కుడిచేతిలో కత్తి, ఎడమచేతిలో గుర్రపు కళ్లాలు పట్టుకొనివున్న ప్రఖ్యాతిచెందిన రాణీ వేలు నాచ్చియార్, చెన్నైలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించబడిన చారిత్రక వ్యక్తులలో అత్యధికంగా ఫోటోలు తీయబడినవారిలో ఒకరు. వి.ఒ. చిదంబరం పిళ్ళై, సుబ్రమణియ భారతి, మరుదు సోదరులవంటి ప్రసిద్ధులైన తమిళ ప్రముఖుల చిత్రపటాల పక్కన ఈమె చిత్రం కూడా ఉంది.

'స్వాతంత్య్ర పోరాటంలో తమిళనాడు'కు ప్రాతినిధ్యం వహిస్తున్న అదే చిత్రాల పట్టికను కేంద్ర ప్రభుత్వ ' నిపుణుల ' కమిటీ న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించేందుకు తిరస్కరించింది. ఈ విషయం గురించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రధానికి చేసిన విజ్ఞప్తి ని పట్టించుకోలేదు. చివరికది, చెన్నైలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సొంత రిపబ్లిక్ డే పరేడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన శకటంగా సాగింది.

కొన్ని ఇతర విషయాలతోపాటు, ఆ చిత్రాలలో ఉన్న కొందరు వ్యక్తులు "జాతీయ ప్రేక్షకులకు తెలియనివారు" అని కేంద్ర ప్రభుత్వ 'నిపుణుల' కమిటీ చెప్పింది. అక్షయ కృష్ణమూర్తి ఈ అభిప్రాయంతో తీవ్రంగా విభేదించవచ్చు. ఎందుకంటే ఆ చిత్రాలలో ఉన్నవారిలో ఒకరితో తనకు వ్యక్తిగత సంబంధం ఉందని ఆమె నమ్ముతుంది. ఆ వ్యక్తి, వేలు నాచ్చియార్, 1796లో తాను మరణించే వరకు బ్రిటీష్ వారితో పోరాడి, శివగంగైని (ప్రస్తుతం తమిళనాడులోని ఒక జిల్లా) పరిపాలించినవారు.

"11వ తరగతిలో ఉండగా స్కూల్‌లో జరిగిన ఒక నృత్యనాటికలో ప్రధాన పాత్ర అయిన వేలు నాచ్చియార్‌ను పోషించడం నా జీవితంలోని ఒక మలుపు" అని ఆమె అన్నది.

"కానీ అదేదో కేవలం నాట్యం చేయటం, నటించటం మాత్రమే కాదని మీకు తెలుసు," వివరిస్తారు అక్షయ. ఆ పాటలు, వాటి సాహిత్యం ద్వారా 'వీరమంగై' - రాణిని అలా పిలుస్తారు - బలాన్నీ, ధైర్యాన్నీ అక్షయ అర్థం చేసుకున్నది. శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందిన అక్షయ, ఆ ఇంటర్-స్కూల్ పోటీ రోజున తాను అస్వస్థతకు గురయ్యాననీ, ప్రదర్శన ఇవ్వగలనో లేదో తనకే తెలియదనీ గుర్తు చేసుకుంది. అయితే ఆరోజు ఆమె తనకు సాధ్యమైనంత ఉత్తమ ప్రదర్శన ఇచ్చారు.

ప్రదర్శన ముగిసి, స్టేజీ నుంచి కిందికి దిగేటప్పుడు ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఆమెను హాస్పిటల్‌కు తీసుకువెళ్ళి సెలైన్ ఎక్కించారు. "నా చేతికి ఐ.వి. లైన్ వేలాడుతుండగా, నేను బహుమతిని - మాకు ద్వితీయ బహుమతి వచ్చింది - అందుకున్నాను." ఈ సంఘటన తన శక్తిసామర్థ్యాల పట్ల తనకు నమ్మకం కలిగేలా చేసింది. ఆమె మరింత "సాహసిగా మారి" బైక్‌నీ, కారునీ నడపడం నేర్చుకున్నది.

Tamil Nadu's tableau for the Republic Day parade, with Rani Velu Nachiyar (left), among others. The queen is an inspiration for Akshaya Krishnamoorthi
PHOTO • Shabbir Ahmed
Tamil Nadu's tableau for the Republic Day parade, with Rani Velu Nachiyar (left), among others. The queen is an inspiration for Akshaya Krishnamoorthi
PHOTO • Shabbir Ahmed

తమిళనాడు గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఇతరులతో పాటు రాణి వేలు నాచ్చియార్ (ఎడమ) ఉన్న శకటం. అక్షయ కృష్ణమూర్తికి రాణి ఒక ప్రేరణ

అక్షయ తన కుటుంబంలో మొట్టమొదటి పట్టభద్రురాలు. ఇంకా, ఆమె ఒక వ్యవస్థాపకురాలు, ఆవిష్కర్త, ప్రేరణాత్మక వక్త(motivational speaker) కూడా.

ఇదంతా కూడా 21 ఏళ్ళ వయసులోనే!

అక్షయ తమిళనాడులోని ఈరోడ్ జిల్లా, సత్యమంగళం సమీపంలోని తన స్వస్థలమైన అరియప్పంపాళయంలో తన తల్లిదండ్రులు, తమ్ముడు, అత్త, ఒక కుక్క, ఇంకా అనేక పక్షులతో (చిలుకలు) కలిసి నివాసం ఉంటుంది. ఆ రాష్ట్ర పటంలో ఆమె ఊరు ఒక చిన్న చుక్క లాంటిది. ఈ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA) గ్రాడ్యుయేట్, ఏదో ఒక రోజున తన ఊరిని జాతీయ స్థాయికి చేర్చాలని అనుకుంటోంది.

కోయంబత్తూర్, కరూర్, తిరుప్పూర్‌లతో సహా తమిళనాడులోని ఈ మొత్తం ప్రాంతం, కింది స్థాయి నుండి ఆకట్టుకునే వ్యవస్థాపక చరిత్రను కలిగి ఉంది. అక్షయ తల్లిదండ్రులు 10వ తరగతి తర్వాత చదువు మానేసినవారు; వారికి సొంతంగా భూమి కూడా లేదు – ఈ రకంగా చూస్తే అక్షయ పాత సంప్రదాయంలోకి ప్రవేశించిన నవతరం ప్రతినిధి.

అక్టోబర్ 2021లో PARI ఆమెను కలిసినప్పుడు "నా వయస్సు నాకు చాలా అనుకూలమైనది, కాని అదే నాకున్న ప్రతికూలత కూడా" అంటూ నవ్వింది అక్షయ. మేము పసుపు రైతు తిరు మూర్తి పొలాలను సందర్శించిన తర్వాత, అతని ఇంట్లో కూర్చొని టీ తాగుతూ, బజ్జీలు తింటూ కూర్చున్నాము. ఈ సమావేశం చాలా గుర్తుపెట్టుకోదగినది. అక్షయ చిన్నగా కత్తిరించిన జుట్టును తన ముఖం పైనుంచి తప్పిస్తూ, తన పెద్దవైన అందమైన కలలను గురించి వివరిస్తుంది.

ఆమెకు ఇష్టమైన కోట్(quote) కూడా దాని గురించే: "ఈ రోజు నిజం చేయడం ద్వారా మీ కలను జీవించండి." ఆమె వివిధ కళాశాలలలో ఇచ్చే ప్రేరణాత్మక ప్రసంగాలలో ఈ కోట్‌ను ఉపయోగిస్తుంది. ఆమె తన బ్రాండ్ పేరును 'సురుక్కుపై ఫుడ్స్' అని పెట్టడం ద్వారా ఆ కోట్‌ను తన జీవితంలోనూ వ్యాపారంలో కూడా ఉపయోగించింది. సురుక్కుపై అంటే తెలుగులో చిక్కం (తాళ్ళు లాగి బిగించి కట్టే చిన్న సంచి. అందులో డబ్బులు దాచుకుంటారు. పల్లెటూళ్ళలో మహిళలు దానిని నడుముకు దోపుకుంటారు) అని అర్థం. తమిళంలో అది గతం తాలూకు జ్ఞాపకాన్నీ, పొదుపునూ, స్థిరత్వాన్నీ ఒకేసారి సంగ్రహించే పదబంధం.

సొంతంగా ఏదైనా చేయాలనే తపన ఆమెలో ఊహించనిదేం కాదు. “నేనూ నా స్నేహితులూ ఉళియిన్ ఉరువం ట్రస్ట్‌ని - శిల్పి యొక్క ఉలి పేరుమీద- మేం కళాశాలలో ఉన్నప్పుడు ప్రారంభించాము. ఇది మాలాంటి చిన్న పట్టణాల నుండి వచ్చినవారు జీవితంలో ముందుకు నడవడానికి సహాయపడేందుకు, విద్యార్థుల నేతృత్వంలో నడపబడే ఒక సంస్థ. 2025 సంవత్సరం నాటికి 2,025 మంది నాయకులను సృష్టించడమే మా లక్ష్యం." ఆశయం పెద్దదే, అయితే, అక్షయ అంటే అదే మరి.

Akshaya in Thiru Murthy's farm in Sathyamangalam. She repackages and resells the turmeric he grows
PHOTO • M. Palani Kumar

సత్యమంగళంలో ఉన్న తిరుమూర్తి పొలంలో అక్షయ . అతను పండించిన పసుపును ఆమె మళ్లీ ప్యాకేజ్ చేసి అమ్ముతుంది

సరిగ్గా ఆమె గ్రాడ్యుయేషన్‌కు ముందు, తానొక వ్యాపారవేత్త కావాలనుకుంటున్నానని ఆమె తెలుసుకున్నప్పుడే, దేశవ్యాప్తంగా మార్చి 2020లో ప్రారంభమైన లాక్‌డౌన్ ఆమె అవకాశాలను తీవ్రంగా పరిమితం చేసింది. ఆ సమయంలోనే ఆమె సత్యమంగళం సమీపంలోని ఉప్పుపళ్ళం కుగ్రామానికి చెందిన సేంద్రియ రైతు తిరుమూర్తిని కలిశారు. అతను ఆమె తల్లిదండ్రుల గృహోపకరణాల దుకాణానికి కస్టమర్, ఇంకా వారికి పాత స్నేహితుడు కూడా. "అప్పాకు [తండ్రి] రేడియో-క్యాసెట్ దుకాణం ఉన్నప్పటి నుండి వారు ఒకరికొకరు తెలుసు" అని అక్షయ గుర్తుచేసుకున్నారు.

ఆమె 'అంకుల్ ' అని పిలుచుకునే తిరు, తన పంటకు తగిన విలువను జోడించి, నేరుగా కస్టమర్‌కు విక్రయించడంద్వారా లాభదాయకమైన పసుపు వ్యాపారాన్ని నడుపుతున్నారు.  ఆయన ఉత్పత్తులను రీప్యాకేజ్ చేసి మళ్లీ విక్రయించవచ్చునని అక్షయ భావించారు. అందుకు ఆయన ప్రతిస్పందన ప్రోత్సాహకరంగా ఉంది: “ ఎడుత్తు పణ్ణుంగ ” (దీన్ని తీసుకొని చేయండి) అన్నారు. "అంకుల్ చాలా సానుకూలంగా ఉన్నారు," అక్షయ నవ్వింది. ఆవిధంగా సురుక్కుపై ఫుడ్స్ పుట్టింది.

ఆమె తన కొత్త కంపెనీతో కలిసి వెళ్లిన మొదటి ప్రదర్శన చాలా ఆశాజనకంగా జరిగింది. Tan Food '21 Expo  అనే పేరున్న ఈ ప్రదర్శన, ఫిబ్రవరి 2021లో మదురైలో జరిగిన ఒక గొప్ప కార్యక్రమం. ఆమె స్టాల్‌ని రెండు వేలమందికి పైగా ప్రజలు సందర్శించారు. బ్రాండింగ్, ప్యాకేజింగ్ ఎంత ముఖ్యమైనవో సందర్శకుల ఫీడ్‌బ్యాక్ ద్వారా, ఆ తరువాత మార్కెట్ పరిశోధన ద్వారా ఆమె అర్థం చేసుకున్నది.

"కస్టమర్‌లు మా బ్రాండ్ పేరుతో ఒక వ్యక్తిగత అనుబంధాన్ని కలిగి ఉన్నారు," అని అక్షయ చెప్పింది. "అంతేకాకుండా ఇది వినూత్నమైనది. అప్పటి వరకు పసుపును ప్లాస్టిక్ ప్యాకెట్లలో మాత్రమే విక్రయించేవారు. పేపర్ సాచెట్‌లలో గానీ, సురుక్కుపై(చిక్కం)లలో గానీ ప్యాక్ చేసి అమ్మటం ఎవరూ చూడలేదు!" FMCG మేజర్‌లకు గానీ, బొతిక్ ఆర్గానిక్ స్టోర్‌లకు గానీ ఆమెకు వచ్చిన ఈ సాధారణ ఆలోచన రాలేదు. ఆమె ఒక విజేత. అలాగే ఆమె మరింత విజయాన్ని పొందాలని కోరుకుంటున్నది.

తన వ్యాపారాన్ని పెంపొందించుకోవడానికి, ఆమె చాలామంది వ్యక్తుల, సంస్థల సలహాలను తీసుకున్నది. పోతన్ సూపర్ ఫుడ్స్‌కు చెందిన డాక్టర్ ఎం. నాచ్చిముత్తు,  షణ్ముగ సుందరం ఆమె మెంటార్లు. మదురై అగ్రి బిజినెస్ ఇంక్యుబేషన్ ఫోరమ్ (MABIF) ఆమెకు ట్రేడ్‌మార్క్‌నూ, FSSAI ధృవీకరణనూ పొందడంలో సహాయపడింది. అక్షయ తనకు వీలైనప్పుడల్లా స్వయం సహాయక (సెల్ఫ్-హెల్ప్) పుస్తకాలను చదువుతారు. వాటిలో ఒకటి: యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్.

Akshaya's Surukupai Foods products on display in Akshaya Home Appliances, the store owned by her parents
PHOTO • M. Palani Kumar

అక్షయ తల్లిదండ్రులకు చెందిన అక్షయ గృహోపకరణాల స్టోర్‌లో ప్రదర్శనలో ఉన్న సురుక్కుపై ఫుడ్స్ ఉత్పత్తులు

"నా బిబిఎ కోర్సు నాకు వ్యాపారాన్ని ప్రారంభించడానికీ, దాన్ని నడపడానికీ అవసరమైన పరిజ్ఞానాన్ని కానీ ఎక్స్‌పోజర్‌ని కానీ ఇవ్వలేదు,” అన్నారామె. విద్యావ్యవస్థతో ఆమెకు పెద్ద పేచీనే ఉంది. “బ్యాంకు లావాదేవీలు జరిపేందుకు అవసరమైన ప్రాథమిక జ్ఞానాన్ని కళాశాలల్లో పిల్లలకు ఎందుకు నేర్పరు? బిబిఎలో అయితే, బ్యాంక్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలో- దాని గురించి? డిపార్ట్‌మెంట్ అధిపతికీ, ఉపాధ్యాయులకూ కూడా వాస్తవ ప్రపంచ అనుభవం ఎందుకు లేదు?”

ఆమె తానే స్వయంగా ఆ ఖాళీలను పూడ్చదలచుకున్నారు. "నేను నేర్చుకోవలసింది చాలా ఉంది."

దీన్ని సమర్థవంతంగా చేయడానికి, ఆమె ప్రతిరోజూ చేయవలసిన పనుల జాబితాను రాసుకుంటారు. ఏ పనైనా పూర్తికాగానే దాన్ని ఆ జాబితా నుంచి కొట్టివేస్తుంది. “నేను ఒక చిన్న డైరీలో చేయాల్సిన పనులగురించి రాసుకుంటాను. రోజు పూర్తయేలోపు ఆ రోజు చేయాల్సిన పనిని కాబితాలోంచి కొట్టివేయకపోతే, పూర్తిచేయటం కోసం దాన్ని మళ్లీ గుర్తు పెట్టుకుంటాను." ఇలా పనిని పూర్తిచేయలేకపోవటం ఆమెలో "అపరాధ భావనను" కలిగిస్తుంది; అందుకోసం ఆమె మరింత కష్టపడుతుంది.

ఆమె ప్రయత్నాలు ఫలించి, ఆమె పోస్ట్-గ్రాడ్యుయేషన్ మూడు సెమిస్టర్లు పూర్తిచేసేందుకు ఉపయోగపడ్డాయి. ఆమె కోర్సు ఎంపిక కూడా ఆసక్తికరంగా ఉంటుంది. “నేను దూరవిద్య ద్వారా సోషల్ వర్క్‌లో మాస్టర్స్ చేస్తున్నాను. ఒక్కో సెమిస్టర్‌కి ఫీజు 10,000 రూపాయలు. పరీక్ష ఫీజు మరో 5,000. మొదట్లో అప్పా నాకు 5 వేలు ఇచ్చేవారు. మిగిలినదంతా నా స్వంత డబ్బు,” ఒక నిశ్చల సంతుష్టి నిండిన స్వరంతో ఆమె వివరించారు. ఆమె 10,000 పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించగా వచ్చిన 40,000 రూపాయల లాభం నుండి ఆ 'మిగిలినది' వచ్చింది.

ఆమె ఉత్పత్తులను కస్టమర్లు 'పెద్ద మొత్తం(బల్క్)'లో కొనుగోలు చేస్తారు. ఆమె కస్టమర్ల కోసం ఎంపిక చేసుకునే అవకాశాలను సులువుచేశారు. ఇప్పుడు ఆమె ఉత్పత్తులలో ఎక్కువగా అమ్ముడుపోతున్న వస్తువు- పూర్తి ఆర్గానిక్ పసుపు ఉత్పత్తులను కలిగిన వివాహ ఆహ్వాన బహుమతి హేంపర్. ఇప్పటివరకూ ఇలా అందిస్తున్నది తానే మొదటిదనీ, ఇప్పటి వరకు మరొకరు ఇటువంటి పని ఇంకా మొదలపెట్టలేదని, ఆమె నమ్మకం. “నేను వాటి ధరను 50 నుండి 100 రూపాయల వరకు పెడతాను. ప్రతి హేంపర్‌లో ఒక సురుక్కుపై(చిక్కం), పసుపు పొడి ప్యాకెట్‌లు, 5-గ్రాముల విత్తనాల ప్యాకెట్‌లు (స్థానిక రకాలైన వంకాయ, టొమాటో, బెండకాయ,  మిరపకాయలు, పాలకూర), 'థాంక్యూ' కార్డు ఉంటాయి.”

“ప్రజలు తమ బంధువులను, స్నేహితులను వివాహానికి ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు, ఆహ్వానపత్రికతో పాటు ఈ హేంపర్‌ని కూడా అందజేస్తారు. ఇది శుభప్రదమైనది, ఆరోగ్యకరమైనది, భూమికి అనుకూలమైనది కూడా,” అని అక్షయ చెప్పారు. ఆమె క్లయింట్లు ఫాన్సీ హేంపర్‌ని కోరుకుంటే, అందుకు డబ్బు చెల్లించడానికి వారు సిద్ధంగా ఉంటే, అప్పుడామె సొగసైన గాజు సీసాలలో పెద్ద మొత్తంలో పసుపు పొడిని ప్యాక్ చేసిస్తారు. కొన్ని వివాహాల కోసం ఈ పెద్ద ప్యాకేజీని ఆమె సరఫరా చేశారు; అలా ఆ నోటా ఈ నోటా పడి జరిగిన ప్రచారం వలన ఆమెకు మరిన్ని ఆర్డర్‌లు వచ్చాయి. " ఇటీవలేహేంపర్ ఒక్కొక్కటి 400 రూపాయల చొప్పున 200 హేంపర్లు ఆర్డర్ వచ్చాయి."

Left: Akshaya with a surukupai, or drawstring pouch, made of cotton cloth. Right: The Surukupai Foods product range
PHOTO • M. Palani Kumar
Left: Akshaya with a surukupai, or drawstring pouch, made of cotton cloth. Right: The Surukupai Foods product range
PHOTO • M. Palani Kumar

ఎడమవైపు : కాటన్ బట్టతో తయారు చేయబడిన సురుక్కుపైతో అక్షయ . కుడివైపు : సురుక్కుపై ఫుడ్స్ ఉత్పత్తి శ్రేణి

నేను సత్యమంగళం సందర్శించిన కొన్ని నెలల తర్వాత, అక్షయా నేనూ ఫోన్‌లో కబుర్లు చెప్పుకుంటుండగా, మధ్యలోనే "బ్యాంక్ మేనేజర్ నన్ను పిలుస్తున్నారు." అంటూ అక్షయ కాల్ కట్‌చేసింది. ఒక గంట తర్వాత వచ్చి, ఇన్‌స్పెక్షన్ కోసం వచ్చారు, అంటూ ఆమె వివరించింది. ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు నుండి ఆమెకు రూ. 10 లక్షలు రుణం మంజూరైంది. దాని కోసం ఆమె స్వయంగా దరఖాస్తు చేసి, కావలసిన అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసి; ఎటువంటి తాకట్టు లేకుండా తొమ్మిది శాతం వడ్డీకి ఆ రుణాన్ని పొందింది. బ్యాంకు ఇచ్చిన ఆ రుణాన్ని ఉపయోగించి ఆమె పసుపును మెత్తగా పొడిచేసి, పరిశుభ్రంగా ప్యాక్ చేసే యంత్రంతో ఒక పసుపు యూనిట్‌ని నెలకొల్పారు. ఆమె త్వరత్వరగా పైకెదగాలని కోరుకుంటున్నారు.

“నా దగ్గర ఒక టన్ను పసుపు పొడి కోసం ఆర్డర్ ఉంది. అందుకని నేను వ్యాపారుల నుండి వాణిజ్య పసుపును కొన్నాను,” అని ఆమె చెప్పారు. యంత్రమే గమ్మత్తైనది. “నేను కాలేజీలో ఉండగా ప్రకటనలు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాను. పూర్తి ఆటోమేటిక్ యంత్రాలలో సెన్సర్ల గురించీ, పేపర్ లాగడం, రోల్‌ను యంత్రంలో పెట్టడం గురించీ నాకు ఏమీ తెలియదు. ఆ పని సరిగ్గా చేయకపోతే, ఆ బ్యాచ్ పసుపు తయారీ వృధా అయిపోతుంది."

ఆమె పొరపాటు జరగగలిగే అవకాశం ఉన్న అనేక విషయాల జాబితాను తయారుచేస్తారు; జరిగే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుంటే, అలా చేయటం సరైనదేనని నమ్ముతారు. మెషీన్‌ను నడిపేందుకు ఆమె ఇద్దరు పార్ట్‌టైమ్ సహాయకులను నియమించుకున్నారు. ఆ మెషీన్‌ని ఉపయోగించి సమీప భవిష్యత్తులో నెలకు రూ. 2 లక్షల టర్నోవర్‌ను సాధించగలనని ఆమె నమ్ముతున్నారు. అంటే, ఆమె కళాశాలలో డిగ్రీ చదివేటప్పుడు చూసిన వాటి కంటే చాలా ఎక్కువ లాభాలన్నట్టు.

అయినప్పటికీ, అక్షయ చేస్తున్నది వ్యక్తిగత ప్రయోజనాలకు మించినది. ఆమె ప్రయత్నం, సాధారణంగా పురుషుల నియంత్రణలో లేదా కార్పొరేట్ల ఆధిపత్యంలో ఉన్న అగ్రి-బిజినెస్ గొలుసు సంస్థల పారంపరిక నిర్మాణాలను కిందమీదయేలా చేస్తుంది.

"పసుపు ప్రాసెసింగ్ పని అత్యంత స్థానిక స్థాయిలో జరుగుతుంది, ఇది పంట పండించే ప్రదేశానికి ప్రక్కనే ఉంది, ఇది చాలా గొప్ప సంగతి," అని కృషి జనని (లాభదాయక పునరుత్పత్తి వ్యవసాయ జీవావరణం కోసం పనిచేసే సామాజిక సంస్థ; గాంగేయం అనే చోట ఉంది.) వ్యవస్థాపక CEO ఉషాదేవి వెంకటాచలం చెప్పారు. “అంతేకాదు, అగ్రి-ప్రాసెసింగ్ కంపెనీల్లో ముందు వరుసలో పనిచేసే యువతులు ఎక్కువమంది లేరు. యాంత్రీకరణ, కేంద్రీకరణల పేరుతో ప్రత్యేకించి పంట చేతికివచ్చిన తర్వాతి ప్రక్రియలో, మహిళల పాత్ర నెమ్మదిగా తోసివేయబడుతోంది."

ఉష ఇంకా ఇలా అంటారు: ఆహార సరఫరా గొలుసు సంస్థలతో ఉన్న సమస్యల్లో ఒకటేమిటంటే, “అవి చాలా కేంద్రీకృతమై ఉండటమే కాక, ప్రాసెసింగ్‌లో చాలా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటాయి. ఉదా: అమెరికాలో పండించిన ఆపిల్‌ పళ్ళు భారతదేశంలో వినియోగానికి వెళ్లేముందు పాలిషింగ్ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్తాయి. మహమ్మారి అనంతర ప్రపంచంలో ఈ పద్ధతి భరించరానిది. వాతావరణ సంక్షోభానికి ఈ రవాణా ఎంతవరకు కారణమవుతుందో ఆలోచించిస్తే, ఇది మరింత తీవ్రమైనది." ఉదాహరణకు శక్తి, ఇంధనాల వినియోగంలో ఇదే జరుగుతుంది.

The biodegradable sachets in which Akshaya sells turmeric under her Surukupai Foods brand. She says she learnt the importance of branding and packaging early in her entrepreneurial journey
PHOTO • Akshaya Krishnamoorthi
The biodegradable sachets in which Akshaya sells turmeric under her Surukupai Foods brand. She says she learnt the importance of branding and packaging early in her entrepreneurial journey
PHOTO • Akshaya Krishnamoorthi
The biodegradable sachets in which Akshaya sells turmeric under her Surukupai Foods brand. She says she learnt the importance of branding and packaging early in her entrepreneurial journey
PHOTO • Akshaya Krishnamoorthi

అక్షయ తన సురుక్కుపై ఫుడ్స్ బ్రాండ్ క్రింద పసుపును విక్రయిస్తున్న బయోడిగ్రేడబుల్ సాచెట్ లు . తన వ్యవస్థాపక ప్రయాణం ప్రారంభంలోనే బ్రాండింగ్ , ప్యాకేజింగ్ ప్రాముఖ్యతను తాను నేర్చుకున్నానని ఆమె చెప్పారు

అక్షయ దీర్ఘకాలిక ప్రణాళికలు వాటన్నింటినీ పరిష్కరించకపోవచ్చు. అయితే కనీసం స్థానికంగానైనా మరింత ముందుకు వెళ్లవచ్చునని ఆమె భావిస్తున్నప్పటికీ, పసుపుతో చాక్లెట్లు, పసుపు చిప్స్ తయారు చేయాలనే ఆమె ఆలోచన సంప్రదాయ మార్కెట్‌కు భంగం కలిగించడం మాత్రం ఖాయం. .

‘ఇది తనకంటూ ఒక ప్రత్యేకత కలిగిన వస్తువు, రుచి కూడా తెచ్చిపెట్టినది అవుతుంది కదా,’ అని నేను అడిగినప్పుడు, "దీన్ని స్వీకరించేవారు కూడా ఉంటారని నేను భావిస్తున్నాను," అని ఆమె నాకు చెప్పారు. “ప్రజలు పెప్సీ, కోక్ తాగుతారు. వారికి నన్నారి షర్బత్, పనీర్ సోడా కూడా ఇష్టం. అలాగే పసుపు ఉత్పత్తులు కూడా, ఇవి ఊపందుకుంటాయి. ఆరోగ్యానికి మంచివి కూడా." అని ఆమె నొక్కిచెప్పారు.

2025 నాటికి గ్రామీణ మార్కెట్లలో విస్తృతంగా వస్తుందని అంచనా వేయబడిన బూమ్‌ని పట్టుకోవడం ఆమె లక్ష్యం." అందుకోసం ఉత్పత్తుల ధరలు అందుబాటులో ఉండాలి, చిన్న మొత్తాలలోనూ ఉండాలి. పెద్ద మొత్తంలో ఉండే సేంద్రీయ పసుపు ప్యాకెట్లు ఖరీదైనవి - 250-గ్రాముల ప్యాకెట్ ధర 165 రూపాయలు ఉంటుంది. అందుకని నేను దీన్ని ఒకసారికి ఉపయోగించే ప్యాకెట్‌గా రూపొందించాను.”

'అది' తన తల్లిదండ్రుల దుకాణంలో ఉన్న సురుక్కుపై ప్యాకెట్. అందులో ఒక్కొక్కటీ 6 గ్రాముల బరువుండే పసుపు ఫేస్ ప్యాక్‌ల పేపర్ సాచెట్‌లు 12 ఉన్నాయి. "కస్టమర్లు ఈ సెట్‌ను 120 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు; లేదా వారు ఒక్కొక్క సాచెట్‌లను కేవలం 10 రూపాయలకే తీసుకోవచ్చు." పెద్ద పౌచ్ ముతక కాటన్ బట్టతో తయారు చేయబడింది. సాచెట్‌లు బయోడిగ్రేడబుల్‌గా (పర్యావరణానికి నష్టం కలిగించని బాక్టీరియా ద్వారా నశించిపోయేవి) ఉంటాయి; తేమ స్థాయిలను నియంత్రించడానికి చాలా పలుచని ప్లాస్టిక్ పొరలతో కప్పబడిన కాగితంతో వీటిని తయారుచేస్తారు.

వాటిని సూత్రీకరణ చేసి తయాచేసేది తిరుమూర్తి. తెల్లటి లేబులింగ్ అక్షయ చేస్తారు. ఆమె వాటి ప్రయోజనాల జాబితాను ఇలా ఏకరువు పెడతారు: "ఇది వృధాను తగ్గిస్తుంది, తేమను కోల్పోనివ్వదు. ధర కేవలం 10 రూపాయలే కాబట్టి, కస్టమర్‌లు దీనిని ప్రయత్నించవచ్చు." ఇలా ఆమె ఆగకుండా మాట్లాడుతూనే ఉంటుంది. "నాకెప్పుడూ శక్తి ఉంటుంది," అంటూ ఆమె నవ్వేస్తారు.

ఆమెకు తల్లిదండ్రుల మద్దతు కూడా ఉంది. వారి మధ్యస్థాయి గృహోపకరణాల దుకాణాలే (వారికి రెండు అవుట్‌లెట్‌లు ఉన్నాయి) ఆమె ఉత్పత్తులను మార్కెట్ చేసే మొదటి ప్రదేశాలు. ఆమె తన స్వంత వెంచర్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నప్పుడు చేసినట్లే, వారు ఆమె నిర్ణయాలను, ఆమె మార్గదర్శకత్వాన్ని గౌరవించారు.

“I always have energy,” she says, laughing
PHOTO • M. Palani Kumar

'నాకెప్పుడూ శక్తి ఉంటుంది,' ఆమె నవ్వుతూ చెప్పింది

కొన్నేళ్ల క్రితం ఆమె తన కుటుంబ దైవం ముందు గుండుచేయించుకున్నప్పుడు, చాలామంది దాన్ని వ్యతిరేకిస్తూ మాటలన్నారు. అయితే తల్లిదండ్రులు ఆమెకు అండగా నిలిచారు, ఆమె అందంగా ఉందని వాళ్ళన్నారు. “నేను తరచూ అనారోగ్యం పాలవుతున్నందున అలా చేశాను. నేను నా జుట్టును క్యాన్సర్ పేషెంట్లకు దానం చేయడానికి ఇష్టపడతాను, కానీ అప్పుడలా చేయలేకపోయాను. జుట్టు తీసేయడం నాకు ఆత్మవిశ్వాసాన్నిచ్చింది,” అని ఆమె అన్నారు. “నా గుర్తింపు నా జుట్టుతో ముడిపడి లేదని నేను గ్రహించాను. ఏదెలావున్నా నా తల్లిదండ్రులు నన్ను ప్రేమిస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను."

ఇంకా, వారు ఆమె కలలకు బాసటగా నిలుస్తారు. ఆమె అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో ఉన్నప్పుడు ఆమెతోపాటు చదివిన 60 మంది అమ్మాయిలలో ఇప్పుడు చాలామంది వివాహితులు. “లాక్‌డౌన్ కారణంగా, తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్ళి చేసి పంపేశారు. వాళ్ళలో కొందరు పనికి వెళతారు. ఇంకెవరూ వ్యాపారం చేయటంలేదు."

అక్షయ విజయం ఈ పరిస్థితిని మార్చగలదని ఉషాదేవి వెంకటాచలం అభిప్రాయపడ్డారు. "ఈ ప్రాంతంలో జన్మించిన ఒక యువతి దేశీయంగానే కాక, ప్రపంచ ఆశయాలతో స్థానికంగా ఒక ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం అనేది దానికదే స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇది ఇతరులకు, ముఖ్యంగా తన తోటివారికి, మంచి ఐడియాలను ఇస్తుంది." అని ఆమె అభిప్రాయపడ్డారు.

అక్షయకైతే తర్వాతి లక్ష్యం, ఎంబిఎ. “చాలా మంది అది చేశాక వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. నేను దీనికి విరుద్ధంగా చేస్తున్నాను." ఎంబిఎ చేయటం తనకు ఉపయోగకరంగా ఉంటుందని ఆమె నమ్ముతున్నారు. తన స్వగ్రామంలోనే ఉండాలనీ, ఇక్కడనుండే తన బ్రాండ్‌ను ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఆమెకు సొంత వెబ్‌సైట్ ఉంది, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ, లింక్డ్‌ఇన్‌లోనూ ఉన్నారు. వంటకాల తయారీ విధానాలను పోస్ట్ చేస్తారు, హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తారు (#turmericlatte అనే పదాన్ని తిరిగి పొందడం), FPOలతోనూ ఎగుమతిదారులతోనూ అనుసంధానం కావాలనుకుంటున్నారు. పొలం, మార్కెట్, ఇల్లు- వీటి మధ్య ఉండే కీలకమైన అంతరాలను సమర్థవంతంగా పూరిస్తూ, "రైతులు తమ పొలాలను చూసుకోవచ్చు, నాలాంటివారు ఆ ఉత్పత్తుల అమ్మకంలో పాల్గొనవచ్చు" అని ఆమె చెప్పారు.

"ఈ రోజుల్లో, అంతా కథ చెప్పడం గురించే," ఆమె దృఢంగా చెప్పారు. "కస్టమర్‌లు నా ప్యాకేజింగ్‌ను వారి ఇంట్లో ఉంచుకున్నప్పుడు - వారు డబ్బును దాచుకోవడానికి నా సురుక్కుమై(చిక్కం)ని ఉపయోగిస్తే - వారు మా బ్రాండ్‌ను గుర్తుంచుకుంటారు, గుర్తుకు తెచ్చుకుని మరీ మళ్ళీ మళ్ళీ కొనుగోలు చేస్తారు." "క్రమంగా, తమిళనాడు పసుపు ఎల్లలు దాటి వెళుతుంది.

ఈ పరిశోధనా అధ్యయనానికి అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం తన పరిశోధనా నిధుల కార్యక్రమం 2020లో భాగంగా నిధులు సమకూరుస్తుంది.

కవర్ ఫోటో: ఎం. పళని కుమార్

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Aparna Karthikeyan

Aparna Karthikeyan is an independent journalist, author and Senior Fellow, PARI. Her non-fiction book 'Nine Rupees an Hour' documents the disappearing livelihoods of Tamil Nadu. She has written five books for children. Aparna lives in Chennai with her family and dogs.

Other stories by Aparna Karthikeyan
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli