ఆమె వేరే ఆదివాసీ ఆడవారితో కలిసి పొలంలో పనిచేస్తుండగా, వారి ఊరు సలిహా నుంచి ఒక యువకుడు వారివైపు వేగంగా పరిగెత్తుతూ అరిచాడు. “వారు ఊరి మీద దాడి చేశారు. మీ నాన్నని ఘోరంగా కొడుతున్నారు. మన ఇళ్లన్నీ వెతుకుతున్నారు.”

“వారు” అంటే బ్రిటిష్ పోలీసులు, బ్రిటిష్ రాజ్యాన్ని ధిక్కరిస్తున్నాయి అనుకునే  గ్రామాల పై విరుచుకుపడ్డారు. అనేక ఇతర గ్రామాలను ధ్వంసం చేశారు, తగలబెట్టారు, వారి ధాన్యం దోచుకున్నారు. తిరుగుబాటుదారులకు తమ స్థానాన్ని చూపించారు.

డేమతి డే, సబర్- సబర్ తెగకు  చెందిన ఒక ఆదివాసీ అమ్మాయి. ఆమె  సలిహాకి తనతో ఉన్న 40 మంది యువతులతో పాటు పరిగెట్టింది. “మా నాన్న నేల మీద పడి ఉన్నాడు, రక్తం కారుతోంది,” అన్నది  వయసుడిగిన ఆ స్వాతంత్య్ర యోధురాలు . “అతని కాలిలో తుపాకి గుండు దిగింది.”

వయసురీత్యా మసకబారుతున్న తలపుల మధ్య ఈ జ్ఞాపకం ఆమె ఉత్తేజపరిచింది. “నాకు పట్టలేని కోపం వచ్చి ఆ ఆఫీసర్ మీదికి  తుపాకీతో వెళ్లాను. ఆ రోజుల్లో మేము లాఠీలు పట్టుకుని వెళ్ళేవాళ్ళం పొలాల్లో పనికైనా, అడవిలోకైనా. ఉన్నట్టుండి జంతువులు మీద పడితే మన దగ్గర కాపాడుకోవడానికి ఏదోటి ఉండాలి.” అన్నది.

ఒక్కసారి ఆ ఆఫీసర్ మీద ఆమె దాడి చేయగానే ఆమెతో ఉన్న 40 మంది యువతులు మిగిలిన సిబ్బంది మీదకు వారి లాఠీలతో  దూసుకువెళ్లారు. “ఆ వెధవని వీధి చివర వరకు పరిగెత్తించా,” అన్నదామె. కోపంగానే అన్నది కాని పక్కున నవ్వింది. “అలా కొట్టుకుంటూ పోవడమే.  అతను తిరిగి నన్నేమైనా అనడానికి కూడా అతనికి అవకాశం ఇవ్వలేదు. నేనలా చేస్తానని అతను ఊహించలేదు. అతను తప్పించుకోడానికి పరిగెత్తుతూనే ఉన్నాడు.” ఆమె అతన్ని కొడుతూ ఊరంతా పరుగెత్తించింది. ఆమె అప్పుడు తన తండ్రిని అక్కడ నుంచి ఎత్తి మోసుకుని వచ్చేసింది. అతన్ని తరవాత అరెస్ట్ చేశారు, కానీ అది వేరే నిరసనకు దారి తీసింది. కార్తీక్ సబర్ అక్కడి బ్రిటిష్ వ్యతిరేకోద్యమాలకు కీలక కార్యదర్శి.

Talk of the British shooting her father and Salihan’s memory comes alive with anger

బ్రిటిష్ వారు తన తండ్రిని తుపాకీ తో కాల్చారు అన్నమాట  సాలిహన్  జ్ఞాపకాన్నీ కోపం  తో రగిలించింది

డేమతి డే సబర్ ని ఆమె ఊరిపేరుతో ‘సాలిహాన్’ అని పిలుస్తారు. ఆమె ఊరు నుయపడా జిల్లాలో ఉంది. ఆమె అక్కడే పుట్టింది. ఇప్పటికీ ఒరిస్సాలో ఈ స్వాతంత్య్ర యోధురాలి గురించి,   బ్రిటిష్ అధికారిని లాఠీతో బెదిరించి సాగనంపిందని చెప్పుకుంటారు. ఆమెలో ఇప్పటికి ఆ నిర్భీతి కనిపిస్తుంది. కానీ ఆమె ఏదో గొప్ప పని చేసిందని ఆమె అనుకోదు. ఆమె దానిని పెద్దగా పట్టించుకోదు కూడా. “వాళ్ళు మా ఇళ్ళని, పంటని సర్వనాశనం చేశారు. మా నాన్న పై దాడి చేశారు.  ఇక వారిని ఎదుర్కొనక తప్పలేదు.”

అది 1930వ సంవత్సరం. ఆమెకి 16 ఏళ్ళు. అప్పటికి బ్రిటిష్ రాజ్యం స్వాతంత్య్రం కోసం జరిగే  మీటింగుల పై  విరుచుకుపడుతుంది. డెమతి బ్రిటిష్ పోలీసుల పై ఎదురుతిరిగిన సంఘటన సలిహా తిరుగుబాటు, కాల్పులుగా మారింది.

నేను డేమతిని కలిసే సమయానికి తన వయసు 90 పైబడింది. ఆమె మొహంలో ఇంకా బలమూ అందము  కనిపిస్తున్నాయి. ఇప్పుడు అర్భకంగా ఉండి, కనుచూపు కోల్పోయే స్థాయికి వచ్చినా, ఆమె తన యవ్వనంలో అందంగా పొడుగ్గా, బలం గా ఉండేది. ఆమె పొడవైన చేతుల్లో ఇప్పటికి చేవ ఉంది. ఆ లాఠీని ఆమె బాగానే పట్టుకొని ఉంటుంది. పాపం ఆ అధికారి బాగానే దెబ్బలు తిని ఉంటాడు. పారిపోయి మంచి పని చేసాడు.

ఆమె ధైర్యానికి గుర్తింపు రాలేదు, బయట ఊరిలలో చాలావరకు మర్చిపోయారు కూడా. నేను చూసినప్పుడు సాలిహాన్ బర్గా జిల్లాలో విపరీతమైన పేదరికంలో ఉంది. ఆమె నాయకత్వాన్ని స్తుతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన రంగురంగుల అధికారక పత్రం ఒకటే ఆమె ఆస్తి. అందులో కూడా ఆమె గురించి కన్నా, ఆమె తండ్రి గురించే ఎక్కువగా ఉంది. ఆమె చేసిన ఎదురుదాడి గురించి అసలు లేదు. ఆమెకు పెన్షన్ గాని కేంద్ర, రాష్ర ప్రభుత్వాల  నుంచి సహకారం గాని లేదు.

ఆమె జ్ఞాపకం తెచ్చుకోవడానికి కష్టపడింది- ఒక విషయం ఆమెకు బాగా గుర్తుంది. అదేంటంటే ఆమె తండ్రి కార్తీక్ సబర్ ని తుపాకీతో కాల్చి చంపారు. ఆ విషయం ప్రస్తావించగానే ఆమె ఇంకా చల్లారని కోపంతో ఎగిసిపడింది. ఇప్పుడు ఆమె ముందే  జరిగుతున్నంతగా. ఆమె చుట్టూ  జ్ఞాపకాలు కూడా కమ్ముకున్నాయి.

Talk of the British shooting her father and Salihan’s memory comes alive with anger

మై పెద్ద అక్క భాన్  డే, గంగా తలెన్, సఖ తోరేన్(తెగకు చెందిన మరో  ఇద్దరు ఆడవారు)- వారు కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు వారందరు లేరు. నాన్న రెండేళ్లు రాయపూర్ జైలు లో గడిపాడు.

ఆమె ప్రాంతం ఈ రోజు బ్రిటిష్ రాజ్యంతో  చేతులు కలిపిన భూస్వాముల పాలయ్యింది. సాలిహాన్, ఆమె అనుయాయులు చేసిన పోరాటఫలం ఆ భూస్వాములు ఎక్కువగా అనుభవిస్తున్నారు.  పేదరికపు సముద్రం మధ్య వీరు ఆస్తిపరులైన దీవుల వంటివారు.

ఆమె మా వైపు చూసి దివ్యమైన చక్కని చిరునవ్వు నవ్వింది. చిరునవ్వులు చిందిస్తోంది కానీ ఆమె అలిసిపోయి ఉంది. ఆమె తన ముగ్గురు కొడుకులు అయిన బ్రిష్ణు భోయి, అంకుర్ భోయి, అకురా భోయి పేర్లు తలుచుకోవడానికి చాలా ఇబ్బంది  పడింది. ఆమెకు మేము వెళ్ళొస్తామని చెప్పినప్పుడు చెయ్యి ఊపింది. డేమతి డే సబర్ ఇప్పటికి నవ్వుతోంది.

‘సాలిహాన్’, మేము ఆమెని కలిసిన మరుసటి సంవత్సరం, 2002 లో  చనిపోయింది.

డెమతి సబర్ ‘సాలిహాన్’ కోసం

వారు నీ కథ చెప్పరు సాలిహాన్
నువ్వు పేజ్ త్రీ లోకి ఎక్కవు
ఆ పేజీ బాగా ముస్తాబయినవారికి,
లిపోసక్షన్ చేయించుకున్న నాజూకు మనుషులకి,
మిగిలినది  పరిశ్రమల అధినేతలకు

ప్రైమ్ టైం నీకోసం కాదు సాలిహాన్
ఇదేమి చిత్రమైన విషయం కాదు కానీ,
అది హంతకులకు, గాయపరిచేవారికి,
కాల్చేవారికి, ఆరోపించేవారికి,
సాధువుల్లా మాట్లాడేవారికి, శాంతి కోసం తపించేవారికి

తెల్లోళ్ళు మీ ఊరిని తగలబెట్టారు సాలిహాన్
చాలామంది మగవారు తుపాకీలు పట్టుకు తిరిగారు
వారు రైళ్లలో వచ్చారు
వారితో పాటు భీభత్సాన్నీ నొప్పినీ తీసుకొచ్చారు
ఉన్న మతిపోగొట్టే వరకు
అక్కడున్నదంతా కాల్చేశారు సాలిహాన్

అక్కడ ఉన్న డబ్బును, ధాన్యాన్ని లూటీ చేసాక
బ్రిటిష్ రాజ్య కుక్కలు
భీభత్స కాండాన్ని రచించారు
నువ్వు దానిని లక్ష్యపెట్టకుండా ఎదుర్కొన్నావు
అతని వైపు పొడవైన అంగలు వేశావు
ఆ మనిషిని తుపాకీతో ఎదుర్కొన్నావు

సాలిహాన్ లో ఇప్పటికీ
నువు చేసిన యుద్ధాన్ని గురించి ఈ కథని చెప్పుకుంటారు
నువ్వు గెలిచావని
నీ అనుయాయులు రక్తం కారుతూ నీ చుట్టూ ఉన్నారని
నీ తండ్రి కాలులో ఒక తుపాకీ గుండు దిగబడిపోయిందని
అయినా నువ్వు నిటారుగా నిలబడ్డావని
ఆ బ్రిటిష్ వారిని తోలిపారేసావని

ఎందుకంటే నువ్వక్కడ యుద్ధం చేయడానికి వెళ్ళావు, ప్రాణభిక్షకు కాదు.
నువ్వు ఆ అధికారిని కొట్టావు సాలిహాన్
అతను తిరిగి నీ పైకి రాక ముందే అతనిని చితగ్గొట్టావు
చివరికి అతను
కుంటుకుంటూ పోయి దాక్కుంటే
పదహారేళ్ళ పిల్లవైన నువ్వూ
నలభైమంది ఆడవారూ
బ్రిటిష్ రాజ్యం పై తిరగబడ్డారు సాలిహాన్

బలంగా అందంగా ఉన్న నువ్వు
ఇప్పుడు  కుంగిపోయావు, తల నెరిసిపోయింది
నీ ఒళ్ళు కృశించిపోతోంది
కానీ ఆ కళ్ళలో మెరుపు ఇంకా తగ్గలేదు
ఎవరైతే బ్రిటీష్ రాజులకు మద్దతు పలికారో  సాలిహాన్
వారే ఈ రోజు నీ ఊరిని ఏలుతున్నారు
పైగా గుడులు కట్టిస్తున్నారు
మన స్వేచ్ఛను వారి స్వార్థం కోసం అమ్మాలనుకున్నవారు
వారు చేసిన నాశనాన్ని ఎన్నటికీ అర్ధం చేసుకోరు
నువ్వు బతికినంత ధైర్యంగానే చనిపోతావు సాలిహాన్
ఆకలితో, తినడానికి చాలినంత లేక.

చరిత్ర నీడల్లో
నీ జ్ఞాపకం వెలిసిపోతుంది
రాయపూర్ జైల్లో రోస్టర్ షీట్ వంటి
నీ గుండె, దానికున్న దమ్ము నాకుంటే
సాలిహాన్, నేను జయించలేనిదంటూ లేదు
ఆ యుద్ధం అసలు
నీ కోసమే కాదు
మిగిలిన అందరి స్వేచ్ఛ కోసం
మా పిల్లలకి నువ్వు తెలియాలి, సాలిహాన్
కానీ నీ గెలుపును చాటుకోడానికి నీకున్న బలగం ఏంటి
నువ్వు రాంపుల పై నడవలేదు
నెత్తి మీద కిరీటాలు ధరించలేదు
పెప్సీ, కోక్ కంపెనీలకి నీ పేరుని అరువివ్వలేదు

నాతో మాట్లాడు సాలిహాన్
గంట నుంచి ముగింపు లేని సమయం వరకు.
మనం విడిపోయే ఈ వేళలో, ఈ సాధారణ ప్రాణికి,
భారతదేశపు అధికారపు అశ్లీలతని కాక,
నీ గుండె దమ్ము గురించి రాయాలనుంది.

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota