"ఈ పోరాటం రైతులది మాత్రమే కాదు, వ్యవసాయ కూలీలది  కూడా" అని రేషమ్, బీంట్ కౌర్ చెప్పారు. "ఈ వ్యవసాయ చట్టాలు అమలవుతే, అది రైతులను మాత్రమే ప్రభావితం చేస్తుంది అనుకుంటారేమో. కానీ రైతుల జీవనోపాధి పై ఆధారపడిన కూలీలకు కూడా ఈ చట్టాలు నష్టం కలుగజేస్తాయి."

అందుకే జనవరి 7 మధ్యాహ్నం, ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు పంజాబ్ లోని ముక్త్సర్ జిల్లా నుండి ప్రయాణించి, దేశ రాజధాని శివార్ల వద్ద జరుగుతున్న  రైతుల నిరసనలో చేరారు.

పంజాబ్ ఖేత్ మజ్దూర్ యూనియన్ ఏర్పాటు చేసిన  20 బస్సులలో కనీసం  1,500 మంది ప్రయాణీకులు ఉన్నారు. వీరంతా కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగే నిరసనల ప్రదేశాలలో ఒకటైన పశ్చిమ ఢిల్లీలోని తిక్రి వద్దకు రాత్రికల్లా  చేరుకున్నారు. వీరు  బతిండా, ఫరీద్కోట్, జలంధర్, మోగా, ముక్త్సర్, పాటియాలా మరియు సంగ్రూర్ జిల్లాల నుండి వచ్చారు. రేషమ్,  బీంట్ ముక్త్సర్ జిల్లాలోని తమ గ్రామమైన చన్ను సమీపంలో ఈ బస్సులను  ఎక్కి ఇక్కడికి చేరుకున్నారు.

నవంబర్ 26 నుండి ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న తిక్రి ,ఇంకా ఇతర నిరసన ప్రదేశాలలో చాలా మంది రైతులు క్యాంప్ చేస్తున్నారు.  మరికొందరు కొద్దిరోజులు వారితో ఉండి, తిరిగి వారి గ్రామాలకు వెళ్లి ఢిల్లీ లో జరుగుతున్న ఆందోళన గురించి తమ ఊరిలోని  ప్రజలకు తెలియజేస్తారు. "ఈ కొత్త వ్యవసాయ చట్టాలు వ్యవసాయ కార్మికులను ఎలా ప్రభావితం చేస్తాయో మా గ్రామంలో చాలామందికి తెలియదు" అని 24 ఏళ్ల రేషమ్ చెప్పారు. “వాస్తవానికి, మా గ్రామాలలో మేము చూసే వార్తా చానెళ్ళ లో ఈ చట్టాలు రైతులు, వ్యవసాయ కూలీల ప్రయోజనాల కోసమేనని చెప్పారు. కూలీలకు భూమి ఇస్తామని వారు చెప్పారు.”

ఈ చట్టాలు మొదట జూన్ 5, 2020 న ఆర్డినెన్స్‌లుగా ఆమోదించబడ్డాయి, తరువాత సెప్టెంబర్ 14 న పార్లమెంటులో వ్యవసాయ బిల్లులుగా ప్రవేశపెట్టబడ్డాయి.  ఇక ఆ నెల 20 నాటికి చట్టాలలోకి ప్రవేశించాయి. మూడు చట్టాలు ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020 పై రైతు (సాధికారత మరియు రక్షణ) ఒప్పందం , రైతుల ఉత్పత్తి వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం , 2020 మరియు ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) చట్టం, 2020. ఈ చట్టాలు ప్రతి భారతీయుడిని చట్ట సహాయం పొందలేనంతగా ప్రభావితం చేస్తాయని విమర్శించారు.

Resham (left) and Beant: 'If farmers' land is taken away by these laws, will our parents find work and educate their children?'
PHOTO • Sanskriti Talwar

రేషాం (ఎడమ) మరియు బీంట్: 'ఈ చట్టాల ద్వారా రైతుల భూమిని స్వాధీనం చేసుకుంటే, మా తల్లిదండ్రులు పని వెతుక్కుని వారి పిల్లలకు చదువును అందించగలరా?'

రైతులందరూ ఈ మూడు చట్టాల ద్వారా పెద్ద కార్పొరేట్‌లకు తమ పై తమ వ్యవసాయంపై లభించే అధికారం ఇవ్వడం ద్వారా జీవనోపాధికి జరుగబోయే హానిని ఊహిస్తున్నారు. ఈ చట్టాలు సాగుదారునికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి), వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలు (ఎపిఎంసిలు), రాష్ట్ర సేకరణ మరియు మరిన్ని సహ మద్దతు యొక్క ప్రధాన రూపాలను కూడా బలహీనపరుస్తాయి.

రేషమ్ మరియు బీంట్,  బౌరియా వర్గానికి చెందిన దళితులు - 6,529 జనాభా ఉన్న చన్నూ గ్రామంలో 58 శాతం మంది షెడ్యూల్డ్ కులాల వారు ఉన్నారు. వ్యవసాయ శ్రమ ద్వారానే వారి  కుటుంబం ఇంతకాలం సాగింది.  నలభయైదేళ్ళ వారి తల్లి పరంజీత్ కౌర్, ఇంకా పొలాలలో పని చేస్తూనే ఉన్నారు, వారి తండ్రి బల్వీర్ సింగ్ కి  ఇప్పుడు యాభైతొమ్మిదియేళ్లు. ఇదే గ్రామం లో అతను ట్రాలీలు మరియు మెటల్ గేట్లు తయారు చేసే వర్క్ షాప్ నడుపుతున్నారు.  20 ఏళ్ల వారి సోదరుడు హర్దీప్ 10 వ తరగతి వరకు చదువుకున్నాడు. అతనికి పెళ్లయింది. హర్దీప్ తండ్రితో పాటే అతని వర్క్ షాప్ లో  పనిచేస్తాడు.

రేషమ్ చరిత్రలో ఎంఏ చేసింది. లాక్డౌన్ కు ముందు ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా నెలకు 3,000 రూపాయిలు సంపాదించేది. లొక్డౌన్ తర్వాత ఆమె ట్యూషన్ క్లాసుల ద్వారా నెలకు 2,000 రూపాయలు సంపాదిస్తోంది. బీఏ డిగ్రీ పొందిన 22 ఏళ్ల బీంట్, ఇన్వెంటరీ క్లర్క్‌గా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటోంది. సోదరీమణులు ఇంట్లో టైలరింగ్ కూడా చేసి ఒక్కో  సల్వార్-కమీజ్ సెట్టు కుట్టడానికి 300 రూపాయిలు తీసుకుంటారు. టైలరింగ్ నుంచి వచ్చే ఆదాయం నుంచి  వారు తమ కాలేజీ ఫీజును కొన్నిసార్లు చెల్లించేవారు.

"మేము వ్యవసాయ కూలీల కుటుంబంలో జన్మించాము" అని రేషమ్ చెప్పారు. “వ్యవసాయ కూలీకి పుట్టిన ప్రతి బిడ్డకు ఎలా శ్రమించాలో తెలుసు. నేను కూడా నా పాఠశాల సెలవుల్లో రోజుకు 250-300 రూపాయలకు నా తల్లిదండ్రుల పాటు పొలాల్లో పనిచేశాను. ”

అందరు వ్యవసాయ కూలీల పిల్లలను ప్రస్తావిస్తూ, “మాకు స్కూలు లేని సమయంలో మేము ఎప్పుడూ స్వేచ్ఛగా కూర్చోవడం కుదరదు. వేరే పిల్లల్లా కాకుండా, మేము పాఠశాల నుండి ఇంటికి వెళ్ళినప్పుడు హాయిగా తిరగడం ఎప్పుడూ జరగలేదు. మేము పొలాలలో కూలిపనికి వెళ్లే వాళ్లం. "

ఈ కొత్త చట్టాల వలన వ్యవసాయ కూలీలు తమ పిల్లలకు చదువుని అందించడం మరింత కష్టమవుతుందని ఆమె చెప్తుంది. “ఏమైనా ఒక కూలి బిడ్డ కూడా కూలీ అయి ఉండాలని అనుకుంటారు. ఈ చట్టాల ద్వారా రైతుల భూమిని లాక్కుంటే, తల్లిదండ్రులు ఎక్కడ నుంచి  పని వెతుక్కుని వారి పిల్లలకు చదువుని అందిస్తారు? ప్రభుత్వం పేదరికాన్ని తగ్గించడానికి ఏమి ప్రయత్నాలు చేస్తోంది? వారిని పని, ఆహారం, చదువు లేకుండా వదిలివేస్తుంది. ”

Many farmers have been camping at Tikri and other protest sites in and around Delhi since November 26, while others join in for a few days, then return to their villages and inform people there about the ongoing agitation
PHOTO • Sanskriti Talwar
Many farmers have been camping at Tikri and other protest sites in and around Delhi since November 26, while others join in for a few days, then return to their villages and inform people there about the ongoing agitation
PHOTO • Sanskriti Talwar

నవంబర్ 26 నుండి ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న తిక్రి మరియు ఇతర నిరసన ప్రదేశాలలో చాలా మంది రైతులు క్యాంప్ చేస్తున్నారు, మరికొందరు కొద్దిరోజులు వచ్చి వారితో ఉండి, తిరిగి వారి గ్రామాలకు వెళ్లి అక్కడ జరుగుతున్న ఆందోళన గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు.

జనవరి 9 న మధ్యాహ్నం, హర్యానా- ఢిల్లీ సరిహద్దులోని సింగు నిరసన స్థలానికి సోదరీమణులు తిక్రి నుండి ఇతర యూనియన్ సభ్యులతో బయలుదేరారు. వారి బస్సులు మూడు కిలోమీటర్ల దూరంలో ఆగిపోయాయి. వారంతా ప్రధాన వేదిక ముందు కూర్చున్న అరేనాకు, ప్లకార్డులు, యూనియన్ జెండాలతో నడిచారు. రేషమ్ పట్టుకున్న ప్లకార్డ్ లో ఇలా ఉంది: ‘రక్తం పీల్చే కార్పొరేట్ల కోసం కాకుండా ప్రజల కోసం ఖజానాలను తెరవండి’.

బీంట్ తన అక్క కంటే ఎక్కువగా  యూనియన్ సమావేశాలలో పాల్గొన్నది. ఆమె పంజాబ్ ఖేట్ మజ్దూర్ యూనియన్‌తో ఏడేళ్లుగా ఉంది. కానీ రేషమ్ మూడేళ్ల క్రితం చేరింది. ఖుండే హలాల్ గ్రామంలో (చన్ను నుండి 50 కిలోమీటర్ల దూరంలో) ఉన్న ఆమె అత్త, మామలు, ఒక కుమార్తె కావాలి అని ఆమె చిన్నతనంలోనే బీంట్ ను దత్తత తీసుకున్నారు. వారు అప్పటికే యూనియన్ సభ్యులు. "కాబట్టి నేను చిన్న వయస్సులోనే సభ్యురాలిని అయ్యాను," అని బీంట్ చెప్పింది. (మూడేళ్ల క్రితం బీంట్ చన్నూలోని డిగ్రీ చేయడం కోసం తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చింది.)

5,000 మంది సభ్యుల పంజాబ్ ఖేత్ మజ్దూర్ యూనియన్ దళితులకు భూ హక్కులు,జీవనోపాధి, కుల వివక్షకు సంబంధించిన అంశాలపై పనిచేస్తుంది. "వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ ఆందోళన వారి భూమి లేక కనీస మద్దతు ధరకు సంబంధించిన సమస్యల కోసం అని చాలామంది అనుకుంటారు. కానీ వ్యవసాయ కూలీలు వారి ఆహార భద్రత గురించి - ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి పోరాడుతున్నారు.  ”అని యూనియన్ ప్రధాన కార్యదర్శి లచ్మాన్ సింగ్ సేవాలా చెప్పారు.

“మా గ్రామంలో వ్యవసాయ కూలీల సంఘం లేదు, రైతు సంఘాలు మాత్రమే. అందువల్ల అక్కడ ఉన్న కొంతమంది వ్యవసాయ కూలీలకు [ఈ చట్టాల ప్రకారం] అన్యాయం జరుగుతోందని తెలియదు,” అని బీంట్ జతచేస్తుంది. “కానీ మాకు తెలుసు. మేము ఢిల్లీ కి వచ్చాము, ఈ చట్టాలు రైతులకే కాకుండా అందరినీ ఎందుకు ప్రభావితం చేస్తాయి అనే విషయాన్ని మేము మా ఊరిలో  వారికి స్పష్టంగా  చెప్పగలము. ”అని రేషమ్ చెప్పారు.

ఈ సోదరీమణులు తిరిగి జనవరి 10 న ఇంటికి బయలుదేరారు. నిరసన ప్రదేశాలలో ఈ రెండు రోజుల అనుభవం తరువాత, బీంట్ తన గ్రామస్తులకు తెలియజేయడానికి చాలా ఉందని చెప్పారు. "రైతుల భూముల్లో వ్యవసాయాన్ని బయటి వ్యక్తులు స్వాధీనం చేసుకుంటే, కూలీలు ఎక్కడికి వెళతారు? మండి బోర్డు కూల్చివేసి, ప్రభుత్వం నడిపే ఏజెన్సీలు విఫలమైతే, పేదలకు వారి రేషన్ ఎక్కడ నుండి వస్తుంది? ” ఆమె పంజాబ్ స్టేట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ బోర్డును ప్రస్తావిస్తూ అడుగుతుంది. "పేదలు చనిపోతారు. ఈ ప్రభుత్వం మేము దద్దమ్మలం అనుకుంటుంది. కానీ మేము ప్రతిరోజూ విచక్షణను పెంచుకుంటాం.  న్యాయం కోసం పోరాడతాం.”

అనువాదం - అపర్ణ తోట

Sanskriti Talwar

Sanskriti Talwar is an independent journalist based in New Delhi, and a PARI MMF Fellow for 2023.

Other stories by Sanskriti Talwar
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota