టక్-టక్-టక్

కొడవటిపూడిలో టార్పాలిన్ కప్పిన ఒక గుడిసెలోంచి ఈ లయబద్ధమైన శబ్దాలు వస్తున్నాయి. మూలంపాక భద్రరాజు, కుండలను చక్కటి గుండ్రని ఆకారంలోకి తీర్చిదిద్దే ఒక చిన్న తెడ్డు లాంటి చెక్క సుత్తి తో కుండను మెల్లగా తడుతున్నారు.

“మందపాటి చెక్క సుత్తి ని కుండ అడుగు భాగాన్ని మూసివేయడానికి వాడుతాం. అడుగు భాగాన్ని మరింత నునుపుగా చేయడానికి ఈ సాధారణ చెక్క సుత్తి ని వాడుతాం, మొత్తం కుండను నునుపుగా మార్చడానికి మరింత సన్నటి చెక్క సుత్తి ని వాడుతాం,” అవసరాన్ని బట్టి సుత్తిని మార్చుకుంటూ, 70 ఏళ్ళ భద్రరాజు వివరించారు.

సన్నగా, సాధారణ పరిమాణంలో ఉండే చెక్క సుత్తి తాటి చెట్టు ( బోరాసస్ ఫ్లెబెల్లిఫెర్ ) కొమ్మల నుండి, మందపాటి సుత్తి అర్జున చెట్టు (తెల్లమద్ది చెట్టు - టెర్మినాలియా అర్జున ) నుండి తయారవుతాయని ఆయన చెప్పారు. చాలా సన్నగా ఉన్న చెక్క సుత్తి ని తీసుకుని ఆయన మళ్ళీ పని మొదలుపెట్టగానే అప్పటివరకూ ఎక్కువ స్థాయిలో ఉన్న మోత తక్కువ స్థాయికి చేరింది.

20 అంగుళాల వ్యాసం కలిగిన పెద్ద కుండను తయారుచేయడానికి ఆయనకు 15 నిమిషాలు పడుతుంది. ఇలా చేసేటప్పుడు కుండ ఒక వైపు పగిలినా లేదా చీలిపోయినా, వెంటనే అక్కడ కాస్త మట్టిని మెత్తి కుండను సరిచేసేందుకు మెల్లగా తట్టే ప్రక్రియను మళ్ళీ మొదలుపెడతారు.

Mulampaka Bhadraraju uses a chekka sutti (left) to smoothen the pot.
PHOTO • Ashaz Mohammed
The bowl of ash (right) helps ensure his hand doesn't stick to the wet pot
PHOTO • Ashaz Mohammed

మూలంపాక భద్రరాజు కుండను నునుపుగా చేయడానికి చెక్క సుత్తిని (ఎడమ) ఉపయోగిస్తారు. గిన్నెలోని బూడిద (కుడి) తడి కుండకు ఆయన చెయ్యి అంటుకోకుండా  సహాయపడుతుంది

తనకు 15 ఏళ్ళ వయసప్పటి నుండి భద్రరాజు ఈ కుమ్మరి వృత్తిలో వున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇతర వెనుకబడిన కులాల (ఒబిసి) జాబితాలో నమోదు చేసివున్న కుమ్మరి సముదాయానికి చెందిన ఈయన, అనకాపల్లి జిల్లాలోని కొడవటిపూడి అనే గ్రామంలో ఈ వృత్తి చేసుకుంటూ నివసిస్తున్నారు.

15 సంవత్సరాల క్రితం రూ. 1,50,000కు కొన్న తన అర ఎకరా భూమిలో ఉన్న చెరువు నుండి ఈ 70 ఏళ్ళ కుమ్మరి, మట్టిని సేకరిస్తారు. పొరుగు గ్రామమైన కోటవురట్ల నుండి ఇసుక, మట్టి, కంకర సరఫరా చేసే ఒక వ్యక్తికి రూ. 1,000 చెల్లించి ఏడాది పొడవునా తనకు అవసరమైన 400 కిలోల ఎర్ర మట్టి ని ఆయన తన పనిప్రదేశానికి తోలించుకుంటారు.

ఆ భూమిలో ఆయన కొబ్బరి ఆకులను, టార్పాలిన్‌లను పైకప్పుగా వేసి రెండు గుడిసెలు కట్టారు. అలా కప్పించిన స్థలం వర్షాకాలంలో ఆయన పనికి అంతరాయం కలిగించకుండా సంవత్సరం పొడవునా పనిచేసుకునేలా ఉపయోగపడుతోంది. ఆ రెండింటిలో ఒక గుడిసెను ఆయన కుండలను తయారుచేసి, వాటిని చక్కటి ఆకారంలో రూపొందించడానికి ఉపయోగిస్తారు; చిన్న గుడిసెలో వాటిని కాలుస్తారు. "మా దగ్గర 200-300 కుండలు తయారవగానే వాటిని [పేర్చిన ఎండు కర్రల మీద] కాలుస్తాం," అని ఆయన చెప్పారు. వీటిని సమీపంలోని బహిరంగ ప్రదేశం నుండి సేకరిస్తారు. "అవి [కుండలు] గుడిసెలోనే ఆరిపోతాయి," అని ఆయన జోడించారు.

ఈ భూమిని ఆయన తాను పొదుపు చేసిన డబ్బుతోనే కొన్నారు. “వారు [స్థానిక బ్యాంకులు] నాకు రుణం ఇవ్వలేదు. నేను ఇంతకుముందు చాలాసార్లు వాళ్ళను అడిగాను కానీ నాకు ఎవరూ రుణం ఇవ్వలేదు." తన పని ద్వారా వచ్చే ఉత్పత్తి అనిశ్చితంగా ఉండటం వలన - ఆయన చేసే ప్రతి 10 కుండలకు, 1-2 కుండలు తయారుచేసే సమయంలోనే పగిలిపోతాయి - వడ్డీ వ్యాపారులతో లావాదేవీలు పెట్టుకోవటం ఆయనకు ఇష్టంలేదు. "తయారుచేసిన అన్ని కుండలూ సరిగ్గా ఆరవు, ఆరబెట్టేటప్పుడు కొన్ని కుండలు పగిలిపోతాయి," గుడిసె మూలలో పగిలిపోయి పడి ఉన్న డజను కుండలను చూపుతూ చెప్పారాయన..

The master potter can finish shaping about 20-30 pots a day
PHOTO • Ashaz Mohammed
The master potter can finish shaping about 20-30 pots a day
PHOTO • Ashaz Mohammed

ఆరితేరిన ఈ కుమ్మరి ఒక్క రోజులో 20-30 కుండలవరకూ పూర్తిచేయగలరు

రోజుకు దాదాపు 10 గంటలు పని చేసే ఆయనకు, ప్రారంభం నుండి ముగింపు వరకు కుండల తయారీ ప్రక్రియకు సాధారణంగా ఒక నెల రోజులు పడుతుంది. "నా భార్య కూడా సహాయం చేస్తే మేం ఒక్క రోజులో 20-30 కుండలను కూడా పూర్తి చేయగలం," అని ఆయన చెప్పారు. మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా ఒక అంశాన్ని నొక్కిచెప్పడానికి ఆపటం తప్ప, కుండను సుత్తితో తట్టడాన్ని ఆయన కొనసాగిస్తూనే వున్నారు. నెలాఖరు వచ్చేసరికల్లా ఈ తయారైన కుండల సంఖ్య సుమారు 200-300 దాకా ఉంటుంది.

ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు, ఇంకా ఆయన భార్య - ఈ ఆరుగురు ఉన్న కుటుంబానికి ఇదే ఏకైక ఆదాయ వనరు. "ఇది మాత్రమే," తమ ఇంటి ఖర్చులనూ, తమ పిల్లల పెళ్ళిళ్ళ ఖర్చులనూ భరించిందని ఆయన నొక్కిచెప్తారు.

భద్రరాజు తన కుండలను విశాఖపట్నం, రాజమండ్రిల నుండి వచ్చే టోకు వ్యాపారులకు అమ్ముతారు. ఈ వ్యాపారులు ప్రతి వారం వచ్చి గ్రామంలోని సుమారు 30 మంది కుమ్మరుల నుండి కుండలను తీసుకువెళుతుంటారు. మార్కెట్లో వివిధ రకాల అవసరాల కోసం ఈ కుండలను అమ్ముతారు: “వంటకు, దూడలు నీరు తాగడానికి, ఇంకా వారి అవసరాలకు తగినట్టుగా వీటిని ఉపయోగించుకుంటారు,” అని ఆ కుమ్మరి చెప్పారు.

"విశాఖపట్నం నుండి వచ్చే టోకు వ్యాపారులు ఒక కుండను 100 రూపాయలకు కొంటారు, అదే రాజమండ్రిలో అయితే టోకు వ్యాపారులు ఒక కుండను 120 రూపాయలకు కొనుగోలు చేస్తారు," అని భద్రరాజు చెప్పారు. "అంతా సరిగ్గా జరిగితే, నేను [ఒక నెలలో] 30,000 రూపాయలు సంపాదించగలను," అన్నారాయన.

పదేళ్ళ క్రితం భద్రరాజు గోవాలోని ఒక హస్త కళలు, చేతి వృత్తుల దుకాణంలో కుమ్మరిగా పనిచేసేవారు. "ఇతర రాష్ట్రాలవారు కూడా చాలమంది అక్కడ ఉండేవారు, అందరూ వివిధ చేతివృత్తులలో నిమగ్నమై ఉండేవారు," అని ఆయన చెప్పారు. ఆయనకు అక్కడ ఒక్కో కుండకు రూ. 200-250 వరకు వచ్చేవి. "కానీ అక్కడి ఆహారం నాకు సరిపడలేదు, అందుకే ఆరు నెలలకే అక్కడి నుండి వచ్చేశాను," అన్నారాయన.

Manepalli switched to a electric wheel five years ago
PHOTO • Ashaz Mohammed

ఐదేళ్ళ క్రితం మానేపల్లి కామేశ్వరరావు విద్యుత్‌తో పనిచేసే కుమ్మరి సారెకు మారారు

'గత 6-7 ఏళ్ళుగా నాకు కడుపులో అల్సర్ ఉంది,' అన్నారు మానేపల్లి. చేతితో తిప్పే సారెను నడిపిస్తున్నప్పుడు ఆయనకు నొప్పి వచ్చేది, అదే యంత్రంతో నడిచే సారె వలన నొప్పి ఉండటంలేదు. కుమ్మరి వర్గానికే చెందిన 46 ఏళ్ళ కామేశ్వరరావు తన యుక్తవయసు నుంచే ఈ పని చేస్తున్నారు

అక్కడికి కొన్ని మీటర్ల దూరంలోనే మరో కుమ్మరి కామేశ్వరరావు మానేపల్లి నివాసం ఉంది. ఇక్కడ చెక్క సుత్తి దబ్బుదబ్బుమని చేసే చప్పుడును యంత్రంతో పనిచేసే సారె నెమ్మదిగా, గిరగిరా తిరుగుతూ చేసే శబ్దం భర్తీ చేస్తోంది. ఇది సారెపైనే కుండను గుండ్రటి ఆకృతిలోకి తీసుకువస్తుంది.

గ్రామంలోని కుమ్మరులందరూ యంత్రాలతో నడిచే సారెలకు మారారు. భద్రరాజు మాత్రమే ఇప్పటికీ చేతితో తిప్పే సారెను నడుపుతున్నారు; యంత్రంతో పనిచేసే సారెకు మారడానికి ఆయన అంతగా ఆసక్తి చూపటంలేదు. "నేను నాకు 15 సంవత్సరాల వయసప్పటి నుండి ఈ పని చేస్తున్నాను," తాను ఎక్కువ పని గంటలకూ, శ్రమకూ అలవాటు పడ్డానంటూ చెప్పారాయన. అదీగాక, యంత్రాలతో నడిచే సారెలు భద్రరాజు తయారుచేసే సంప్రదాయ 10-లీటర్ల కుండలను కాకుండా చాలా చిన్న కుండలను తయారుచేయడానికే రూపొందించినవి.

చాలామంది పాత కుమ్మరుల మాదిరిగానే మానేపల్లి కూడా అనారోగ్యం వలనా, శస్త్రచికిత్స జరగటం కారణంగా ఐదేళ్ళ క్రితం యంత్రంతో నడిచే సారెకు మారారు, “గత 6-7 సంవత్సరాలుగా నా కడుపులో అల్సర్ ఉంది,” అని ఆయన చెప్పారు. చేతితో తిప్పే సారెను నడిపినప్పుడు ఆయనకు నొప్పి వచ్చేది. ఇప్పుడు ఆటోమేటిక్ యంత్రంతో నడిచే సారెను వాడుతున్నప్పటి నుంచి ఆ నొప్పి రావటంలేదు.

“నేను యంత్రంతో పనిచేసే కుమ్మరి సారెను 12,000 రూపాయలకు కొన్నాను. అది పాడైపోయిన తర్వాత ఖాదీ గ్రామీణ సొసైటీ నుండి మరొకదాన్ని ఉచితంగా పొందాను. నేనిప్పుడు దానితోనే కుండలు తయారుచేస్తున్నాను."

Left: Manepalli’s batch of pots being baked.
PHOTO • Ashaz Mohammed
Right: He holds up a clay bottle he recently finished baking
PHOTO • Ashaz Mohammed

ఎడమ: ఆవంలో కాలుతోన్న మానేపల్లికి చెందిన కుండలు. కుడి: ఇటీవలే తాను తయారుచేసి కాల్చిన మట్టి సీసాని చూపిస్తోన్న ఆయన

“ఒక సాదా [చిన్న] కుండ ధర 5 [రూపాయిలు]. దానిపైన ఏదైనా డిజైన్ వేస్తే, ఆ కుండ ధర 20 రూపాయలు," వాటిని కేవలం అలంకరణ కోసమే వినియోగిస్తుంటారని ఆయన నొక్కిచెప్పారు. కుమ్మరి వర్గానికే చెందిన 46 ఏళ్ళ కామేశ్వరరావు, తన తండ్రితో కలిసి తన యుక్తవయసు నుంచే ఈ పని చేస్తున్నారు. 15 ఏళ్ళ క్రితం తండ్రి చనిపోయినప్పటి నుంచి ఒంటరిగానే ఆయన ఈ పని చేస్తున్నారు.

ముగ్గురు పిల్లలు, భార్య, తల్లి - ఈ ఆరుగురు ఉన్న కుటుంబంలో మానేపల్లి ఒక్కరే సంపాదించే సభ్యుడు. “ప్రతిరోజూ పనిచేస్తే నేను 10,000 [నెలకు] రూపాయలు సంపాదించగలను. కుండలు కాల్చడానికి ఉపయోగించే బొగ్గుకు సుమారు 2,000 రూపాయలు ఖర్చవుతుంది. అది పోతే నా దగ్గర మిగిలేది కేవలం 8,000 రూపాయలే.”

అనుభవజ్ఞుడైన ఈ కుమ్మరి తన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సక్రమంగా పని చెయ్యలేక, తరచుగా పని దినాలను పూర్తిగా మానేయవలసివస్తోంది. మరేదైనా పని చేస్తున్నారా అని ఆయనను అడిగినప్పుడు, "నేను ఇంకేం చేయగలను?" అంటూ, "నాకున్న ఒకే ఒక్క పని ఇదే," అని జోడించారాయన.

అనువాదం: నీరజ పార్థసారథి

Student Reporter : Ashaz Mohammed

Ashaz Mohammed is a student of Ashoka University and wrote this story during an internship with PARI in 2023

Other stories by Ashaz Mohammed
Editor : Sanviti Iyer

Sanviti Iyer is Assistant Editor at the People's Archive of Rural India. She also works with students to help them document and report issues on rural India.

Other stories by Sanviti Iyer
Translator : Neeraja Parthasarathy

Neeraja Parthasarathy is a teacher, translator and eclectic reader in both English and Telugu.

Other stories by Neeraja Parthasarathy