జంబో పాదముద్రల కోసం కొండలూ పొలాల చుట్టూ తిరుగుతున్నాం.

భోజనం పళ్ళేల కంటే పెద్దవీ, మెత్తని నేలమీద లోతుగా పాతుకున్న పాద ముద్రలు మాకు పుష్కలంగా కనిపించాయి. పాతవి మెల్లగా మాసిపోతున్నాయి. కొందరు ఆ జంతువు చేసిన పనిని ఎత్తిచూపుతారు: కాస్త తీరుబాటు నడక, మంచి భోజనం, బోలెడంత పేడ. అది విసిరికొట్టిన వస్తువుల జాడ: రాతి స్తంభాలు, వైరు కంచెలు, చెట్లు, గేట్లు…

మేం ఏనుగుతో ముడిపడివున్న ప్రతిదాన్నీ ఫోటో తీయడానికి ఆగిపోతున్నాం. పాదముద్రల ఫోటోనొకదాన్ని నేను నా ఎడిటర్‌కి పంపాను. "అక్కడ ఏనుగు ఉందా?" అని ఆయన ఆశగా అడుగుతూ జవాబిచ్చారు. ఆయన ఆశలు అడియాసలు కావాలని ప్రార్థిస్తున్నాను.

ఎందుకంటే, నేను విన్నదాని ప్రకారం కృష్ణగిరి జిల్లా గంగనహళ్లి కుగ్రామంలో, ఏనుగులు అరటిపండ్లు తిని తలపై దీవెనలు కురిపించే అవకాశం తక్కువ. అలా చేయటం గుడి ఏనుగుల అలవాటు కావచ్చు. ఇవి వాటి అడవి దాయాదులు. సాధారణంగా ఆకలితో ఉంటాయి.

డిసెంబర్‌ 2021లో తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని రాగులు పండించే రైతులను కలవడానికి నేను చేసిన యాత్ర, అనుకోకుండా నన్ను ఏనుగుల దారిలోకి నడిపించింది. వ్యవసాయ ఆర్థికశాస్త్రం గురించి చర్చలు ఉంటాయని నేను అనుకున్నాను. ఖచ్చితంగా కొన్నైతే ఉన్నాయి. కానీ చాలావరకూ, పొలం తర్వాత పొలంలో, వారు తమ ఇళ్లలో వాడకానికి మాత్రమే సరిపడేలా రాగుల ను (ఫింగర్ మిల్లెట్) పండించడానికి కారణం ఏనుగులే అని నేను విన్నాను. చాలా తక్కువ ధర పలకడం (లాభం లేదా నష్టం లేని స్థితిలో ఉంచే 35 నుండి 37 రూపాయలకు బదులుగా, కిలో 25 నుండి 27 రూపాయల ధర ఉండటం), వాతావరణ మార్పులు, అసాధారణమైన భారీ వర్షాల మధ్య రైతులు ఇబ్బంది పడుతున్నారు. వీటికి తోడు ఏనుగుల తొండాలూ, దంతాలూ. ఇవే దాదాపుగా, రైతుల వెన్ను విరిచిన అతి పెద్ద విషయాలు.

“ఏనుగులకు చాలా ప్రతిభ ఉంటుంది. తీగల తాళ్ళను కిందికి వంచి, తీగ కంచెలను ఎలా దాటుకోవాలో అవి నేర్చుకున్నాయి. విద్యుత్ కంచెలపై చెట్లను ప్రయోగించి షార్ట్ సర్క్యూట్ అయ్యేలా చేయటం వాటి తెలుసు,” అని ఆనందరాము రెడ్డి వివరించారు. "అవి ఎప్పుడూ మంద కోసం వెతుక్కుంటుంటాయి." అన్నారాయన. ఆనంద - అని అందరూ పిలిచే ఈయన తేన్కనికోట్టై తాలూకా లోని వడ్ర పాళైయమ్‌కు చెందిన ఒక రైతు . మేలగిరి రిజర్వ్ ఫారెస్ట్ అంచుల వరకు ఆయన మమ్మల్ని నడిపించారు. అది ఉత్తర కావేరి వన్యప్రాణుల అభయారణ్యం లో ఒక భాగం.

The large footprint of an elephant.
PHOTO • M. Palani Kumar
Damage left behind by elephants raiding the fields for food in Krishnagiri district
PHOTO • M. Palani Kumar

ఎడమ: ఏనుగు పెద్ద పాదముద్ర. కుడి: కృష్ణగిరి జిల్లాలో ఆహారం కోసం పొలాలపై ఏనుగులు దాడి చేయడంతో నష్టం వాటిల్లింది

ఏళ్ల తరబడి ఏనుగులు అడవిలోంచి బయటికి వచ్చి పొలాల్లో సంచరిస్తూనే ఉన్నాయి. దళసరి చర్మం కలిగిన ఈ జీవులు గుంపులు గుంపులుగా గ్రామాల్లోకి దిగివచ్చి, పొలాల్లో ఉన్న రాగుల పంటలో ఎక్కువ భాగాన్ని తినేసి, మిగిలిన పంటను తొక్కేస్తాయి. ఇది రైతులను టమోటాలు, బంతి పువ్వులు, గులాబీలు వంటి మార్కెట్ ఉండి, ఏనుగులు తినడానికి ఇష్టపడవని వారు నమ్మే ప్రత్యామ్నాయ పంటల గురించి ఆలోచించేలా చేసింది. “2018-19లో ఇక్కడ విద్యుత్ కంచె వేసిన తర్వాత, మంద బయటకు రాలేదు. కానీ మగ ఏనుగులను ఏదీ ఆపలేదు." అని ఆయన నాకు హామీ ఇస్తున్నట్టుగా అన్నారు. "మొట్టైవాల్, మఖానా, గిరి... వాటి ఆకలి వాటిని బయటకు పంపి మా పొలాల్లోకి నెట్టేస్తుంది.”

"అడవి నాణ్యత, మానవుల-ఏనుగుల మధ్య సంఘర్షణకు ప్రధాన కారణాలలో ఒకటి" అని ఎస్.ఆర్. సంజీవ్ కుమార్ అన్నారు. ఈయన తమిళనాడులోని కృష్ణగిరి, ధర్మపురి జిల్లాలలోని వన్యప్రాణుల గౌరవ సంరక్షకుడు. ఒక్క కృష్ణగిరిలోనే విపరీతంగా దాదాపు 330 గ్రామాలు ఈ సమస్యతో బాధపడుతున్నాయని ఆయన అంచనా.

నేను ఈ ప్రాంతాన్ని సందర్శించిన కొద్దిసేపటికే, వన్యప్రాణి సంరక్షణ స్వచ్ఛంద సంస్థ అయిన కెన్నెత్ ఆండర్సన్ నేచర్ సొసైటీ (కె ఎ ఎన్ఎస్) వ్యవస్థాపక సభ్యుడూ, పూర్వ అధ్యక్షుడు కూడా అయిన సంజీవ్ కుమార్, జూమ్ కాల్ ద్వారా ఒక ప్రదర్శనను నాతో పంచుకున్నారు. ఏనుగు ఆకారంలో ఉన్న నలుపు రంగు చుక్కలతో తెరపై కనిపిస్తోన్న ఆ చిత్రం అద్భుతంగా ఉంది. “ప్రతి చుక్కా సంఘర్షణ జరిగే గ్రామాన్ని సూచిస్తుంది. పంట నష్టం జరిగిన ప్రదేశాలనుంచి ఈ డేటాను సేకరించాం,” అని ఆయన చెప్పారు.

ఈశాన్య రుతుపవనాల ప్రవేశం తర్వాత, పంటలు కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఏనుగులు దాడి చేస్తాయి. “సంవత్సరానికి 12 లేదా 13 (కృష్ణగిరి జిల్లాలో) మానవ మరణాలు కూడా ఉంటాయి. ఇవి డిసెంబర్, జనవరి నెలల మధ్య మరింత ఎక్కువగా ఉంటాయి- అంటే, సాధారణంగా, రాగుల పంటను కోసే సమయంలో.” ఏనుగులు కూడా చనిపోతాయి. "ప్రతీకార చర్యల వలన. రైల్వే లైన్ల మీద, హైవేల మీద, తెరచివున్న బావులలో పడినప్పుడు జరిగే ప్రమాదాల వలన. అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్తీగలు తగిలినపుడు అవి కూడా విద్యుదాఘాతానికి గురవుతాయి.”

ఏనుగులు 100 రకాల మొక్కలను తింటాయని సంజీవ్ వివరించారు. “అవి మొక్కలోని అనేక భాగాలను తింటాయి. బందీలుగా చిక్కిన ఏనుగులను పరిశీలించినపుడు, అవి 200 కిలోల గడ్డి తింటాయనీ, 200 లీటర్ల నీరు తాగుతాయనీ మనకు తెలుస్తుంది." కానీ, "అడవిలో, ఒక సీజన్ నుండి మరో సీజన్ వరకు వాటి తిండి పరిమాణం చాలా మారుతూ ఉంటుంది. అలాగే వాటి శరీర పరిస్థితి కూడా." అని ఆయన ఎత్తి చూపారు.

In this photo from 2019, Mottai Vaal is seen crossing the elephant fence while the younger Makhna watches from behind
PHOTO • S.R. Sanjeev Kumar

2019 నాటి ఫోటోలో , మొట్టైవాల్ ఏనుగు కంచెను దాటుతున్నట్లు కనిపిస్తుండగా , చిన్న మఖానా వెనుక నుండి చూస్తోంది

అంతేకాకుండా, లాంటానా కమెరా(తెలుగులో పులికంప, తలంబ్రాల మొక్క అంటారు) అనే ఒక చొరబాటు గుణం కలిగి, అడవికి పరిచయం చేయబడ్డ పూలుపూసే మొక్క ఇప్పుడు "హోసూర్ ప్రాంతంలోని 85 నుండి 90 శాతం అటవీ ప్రాంతాన్ని" ఆక్రమించి ఉంది. ఇది ఒక గట్టి కాండం కలిగిన మొక్క. మేకలు, ఆవులు ఈ మొక్కను తినవు. త్వరత్వరగా వ్యాపిస్తుంది. "బండిపుర, నాగర్‌హోళెలోనూ ఇదే పరిస్థితి. సఫారీ మార్గాలలో ఉన్న లాంటానా మొక్కలను తొలగించారు. దాంతో ఏనుగులు గడ్డి తినడానికి అక్కడికి వస్తాయి, వాటిని మనం చూడవచ్చు."

ఏనుగులు తమ ప్రాంతం నుండి బయటకు రావడానికి ప్రధాన కారణం లాంటానా అని సంజీవ్ వాదిస్తారు. అంతేకాకుండా, జంబోలకు(ఏనుగులు), రాగులు రసభరితంగానూ, చాలా ఊరించేవిగానూ ఉంటాయి. "నేనూ ఒక ఏనుగునైతే, నేను కూడా వాటిని తినడానికి వస్తాను." ముఖ్యంగా మగ ఏనుగులకు పంటలపై దాడి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, 25-35 సంవత్సరాల మధ్య, వాటిలో పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది. అటువంటివే, ఎక్కువగా రిస్క్ తీసుకుంటాయి.

అయితే మొట్టైవాల్ అలా కాదు. అతనొక వృద్ధుడూ, తన పరిమితులు తనకు తెలిసినవాడూనూ. సంజీవ్ అతని వయస్సును 45 దాటింది, 50కి చేరువలో ఉన్నాడంటూ లెక్కలువేశారు. సంజీవ్ అతన్ని చాలా 'యింపైన ' ఏనుగు అని పిలుస్తారు. "అతను మస్త్ లో ఉన్నప్పుప్పటి వీడియో ఒకటి చూశాను." ( మస్త్ అనేది మగ ఏనుగులలో ఒక జీవసంబంధమైన, హార్మోన్ల పెరుగుదలకు సంబంధించిన పరిస్థితి. దీనిని చాలా సాధారణమైన, ఆరోగ్యకరమైన పరిస్థితిగా పరిగణిస్తారు. కానీ అది కొనసాగే 2-3 నెలల్లో ఏనుగులు మరింత దూకుడుగా ఉంటాయని కూడా దీని అర్థం.) “సాధారణంగా, అవి హింసాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కానీ మొట్టైవాల్ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అతను వివిధ వయసుల్లో ఉన్న ఏనుగుల మందలో ఉన్నాడు. నిశ్శబ్దంగా, ఒక పక్కగా నిలబడి ఉన్నాడు. అతను ప్రపంచాన్ని చూసినవాడు.”

సంజీవ్ అతనిని దాదాపు 9.5 అడుగుల పొడవు, బహుశా 5 టన్నుల బరువు కలిగి ఉంటాడని అంచనా కట్టారు. "అతనికి మఖానా అనే సన్నిహిత సహచరుడు ఉన్నాడు. వాళ్లు ఇతర యువ ఏనుగులతో కలిసి జట్టు కడతారు." అతనికి పిల్లలు పుట్టారా, అని నేనడిగాను. సంజీవ్ నవ్వారు. "అతనికి చాలామంది పిల్లలుండివుంటారు."

అతను తన యవ్వనావస్థను దాటిన తర్వాత కూడా పొలాలపై ఎందుకు దాడి చేస్తున్నాడు? మొట్టైవాల్‌కు తన శరీర స్థితిని చక్కగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుందికదా, అని సంజీవ్ కుమార్ అన్నారు. "అతనికి బయట చాలా మంచి ఆహారం లభిస్తుంది - రాగులు , పనసపళ్ళు, మామిడిపళ్ళు - అవి తిన్న తర్వాత, తిరిగి అడవిలోకి వెళ్ళిపోతాడు." క్యాబేజీ, బీన్స్, కాలీఫ్లవర్ తినే ఇతర మగ ఏనుగులు కూడా ఉన్నాయి. ఇవి పరాయి ఆహారాలు, పురుగుమందులతో పండించినవని సంజీవ్ చెప్పారు.

“మూడు సంవత్సరాల క్రితం, పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. టమాటా, బీన్స్‌పై భారీ పెట్టుబడులు పెట్టిన రైతులు చాలా నష్టపోయారు. ఏనుగు తినేది ఒక భాగమైతే, అందుకు ఐదు రెట్లు ఎక్కువగా పంటను ధ్వంసం చేస్తుంది." అందుకని ఎక్కువ మంది రైతులు ఏనుగును ప్రలోభపెట్టని పంటలకు మారుతున్నారు. ఆ విధంగా మొట్టైవాల్, అతని స్నేహితులు ఈ ప్రాంతంలోని వ్యవసాయ పద్ధతులను ప్రభావవంతంగా మార్చేస్తున్నారు.

A rare photo of Mottai Vaal, in the Melagiri hills
PHOTO • Nishant Srinivasaiah

మేలగిరి కొండల్లో మొట్టైవాల్ : ఒక అరుదైన ఛాయాచిత్రం

కొన్నేళ్ళుగా ఏనుగులు అడవిలోంచి వచ్చి పొలాల్లో సంచరిస్తున్నాయి. ఎక్కువగా రాగుల పంటను తినే ఈ దళసరి చర్మపు జీవుల గుంపులు గ్రామాల మీద పడుతుంటాయి

*****

ఇంతకు ముందు మాకు కొంత పరిహారమైనా వచ్చేది . ఇప్పుడు , వాళ్ళు ( అధికారులు ) ఫోటోలు తీసుకుంటారు కానీ మాకు మాత్రం డబ్బేమీ ఇవ్వడటంలేదు.
గుమ్మళాపురం గ్రామంలోని గంగనహళ్ళికి చెందిన రైతు వినోదమ్మ

మొట్టైవాల్‌ని చాలా చాలా దగ్గరగా కలిసిన అతికొద్దిమందిలో గోపీ శంకరసుబ్రమణి ఒకరు. ఒకరోజు తెల్లవారుజామున, నవదర్శనం అనే స్వచ్ఛంద సంస్థలో తాను నివాసముంటున్న కాటేజీ తలుపులను మాకోసం తెరిచారాయన. మా అతిథేయి గోపకుమార్ మీనన్‌తో కలిసి మేం ఉంటున్న గొల్లపల్లి నుండి ఈ నవదర్శనం ఒక అరగంట ప్రయాణదూరంలో ఉంది.

స్నేహితుడి కోసం ఎదురుచూస్తున్న గోపీకి తన మిత్రునికి బదులుగా పొడుగ్గా, విశాలంగా ఉన్న ఒక - సిగ్గుపడుతున్న - ఏనుగు కనిపించింది. ఎందుకంటే మొట్టైవాల్ దాదాపు వెంటనే వెనుదిరిగాడు. కొండ ఒడ్డున ఉన్న అందమైన ఇంటి వరండాలో కూర్చుని గోపీ మనకు ఎన్నో కథలు చెబుతారు. కొన్ని రాగుల గురించీ, మిగిలినవి ఏనుగుల గురించీ.

ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదువుకున్న గోపీ, సాంకేతికత నుండి ఆహారాన్ని పండించే దిశగా మారారు. కొన్నేళ్ళుగా గుమ్మళాపురం గ్రామంలోని గంగనహళ్లిలో నవదర్శనం ట్రస్టు నిర్వహిస్తున్న 100 ఎకరాల భూమిలో నివాసముంటూ పని చేస్తున్నారు. ట్రస్ట్ తనను తాను నిలబెట్టుకోవడానికి అక్కడి గ్రామస్తులు, సందర్శకులు, వర్క్‌షాప్‌ల సహకారంపై ఆధారపడుతుంది. "మేం పెద్ద ప్రణాళికలు చేయం, మాకు పెద్ద బడ్జెట్లు లేవు. మేం దాన్ని సరళంగా, చిన్నగా ఉంచడానికి ప్రయత్నిస్తాం." సమీపంలోని గ్రామస్తులను కలుపుకొని నిర్వహిస్తోన్న ఆహార సహకార సంస్థ వారి ప్రధాన కార్యకలాపాలలో ఒకటి. కొద్దిపాటి భూములు కలిగివుండి, ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే వ్యవసాయం పనులు ఉండడంతో వారు అడవిపై ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

"మేం 30 కుటుంబాలకు - ఎక్కువమంది గంగనహళ్లి గ్రామానికి చెందినవారు - భూమినిచ్చి, విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులను తయారు చేయడం ఎలాగో తెలియజెప్పి, వారిని అడవికి వెళ్ళే వారి సంస్కృతి నుంచి దూరం చేశాం." అని గోపి చెప్పారు. రాగుల ను ఇప్పుడు ప్రధానంగా వారి ఇళ్లలో వాడకం కోసం పండిస్తున్నారు. ఏమైనా మిగిలితే మాత్రమే అమ్ముతారు.

గోపీ నవదర్శనంలో ఉంటున్న ఈ 12 సంవత్సరాలలో రాగులను పండించటంలో గణనీయమైన మార్పు అతనికి కనిపించింది - స్థానిక రకం నుండి స్వల్పకాలిక హైబ్రిడ్ రకం వరకు  సాధారణంగా 4-5 నెలల వరకూ ఉండే పంటకాలం 3 నెలలకు తగ్గింది. ఇది చాలా మంచిదంటారతను. మెట్ట ప్రాంతపు భూమిలో పండే పంట భూమిలో ఎక్కువ కాలం ఉన్నప్పుడు, "అది ఎక్కువ పోషకాహారాన్ని తీసుకుంటుంది" అని చెప్పారు. సహజంగానే, తక్కువ వ్యవధిలో పండేదానికి అంత అవసరం ఉండదు. ఫలితంగా, ప్రజలు ఒకటికి బదులుగా రెండు రాగి ముద్దలను తింటారు. "అంత తేడా ఉంటుంది."

Gopi Sankarasubramani at Navadarshanam's community farm in Ganganahalli hamlet of Gumlapuram village.
PHOTO • M. Palani Kumar
A damaged part of the farm
PHOTO • M. Palani Kumar

ఎడమ: గుమ్మళాపురం గ్రామం, గంగనహళ్లిలోని నవదర్శనం కమ్యూనిటీ పొలంలో గోపీ శంకరసుబ్రమణి. కుడి: పొలంలో దెబ్బతిన్న భాగం

అయితే రైతులు ఏమైనప్పటికీ మారతారు. ఎందుకంటే తక్కువకాలంలో పండే పంటకు కాపలా కాయటానికి తక్కువ సమయం పడుతుంది. అదనంగా, మార్కెట్ ధరలో మార్పుండదు. "అంతేకాకుండా, రైతులు సాగును అనుసంధానం చేయాలి" అని గోపి చెప్పారు. “చాలా మంది కాపలాగా ఉంటే - ఒకరు ఈ మూల నుండి మరొకరు ఆ మూల నుండి అరుస్తూ - ఏనుగును దూరంగా ఉంచడానికి అవకాశం ఉంది. మీరు తప్ప మిగిలిన అందరూ తక్కువ కాలపు పంటను పండిస్తే, అప్పుడు మీ పంట కోసం ఏనుగులు వస్తాయి...”

మా సంభాషణ అందమైన పక్షి కూతల అంతరాయాలతో సాగుతోంది. అవి కూడా అడవుల గురించిన వార్తలను పంచుకోవాలనుకుంటున్నట్లుగా ఈలలు వేస్తూ, నవ్వుతూ, పాడుతూ ఉన్నాయి.

రాగిముద్ద, పాలకూర పులుసుతో మధ్యాహ్న భోజనం ముగించిన తర్వాత, కరకరలాడే వేరుశెనగ మిఠాయి, సువాసనలీనుతున్న రాగి లడ్డూలను మాకు అందజేశారు. వాటిని తయారుచేసిన మహిళలు - వినోదమ్మ, బి. మంజుల - కన్నడంలో మాట్లాడారు (గోపీ, అతని స్నేహితులు నా కోసం అనువదించారు). వర్షాల వలనా, ఏనుగుల వలనా తమ రాగుల పంటలో చాలాభాగం నష్టపోయినట్టు వాళ్ళు చెప్పారు.

తాము ప్రతిరోజూ రాగులను తింటామనీ, తమ పిల్లలకు కూడా - పిల్లలు పెద్దయ్యి అన్నం తినడం ప్రారంభించే వరకు 'ఒక మాదిరి చిక్కగా' ఉండే రాగి గంజిని తినిపిస్తామనీ, వాళ్ళు మాతో చెప్పారు. ఏటా పండే రాగుల పంటను ఇంట్లోనే బస్తాల్లో భద్రపరుచుకుని, అవసరమైనప్పుడు మెత్తగా పిండి పట్టించుకుంటారు. అయితే ఈ ఏడాది పంట నాసిరకంగా ఉండడంతో మరింతగా పండించడం కష్టమవుతోంది.

ఈ మహిళలిద్దరూ నవదర్శనం చుట్టూ ఉన్న గంగనహళ్లి కుగ్రామానికి చెందినవారు, మధ్యాహ్న భోజనం ముగించి తిరిగి వచ్చారు. వారి పొలాల్లో - వినోదమ్మకు 4 ఎకరాలు, మంజులకు 1.5 ఎకరాల పొలం ఉంది - రాగులు , వరి, చిక్కుళ్ళు, ఆవాలు పండిస్తారు. "అకాల వర్షాలు కురిసినప్పుడు, రాగి గింజలు మొక్కమీదనే మొలకెత్తుతాయి" అని మంజుల చెప్పారు. అప్పుడు పంట పాడైపోతుంది.

దీనిని నివారించేందుకు వినోదమ్మ కుటుంబం పంటను త్వరగా కోయాలనీ, రాగుల నూ కాడలనూ వేగంగా వేరు చేసేందుకు యంత్రాన్ని ఉపయోగించాలనీ నిర్ణయించుకుంది. ఆమె తన చేతులతో గాలిలో చక్కని వరుసలను పేరుస్తూ, భాషలోని అంతరాలను సంకేతాలతో తొలగిస్తున్నారు.

మానవ-జంతు సంఘర్షణ గురించి వారికి కలిగే ఆశాభంగం అనువాదం లేకుండా కూడా బయటపడిపోతుంది. ఇంతకు ముందు మాకు కొంత పరిహారమైనా వచ్చేది. ఇప్పుడు, వాళ్ళు (అధికారులు) ఫోటోలు తీసుకుంటారు కానీ మాకు మాత్రం డబ్బేమీ ఇవ్వడటంలేదు.

Manjula (left) and Vinodhamma from Ganganahalli say they lose much of their ragi to unseasonal rain and elephants
PHOTO • M. Palani Kumar
A rain-damaged ragi earhead
PHOTO • Aparna Karthikeyan

ఎడమ: గంగనహళ్లికి చెందిన మంజుల (ఎడమవైపు ఉన్నవారు), వినోదమ్మ మాట్లాడుతూ అకాల వర్షం, ఏనుగుల దాడుల వల్ల తమ రాగుల పంటను చాలావరకు కోల్పోతున్నామని చెప్పారు. కుడి: వర్షం వలన దెబ్బతిన్న రాగి కంకులు

ఏనుగు ఎంత తింటుంది? చాలా తింటుంది అన్నారు గోపీ. ఒకసారి, రెండు ఏనుగులు రెండు రాత్రులపాటు 20,000 రూపాయలకు పైగా విలువైన 10 బస్తాల రాగులను తిన్నాయని ఆయన గుర్తుచేస్తుకున్నారు. “ఒక ఏనుగు ఒకే దాడిలో 21 పనసపండ్లను కూడా తిన్నది. ఇంకా క్యాబేజీలు..."

పండించిన పంటను కాపాడుకునేందుకు రైతులు నిద్రను కోల్పోతున్నారు. రాగుల పంటకాలంలో రాత్రి వెంట రాత్రి మచాన్‌ పై (మంచె) కూర్చొని రెండేళ్లపాటు ఏనుగుల కోసం కాపలా కాయడాన్ని గోపీ గుర్తు చేసుకున్నారు. ఇది కష్టతరమైన జీవితం అని ఆయనన్నారు. తెల్లారేసరికి మీరు దెబ్బతినిపోతారు. నవదర్శనం చుట్టూ ఉన్న ఇరుకైన, వంకరలు తిరిగిన రోడ్ల వెంట మేం చాలా మచాన్ల ను గుర్తించాం. కొన్ని పక్కాగా ఉన్నవి, మరికొన్ని తాత్కాలిక ఉపయోగానికి. చాలా మంది దగ్గర ఒక రకమైన గంట ఉంటుంది - ఒక రేకు డబ్బాకు తాడు కట్టిన కర్ర జోడించబడి ఉంటుంది. ఏనుగు కనిపించిందని ఇతరులను హెచ్చరించే మార్గం ఇది.

అసలు విషాదం ఏమిటంటే, ఎలాగూ ఏనుగు పంటలపై తరచూ దాడి చేస్తూనే ఉంటుంది. "ఒకటే ఏనుగు కనిపించినప్పుడు కూడా మేం దాన్ని ఆపలేకపోయాం," అని గోపి గుర్తుచేసుకున్నారు. "మేం టపాసులు పేల్చాం, ప్రతిదీ ప్రయత్నించాం, కానీ అది మాత్రం తన ఇష్టానుసారం చేసేసింది."

గంగనహళ్లి ప్రాంతానికి ఇప్పుడొక విచిత్రమైన సమస్య ఉంది: అటవీ శాఖవారు ఏనుగుల కోసం వేసిన కంచె నవదర్శనానికి చాలా దగ్గరగా ముగుస్తుంది. అది ఏనుగులు దాదాపు వారి భూమిలోకి ప్రవేశించగలిగేంత ఖాళీని సృష్టిస్తుంది. అందుకే ఏడాదికి 20 సార్లు ఏనుగుల దాడి జరిగే చోట ఇప్పుడు పంట చేతికి రావడంతో దాదాపు ప్రతి రాత్రీ ఏనుగులు పొలంలోకి వస్తున్నాయి.

“కంచెకు ఇరువైపులా ఉన్న ప్రజలందరినీ ఇది దెబ్బకొదుతుంది. అది మొదలైనప్పుడు, మీరిక ఆపలేరు." గోపి ఒక వేలు ఆడిస్తూ తల ఊపారు.

A makeshift machan built atop a tree at Navadarshanam, to keep a lookout for elephants at night.
PHOTO • M. Palani Kumar
A bell-like contraption in the farm that can be rung from the machan; it serves as an early warning system when elephants raid at night
PHOTO • M. Palani Kumar

ఎడమ : రాత్రివేళల్లో ఏనుగుల రాకను గమనించేందుకు నవదర్శనం వద్ద చెట్టుపై తాత్కాలికంగా నిర్మించిన మచాన్ ( మంచె ). కుడి : మచాన్ నుండి మోగించదానికి వీలుగా పొలంలో ఉన్న ఒక గంట వంటి పరికరం ; ఇది రాత్రి సమయంలో ఏనుగులు దాడి చేసినప్పుడు ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా పనిచేస్తుంది

*****

'నా భార్య నన్ను తరచుగా చూడాలనుకుంటోంది .'
ఏనుగుల దాడుల నుండి పంటలను రక్షించుకోవడంలో మునిగిపోయిన 60 ఏళ్ల రైతు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ న్యాయమూర్తితో

అనేక కారణాల వల్ల మానవులు-ఏనుగుల మధ్య జరిగే సంఘర్షణకు సున్నితమైన, స్థిరమైన పరిష్కారం అవసరం. మొదటి సంగతి, సమస్య ఏనుగెంత పెద్దదో అంత పెద్దది. ప్రపంచవ్యాప్తమైనది. ప్రస్తుత నిర్వహణ వ్యూహాలను సమీక్షిస్తూ ఫ్రాంటియర్స్ ఇన్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్‌లోని ఒక పత్రం ఇలా చెప్తోంది: “ప్రపంచంలోని 1.2 బిలియన్ల మంది ప్రజలలో రోజుకు 1.25 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న ఎక్కువమంది ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని ఏనుగులు ఎక్కువగా సంచరించే దేశాల్లో నివసిస్తున్నారు.” ఈ అట్టడుగు వర్గాలు "జీవించే స్థలం కోసం, వనరుల కోసం ఏనుగుల వంటి ఇతర జీవజాతులతో ఎక్కువగా పోటీ పడవలసి వస్తోంది."

భారతదేశంలో, 22 రాష్ట్రాలు ఏనుగులతో ముఖాముఖి తలపడుతున్నాయని గౌరవ వన్యప్రాణి సంరక్షకులు సంజీవ్ కుమార్ చెప్పారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, అస్సాంలలో ఇవి ప్రధానంగా జరుగుతున్నాయి.

పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ రాజ్యసభలో సమర్పించిన అధికారిక గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 2018 నుండి డిసెంబర్ 2020 వరకు మూడేళ్ల కాలంలో 1,401 మంది మనుషులు, 301 ఏనుగులు దీని కారణంగా మరణించారు.

కాగితాలపై మాత్రం, రైతులు - ఆమె/అతడు - పొందిన నష్టాలకు తప్పనిసరిగా పరిహారం చెల్లించాలనే ఉద్దేశం ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది. అటవీ, పర్యావరణం మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వారి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ డివిజన్ జారీ చేసిన 2017 భారత ప్రభుత్వ పత్రం , అంచనా వేసిన పంట నష్టంలో చెల్లించాల్సిన పరిహారం 60 శాతం ఉండాలని సిఫార్సు చేసింది. ఇంకా ఏమంటుందంటే, "పరిహారం పంట విలువలో 100 శాతానికి దగ్గరగా ఉంటే, తన పంటలను రక్షించుకోవడానికి ఆ రైతుకు ఇంక ఎటువంటి ప్రోత్సాహకాలు ఉండవు."

హోసూర్‌లోని వైల్డ్‌లైఫ్ వార్డెన్ కార్యాలయంలో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా పనిచేస్తున్న ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి కె. కార్తికేయని నాతో మాట్లాడుతూ, హోసూర్ ఫారెస్ట్ డివిజన్‌లో ఏటా 200 హెక్టార్ల కంటే ఎక్కువ భూమిలో పంటలు దెబ్బతింటున్నాయని చెప్పారు. “తమ పంటలకు పరిహారం కోరుతూ రైతుల నుండి 800 నుండి 1,000 వరకూ దరఖాస్తులను అటవీ శాఖ అందుకుంటోంది. వార్షిక చెల్లింపు రూ. 80 లక్షల నుండి 1 కోటి మధ్య ఉంటుంది" అని ఆమె చెప్పారు. ప్రతి మనిషి మరణానికి చెల్లించే 5 లక్షల నష్టపరిహారం కూడా ఇందులోనే ఉంది. ఈ ప్రాంతంలో ఏనుగుల వల్ల ఏటా 13 మంది చనిపోతున్నారు.

Tusker footprints on wet earth.
PHOTO • Aparna Karthikeyan
Elephant damaged bamboo plants in Navadarshanam
PHOTO • M. Palani Kumar

ఎడమ : తడిగా ఉన్న భూమిపై ఏనుగుల పాదముద్రలు . కుడి : నవదర్శనంలో వెదురు మొక్కలను ఏనుగు ధ్వంసం చేసింది

"ఎకరానికి చెల్లించాల్సిన పరిహారం గరిష్టంగా రూ. 25,000,” అని కార్తికేయని వివరించారు. "దురదృష్టవశాత్తూ, ఉద్యాన పంటలకు ఇది సరిపోదు. రైతులు ఎకరాకు 70,000 రూపాయలకు పైగానే నష్టపోతున్నారు."

అంతేకాకుండా, పరిహారం కోసం రైతు కొన్ని పత్రాలను సమర్పించాలి, వ్యవసాయ లేదా ఉద్యానవన అధికారి వ్యవసాయ భూమిని తనిఖీ చేస్తారు, ఆపై గ్రామ పరిపాలన అధికారి (విఎఒ) వారి భూమి పత్రాలను తనిఖీ చేసి ధృవీకరించాలి. చివరగా, అటవీ రేంజ్ అధికారి సందర్శించి ఫోటోలు తీస్తారు. అప్పుడు జిల్లా అటవీ అధికారి (డిఎఫ్ఒ) పరిహారం ఏదైనా ఉంటే మంజూరు చేస్తారు.

ఇబ్బందేమిటంటే, రైతులు 3,000 నుండి 5,000 రూపాయల వరకు పరిహారంగా పొందడానికి - కొన్నిసార్లు మూడు పంట కాలాల వరకు వేచి ఉండాలి. "రివాల్వింగ్ ఫండ్‌ని ఉపయోగించి వెంటనే పరిష్కరించినట్లయితే బాగుంటుంది" అని కార్తికేయని చెప్పారు.

ఈ సంఘర్షణను పరిష్కరించడం, మనుషుల జీవితాలనూ రైతుల జీవనోపాధినీ రక్షించడమే కాకుండా, వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇది రాష్ట్ర అటవీ శాఖకు పరపతిని కూడా తిరిగి సంపాదించిపెడుతుందని సంజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు. "ప్రస్తుతానికి మాత్రం ఏనుగుల సంరక్షణ భారాన్ని వ్యవసాయదారులే భరిస్తున్నారు." అని ఆయన చెప్పారు.

రాత్రి వెంట రాత్రి, ఇలా నెలల తరబడి ఏనుగుల పాలబడకుండా పంటను కాపాడుకోవడం సరదా విషయమేమీ కాదని సంజీవ్ అంగీకరిస్తారు. ఇది రైతులను అనేక గంటల పాటు, రోజుల తరబడీ కట్టడి చేస్తుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) సమావేశంలో, 'నా భార్య నన్ను తరచుగా చూడాలని కోరుకుంటుంది' అని ఒక రైతు న్యాయమూర్తికి చెప్పడాన్ని అతను గుర్తు చేసుకున్నారు. ఆ రైతుకు 60 ఏళ్లు పైబడి ఉంటాయనీ,అతనికి అక్రమ సంబంధం ఉందని అతని భార్య అనుమానిస్తోందనీ సంజీవ్ గుర్తుచేసుకున్నారు.

రైతుపై ఉండే ఒత్తిడి అటవీ శాఖకు సమస్యగా మారుతోంది. "రైతులు ఆ ఒత్తిడిని డిపార్ట్‌మెంట్‌ మీదకు మళ్ళించారు. వారు కార్యాలయాన్ని బద్దలుకొట్టారు. వారు రోడ్‌రోకోలు చేశారు, సిబ్బందిని దుర్భాషలాడారు, వారిపై చేయిచేసుకున్నారు. ఇది అటవీ శాఖను వెనుకంజ వేసేలా చేసింది, వారి రక్షణ విధులకు ఆటంకం కలిగించింది" అని సంజీవ్ కుమార్ చెప్పారు.

Anandaramu Reddy explaining the elephants’ path from the forest to his farm in Vadra Palayam hamlet
PHOTO • M. Palani Kumar

వడ్రపాళైయమ్ కుగ్రామంలోని తన పొలానికి అడవి నుండి ఏనుగులు వచ్చే మార్గాన్ని గురించి వివరిస్తున్న ఆనందరాము రెడ్డి

మానవుల-ఏనుగుల సంఘర్షణకు ఆర్థికపరమైన వ్యయం, పర్యావరణపరమైన వ్యయం, మానసికపరమైన వ్యయం కూడా ఉంటుంది. మీ తప్పు లేకుండానే, ఏ రోజుకైనా దెబ్బతినిపోవచ్చు, లేదా నాశనమైపోవచ్చు అని తెలిసి కూడా వ్యాపారాన్ని నడుపుతున్నట్లు ఊహించుకోండి

వీటన్నింటికీ తోడు ఏనుగుల ప్రాణాలకు ముప్పు ఉంది. 2017లో నిర్వహించిన గణన ప్రకారం తమిళనాడులోని ఏనుగుల సంఖ్య 2,761 . ఇది భారతదేశంలోని మొత్తం ఏనుగుల సంఖ్య అయిన 29,964 లో కేవలం 10 శాతం కంటే తక్కువ. ఇది ఆందోళన కలిగించే అత్యవసర సమస్య.

ఏనుగుల-మానవుల సంఘర్షణ, విద్యుదాఘాతం, రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు ఈ అరుదైన జాతుల క్షీణతకు దోహదపడ్డాయి. ఒక స్థాయిలో, ఇది పరిష్కారం లేని సమస్యగా కనిపిస్తుంది. అయితే సంజీవ్, మరికొంతమంది ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు - మూర్తి సహాయంతో…

*****

'నిజానికి , మేం విద్యుత్తుపై ఆధారపడకూడదనుకుంటున్నాం . సౌరశక్తి నమ్మదగినది కాదు . దీనికి తోడు , ఏనుగులు విద్యుత్తును గుర్తుపడతాయి .'
ఎస్.ఆర్. సంజీవ్ కుమార్, కృష్ణగిరి, ధర్మపురి జిల్లాల గౌరవ వన్యప్రాణి సంరక్షకుడు

కృష్ణగిరి జిల్లాలో మేలగిరి ఏనుగు కంచె ఆలోచన దక్షిణాఫ్రికాలోని ఆడో ఎలిఫెంట్ నేషనల్ పార్క్ నుండి వచ్చిందని సంజీవ్ కుమార్ చెప్పారు. 'భారతదేశపు ఏనుగు మనిషి' రామన్ సుకుమార్ ఈ విషయం గురించి నాకు చెప్పారు. అక్కడ వాళ్ళు వాడుకలో లేని రైల్వే లైన్లు, ఎలివేటర్ కేబుళ్లను ఉపయోగించారు. వాళ్ళు కంచె వేసిన వెంటనే, వివాదం ముగిసింది." సంజీవ్ ఆడో పార్క్ ఆలోచనను అనుసరించారు.

అప్పటి వరకు, హోసూర్ ఫారెస్ట్ డివిజన్‌లో ఏనుగులను అడవికి లోపల, పొలాలకు వెలుపల ఉంచడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏవీ విజయవంతం కాలేదు. వారు ఏనుగులను నిరోధించే కందకాలను ప్రయత్నించారు. ఇవి అటవీ సరిహద్దు చుట్టూ తవ్విన లోతైన గుంటలు. వారు సంప్రదాయ సౌర విద్యుత్‌తో పనిచేసే కంచెలు, ముళ్ళ కంచెలను ప్రయత్నించారు. ఆఫ్రికా నుండి కొన్ని ముళ్ల చెట్లను కూడా దిగుమతి చేసుకున్నారు. అయితే ఏవీ పని చేయలేదు.

హోసూర్ డివిజన్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా దీపక్ బిల్గి, ఐఎఫ్ఎస్, నియమించబడినప్పుడు ఒక పురోగతి జరిగింది. బిల్గి ఈ ఆలోచనపై ఆసక్తి కనబరిచారు. అందుకోసం డబ్బును సమకూర్చుకొని, కలెక్టర్‌తో మాట్లాడి, "మేం ప్రయోగాత్మకంగా కంచె వేయాలని నిర్ణయించుకున్నాం" అని సంజీవ్ వివరించారు.

A section of the Melagiri Elephant Fence, which is made of pre-cast, steel-reinforced concrete posts, and steel wire rope strands
PHOTO • M. Palani Kumar

మేలగిరి ఏనుగు కంచెలో ఒక భాగం . ఇది పోతపోయని ఉక్కుతో పటిష్టపరచిన కాంక్రీట్ స్తంభాలు , ఉక్కు తీగల తాళ్ళతో తయారుచేశారు

ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఏనుగు బలమెంత అనేదానిపై పెద్దగా సమాచారం లేదు. ఒక ఏనుగు లేదా ఏనుగులు ఎంత బరువును లాగగలవో ఎవరికీ తెలియదు. కాబట్టి వారు ముధుమలైలో ఒక నమూనాను అమర్చారు, దానిని కుమ్కీ లతో (శిక్షణ పొందిన బందీ ఏనుగులు) పరీక్షించారు. ఆ ఏనుగులలో ఒకటి, మూర్తి అని పిలిచే ఐదు టన్నుల బరువున్న దంతాలు లేని ఏనుగు. ఇది అటవీ శాఖ ద్వారా పునరావాసం పొందక ముందు అనేక మందిని చంపినందుకు అపఖ్యాతి పాలయింది. బీటా టెస్టర్‌గా, మానవులు-ఏనుగుల సంఘర్షణను తగ్గించే కేబుల్‌లను తనిఖీ చేయడం దీని పని.

"మీరు అతని గతాన్ని ఊహించలేరు," అంటారు సంజీవ్. ఎందుకంటే అతను బాగా శిక్షణ పొందాడు. చాలా విధేయుడూ, సౌమ్యుడూ అయ్యాడు. ఇప్పుడు మూర్తి పదవీ విరమణ చేశాడు. నాకున్న సమాచారం ప్రకారం ఏనుగుల పదవీ విరమణ వయస్సు 55 సంవత్సరాలు. భోజనం, వసతితో సహా మంచి జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఆడ ఏనుగుల శిబిరంలో, వాటితో సంభోగం చేస్తూ అప్పుడప్పుడు 'స్టడ్'గా కూడా వ్యవహరిస్తాడు. అడవిలో, అతని సేవలు అవసరం లేదు, లేదా అనుమతి ఉండదు. ఎందుకంటే, యువ ఏనుగులు ఆ ప్రత్యేక సౌకర్యం కోసం అతనితో పోటీపడతారు.

కొన్ని పరిస్థితులలో ఒక్కో ఏనుగు 1,800 కిలోగ్రాముల గరిష్ట శక్తిని ప్రయోగించగలదని మూర్తి ద్వారా తెలుసుకున్నారు. మూర్తి అనుభవం ఆధారంగా వారు నిర్మించిన ఇనుప స్తంభాల రూపకల్పన, మొదటి రెండు కిలోమీటర్ల కంచె ఆనంద ఇంటికి ఎంతో దూరంలో లేదు.

“మొదటి ప్రయత్నంలోనే చాలా నేర్చుకున్నాం. మొట్టైవాల్ చుట్టూ తిరుగుతుండే ఏనుగు మఖానా మొదటి వారంలోనే ఆ కంచెను విరగ్గొట్టేసింది. కొత్త సాంకేతికతలతో స్తంభాలు నిర్మించాల్సి వచ్చింది, అవి మునుపటి వాటికంటే 3.5 రెట్లు బలంగా ఉన్నాయి. ఆ ఉక్కు తీగల తాడు 12 టన్నుల బరువును తట్టుకోగలదు. అంటే ఆ తాడుతో రెండు ఏనుగులను సులభంగా ఎత్తవచ్చన్నమాట."

ఇతర నమూనాలతో పోలిస్తే, తాము నిర్మించిన కంచె దాదాపు నాశనం చేయటానికి వీలులేనిదని సంజీవ్ చెప్పారు. ఇది పోతపోయని ఉక్కుతో పటిష్టపరచిన కాంక్రీట్ స్తంభాలు, ఉక్కు తీగల తాళ్ళతో తయారుచేసింది. ఏనుగులు ఈ స్తంభాలను గానీ, తీగను గానీ విరగ్గొట్టలేవు. అవి వాటి పైకి ఎక్కటం, వాటిగుండా దూరిపోవడం లాంటివి చేయవచ్చు. “ఏదైనా సమస్యాత్మక ప్రాంతాలలో నిర్దిష్ట పరిష్కారాన్ని కనుక్కోవడానికి, దాన్ని పరిష్కరించడానికి ఇది మాకు అవకాశాన్ని ఇస్తుంది. మన స్నేహితులు పంటలపై దాడి చేసి బయటకు రావడం లేదా తిరిగి వెళ్లడాన్ని కూడా మా జట్టు కెమెరాలో బంధించింది." వారు చూసిన దాన్ని ఆధారంగా చేసుకుని, కొంత మెరుగులుదిద్దారు. "కొన్నిసార్లు ఏనుగు వచ్చి ఇంకింత ఎక్కువ పని చేయడం ఎందుకు అవసరమో మనకు చూపిస్తుంటుంది," అని సంజీవ్ నవ్వారు.

ఈ నాన్-ఎలక్ట్రిక్(విద్యుత్‌తో పనిలేని) ఉక్కు కంచె ధర కిలోమీటరుకు రూ. 40 లక్షల నుంచి 45 లక్షలు. జిల్లా కలెక్టర్ - కొంత ప్రైవేట్ రంగ సహాయంతో, అలాగే రాష్ట్ర ప్రభుత్వ తమిళనాడు ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్స్ పథకం ద్వారా మొదటి రెండు కిలోమీటర్ల కంచెకూ, తదుపరి 10 కిలోమీటర్ల కంచెకూ కూడా నిధులు సమకూర్చారు.

Anandaramu walking along the elephant fence and describing how it works
PHOTO • M. Palani Kumar

ఆనందరాము ఏనుగు కంచె వెంట నడుస్తూ , అది ఎలా పనిచేస్తుందో వివరిస్తున్నారు

ఏనుగులు రాకుండా ఇప్పుడు కంచె వేయబడిన 25 కిలోమీటర్లలో, 15 కి.మీ.లు విద్యుత్తుతో పనిలేనివి, మిగిలిన 10 కి.మీ.లు విద్యుత్‌తో (సౌర శక్తి) పనిచేసేవి. వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది - 10,000 వోల్టులు. ఇది ప్రతి సెకనుకు పల్సేట్ చేసే చిన్న మొత్తంలోని డైరెక్ట్ కరెంట్. "సాధారణంగా, ఏనుగు దానిని తాకినప్పుడు చనిపోదు," అని సంజీవ్ వివరించారు. “మనం ఇళ్లలో, పొలాల దగ్గర ఉపయోగించే 230 వోల్టుల ఎసి కరెంట్ ద్వారా విద్యుదాఘాతాలు సంభవిస్తాయి. ఇక్కడ ఉపయోగించే కరెంటు, ఇళ్లలో ఉపయోగించే కరెంటులో కొన్ని వేల వంతు మాత్రమే ఉంటుంది కాబట్టి, వాటికి హాని జరగదు. లేకపోతే, అది వాటిని చంపేస్తుంది.”

డిసి వోల్టేజ్ 6,000 వోల్ట్‌లకు పడిపోయినప్పుడు, ఉదాహరణకు ఏదైనా చెట్టు లేదా మొక్క ఆ కంచెపై పడి ఉంటే, ఏనుగులు హాయిగా వాటిమీదుగా నడిచేస్తాయి. కొన్ని మగ ఏనుగులకు తినాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో అవి కేవలం అన్నిటినీ తోసేసుకుని బయటపడతాయి. "వాటి మనస్సులో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం కష్టం," అని సంజీవ్ అంగీకరించారు.

“నిజాయితీగా చెప్పాలంటే, మేం విద్యుత్తుపై ఏ విధంగానూ ఆధారపడకూడదనుకుంటున్నాం. సౌరశక్తి నమ్మదగినది కాదు,” అని సంజీవ్ ఎత్తి చూపారు. అదనంగా, ఏనుగులు విద్యుత్తు గురించి తెలుసుకున్నాయి. వాటికి ఇన్సులేషన్(నిరోధకత), కండక్టివిటీ(వాహకత) ఏమిటో తెలుసు. అవి ఒక కొమ్మనో, లేదా చెట్టునో తీసుకొని కంచెపై వేసి షార్ట్ సర్క్యూట్ అయ్యేలా చేస్తాయి. లేదా మగ ఏనుగు కంచెను విచ్ఛిన్నం చేయడానికి తన దంతాన్ని ఉపయోగిస్తుంది- దంతంలోంచి విద్యుత్తు ప్రవహించలేదని అవి తెలుసుకున్నాయి. "కరెంటు ఉందో లేదో తెలుసుకోవడానికి కంచెని చిన్న కొమ్మతో పరీక్షిస్తున్న ఒక ఏనుగు ఫోటో నా దగ్గర ఉంది" అని సంజీవ్ నవ్వారు.

*****

' మేలగిరి కంచె కారణంగా , ఏనుగులు దక్షిణం వైపుకు వెళ్లాయి . ఇది మంచి విషయమే . ఎందుకంటే అక్కడ దట్టమైన అడవి నీలగిరి వరకూ విస్తరించి ఉంది. '
కె. కార్తికేయని, భారత అటవీ సేవా(ఐఎఫ్ఎస్) అధికారి

ఏనుగులతో సంఘర్షణలో ఆర్థిక వ్యయం, పరిసర/పర్యావరణ సంబంధమైన వ్యయం, మానసికపరమైన వ్యయం కూడా ఉంటుంది.  మీ తప్పు లేకుండానే, ఏ రోజుకైనా దెబ్బతినిపోవచ్చు, లేదా నాశనమైపోవచ్చు అని తెలిసి కూడా వ్యాపారాన్ని నడుపుతున్నట్లు ఊహించుకోండి. కృష్ణగిరి జిల్లాలో తరతరాలుగా వ్యవసాయం చేస్తూ జీవిస్తున్న రైతుల జీవితం అదే.

స్థానికంగా పండే పంటలతో విందు చేసుకోవడమే కాకుండా, పంటలపై దాడి చేసే ఏనుగులు ఎక్కువ దూరం వెళ్లడం కూడా నేర్చుకున్నాయనీ, గత దశాబ్దంన్నర కాలంలోనే ఇది జరిగిందనీ సంజీవ్ కుమార్ వివరించారు. "రిజర్వ్ ఫారెస్ట్ దాటి ఒక కిలోమీటరు లేదా రెండు కిలోమీటర్లు ప్రయాణించడం నుండి, అవిప్పుడు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలోకి దాదాపు 70 లేదా 80 కిలోమీటర్లు ప్రయాణించి, అక్కడ రెండు నెలలు గడిపి తిరిగి వస్తున్నాయి." పంటలపై ఎక్కువగా దాడులు జరిగే హోసూర్ ప్రాంతంలో, ఏనుగులు భారీగా ఉంటాయి; ఆరోగ్యంగా కనిపిస్తాయి, ఎక్కువమంది పిల్లలను కలిగి ఉంటాయి.

యువ ఏనుగులు చాలా చాలా సాహసం చేస్తాయి. సంజీవ్ అభయారణ్యం వెలుపల ఏనుగుల మరణాల గురించి సమాచారాన్ని సేకరించి, వాటితో ఒక గ్రాఫ్‌ను రూపొందించారు. చనిపోయిన ఏనుగులలో 70-80 శాతం సాపేక్షికంగా చిన్నవీ, మగవీ అని ఆయన కనుగొన్నారు.

Mango plantation damaged by elephants in Anandaramu’s field
PHOTO • Anandaramu Reddy
Ananda with more photographs showing crops ruined by elephant raids
PHOTO • Aparna Karthikeyan

ఎడమ : ఆనందరాముని పొలంలో ఏనుగుల దాడిలో దెబ్బతిన్న మామిడి తోట . కుడి : ఏనుగుల దాడులలో నాశనమైన పంటలను చూపిస్తోన్న మరిన్ని ఫోటోలతో ఆనంద

ఈ మధ్యకాలంలో ఏనుగుల మందను చాలా అరుదుగా చూస్తున్నామని ఆనంద నాతో చెప్పారు. కేవలం అబ్బాయిలే: మొట్టైవాల్, మఖానా, గిరి. అతనిప్పటికీ ఏనుగుల దాడుల చిత్రాలను నాకు వాట్సాప్‌లో పంపుతున్నారు. పడిపోయిన మామిడి కొమ్మలు, నలిగిపోయిన అరటి చెట్లు, తొక్కేసిన పండ్లు, కుప్పలు కుప్పలుగా ఏనుగుల రెట్టలు అందులో ఉంటాయి. ఆనంద మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా ఉంటారు, ఎప్పుడూ కోపంగా ఉండరు.

"ఎందుకంటే, కోపమేదైనా ఉంటే అది ప్రభుత్వం మీదకో, లేదా అటవీ శాఖ వైపుకో మళ్లుతుంది" అని సంజీవ్ చెప్పారు. “పరిహారం ఇవ్వడం చాలా ఆలస్యమైందనీ, లేదా అసలుకే రాదనీ వారికి తెలుసు. కాబట్టి వారు దాని గురించి అడగడమే మానేశారు. సమాచారం (డేటా) సంఘర్షణ యొక్క నిజమైన తీవ్రతను చూపకపోవడం అనేది ఒక సమస్య."

ఏనుగులు అడవి లోపలే ఉండేలా చూడటమే సంఘర్షణను తగ్గించే ఏకైక మార్గం. వాటి సహజ ఆవాసాలను పునరుద్ధరించినప్పుడే సమస్య తొలగిపోతుంది. “ఇది 80 శాతం సమస్యను పరిష్కరిస్తుంది. లాంటానాను వదిలించుకోవడం కూడా చాలా ముఖ్యమే."

ప్రస్తుతానికి కంచె వేయబడిన 25 కిలోమీటర్లలో - ఇది మానవుల, ఏనుగుల సమన్వయ సరిహద్దులో 25 శాతం - సంఘర్షణ 95 శాతం తగ్గింది. "మేలగిరి కంచె కారణంగా, ఏనుగులు దక్షిణం వైపుకు వెళ్లాయి. ఇది మంచి విషయమే. ఎందుకంటే అక్కడ దట్టమైన అడవి సత్యమంగళం మీదుగా నీలగిరి వరకూ విస్తరించి ఉంది. ఇదే వారికి శ్రేయస్కరం.” అని కార్తికేయని చెప్పారు.

మేలగిరి కంచె చాలా వరకు భౌతిక అవరోధంగా ఉంటుంది. "ఇది సౌరశక్తితో విద్యుద్దీకరించబడిన చోట, ఒక మానసిక అవరోధం అవుతుంది. ఇది వాటికి చిన్న షాక్ ఇచ్చి, వాటిని భయపెడుతుంది. కానీ ఏనుగులు తెలివైనవి. తేనెతుట్టె (బీహైవ్) కంచెలు, లేదా పులి గాండ్రింపులు, లేదా అలారం శబ్దాలు వాటి మీద పనిచేయవు." మొత్తమ్మీద, మనం అన్ని ఏనుగులను అన్ని వేళలా మోసం చేయలేమన్నారు సంజీవ్ కుమార్.

కానీ ఏనుగులు ఎప్పుడూ ఒక అడుగు ముందుకే ఉన్నట్టుంటాయి. తమను లోపల ఎలా ఉంచాలో  అవి ప్రజలకు నేర్పిస్తున్నాయి. అవి కెమెరా ట్రాప్‌లను బద్దలు కొట్టడం ప్రారంభించాయి. సంజీవ్ మాట్లాడుతున్నప్పుడు, నేను నా తెరపై ఉన్న చిత్రాన్ని తదేకంగా చూస్తున్నాను: రెండు ఏనుగులు సరిగ్గా కంచెకు ఎదురుగా నిలబడివున్నాయి- ఆ తాళ్లను దాటుకొని రాగుల ను ఎలా చేరుకోవాలో పథకం వేస్తూ...

కథనాన్ని నివేదించేటప్పుడు అందించిన సహాయానికీ , ఆతిథ్యానికీ , విలువైన ఇన్ పుట్ లకూ గోపకుమార్ మీనన్ కు రచయిత ధన్యవాదాలు తెలియజేస్తున్నారు .

పరిశోధనా అధ్యయనానికి అజీమ్ ప్రేమ్ జీ విశ్వవిద్యాలయం తన 2020 పరిశోధన నిధుల కార్యక్రమంలో భాగంగా నిధులు సమకూర్చింది .

కవర్ ఫోటో ( మొట్టైవాల్ ): నిశాంత్ శ్రీనివాసయ్య

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Aparna Karthikeyan

Aparna Karthikeyan is an independent journalist, author and Senior Fellow, PARI. Her non-fiction book 'Nine Rupees an Hour' documents the disappearing livelihoods of Tamil Nadu. She has written five books for children. Aparna lives in Chennai with her family and dogs.

Other stories by Aparna Karthikeyan
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli