PHOTO • P. Sainath

కొందరు గ్రామ వాసులు మొదట్లో వీర్ నారాయణ్ సింగ్‌ను ఒక 'బందిపోటు'గా అభివర్ణించారు, కానీ మేము తిరిగి వెళ్లే సమయానికి వాళ్ల అభిప్రాయంలో కాస్త మార్పు వచ్చింది

"వీర్ నారాయణ్ సింగ్ ఆ?" అని చత్తీస్‌ఘడ్‌లోని సోనాఖాన్ గ్రామానికి చెందిన సహస్రామ్ కన్వర్ తన అభిప్రాయం చెప్పసాగారు. "అతను ఒక దొంగ, ఒక బందిపోటు. కొందరు ప్రజలు ఆయన గొప్పవాడని అంటారు. మేము అలా అనుకోం." ఆయన చుట్టూ కూర్చున్న వారిలో చాలా మంది అవునంటూ తలూపారు. మరికొందరు అటువంటి అభిప్రాయాన్నే వెళ్లబుచ్చారు.

అది విని మాకు ఎంతో బాధేసింది. సోనాఖాన్ గ్రామాన్ని వెతుక్కుంటూ మేము ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చాం. 1850 దశకం మధ్యలో జరిగిన చత్తీస్‌ఘడ్ గిరిజన తిరుగుబాటుకు ఈ గ్రామం కేంద్రంగా నిలిచింది. ఇది, 1857లో జరిగిన సైనిక తిరుగుబాటుకు ముందే మొదలైంది. ఒక నిజమైన పల్లె వీరుడిని తెర పైకి తెచ్చింది.

ఈ గ్రామంలోనే వీర్ నారాయణ్ సింగ్ బ్రిటీష్ వారిని ఎదిరించి నిలిచారు.

1850లలో కరువు అంచుల దాకా వచ్చిన దీన స్థితి ఈ విప్లవానికి దారి తీసింది. ప్రజల దైనందిన జీవనం మరింత కష్టతరం కావడంతో సోనాఖాన్‌లోని నారాయణ్ సింగ్, ఆ ప్రాంతపు భూస్వాములను ధిక్కరించి నిలిచాడు. దాదాపు అంతా గిరిజనులే నివసించే ఈ గ్రామంలో అత్యంత వృద్ధుడైన చరణ్ సింగ్, "అతను ఎన్నడూ దాన ధర్మాలను కోరలేదు" అని చెప్పారు. నారాయణ్ సింగ్ మీద ఇతనికి మాత్రమే కాస్తంత సదభిప్రాయం ఉందనిపిస్తోంది.

"ప్రజల కోసం గోడౌన్లను తెరిచి, అందులోని ధాన్యాన్ని పంచి పేదల ఆకలి తీర్చమని అతను వ్యాపారులను, భూస్వాములను కోరాడు." కరువు కాటకాల సమయాలలో ఎప్పుడూ జరిగే లాగానే, అప్పుడు కూడా గోడౌన్లలో ధాన్యం నిండుగా ఉండింది. " ప్రజలకు తొలి పంట చేతికి అందగానే, తీసుకున్న  ధాన్యాన్ని వారు తిరిగి ఇచ్చేస్తారని చెప్పాడు. దానికీ భూస్వాములు ఒప్పుకోకపోవడంతో పేద ప్రజలకు తోడుగా దండెత్తి, ధాన్యాన్ని జప్తు చేసుకుని అందరికీ పంచేలా నాయకత్వం వహించాడు.”అలా మొదలైన పోరాటం చుట్టు పక్కల ప్రాంతాలకు వ్యాపించి, అన్ని చోట్లా గిరిజనులు తమను అణిచివేచేస్తోన్న వర్గాలపై తిరుగుబాటు చేశారు.

“He did not seek charity,” says Charan Singh, the oldest Adivasi resident of Sonakhan, who alone seems to have a more generous view of Veer Narayan Singh
PHOTO • P. Sainath

సోనాఖాన్‌లో అత్యంత వృద్ధుడైన చరణ్ సింగ్, "అతను ఎన్నడూ దాన ధర్మాలను కోరలేదు" అని చెప్పారు. నారాయణ్ సింగ్ మీద అతనికి మాత్రమే కాస్తంత సదభిప్రాయం ఉందనిపిస్తోంది.

"1857 తిరుగుబాటుకు చాలా కాలం మునుపే ఈ ఘర్షణ మొదలైంది," అని భోపాల్‌లోని బర్కతుల్లా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హీరాలాల్ శుక్లా చెప్పారు. అయినప్పటికీ, "1857 తిరుగుబాటు వీరులతో కలిసి సంయుక్తంగా ఈ ఘర్షణ కొనసాగింది". అంటే, ఒక వైపు బ్రిటీష్ వారు గెలుపొందాలని కోరుతూ బాంబే, కలకత్తా నగరాలలోని ధనికులు, ఉన్నత వర్గాలు సమావేశాలను నిర్వహిస్తోంటే మరో వైపు చత్తీస్‌ఘడ్‌లోని గిరిజనులు ఎంతో త్యాగం చేసి పోరాడారు.

1857లో బ్రిటీష్ వారు నారాయణ్ సింగ్‌ను రాయ్‌పూర్‌లో ఉరి తీశారు.

స్వతంత్ర పోరాటంలో భాగంగా చేసిన త్యాగాలపై సోనాఖాన్ ప్రజలకు చిన్న చూపు లేదు. వాళ్లు కూడా ఎన్నో త్యాగాలు చేశారు. "బ్రిటీష్ వారిపై పోరాడటం సరైన పని. ఈ దేశం మనకే సొంతం," అని జై సింగ్ పైక్రా అనే ఒక సన్న కారు రైతు చెప్పారు. గత యాభై ఏళ్లలో, "పేదవారికి మాత్రం పెద్దగా ప్రయోజనాలు ఒనగూరలేదు" అని అభిప్రాయపడ్డారు.

సోనాఖాన్ అనే పేరులో బంగారం ఉన్నా, చత్తీస్‌ఘడ్‌లోని ఎన్నో గిరిజన, గిరిజన-ఏతర పేదలు ఎదుర్కొనే ఆకలి పోరాటం సోనాఖాన్‌లో కూడా తాండవిస్తుంది. "మునుపటి సీజన్‌లో మీరు వచ్చి ఉంటే, ఇప్పుడు మీకు కనబడే కొద్ది మంది కంటే కూడా ఇంకా తక్కువ సంఖ్యలో ప్రజలు కనబడేవారు. కొన్ని సార్లు, ఎంతో కొంత సంపాదించేందుకు గాను మేమంతా వలస వెళ్లక తప్పదు," అని శ్యామసుందర్ కణ్వర్ చెప్పారు. ఇక్కడ అక్షరాస్యతా కార్యక్రమాలు విఫలం కావడానికి ఇది కూడా ఒక కారణం.

సోనాఖాన్ గ్రామం చుట్టూ రక్షిత అభయారణ్యం ఉంది. అరణ్యాలను వేధించే ఎన్నో సమస్యలు అప్పటికీ ఇప్పటికీ అలానే ఉన్నాయి. వీర్ నారాయణ్ పోరాడిన అవే శక్తులు ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. వాళ్లు వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు మరియు భూస్వాములు. "కొన్నిసార్లు, కేవలం బ్రతికి బట్ట కట్టడం కోసమే భూమిని తాకట్టు పెట్టాల్సి వస్తుంది," అని విజయ్ పైక్రా అనే మరో రైతు చెప్పారు.

PHOTO • P. Sainath

సోనాఖాన్ గ్రామస్థులు కొందరు మాతో పాటు సమాధి వరకు వచ్చారు.

ఆ సమస్యలన్నింటినీ ఇంకా ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ, వీర్ నారాయణ్ సింగ్‌ను మాత్రం ఎవరూ గుర్తు చేసుకోవడం లేదు, ఎందుకని?

"ఆ ప్రశ్నకు సమాధానం గతంలో వెతికితే దొరకదు. 1980లు, 90లలో నడిచిన మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దొరుకుతుంది," అని భోపాల్‌కు చెందిన ఒక ప్రభుత్వాధికారి చెప్పారు.

"అర్జున్ సింగ్ దాదాపు 13 ఏళ్ల క్రితం, [తన హెలికాప్టర్‌లో] వచ్చారు," అని చరణ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. "వచ్చి, ఇక్కడ ఒక ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇంకొంత మంది పెద్ద మనుషులు వచ్చారు. [మంత్రులు హర్‌వంష్ సింగ్, కాంతీలాల్ భురియా మరియు విద్యా చరణ్ శుక్లా.] వాళ్లు కూడా హెలికాప్టర్‌లలోనే వచ్చారు. మధ్యలో, ఇతరులు కూడా వచ్చారు."

సోనాఖాన్‌కు దగ్గరి ప్రాంతమైన పిథోరాకు, రాయ్‌పూర్‌కు మధ్య ఉన్న 100 కిలోమీటర్ల దూరాన్ని రోడ్డు మార్గంలో దాటడానికి రెండు గంటలు పడుతుంది. అయితే, ఆ తర్వాత కేవలం 30 కిలోమీటర్ల దూరంలోని సోనాఖాన్ గ్రామాన్ని చేరుకోవడానికి రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. "ఇక్కడ ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యం వస్తే, వాళ్లకు వైద్య సహాయం అందజేయడానికి, అడవి గుండా 35 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లాల్సి ఉంటుంది," అని జై సింగ్ పైక్రా చెప్పారు.

మరి అర్జున్ సింగ్ ప్రారంభించిన ఆసుపత్రి ఏమైంది? "దానిని ప్రారంభించాక గత 13 ఏళ్లలో ఒక్క డాక్టర్ కూడా రాలేదు," అని పైక్రా చెప్పారు. అక్కడ ఒక కాంపౌండర్ మాత్రమే విధుల్లో ఉండి ప్రిస్క్రిప్షన్‌లను రాసి ఇస్తారు. కానీ, అందులోని మందులను మాత్రం బయటి నుండి తెచ్చుకోవాల్సి ఉంటుంది.

Hunger and poor health care are still issues in Sonakhan, as these women explain
PHOTO • P. Sainath

ఆకలి, అరకొరగా ఉండే వైద్య సదుపాయాల వంటి సమస్యలు ఇప్పటికీ సోనాఖాన్ గ్రామాన్ని వేధిస్తున్నాయని ఈ మహిళలు వివరించారు

ఇంతకీ ఆ "పెద్ద మనుషులు" ఇక్కడికి ఎందుకొచ్చినట్టు? అసలు వచ్చి ఏం చేశారు?

"ప్రతి సారీ ఇదే జరుగుతుంది," అని పైక్రా చెప్పారు. "నారాయణ్ సింగ్ గురించి ఉపన్యాసాలు ఇచ్చి, ఆయన వంశీయులైన ఒకే ఒక్క కుటుంబానికి మాత్రమే నగదు, ఇతర బహుమతులను ఇస్తారు." ఆ వంశీయల కోసం మేము వెతికి చూసినా ఎవరూ కానరాలేదు.

"వాళ్లెప్పుడూ ఇక్కడ ఉండరు. అసలు వాళ్లు నిజంగా ఆయన వంశీయులా కాదా అని ఎవరికి తెలుసు?" అని చరణ్ సింగ్ చెప్పారు. "వంశీయులమేనని వాళ్లు చెప్పుకుంటారు. కానీ గ్రామ దేవత గుడి దగ్గర పూజ కూడా చేయరు."

"అయినా, ఆ బహుమతులన్నింటినీ వాళ్లే లాగేసుకుంటారు," అని పైక్రా ఆరోపించారు.

స్వాతంత్ర సమరయోధులను లెక్కించే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. బ్రిటీష్ వారిపై పోరాడుతూ వేలల్లో గిరిజనులు తమ ప్రాణాలు అర్పించారు. కానీ స్వాతంత్ర సమరయోధుల జాబితాలలో గిరిజనుల పేర్లు మచ్చుకైనా కనబడవు. చత్తీస్‌ఘడ్‌లో, బస్తార్‌లోనూ అదే పరిస్థితి ఎదురౌతుంది. కానీ మిర్ధా, శుక్లా. అగర్వాల్, గుప్తా, దుబే వంటి (అగ్ర కుల) వ్యక్తుల పేర్లు మాత్రం కనబడతాయి. చరిత్రను విజేతలే రాస్తారనే దానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

PHOTO • P. Sainath

బ్రిటీష్-వ్యతిరేక పోరును ముందుండి నడిపిన మహా వీరుడి గురించి గ్రామ పెద్దలు చెబుతుంటే ఇతరులు వింటున్నారు

1980వ దశకం మధ్యలో, అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ తన ప్రధాన విరోధులైన శుక్లా సోదరులను రాజకీయంగా దెబ్బ తీయాలని అనుకున్నారు. వారిలో ఒకరు శ్యామ చరణ్ శుక్లా, అదే రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. మరొకరు విద్యా చరణ్ శుక్లా పలు మార్లు కేంద్ర మంత్రిగా పని చేశారు. ఈ సోదరుల రాజకీయ ప్రాబల్యానికి చత్తీస్‌ఘడ్ ఒక కంచు కోటగా ఉండేది, కొంత మేరకు ఇప్పటికీ అలానే ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఆధిపత్యం సాధించాలనే ధ్యేయంతో అర్జున్ సింగ్ వారిని లక్ష్యం చేసుకున్నారు. ఆ వ్యూహంలో భాగంగా వీర్ నారాయణ్‌ను ఒక పావుగా ఎంచుకున్నారు.

నారాయణ్ సింగ్‌ను చరిత్ర పుస్తకాల నుండి తుడిచేసినా ఈ ప్రాంత ప్రజల దృష్టిలో ఆయన ఒక నిజమైన వీరుడు. అయితే ఇప్పుడు అతడిని ప్రభుత్వం ఒక పావులాగా వాడుకుంటోంది.

నిజానికి వీర్ నారాయణ్ సింగ్‌ను తెర మీదకు తెచ్చి ప్రాచుర్యం కల్పించింది, శుక్లా సోదరుల రాజకీయ బలాన్ని క్షీణింపజేయడానికే. చత్తీస్‌ఘడ్‌లో అసలైన వీరులు ఎవరు? గిరిజన వీరుడా? అగ్ర వర్గాలకు చెందిన శుక్లా సోదరులా? చత్తీస్‌ఘడ్ ఆచార సాంప్రదాయాలకు అసలైన హక్కుదారులు ఎవరు? గతాన్ని తరచి చూసే ఆ ప్రయత్నం వెనుక సమకాలీన రాజకీయ యుద్ధ వ్యూహాలు దాగి ఉన్నాయి. వీర్ నారాయణ్ పట్ల అమితమైన గౌరవం ఉన్నట్టు చూపడం ద్వారా, అర్జున్ సింగ్ తాను శుక్లా సోదరులకు వ్యతిరేకంగా సామాన్య గిరిజనుల సరసన ఉన్నట్టుగా ప్రజలకు సందేశాన్ని పంపే ప్రయత్నం చేశారు.

దాంతో, ప్రభుత్వ యంత్రాంతం నారాయణ్ సింగ్ జీవితం గురించిన ఒక అధికారిక వృత్తాంతాన్ని పునర్నిర్మించడం ప్రారంభించింది. దాని వల్ల కొంత మేలు కూడా జరిగింది. మరుగున పడిపోయిన వీరుడికి అందాల్సిన గౌరవం చిట్ట చివరికి అందసాగింది. అందులో తప్పేమీ లేదు. అయితే, దాని వెనుక ఉన్న ఉద్దేశాల సంగతి మాత్రం వేరు. ఆ వీరుడి వారసత్వం కోసం పోటీ పడుతూ రాజకీయ నాయకులు సోనాఖాన్ చుట్టూ చక్కర్లు కొట్టడం మొదలు పెట్టారు. ఆసుపత్రులకు, ఇతర భవనాలకు ఘనంగా ప్రారంభోత్సవాలు నిర్వహించారు కానీ ఆ తర్వాత అవి పనిచేస్తున్నాయా లేదా అని మాత్రం లెక్క చేయలేదు. ఉద్యోగాలు, "సహాయక కార్యక్రమాల"ను ప్రకటించారు. రిజర్వాయర్లకు, తోటలకు వీర్ నారాయణ్ సింగ్ పేరు పెట్టారు.

కానీ, ఒకే ఒక్క కుటుంబానికే ఆ ప్రయోజనాలు చేకూరాయని గ్రామ వాసులు ఆరోపిస్తున్నారు.

PHOTO • P. Sainath

వీధి కుక్కలు తచ్చాడుతూ దయనీయ స్థితిలో ఉన్న వీర్ నారాయణ్ సింగ్ సమాధి

ఒకవైపు నారాయణ్ సింగ్ కీర్తి ఇతర ప్రాంతాలలో వ్యాప్తి చెందుతుంటే, మరో వైపు అతని సొంత గ్రామంలోనే అతనిపై గౌరవం క్షీణించసాగింది. ఒకే ఒక్క కుటుంబానికి ఇలా పక్షపాత ధోరణిలో చేయూతనివ్వడం వల్ల సోనాఖాన్‌లో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి.

వీర్ నారాయణ్ అంకురార్పణ చేసిన విప్లవ రాజకీయం ఇప్పుడు అడుగంటి పోయింది. పోషణా రాజకీయం విజయం సాధించింది. నిజమైన పల్లె వీరుడి స్మృతిని పాలక వర్గాలు తమ ఆధీనంలోకి తీసుకుని, అతడిని గుర్తు తెలియకుండా నాశనం చేశారు. అతను ఏ ఐకమత్యం కోసమైతే పోరాడాడో, దాని జాడే లేకుండా పోయింది. 80ల దశకం ప్రారంభమైంది.

మా బస ముగిసే సరికి గ్రామ వాసులు కాస్త శాంతించారు. వాళ్ల కోపాన్ని సరైన వారి మీద చూపించకున్నా, అది నిర్హేతుకమైనది కాదు. "ఆయన నిజంగా మంచి మనిషే," అని విజయ్ పైక్రా చెప్పారు. "కానీ ఆయన పోరాడింది మనందరి కోసం కదూ? కేవలం తన కుటుంబం కోసమే కాదు. ఆయన స్వార్థంతో నడుచుకోలేదు. మరి అలాంటప్పుడు ఒక్క కుటుంబానికే ప్రయోజనాలన్నీ అందితే ఎలా?"

సోనాఖాన్‌లో వీర్ నారాయణ్ సింగ్ రెండు సార్లు మృతి చెందాడు. మొదటి సారి బ్రిటీష్ సర్కారు చేతుల్లో. రెండవ సారి మధ్యప్రదేశ్ రాష్ట్ర సర్కారు చేతుల్లో. ఆయన లేవనెత్తిన సమస్యలకు ఇంకా పరిష్కారం దొరకలేదు.

ఈ వార్తా కథనం 'ది టైమ్స్ ఆఫ్ ఇండియా' దినపత్రికలో 1997 ఆగస్ట్ 27న మొదట ప్రచురితమైంది.

ఈ వరసలో ఇంకొన్ని శీర్షికలు :

సాలిహాన్ రాజ్ మీద ఎదురుదాడి చేయగా

పనిమారా స్వాతంత్య్ర క్షేత్ర యోధులు -1

పనిమారా స్వాతంత్య్ర క్షేత్ర యోధులు - 2

లక్ష్మి పాండా ఆఖరి పోరాటం

తొమ్మిది దశాబ్దాల అహింస

షేర్పూర్ : గొప్ప త్యాగం, గుర్తులేని జ్ఞాపకం

గోదావరి: దాడి కై ఎదురుచూస్తున్న పోలీసులు

కలియస్సేరి :  సుముకన్ కోసం వెతికే ఒక ప్రయత్నం

కల్లియస్సేరి : యాభైల్లో కూడా వీడని పోరాటం

అనువాదం : శ్రీ రఘునాథ్ జోషి

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Sri Raghunath Joshi

Sri Raghunath Joshi obtained a Masters degree in Engineering but switched careers to pursue his love of Telugu language. Currently he works remotely as Telugu-Language Lead at a Localization firm based in Noida. He can be contacted at [email protected]

Other stories by Sri Raghunath Joshi