“అక్కడ MSP ఉండదు, వారు నెమ్మదిగా APMC లను మూసివేస్తారు, పైగా  కరెంటును ను ప్రైవేటీకరిస్తున్నారు. మేము ఆందోళన పడడానికి పూర్తిగా కారణం ఉంది, ”అని శివమొగ్గ జిల్లాకు చెందిన డి. మల్లికార్జునప్ప అనే రైతు అన్నారు.

మల్లికార్జునప్ప (61) జనవరి 25 న షికార్పూర్ తాలూకా ఉన్న హులుగినకోప్ప అనే తన గ్రామం నుంచి 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బెంగళూరుకు వచ్చారు, మరుసటి రోజు రైతుల రిపబ్లిక్ డే ట్రాక్టర్ పరేడ్‌లో చేరారు. "పెద్ద కంపెనీల మాటలు వినే బదులు, వారు [కేంద్ర ప్రభుత్వం] ఎపిఎంసిలను సంస్కరించాలి, తద్వారా మాకు ధాన్యానికి సరైన ధర లభిస్తుంది" అని ఆయన అన్నారు.

కొత్త వ్యవసాయ చట్టాలు అతని చింతలను పెంచాయి - రైతులు తమ ఆహార ధాన్యాల సేకరణకు హామీ ఇచ్చే కనీస మద్దతు ధర (ఎంఎస్పి) మరియు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలు (ఎపిఎంసి) వంటి కొన్ని ప్రభుత్వ సహకారాలను  ఈ చట్టాలు బలహీన పరుస్తాయి.

మల్లికార్జునప్ప తన 12 ఎకరాల భూమిలో 3-4 ఎకరాలలో వరిని సాగు చేస్తాడు. అతను మిగిలిన స్థలంలో వక్క పంట ను పెంచుతాడు. "గత సంవత్సరం వక్క పంట దిగుబడి చాలా తక్కువగా ఉంది, వరి దిగుబడి కూడా తక్కువే వచ్చింది." అని అతను చెప్పాడు. “నేను 12 లక్షల రూపాయల బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించాలి. వారు [రాష్ట్ర ప్రభుత్వం] రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పారు. కానీ బ్యాంకులు ఇప్పటికీ నాకు చాలా నోటీసులు పంపి వేయబోయే జరిమానాల గురించి హెచ్చరిస్తున్నాయి. నాకు దాని గురించి కూడా ఆందోళనగా ఉంది ” అని ఆయన కోపంగా అన్నారు.

బెంగుళూరు కు దూరంగా ఉన్న జిల్లాల నుండి  వచ్చిన మల్లికార్జునప్ప వంటి రైతులు పెరేడ్ కు ఒక రోజు ముందు చేరుకున్నారు. అయితే సమీప జిల్లాలైన మాండ్యా, రామనగర, తుమ్కూర్ జిల్లాల నుంచి వచ్చిన ఇతర రైతులు, జనవరి 26 న ఉదయం 9 గంటలకు బెంగళూరు నగర శివార్లలో ట్రాక్టర్లు, కార్లు బస్సులలో సమావేశమయ్యారు. వారు సెంట్రల్ బెంగళూరులోని గాంధీ నగర్ ప్రాంతంలోని ఫ్రీడమ్ పార్కుకు మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకుని ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ పరేడ్‌కు మద్దతుగా నిరసనలో పాల్గొనవలసి ఉంది. నవంబర్ 26 నుండి ఢిల్లీ సరిహద్దుల్లో మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్న రైతులు జాతీయ రాజధానిలో రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించారు.

Left: D. Mallikarjunappa (centre), a farmer from Shivamogga. Right: Groups from across Karnataka reached Bengaluru for the protest rally
PHOTO • Tamanna Naseer
Left: D. Mallikarjunappa (centre), a farmer from Shivamogga. Right: Groups from across Karnataka reached Bengaluru for the protest rally
PHOTO • Tamanna Naseer

ఎడమ: శివమోగ్గకు చెందిన డి.మల్లికార్జునప్ప (మధ్య). కుడి: నిరసన ర్యాలీ కోసం కర్ణాటక వ్యాప్తంగా ఉన్న బృందాలు బెంగళూరు చేరుకున్నాయి

రైతులు నిరసన తెలిపే చట్టాలు: రైతు ఉత్పత్తి వాణిజ్య (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం, 2020 ; ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020 పై రైతు (సాధికారత మరియు రక్షణ) ఒప్పందం ; మరియు ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) చట్టం, 2020 . ఇవి మొదట జూన్ 5, 2020 న ఆర్డినెన్స్‌లుగా ఆమోదించబడ్డాయి, తరువాత సెప్టెంబర్ 14 న పార్లమెంటులో వ్యవసాయ బిల్లులుగా ప్రవేశపెట్టబడ్డాయి.  అదే నెల 20 న ప్రస్తుత ప్రభుత్వంచే ఇవి చట్టాలుగా ఆమోదించబడ్డాయి.

రైతులు ఈ చట్టాలను వారి జీవనోపాధికి జరిగే పెద్ద హానిగా చూస్తారు. ఎందుకంటే వీటి ద్వారా పెద్ద కార్పొరేట్‌లు రైతుల వ్యవసాయంపై మరింత అధికారాన్ని పొందుతారు. MSP, APMC లు, రాష్ట్ర సేకరణ  ఇలా మరెన్నో, ప్రభుత్వం సాగుదారునికి మద్దతు ఇచ్చే సహకారాలను కూడా వారు బలహీనపరుస్తారు. అంతేగాక భారతీయ రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ను బలహీనం చేస్తూ, పౌరులందరికీ వాజ్యం వేయగల చట్టబద్దమైన హక్కును నిలిపివేస్తున్నందున ప్రతి భారతీయుడిని ప్రభావితం చేసే ఈ  చట్టాలు విమర్శించబడ్డాయి.

టి.సి. వసంత బెంగళూరు సమీపంలోని బీదడి పట్టణం లో నిరసనకారులతోపాటుగా  కలిశారు.  ఈ నిరసనలో పాల్గొనడానికి రైతులైన ఆమె, ఆమె సోదరి పుట్టా చన్నమ్మ, మాండ్యా జిల్లాలోని మద్దూర్ తాలూకా నుండి వచ్చారు. వారి గ్రామమైన కె.ఎం. దోడిలో  వసంత ఆమె భర్త, కె.బి. నింగెగౌడ, రెండు ఎకరాల భూమిలో వరి, రాగి, ఇంకా జొన్న సాగు చేస్తున్నారు. నర్సింగ్  చదువుతున్న 23 ఏళ్ల కుమారుడు, సోషల్ వర్క్ చదువుతున్న 19 ఏళ్ల కుమార్తె తో కలిపి నలుగురు సభ్యులున్న వారి కుటుంబం చాలావరకు వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం పైనే  ఆధారపడి ఉంటుంది. వారి స్వంత భూమి లో వ్యవసాయమే కాక వసంత, ఆమె భర్త- ఇద్దరూ MGNREGA పనికి సంవత్సరానికి 100 రోజులు వెళ్తారు.

కర్ణాటక భూ సంస్కరణల (సవరణ) చట్టం, 2020 ను ప్రస్తావిస్తూ "కొత్త వ్యవసాయ చట్టాలు భూ చట్టంలానే కంపెనీలకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తాయి" అని వసంత అన్నారు. ఈ చట్టం వ్యవసాయేతర వ్యక్తులకు  ‘వ్యవసాయ భూమిని కొనడం మరియు అమ్మడం’ పై ఉన్న  ఆంక్షలను తొలగించింది. వ్యవసాయ భూములను కార్పొరేట్ సంస్థలు స్వాధీనం చేసుకుంటాయనే భయంతో కర్ణాటకలోని రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

"వారు [ప్రభుత్వం] రైతులు అన్నదాతలు అని చెబుతూనే ఉంటారు , కాని మా పై వేధింపులు మానరు. [ప్రధాని] మోడీ, [ముఖ్యమంత్రి] యడియరప్ప ఇద్దరూ రైతులను హింసించారు. యెడియరప్ప ఇక్కడ భూ చట్టాన్ని సవరించారు. అతను ఆ సవరణని విరమించి రైతులకు వాగ్దానం చేయాలి. ఈ రోజు వారి ట్రాక్టర్లలో వందలాదిమందిమి వస్తున్నాము.  మేం భయపడము , ” అని వసంత అన్నారు.

Top left: T.C. Vasantha (in orange saree), Putta Channamma (in yellow) and other farmers from Mandya assembled in Bidadi, near Bengaluru. Top right: R.S. Amaresh arrived from Chitradurga. Bottom: Farmers on their way to Bengaluru's Freedom Park
PHOTO • Tamanna Naseer

ఎగువ ఎడమ: టి.సి. వసంత (నారింజ చీరలో), పుట్టా చన్నమ్మ (పసుపు రంగులో) మరియు మాండ్యకు చెందిన ఇతర రైతులు బెంగళూరు సమీపంలోని బిడాడిలో సమావేశమయ్యారు. ఎగువ కుడి: R.S. అమరేష్ చిత్రదుర్గా నుండి వచ్చారు. దిగువ: బెంగళూరు ఫ్రీడమ్ పార్కుకు వెళ్లే రైతులు

కర్ణాటక రైతులు, పంజాబ్ మరియు హర్యానా రైతుల కంటే ముందు నుండే  నిరసన వ్యక్తం చేస్తున్నారని రైతు సంస్థ కర్ణాటక రాజ్య రైతా సంఘ (కెఆర్ఆర్ఎస్) నాయకుడు బదగల్పురా నాగేంద్ర అన్నారు. "మేము మొట్టమొదట 2020 మేలో భూ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం ప్రారంభించాము, తరువాత కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మేము మా గళాన్నెత్తాము."  బెంగళూరులో, గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిపిన  ర్యాలీలో  ప్రధాన నిర్వాహక సంస్థలలో KRRS ఒకటి. అసలైతే 2 వేల ట్రాక్టర్లను తీసుకురావాలని సంస్థ ప్రణాళిక వేసింది, “కానీ పోలీసులు 125 ట్రాక్టర్లకు మాత్రము అనుమతినిచ్చారు” అన్నారు  ఆ రైతు నాయకుడు.

కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల సంపాదనను మరింత కష్టతరం చేస్తాయని ఆర్.ఎస్. చిత్రదుర్గ జిల్లా చల్లకరే తాలూకాలోని రేణుకాపుర గ్రామానికి చెందిన అమరేష్ అనే 65 ఏళ్ల రైతు అన్నారు.  “రైతుగా జీవించడం చాలా కష్టం. మన పంటకు విలువ లేదు. వ్యవసాయం పై ఆశను వదులుకున్నాం. ఇది ఇలాగే కొనసాగితే, రైతు లేని రోజు వస్తుంది. ” అని బాధపడ్డారు.

తన పిల్లలు రైతులు కావాలని అమరేష్ కోరుకోలేదు, కాబట్టి వారు వేరే వృత్తులు చేపట్టేలా జాగ్రత్త పడ్డారు. “నేను నా పిల్లలిద్దరినీ  చదివిస్తున్నాను కాబట్టి వారు వ్యవసాయం మీద ఆధారపడవలసిన అవసరం లేదు. మాకు వ్యవసాయంలో ఖర్చు చాలా ఎక్కువ. నా పొలంలో ముగ్గురు కూలీలు పనిచేస్తున్నారు, నేను ఒక్కొక్కరికి రూ. 500 [రోజుకు] ఇవ్వాలి. నాకు ఎప్పటికీ సరిపడా ఆదాయం ఉండదు, ”అని అన్నారు. అతని 28 ఏళ్ల కుమారుడు చార్టర్డ్ అకౌంటెన్సీ విద్యార్థి, అతని 20 ఏళ్ల కుమార్తె  ఎంఎస్సీ చేస్తున్నారు.

బిడాడిలోని బైరమంగళ క్రాస్ వద్ద, జనవరి 26 న వచ్చిన మొదటి నిరసనకారులలో గజేంద్ర రావు ఒకరు. గజేంద్ర రైతు కాదు. అతను క్యాబ్ డ్రైవర్. అంతేకాదు,  రాష్ట్రంలోని హక్కుల సమూహమైన కర్ణాటక జనశక్తి కార్యకర్త. "నా ఆహారం కోసం పోరాడటానికి నేను ఇక్కడికి వచ్చాను" అని ఆయన అన్నారు. "ప్రభుత్వం ఇప్పుడు ఎఫ్సిఐ [ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా] తో ధాన్యాలు నిల్వ చేస్తుంది. ఈ వ్యవస్థ నెమ్మదిగా మారుతుంది. మనము ఆ దిశగా వెళ్తున్నాము. ఇకపై వ్యవస్థను  ప్రభుత్వం బదులు కార్పోరేట్లు నియంత్రించే అవకాశం ఉంది  కాబట్టి ఆహార ధరలు ఖచ్చితంగా పెరుగుతాయి. “ అన్నారు.

Left: Gajendra Rao, a cab driver in Bengaluru, joined the protestors in Bidadi. Right: Farmers' groups came in buses, tractors and cars
PHOTO • Tamanna Naseer
Left: Gajendra Rao, a cab driver in Bengaluru, joined the protestors in Bidadi. Right: Farmers' groups came in buses, tractors and cars
PHOTO • Tamanna Naseer

ఎడమ: బెంగళూరులో క్యాబ్ డ్రైవర్ గజేంద్ర రావు బీదాడిలో నిరసనకారులతో చేరారు. కుడి: బస్సులు, ట్రాక్టర్లు, కార్లలో రైతు సంఘాలు వచ్చాయి

గజేంద్ర తాతకు ఉడిపి జిల్లాలో ఒక పొలం ఉండేది. "కానీ కుటుంబ గొడవల కారణంగా మేము దానిని పోగొట్టుకున్నాము. నాన్న 40 సంవత్సరాల క్రితం బెంగళూరు వచ్చి రెస్టారెంట్ ప్రారంభించారు. నేను ఇప్పుడు నగరంలో క్యాబ్‌లను నడుపుతున్నాను, ”అని ఆయన చెప్పారు.

ఈ మూడు వ్యవసాయ చట్టాలు భారతదేశ రైతులందరి పై ప్రభావం చూపుతాయని KRRS నాయకుడు నాగేంద్ర తెలిపారు. "కర్ణాటకలో కూడా MSP పై ప్రభావం ఉంటుంది. [కర్ణాటక] APMC చట్టం 1966 లో  ఆహార సేకరణపై కొన్ని ఆంక్షలు ఉన్నాయి. కొత్త చట్టం ప్రైవేట్ మార్కెట్లు మరియు సంస్థలను మాత్రమే ప్రోత్సహిస్తుంది. వాస్తవానికి వ్యవసాయ చట్టాలు గ్రామీణ భారతదేశ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ”

ఈ చట్టాలు రైతుల పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తాయని అమరేష్ అభిప్రాయపడ్డారు. "ప్రభుత్వం మా ఉత్పత్తి ఖర్చులను పరిశీలించి, కొంత మార్జిన్‌ను లాభంగా అనుమతించాలి, అందుకు అనుగుణంగా MSP ధర ని నిర్ణయించాలి. ఈ చట్టాలను తీసుకురావడం ద్వారా వారు రైతులకు హాని చేస్తున్నారు. పెద్ద కంపెనీలు తమ వ్యూహాలతో మాకు ప్రభుత్వం కన్నా తక్కువ చెల్లిస్తాయి, ”అని ఆయన అన్నారు.

కానీ అలా జరగనివ్వకూడదని వసంత నిశ్చయించుకుంది. "మేము పెట్టిన కృషికి, ప్రతి ఎకరానికి 50,000 నుండి లక్ష రూపాయలు పొందాలి, కాని మాకు ఏమీ లభించడం లేదు" అని ఆమె అంటూ,  "ఒక నెల మాత్రమే కాదు, అవసరమైతే మేము ఒక సంవత్సరం పాటు పోరాడుతాము.” అని గట్టిగా చెప్పింది.

అనువాదం - అపర్ణ తోట

Tamanna Naseer

Tamanna Naseer is a freelance journalist based in Bengaluru.

Other stories by Tamanna Naseer
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota