మీరు 6-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలైతే, మీ చుట్టుపక్కల పాఠశాలల్లో "ఉచిత మరియు నిర్బంధ విద్య" పొందే హక్కు మీకు ఉంది. దీనిని నిర్ణయించే చట్టమైన – పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం (RTE) ను భారత ప్రభుత్వంవారు 2009లో రూపొందించారు.

కానీ ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాకు చెందిన తొమ్మిదేళ్ల చంద్రికా బెహెరా దాదాపు రెండేళ్లుగా పాఠశాలకు దూరంగా ఉంటోంది. దానికి కారణం అన్నిటికంటే సమీప పాఠశాల ఇప్పటికీ చాలా దూరంలో, అంటే ఆమె ఇంటికి దాదాపు 3.5 కిలోమీటర్ల దూరంలో ఉండటమే.

గ్రామీణ భారతదేశంలో బోధన, అభ్యాస పద్ధతులు స్థిరంగా లేవు. చట్టాలు, విధానాలు తరచుగా కాగితాలపై కనిపిస్తాయి కానీ అమలుకు మాత్రం నోచుకోవు .  కానీ కొన్ని సందర్భాల్లో తమ వినూత్న ఆలోచనలు, దృఢ వ్యక్తిత్వం కలిగిన కొద్ది మంది ఉపాధ్యాయులు వ్యవస్థలోని సవాళ్లను అధిగమించి నిజమైన మార్పును  తీసుకొస్తున్నారు.

ఉదాహరణకు, కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని సంచార ఉపాధ్యాయుడిని తీసుకోండి. లిద్దర్ లోయలోని గుజ్జర్ స్థావరంలో సంచార సముదాయానికి చెందిన చిన్న పిల్లలకు బోధించడానికి నాలుగు నెలల పాటు ఆయన ఆ స్థావరంలోనే బస చేశారు. తమ పరిమిత వనరులను వీలైనంత మేర ఉపయోగించుకోవడానికి ఉపాధ్యాయులు వినూత్న పద్ధతులను కూడా ప్రయత్నిస్తున్నారు. కోయంబత్తూరులోని విద్యా వనం పాఠశాల లోని ఉపాధ్యాయులు తమ విద్యార్థులను జన్యుమార్పిడి పంటలపై చర్చించేలా చేశారు. వారిలో చాలామంది ఆంగ్లం మాట్లాడే మొదటి తరం వారు. కానీ వారంతా సేంద్రీయ బియ్యం విలువను, మరెన్నో విషయాలను తెలియజేస్తూ ఆంగ్లంలో చర్చిస్తున్నారు.

PARI గ్రంథాలయాన్ని సందర్శించడం ద్వారా మీరు తరగతి గదుల్లోకి అడుగుపెట్టి, అభ్యాస ఫలితాల దృక్కోణాన్ని, భారతదేశంలోని విద్యా స్థితి యొక్క మెరుగైన చిత్రాన్ని చూడవచ్చు. మేము గ్రామీణ విద్య అందుబాటు, నాణ్యత, అంతరాలపై నివేదికలను పొందుపరుస్తాము. లైబ్రరీలోని ప్రతి ముద్రిత పత్రంతో పాటు ఒక చిన్న సారాంశం ఉంటుంది. అందులో ప్రధాన అంశాలు ప్రముఖంగా కనిపిస్తాయి.

PHOTO • Design courtesy: Siddhita Sonavane

తాజా వార్షిక విద్యా స్థితి (గ్రామీణ ) నివేదిక ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్,  ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల ప్రాథమిక పఠనా సామర్థ్యం 2012 కంటే ముందు ఉన్న స్థాయికి పడిపోయింది. మహారాష్ట్రలోని నందుర్‌బార్ జిల్లాలోని తోరణ్‌మల్ ప్రాంతంలో 8 ఏళ్ల షర్మిల తన పాఠశాల మార్చి 2020లో మూతపడిన తర్వాత తనకు తాను కుట్టు మిషన్‌ను ఉపయోగించడం నేర్చుకుంది. మరాఠీ అక్షరాలను గురించి ప్రస్తావిస్తూ, “ నాకు అవన్నీ గుర్తు లేవు ” అని చెప్పింది.

కోవిడ్ -19 వ్యాధి రాష్ట్రాల వ్యాప్తంగా విద్యా సంక్షోభం పెరగడానికి దారితీసింది.  విద్య ఆన్‌లైన్ కావటంతో  విద్యా సముపార్జన కోసం కష్టపడుతున్న వారి ఇబ్బందులు వర్ణనాతీతం. పట్టణ ప్రాంతాల్లో 24 శాతం మంది పిల్లలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది శాతం మంది పిల్లలు మాత్రమే ‘తగినంత ఆన్‌లైన్ విద్య అందుబాటు (యాక్సెస్)ను' కలిగి ఉన్నారని ఆగస్టు 2021లో నిర్వహించిన ఈ సర్వే చెబుతోంది.

PHOTO • Design courtesy: Siddhita Sonavane

1-8 తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజన పథకం కింద దాదాపు 11.80 కోట్ల మంది పిల్లలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 50 శాతం మంది విద్యార్థులు తమ పాఠశాలల్లో ఉచిత మధ్యాహ్న భోజనాన్ని పొందుతున్నారని  - వారిలో 99.1 శాతం మంది ప్రభుత్వ  పాఠశాలల్లో చదివేవారేనని  నివేదికలు చెబుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని మాటియా గ్రామం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయురాలు పూనమ్ జాదవ్ మాట్లాడుతూ, “కొద్దిమంది తల్లిదండ్రులు మాత్రమే  తమ పిల్లలకు ఇటువంటి భోజనాన్ని ఇవ్వగలరు," అని చెప్పారు. పాఠశాలల్లో ఇలాంటి సంక్షేమ పథకాలను నిరంతరం బలోపేతం చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.

“నేను తగినంత చదువుకున్నానని మా నాన్న అంటారు. నేను ఇంకా చదువుకుంటూ పోతే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారని ఆయన ప్రశ్న,” అని బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల శివాని కుమార్ చెప్పారు. విద్యా విధానంలో లింగ భేదం ఒక పెద్ద సూచిక - వనరుల కేటాయింపు శ్రేణిలో బాలికలు తరచుగా తక్కువ స్థాయిలో ఉంటారు. భారతదేశంలో విద్యపై గృహ సామాజిక వినియోగం ముఖ్య సూచికలు: ఎన్ఎస్ఎస్ 75వ రౌండ్ (జూలై 2017-జూన్ 2018) దీనిని నిర్ధారిస్తుంది. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని 3-35 సంవత్సరాల వయస్సు గల బాలికలలో 19 శాతం మంది పాఠశాలల్లో ఎన్నడూ నమోదు కాలేదని ఈ నివేదిక పేర్కొంది.

PHOTO • Design courtesy: Siddhita Sonavane

2020లో భారతదేశంలో ఉన్నత విద్యలో చేరిన 4.13 కోట్ల మంది విద్యార్థులలో 5.8 శాతం మంది మాత్రమే షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు. ఇది దేశంలోని సామాజిక సమూహాల మధ్య విద్య అందుబాటులో అసమానతలను  తెలుపుతుంది. "గ్రామీణ ప్రాంతాలలో ప్రైవేట్ పాఠశాలల సంఖ్య పెరుగుదల దేశంలోని అట్టడుగు వర్గాలకు కొత్త అవకాశాలను కల్పించకపోగా ఆ  ప్రాంతాలలో  సామాజిక, ఆర్థిక, జనాభా స్థితిగతులలో ఎలాంటి మార్పు తీసుకు రాలేదని  తెలుస్తోంది" అని ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక పేర్కొంది.

ప్రయివేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ చాలామంది తమ విద్య కోసం ప్రభుత్వ మద్దతుపైనే ఆధారపడుతున్నారు. దీనికి కారణాలు స్పష్టంగా కనపడుతున్నాయి - ప్రాథమిక స్థాయిలో విద్య యొక్క సగటు వార్షిక వ్యయం ప్రభుత్వ పాఠశాలల్లో అయితే రూ. 1,253  కాగా ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలో అది రూ. 14,485 గా ఉంది.  “ప్రైవేట్ స్కూల్ టీచర్లు మేము చేసేదంతా వండడమూ, శుభ్రం చేయడమూ మాత్రమే అని అనుకుంటారు. వారి ప్రకారం బోధనలో నాకు ‘అనుభవం’ లేదు’’ అని బెంగళూరులోని ఓ అంగన్‌వాడీ లో టీచర్‌గా పనిచేస్తున్న 40 ఏళ్ల రాజేశ్వరి చెప్పారు.

PHOTO • Design courtesy: Siddhita Sonavane

తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రాజేశ్వరి వంటి పాఠశాల ఉపాధ్యాయుల పని దుర్భరంగానూ, కష్టంగానూ ఉంటుంది. ఉదాహరణకు, ఉస్మానాబాద్‌లోని సంజా గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలను తీసుకోండి. మార్చి 2017 నుండి మహారాష్ట్రలోని ఈ పాఠశాలకు విద్యుత్ సరఫరా లేదు. "ప్రభుత్వం నుండి వచ్చే నిధులు సరిపోవు .. పాఠశాల నిర్వహణ ఇంకా విద్యార్థులకు స్టేషనరీ కొనుగోలు కోసం మాకు సంవత్సరానికి 10,000 రూపాయలు మాత్రమే లభిస్తాయి," అని పాఠశాల ప్రిన్సిపాల్ శీలా కులకర్ణి చెప్పారు.

ఇది అంత అరుదైనదేమి కాదు - 2019 నాటికి దేశంలోని దాదాపు 23 మిలియన్ల మంది పిల్లల కు వారి పాఠశాలల్లో తాగునీటి సేవలు అందుబాటులో లేవు; అంతేకాక 62 మిలియన్ల మంది పిల్లల కు పాఠశాలలో పారిశుద్ధ్య సౌకర్యాలు లేవు.

PHOTO • Design courtesy: Siddhita Sonavane

భారతదేశంలో పెరుగుతున్న కళాశాలల సంఖ్య చూసినట్లయితే గ్రామీణ విద్యలో లోపం కేవలం సౌకర్యాల లేమి ఒకటే  కారణం కాదని  తెలుస్తోంది: ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకారం కళాశాలల సంఖ్య 2019-20లో 42,343 నుండి 2020-21లో 43,796కి పెరిగింది. ఇదే కాలంలో దేశంలో బాలికల కోసమే ప్రత్యేకంగా 4,375 కళాశాలలు ఉన్నాయని సర్వే తెలుపుతుంది.

దేశంలోని గ్రామాలూ, చిన్న పట్టణాలలో బాలికలు ఉన్నత విద్యా అవకాశాల కోసం తిరుగుబాటు చేశారు. మహారాష్ట్రలోని బుల్‌డాణా జిల్లాలోని ఒక కుగ్రామానికి చెందిన జమున సోళంకే తన నాథ్‌జోగి సంచార సముదాయంలోనే 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన మొదటి బాలిక. “త్వరగా ఉద్యోగం వస్తుందని బస్ కండక్టర్ లేదా అంగన్‌వాడీ వర్కర్‌ అవ్వమని అందరూ చెబుతున్నారు. కానీ నేను ఏమి కావాలనుకుంటున్నానో అదే అవుతాను ,” అని జమున దృఢంగా చెప్పింది.

ముఖచిత్రం: స్వదేశ శర్మ

అనువాదం: నీరజ పార్థసారథి

PARI Library

The PARI Library team of Dipanjali Singh, Swadesha Sharma and Siddhita Sonavane curate documents relevant to PARI's mandate of creating a people's resource archive of everyday lives.

Other stories by PARI Library
Translator : Neeraja Parthasarathy

Neeraja Parthasarathy is a teacher, translator and eclectic reader in both English and Telugu.

Other stories by Neeraja Parthasarathy