ఇది భారీ వ్యవస్థ - పంజాబ్ అంతా కలిపి (2019-20లో) 152 ప్రధాన యార్డులు, 279 ఉప యార్డులు, 1,389 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి, జస్వీందర్ సింగ్ కోసం ఒక భద్రతా వలయాన్ని ఏర్పరిచాయి. ఈ మండి వ్యవస్థలో రైతు సురక్షితంగా ఉన్నట్లు అనిపిస్తుంది, సంగ్రూర్ జిల్లాలోని లాంగోవల్ పట్టణానికి చెందిన 42 ఏళ్ల జస్విందర్, అతని కుటుంబంతో కలిసి 17 ఎకరాలు సాగు చేస్తాడు. “నేను పంట చేతికి రాగానే ఎలాంటి సందేహం, భయం లేకుండా దానిని మండికి తీసుకురాగలను. నాకు ఈ పని ఎలా చేయాలో తెలుసు కాబట్టి నాకు రావలసింది నాకు తప్పకుండా వస్తుందని కూడా తెలుసు.“

ప్రధాన యార్డ్‌లు చాలా భారీ మండీలుగా మారతాయి (ఇక్కడ ఫోటోలలో ఉన్న సునమ్‌లో ఉన్నట్లు). ఈ యార్డులు రైతులు తమ పంటను తీసుకు వచ్చి కుప్పలుగా పోయడానికి చాలా రకాల సౌకర్యాలతో కొన్ని స్థలాలున్నాయి. మామూలుగా వారి ఆర్తియ కమిషన్ ఏజెంట్ల షాపుల ముందే కుప్పపోస్తారు. ఒకవేళ ఆ సంవత్సరం ఉత్పత్తికి ప్రిన్సిపల్ యార్డ్‌లోని స్థలం సరిపోకపోతే సబ్-యార్డ్‌లస్థలాలను వినియోగిస్తారు.  గ్రామాలలో(షెరాన్ వంటి గ్రామాలలో) కొనుగోలు కేంద్రాలు చిన్న మండీలుగా మారాతాయి. ఇవన్నీ కలిపితేనే  పంజాబ్ విస్తారమైన వ్యవసాయ ఉత్పత్తి వాణిజ్య కమిటీ(APMC) నెట్వర్క్ అవుతుంది

"నా పంటను విక్రయించినప్పుడు, నాకు ఆర్తియా నుండి J- ఫారమ్ వస్తుంది. ఈ ఫారమ్ నాకు చెల్లింపు వచ్చే వరకు సెక్యూరిటీగా పనిచేస్తుంది" అని జస్వీందర్ చెప్పారు. "ఇది ప్రభుత్వ ఏర్పాటు కనుక, నా చెల్లింపుతో ఏదైనా అనుకోని ఇబ్బంది ఎదురైతే, నాకు చట్టం నుండి రక్షణ ఉంటుందని, అదే పెద్ద భరోసా అని అని నాకు తెలుసు," అని ఆయన చెప్పారు (పంజాబ్ వ్యవసాయంలో ఉత్పత్తి మార్కెట్ల చట్టం 1961 సూచిస్తూ చెప్పారు).

APMC నెట్‌వర్క్ ప్రైవేట్ వ్యాపారులు లేదా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేదా మార్క్‌ఫెడ్ (పంజాబ్ స్టేట్ కోఆపరేటివ్ సప్లై) వంటి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నియంత్రిత ప్రక్రియలో పంటలను కొనుగోలు చేస్తుంది. ఇది ప్రధానంగా గోధుమనూ, వారిని స్టేట్ మాన్డేటెడ్ మినిమం సపోర్ట్ ప్రైస్ (MSP) ద్వారా కొనుగోలు చేస్తుంది. ఒకసారి ధాన్యం పంజాబ్లోని మండీలకు చేరితే, FCI లేదా మార్క్ ఫెడ్ అధికారులు ధాన్యంలో ఉన్న తేమ పరిమాణం ద్వారా దాని నాణ్యతను పరీక్షిస్తారు. ఆ తర్వాత ఆ ధాన్యాన్ని వేలం పాడి అమ్ముతారు. ఈ ప్రక్రియ మొత్తం ఆర్టియాల ద్వారా జరుగుతుంది. వీరు ఈ గొలుసులో చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు.

అందుబాటులో ఉండడం, విశ్వసనీయంగా పనిచేయడం-  ఇటువంటి వ్యవస్థ  వలన కలిగే ప్రధాన ప్రయోజనాలు అని పాటియాలా జిల్లాలోని పాత్రాన్ తహసీల్‌లోని దుగల్ కలాన్ గ్రామానికి చెందిన 32 ఏళ్ల అమన్ దీప్ కౌర్ చెప్పారు. “చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను నా ఉత్పత్తులను గ్రామ మండికి [కొనుగోలు కేంద్రానికి] తీసుకెళ్లగలను. ఇది సౌకర్యవంతంగా ఉంటుంది పైగా నా పంటకు [MSPగా] నేను పొందే రేటు నాకు తెలుసు. రాష్ట్రంలో చెరకుతో ఏం జరుగుతుందో చూశాం. దీనికి కేంద్రీకృత వ్యవస్థ లేదు, కాబట్టి రైతులు తమ ఉత్పత్తులను కొన్నిసార్లు ఒక నగరంనించి మరో నగరానికి తీసుకెళ్లి ఎక్కడ మంచి ధర పలికితే అక్కడ అమ్మాలి. కానీ మేము మంచి ధర కోసం ఇలా తిరుగుతూ ఎలా ఉండగలం?

PHOTO • Novita Singh with drone operator Ladi Bawa

ఒక కంబైన్ గోధుమ ధాన్యాన్ని ట్రాక్టర్‌లోకి దింపుతుంది, ఆ ట్రాక్టర్  ఆ ధాన్యాన్ని సంగ్రూర్ జిల్లాలో సమీపంలోని సునం మండికి తీసుకువెళుతుంది. ఈ ప్రక్రియ రోజుకు చాలాసార్లు మళ్లీ మళ్లీ  జరిగుతుంది. ఇది కోత కాలమైన ఏప్రిల్ మధ్యలో బైసాఖి పండగ సమయంలో ప్రారంభమవుతుంది ఆ తర్వాత 10 రోజులు గరిష్ట స్థాయిలో పని ఉంటుంది

అమన్ దీప్ కుటుంబం 22 ఎకరాలు సాగు చేస్తుంది - వారి స్వంతానికి ఆరు ఎకరాలుండగా, మిగిలిన భూమిని లీజుకు తీసుకున్నారు. "మేము కూడా ఆర్తియా పై చాలా ఆధారపడి ఉన్నాము," ఆమె చెప్పింది. “ఉదాహరణకు, వర్షం కురిసి, మన గోధుమ పంట తడిస్తే, అది ఆరిపోయే వరకు 15 రోజులు మండిలో ఆర్తియా తో వదిలివేయవచ్చు . అంతేగాక అది అమ్ముడవుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అది ఖచ్చితంగా ప్రైవేట్ మండీలో సాధ్యం కాదు.”

"మేము మా ఉత్పత్తులను విక్రయించిన ఆరు నెలలకు మాకు చెల్లింపు వస్తుంది, కానీ చెల్లింపులు వచ్చే వరకు ఆర్తియా మాకు డబ్బు ఇస్తుంది" అని గోధుమ పండించే సంగ్రూర్ తహసీల్ (మరియు జిల్లా) లోని మంగ్వాల్ గ్రామానికి చెందిన 27 ఏళ్ల జగ్జీవన్ సింగ్ చెప్పారు. ఈయన మూడు ఎకరాలలో గోధుమ, వరి పంట వేశారు. "అంతేగాక, ఒక మండిలో MSP కారణంగా నేను పెట్టిన ఖర్చు నాకు తిరిగివస్తుందని నాకు ఖచ్చితంగా తెలుసు."

ఏదేమైనా, రైతుల ఉత్పత్తి వాణిజ్యం (ప్రమోషన్ మరియు ఫెసిలిటేషన్) చట్టం, 2020 , మధ్యవర్తులను తొలగించి, రైతు తన ఉత్పత్తులను నేరుగా కొనుగోలుదారుకు విక్రయించడానికి అనుమతించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 1960ల మధ్యకాలంలో హరిత విప్లవ కాలం నుండి పంజాబ్‌లో దశాబ్దాలుగా నిర్మించిన నమ్మకమైన మార్కెటింగ్ గొలుసులో ఆర్తియా లు ఇతర లింక్‌లతో పాటు APMC మండీల మాతృకను బలహీనపరుస్తుంది.

ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఇది దశాబ్దాల తరబడి ఉన్న మద్దతు పునాదిని కూల్చివేస్తుందని వారు భయపడుతున్నారు. ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020 , మరియు నిత్యావసర వస్తువుల (సవరణ) చట్టం, 2020 పై రైతుల (సాధికారత మరియు రక్షణ) ఒప్పందంపై కూడా వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టాలను మొదటగా గత ఏడాది జూన్ 5న ఆర్డినెన్స్‌లుగా ఆమోదించారు, తర్వాత సెప్టెంబర్ 14న పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లులుగా ప్రవేశపెట్టారు.

ఈ నిరసనలు నవంబర్ 26, 2020న ప్రారంభమయ్యాయి. అంతకుముందే పంజాబ్‌లో కూడా మొదలయ్యాయి - ఆగస్టు మధ్యలో ప్రారంభమైన ఆందోళనలు సెప్టెంబర్-అక్టోబర్ నాటికి పూర్తి స్థాయికి వచ్చాయి.

రైతుల నిరసనలకు పంజాబ్‌లోని ఆర్తియాస్ అసోసియేషన్ మద్దతు ఇస్తుంది. రైతు తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశాన్ని మండి అందిస్తుందని దాని అధ్యక్షుడు రవీందర్ చీమా చెప్పారు. "ప్రభుత్వ సంస్థలతో పాటు, [ప్రైవేట్] వ్యాపారులు కూడా మండీల వద్ద ఉన్నారు. కనుక రైతులు తమకు మంచి ధర లభించడం లేదని భావిస్తే, అప్పుడు ఒక అవకాశం ఉంది. కొత్త చట్టం రైతులు బేరం చేయగల శక్తిని తొలగిస్తుంది, వ్యాపారిని మండీ వెలుపల కూడా  ఉత్పత్తులను విక్రయించడానికి అనుమతిస్తుంది - అంటే పన్నులు చెల్లించే పనిలేదు (వర్తకుడే  MSP పైన చెల్లించాలీ). కాబట్టి ఏ వర్తకుడు మండీలకు వచ్చి ఉత్పత్తులను కొనరు, అలా APMC నెమ్మదిగా విలువ కోల్పోతుంది, అన్నారు చీమ.

PHOTO • Novita Singh with drone operator Ladi Bawa

హరిత విప్లవం తర్వాత పంజాబ్‌లో హార్వెస్టింగ్ ప్రక్రియ ఎక్కువగా యాంత్రీకరించారు. 2019-20లో రాష్ట్రంలో సుమారు 176 లక్షల టన్నుల గోధుమలు ఉత్పత్తి చేశారు, ఇది దాదాపు 35 లక్షల హెక్టార్లలో సాగు చేయబడింది, సగటు దిగుబడి ఎకరాకు 20.3 క్వింటాళ్లు


PHOTO • Aranya Raj Singh

ఏప్రిల్ 14, 2021న సంగ్రూర్ జిల్లాలోని సునమ్ మండి వద్ద గోధుమలను అన్‌లోడ్ చేస్తున్నారు


PHOTO • Novita Singh with drone operator Ladi Bawa

రైతులందరూ తమ ఉత్పత్తులను వేలం వేయడానికి మండీలకు తీసుకువస్తారు: 2021లో దాదాపు 132 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలు సేకరించాయి (ప్రైవేట్ వ్యాపారులు మొత్తం ఉత్పత్తిలో 1 శాతం కంటే తక్కువ కొనుగోలు చేస్తారు)


PHOTO • Aranya Raj Singh

సంగ్రూర్ జిల్లాలోని షెరాన్ గ్రామానికి చెందిన రూప్ సింగ్ అనే 66 ఏళ్ల రైతు: అతను వచ్చినప్పటి నుండి అతను స్థానిక మండీలో తన ఉత్పత్తులతో కూర్చున్నాడు . ఉత్పత్తులను ప్యాక్ చేసి విక్రయించడం అక్కడే కొనసాగుతుంది-ఈ పనికి 3-7  రోజులు పట్టొచ్చు


PHOTO • Aranya Raj Singh

సునం యార్డులో ధాన్యం నుండి పొట్టు తీసే చోట- గోధుమలను నూర్పిడికి తీసుకువెళుతున్న మహిళా కూలీలు. మండిలలోని శ్రామికశక్తిలో మహిళలే ఎక్కువ భాగం


PHOTO • Aranya Raj Singh

సున్నం మండి వద్ద, ఒక కూలీ ఊక జాడలను తొలగిస్తూ గోధుమ కుప్పను శుభ్రపరుస్తుంది


PHOTO • Novita Singh

షెరాన్ మండి వద్ద ఒక కార్మికుడు గోధుమ సంచులను అమ్మిన తర్వాత ఆ సంచులను మూసివేస్తున్నాడు. ఈ పనుల కోసం కూలీలను ఆర్టియాల ద్వారా నియమిస్తారు


PHOTO • Aranya Raj Singh

షెరాన్ మండిలో, ఏప్రిల్ 15, 2021: గోధుమల బరువు తూస్తున్నారు

PHOTO • Aranya Raj Singh

షెరాన్ మండిలో మధ్యాహ్న విశ్రాంతి. ఇక్కడ చాలా మంది కార్మికులు ఇప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్ నుండి వచ్చారు


PHOTO • Novita Singh with drone operator Ladi Bawa

సునం మండి వద్ద ప్రభుత్వ ఏజెన్సీలు కొనుగోలు చేసిన గోధుమ బస్తాలపై విశ్రాంతి తీసుకుంటున్న కార్మికులు, రైతులు


PHOTO • Aranya Raj Singh

విక్రయించిన గోధుమ సంచులను ట్రక్కుల్లోకి ఎక్కించి, ఈ ఉత్పత్తులను గోడౌన్‌లు మార్కెట్‌లకు తీసుకెళతారు

PHOTO • Aranya Raj Singh

షెరాన్ మండి వద్ద సాయంత్రం కార్మికులు. గోధుమ కోత ఎక్కువగా ఉండే రోజుల్లో పని ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వారు ఎక్కువ గంటలు పని చేస్తారు, రాత్రిపూట కూడా ట్రాక్టర్ల నిండా ధాన్యాలు వస్తాయి


PHOTO • Aranya Raj Singh

ఒక రైతు షెరాన్ మండి వద్ద ఇంకా విక్రయించబడని గోధుమల కుప్పల్లో నడుస్తున్నాడు


PHOTO • Aranya Raj Singh

షెరాన్ మండి వద్ద రైతులు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు


PHOTO • Novita Singh

ఒక రైతు షెరాన్ మండి వద్ద ఉత్పత్తులను విక్రయించే వరకు వాటికి కాపలాగా ఉండి - రాత్రికి తన పడకను ఏర్పాటు చేసుకుంటున్నాడు


PHOTO • Aranya Raj Singh

సంగ్రూర్ జిల్లాలోని నమోల్ గ్రామానికి చెందిన మహేందర్ సింగ్ సునమ్ మండి లోపల తన ఆర్తియా దుకాణం వద్ద కూర్చున్నాడు. వడ్డీ వ్యాపారులుగా వ్యవహరించడమే కాకుండా, రైతులకు పురుగుమందులు, ఎరువులు మరియు ఇతర వ్యవసాయ సామగ్రిని అందించడంలో కూడా ఆర్తియాలు సహాయపడతాయి


PHOTO • Aranya Raj Singh

రవీందర్ సింగ్ చీమా, సునమ్ మండిలోని పంజాబ్ అర్థియాస్ అసోసియేషన్ అధ్యక్షుడు.  హామీ లేని MSP లేకపొతే రైతు ప్రైవేట్ వ్యాపారి ద్వారా దోపిడీకి గురవుతాడని ఆయన చెప్పారు


PHOTO • Novita Singh with drone operator Ladi Bawa

సంగ్రూర్ జిల్లాలోని సునం మండిలోని ఒక ప్రధాన యార్డ్. రాష్ట్రంలోని మండీలలో ప్రధాన కార్యకలాపాలు గోధుమ పంట (ఏప్రిల్) వరి కోత (అక్టోబర్-నవంబర్) సమయంలో ఉండగా, ఈ మార్కెట్‌లు ఏడాది పొడవునా, పప్పుధాన్యాలు, పత్తి మరియు నూనె గింజలు వంటి ఇతర పంటలతో వ్యాపారం చేస్తాయి


ఈ కథనానికి సంబంధించిన ఫోటోలు ఏప్రిల్ 14-15, 2021న తీశారు.

అనువాదం: అపర్ణ తోట

Novita Singh

Novita Singh is an independent filmmaker based in Patiala, Punjab. She has been covering the ongoing farmers protests since last year for a documentary.

Other stories by Novita Singh
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota