"ఈ చట్టం ఉద్దేశించిన  నియమాలు లేదా ఆదేశాల ప్రకారం,  ఏదైనా చట్టాన్ని అములుచేసే ఉద్దేశంతో చేయదలచిన లేక చేయడానికి ఉద్దేశించిన ఏ విషయంలోనైనా  కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం, లేదా వాటికి సంబంధించిన అధికారి లేదా ఇతర వ్యక్తుల పై ఎటువంటి దావా, ప్రాసిక్యూషన్ లేదా ఇతర చట్టపరమైన చర్యలు ఉండవు. ”

ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం, 2020 లోని సెక్షన్ 13 కు స్వాగతం (ఇది వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్ కమిటీలను అరికట్టడానికి ఉద్దేశించినది, దీనిని ఎపిఎంసిలుగా పిలుస్తారు).

కొత్త చట్టాలు రైతుల గురించి మాత్రమే అని మీరు అనుకున్నారా? ఖచ్చితంగా. సివిల్ సర్వెంట్లుగా పిలవబడే పౌర సేవకులు వారి విధులను నిర్వర్తిస్తున్నప్పుడు, వారి పై విచారణను మినహాయించే ఇతర చట్టాలు కూడా ఉన్నాయి. కానీ దీనివలన ‘విశ్వాసంతో లేక మంచి ఉద్దేశంతో’ వారు ఏపని చేసినా, వారికి ఉండే రక్షణ వలన ఈ చట్టం స్పష్టతను కోల్పోతుంది. ఎందుకంటే ఈ చట్టం వలన వారు చట్ట పరిధి’లో  చేసిన నేరాలు కోర్ట్ వరకు రాకపోవడమే కాక, వారు ముందు ముందు చట్ట పరిధి’లో  చేయగలిగే నేరాలకు కూడా ఏ విధమైన చర్యా తీసుకోబడదు.

ఒకవేళ ఈ విషయాన్ని విస్మరించినట్లైతే - సెక్షన్ 15 ప్రకారం మీకు న్యాయస్థానాలలో చట్టపరమైన సహాయం లేదు. :

"ఏ విషయానికైనా ఎటువంటి దావా లేదా చర్యలను చేపట్టడానికి  ఏ సివిల్ కోర్టుకు అధికార పరిధి ఉండదు, ఈ చట్టం ద్వారా లేదా దానికి లోబడి  దాని ద్వారా రూపొందించబడిన నిబంధనల ద్వారా అధికారం పొందిన ఏ అధికారి పై దావా అయినా సరే బుట్టదాఖలు చేయవచ్చు."

చట్టబద్ధంగా సవాలు చేయలేని ‘మంచి విశ్వాసంతో లేక ఉద్దేశం తో’ పనులు చేసే ఇతర వ్యక్తులు’ ఎవరు? సూచన: నిరసన తెలిపే రైతులు జపిస్తున్న కార్పొరేట్ దిగ్గజాల పేర్లు వినడానికి ప్రయత్నించండి. ఇదంతా వ్యాపార సౌలభ్యం గురించి - చాలా పెద్ద వ్యాపారం అన్నమాట.

"ఎటువంటి దావా, ప్రాసిక్యూషన్ లేదా ఇతర చట్టపరమైన చర్యలు అబద్ధం కాదు ...." ఇక్కడ దావా వేయలేనిది రైతులు మాత్రమే కాదు. మరెవరూ వేయలేరు. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి కూడా వర్తిస్తుంది. లాభాపేక్షలేని సమూహాలు, లేదా వ్యవసాయ సంఘాలు లేదా ఎవరైనా పౌరుడు (చట్టాన్ని అనుసరించి లేక అనుసరించకుండా  నడిచేవారు) జోక్యం చేసుకోలేరు.

1975-77 యొక్క అత్యవసర పరిస్థితుల(అన్ని ప్రాథమిక హక్కులను నిలిపివేసినప్పుడు)లోనే కాక,  ఏ సమయం లోనైనా చట్టపరమైన సహాయాన్ని పొందే పౌరుడి హక్కును  నిలిపివేసే అధిక మినహాయింపులలో ఈ చట్టాలు ఖచ్చితంగా ఉన్నాయి

The usurping of judicial power by an arbitrary executive will have profound consequences
PHOTO • Q. Naqvi

ఏకపక్ష కార్యనిర్వాహక అధికారి న్యాయవ్యవస్థను స్వాధీనం చేసుకోవడం తీవ్ర పరిణామాలను కలిగిస్తుంది

ఈ చట్టం వలన ప్రతి భారతీయుడు ప్రభావితమవుతాడు. ఇంకోలా చెప్పాలంటే, ఈ చట్టాల యొక్క చట్టపరమైన-భాష  ప్రకారం ఈ చట్టం, ఒక (తక్కువ-స్థాయి) ఎగ్జిక్యూటివ్‌ను కూడా న్యాయవ్యవస్థగా మారుస్తుంది. ఇంకా చెప్పాలంటే, న్యాయమూర్తి, జ్యూరీ మరియు అమలుదారుగా కూడా మారుస్తుంది. రైతులు,  వారు వ్యవహరించే దిగ్గజ సంస్థల మధ్య ఇప్పటికే ఉన్న అత్యంత అన్యాయమైన శక్తి కలిగించే అసమతుల్యతను ఇది ఇంకా పెద్దది చేస్తుంది.

దీని గురించి అప్రమత్తమైన ఢిల్లీ బార్ కౌన్సిల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాసిన లేఖలో ఇలా అడుగుతుంది: "పౌర పరిణామాలను కలిగి ఉన్న ఏదైనా వ్యాజ్యాలకు,   పరిపాలనా సంస్థలతో కూడిన నిర్మాణాలను నియంత్రించే లేక నడుపుతున్న ఎగ్జిక్యూటివ్ అధికారులు తీర్పు ఎలా  ఇవ్వగలరు?"

(ఎగ్జిక్యూటివ్ అధికారులు అంటే , ఇక్కడ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్లు మరియు అదనపు జిల్లా న్యాయాధికారులు. వీరందరూ వారి నిష్పక్షపాతానికి ప్రసిద్ధి చెందినవారు! ప్రతి భారతీయుడికి తెలిసినట్లుగానే మంచి విశ్వాసంతో మరియు మంచి ఉద్దేశ్యంతో పొంగిపొరలుతుంటారు! ). ఢిల్లీ బార్ కౌన్సిల్,  న్యాయాధికారాలను ఎగ్జిక్యూటివ్ అధికారులకు  బదిలీ చేయడం "ప్రమాదకరమైనది, తప్పు" అని పేర్కొంది. అలానే న్యాయ వృత్తిపై దాని ప్రభావాన్ని కూడా ఎత్తిచూపింది : "ఇది ముఖ్యంగా జిల్లా కోర్టులను గణనీయంగా దెబ్బతీస్తుంది, అంతేగాక  న్యాయవాదుల పాత్రని కుదిస్తుంది."

ఇంకా ఈ చట్టాలు రైతుల గురించి మాత్రమే అని అనుకుంటున్నారా?

ఈ చట్టంలో  న్యాయవ్యవస్థను ఎగ్జిక్యూటివ్‌కు బదిలీ చేయడం,  కాంట్రాక్టుల గురించి ఇంకా ఉంది - రైతుల (సాధికారత మరియు రక్షణ) ధర భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టంపై ఒప్పందం. 2020.

సెక్షన్ 18 “చట్టాన్ని అనుసరించి” వాదనను పునరుద్ఘాటిస్తుంది.

సెక్షన్ 19 ఇలా పేర్కొంది: “ ఈ చట్టం ద్వారా ఏ కోర్టుకూ లేదా జ్యూరిస్డిక్షన్ కు ఎటువంటి వాజ్యానికైనా సంబంధించి, ఈ చట్టం ద్వారా రక్షణ పొందిన సబ్ డివిజనల్ అథారిటీ లేదా అప్పీలేట్ అథారిటీ పై నిర్ణయాధికారం లేదా నిషేధాజ్ఞలు జారీ చేసే అధికారం ఏ సివిల్ కోర్టుకు  లేదా మరే ఇతర అధికారానికి అధికారం ఉండదు. దీనికి సంబంధించి ఏ చర్య తీసుకోవలసి ఉన్నా, లేదా తీసుకుని ఉన్నా ఎటువంటి దావా లేదా చర్యలను తీసుకోవడానికి అధికార పరిధి ఉండదు(అని గట్టిగా చెప్పబడింది).  ఈ చట్టం ద్వారా, లేదా దాని క్రింద ఇవ్వబడిన ఏదైనా అధికారం, లేదా ఆ చట్టం చేసిన ఏదైనా నియమాలకు అనుగుణంగా, తీసుకోబడిన లేదా తీసుకోవలసిన ఏదైనా చర్యకు సంబంధించి, ఈ చట్టం ద్వారా లేదా కింద ఇవ్వబడిన ఏదైనా అధికారాన్ని అనుసరించి గాని లేదా కొత్త నియామాల ద్వారా గాని చేపట్టొచ్చు..”

ఇక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్. 19 వాక్ మరియు భావ ప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత సమావేశాలు, ఉద్యమ స్వేచ్ఛ, సంఘాలు లేదా సంఘాలను ఏర్పాటు చేసే హక్కు గురించి అనుకుంటే….

ఈ వ్యవసాయ చట్టంలోని సెక్షన్ 19 యొక్క సారాంశం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 లో కూడా ఉంది, ఇది రాజ్యాంగ పరిష్కారాలకు (చట్టపరమైన చర్య) హక్కును హామీ ఇస్తుంది. సెక్షన్ 32 రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణంలో భాగంగా పరిగణించబడుతుంది.

భారతీయ ప్రజాస్వామ్యం కోసం కొత్త వ్యవసాయ చట్టాల యొక్క ఈ చిక్కుల గురించి ఖచ్చితంగా ‘ప్రధాన స్రవంతి’ మీడియాకు  (జనాభాలో 70 శాతానికి పైగా ఉన్న ప్లాట్‌ఫారమ్‌ల యొక్క వింత పదం) తెలియదు. కానీ వీరి లాభాపేక్ష ప్రజా ప్రయోజనం లేదా ప్రజాస్వామ్య సూత్రాల భావన కంటే చాలా ఎక్కువ.

Protestors at Delhi’s gates were met with barricades, barbed wire, batons, and water cannons – not a healthy situation at all
PHOTO • Q. Naqvi
Protestors at Delhi’s gates were met with barricades, barbed wire, batons, and water cannons – not a healthy situation at all
PHOTO • Q. Naqvi

ఢిల్లీ లో నిరసనకారులు బారికేడ్లు, ముళ్ల తీగలు, లాఠీలు మరియు నీటి ఫిరంగులను ఎదుర్కొన్నారు - ఇది అంత ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు

అభిప్రాయాల సంఘర్షణ(ల) గురించి ఏవైనా భ్రమలు ఉంటే వదిలించుకోండి. ఈ మీడియా సంస్థలు కూడా కార్పొరేషన్లే. మన దేశంలోని అతిపెద్ద భారతీయ కార్పొరేషన్ యొక్క బిగ్‌బాస్ అత్యంత ధనిక మరియు అతిపెద్ద మీడియా యజమాని. ఢిల్లీ  ద్వారాల వద్ద ఉన్న రైతులు తమ నినాదాలలో పిలిచే పేర్లలో ‘అంబానీ’ ఒకటి.  వేరే ఇతర దిగువ స్థాయిలో మనము ఫోర్త్ ఎస్టేట్ మరియు రియల్ ఎస్టేట్ మధ్య తేడాను గుర్తించగలగడం చాలా కాలం క్రితమే నేర్చుకున్నాం. ఈ కార్పోరేషన్ల అవసరాల కంటే పౌరుల ముఖ్యమైన అవసరాలు(రైతులు మాత్రమే అయినా సరే) చూడలేనంతగా ‘ప్రధాన స్రవంతి’ మీడియా చొచ్చుకుపోయింది.

రాజకీయ నివేదికలలో (కొంతమంది తెలివైన - మరియు సాధారణమైన - మినహాయింపులతో) ధనిక రైతులు -పంజాబ్ రైతులు(మాత్రమే) , ఖలిస్తానీలు, కపటవాదులు, కాంగ్రెస్ కుట్రదారులు, ఇంకా  మరెన్నో అంటూ తమ న్యూస్ పేపర్లలో మరియు ఛానెళ్ళలో రైతుల గురించి కనీస కనికరం లేకుండా చెబుతున్నారు.

పెద్ద మీడియా సంపాదకీయాలు వేరే రకం గా మాట్లాడుతున్నాయి. అవి రైతుల పైన, మొసలి కోతి పై చూపించే దొంగ కరుణను చూపిస్తున్నాయి. ముఖ్యంగా, “ప్రభుత్వం దీన్ని బాగా నిర్వహించవలసి ఉండాల్సింది.” “వీరంతా సరిగ్గా చూడలేని,  అర్ధం చేసుకోలేని పామరులు.” “ఇంతటి మేధ ఉన్న ప్రధాన మంత్రి మరియు  ఆర్థికవేత్తలు - ఇటువంటి శ్రద్ధగల చట్టాలను రూపొందించారు. ఇవి రైతులకు మన ఆర్ధిక వ్యవస్థకు చాలా ముఖ్యమైనవి. ఈ చట్టాలు చాలా ముఖ్యమైనవి, అవసరమైనవి”, అని నొక్కివక్కాణిస్తున్నాయి.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో సంపాదకీయం ఇలా చెబుతోంది, “ఈ మొత్తం వ్యవహారంలో లోపం సంస్కరణల్లో లేదు, కానీ వ్యవసాయ చట్టాలు ఆమోదించబడిన విధానంలో మరియు ప్రభుత్వ కమ్యూనికేషన్ వ్యూహం లేదా అది లేకపోవడం లో ఉంది.” “ఈ మూడు వ్యవసాయ చట్టాలు వంటి " ఇతర గొప్ప ప్రణాళికలను "భారతీయ వ్యవసాయం యొక్క నిజమైన సామర్థ్యాన్ని పెంపొందించడానికి అవసరమైన సంస్కరణలు" ‘అయినప్పటికీ, వాటిని తెలియపరిచిన పద్ధతిలో లోపం ఉందని ఎక్స్ప్రెస్ ఆందోళన చెందుతోంది.

టైమ్స్ ఆఫ్ ఇండియా తన సంపాదకీయంలో, “అన్ని ప్రభుత్వాలూ ముందు చేయవలసిన మొట్టమొదటి పని, ఎంఎస్పి పాలన రాబోయే రోజుల్లో అంతం కావడం గురించి  రైతులలో ఉన్న అపోహలను రద్దు చేయడమే ,” అనీ “కేంద్రం యొక్క సంస్కరణ ప్యాకేజీ వ్యవసాయ వాణిజ్యంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ఒక హృదయపూర్వక ప్రయత్నం. వ్యవసాయ ఆదాయాలను రెట్టింపు చేసే ఆశలు ఈ అభివృద్ధి చెందుతున్న సంస్కరణల విజయంపై ఆధారపడి ఉంటాయి…అంతేగాక ఇటువంటి సంస్కరణలు  భారతదేశ ఆహార మార్కెట్లో హానికరమైన వక్రీకరణలను కూడా సరిచేస్తాయి. ” అని చెప్పింది.

PHOTO • Q. Naqvi

అన్యాయమైన మూడు చట్టాలను రద్దు చేయడం కంటే చాలా పెద్ద కారణం కోసం ఢిల్లీ గేట్ల వద్ద ఉన్న రైతులు పోరాడుతున్నారు. వారు మనందరి హక్కుల కోసం పోరాడుతున్నారు

"ఈ చర్యకు [కొత్త చట్టాలు] మంచి కారణం ఉంది" అని హిందూస్తాన్ టైమ్స్ సంపాదకీయం పేర్కొంది. "చట్టాల వాస్తవికత మారదని రైతులు గుర్తించాలి. ఇది చాలా సున్నితంగా వ్యవహరించవలసిన సమయం.  ఇక్కడ తీవ్ర-గుర్తింపు సమస్యలతో ఉన్న రైతులు సరదా పడుతున్నారు.  అంతేగాక ఇది ఉగ్రవాద వాక్చాతుర్యం మరియు చర్యలకు అనుగుణంగా ఉంది.”

రైతులు వారికి తెలియకుండానే  ఏ కుట్రదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు,  ఎవరి ఆదేశాల మేరకు వారు పనిచేస్తారు వంటి ప్రశ్నలతో ప్రభుత్వం పట్టుబడుతోంది,. సంపాదకీయ రచయితలు మాత్రం వారు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తారనే దానిపై చాలా ఎక్కువ స్పష్టత కలిగి ఉన్నారు. వారికి ఆహారం ఇచ్చే కార్పొరేట్ పంజాలను వారు కొరికే ప్రమాదమే లేదు.

ఎంత మంచి  ఉద్దేశం ఉన్న, సాపేక్షంగా తక్కువ పక్షపాతమున్న టెలివిజన్ ఛానెళ్ళలో కూడా, చర్చలలోని ప్రశ్నలు ఎల్లప్పుడూ ఒకే  చట్రంలో ఉంటాయి. నిపుణులు, మేధావులు కూడా ఆ చట్రం లోనే  బందీ అయి ఉంటారు.

అసలు ఇలాంటి ప్రశ్నల పై ఒక్కసారి కూడా తీవ్రమైన దృష్టి పెట్టకండి: ఇప్పుడే  ఎందుకు? ఇదే సమయం లో కార్మిక చట్టాల గురించి ఈ తొందరపాటు ఏమిటి ? గత ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ భారీ మెజారిటీ సాధించారు. మెజారిటీ అతనికి కనీసం 2-3 సంవత్సరాలు ఉంటుంది. ఈ కరోనా మహమ్మారి తీవ్రరూపం లో ఝడిపిస్తుండగా ఈ చట్టాలను అమలు చేయడానికి ఇది మంచి సమయం అని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు భావించింది - ఒక మహమ్మారి నిర్మూలన చేపట్టాల్సిన సమయంలో మరింత అత్యవసర శ్రద్ధ కోరుతూ వెయ్యి ఇతర విషయాలు ఎందుకు తీసుకువస్తున్నట్లు?

ఇది అసలు  లెక్క. ఇది కోవిడ్ -19 మహమ్మారి స్తంభించిపోయిన సమయం, రైతులు మరియు కార్మికులు ఇటువంటి పరిస్థితి లో అర్ధవంతమైన రీతిలో వ్యవస్థీకృతమై  ప్రతిఘటించలేరు. సంక్షిప్తంగా, ఇది మంచి సమయం మాత్రమే కాదు, ఇది ఉత్తమ సమయం. ఇది తమ నిపుణులచే ఉదహరించబడింది. వీరిలో కొందరు ఇటువంటి పరిస్థితిని చూశారు. ఇది  ‘రెండవ 1991 క్షణం’.  సమూల సంస్కరణల ద్వారా ముందుకు సాగే అవకాశం.  నిరాశ, దుఃఖం మరియు గందరగోళాన్ని వాడుకోగలిగిన సమయం.  అంతేగాక పాలకులను వేడుకున్న ప్రముఖ సంపాదకులకు కూడా అనుకూలమైన సమయం.  “

ఈ చట్టాలు రాజ్యాంగ విరుద్ధం అనే అతి ముఖ్యమైన ప్రశ్నల పై, పైపైన నిజాయితీ లేని సూచనలు ఇవ్వడం ఏ హక్కు లేకుండా రాష్ట్ర అంశం పై  కేంద్రం అలా  చట్టాలతో బాంబులు వదలడం కంటే ఎక్కువేమీ కాదు.

PHOTO • Binaifer Bharucha

నవంబర్ 2018 లో 22 రాష్ట్రాలు మరియు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల రైతులు - పంజాబ్ నుండి మాత్రమే కాదు - ప్రస్తుత నిరసనకారుల డిమాండ్లతో సమానమైన డిమాండ్లతో ఢిల్లీ పార్లమెంటుకు వెళ్లారు

ప్రభుత్వం  చేయి సాచి ఇచ్చిన డెత్ బై కమిటీ ప్రతిపాదనను రైతులు ఎందుకు ఇంత ధిక్కారంతో కొట్టిపారేశారనే అంశం పై సంపాదకీయాలలో పెద్దగా చర్చ జరగలేదు. దేశవ్యాప్తంగా ప్రతి రైతూ ‘స్వామినాథన్ రిపోర్ట్'  అని పిలిచుకునే  ‘జాతీయ రైతుల కమిషన్’ నిజంగా అమలు చేయాలని కోరుతున్నారు. 2004 లో కాంగ్రెస్ మరియు 2014 లో  బిజెపి పోటీ చేసినప్పుడు ఆ నివేదికపై చర్య తీసుకుంటామని వాగ్దానం చేశాయి.

మరి, అన్నట్టు, నవంబర్ 2018 లో, ఢిల్లీ పార్లమెంటు సమీపంలో 100,000 మంది రైతులు ఆ నివేదిక యొక్క ముఖ్య సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ సంక్షోభం గురించి చర్చించడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశంతో సహా వారు రుణ మాఫీ, కనీస మద్దతు ధర మరియు అనేక ఇతర డిమాండ్లను కూడా కోరారు. ఒక్క మాటలో చెప్పాలంటే, దిల్లీ దర్బార్ను సవాలు చేస్తున్న రైతులు ఇప్పుడు చాలా కోరికలు కోరుతున్నారు. అంతేగాక వీరందరూ  పంజాబ్ మాత్రమే కాకుండా 22 రాష్ట్రాలు మరియు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారు!

ప్రభుత్వం నుండి ఒక కప్పు టీని అంగీకరించడానికి నిరాకరించిన రైతులు చేసిన తప్పంతా వారిని కట్టిపడేసేందుకు ప్రభుత్వం వేసిన సగం చచ్చిన లెక్కలు మనకు చూపించడం. ఎంతో ప్రమాదం ఉందని తెలిసికూడా, వారి హక్కుల కోసం (మన హక్కుల కోసం కూడా) వారు గతంలో కానీ ఇప్పుడు గాని గట్టిగా నిలబడి ఉన్నారు.

‘ప్రధాన స్రవంతి’ మీడియా విస్మరించే విషయం కూడా వారు పదేపదే చెప్పారు. ఆహార నియంత్రణపై కార్పోరేట్  నియంత్రణ మొదలైతే ఏమిటో, ఈ దేశానికి ఏమవుతుందో ఆలోచించమని వారు పదేపదే  హెచ్చరిస్తున్నారు. ఇంతకీ మీరు ఈ మధ్య లో వచ్చిన  సంపాదకీయాలు ఏవైనా చూశారా?

వారిలో చాలామందికి  ఈ  మూడు చట్టాలను రద్దు చేయడం కంటే, తమ కోసం, లేదా పంజాబ్ కోసం కంటే, ఇంకా చాలా పెద్ద వాటి కోసం పోరాడుతున్నామని తెలుసు. ఆ చట్టాలను రద్దు చేయడం మనం ఉన్న చోటికి మమ్మల్ని తిరిగి తీసుకెళ్లడం కంటే ఎక్కువేం కాదు. భయంకరంగా కొనసాగుతున్న ఈ వ్యవసాయ సంక్షోభం లో  ఈ చట్టాలు రద్దు చేసిన తరువాత పరిస్థితి, అంత బాగా ఏమి ఉండదు. కానీ ఇది ఉన్న వ్యవసాయ వెతలకు మళ్ళీ  కొత్త కష్టాలు రావడాన్నినిలిపివేస్తుంది లేదా కనీసం వాటిని నెమ్మదిస్తుంది. నిజమే, ‘ప్రధాన స్రవంతి మీడియా’ లాగా కాకుండా, పౌరులు చట్టబద్దమైన హక్కును తొలగించడంలో మరియు మన హక్కులను హరించడంలో ఈ చట్టాల యొక్క ప్రాముఖ్యతను రైతులు చూశారు. ఒకవేళ వారు దానిని ఆ విధంగా చూడకపోయినా లేదా ఉచ్చరించకపోయినా - రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం మరియు ప్రజాస్వామ్యం యొక్క రక్షణ కూడా వారి ప్రతిఘటనలో భాగమే.

కవర్ ఇలస్ట్రేషన్: ప్రియాంక బోరార్ కొత్త మీడియా ఆర్టిస్ట్, కొత్త అర్థాలను మరియు వ్యక్తీకరణను కనుగొనటానికి సాంకేతికతతో ప్రయోగాలు చేస్తున్నారు. ఆమె నేర్చుకోవడం, నేర్చుకున్నది ప్రయోగించడం కోసం అనుభవాలను రూపొందిస్తారు.  ఇంటరాక్టివ్ మీడియాతో పనిచేయడమే కాక సాంప్రదాయ పెన్ మరియు కాగితాలతో కూడా మనకు వీక్షక అనుభవాన్ని అందిస్తారు.

వ్యాసం మొట్టమొదట డిసెంబర్ 09, 2020 న ‘ది వైర్‌’ లో ప్రచురితమైనది.

అనువాదం - అపర్ణ తోట

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota