ప్రియమైన భారత ప్రధాన న్యాయమూర్తిగారికి,

మీడియా పోకడ పై మీ నిశిత పరిశీలనకు ధన్యవాదాలు, “దురదృష్టవశాత్తూ పరిశోధనాత్మక పాత్రికేయం అనే కాన్సెప్ట్, మీడియా కాన్వాస్ నుండి కనుమరుగవుతోంది. మేము ఎదుగుతున్నప్పుడు, పెద్ద కుంభకోణాలను బయటపెట్టే వార్తాపత్రికల కోసం ఆసక్తిగా ఎదురుచూసేవారము. వార్తాపత్రికలు మమ్మల్ని ఎప్పుడూ నిరాశపరచలేదు.”

ఇటీవలి కాలంలో మీడియా గురించి, చాలా అరుదుగా నిజమైన మాటలు మాట్లాడుతున్నారు. క్లుప్తంగా, మీ పాత సోదరభావాన్ని గుర్తుచేసుకున్నందుకు ధన్యవాదాలు. మీరు 1979లో ఈనాడులో చేరిన కొద్ది నెలలకే నేను జర్నలిజంలోకి వెళ్లాను.

మీరు ఇటీవల ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మీ ప్రసంగంలో గుర్తుచేసుకున్నట్లుగా - ఆ విపరీతమైన రోజుల్లో, మేము నిద్రలేచి, "పెద్ద కుంభకోణాలను బహిర్గతం చేసే వార్తాపత్రికల కోసం ఆసక్తిగా ఎదురుచూసేవారము." ఈ రోజు మనం, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) వంటి క్రూరమైన చట్టాల ప్రకారం ఆ కుంభకోణాలను బయటపెట్టిన జర్నలిస్టులు,  వారి నివేదికల వలన జైలుకు పంపబడ్డారన్న వార్తలతో మేలుకుంటున్నాము సార్. లేదా భయంకరంగా దుర్వినియోగం అవుతున్న, మీరు ఇటీవల తీవ్రంగా విమర్శించిన, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) వంటి చట్టాల క్రింద వారి జీవితం ఇబ్బందులలో పడుతోంది.

"గతంలో కుంభకోణాలు, దుష్ప్రవర్తన పై వార్తాపత్రిక ప్రచురించిన నివేదికలు తీవ్రమైన పరిణామాలకు దారితీసే తరంగాలను సృష్టించడం మేము చూశాము" అని ఆ ప్రసంగంలో అన్నారు మీరు.  అయ్యో, ఈ రోజుల్లో జర్నలిస్టులు ఇలాంటి కథనాలు చేయడం పై తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఇది పరిశోధనాత్మక జర్నలిజానికే కాదు, స్ట్రెయిట్ రిపోర్టింగ్ చేసే వారికి కూడా, ఈ ప్రమాదం ఉంటోంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఆ భయంకరమైన దారుణంలో, సామూహిక లైంగిక హింసకు గురైన బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి హత్రాస్‌కు వెళుతుండగా అరెస్టు అయిన సిద్ధిక్ కప్పన్ , బెయిల్ పొందలేక ఒక సంవత్సరం పాటుగా  జైలులో మగ్గుతున్నాడు. అతని కేసు ఒక కోర్ట్ నుండి ఇంకో  కోర్టుకు బంతిలా  విసరబడుతూండగా, జైలులో అతని ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణీస్తోంది.

మన ముందు ఉన్న ఈ  ఉదాహరణతో, ఖచ్చితంగా, జర్నలిజం  చాలావరకు - అది పరిశోధనాత్మకమైనదైనా లేదా మరేదైనా  - అదృశ్యమైపోతోంది.

జస్టిస్ రమణ గారు, గతంలో జరిగిన కుంభకోణాలను బహిర్గతం చేసిన కథనాలతో పోలిస్తే, మీరు “ఇటీవలి సంవత్సరాలలో జరిగిన ఇంత పెద్ద కథనాన్ని గుర్తుకు తెచ్చుకోలేదు. తోటలో మీకు అంతా గులాబీలమయంలా కనిపిస్తుంది. ఇక మీ స్వంత నిర్ధారణలకు మీరే రావాలి. ”

చట్టం,  మీడియా- ఈ  రెండింటిపై మీకున్న లోతైన జ్ఞానంతో పాటుగా, భారతీయ సమాజాన్ని నిశితంగా పరిశీలించే వ్యక్తిగా - మీకు ఈ విషయం చెప్పాలని కోరుకుంటున్నాను. సార్, మీరు కొంచెం ముందుకు వెళ్లి పరిశోధనాత్మకంగానే కాకుండా భారతీయ జర్నలిజాన్ని ముంచెత్తిన చాలా  అంశాలను బయటపెట్టారు. మా స్వంత నిర్ధారణలకు రావాలని మీరు మమ్మల్ని ఆహ్వానించినట్లుగా, మీ పరిశీలన కోసం నేను మూడు కారణాలను అందించవచ్చా?

ముందుగా, మీడియా యాజమాన్య నిర్మాణాత్మక వాస్తవాలు అత్యధిక లాభాలను ఆకాంక్షించే కొన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో కేంద్రీకృతమై ఉన్నాయి.

రెండవది, స్వతంత్ర జర్నలిజంపై రాష్ట్రం చేసే ఘనమైన దాడి, అంతేగాక అటువంటి జర్నలిజం పై నిర్దాక్షిణ్యమైన అణచివేత.

మూడవదిగా, కుళ్లిపోతున్న నైతికత -  అధికారానికి స్టెనోగ్రాఫర్‌లుగా పనిచేయడానికి చాలామంది సీనియర్ ప్రొఫెషనల్స్ ఆత్రుతపడుతున్నారు.

నిజానికి, క్రాఫ్ట్ నేర్పించే వ్యక్తిగా, నేను నా విద్యార్థులను మా వృత్తిలో మిగిలి ఉన్న రెండు ఆలోచనా విధానాలలో దేనికి చెందాలనుకుంటున్నారో ఎంచుకోమని అడుగుతాను - జర్నలిజమా  లేక స్టెనోగ్రఫీనా?

దాదాపు 30 సంవత్సరాలుగా, భారతీయ మీడియా రాజకీయంగా స్వేచ్ఛగా ఉందని, అయితే లాభం కోసం ఖైదు చేయబడ్డదని నేను వాదించాను. నేడు, వారు లాభార్జనతో ఖైదు చేయబడి ఉండినా, వారిలో కొన్ని స్వతంత్ర స్వరాలు మాత్రం రాజకీయంగా ఖైదు చేయబడ్డాయి.

మీడియా స్వేచ్ఛ ఎంత భయంకరమైన స్థితిలో ఉందో మీడియాలోనే  చాలా తక్కువ చర్చలు జరుగుతున్నాయని గమనించడం చాలా ముఖ్యం. జర్నలిజంతో సంబంధం ఉన్న నలుగురు ప్రముఖ ప్రజా మేధావులు గత కొన్నేళ్లలో హత్యకు గురయ్యారు. వీరిలో ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ పూర్తి స్థాయి మీడియా మనిషి. (వాస్తవానికి రైజింగ్ కాశ్మీర్ ఎడిటర్ షుజాత్ బుఖారీ కూడా ముష్కరుల తూటాలకు బలయ్యారు). కానీ మిగిలిన ముగ్గురూ మీడియాలో తరచుగా రాసే రచయితలు, కాలమిస్టులు. నరేంద్ర దభోల్కర్ దాదాపు 25 సంవత్సరాల పాటు మూఢనమ్మకాలపై పోరాడుతూ, ఒక పత్రికను స్థాపించి సంపాదకత్వం వహించారు. గోవింద్ పన్సారే,  M.M. కల్బుర్గి కూడా అద్భుత రచనా పటిమ ఉన్న రచయితలు, కాలమిస్టులు.

ఈ నలుగురిలో ఒక లక్షణం కలిసి ఉంది: వారు హేతువాదులు, అలానే వీరు భారతీయ భాషలలో వ్రాసే జర్నలిస్టులు - ఇది వారి హంతకులకు ముప్పును పెంచింది. నలుగురి హత్యలు రాష్ట్రేతర పాత్రధారుల ద్వారా నిర్వహించబడ్డాయి, ఇది స్పష్టంగా రాష్ట్ర స్థాయి రాజకీయాలలో రాష్ట్రేతరులు అవసరాన్ని మించి లీనమవుతున్నారని తెలియజేస్తోంది. వీరి జాబితాలో ఇంకా అనేక ఇతర స్వతంత్ర జర్నలిస్టులు ఉన్నారు.

స్వతంత్ర భారతదేశ చరిత్రలో పత్రికా స్వేచ్ఛ అత్యల్ప స్థాయికి చేరుకుందనే వాస్తవాన్ని న్యాయవ్యవస్థ ఎదుర్కొంటే ప్రస్తుత జర్నలిజం ఈ దుర్భర స్థితి నుండి కొంత మెరుగుపడవచ్చు. ఆధునిక సాంకేతిక స్థితిని అణచివేయగల ఈ సామర్థ్యం - మీరు పెగాసస్ కేసుతో వ్యవహరిస్తూ నిస్సందేహంగా గమనించినట్లు - ప్రస్తుత పరిస్థితి ఎమెర్జెన్సీ  పీడకలలను కూడా చిన్నదిగా కనపడేలా చేస్తోంది.

ఫ్రాన్స్‌కు చెందిన రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ 2020లో విడుదల చేసిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారత్ 142వ ర్యాంక్‌కు దిగజారింది .

పత్రికా స్వేచ్ఛ పట్ల ఈ ప్రభుత్వ విధానం గురించి నా ప్రత్యక్ష అనుభవాన్ని పంచుకోనివ్వండి. అవమానకరమైన 142 ర్యాంక్‌ వచ్చిందన్న కోపంతో, కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ, ఇండెక్స్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు, ఇది భారతదేశంలో పత్రికా స్వేచ్ఛపై రికార్డును సృష్టించింది. ఇందులో  సభ్యునిగా ఉండమని నన్ను అడిగినప్పుడు, WPFI ర్యాంకింగ్‌ను తిరస్కరించడం కంటే భారతదేశంలోని పత్రికా స్వేచ్ఛ యొక్క వాస్తవ స్థితిపై ఎక్కువ దృష్టి పెడతామనే హామీతో నేను అంగీకరించాను.

13 మందితో కూడిన ఈ కమిటీలో, 11 మంది బ్యూరోక్రాట్లు, ప్రభుత్వ-నియంత్రిత-సంస్థ పరిశోధకులు ఉన్నారు. కానీ ఈ పత్రికా స్వేచ్ఛతో వ్యవహరించే కమిటీలో, కేవలం ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు! వారిలో ఒకరు, హాజరైన రెండు సమావేశాలలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సమావేశాలు సజావుగా సాగాయి, అయినప్పటికీ అక్కడ నేను మాత్రమే మాట్లాడుతున్నానని, ప్రశ్నలను లేవనెత్తుతున్నానని గమనించాను. ఆ తర్వాత వర్కింగ్ గ్రూపులచే ‘డ్రాఫ్ట్ రిపోర్ట్’ రూపొందించబడింది, ఇందులో ‘డ్రాఫ్ట్’ అనే పదం లేకపోవడం గమనార్హం. సమావేశాల్లో లేవనెత్తిన తీవ్రమైన అంశాలేవీ నివేదికలో ప్రతిబింబించలేదు. కాబట్టి నేను వాటిని ఆ డ్రాఫ్ట్ లో చేర్చడానికి స్వతంత్ర లేదా భిన్నాభిప్రాయాన్ని సమర్పించాను.

ఒక్కసారిగా ఆ నివేదిక, ఆ కమిటీ, అన్నీ మాయమయ్యాయి . దేశంలోని అత్యున్నత బ్యూరోక్రాట్ ఆదేశాలపై ఏర్పాటైన ఒక కమిటీ - బహుశా, భారతదేశంలోని ఇద్దరు అత్యంత శక్తివంతమైన వ్యక్తులకు మాత్రమే నివేదించే కమిటీ - అదృశ్యమైంది. పత్రికా స్వేచ్ఛపై RTI విచారణలు నివేదికను వెలికితీయడంలో విఫలమయ్యాయి! నా దగ్గర ఆ 'డ్రాఫ్ట్' కాపీ కూడా ఉంది. పరిశోధనాత్మక జర్నలిజం కాదు, భారతదేశంలో పని చేసే జర్నలిజాన్ని పరిశోధించడమే అసలైన కసరత్తు . అందుకున్న ఒక్క అసమ్మతితో అది కూడా అదృశ్యమైంది.

మీ ప్రసంగంలో ప్రస్తావించిన జర్నలిజంలో పరిశోధనాత్మక రిపోర్టింగ్‌ను చేయడానికి చాలా మందికి ఆసక్తి ఉంది. ముఖ్యంగా ప్రభుత్వంలో జరిగే స్కామ్‌లు, అవినీతిపై దర్యాప్తులు చెయ్యాలని చాలా ఉంది. ఈ రోజు దీన్ని ప్రయత్నిస్తున్న చాలా మంది జర్నలిస్టులు మొదటి అడుగు వద్దనే పెద్ద అడ్డంకిలో పడ్డారు -  ప్రయోజనాలకు సంబంధించిన ప్రభుత్వ ఒప్పందాలు,  ఉన్నత స్థానాల్లో ఉన్న శక్తివంతమైన వ్యక్తులతో, కార్పొరేట్ మీడియా బాస్‌లతో మమేకమై ఉంది.

పెయిడ్ న్యూస్‌ల ద్వారా విపరీతంగా డబ్బు సంపాదిస్తున్న దిగ్గజ మీడియా యాజమాన్యాలు, ప్రభుత్వ వనరుల దోపిడీకి లైసెన్స్‌లు పొందడం, ప్రభుత్వ ప్రైవేటీకరణ ఆర్మీ వేల కోట్ల ప్రజా ఆస్తులను వారికి అప్పగించడం జరుగుతుంటే, ఇవే యాజమాన్యాలు అధికార పార్టీల ఎన్నికల ప్రచారాలకు విపరీతంగా నిధులు సమకూరుస్తున్నాయి. అధికారంలో ఉన్న వారి భాగస్వాములను కలవరపెట్టడానికి ఈ యాజమాన్యాలు, వారి పాత్రికేయులను అనుమతించే అవకాశం లేదు. దీని వలన ఒకప్పుడు గర్వించదగిన భారతీయ వృత్తి ప్రస్తుతం కేవలం ఆదాయ మార్గంగా తగ్గి, తరచుగా ఫోర్త్ ఎస్టేట్ కు,  రియల్ ఎస్టేట్ కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మసకబారుస్తుంది. ఈ మీడియా యాజమాన్యాలకు పాత్రికేయంలో అధికారంలో నిజాల గురించి చేసే వ్యాఖ్యల పై తపన లేదు.

ఈ మహారోగ యుగంలో ఈ దేశ ప్రజలకు జర్నలిజం, ఇంకా జర్నలిస్టుల అవసరం మామూలు కన్నా ఎక్కువగా ఉందని నేను చెబితే మీరు నాతో ఏకీభవిస్తారని నేను భావిస్తున్నాను, సార్. వారి స్వంత పాఠకులు, వీక్షకులతో సహా ప్రజల తీరని అవసరాలకు శక్తివంతమైన మీడియా సంస్థల యజమానులు ఎలా ప్రతిస్పందించారు? 2,000-2,500 మంది జర్నలిస్టులను తొలగించడం ద్వారా, ఇంకా అనేకరెట్ల  నాన్ జర్నలిస్టు మీడియా ఉద్యోగులను తొలగించడం ద్వారా.

PHOTO • Courtesy: TMMK
PHOTO • Shraddha Agarwal

ఈ రోజు చాలా పెద్ద మీడియా వర్గాలు COVID-19 దుర్వినియోగానికి సంబంధించిన కథనాలను గుర్తుంచుకోవు. కోవిడ్-19 మహారోగం పై  పోరాటంలో అద్భుతంగా పనిచేసిందని, ప్రపంచాన్ని అన్నింటిలో ముందుకు నడిపించిందని, తెలిపే భారతదేశ ప్రభుత్వ అపోహలను వెల్లడి చేసింది

ప్రజాసేవ చేయాలనే ఆదర్శం కనుమరుగైంది. 2020 నాటి ఆర్థిక పతనం మీడియా ప్రభుత్వ ప్రకటనలపై ఆధారపడిన దానికంటే ఎక్కువ ఆధారపడేలా చేసింది. కాబట్టి నేడు, మనకు పెద్ద ఎత్తున మీడియా విభాగాలు ఉన్నాయి, COVID-19 దుర్వినియోగంపై వారి స్వంత (ఒప్పుకునే కొన్ని) కథనాలను మరచిపోయి, కోవిడ్-19 మహారోగం పై పోరాడడంలో భారతదేశం అద్భుతంగా పని చేసిందని, ప్రపంచాన్ని అన్నింటిలో నడిపించిందని ప్రభుత్వ అపోహలను గట్టిగా వెల్లడి  చేస్తోంది.

ఈ కాలంలో పారదర్శకత లేని  'PM కేర్స్ ఫండ్' ఏర్పడింది. ఇది దాని శీర్షికలో 'ప్రధాని(PM)' అనే పదాలను కలిగి ఉంది, దాని వెబ్‌సైట్‌లో అతని చిత్రాన్ని ప్రదర్శిస్తుంది, కానీ అది ' పబ్లిక్ అథారిటీ' కాదని లేదా RTIకి లోబడి లేదని వాదించింది, నిజానికి అది,"భారత ప్రభుత్వ నిధి కాదు." రాష్ట్రం యొక్క ఒక విభాగం ద్వారా ఏదైనా సంస్థాగత ఆడిట్‌కు సమర్పించాల్సిన అవసరం లేదు.

ఈ దేశ స్వతంత్ర చరిత్రలో అత్యంత తిరోగమన కార్మిక చట్టాలను మొదట రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్‌లుగా, తర్వాత కేంద్రం ‘కోడ్‌లు’గా మార్చిన కాలం కూడా ఇదే సార్. కొన్ని ఆర్డినెన్స్‌లు భారతీయ కార్మికులను, కార్మిక హక్కుల గొప్ప ప్రమాణమైన - ఎనిమిది గంటల పనిని రద్దు చేయడం ద్వారా ఒక శతాబ్దం వెనక్కు తోసేశాయి . సహజంగానే, అనేక మంది కార్మికులను నియమించే కార్పొరేట్ల యాజమాన్యంలోని మీడియాలో వీటిలో దేనినైనా పరిశోధించడానికి చాలా తక్కువ అవకాశం ఉంది. మీడియా యజమానులచే తొలగించబడిన కొందరు ఉత్సాహం కలిగిన ప్రస్తుత నిరుద్యోగులు, దీనిని ఖచ్చితంగా పరిశోధించగలిగి ఉండేవారు.

మహాశయా, ప్రభుత్వ అవినీతిపైనా, జర్నలిస్టుల మూకుమ్మడి తొలగింపు, కార్మిక హక్కులను హరించివేయడం, లేదా ప్రధానమంత్రి పదవిని దుర్వినియోగం చేస్తూ పారదర్శకమైన ఆడిట్ లేని నిధులు నియంత్రించడం - ఈ అల్లకల్లోలాలని అరికట్టడానికి న్యాయవ్యవస్థ ముందుకు రావడం నేను చూడలేదు, ఇది కూడా నన్ను ఇబ్బంది పెడుతోంది. జర్నలిజాన్ని అటువంటి రాజీ-  చెల్లింపుదారుల-స్నేహపూర్వక ఆదాయ స్థాయికి తగ్గించిన మీడియా అంతర్గత, ఇంకా అందులోని నిర్మాణపరమైన లోపాలను నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. కానీ ఖచ్చితంగా, పైన ప్రస్తావించిన  కొన్ని విషయాలలో న్యాయవ్యవస్థ జోక్యం, జర్నలిస్టులు కాస్త నిశ్చింతగా ఊపిరి పీల్చుకోవడానికి సహాయపడుతుందేమో?

స్వతంత్ర మీడియా కార్యాలయాలపై దాడులు, వాటి యజమానులను, జర్నలిస్టులను 'మనీలాండరర్స్' అని బెదిరించడం, దూషించడం, వారి సంస్థలపై కనికరంలేని వేధింపులు- ఇవన్నీ తీవ్ర వేగంతో సాగుతున్నాయి. ఖచ్చితంగా, ఈ కేసుల్లో చాలావరకు కోర్టులో కూలిపోతాయి - ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసే ఏజెన్సీలకు చాలా తెలుసు. కానీ వారొక ప్రత్యేక సూత్రంపై పని చేస్తున్నారు: ఈ న్యాయ ప్రక్రియే వారికి విధించే శిక్ష. దీనికి సంవత్సరాలు పడుతుంది, న్యాయవాదుల ఫీజుకు అనేక లక్షల రూపాయలు చెల్లించాలి, దీని వలన కొన్ని స్వతంత్ర స్వరాలు పూర్తిగా దివాలా తీస్తాయని రూడి అవుతుంది. బిగ్ మీడియాలో ఆ అరుదైన స్వతంత్ర స్వరం - దైనిక్ భాస్కర్ - పై కూడా అండర్ గ్రౌండ్ డెన్ పై జరిపే దాడి వంటిది చేయబడింది. దీని గురించి అతి  భయస్థులైన బిగ్ మీడియాలో ఏ చర్చ జరగలేదు.

ఇలా కావాలని జరిగే చట్టాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి మన న్యాయవ్యవస్థ ఏదైనా చేయగలదేమో, సార్?

PHOTO • Shraddha Agarwal
PHOTO • Parth M.N.

ఏదైనా 'ప్రధాన స్రవంతి' మీడియా తమ పాఠకులకు లేదా వీక్షకులకు, రైతుల ప్రతి రెండవ నినాదంలోనూ పెట్టిన ఆ రెండు పేర్లు - ఆ ఇద్దరు పెద్దమనుషుల ఉమ్మడి విలువ పంజాబ్ లేదా హర్యానా స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి కంటే చాలా ఎక్కువ అని చెబుతుందా?

అయ్యో, ఇప్పుడు రద్దు చేయబడిన వ్యవసాయ చట్టాల విషయంలో కూడా న్యాయవ్యవస్థ తన  తరఫుదారిని చెప్పలేదు. నేను ఎప్పుడూ చట్టాన్ని అధ్యయనం చేయలేదు కానీ అటువంటి వివాదాస్పద చట్టం యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సమీక్షించడం అత్యంత సీనియర్ రాజ్యాంగ న్యాయస్థానం యొక్క ఒక ముఖ్యమైన విధి అని మాత్రం అర్థం చేసుకున్నాను.  బదులుగా న్యాయస్థానం ఒక కమిటీని ఏర్పాటు చేసింది, వ్యవసాయ చట్ట సంక్షోభానికి పరిష్కారాలతో కూడిన నివేదికను రూపొందించమని వారిని ఆదేశించింది - ఇక ఆ తరవాత ఆ  నివేదిక, కమిటీ- ఈ రెండూ ఏమయ్యాయో తెలియదు.

దీనితో, ఇది డెత్ - బై- కమిటీ అన్న వాక్యం డెత్ అఫ్ కమిటీ గా మారింది.

మళ్ళీ, వ్యవసాయ చట్టాలపై 'మెయిన్ స్ట్రీమ్' మీడియాలో ఎవరికి వారు, వారి లాభోద్దేశాలతో ఉన్నారు. చట్టాల నుండి అత్యధిక లాభాలను పొందే వ్యక్తిగత కార్పొరేట్ నాయకుడు దేశంలోనే అతిపెద్ద మీడియా యజమాని కూడా. అతని స్వంతం కాని మీడియాలో, అతను అతిపెద్ద ప్రకటనదారుడు. కాబట్టి ‘ప్రధాన స్రవంతి’ మీడియా తమ సంపాదకీయాల్లో ఈ చట్టాలను సమర్ధిస్తూ రాయడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు.

వారిలో ఎవరైనా తమ పాఠకులకు లేదా వీక్షకులకు ఇద్దరు కార్పొరేట్ దిగ్గజాలు అని ప్రతి రెండవ నినాదంలో పేరు పెట్టారు - ఆ ఇద్దరు పెద్దమనుషుల ఉమ్మడి విలువ పంజాబ్ లేదా హర్యానా యొక్క స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి కంటే చాలా ఎక్కువ అని చెప్పగలరా? ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం, పంజాబ్ జిఎస్‌డిపికి ప్రత్యర్థిగా వారిలో ఒకరు కేవలం తమ వ్యక్తిగత సంపదను కూడబెట్టారని చెప్పగలరా? ఇటువంటి సమాచారం వారి పాఠకులకు, ప్రేక్షకులకు ఒక అభిప్రాయానికి రావడానికి మంచి అవకాశాన్ని ఇస్తుంది కదా?

ఇప్పుడు చాలా కొద్ది మంది జర్నలిస్టులు - ఇంకా తక్కువ మీడియా సంస్థలు మాత్రమే - మీరు మీ ప్రసంగంలో పాత జ్ఞాపకాల నెమరువేసుకుని వ్యక్తం చేసిన పరిశోధనాత్మక జర్నలిజాన్ని చేయగల సామర్థ్యం కలిగి ఉన్నారు. వారిలో ఇంకా తక్కువ మంది మాత్రమే, వందల మిలియన్ల మంది సాధారణ భారతీయుల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై నివేదిస్తూ, మానవ స్థితిపై పరిశోధిస్తున్నపనిలో నిమగ్నమై ఉన్నారు. 41 సంవత్సరాలుగా ఆ రెండవ విభాగంలో  ఎక్కువగా సాధన చేసిన వారిలో ఒకడిగా నేను వ్రాస్తున్నాను.

కానీ మానవ పరిస్థితిని పరిశోధించే మరికొందరు ఉన్నారు - వారు జర్నలిస్టులు కాకపోయినా, దానిని మెరుగుపరచడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా భారత ప్రభుత్వం యుద్ధం ప్రకటించిన లాభాపేక్షలేని, పౌర సమాజ సంస్థలు. వీరికి FCRAలు రద్దు చేయబడ్డాయి , కార్యాలయాలపై దాడులు జరిగాయి, వీరి ఖాతాలు స్తంభింపజేయబడ్డాయి, వీరిపై మనీలాండరింగ్ ఆరోపణలు కూడా చేయబడ్డాయి. ఈ సంస్థలు నాశనం చేయబడి, దివాలా తీసే వరకు - లేదా త్వరలో దివాలా పడబోతున్న స్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా వాతావరణ మార్పు, బాల కార్మికులు, వ్యవసాయం, ఇంకా  మానవ హక్కులతో వ్యవహరించే సమూహాలపై ఈ చర్యలు సాగుతున్నాయి.

కాబట్టి మనం ఆ స్థితిలో ఉన్నాము సార్, మీడియా వారు అధ్వాన్న స్థితిలో ఉన్నారు - కానీ వారిని రక్షించాల్సిన సంస్థలు విఫలమవుతున్నాయి. మీ ప్రసంగంలోని అంతర్దృష్టితో కూడిన క్లుప్తమైన వ్యాఖ్యలే నన్ను మీకు ఈ లేఖ రాసేలా చేశాయి. మీడియా మరింత మెరుగవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి న్యాయవ్యవస్థ సహాయపడగలదని నేను సూచించవచ్చా - కానీ న్యాయ వ్యవస్థ కూడా మెరుగుపడాలి కదా? మన సంస్థలు, ఇంకా మనమంతా , సిద్ధిక్ కప్పన్ జైలులో గడిపిన ప్రతి అదనపు రోజు ను, మన పనితనం పైన వెల్లడయ్యే కఠినమైన  తీర్పుగా భావించాలని నేను నమ్ముతున్నాను

మీ భవదీయుడు,
పి. సాయినాథ్

ఇలస్ట్రేషన్ చేసినది పరిప్లాబ్ చక్రవర్తి: సౌజన్యం, ది వైర్.

కథనం మొదట ది వైర్‌లో ప్రచురించబడింది

అనువాదం: అపర్ణ తోట

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota