నా ఎస్ఎస్‌సి (సెకండరీ స్కూల్ సర్టిఫికేట్) ఫలితాలు రాబోయే రోజున నా పరిస్థితి అప్పుడే కొట్టిన క్రికెట్ బంతిలా ఉంది. ఆ బంతినే అందరూ ఎలా చూస్తుంటారో మీకు తెలుసా? అది నాలుగా (పరుగులు), ఆరా? అందరూ చూస్తుంటారు. నేను పరీక్ష తప్పిపోతే ఏమవుతుంది? మా నాన్న నాకు వెంటనే పెళ్ళి చేసేస్తాడు.

పరీక్షా ఫలితాలను ప్రకటించాక, నాకు 79.06 శాతం మార్కులు వచ్చినందుకు హాయిగా ఊపిరిపీల్చుకున్నాను. ఒక్క పాయింట్‌తో మా పాఠశాలలో అత్యధిక మార్కులు వచ్చినవారిలో మూడో స్థానాన్ని పోగొట్టుకున్నాను. నేను సాధించినదాన్ని చూసి నేను చాలా ఉద్వేగానికి గురయ్యాను: మా నాథ్‌జోగీ సంచార సముదాయంలో, ఇంతవరకూ ఏ బాలికా 10వ తరగతిలో ఉత్తీర్ణురాలు కాలేదు.

నేను నావ్ ఖుర్ద్ (జళ్‌గావ్ జామోద్ తాలూకా , బుల్‌డాణా జిల్లా) అనే చిన్న గ్రామంలో నివాసముంటాను. మా గ్రామంలో కేవలం నా సముదాయానికి చెందినవారే ఉంటారు. ఇక్కడివాళ్ళలో ఎక్కువమంది బిచ్చం అడుక్కునేందుకు పుణే, ముంబై, నాగపూర్ వంటి పట్టణాలకు వెళ్తుంటారు. నా తల్లిదండ్రుల వంటి కొందరు మాత్రం మా చుట్టుపక్కల గ్రామాలలో రోజువారీ కూలీలుగా పనిచేస్తుంటారు.

నా తల్లిదండ్రులు - భావూలాల్ సాహెబ్‌రావ్ సోళంకే (45), ద్రౌపద సోళంకే (36) - గోధుమ, జొవర్ (జొన్న), మొక్కజొన్న, సోయా చిక్కుడు, ప్రత్తి పండించే ఇతరుల పొలాల్లో పనిచేస్తారు. రోజులో ఎనిమిది గంటలపాటు పనిచేస్తే వారికి ఒక్కొక్కరికి రూ. 200 వస్తాయి. పనికోసం వెతికేవాళ్ళు ఎక్కువమంది ఉండటం, వారికి తగినంత పని లేకపోవటం వల్ల నా తల్లిదండ్రులు చాల అరుదుగా మాత్రమే ఎక్కువ గంటలపాటు పనిచేస్తుంటారు, ఆ పని కూడా నెలలో 10-12 రోజులు మాత్రమే దొరుకుతుంది.

మా నాన్న 5వ తరగతి వరకూ చదివిన తర్వాత పనికి వెళ్ళటం కోసం బడి మానేశాడు. నా ఇద్దరు అక్కలలో రుక్మా (24) ఎన్నడూ బడికి వెళ్ళలేదు, నీనా (22) 5వ తరగతి వరకూ చదివింది. మా అక్కలిద్దరికీ ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళు బడి మానేసినప్పటి నుంచీ రోజు కూలీలుగా పనిచేస్తున్నారు. మా అన్న దేవ్‌లాల్ (20) కూడా కూలిపనికే వెళ్తాడు. అతను 9వ తరగతిలో బడి మానేశాడు. నాకు పదేళ్ళు రాగానే మా నాన్న, "ఇక నువ్వు పనికి పోవచ్చు; ఇంకెంతమాత్రం చదవాల్సిన అవసరంలేదు," అని చెప్పాడు. అలా చెప్పింది ఆయనొక్కడే కాదు. నేను బడికి ప్రతిరోజూ ఒక ముసలావిడను దాటుకుంటూ వెళ్తుంటాను. ఆమె కూడా నన్ను తిడుతుంది: "మీ అక్కలు బడికి వెళ్ళలేదు, నీకా అవసరం ఏమిటి? చదువుకుంటే నీకు ఉద్యోగం వస్తుందనుకుంటున్నావా?"

Jamuna with her family at their home in Nav Kh, a Nathjogi village: 'I was thrilled with my achievement: in our community, no girl has ever passed Class 10'
PHOTO • Anjali Shinde
Jamuna with her family at their home in Nav Kh, a Nathjogi village: 'I was thrilled with my achievement: in our community, no girl has ever passed Class 10'
PHOTO • Anjali Shinde

నాథ్‌జోగీ గ్రామమైన నావ్ ఖర్ద్‌లోని ఇంటిలో తన కుటుంబంతో జమున: ‘నేను సాధించినదాని పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను; మా సముదాయంలో ఏ అమ్మాయీ పదవ తరగతిలో ఉత్తీర్ణురాలు కాలేదు’

మా చిన్నాన్న ఒకరు కూడా నాకు పెళ్ళి చేసెయ్యమని ఎప్పుడూ మా తల్లిదండ్రులతో చెప్తుండేవాడు, ఆయనకు మా నాన్న జతకలిసేవాడు. "నా పెళ్ళి గురించి నాతో గానీ ఇంకెవరితో గానీ మాట్లాడొద్దని బాబా (నాన్న)తో చెప్పు. నేను చదువుకోవాలనుకుంటున్నాను," అని మా అమ్మతో చెప్పేదాన్ని. ఆమె మా నాన్నతో మాట్లాడాలని ప్రయత్నించినప్పుడల్లా వాళ్ళిద్దరికీ పోట్లాట జరిగేది.

ఆ తర్వాత, నేను పదో తరగతి పాసైన తర్వాత, నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఒక జర్నలిస్ట్ వచ్చినప్పుడు మా నాన్న కన్నీరు పెట్టుకున్నాడు. "నా కూతురు నా మాట విననకుండా తన చదువును కొనసాగించినందుకు నాకు సంతోషంగా ఉంది," అని ఆయన ఆ జర్నలిస్టుతో చెప్పాడు.

నాకు ఏడేళ్ళప్పుడు బడికి వెళ్ళడం మొదలుపెట్టాను. పొరుగున ఉన్న పళశీ సుపో పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు బడికి వెళుతున్న బాలికల పేర్లను నమోదు చేసుకోవడానికి మా ఊరికి వచ్చారు. ఎవరో నా పేరు ఇవ్వడంతో, నేనక్కడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో చేరాను.

ఒక ఏడాది తర్వాత, మా ఊర్లో ఒక ప్రాథమిక పాఠశాల ప్రారంభం కావటంతో నేను అక్కడికి మారిపోయాను. 5వ తరగతిలో అక్కడికి 14 కిలోమీటర్ల దూరంలోని జళ్‌గావ్ జామోద్ తహసీల్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న మహాత్మా ఫూలే నగర్ పరిషద్ విద్యాలయలో చేరాను. మా ఊరి నుంచి రెండు కిలోమీటర్లు నడిచి, అక్కడినుంచి టౌన్ బస్టాండ్‌కు ఒక షేర్ ఆటోలో వెళ్ళి, అక్కడి నుంచి మళ్ళీ ఒక కిలోమీటరు నడుస్తాను. ఆటోలో ప్రయాణం ఒక అరగంట పడుతుంది, ఒకవేపు ప్రయాణానికి రూ. 30 ఖర్చవుతుంది. మా ఊరినుంచి మరో ఆరుగురు అమ్మాయిలు కూడా అక్కడే చదువుతున్నారు. మేమంతా రోజూ కలిసి ప్రయాణం చేస్తాం.

ఒకరోజు వర్షాకాలంలో, మా ఊరికి దగ్గరలో ఉన్న ఒక వాగులో నీటి మట్టం పెరిగిపోయింది. మేం మెయిన్ రోడ్డుకు వెళ్ళాలంటే ఆ వాగును దాటాలి. మామూలుగా ఆ వాగును దాటేటప్పుడు మా పైజామాలను పైకి మడచి, చెప్పులు చేతపట్టుకొని నడిచేవాళ్ళం. మోకాళ్ళ కిందిభాగం మాత్రమే తడిసేది.

అయితే, ఆ రోజు మాత్రం వాగులోని నీళ్ళు మా నడుము భాగం వరకూ వచ్చాయి. మా ఊరికి చెందిన ఒక వ్యక్తి ఒడ్డున నిల్చొని ఉండటం చూసి, " కాకా , ఈ నదిని దాటడానికి కొంచం సాయంచెయ్యి," అని అడిగాను. "అందరూ ఇళ్ళకు వెళ్ళండి, మీరంతా! మీరెందుకు బడికి వెళ్ళాలనుకుంటున్నారు? అక్కడంతా వరదలు వస్తుంటే, మీరు చదువుకోవాలనుకుంటున్నారా? ఆడపిల్లలు ఇంట్లో కూర్చోవాలి, మీకు చదువుకోవాల్సిన అవసరం ఏంటీ?" అంటూ ఆయన కేకలు వేశాడు. ఆ రోజు మాకు బడి పోయింది. మరుసటి రోజు తరగతిలో, మేమంతా అబద్ధం చెప్తున్నామని నమ్మిన మా టీచర్, శిక్షగా మమ్మల్ని తరగతి గది బయట నిల్చోబెట్టారు.

Left: Jamuna has to travel long distances to go to school, the situation worsens during the monsoon season. Right: Archana Solanke, Jamuna Solanke, Anjali Shinde and Mamta Solanke are the first batch from the Nathjogi community to pass Class 10
PHOTO • Anjali Shinde
Left: Jamuna has to travel long distances to go to school, the situation worsens during the monsoon season. Right: Archana Solanke, Jamuna Solanke, Anjali Shinde and Mamta Solanke are the first batch from the Nathjogi community to pass Class 10
PHOTO • Rajesh Salunke

ఎడమ: బడికి వెళ్ళాలంటే జమున చాలా దూరాలు ప్రయాణించాలి. వర్షాకాలంలో పరిస్థితులు మరీ దారుణంగా మారతాయి. కుడి: నాథ్‌జోగీ సముదాయంలో తొలిసారిగా 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన అర్చనా సోళంకే, జమునా సోళంకే, అంజలి శిందే, మమతా సోళంకే

మరోసారి అలాగే జరిగినప్పుడు, అతన్ని పిలిచి మాట్లాడమని మా అమ్మతో చెప్పాను. అప్పుడతను మా మాటలు నమ్మాడు. ఆ తర్వాత మా టీచర్ మా ఊరికి వచ్చినప్పుడు మేం చెప్పిన పరిస్థితిని స్వయంగా చూశారు.

ఉదయం 9 గంటలకు ఒక బస్‌ను పంపించమని అభ్యర్థిస్తూ జళగావ్ జామోద్ బస్ స్టాండ్‌లో ఉన్న రాష్ట్ర రవాణా కార్యాలయంలో ఒక అర్జీని సమర్పించాలని నిర్ణయించుకున్నాను. బస్‌ను ఉపయోగించే 16 మంది అమ్మాయిలు ఆ అర్జీపై సంతకాలు చేశారు. వారిలో అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే ఇస్లామ్‌పుర్ గ్రామానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. మానవ్ వికాస్ బస్ కేవలం అమ్మాయిలకు మాత్రమే ఉద్దేశించినది, అందులో ప్రయాణం ఉచితం.

అంగీకరించిన అధికారి మరుసటి రోజు నుంచి ఉదయం 9 గంటలకే బస్ అక్కడికి వస్తుందని మాకు మాటిచ్చారు. నిజంగానే వచ్చింది కూడా! నేను చాలా సంతోషించాను. కానీ అలా ఒక్క రోజు మాత్రమే జరిగింది. రెండోరోజు బస్ రాకపోవడంతో, నేను ఆ అధికారి దగ్గరకు మళ్ళీ వెళ్ళాను. "ఆ బస్ ఇంకో ఊరి నుండి వస్తుంది. బస్ సమయాన్ని మార్చడానికి ఆ ఊరివాళ్ళు ఒప్పుకోవటం లేదు. మీకు సరిపోయే సమయానికి నేను బస్‌ను పంపలేను," అని ఆ అధికారి చెప్పారు. మమ్మల్ని బడి సమయాలను మార్చుకోవల్సిందిగా ఆయన సలహా ఇచ్చారు, కానీ అదెలా సాధ్యం?

బస్‌లో ప్రయాణం చేసేటప్పుడు ఇంకా ఇతర సమస్యలు కూడా ఉంటాయి. ఒకసారి నేనూ నా స్నేహితులూ రాష్ట్ర రవాణా బస్ ఎక్కాం. ఇంతలో ఒక అబ్బాయి నా స్నేహితురాలి దుపట్టాను లాగుతూ, "ఏయ్, మోహిదేపూర్ అమ్మాయిలూ, బయటకు పొండి," అని అరిచాడు. మిగతా అబ్బాయిలు కూడా అతనితో కలిశారు, పెద్ద పోట్లాట అయింది. మోహిదేపూర్‌లో మా నాథ్‌జోగీ సముదాయంవారు నివసిస్తుంటారు. మా నాథ్‌జోగీ అమ్మాయిలు బస్‌లో ఎక్కడం ఆ అబ్బాయిలకు ఇష్టంలేదు. నాకు చాలా కోపం వచ్చింది. బస్ జళ్‌గావ్ జామోద్ చేరుకోగానే, నేనతన్ని రాష్ట్ర రవాణా కార్యాలయానికి తీసుకువెళ్ళాను. ఇంతలో కండక్టర్ కల్పించుకొని, ఈ బస్ అందరికోసం అని ఆ అబ్బాయిలతో చెప్పాడు. కానీ అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి, అందుకని మేం బస్‌కంటే ఆటోలు ఎక్కడానికే మొగ్గు చూపిస్తాం.

నాకు పదిహేనేళ్ళ వయసున్నపుడు మా ఇల్లు ఉన్న స్థలాన్ని తన పేరు మీదకు మార్చుకునేందుకు మా నాన్న ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఆ స్థలం మా తాతయ్య పేరు మీద ఉంది, ఆయన ఆ స్థలాన్ని మా నాన్నకు బహుమతిగా ఇచ్చాడు. కానీ మా ఊళ్ళో ఆ పని చేసే అతను రూ. 5000 లంచంగా అడుగుతున్నాడు. మా నాన్న దగ్గర అంత డబ్బు లేదు. మేం ఆ వ్యక్తిని అనేకసార్లు బతిమిలాడినా అతను ఆ పని చేయలేదు. ఫలితంగా, మా ఇంటిని పక్కా ఇంటిగా మార్చుకునేందుకు అవసరమైన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం నుండి మేం పొందలేకపోయాం.

Left: Jamuna would cook and join her parents to work in the fields. Right: They cannot avail state funds to build a pucca house
PHOTO • Anjali Shinde
Left: Jamuna would cook and join her parents to work in the fields. Right: They cannot avail state funds to build a pucca house
PHOTO • Anjali Shinde

ఎడమ: జమున వంట చేస్తుంది, తన తల్లిదండ్రులతో కలిసి పొలం పనులు కూడా చేస్తుంది. కుడి: ఒక పక్కా ఇంటిని నిర్మించుకోవడానికి వాళ్ళు ప్రభుత్వం నుండి డబ్బులు సంపాదించుకోలేకపోయారు

మా ఇంటిని మా పేరు మీదకు మార్చుకోవడానికి మేమెందుకు డబ్బులివ్వాలి? అలాంటి సమస్యలు ఎవరికీ ఉండకూడదు. నాకు బాగా చదివి, ఒకరోజున పెద్ద అధికారిని కావాలని ఉంది. మాలాంటి పేదవాళ్ళు తమ పనులు చేయించుకోవడానికి లంచాలు ఇవాల్సిన పరిస్థితి ఉండకూడదు. వారికున్న హక్కులేమిటో, అధికారంలో ఉన్న వ్యక్తులను చూసి భయపడకూడదని కూడా నేను వాళ్ళకు వివరిస్తాను.

ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి వరకు పుస్తకాలను ఉచితంగానే ఇస్తారు, యూనిఫామ్ కూడా ఉండదు. కానీ 9వ తరగతి నుంచి పుస్తకాలు, యూనిఫామ్ కొనుక్కోవాల్సివుంటుంది. పుస్తకాలకు రూ. 1000, యూనిఫామ్‌కు రూ. 550 అవుతుంది. ఒక టర్మ్‌కు ప్రైవేట్ ట్యూషన్ కోసం మరో రూ. 3000 కావాలి. రెండు టర్ములకు డబ్బులు కట్టలేనందున, నేను ఒక్క టర్మ్‌కు మాత్రమే ట్యూషన్ తీసుకున్నాను. మా పాఠశాల ఉపాధ్యాయులను సహాయం కోసం అడిగాను. ఈ ఖర్చులన్నీ గడవటం కోసం, 9వ తరగతిలోకి వెళ్ళబోయే ముందు వచ్చే వేసవి కాలంలో నేను నా తల్లిదండ్రులతో కలిసి పొలం పనులు చేశాను. తెల్లవారుఝామున 4 గంటలకే లేచి ఒక గంట సేపు చదువుకునేదాన్ని. మా అమ్మా నాన్నా, అన్నయ్య ఆ సమయానికే పనిలోకి వెళ్ళేవాళ్ళు. ఒక గంట చదివిన తర్వాత, నేను భాకరీలు (రొట్టెలు), భాజీ (కూర) తయారుచేసి పొలంలో పనిచేస్తుండే వాళ్ళకోసం తీసుకువెళ్తాను.

నేను ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకూ వాళ్ళతో పనిచేస్తాను. అందుకు గంటకు రూ. 25 చెల్లిస్తారు. తొమ్మిదిన్నరకు ఇంటికి తిరిగివచ్చి బడికి వెళ్ళేందుకు సిద్ధమవుతాను. బడి నుంచి తిరిగి వచ్చాక కూడా మళ్ళీ పని చేయడానికి వెళ్తాను. సెలవురోజుల్లో కూడా పనిచేస్తాను; అలా సంపాదించిన డబ్బులు ఒక యూనిఫామ్ కొనుక్కోవడానికి వస్తాయి.

Jamuna with Bhaulal Babar, her supportive primary school teacher
PHOTO • Anjali Shinde

ప్రాథమిక పాఠశాలలో తనకు మద్దతుగా ఉన్న ఉపాధ్యాయుడు భావూలాల్ బాబర్‌తో జమున

పోయిన సంవత్సరం (2019) జల్ శక్తి అభియాన్ (జల వనరుల మంత్రిత్వశాఖ) బ్లాక్ స్థాయిలో నిర్వహించిన వ్యాస రచన పోటీలో నేను ఒక ట్రోఫీని గెల్చుకున్నాను. బుల్‌డాణాలో జిల్లా స్థాయిలో నిర్వహించిన విజ్ఞానశాస్త్ర ప్రదర్శనలో సేంద్రియ ఎరువుపై నేను చేసిన ప్రాజెక్టుకు నాకు రెండవ బహుమతి లభించింది. మా పాఠశాలలో జరిగిన పరుగు పందెంలో రెండవ స్థానంలో నిలిచాను. నాకు గెలవటమంటే ఇష్టం. మా నాథ్‌జోగీ సముదాయానికి చెందిన అమ్మాయిలకు గెలిచే అవకాశం ఎప్పుడూ రాదు.

ఆగస్టులో 11, 12వ తరగతుల కోసం జళ్‌గావ్ జామోద్ పట్టణంలోని ది న్యూ ఎరా ఉన్నత పాఠశాలలో నాకు ప్రవేశం దొరికింది. అది ఒక ప్రైవేట్ పాఠశాల. అందులో ఏడాదికి రూ. 5000 రుసుముగా చెల్లించాలి. నేను సైన్స్ విభాగాన్ని - లెక్కలు, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం - ఎంచుకున్నాను. సివిల్ సర్వీసెస్ ప్రవేశ పరీక్షలకు ఉపయోగపడుతుందని నాకు చెప్పడంతో, చరిత్రను కూడా నా చదువులో చేర్చుకున్నాను. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్)కు ఎంపిక కావాలనేది నా కల.

డిగ్రీ చదవడం కోసం నేను విశ్వవిద్యాలయాలు ఉండే పుణేకు గానీ, బుల్‌డాణాకు గానీ వెళ్ళాల్సివుంటుంది. నాకు ఉద్యోగం త్వరగా వస్తుంది కాబట్టి బస్ కండక్టర్‌గా గానీ, అంగన్‌వాడీ వర్కర్‌గా కానీ అవమని జనం నాతో అంటుంటారు. కానీ నేను ఏమి కావాలనుకున్నానో అదే అవుతాను.

నా సముదాయం బిచ్చమెత్తుకోవటం మీద ఆధారపడటాన్నీ, ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయాలనే వారి పట్టుదలనూ మార్చాలని కోరుకుంటున్నాను. తమను తాము పోషించుకోవడానికి అడుక్కోవడం ఒక్కటే మార్గం కాదు, చదువు కూడా మనకు తిండిపెడుతుంది.

లాక్‌డౌన్ వలన గ్రామాలకు తిరిగివచ్చిన మా ఊరివాళ్ళంతా కూలి పనుల కోసం వెతుక్కుంటున్నారు. మా కుటుంబం కూడా పనేమీ దొరక్కపోవడంతో ఇంట్లోనే ఉంటోంది. నా పాఠశాల ప్రవేశం కోసం మా నాన్న ఒక గ్రామ పెద్ద వద్ద డబ్బు అప్పు తీసుకున్నాడు. ఆ అప్పును తీర్చడం చాలా భారం కాబోతోంది. మేం ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధమే కానీ, భిక్ష కోసం అడుక్కోం.

పుణేకి చెందిన స్వతంత్ర మరాఠీ జర్నలిస్ట్, ప్రశాంత్ ఖుంటే ఈ కథన రచనలో సహాయం చేశారు.

ముఖ చిత్రం: అంజలి శిందే

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Jamuna Solanke

Jamuna Solanke is a Class 11 student in The New Era High School, Jalgaon Jamod tehsil, Maharashtra. She lives in Nav Kh village of the state's Buldana district.

Other stories by Jamuna Solanke
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli