" సురూ సురూ మే ఏక్ నంగ్ బనానే మే ఆధీ కలక్ లగతీ థీ మేరీ [మొదట్లో ఒక జల్లెడ తయారుచేయడానికి నాకు అరగంట సమయం పట్టేది]." జల్లెడ తయారీ గురించి మాట్లాడుతున్నప్పుడు తన వేలికొనలపై ఉన్న కోతలను బొటనవేలుతో నొక్కుకుంటూ అన్నారు మొహమ్మద్ భాయ్ . ఇప్పటికీ పని చేస్తున్నప్పుడు ఆయన తన వేళ్ళను కోసుకోవచ్చు, కానీ  అనుభవంతో అతని పని సులభం అయింది. గుజరాత్‌లోని ముస్లిమ్‌లు తరచుగా మాట్లాడినట్లే గుజరాతీ పదాలను ఉదారంగా వాడుతూ మాట్లాడే ఒక విధమైన హిందీలో అయన కూడా మాట్లాడుతారు. “ ఏక్ మహినా తక్లిఫ్ పడీ మేరే కో. అబ్ ఏక్ నంగ్ పాంచ్ మినిట్ మే బన్ జాతా హై [ఒక నెల పాటు నాకు ఇబ్బందిగా ఉండింది, కానీ ఇప్పుడు ఐదు నిమిషాల్లో ఒక జల్లెడ తయారవుతుంది]," అని అతను నవ్వుతూ చెప్పారు.

మేం అహ్మదాబాద్‌లోని కుత్బీ బిల్డింగ్‌లోని ఒక 10 X 10 సైజు గదిలో కూర్చునివున్నాం. అది 43 ఏళ్ళ మొహమ్మద్ చర్నావాలా, 76 ఏళ్ళ అతని అమ్మీ (తల్లి) రుకయ్యా మౌఝుసైనీ నివాసముండే ఇల్లు. అహ్మదాబాద్‌లోని కాలుపుర్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న దావుదీ వోరా రోజా అనే చాల్‌ లోని శ్రామిక తరగతి ముస్లిమ్‌లు నివసించే ఈ రెండు అంతస్తుల భవనంలోని 24 ఇళ్ళలో వారిది కూడా ఒకటి. ఆధునికంగా కనిపించే రైల్వే స్టేషన్‌కి అవతలి వైపుకు వెళ్తే మీరు పాత నగరంలో అడుగుపెట్టినట్లే.

సందుగొందుల గుండా దారిచేసుకుంటూ వెళుతూ ఉంటే మీకు ఆహారం, తగాదాలు, గొడవలు, అప్పుడప్పుడు గాలిలోంచి తేలివచ్చే తిట్లూ దూషణలూ కనబడుతూ వినపడుతూ ఉంటాయి. మీరొక గజిబిజిగా అల్లుకున్న రోడ్ల సాలెగూడును చేరుకుంటారు - ఒకటి ఐమూలగా, ఒకటి కుడి వైపుకు, మరొకటి ఎడమ వైపుకు తిరిగి మూసుకుపోయిన వీధి చివరకు చేరుకుంటుంది. ఇంకోటి వంకరటింకరగా మెలికలు తిరుగుతూ, ఆపై తిన్నగా ఉంటూ, తిరిగి ఒకదానిలో మరొకటి కలిసిపోతుంటుంది. వీటిలో ఏదో ఒక దారి మిమ్మల్ని మొత్తం 110 కుటుంబాలు నివసించే దావూదీ వోరా రోజాలోని వోరా ట్రస్ట్‌కు చెందిన కుత్బీ భవనానికి చేరుస్తుంది.

మొహమ్మద్ భాయ్ ఇక్కడ నుండి తన చెక్క బండిని నెట్టుకుంటూ వారంలో ప్రతి మూడు రోజులకు ఒకసారి నగరంలో దాదాపు 30 కిలోమీటర్ల దూరం నడుస్తూ తిరుగుతారు. అతను ఉదయం ఆరు గంటలకు బయలుదేరుతారు. "అతను తన తండ్రి తిరిగిన చోటుకల్లా తిరుగుతాడు!" భర్తను గుర్తు చేసుకున్న రుకయ్యా చున్నీతో ముఖం తుడుచుకుంటూ చెప్పారు. "అతను నదిని దాటి, సబర్మతి అవతలి వైపు వెళ్ళి రాత్రి 9 లేదా 10 గంటలకు ఆలస్యంగా తిరిగి వచ్చేవాడు." అబ్బా (తండ్రి) మౌఝుసైనీ 2023 ఫిబ్రవరిలో మరణించారు. అప్పుడు ఆయన వయసు 79 సంవత్సరాలు.

Mohamad Charnawala.
PHOTO • Umesh Solanki
His mother Ruqaiya Moiz Charnawala
PHOTO • Umesh Solanki

ఎడమ: మొహమ్మద్ చర్నావాలా. కుడి: అతని తల్లి రుకయ్యా మోయిజ్ చర్నావాలా

Left: Sieves and mesh to be placed in the sieves are all over his kitchen floor.
PHOTO • Umesh Solanki
Right: Mohamad bhai, checking his work
PHOTO • Umesh Solanki

ఎడమ: వంటగది నేలపై నిండి ఉన్న జల్లెడలూ, అందులో అమర్చాల్సిన జాలీ. కుడి: తాను చేసిన పనిని తనిఖీ చేసుకుంటోన్న మొహమ్మద్ భాయ్

లేదు, మొహమ్మద్ భాయ్ తన నైపుణ్యాన్ని తన తండ్రి నుండి నేర్చుకోలేదు. " హో గయీ హిమ్మత్ తో కర్ లియా [ప్రయత్నించే ధైర్యం వచ్చింది, చేసేశాను]," అని అతను చెప్పారు. “వాటిని [జల్లెడలు] ఇంట్లో ఆయన తయారుచేస్తుండగా నేను చూస్తూ ఉండేవాడిని. కానీ ఆయన బతికుండగా నేను ఒక్క జల్లెడను కూడా ముట్టుకోలేదు. నేను చూసి నేర్చుకున్నాననుకుంటున్నాను," అన్నారతను. అతని తండ్రి తన మేనమామ టీ దుకాణంలో పనిచేసేవారు, కాని ఒక గొడవ జరిగిన తరువాత అతను ఆ పనిని వదిలి జల్లెడలు చేయడం మొదలుపెట్టారు. "1974లో మేం సరస్‌పుర్‌కు మారినప్పటి నుండి మా నాన్న తన బండితో బయటికి వెళ్ళేవాడు," అని మొహమ్మద్ భాయ్ గుర్తుచేసుకున్నారు. ఆయన చనిపోయే వరకు అదే పని చేశారు.

అయితే మొహమ్మద్ భాయ్ ఈ పనికి కొత్త. తండ్రి మరణించిన ఐదు నెలల తర్వాత మాత్రమే ఆయన ఈ పని చేయటం మొదలుపెట్టారు. వారానికి మూడు రోజులు ఆయన ఈ పని చేస్తారు. “ఇతర రోజుల్లో నేను పెద్ద యూనిట్లలో ఉపయోగించే 200-250 కిలోల డీజిల్, పెట్రోల్, గ్యాస్ కవాటాలకు (volves) రంగులు వేస్తాను. ఉదయం 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 7.30  వరకు పనిచేస్తాను, మధ్యలో అరగంట పాటు భోజన విరామం. నాకు రోజుకు 400 రూపాయలు వస్తాయి." జల్లెడ మరమ్మతు పని అతనికి పెద్దగా ఆదాయాన్నివ్వదు. “ కోయి దిన్ సౌ ఆయే. కోయి దిన్ పంచసో భీ లే కె ఆయే. కోయి దిన్ నహీ భీ లాయే. కోయి నక్కీ నహీ [కొన్ని రోజులు 100 రూపాయలు వస్తాయి, కొన్ని రోజులు 500 కూడా తీసుకువస్తాను, ఒక రోజు అస్సలు ఏమీ తీసుకురాను. ఏదీ స్థిరంగా ఉండదు]," అని ఆయన చెప్పారు.

అలా అయితే అతను వారం మొత్తం కవాటాలకు రంగులేసే పనినే ఎందుకు చేయటంలేదు?

“వ్యాపారంలో ఉన్నట్లయితే పురోగతిని సాధించాలని ఆశించవచ్చు, అభివృద్ధి చెందవచ్చు. ఇంకొక దాన్ని(పెయింట్ వేసే పని) ఉద్యోగం అంటారు, ఉదయం వెళ్ళి రాత్రికి తిరిగి వస్తాం.” అతను ఒకే సమయంలో అలసిపోయినట్లు గానూ, ఆశావాదిగానూ కనిపిస్తున్నారు.

“నేను 7వ తరగతి వరకు చదివాను. 8వ తరగతిలో కూడా చేరాను, కానీ ఆ తర్వాత అల్లర్లు చెలరేగాయి. నేను తిరిగి పాఠశాలకు వెళ్ళలేదు. అప్పటి నుంచి పనికెళ్ళటం మొదలుపెట్టాను. ప్రైమస్ స్టవ్వులు మరమ్మత్తు చేసే షాపులో రోజుకు 5 రూపాయల కూలీకి పనిచేశాను. కిరోసిన్ పంపులు, వెల్డింగ్ రాడ్లు కూడా తయారుచేశాను. చాలా పనులు చేశాను,” అని ఆయన చెప్పారు. జల్లెడలు తయారుచేయడం, వాటి మరమ్మతులు చేయడం అతను కొత్తగా చేస్తోన్న పని.

అహ్మదాబాద్‌లోనూ, ఇంకా ఇతర నగరాల్లో కూడా జల్లెడలను మరమ్మత్తు చేసేవారు చాలామంది ఉన్నారు, కానీ మొహమ్మద్ భాయ్ లాంటి ఇంటింటికి తిరిగి మరమ్మత్తు సేవలను అందించేవారు ఎక్కువమంది లేరు. “మొదట మా నాన్న మాత్రమే ఆ పని చేసేవారు, ఇప్పుడు నేను చేస్తున్నాను. మరెవరూ మరమ్మత్తు సేవలను అందించే బండి నడుపుతున్నట్లు నాకు తెలియదు. ఎవరి గురించీ వినలేదు. ఎవరినీ చూడలేదు. నేను ఒక్కడినే ఈ బండితో తిరుగుతుంటాను," అన్నారాయన.

అతని బండి వివిధ పరిమాణం, బరువు, మందం కలిగిన రకరకాల పనిముట్లతో - ఇనుప వలలు, కొన్ని పాత జల్లెడలు, ఒక ఉలి, కొన్ని చీలలు, ఒక చిమటా (శ్రావణం), ఒక జత పెద్ద కత్తెరలు, రెండు సుత్తెలు, మూడు అడుగుల పొడవున్న రైలు పట్టా - నిండి ఉంటుంది. కొన్నిసార్లు కుర్తా పైజామా, కొన్నిసార్లు ప్యాంటు, చొక్కా ధరించి, కాళ్ళకు పాత చెప్పుల జత, ముఖం తుడుచుకోవడానికి భుజంపై రుమాలుతో అతను 100 కిలోల బరువుండే తన బండిని నగరం సందుగొందుల గుండా నెట్టుకుంటూ తిరుగుతుంటారు.

Mohamad bhai pushing his repairing cart through lanes in Saraspur
PHOTO • Umesh Solanki
Mohamad bhai pushing his repairing cart through lanes in Saraspur
PHOTO • Umesh Solanki

సరస్‌పుర్ వీధుల్లో తన మరమ్మత్తుల బండిని నెట్టుకుంటూ వెళ్తోన్న మొహమ్మద్ భాయ్

ఒక జల్లెడ తయారుచేయడమంటే బజారుకు ఒకటి కంటే ఎక్కువసార్లు వెళ్ళిరావటం. మొహమ్మద్ భాయ్ మొదట బజారు నుండి ఒక తగరపు రేకును కొని, కావలసినంత పొడవు, వెడల్పుల ప్రకారం ఆ రేకును కత్తిరిస్తారు. ఆపైన కత్తిరించిన రేకులను మడతపెట్టి, అంచు కోసం చదునైన ముక్కలను సిద్ధం చేయటం కోసం మార్కెట్లోని 'ప్రెస్'కి తీసుకెళ్తారు. ఇనుప రేకులను కత్తిరించి, నొక్కే చిన్న దుకాణాన్ని ఆయన 'ప్రెస్' అంటారు.

ఇంట్లో అతను ఇనుప కమ్మీలపై రెండు రివెట్లను ఒక కొక్కెంతో అతికిస్తారు. ఆపై మళ్ళీ బజారుకు వెళ్ళి 'కోర్-కందోరో' - ఈ ప్రక్రియలో జల్లెడ కోసం చట్రాన్నీ, చుట్టూ అమర్చే రేకునూ సిద్ధం చేస్తారు- చేయించి తీసుకువస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అతను తీగతో అల్లిన జాలీని, రివెట్లను గుండ్రంగా ఉన్న జల్లెడ చట్రానికి అతికిస్తారు.

“పేలాలు, మరమరాలు, వేయించిన సెనగలు, వక్కలూ జల్లించడం కోసం వెడల్పాటి జాలీని ఉపయోగిస్తారు. మేం ఈ వెడల్పాటి జాలీని 'నం. 5’ అంటాం. మిగతావన్నింటినీ - గోధుమలు, బియ్యం, జొన్నల వంటి చిరుధాన్యాలు - జల్లించటానికి ఉపయోగించే జల్లెడను ‘రన్నింగ్ ఐటెమ్’ అంటాం,” అని మొహమ్మద్ భాయ్ నాకు ఒక పెద్ద జల్లెడను చూపిస్తూ వివరించారు. “నేను కొత్త జల్లెడను 70 రూపాయలకు అమ్ముతాను, పాతదాన్ని నలభై లేదా నలభై ఐదుకి మరమ్మత్తు చేయగలను. ఇదంతా జాలీ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది."

జల్లెడను గుర్తించడానికి దాని పరిమాణంతో పాటు జాలీ నాణ్యత కూడా మరొక మార్గం అని అతను వివరించారు. "అవి వివిధ పరిమాణాలలో - 10', 12', 13', 15' లేదా 16' వ్యాసంలో -  రావచ్చు. ప్రతి దాని జాలీ నాణ్యతలో కూడా తేడా ఉంటుంది," అని అతను వివరించారు.

“తీగతో అల్లిన జాలీ 30 మీటర్ల చుట్ట ధర దాదాపు 4,000 రూపాయలు ఉంటుంది. ఎక్కువగా అమ్ముడుపోయే సాధారణ జల్లెడలకు నేను 10 నుంచి 40 రూపాయలు వసూలు చేస్తున్నాను. నం.12 జల్లెడకు నేను రూ. 70 లేదా 80 వసూలు చేస్తుంటాను. ఇదంతా కొనేవారిపై ఆధారపడి ఉంటుంది. నాకు రూ. 90 లేదా రూ. 100 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవారు కూడా ఉన్నారు."

ముడిసరుకుపై అతను ప్రతి కొన్ని నెలలకు రూ. 35,000 ఖర్చు చేస్తారు. అతని నెల సంపాదన ఆరు నుంచి ఏడు వేల రూపాయల వరకూ ఉంటుంది. ఖర్చులు మాత్రం భారీగా ఉన్నాయని ఆయన నిట్టూరుస్తూ చెప్పారు. "మేం ఇద్దరం మాత్రమే ఉంటాం, అయినా సరే నేను ఇంటికి తెచ్చినదంతా దాదాపుగా ఖర్చయిపోతుంది." ఇంతలోనే ఒక్కసారిగా నవ్వి, “నేను ఆదివారం ఎక్కడికీ పనికి వెళ్ళను. ఆ ఒక రోజు విశ్రాంతి తీసుకుంటాను," అన్నారు.

Mohamad bhai with his a door-to-door repairing service cart on the Anil Starch road in Bapunagar, Ahmedabad
PHOTO • Umesh Solanki

అహ్మదాబాద్‌ బాపునగర్‌లోని అనిల్ స్టార్చ్ రోడ్‌లో తన ఇంటింటికి తిరిగి మరమ్మత్తు సేవలు చేసే బండితో మొహమ్మద్ భాయ్

'First it was only my father and now it is me. I do not know of anyone else who runs a repair servicing cart,' he says
PHOTO • Umesh Solanki

'మొదట మా నాన్న మాత్రమే ఈ పని  చేసేవారు, ఇప్పుడు నేను చేస్తున్నాను. మరెవరూ మరమ్మత్తు సేవలు చేసే బండి నడుపుతున్నట్లు నాకు తెలియదు' అని ఆయన చెప్పారు

He walks from his home for about 30 kilometres, pushing his wooden cart across the city, every three days a week
PHOTO • Umesh Solanki

వారంలో మూడు రోజులకు ఒకసారి తన ఇంటి నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరం నగరమంతా నడుస్తూ తన చెక్క బండిని నెట్టుకుంటూ తిరుగుతారు

Mohamad bhai earns litte from repairing sieves. 'Some days I bring 100 rupees, some days I may bring 500 rupees, someday there will be nothing at all. Nothing is fixed'
PHOTO • Umesh Solanki

మొహమ్మద్ భాయ్ జల్లెడలు బాగుచేయడం ద్వారా సంపాదించేది చాలా తక్కువ. 'కొన్ని రోజులు నేను 100 రూపాయలు తీసుకువస్తాను, కొన్ని రోజులు 500 తీసుకువస్తాను,  ఒక్కో రోజు ఏమీ రాదు. ఏదీ స్థిరంగా ఉండదు'

What Mohamad bhai makes from repairing sieves can depend from customer to customer.  'For No. 12 I may charge rupees 70 or 80, it all depends on the customer. There are those who are willing to give me 90 or 100 also'
PHOTO • Umesh Solanki

జల్లెడలను మరమ్మత్తు చేయడం ద్వారా మొహమ్మద్ భాయ్‌కి వచ్చే ఆదాయం కొనుగోలుదారులపై ఆధారపడి ఉంటుంది. 'నం.12 జల్లెడకు నేను రూ. 70 లేదా 80 వసూలు చేస్తుంటాను. ఇదంతా కొనేవారిపై ఆధారపడి ఉంటుంది. నాకు రూ. 90 లేదా 100 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవారు కూడా ఉన్నారు’

Seventy-five-year-old Shabbir H. Dahodwala in the press, folding and pressing the tin sheets
PHOTO • Umesh Solanki

ప్రెస్‌లో తగరపు రేకులను మడతపెట్టి నొక్కుతున్న డెబ్బై ఐదేళ్ళ షబ్బీర్ హెచ్. దాహోద్‌వాలా

Mohamad bhai Charnawala, 'I don’t go to work anywhere on a Sunday. One day I rest'
PHOTO • Umesh Solanki

మొహమ్మద్ భాయ్ చర్నావాలా, 'నేను ఆదివారం పనికోసం ఎక్కడికీ వెళ్లను. ఆ ఒక రోజు విశ్రాంతి తీసుకుంటాను'

అనువాదం : నీరజ  పార్థసారథి

Umesh Solanki

Umesh Solanki is an Ahmedabad-based photographer, documentary filmmaker and writer, with a master’s in Journalism. He loves a nomadic existence. He has three published collections of poetry, one novel-in-verse, a novel and a collection of creative non-fiction to his credit.

Other stories by Umesh Solanki
Editor : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya
Translator : Neeraja Parthasarathy

Neeraja Parthasarathy is a teacher, translator and eclectic reader in both English and Telugu.

Other stories by Neeraja Parthasarathy