గత వారం గణపతి బాల్ యాదవ్, తన సైకిల్ తొక్కుకుంటూ సూర్యాస్తమయంలోకి జారిపోయారు. స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవకారుల భూగర్భ కొరియర్,  తన సెంచరీని పూర్తి చేసుకుని 101 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తూ, తన పురాతన సైకిల్‌పై రోజుకు 5-20 కిలోమీటర్లు ప్రయాణం చేసిన వ్యక్తి , కొద్దికాలం అనారోగ్యానికి లోనై , ఆకాశపు దారిలోకి మరలిపోయారు.

2018 లో మేము కలిసిన రోజుకు ఆయన వయసు 97. మమ్మల్ని వెతుకుతూ సైకిల్ పై 30 కిలోమీటర్ల దూరం వచ్చారు. ఇక్కడ ‘మేము’ అంటే ఆలస్యంగా వచ్చిన మా PARI బృందం. కానీ ఆకట్టుకునే అతని కథను వినడానికి మేమందరం ముందున్నాం. మే నెల మధ్యలో, ఆయన గంటలు తరబడి రోడ్డు మీదే ఉన్నారు. ఆయన సైకిల్ ఒక మ్యూజియం లో ఉంచదగినంత పాతదిగా ఉన్నా ఆయనకు ఇబ్బంది ఏమి లేనట్లుంది. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు, కానీ అతని కథ మిగిలి ఉంది: అదే గణపతి యాదవ్ జీవిత చక్రం .

1920 లో జన్మించిన గణపతి బాల్ యాదవ్ తూఫాన్ సేన (వర్ల్‌విండ్ ఆర్మీ)లో స్వాతంత్య్ర సమర యోధుడిగా పనిచేశారు. తూఫాన్ సేన (వర్ల్‌విండ్ ఆర్మీ) అంటే - 1943 లో బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్య్రం ప్రకటించిన ప్రతీ సర్కార్ యొక్క సాయుధ విభాగం. లేదా తాత్కాలిక, సతారా యొక్క అండర్ గ్రౌండ్ ప్రభుత్వం అని కూడా అనొచ్చు.  ఈ దశలో బాల్ యాదవ్ బ్రిటిష్ రాజుకు జరిపిన వ్యతిరేక చర్యలలో పాల్గొన్నారు. జి. డి. బాపు లాడ్ మరియు ‘కెప్టెన్ భావు నేతృత్వంలో జూన్ 1943 న సతారా జిల్లాలోని షెనోలి వద్ద గొప్ప రైలు దోపిడీ జరిపిన విప్లవాత్మక బృందంలో ‘గణపా దాదా’ కూడా ఉన్నారు.

మాకు చెప్పిన ప్రకారం,“నేను మా నాయకులకు (అడవిలో దాక్కున్న) ఆహారాన్ని అందచేసాను. వాళ్ళను రాత్రుళ్లు  కలవడానికి వెళ్తాను. నాయకుడి పాటు 10-20 మంది ఉంటారు.” ఒకవేళ ఆయన బ్రిటిష్ వాళ్ళకి దొరికిపోయి ఉంటే ఆయనని,  ఆ 20 మందిని  ఉరితీసేవారు. కానీ యాదవ్ కొన్ని సంవత్సరాలు తన సైకిల్ పై ఎవరికీ తెలీకుండా అండర్గ్రౌండ్ లో “మీల్స్ ఆన్ వీల్స్” గా ఆహారాన్ని అందించారు. ఆయన ఈ విప్లవ సమూహాల మధ్య అతి ముఖ్యమైన  సందేశాలను కూడా చేరవేసేవారు.

The day we met him in 2018 – he was then 97 – he had cycled close to 30 kilometres in search of the PARI team
PHOTO • P. Sainath
The day we met him in 2018 – he was then 97 – he had cycled close to 30 kilometres in search of the PARI team
PHOTO • P. Sainath

2018 లో మేము అతనిని కలిసిన రోజుకు - ఆయన వయసు 97 - అతను PARI బృందాన్ని వెతుకుతూ 30 కిలోమీటర్ల సైక్లింగ్ చేసి వచ్చారు.

అతని సైకిల్ ని  నేను ఎప్పటికీ మరచిపోలేను. ఆ పాత యంత్రాన్ని నేను  చూస్తూండిపోయాను.  గుడ్లని అమ్మేవారు, పావ్ అమ్మేవారు, ధోబిలు, ఇతరులు ఇప్పటికీ గ్రామాల్లో, నగరాల్లో ఇళ్ల వద్దకే సేవలను అందించేందుకు వాడే రకం సైకిల్ అది. సంభాషణలో ఆయన ఒక్కసారి మాత్రం కనుబొమలు ముడేసారు. ఈ సైకిల్ వయసు పావు శతాబ్దం “మాత్రమే” అని ఆయన అన్నారు. అంతకు ముందున్న సైకిల్ ను ఎవరో దొంగిలించారు. అది అతనికి ఎంతో ఇష్టమైనది. దానిని ఆయన దాదాపు 55 సంవత్సరాలు ఉపయోగించారు . ఆ దొంగిలించినవాడు ఎవరైనా పురాతన వస్తువుల వ్యాపారి అయి ఉంటాడేమో అని నాకు అనుమానం వచ్చింది.

మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలోని షిర్గావ్ గ్రామంలో ఉన్న తన తాత ఇంట్లో మా స్నేహితుడు, జర్నలిస్ట్ సంపత్ మోర్ మాకు గణపతి యాదవ్ ను  పరిచయం చేశాడు. ఆ తరవాత మేము 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సొంత గ్రామమైన రామపూర్‌కు వెళ్లి, చాలా గంటలు మాట్లాడాము. 97 ఏళ్ళ వయసులో సైకిల్ నడపడం చేయడం మాకు అంత పెద్ద విషయంగా ఎందుకు కనిపిస్తుందో ఆయనకి అర్థంకాలేదు. కాని మా అభ్యర్థన మన్నించి మరో అరగంటసేపు  సైకిల్ నడిపారు. PARI ఫెలో సంకేత్  జైన్, మా వీడియో ఎడిటర్ సించితా మాజీ రికార్డు చేయడానికి కష్టపడ్డారు. సించితా స్కూటర్ వెనుక సీటు మీద రివర్స్ లో కూర్చుని,  సంకేత్ ఆ మురికి రోడ్ మీద వెల్లకిలా పడుకుని, గణప దాదాని రికార్డు చేశారు. స్కూటర్  ముందు వెళ్తూ ఉంటే వెనుక ఆయన సైకిల్ పై రోజూ వస్తున్నట్టే వస్తుంటే, సంచిత ఆయనని రికార్డు చేసింది.

ఆ ఇంటర్వ్యూలో PARI బృందం నుండి భారత్ పాటిల్, నమితా వైకర్ మంచి వ్యాఖ్యాతలుగా పనిచేశారు. అప్పటి ప్రతి క్షణం నాకు మరపురానిది.

తరవాత రెండేళ్ళలో సంపత్ ఎప్పుడు ఆ పెద్దాయనని కలిసినా నేను, PARI  టీమ్ “నన్ను గొప్పవాడిలా ప్రచారం చేశారు ” అనేవారని సంపత్  చెప్పేవాడు. “నేను ఎవ్వరూ కాదు, స్వాతంత్య్ర పోరాటంలో కొరియర్ ని మాత్రమే. కానీ వారు నా పాత్రను ముఖ్యమైనదిగా చూశారు, చాలా గౌరవంగా చూశారు.” అని ఆయన అన్నారు. ఆయన గురించి రాయడం వలన తన సొంత గ్రామంలో, చుట్టుపక్కల  ప్రాంతాల్లో ఆయనకు చాలా గుర్తింపు వచ్చింది. దీనికి ఆయన బాగా కదిలిపోయారు.

When it was time to part, Dada (Ganpati Bal Yadav) knew only from the body language that this man is now going. Dada was overcome with emotion
PHOTO • P. Sainath
When it was time to part, Dada (Ganpati Bal Yadav) knew only from the body language that this man is now going. Dada was overcome with emotion
PHOTO • Sanket Jain

విడిపోయే సమయం వచ్చినప్పుడు, ఈ మనిషి ఇప్పుడు వెళ్తున్న బాడీ లాంగ్వేజ్ మాత్రమే దాదా (గణపతి బాల్ యాదవ్) అర్ధం చేసుకున్నాడు. దాదా భావోద్వేగంతో బయటపడింది.

ఆ వినయం భారతదేశపు చివరి జీవన స్వాతంత్య్ర సమరయోధులలో నేను కనుగొన్న ఒక గుణం. వారికి - వారు, వారి సమయం మరియు వారి ప్రపంచం చాలా ప్రత్యేకమైనవని బాగా తెలుసు. అయినా, వారు చాలా సరళంగా వారు ఏం  చెయ్యాలో అదే చేశారని అది వారి విధి అని  చెప్తారు. అంతేగాక ప్రతిఫలం ఆశించకుండా పని చేసిన వీరిది వ్యక్తిత్వపు స్థాయి మన ఊహకు అందనిది.  గణపా  దాదా వంటి ఎందరో 1972 లో భారత రాష్ట్రం వారికి ఇచ్చిన పెన్షన్లను ఎప్పుడూ తీసుకోలేదు.

భారతదేశం యొక్క చివరి జీవన స్వాతంత్య్ర సమరయోధుల కోసం ఏర్పరచిన ఈ పేజీ ని పాఠకులు తరచూ సందర్శించాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. మరో ఐదేళ్ళలో, వీరిలో ఎవరూ సజీవంగా మిగిలి ఉండరు. బ్రిటీష్ సామ్రాజ్యవాదం నుండి భారతదేశాన్ని విడిపించి, ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన వారిని చూడటానికి, మాట్లాడటానికి లేదా వినడానికి రాబోయే తరానికి ఎప్పటికీ అవకాశం ఉండదు.

ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు. భారతదేశం వేగంగా కనుమరుగవుతున్న బంగారు తరం నుంచి మరో నిష్క్రమణ. PARI నుంచి వచ్చిన మేము ఆయన తన కథను మాకు చెప్పడానికి ఒప్పుకున్నందుకు నిజంగా గర్వపడ్డాము. - ఆయన మరణిస్తున్నందుకు సంతాపం తెలిపినా ఆయన జీవితాన్ని వేడుకగానే చూస్తాము.  వందేళ్ల వయసు దాటినా చురుకుగా వ్యవసాయాన్ని కొనసాగించిన రైతు ఆయన. నేను ఇక బయలుదేరుతున్నప్పుడు, ఆ పెద్దాయన తన స్వహస్తాలతో, అతని ఒంటి గది ఇంటిలో నాకు ఏదో ఇవ్వాలనుకున్నట్లు చెప్పాడు- అది ఒక కప్పు తాజా పాలు! ఆ సమయంలో, మేమిద్దరమూ నిజంగా ఉద్వేగానికి లోనయ్యాము.

సంపత్ మోర్ కంటే ఆ క్షణాన్ని ఎవ్వరూ బాగా చిత్రీకరించలేదు: “సాయినాథ్ సర్ ఇంగ్లీషులో మాట్లాడుతుండగా, గణప దాదా మరాఠీలో మాట్లాడాడు. కానీ విడిపోయే సమయం వచ్చినప్పుడు, ఇంగ్లీష్ అర్థం చేసుకోలేని దాదాకు, ఈ మనిషి ఇప్పుడు వెళ్తున్న బాడీ లాంగ్వేజ్ మాత్రమే అర్ధమైంది. దాదా భావోద్వేగం బయటపడింది. అతను లేచి నిలబడి సార్ చేతిని తన చేతుల్లో గట్టిగా పట్టుకున్నాడు. దాదా కళ్ళు మెరిసిపోయాయి. సర్ కూడా చాలా సేపు దాదా చేతిని పట్టుకున్నారు. ఇద్దరూ ఏ భాషా  అవసరం లేకుండా మాట్లాడటం మేము చూడగలిగాము.”

అనువాదం: అపర్ణ తోట

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota