వాళ్ళు తమిళనాడులో ఎన్నో ప్రదేశాలు దాటుకుని వచ్చారు, తూత్తుకుడి పట్టణంలో వీధులలోకి గుంపులు గుంపులుగా మనుషులు వచ్చాక -  ఒక చిన్నపిల్లాడు వారి వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను కాసేపట్లోనే వారు చేసే ఆ నిరసన లో  కలిసిపోయి విప్లవాత్మక నినాదాలు ఇచ్చాడు. “మీకీ రోజు ఈ విషయం అర్ధమవకపోవచ్చు.” అన్నారయన, “కానీ భగత్ సింగ్ ని ఉరితీయడం తమిళనాడులో స్వాతంత్య్రపోరాట భావోద్వేగాలను ఒక మలుపు తిప్పింది. ప్రజలు నిర్ఘాంతపోయారు, చాలా మంది కనీళ్ళు పెట్టుకున్నారు.”

“నాకు అప్పుడు 9 ఏళ్ళు మాత్రమే”, ఆయన నవ్వారు.

ఈ రోజు ఆయన వయసు 99 ఏళ్ళు. ఆయనలో స్వాతంత్య్ర యోధుడిని చేసిన ఆత్మజ్వాల, ఇంకా ప్రజ్వలంగా ఉంది. ఈయన ఒక అండర్ గ్రౌండ్ విప్లవ రచయిత, వక్త, విప్లవాత్మక మేథావి. బ్రిటిష్ జైలు నుండి ఆగష్టు 14, 1947న బయటపడిన వ్యక్తి. “ఆ రోజు ఆ జడ్జి సెంట్రల్ జైలుకి వచ్చి మమ్మల్ని విడుదల చేశారు. మమ్మల్ని మదురై కుట్ర కేసులో పట్టుకున్నారు. నేను మదురై సెంట్రల్ జైలు నుండి వచ్చి స్వాతంత్య్ర ఊరేగింపులో పాల్గొన్నాను.”

వందేళ్లున్న శంకరయ్య మేధ ఇప్పటికీ చురుకుగా ఉంది. ఇప్పటికీ ఆయన ఉపన్యాసాలు ఇస్తారు. 2018లో ఈయన ఇంటి నుంచి చైన్నై ఊరి చివర ఉన్న క్రోమ్పేట్ వరకు వచ్చారు. అక్కడ తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ మీట్ జరుగుతోంది, అక్కడే మేము ఆయనను ఇంటర్వ్యూ చేశాము. స్వాతంత్య్ర పోరాటం లో పాల్గొన్న ఫలితంగా ఆయన ఎప్పటికి తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేకపోయినా రాజకీయ పరిణామాలపై పుస్తకాలు, కరపత్రాలు, జర్నలిస్ట్ వ్యాసాలూ రచించారు.

నరసింహాలు శంకరయ్య అమెరికన్ కాలేజీ, మదురై లో బి ఏ  హిస్టరీ పూర్తిచెయ్యబోతూ, అతని ఆఖరు పరీక్షలను 1941 లో రెండు వారాల  వ్యవధిలో రాసే అవకాశం పోగొట్టుకున్నారు. “నేను విద్యార్థుల యూనియన్ కు జాయింట్ సెక్రటరీని.”  ఈయన క్యాంపస్ లో కవుల సమాజాన్ని స్థాపించారు. తన కాలేజ్లో మంచి ఫుట్బాల్ ఆటగాడు కూడా. బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలలో ముందుడేవారు. “కాలేజీ రోజుల్లో వామపక్ష భావజాలమున్న వ్యక్తులకు నేను దగ్గరయ్యాను. భారత స్వాతంత్య్రం రాకుండా సమాజం లో మార్పు రాదనీ నమ్మాను.” ఆయనకు 17 ఏళ్ళు ఉన్నప్పుడే భారత కమ్యూనిస్ట్ పార్టీ లో సభ్యుడయ్యారు(అప్పటికే అది నిషేధించబడింది, అందుకే అండర్ గ్రౌండ్ లో పని చేసేవారు).

అమెరికన్ కాలేజీ అనుకూలంగానే ఉండేదని గుర్తు తెచ్చుకున్నారు ఆయన. “మా కాలేజీలో అమెరికన్ డైరెక్టర్, ఇంకొందరు అమెరికన్లు ఫాకల్టీ సభ్యులు ఉండేవారు. మిగిలినవారందరూ తమిళవారే. వారంతా తటస్థంగా ఉండేవారు కానీ బ్రిటిష్ వారికి అనుకూలంగా ఐతే లేరు. విద్యార్థి కార్యకలాపాలకు అనుమతి ఉండేది.” 1941 మదురైలో అన్నామలై యూనివర్సిటీ స్టూడెంట్ అయిన మీనాక్షిని, బ్రిటిష్ వారి పై నిరసన తెలియజేసినందుకు అరెస్టు చేశారని నిరసన సభ జరిగింది. “అప్పుడు మేమొక కరపత్రాన్ని విడుదల చేశాము. మా హాస్టల్ రూమ్ ని తనిఖీ చేశారు. నా స్నేహితుడు నారాయణస్వామి వద్ద కరపత్రం దొరికినందుకు అరెస్ట్ చేశారు. ఆ తరవాత అతని అరెస్టుని ఖండిస్తూ మేము ఇంకో మీటింగ్ ని నిర్వహించాము.

వీడియో చూడండి: భారత స్వాతంత్య్రం కోసం శంకరయ్య పోరాటం

“ఆ తరవాత 1941, ఫిబ్రవరి 28న బ్రిటిష్ వారు నన్ను అరెస్ట్ చేశారు. అది నా ఆఖరు పరీక్షలకు పదిహేను రోజుల ముందు. నేనిక  ఎప్పటికి వెనక్కి రాలేదు, నా బిఎ పూర్తిచెయ్యలేదు.”  అతని అరెస్ట్ ఎలా జరిగిందో చెబుతూ, దశాబ్దాల తరవాత, ”ఇండియా స్వేచ్ఛ కోసం నేను జైలు కెళ్ళినందుకు, పోరాటంలో భాగమైనందుకు  గర్వపడుతున్నా. అదొక్కటే నా మనసులోని ఆలోచన.” భవిష్యత్తు  అవకాశాలు పోయాయని ఆయనలో పశ్చాత్తాపం లేదు.  ఆయన తన విప్లవాత్మక యవ్వన సమయాల్లోని నినాదాన్ని గుర్తుచేసుకున్నారు. “మాకు ఉద్యోగాలు కాదు, స్వాతంత్య్రం కావాలి.”

“నేను మదురై జైలులో 15 రోజులున్న తరవాత వెల్లూరు జైలుకు పంపించారు. ఆ సమయాల్లో తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కేరళలో డిటైన్  చేయబడిన వారు ఎందరో అక్కడ ఉండేవారు.”

“కామ్రేడ్ ఎ కె గోపాలన్(కేరళ లోని గొప్ప కమ్యూనిస్ట్ పార్టీ లీడర్)ని తిరుచిలో ఒక సమావేశాన్ని  ఏర్పాటు చేసినందుకు గాను అరెస్ట్ చేశారు. కేరళలోని కామ్రేడ్ ఇంబీచి బావ, వి సుబ్బయ్య, జీవానందాన్ని కూడా అదే సమావేశంలో అరెస్ట్ చేశారు. వారంతా వెల్లూర్ జైల్లో ఉన్నారు. మద్రాస్ లో ప్రభుత్వం మమ్మల్ని రెండు గుంపులుగా విడగొట్టింది. ఒక సమూహానికి ‘సి’ టైపు రేషన్- క్రిమినల్ కాన్విక్టులకు ఇచ్చేది ఇద్దామనుకున్నారు. మేము 19 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాము. పదో రోజుకు మమ్మల్ని రెండు భాగాలుగా విడగొట్టారు. నేను అప్పటికింకా విద్యార్థినే.”

జైలు ఇన్స్పెక్టర్ జనరల్, శంకరయ్య సెల్ కి వచ్చి, కౌమారం లో ఉన్న పిల్లవాడు మాక్సిం గోర్కీ , ‘అమ్మ’ ని చదువుతున్నాడని ఆశ్చర్యపోయాడు. “నువ్వు  నిరాహారదీక్ష పదో రోజున గోర్కీ అమ్మ ని చదువుతున్నావా?” అని అడిగాడు,” అని చెప్పాడు శంకరయ్య. అతన్ని కళ్లు ఆ జ్ఞాపకాలతో తళుక్కుమన్నాయి.

ఆ సమయం లో చాలామంది ప్రసిద్ధ నాయకులు వేరే జైళ్లలో ఉన్నారు- “ వారిలో కామరాజర్(కె కామరాజు, తరవాత మద్రాస్ రాష్ట్రానికి, (ప్రస్తుత తమిళనాడు) 1954-63 కాలంలో   ముఖ్యమంత్రి అయ్యారు), పట్టాభి సీతారామయ్య (స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు), ఇంకా వేరే ఇతరులు ఉన్నారు. ఏదేమైనా వారు వేరే చోట, వేరే జైల్లో ఉన్నారు. కాంగ్రెస్ వారు నిరాహార దీక్షలో పాల్గొనలేదు. వారెప్పుడు-  మహాత్మా గాంధీ మాటలనే పాటిస్తాం అనేవారు. అంటే ‘జైలు లో  ఎటువంటి గొడవని సృష్టించకండి.’ అని. అయినా ప్రభుత్వం కొన్ని రాయితీలను ఇచ్చింది. మేము మా నిరాహారదీక్షను 19వ రోజుకు ముగించాము.”

PHOTO • S. Gavaskar

పైన ఎడమ: తొంభైలమధ్యలో  ఉన్న శంకరయ్య పార్టీ రాష్ట్ర కమిటీ ఆఫీస్ ఎదురుగా నిలబడి ఉన్నారు. పైగా కుడి: పబ్లిక్ మీటింగ్ లో (ముందు మూలలో, మొదటి మనిషి) 1980 లలో తన పాత కామ్రేడ్ పి రామమూర్తి ఉపన్యసిస్తున్నారు

వారిద్దరి మధ్య అభిప్రాయం బేధాలున్నప్పటికీ, “కమ్యూనిస్టులకు కామరాజరార్ మంచి స్నేహితుడు. అతనితో పాటు అదే జైలు గది లో మదురై నుంచి తిరునల్వేలి నుంచి వచ్చిన మరో ఇద్దరు కూడా కమ్యూనిస్టులే. నేను కామరాజరార్ కు సన్నిహితంగా మసిలేవాడిని. అతను జైలువారు మా పట్ల వ్యవహారిస్తున్నతీరును మార్చడానికి ఒకటి రెండు సార్లు ప్రయత్నించాడు. కానీ జైలులో చాలా వాదోపవాదాలు కూడా  జరిగేవి(కాంగ్రెస్ వారికి కమ్యూనిస్టులకు మధ్య). ముఖ్యంగా జర్మన్-సోవైట్ వార్ మొదలైనప్పుడు.

ఆ తరవాత మాలో ఎనిమిది మందిని రాజమండ్రి(ప్రస్తుతపు ఆంధ్రప్రదేశ్) జైలుకు బదిలీ చేసి అక్కడ విడిగా ఉంచారు.

ఏప్రిల్ 1942 నాటికి ప్రభుత్వం అందరు  విద్యార్థులను విడుదల చేసింది, నన్ను తప్ప. హెడ్ వార్డెన్ వచ్చి, “ శంకరయ్య అంటే ఎవరు? “ అని అడిగి, ఆ తరవాత చెప్పాడు, అందరు విడుదలయ్యారు నేను తప్ప అని. ఒక నెల పాటు నేను ఒంటరిగా ఉండిపోయాను - ఇదివరకు అంతమంది ఉన్న ఆ స్థలంలో నేనొక్కడినే సంచరించేవాడిని.”

ఏ ఆరోపణలతో మిమ్మల్ని అరెస్ట్ చేశారు?  “ఇది అని ఏమి లేదు. డిటెన్షన్ మాత్రమే. ప్రతి ఆరునెలలకు వారు ఒక రాతపూర్వక నోటీసు జారీ చేసేవారు - నిన్నెందుకు అదుపులోకి తీసుకున్నారో చెబుతూ. ఆ కారణాలలో - సెడిషన్, కమ్యూనిస్ట్ పార్టీ కలాపాలు ఇటువంటివి ఉండేవి. మేము కమిటీకి మళ్లీ సమాధానం ఇచ్చేవారం. కానీ కమిటీ దానిని తోసిపుచ్చేది.”

కానీ, “విడుదలైన నా స్నేహితులు కామరాజరార్ ని రాజమండ్రి స్టేషన్ లో కలిశారు. ఆయన కలకత్తా నుండి  వెనక్కి వస్తున్నాడు. నన్ను విడుదల చేయలేదని తెలుసుకుని అతను మద్రాస్ చీఫ్ సెక్రటరీ కి ఒక ఉత్తరం రాశాడు- నన్ను వెల్లూర్ కు బదిలీ చేయమని కోరుతూ. అతను నాకు కూడా ఒక ఉత్తరం రాశాడు. ఆ తరవాత నెల నన్ను వెల్లూర్ జైలుకు బదిలీ చేశారు- అక్కడ నేను మరో 200 మంది సహోద్యోగులతో కలిసి ఉన్నాను.”

ఇలా జైళ్లు మారుతూ ఆయన మన మాజీ రాష్ట్రపతి వెంకటరమణని కూడా కలిశారు. “ఆయన 1943 లో జైలు లో ఉన్నప్పుడు, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియాలో సభ్యుడు. తరవాత ఆయన కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. అయినా మేము కలిసి కొన్నేళ్లు పనిచేశాము.”

PHOTO • M. Palani Kumar ,  Surya Art Photography

తూత్తుకుడి పట్టణం లోని స్కూల్(ఎడమ) శంకరయ్య ఇక్కడ ఐదవ తరగతి వరకు చదివారు. ఆ తరవాత మదురై లోని సెయింట్ మేరీస్ మిడిల్ స్కూల్ లో చదివాడు. ఆ తరవాత మదురై లోని అమెరికన్ కాలేజ్(కుడి), బిఎ చదివినా దాని పూర్తిచేయలేదు. ఆయన పరీక్షలు 15 రోజుల ముందు జైలు పాలయ్యారు

శంకరయ్య తోపాటు అమెరికన్ కాలేజ్ లో  చదువుకున్న చాలామంది - విద్యార్థుల పోరాటం లో చేయికలిపినవారు, పట్టభద్రులయ్యాక ప్రసిద్ధులయ్యారు. ఒకరు తమిళనాడు చీఫ్ సెక్రటరీ అవగా, మరొకరు జడ్జి అయ్యారు, ఇంకొకరు ఐఏఎస్ ఆఫీసర్ అయి చీఫ్ మినిస్టర్ కు సెక్రటరీ అయ్యారు. శంకరయ్య మళ్లీమళ్లీ జైళ్లకు వెళ్లారు - స్వాతంత్య్రం వచ్చాక కూడా. 1947 లో లోపల ఆయన చూసిన జైళ్లు - మదురై, వెల్లూర్, రాజమండ్రి, కన్నూర్, సేలం, తంజావూర్…

1948 లో కమ్యూనిస్ట్ పార్టీ పై నిషేధం విధించాక, ఆయన మళ్లీ ఇంకోసారి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. 1950లో ఆయనను అరెస్టు చేసి ఒక సంవత్సరం తరవాత విడుదల చేశారు. 1962లో ఎంతోమంది కమ్యూనిస్టులతో పాటు ఆయనను జైలులో వేసినా, ఆయనను మాత్రం 7 నెలలు - ఇండియా చైనా యుద్ధం అప్పుడు ఉంచేశారు. ఆ తరవాత మళ్లీ 1965లో విజృభించిన కమ్యూనిస్టు పోరాట సమయంలో ఆయనను 17 నెలలు జైలులో ఉంచారు.

కానీ స్వాతంత్య్రం తరవాత ఆయన్ని ఇబ్బందులు పెట్టినవారితో ఆయనకు వైషమ్యాలేమి లేవు. అవన్నీ రాజకీయ వైరుధ్యాలు గానే చూస్తారు కానీ వ్యక్తిగత కక్షలు కావని చెప్తారు. వ్యక్తిగత లాభం గురించి ఆలోచించకుండా, బలహీనుల కోసం ఆయన పోరాడుతూనే ఉన్నారు.

స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన లేక ఆయన స్ఫూర్తిపొందిన సమయాలేంటి?

“1931లో మార్చ్ 31న భగత్ సింగ్ ను ఉరితీయడం. 1945 లో జరిగిన ఇండియన్ నేషనల్ ఆర్మీ ట్రయల్స్ , 1946 లో జరిగిన రాయల్ ఇండియన్ నేవీ(RIN) మ్యుటినీ, ఇటువంటి కొన్ని ముఖ్య సంఘటనలు బ్రిటిష్ వారి సామ్రాజ్యవాదం పై యుద్ధానికి ఉత్తేజాన్నిచ్చాయి.”

దశాబ్దాలుగా, వామపక్షాల పట్ల ఆయన నిబద్ధత పెరుగుతూనే ఉంది. ఆయన ఎప్పటికీ పార్టీకి పూర్తి స్థాయి(హోల్ టైమర్)లో పనిచేస్తారు.

“1944 లో నేను తంజావూరు జైలు నుండి విడుదలై వచ్చాక, నన్ను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో మదురై జిల్లా కమిటీ సెక్రటరీగా ఎంచుకున్నారు. ఆ తరవాత 22 ఏళ్ళు నేను పార్టీ ల్లో రాష్ట్ర కమిటీ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను.”

Left: Sankariah in his party office library in 2013 – he had just inaugurated it. Right: With his wife S. Navamani Ammal in 2014 on his 93rd birthday. Navamani Ammal passed away in 2016
PHOTO • S. Gavaskar
Left: Sankariah in his party office library in 2013 – he had just inaugurated it. Right: With his wife S. Navamani Ammal in 2014 on his 93rd birthday. Navamani Ammal passed away in 2016
PHOTO • S. Gavaskar

ఎడమ : శంకరయ్య, 2013లో అతని పార్టీ ఆఫీస్ లైబ్రరీలో - దీనిని అప్పుడే ప్రారంభించారు. కుడి: 2014లో ఆయన 93 వ జన్మ దినం నాడు అతని భార్య నవమని అమ్మాళ్ తో, నవమని అమ్మాళ్ 2016 లో చనిపోయారు

జనసమీకరణలో శంకరయ్య కీలక వ్యక్తి. 1940 ల మధ్య నాటికి, మధురై,  వామపక్షాలకు ప్రధాన స్థావరం. “ పి.సి. జోషి [CPI ప్రధాన కార్యదర్శి] 1946 లో మధురైకి వచ్చినప్పుడు, ఆ సమావేశానికి లక్షమంది హాజరయ్యారు. మా సమావేశాలకు చాలామంది ప్రజలు హాజరవుతారు.”

వారిపై  పెరుగుతున్న ప్రజాదరణ వలన బ్రిటిష్ ప్రభుత్వం 'మధురై కుట్ర కేసు' లో మొదటి నిందితుడిగా పి. రామమూర్తి [తమిళనాడులో ప్రసిద్ధ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు], శంకరయ్యను రెండవ నిందితుడిగా, ఇంకా చాలా మంది సిపిఐ నాయకులు, కార్యకర్తలను కూడా కేసులోకి  లాగింది. ఈ కేసులో నిందితులు, ఇతర ట్రేడ్ యూనియన్ నాయకులను హత్య చేయడానికి వారి కార్యాలయంలో కుట్ర పన్నారని అభియోగాలు మోపారు. దీనికి ప్రధాన సాక్షి ఒక బండి లాగే వ్యక్తి అని, అతను కేవలం వారి మాట విన్నాడని పోలీసులు విధిగా అధికారులకు నివేదించారు.

ఎన్. రామ కృష్ణన్ (శంకరయ్య తమ్ముడు) తన 2008 జీవితచరిత్రలో “ పి. రామమూర్తి - ఒక శతాబ్ది నివాళి”, అనే అధ్యయనం లో ఇలా రాశారు. “విచారణ సమయంలో, రామమూర్తి [స్వయంగా తన కేసు తానే వాదించుకున్నారు] ప్రధాన సాక్షి చిన్న దొంగ అని, చాలాసార్లు జైలుకు వెళ్లినవాడు అని నిరూపించారు." ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి “ఆగష్టు 14, 1947 న జైలు ప్రాంగణానికి వచ్చారు ... ఈ కేసులో పాల్గొన్న వారందరినీ విడుదల చేశారు. అంతేగాక గౌరవనీయమైన నాయకులకు వ్యతిరేకంగా ఈ కేసును పెట్టినందుకు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.”

ఈ మధ్య మన  గతకాల వైభవాల గురించి ఎంత ప్రతిధ్వనించినా, అమాయకులను విడిపించడానికి, ప్రభుత్వాన్ని తెగడడానికి ఒక ప్రత్యేక న్యాయమూర్తి జైలుకు వెళ్ళే అవకాశం అసలు లేదు.

1948 లో CPI ని నిషేధించిన తరువాత, రామమూర్తి ఇంకా ఇతరులు మళ్లీ జైలు పాలయ్యారు - ఈసారి స్వతంత్ర భారతదేశంలో. ఎన్నికలు వస్తున్నాయి, వామపక్షాల పట్ల ఉన్న ప్రజాదరణ, మద్రాస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ముప్పుగా ఉంది.

Left: DMK leader M.K. Stalin greeting Sankariah on his 98th birthday in 2019. Right: Sankariah and V.S. Achuthanandan, the last living members of the 32 who walked out of the CPI National Council meeting in 1964, being felicitated at that party’s 22nd congress in 2018 by party General Secretary Sitaram Yechury
PHOTO • S. Gavaskar
Left: DMK leader M.K. Stalin greeting Sankariah on his 98th birthday in 2019. Right: Sankariah and V.S. Achuthanandan, the last living members of the 32 who walked out of the CPI National Council meeting in 1964, being felicitated at that party’s 22nd congress in 2018 by party General Secretary Sitaram Yechury

ఎడమ: డిఎంకె నాయకుడు ఎం. కె. స్టాలిన్ 2019 లో 98 వ పుట్టినరోజు సందర్భంగా శంకరయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. కుడి: 1964 లో సిపిఐ జాతీయ కౌన్సిల్ సమావేశం నుండి నిష్క్రమించిన 32 మందిలో చివరి సభ్యులైన శంకరయ్య ,వి. ఎస్  అచ్యుతానందన్ లను,  పార్టీ జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి 2018 లో, ఆ పార్టీ 22 వ కాంగ్రెస్‌లో సత్కరించారు

"కాబట్టి రామమూర్తి నిర్బంధంలో ఉన్నప్పుడు, సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ముందు తన నామినేషన్ దాఖలు చేశారు. మద్రాస్ ఉత్తర నియోజకవర్గం నుండి మద్రాస్ అసెంబ్లీకి 1952 ఎన్నికల్లో పోటీ చేశారు. అతని ప్రచార బాధ్యత నేను తీసుకున్నాను. ఇక ప్రముఖ కాంగ్రెస్ సభ్యుడు చిదంబరం భారతి, పి.టి. జస్టిస్ పార్టీ నుండి రాజన్- ఇతర ఇద్దరు అభ్యర్థులు.  రామమూర్తి అద్భుతంగా గెలిచాడు, అతను జైల్లో ఉన్నప్పుడే ఫలితం ప్రకటించారు. భారతి రెండవ స్థానంలో నిలిచాడు, రాజన్ డిపాజిట్ కోల్పోయాడు. విజయోత్సవ సమావేశం 3 లక్షలకు పైగా ప్రజలు హాజరైయ్యారు.” అలా స్వాతంత్య్రం వచ్చాక,  తమిళనాడులో, ప్రతిపక్షం నుండి ఎన్నికైన మొదటి నాయకుడు రామమూర్తి అయ్యారు.

1964లో కమ్యూనిస్ట్ పార్టీ విడిపోయినప్పుడు, శంకరయ్య కొత్తగా ఏర్పడిన CPI-M తో కలిశారు. "1964లో సిపిఐ జాతీయ కౌన్సిల్ నుండి బయటకు వెళ్లిన 32 మంది సభ్యులలో, నేను, వి. ఎస్. అచ్యుతానందన్ మాత్రమే ఇప్పటికీ బ్రతికి ఉన్నాం." అన్నారు.  శంకరయ్య జనరల్ సెక్రటరీగా, ఆ తరువాత ఆల్ ఇండియా కిసాన్ సభకు అధ్యక్షుడిగా కొనసాగారు, ఇప్పటికీ ఆల్ ఇండియా కిసాన్ సభ, 15 మిలియన్ల మంది సభ్యులున్న భారతదేశపు అతిపెద్ద రైతు సంస్థ. ఆయన CPI -M తమిళనాడు రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఏడు సంవత్సరాలు, పార్టీ కేంద్ర కమిటీ లో రెండు దశాబ్దాలు పైగానే పనిచేశారు.

తమిళనాడు అసెంబ్లీలో మొదటగా తమిళాన్ని పరిచయం చేసినది తానేనని ఆయన గర్వంగా చెప్పారు.  “1952 లో, అసెంబ్లీలో తమిళంలో మాట్లాడేవారు కాదు, అక్కడ వాడే  భాష ఇంగ్లీష్ మాత్రమే. కానీ [మా ఎమ్మెల్యేలు] జీవానందం మరియు రామమూర్తి తమిళంలో మాట్లాడేవారు, దాని నిబంధన 6 లేదా 7 సంవత్సరాల తరువాత మాత్రమే వచ్చింది.”

కార్మికవర్గం మరియు రైతుల పట్ల శంకరయ్య నిబద్ధత ఏమాత్రం తగ్గలేదు. కమ్యూనిస్టులు "ఎన్నికల రాజకీయాలకు సరైన సమాధానాలు కనుగొంటారు", భారీ ఎత్తున ప్రజా ఉద్యమాలను నిర్మిస్తారు, అని  ఆయన నమ్ముతారు. ఇంటర్వ్యూ మొదలుపెట్టిన ఒక గంటన్నర తరవాత కూడా, 99 ఏళ్ల ఆయన, మొదలులో చూపిన అదే తపనతోనూ శక్తితోనూ, ఇంటర్వ్యూ ముగిసే వరకు మాట్లాడారు.  భగత్ సింగ్ త్యాగం ద్వారా స్ఫూర్తి పొంది వీధిలోకి వచ్చిన 9 ఏళ్ల అతని నిబద్ధత చెక్కుచెదరకుండా అలా ఉండిపోయింది.

గమనిక: ఈ కథను రూపొందించడంలో కవిత మురళీధరన్ అందించిన అమూల్యమైన సూచనలకు నా ధన్యవాదాలు.

అనువాదం: అపర్ణ తోట

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota