నాగిరెడ్డి తమిళనాడులో నివాసముంటారు, కన్నడం మాట్లాడతారు, తెలుగు చదువుతారు. ఒక డిసెంబర్ ఉదయాన, ఆయన్ని కలవటం కోసం మేము కొన్ని కిలోమీటర్లు నడిచివెళ్ళాం. ఆయన ఇల్లు, ఆయన మాతో యథాలాపంగా చెప్పినట్టుగా "అదిగో అక్కడుంది." నిజానికది నీటితో పొంగిపొరలుతున్న సరస్సు దగ్గరలో, పెద్ద చింతచెట్టును దాటి, యూకలిప్టస్ కొండ పైకి ఎక్కి, మామిడి తోటలోకి దిగి, కాపలా కుక్కని, దాని పక్కనే కీచుకీచుమంటున్న కుక్కపిల్లని, పశువుల కొట్టాన్ని దాటుకుని వెళ్తే వస్తుంది.

దేశంలోని ఏ రైతైనా ఎదుర్కొనే అన్ని సాధారణ సమస్యలూ తలనొప్పులతో పాటు, నాగిరెడ్డిని తాను పండించే పంటలనే మార్చేసేలా చేసేస్థాయికి ఆయనని బాధించేది మరొకటి ఉంది. ఆయన మూడు కఠినమైన, భయపెట్టే  పాత్రలచే వేటాడబడుతున్నారు. అవి: మొట్టై వాల్, మఖానా, గిరి.

వాటి ఆకారాన్నిబట్టి కూడా ఈ కుర్రాళ్లను తేలికగా తీసుకోకూడదని ఇక్కడి రైతులు తెలుసుకున్నారు. అవి ఒక్కొక్కటీ 4,000, 5,000 కిలోల మధ్య బరువు ఉన్నప్పుడు కాదు. ఈ దోపిడీ ఏనుగుల ఖచ్చితమైన బరువూ ఎత్తులను దగ్గరగా వెళ్ళి తనిఖీ చేయడంలో ఉత్సాహం లేనందుకు స్థానికులను క్షమించవచ్చు.

మేము కృష్ణగిరి జిల్లాలో ఉన్నాం. ఇది తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉంది. తేన్కనికోట్టై తాలూకా లోని నాగిరెడ్డి కుగ్రామం, వడ్రపాళైయం, అడవికి గానీ ఏనుగులకు గానీ మరీ దూరంలో ఏంలేదు. మేము కూర్చున్న ఆ ఇంటి సిమెంట్ వరండా, ఆయన పొలాలకు కొన్ని మీటర్ల దూరంలోనే ఉంది. గ్రామస్థులు నాగన్నగా పిలుచుకునే ఆయన వయస్సు 86 సంవత్సరాలు. అత్యంత పోషక విలువలు కలిగిన చిరుధాన్యమైన రాగులను (ఫింగర్ మిల్లెట్) పండించే రైతు. దశాబ్దాలుగా వ్యవసాయంలో జరిగిన ప్రతి మార్పుకీ - అది మంచిది కావచ్చు చెడ్డది కావచ్చు తరచుగా ఉండేట్టు భయంకరమైనదీ కావచ్చు - ఆయన సాక్షి.

"నా చిన్నతనంలో, ఆనై (ఏనుగులు), రాగుల సువాసన వాటిని ఆకర్షించినప్పుడు, ఆ సీజన్‌లో కొన్ని రోజులు మాత్రమే వచ్చేవి." మరి ఇప్పుడు? "అవి తరచుగా వస్తున్నాయి. పంటల్నీ, పండ్లనూ తినడం అలవాటు చేసుకున్నాయి."

అందుకు రెండు కారణాలను నాగన్న తమిళంలో వివరించారు. “1990 తర్వాత, ఈ అడవిలో ఏనుగుల సంఖ్య పెరిగింది. అదే సమయంలో అడవి పరిమాణం, నాణ్యత తగ్గిపోయాయి. కాబట్టి, అవి తమ ఆహారం కోసం ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఒక మంచి హోటల్‌కి వెళ్లినప్పుడు దాని గురించి మీ స్నేహితులకు ఎలా చెప్తారో, అవి కూడా వాటి స్నేహితులతో చెబుతాయి.” అంటూ ఆయన నిట్టూర్చారు, నవ్వారు కూడానూ. ఆ వ్యంగ్య పోలిక ఆయన్ని రంజింపజేసింది, నన్ను ఆశ్చర్యపరిచింది.

PHOTO • M. Palani Kumar
PHOTO • Aparna Karthikeyan

ఎడమ : నాగిరెడ్డి పొలాల్లో రాగుల పంట కోతకు సిద్ధంగా ఉంది . కుడి : ఏనుగులను తరిమికొట్టేందుకు అటవీ శాఖ ఇచ్చిన ఎల్ ఈడి టార్చ్ వెలుతురును తన కొడుకు ఆనందరాము చూపిస్తుంటే నాగిరెడ్డి చూస్తున్నారు

వాటిని తిరిగి అడవికి ఎలా పంపిస్తారు? “మేము కూచ్చల్ [చాలా శబ్దం] చేస్తాం. బ్యాటరీని వెలిగిస్తాం,” ఎల్ఇడి టార్చ్‌ని చూపిస్తూ ఆయన వివరించారు. ఆనంద అని పిలవబడే ఆయన కొడుకు ఆనందరాము, అటవీ శాఖ అతనికి ఇచ్చిన లైట్‌ను ఆన్ చేశారు. అది మంచి ప్రకాశవంతమైన తెల్లని కాంతిని విరజిమ్ముతోంది. "కానీ రెండు ఏనుగులు మాత్రమే వెళ్లిపోతాయి" అని నాగన్న చెప్పారు.

"మొట్టై వాల్ కళ్ళు మూసుకుంటూ వెనుదిరిగి, తినడం కొనసాగిస్తాడు," ఆనంద వరండాలో ఒక మూలకు వెళ్ళి, టార్చ్‌కి తన వీపు చూపిస్తూ ప్రదర్శించారు. “మొట్టై వాల్ పూర్తిగా తినే వరకు వెళ్ళడు. టార్చిని మెరిపిస్తూ, మీరు మీ పని చేయండి; నేను నా పని,కడుపు నిండే వరకు తినడం, చేస్తాను- అని వాడు చెబుతున్నట్లుగా ఉంటుంది."

పొట్ట పెద్దది కాబట్టి మొట్టై వాల్ దొరికినవన్నీ తింటాడు. రాగులు అతనికి చాలా ఇష్టమైనవి. పనసపండు కూడా అంతే. అతనికి ఎత్తైన కొమ్మలు అందకపోతే, ముందు కాళ్ళను చెట్టుపై ఉంచి, తన పొడవాటి తొండాన్ని ఉపయోగించి పండ్లను కోస్తాడు. చెట్టు ఇంకా ఎక్కువ ఎత్తుగా ఉంటే, శుభ్రంగా దాన్ని పడగొట్టేస్తాడు. పండ్లు తింటూ పండుగచేసుకుంటాడు. "మొట్టై వాల్  10 అడుగుల పొడవుంటాడు" అని నాగన్న చెప్పారు. "అతను రెండు కాళ్ళెత్తి నిల్చుంటే మరో ఆరు లేదా ఎనిమిది అడుగుల ఎత్తువి అందుకోగలడు" అని ఆనంద చెప్పారు.

“కానీ మొట్టై వాల్ మనుషులను బాధించడు. మొక్కజొన్నలు, మామిడిపండ్లు తింటాడు. పొలంలో ఏ పంట వేసినా తొక్కేస్తాడు. ఏనుగులు వదిలేసినవాటిని కోతులు, అడవి పందులు ముగించేస్తాయి," అంటారు నాగన్న. మనం నిత్యం కాపలాగా ఉండాలి. లేకపోతే కోతులు దాడి చేయడంతో వంట గదిలోని పాలు, పెరుగు కూడా పోతాయి.

“ఇది చాలదన్నట్లు అడవి కుక్కలు మన కోళ్ళను తింటాయి. చిరుతపులులు వచ్చి మన కాపలా కుక్కలను తింటాయి. పోయిన వారమే…” ఆయన చూపుడువేలు పెద్ద పిల్లి వేటాడే మార్గాన్ని చూపెడుతుంటే, నేను వణికాను. నా వణుకు ఉదయపు చలి వలన మాత్రమే కాదు, అనిశ్చిత పరిస్థితుల మధ్య ప్రమాదపు అంచున జీవించడమనే ఆలోచన వలన కూడా.

వారు ఎలా నెట్టుకొస్తున్నారు? నేను అడిగాను. "మా ఇంటికి సరిపడేటన్ని రాగుల ను మాత్రమే అర ఎకరంలో పండిస్తున్నాం" అని ఆనంద వివరించారు. “80 కిలోల బస్తాకు 2,200 రూపాయలంటే, మేం లాభం కోసం చూసుకుంటే, ఆ ధర చాలా తక్కువ. అదీగాక ఈ అకాల వర్షమొకటీ. ఇంకా ఏదైనా మిగిలితే, జంతువులు తింటాయి," అని అతను చెప్పారు. "మేము మా పొలాల్లో యూకలిప్టస్ చెట్లు వేశాం. ఈ ప్రాంతంలోని ఇతర రైతులు రాగి పండించటం నుండి గులాబీలకు మారారు.

ఏనుగులు కట్ ఫ్లవర్స్ జోలికి వెళ్ళవు. ఇప్పటికైతే ఏంలేదు…

PHOTO • M. Palani Kumar

ఏనుగులు వచ్చే దారిని చూపిస్తున్న ఆనందరాము . పంటలనూ పండ్లనూ తినేందుకు జంతువులు తరచుగా వస్తుంటాయి

*****

చిలుకల్ని పారదోలే చిరుధాన్యాల చేను పక్కనే
ఉయ్యాలపై కూర్చుని ఎదురుచూస్తూన్నాను
అతనొచ్చినపుడు, నా ఉయ్యాలను కొంచం ఊపమన్నాను
సరేనమ్మాయీ అంటూ ఉయ్యాలలూపాడు
నా పట్టు జారిపోతుందన్నట్టు అతని ఎదపై వాలాను
నిజమేననుకొని అతను, నన్ను గట్టిగా పట్టుకునేందుకు ముందుకు తూగాడు
సోయిలేనట్లుగా ఆ ఎదపై నిలిచిపోయాను

భావోద్వేగం నిండిన ఈ పంక్తులు 2,000 సంవత్సరాల నాటివి. కపిలర్ రచించిన ‘ కలిత్తొగై ’ లోనివి. సంగమ్ యుగానికి చెందిన పద్యం. ఇందులో చిరుధాన్యాల ప్రస్తావన రావడం అసాధారణమేమీ కాదని, OldTamilPoetry.com అనే బ్లాగ్‌ను నడుపుతున్న సెందిల్ నాథన్ అన్నారు. ఈ బ్లాగులో ఈయన అనువాదం చేసిన సంగమ్ సాహిత్యం లోని కవిత్వ రచనలుంటాయి.

"చిరుధాన్యాలు పండించే చేలు సంగమ్ నియమావళిలో ప్రేమ కవితలకు నేపథ్యంగా ఉంటాయి" అని సెందిల్ నాథన్ చెప్పారు. “చిరుధాన్యాలను 125 సార్లు ప్రస్తావించినట్లు ఒక ప్రాథమిక పరిశోధన చూపిస్తుంది. ఇది బియ్యం గురించిన ప్రస్తావనల కంటే కొంచెం ఎక్కువ. కాబట్టి సంగమ్ యుగంలో (సుమారు 200 BCE - 200 CE) ప్రజలకు చిరుధాన్యాలే ముఖ్యమైన ధాన్యాలని ఊహించవచ్చు. ఆ సమూహంలో, తినై (కొర్రలు - ఫాక్స్‌టైల్ మిల్లెట్) ప్రధానంగా ఉంటుంది, దాని తర్వాతి స్థానంలో వరగు (అరికె లేదా కోడో మిల్లెట్) ఉంటుంది.

రాగుల మూలస్థానం తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా అని కె.టి. అచ్చయ్య తన పుస్తకం ఇండియన్ ఫుడ్ : హిస్టారికల్ కంపానియన్ ‌లో రాశారు. ఇది అనేక వేల సంవత్సరాల క్రితంమే దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించింది."కర్ణాటకలోని తుంగభద్రానది ఒడ్డున ఉన్న హళ్ళూర్ సైట్(1800 BCE)"లోను, "తమిళనాడులోని పైయంపల్లి (1390 BCE)" లోను దీనిని కనుగొన్నారు. ఈ ప్రదేశాలు నాగన్న ఇంటికి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

భారతదేశంలో రాగుల ఉత్పత్తిలో కర్ణాటక అగ్రస్థానంలో ఉండగా, తమిళనాడు రెండవ స్థానంలో ఉంది. ప్రతి ఏటా 2.745 లక్షల మెట్రిక్ టన్నుల రాగులు పండుతాయి. నాగిరెడ్డి గ్రామం ఉన్న ఒక్క కృష్ణగిరి జిల్లాలోనే రాష్ట్రంలోని రాగుల్లో 42 శాతం ఉత్పత్తి అవుతోంది.

యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (FAO) రాగుల యొక్క అనేక ' ప్రత్యేక లక్షణాలను ' పేర్కొంది. రాగుల ను పప్పుదినుసులతో పాటు అంతరపంటగా వేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు అనేది అందులో ఒకటి. ఇది తక్కువ ఉత్పాదకాలతో గణనీయమైన దిగుబడిని ఉత్పత్తి చేయగలదు. సారం తక్కువ ఉన్న నేలలలో కూడా పండుతుంది.

PHOTO • Aparna Karthikeyan
PHOTO • Aparna Karthikeyan

రాగుల పంటలో రాగి కంకి ( ఎడమవైపు ), దాని గింజలు . తమిళనాడులో పండే రాగుల్లో 42 శాతం కృష్ణగిరి జిల్లాయే ఉత్పత్తి చేస్తుంది

ఇంకా, రాగుల ఉత్పత్తి తగ్గింది, వాటికి ప్రజాదరణ కూడా క్షీణించింది. ఇదే సమయంలో హరిత విప్లవం ప్రభావం వలన బియ్యం, గోధుమలకు ప్రజాదరణ పెరగడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ హరిత విప్లవం బియ్యం, గోధుమలను ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా అందరికీ సులభంగా లభ్యమయ్యేలా చూసింది.

గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం అంతటా ఖరీఫ్ సీజన్‌లో రాగుల ఉత్పత్తి ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. కానీ, 2021 నాటికి దాదాపు 2 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని భావించారు. అయితే, 2022కి సంబంధించిన మొదటి అంచనాలు మాత్రం క్షీణతను సూచిస్తున్నాయి. 2010లో ఈ సంఖ్య 1.89 మిలియన్ టన్నులు. 2022 ఆర్థిక సంవత్సరానికి అంచనా - ప్రాథమిక అంచనాలు - సుమారు 1.52 మిలియన్ టన్నులు.

చిరుధాన్యాలపై పనిచేసిన అభివృద్ధి సంస్థ, ధన్(డిఎచ్ఏఎన్) ఫౌండేషన్ ప్రకారం, “వాటి పోషక లక్షణాలు, వాతావరణ స్థితిస్థాపకత ఉన్నప్పటికీ, భారతదేశంలో రాగుల వినియోగం 47 శాతం తగ్గింది . ఇతర చిరుధాన్యాలను తీసుకోవడం కూడా గత ఐదు దశాబ్దాలలో 83 శాతం తగ్గింది.

దేశంలోనే అతిపెద్ద రాగుల ఉత్పత్తిదారు, పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో "గ్రామీణ కుటుంబాలలో ఒక నెలకు సగటు తలసరి రాగుల వినియోగం 2004-05లో 1.8 కిలోలు ఉంటే, 2011-12 నాటికి అది 1.2 కిలోలకు పడిపోయింది."

కొన్ని సమాజాలు, భౌగోళిక ప్రాంతాలు రాగుల ను పండించడాన్నీ తినడాన్నీ కొనసాగించడం వల్ల ఈ పంట మనుగడ కొనసాగింది. అటువంటి ప్రాంతాలలో కృష్ణగిరి జిల్లా కూడా ఒకటి.

*****

మీరు ఎంత ఎక్కువ రాగులు పండిస్తే, అంత ఎక్కువ పశువులను పోషించగలరు, [మెరుగైన] వారపు ఆదాయం కూడా. పశుగ్రాసం కొరతతో ప్రజలు తమ పశువులను అమ్ముకున్నారు.
గోపకుమార్ మీనన్, రచయిత మరియు రైతు

PHOTO • Aparna Karthikeyan
PHOTO • Aparna Karthikeyan

ఎడమ : గొల్లపల్లి గ్రామంలో గోపకుమార్ మీనన్ తన పొలంలో రాగి కాడ పట్టుకొని ఉన్నారు . కుడి : వర్షంతో దెబ్బతిన్న రాగి కంకి

నేను నాగన్న ఇంటికి వెళ్లడానికి ముందు రోజు రాత్రి, ఆ ప్రాంతంలోని మా అతిథేయి గోపకుమార్ మీనన్ నాకు ఒక థ్రిల్లింగ్ ఏనుగు కథను చెప్పారు. అవి డిసెంబర్ నెల మొదటి రోజులు. మేము గొల్లపల్లి గ్రామంలో అతని ఇంటి డాబా మీద కూర్చున్నాము. మా చుట్టూ ప్రతిదీ నల్లగా, చల్లగా, వింత అందంతో ఉంది. కొద్దిపాటి రాత్రి జీవితం మాత్రమే మేల్కొని ఉంది; వారు పాడుతున్నారు, వారు కూనిరాగం తీస్తున్నారు. ఇదంతా ఒకే సమయంలో భరోసానూ కలిగిస్తుంది, పరాకునూ కలిగిస్తుంది.

కొంచెం దూరంలో ఉన్న మామిడి చెట్టు వైపు చూపిస్తూ “మొట్టై వాల్ ఇక్కడే ఉన్నాడు. వాడికి మామిడిపండ్లు కావాలి. కానీ పండ్లని అందుకోలేకపోయాడు. దాంతో చెట్టునే పడగొట్టేశాడు." అన్నారు గోపా. నేను చుట్టూ చూస్తున్నాను, ప్రతిదీ ఏనుగు ఆకారంలోనే ఉన్నట్టనిపిస్తోంది. "చింతించకండి. వాడిప్పుడు ఇక్కడ ఉంటే, మీకు తెలిసిపోతుంది" అని గోపా నాకు హామీ ఇచ్చారు.

ఆ తర్వాత ఒక గంటసేపు గోపా నాకు చాలా కథలు చెప్పారు. ఆయన బిహేవియరల్ ఎకనామిక్స్‌లో రిసోర్స్ పర్సన్, రచయిత, కార్పొరేట్ ఫెసిలిటేటర్. 15 ఏళ్ల క్రితం గొల్లపల్లిలో కొంత భూమిని కొన్నారు. వ్యవసాయం చేయాలనుకున్నారు. సాగుచేయటం ఎంత కష్టమో ఆయనకు అప్పుడే అర్థమైంది. ఆయనిప్పుడు తన రెండు ఎకరాలలో నిమ్మచెట్లు, ఉలవల సాగును మాత్రమే అంటిపెట్టుకునివున్నారు. పూర్తిస్థాయి రైతులకు - వ్యయసాయం ద్వారా వచ్చే ఆదాయంపై ఆధారపడేవారు - చాలా కష్టం. ప్రతికూల విధానాల మార్గదర్శకత్వం, వాతావరణ మార్పులు, అతి తక్కువ ఉత్పత్తి సేకరణ ధర, మానవ-జంతు సంఘర్షణ- ఇవన్నీ కలిసి సంప్రదాయ రాగి పంటను నాశనం చేశాయని ఆయన చెప్పారు.

"ప్రతిపాదించబడి, ఆ తర్వాత రద్దు చేయబడిన వ్యవసాయ చట్టాలు ఎందుకు పని చేయవు అనేదానికి అద్భుతమైన ఉదాహరణ రాగులే" అని గోపా చెప్పారు. "మీరు దానిని ఎవరికైనా విక్రయించవచ్చని చట్టం చెప్పింది. తమిళనాడునే తీసుకోండి. ఇదే సాధ్యమైతే, రైతులు రాగుల ను మరింత ఎక్కువగా పండించేవారు, అవునా? కనీస మద్దతు ధర క్వింటాల్ కు 3,377 రూపాయలు ఉన్న కర్ణాటకకు ఎందుకు అక్రమంగా రవాణా చేస్తారు?

తమిళనాడులోని ఈ ప్రాంతంలోని ప్రజలు మద్దతు ధరను అర్థంచేసుకోలేకపోతున్నారని తేలింది. అందుకే, గోపా మీనన్ చెప్పినట్లుగా, కొందరు దానిని సరిహద్దుల గుండా స్మగ్లింగ్ చేస్తారు.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

గొల్లపల్లికి వెలుపల , రైతు శివ కుమారన్ కౌలుకు తీసుకున్న పొలాల్లో రాగుల పంటను కోస్తున్న కార్మికులు

ప్రస్తుతం తమిళనాడులోని హోసూర్ జిల్లాలో, “80 కిలోల అత్యుత్తమ నాణ్యతకలిగిన రాగుల కు 2,200 రూపాయలు, రెండవ రకం నాణ్యతకు 2,000 రూపాయలు ఉంది. కాబట్టి కిలో రాగుల ధర 25 నుండి 27 రూపాయల మధ్య ఉంటుంది." అన్నారు ఆనంద.

ఇప్పుడిది కమీషన్ ఏజెంట్ వారికి ఇంటి వద్ద చెల్లించే ధర. రాగులు చేతులు మారినప్పుడు ఆ ఏజెంట్ తన లాభాన్ని పొందుతాడు. ఒక బ్యాగ్‌కి దాదాపు 200 రూపాయలు ఉంటుందని ఆనంద అంచనా వేస్తున్నారు. రైతులు నేరుగా మండీకి వెళ్లి విక్రయించినట్లయితే, వారు అత్యధిక నాణ్యత కలిగిన 80 కిలోల బస్తాకు 2,350 రూపాయలు పొందవచ్చు. కానీ అతనికి దాని వల్ల లాభం కనిపించడం లేదు. "ఏమైనప్పటికీ నేను మండిలో లోడింగ్‌కు, టెంపోకు, కమీషన్ కోసం కూడా చెల్లించాలి ..."

కర్ణాటకలో కూడా, తమిళనాడులో కంటే కనీస మద్దతు ధర (MSP) వాస్తవానికి మెరుగ్గా ఉన్నప్పటికీ, సేకరణ ఆలస్యం అవుతున్నందున చాలా మంది రైతులు మద్దతు ధర కంటే 35 శాతం తక్కువకు విక్రయిస్తున్నారు .

"ప్రతిచోటా సరైన MSPని అమలు చేయండి" అని గోపా మీనన్ అన్నారు. “కిలో 35 రూపాయలకు మీరు కొంటే, జనం పండిస్తారు. మీరలా చేయకపోతే, ఈ ప్రాంతంలో ఏమి జరుగుతోందో చూడండి - ఇక్కడ ప్రజలు పువ్వులు (కట్ ఫ్లవర్స్), టమోటాలు, ఫ్రెంచ్ బీన్స్‌ పండించేందుకు మారుతున్నారు. ఇక అదే శాశ్వతం అవుతుంది.”

ఆ ఊరిలో గోపా పొరుగువారు, మధ్య వయస్కుడైన చిన్న రైతు సీనప్ప ఎక్కువ టమాటాలు పండించాలనుకుంటున్నారు. "ఇది లాటరీ. టమోటాలు పండించి 3 లక్షలు సంపాదించిన ఒక రైతు ప్రతి రైతునూ ప్రభావితం చేస్తాడు. కానీ అందుకు పెట్టుబడి(ఇన్‌పుట్) ఖర్చులు చాలా ఎక్కువ. ధరలో హెచ్చుతగ్గులు కూడా నమ్మశక్యంగా ఉండవు. ఒకోసారి కిలో ధర ఒక రూపాయి ఉంటుంది, మరోసారి అత్యధికంగా కిలో ధర 120 రూపాయలకు చేరుకుంది." అంటారు సీనప్ప.

శీనప్పకు గిట్టుబాటు ధర లభిస్తే టమాటాలు పండించటం ఆపి, రాగులే ఎక్కువగా పండించేవారు. “మీరు ఎంత ఎక్కువ రాగులు పండిస్తే, అంత ఎక్కువ పశువులను పోషించగలరు. పైగా మీరు వారానికి మరింత ఎక్కువ ఆదాయాన్ని కూడా పొందవచ్చు. మేత కొరత కారణంగానే ప్రజలు పశువులను అమ్ముకుంటున్నారు.”

PHOTO • M. Palani Kumar
PHOTO • Aparna Karthikeyan

ఎడమ : కోసిన పంటను కట్టలుగా కట్టారు . రాగులు రెండేళ్ల వరకు నిల్వ ఉంటాయి . కుడి : గుట్టగా పేర్చిన కాడలలను పశువుల మేతగా ఉపయోగిస్తారు

ఇక్కడి ప్రజలందరికీ రాగులు ప్రధాన ఆహారం, అని గోపా మీనన్ నాతో అన్నారు. “మీకు డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే మీరు రాగుల ను అమ్మండి. దీన్ని రెండేళ్ల వరకు నిల్వ ఉంచుకుని, అవసరమైనప్పుడు మెత్తగా పిండిచేసుకుని ఆహారానికి వాడుకోవచ్చు. ఇతర పంటలు ఇంత బాగా ఉండవు. మీరు కొడితే ఈ రోజు జాక్‌పాట్‌ కొడతారు, లేదంటే పూర్తిగా మునిగిపోతారు.”

ఈ ప్రాంతంలో అనేక వివాదాలు ఉన్నాయి, అవి సంక్లిష్టంగా కూడా ఉన్నాయి. "ఇక్కడ పండించే కట్ ఫ్లవర్స్ ప్రధానంగా చెన్నై మార్కెట్‌కి వెళ్తాయి" అని గోపా మీనన్ చెప్పారు. “ఒక వాహనం పూలు పండించే తోట గేటు దగ్గరకే వస్తుంది, మీ డబ్బు మీరు వెంటనే పొందుతారు. పంటలలో అత్యంత విలువైన పంట అయిన రాగుల కు అలాంటి ఎటువంటి హామీ లేదు. దేశీ రకం, హైబ్రిడ్ లేదా సేంద్రీయ రకం- ఇలా దేనికైనా ఒకటే ధర ఉంటుంది.

“ధనిక రైతులు విద్యుత్ కంచెలు, గోడలు కట్టి ఏనుగులను పేద రైతుల ప్రాంతాలకు మళ్లిస్తారు. ధనిక రైతులు వేరేవేవో పండిస్తారు. పేద రైతులు రాగులను పండిస్తున్నారు. ఇక్కడి రైతులు ఏనుగుల పట్ల చాలా సహనంతో ఉంటారు. వారి సమస్య ఏమిటంటే, మొత్తం జరిగే నష్టంలో అవి తినేది కేవలం పదో వంతు మాత్రమే ఉంటుంది. మొట్టై వాల్‌ని నేను 25 అడుగుల దూరంలో చూశాను,” అని గోపా చెప్పారు. ఏనుగు కథలు మళ్లీ ముందుకొచ్చాయి. “ప్రజల మాదిరిగానే, మొట్టై వాల్ ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు చెందినవాడు. అతను తమిళ నివాసి. అలాగే గౌరవ కన్నడిగ కూడా. మఖానా అతని డిప్యూటీ. అతను మఖానాకు విద్యుత్ కంచెను ఎలా దాటాలో చూపిస్తాడు."

ఇదంతా వింటుంటే, మొట్టై వాల్ ఆ డాబా పక్కనే ఉండి వింటున్నట్టు అనిపించింది. “అయితే నేను హోసూర్ వెళ్లి కారులో పడుకుంటాను,” నేను భయంగా నవ్వాను. గోపా నవ్వారు. "మొట్టై వాల్ భారీకాయుడు, చాలా పెద్దగా ఉంటాడు. కానీ అతను చాలా సున్నితమైన వ్యక్తి." అన్నారు. నేను అతన్ని - లేదా మరే ఇతర ఏనుగులనైనా - ఎప్పుడూ కలవకూడదని ప్రార్థిస్తున్నాను. కానీ దేవతలకు వేరే ప్రణాళికలు ఉన్నాయి…

*****

అసలైన స్థానిక రాగులకు దిగుబడి తక్కువగా ఉంటుంది , కానీ రుచి , పోషకాలు ఎక్కువగా ఉంటాయి .
కృష్ణగిరిలో రాగులు పండించే రైతు నాగిరెడ్డి

PHOTO • M. Palani Kumar

ఎడమ నుండి : వడ్రపాళైయం కుగ్రామంలోని వారి ఇంటి వరండాలో నాగన్న ( నాగిరెడ్డి ), అతని కోడలు ప్రభ , కుమారుడు ఆనంద . ' నాకు ఐదు రకాల రాగులు గుర్తున్నాయి' అంటారు నాగన్న

నాగన్న యువకుడిగా ఉన్నప్పుడు రాగులు అతని ఛాతీ వరకూ ఎత్తు పెరిగేవి. ఆయన పొడవాటి మనిషి - దాదాపు 5 అడుగుల 10 అంగుళాలు ఉంటారు, సన్నగా ఉంటారు. అతను ధోవతి, చొక్కా ధరిస్తారు. భుజాల చుట్టూ తువ్వాలు చుట్టుకొని ఉంటారు. కొన్నిసార్లు కర్రను పట్టుకుంటారు. బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మచ్చలేని తెల్లటి చొక్కా ధరిస్తారు.

"నాకు ఐదు రకాల రాగులు గుర్తున్నాయి," వరండాలో కూర్చుని, గ్రామాన్నీ ఇంటినీ ప్రాంగణాన్నీ ఒకేసారి గమనిస్తూ అన్నారు. “అసలు నాటు (స్థానిక) రాగి కి నాలుగు లేదా ఐదు రెల్లలు మాత్రమే ఉంటాయి. దిగుబడి తక్కువగా ఉంటుంది కానీ రుచి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

హైబ్రిడ్‌ రకాలు 1980లో కనిపించాయని ఆయన గుర్తుచేసుకున్నారు. వాటికి పేర్లుగా మొదటి అక్షరాలు ఉన్నాయి -MR, HR- ఇలా. వాటికి ఎక్కువ రెల్లలు ఉన్నాయి. ఒక్కొక్కటి 80 కిలోలుండే ఐదు బస్తాల దిగుబడి నుండి 18 బస్తాలకు దిగుబడి పెరిగింది. కానీ మెరుగైన దిగుబడి రైతులను ఉత్తేజపరచాల్సిన అవసరం ఏమీలేదు. ఎందుకంటే అటువంటి ఆదాయ ప్రయోజనాలతో వాణిజ్యపరంగా సాగు చేయాలంటే వారికి తగినంత ధర లేదు.

ఆయన వ్యవసాయం చేసిన 74 ఏళ్లలో – 12 ఏళ్ల వయసులో ప్రారంభించారు - నాగన్న ఎన్నో పంటలు పండించారు. “మా కుటుంబం తాను కోరుకున్నవన్నీ పండించింది. మా పొలాల్లోని చెఱకుతో బెల్లం తయారు చేశాం. నువ్వులు పండించి, నూనె కోసం చెక్క మిల్లులో గింజలు ఆడించాం. రాగులు , బియ్యం, ఉలవలు, మిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయలు... మా దగ్గర అన్నీ ఉన్నాయి.”

పొలమే అతని పాఠశాల. అధికారికమైన బడి చాలా దూరంలో ఉంది, అందుబాటులో కూడా లేదు. అతను పశువులు, మేకలు ఉన్న కుటుంబ పశుసంపదను కూడా చూసుకున్నారు. అది చాలా బిజీగా ఉండే జీవితం. అందరికీ పని ఉండేది.

నాగన్న ఉమ్మడి కుటుంబం చాలా పెద్దది. వారందరూ - 45 మంది సభ్యుల వరకు లెక్కించారు - అతని తాత కట్టిన పెద్ద ఇంట్లో నివసించారు. 100 సంవత్సరాల వయసున్న పురాతన భవనం.  పశువుల కొట్టం, పాత ఎద్దుల బండి ఉన్నాయి. ఆ సంవత్సరంలో వచ్చే రాగి పంటను నిల్వ చేయడానికి వరండాలో గాదెలు (ధాన్యాగారం) నిర్మించబడ్డాయి.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ : నాగన్న పూర్వీకుల ఇంటి పశువుల కొట్టం . కుడి : పాత ఇంటి వరండా , అందులో నిర్మించిన ధాన్యాగారం

అతనికి 15 ఏళ్ళ వయసులో, నాగన్న కుటుంబ ఆస్తిని కుటుంబ సభ్యులందరికీ పంచిపెట్టారు. భూమిలో వాటా కాకుండా, అప్పటి గోశాల కూడా ఆయన వాటాకు వచ్చింది. దానిని శుభ్రం చేసి, ఇల్లు నిర్మించడం ఆయన వంతైంది. “అప్పట్లో, ఒక్కో సిమెంట్ బస్తా 8 రూపాయల ఖరీదుండేది - అది చాలా ఎక్కువ మొత్తం. ఈ ఇంటిని 1,000 రూపాయలకు కట్టడానికి మేం మేస్త్రీతో ఒప్పందం (అంగీకారం) చేసుకున్నాం.

కానీ అది పూర్తి కావడానికి సంవత్సరాలు పట్టింది. ఒక మేకనీ, 100 బెల్లం దిమ్మల్నీ అమ్మి గోడ కట్టడానికి కొన్ని ఇటుకలను కొన్నారు. ఇల్లు కట్టడానికి కావలసిన వస్తువులన్నీ మాటు వండి (ఎద్దుల బండి)లో వచ్చాయి. అప్పట్లో డబ్బుకు బాగా ఇబ్బందిగా ఉండేది. రాగులు అమ్మితే ఒక పడి కి(ఈ రాష్ట్రంలో ఒక సంప్రదాయ కొలత - 60 పడిలు 100 కిలోలు) 8 అణాలు మాత్రమే వచ్చేవి.

వివాహం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాల ముందు - 1970 లో - నాగన్న చివరకు తన ఇంటికి మారారు. తానెలాంటి ఆధునిక సౌకర్యాలూ జోడించలేదంటూ, " ఏదో ఇక్కడ కొంచం అక్కడ కొంచెం" అన్నారు. ఆయన మనవడు తన వంతు తాను జోడించాడు. ఒక పదునైన సాధనంతో, పేరై (నూనె దీపం ఉంచే గూడు) పైన తన పేరును, తన 'హోదా'ను చెక్కాడు: 'దినేష్ ఈజ్ ద డాన్.' మేము ఆ 13 ఏళ్ల పిల్లాడిని ఆ రోజు ఉదయాన్నే చూశాం. రోడ్డుపై నడుచుకుంటూ బడికి వస్తున్నాడు. డాన్ కంటే మంచి అబ్బాయిలాగానే కనిపించాడు. హల్లో అని గొణిగి, పారిపోయాడు.

తనొక డాన్‌ని అనుకుంటున్న పిల్లాడి తల్లి ప్రభ మాకు టీ అందిస్తోంది. నాగన్న ఆమెను ఉలవలు తీసుకురమ్మని అడిగారు. ఆమె వాటిని ఒక రేకు డబ్బా లో తీసుకువస్తుండగా, కదిలించినప్పుడల్లా ఒక రకమైన సంగీతాన్ని వినిపిస్తోంది. వాటిని కొళంబు (గ్రేవీ)గా ఎలా వండాలో ఆయన వివరిస్తున్నారు. పచ్చిగానే తినండి, “ పరవాయిల్లా [మరేం ఫరవాలేదు]” అని చెప్పారు. అందరం చేతినిండా తీసుకున్నాం. కొచం వగరుగా, కరకరలాడుతూ రుచిగా ఉంది. "వేయించి ఉప్పు చల్లితే చాలా రుచిగా ఉంటుంది," అని నాగన్న చెప్పారు. అందులో మాకస్సలు అనుమానమే లేదు.

వ్యవసాయంలో ఏం మార్పు వచ్చిందని అడిగాను. "అంతా," అతను సూటిగా చెప్పారు. "కొన్ని మార్పులు మంచివి, కానీ జనం," అంటూ తల పంకించారు. "ఇక పని చేయకూడదనుకుంటున్నాను." 86 ఏళ్ల వయస్సులో, ఆయన ఇప్పటికీ ప్రతిరోజూ పొలానికి వెళ్తారు. తనను ప్రభావితం చేసే రోజువారీ సమస్యలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. "ఇప్పుడు, మీకు భూమి ఉన్నా కూడా, మీకు కూలీలు దొరకరు," అని అతను ఎత్తి చూపారు.

PHOTO • M. Palani Kumar

తన ఇంటి వరండాలో కూర్చుని , నాగన్న తన చిన్ననాటి కథలను చెబుతారు

" రాగుల ను కోయడానికి యంత్రాలు ఉన్నాయని జనం మీకు చెబుతారు.” అన్నారు ఆనంద. “కానీ యంత్రం రెల్లల మధ్య తేడాను గుర్తించదు. ఒక కదిర్ [ఎన్ను/కంకి] లో ఒక రెల్ల పండి ఉండవచ్చు, మరొకటి ఎండిపోయి ఉండవచ్చు, ఇంకొకటి పాలుపోసుకుని ఉండవచ్చు. యంత్రం వాటిని మొత్తంగా కలిపి లాగేస్తుంది. వాటిని బస్తాలో నింపినప్పుడు, అది వృథాగా పోతుంది, బూజు పట్టిన వాసన వస్తుంది." చేతితో ప్రాసెస్ చేయడం శ్రమతో కూడుకున్న పని. "కానీ ఇది చాలా కాలం పాటు నిలవ ఉండేలా చేస్తుంది."

శివ కుమారన్ కౌలుకు తీసుకున్న రాగుల పొలాన్ని పదిహేను మంది మహిళలు చేతితో కోస్తున్నారు. తన కొడవలిని చంక కింద ఉంచుకొని, 'సూపర్‌డ్రై ఇంటర్నేషనల్' అని ముద్రించిన టీ-షర్ట్‌పై టవల్‌తో కప్పుకుని, శివ రాగుల గురించి ఉద్వేగంగా మాట్లాడారు.

గొల్లపల్లి వెలుపల ఉన్న అతని పొలం కిందటి కొన్ని వారాల్లో పెద్ద గాలీ వానల్ని చూసింది. రైతుదనం మీద గొప్ప ఆసక్తి కలిగిన పాతికేళ్ళ రైతు శివ, ఆ వానతడి రోజుల గురించీ, అందువల్ల దిగుబడికి జరిగిన దయనీయమైన నష్టం గురించీ నాకు చెప్పారు. కంకులన్నీ చిందరవందరగా పడిపోయాయి. మహిళలు ముంగాళ్ళ మీద కూర్చొని, కొడవళ్లతో కోసి రాగి కంకులను కట్టలుగా పేర్చారు. దిగుబడి తగ్గింది, అయితే కోత కోసే మహిళల పనిగంటలు ఒక రోజు నుంచి రెండు రోజులకు పెరిగాయి.కానీ భూమి లీజు (కౌలు) ధర మాత్రం మారలేదు- అని శివ ఎత్తి చూపారు.

“ఈ పొలానికి – రెండెకరాల లోపే – నేను కౌలుగా ఏడు బస్తాల రాగులు చెల్లించాలి. మిగిలిన 12 లేదా 13 బస్తాలను నేను ఉంచుకోవడమో, అమ్మటమో చేయొచ్చు. కానీ, కర్ణాటక ధరలైతే మాత్రమే మీరు లాభాన్ని చూడగలరు. తమిళనాడులో మాకు కిలో 35 రూపాయలు ఉండాలి. ఇది రాసుకో,” అని నాకు సూచించారు. నేను నోట్ చేసుకున్నాను...

తన పెరట్లోకి తిరిగివచ్చిన నాగన్న నాకొక పాత గానుగరాయిని చూపించారు. ఇది ఒక భారీ స్తూపాకారపు రాయి. దీనిని పశువులు లాగుతాయి. ప్రత్యేకంగా ఆవు పేడతో అలికి తయారు చేసిన గట్టి నేలపై విస్తారంగా పరచి వున్న రాగుల పంటపై ఈ రాయిని నడిపిస్తారు. నెమ్మదిగా, కానీ నేర్పుగా, ఈ రాయి రెల్లలను నలుస్తుంది. రాగులు , వాటి కాండాలు విడివిడిగా సేకరిస్తారు. ఆ తర్వాత పొట్టు వేరుచేసిన రాగులను ఇంటి ముందు తవ్విన పాతర్లలో నిల్వ చేస్తారు. ఇంతకుముందు వాటిని జనపనార బస్తాలలో ఉంచేవారు. ఇప్పుడు తెల్లటి ప్లాస్టిక్‌ సంచులలో ఉంచుతున్నారు.

"లోపలికి రండి. భోజనం చేయండి" అని నాగన్న మమ్మల్ని ఆహ్వానించారు. వంటగదిలో కొన్ని కథలు వినొచ్చనే ఆశతో, నేను ఆత్రంగా ప్రభను అనుసరించాను.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: గొల్లపల్లి బయట ఉన్న తన కౌలు భూమిలో వర్షంతో దెబ్బతిన్న రాగి పంటను కోస్తున్న శివ కుమారన్. కుడి: శివ పొలంలో ఎన్నులు కోసి కట్టలు కట్టే పనిచేస్తున్న కార్మికులు

*****

వానని తాగిన నేలలో పండించిన
పావురాయి గుడ్లవంటి రాగులను
పాలతో వండీ తేనెలు కలిపీ
నిప్పులపై కాల్చిన కండగలిగిన కుందేటి మాంసంతో
ఇంటిల్లిపాదితో కలిసి భోంచేస్తాను

పుఱనానూరు-34, అలత్తూర్ కిళార్ రచించిన సంగమ్ పద్యం
సెందిల్ నాథన్ అనువాదం

ఆరోగ్యానికి మేలుచేసే రాగు ల్లో కాల్షియం, ఐరన్ ఎక్కువ మోతాదుతో ఉంటాయి. గ్లూటెన్ ఉండదు. ఎక్కువ కాలం -రెండేళ్ళ వరకూ - నిల్వ ఉంటాయి. 2వేల ఏళ్ల కిందట కూడా తమిళులు మాంసం, పాలు, తేనె, కలిపి చాలా ఆసక్తికరమైన చిరుధాన్యాల వంటకం తయారుచేసుకునేవారు. ఇప్పుడు రాగులను భోజనంగానే కాకుండా చిరుతిళ్లుగానూ తీసుకుంటూ పసిపిల్లలకూ అందిస్తున్నారు. తమిళనాడులో ఆయా ప్రాంతాల్లో వారికి తమ సొంత వంటకాల తయారీ విధానాలున్నాయి. కృష్ణగిరి జిల్లాలో రాగిముద్ద లేదా కలి చేసుకుంటారు. ప్రభ దీన్ని ఎలా చేయాలో చూపిస్తోంది

మేం ఆమె వంటగదిలో ఉన్నాం. అక్కడ సిమెంట్ ప్లాట్‌ఫామ్‌ మీద స్టీల్ స్టవ్ కూర్చునివుంది. పొయ్యిపై ఉన్న అల్యూమినియం కడాయి (గుండ్రని పాత్ర) లో ఆమె నీళ్లు పోసింది. ఓ చేత్తో తెడ్డు, మరో చేత్తో రాగి పిండి గిన్నె పట్టుకుని ఉంది.

తమిళం వచ్చా? అంటూ నేనే మాటలు మొదలుపెట్టాను. సల్వార్ కమీజ్ వేసుకుని, కొద్దిపాటి నగలు, చిరునవ్వు ధరించిన ప్రభ (రాదన్నట్టు) తలూపింది. అయితే ఆమెకు తమిళం అర్థమవుతుంది. కాస్త తమిళం కలిసిన కన్నడంలో జవాబులిచ్చింది. తనకు పదిహేనేళ్ల వయసు నుంచి, అంటే “పదహారేళ్లుగా ఈ రాగిముద్ద చేస్తున్నా”నని చెప్పింది.

నీళ్లు మసలకాగుతున్నప్పుడు అందులో పెద్ద గిన్నెతో నేర్పుగా రాగి పిండి పోసింది. నీళ్లు, పిండి కలిసి బూడిదరంగు ముద్దగా మారాయి. పాత్రను పట్టకారుతో గట్టిగా పట్టుకుని తెడ్డుతో వేగంగా కలిపింది. చాలా కష్టమైన పని. శక్తి, నైపుణ్యం ఉండాలి. రాగి కొద్ది నిముషాల్లోనే ఉడికిపోతుంది. పిండి ఉడికి, తెడ్డు చుట్టూ ఉండలా తిరిగింది.

ఆమెను చూస్తుంటే, ఈ ప్రాంతంలోని ఆడవాళ్లు రెండు వేల సంవత్సరాలుగా ఈ పనిచేస్తున్నట్లు అనిపించింది

‘మా చిన్నప్పుడు రాగి ముద్దని కట్టెల పొయ్యిపై మట్టికుండలో చేసేవాళ్లు’ అన్నారు నాగన్న. రుచి చాలా బావుండేదన్నారు. దేశవాళీ రాగుల వల్లే ఆ రుచి అన్నారు ఆనంద. “మీరు ఇంటి బయటవుంటే ఆ ముద్ద గమ గమ వాసనై (ఘుమఘుమ వాసనల) మిమ్మల్ని లోపలికి పిలుస్తుంది.” స్థానిక రాగుల సువాసనను అసాధారణమైనదిగా గుర్తిస్తూ అన్నారు ఆనంద.  “అదే హైబ్రిడ్ రాగి ముద్ద అనుకోండి, దాని వాసన పక్క గదిలోకి కూడా రాదు’ అన్నారు.

PHOTO • Aparna Karthikeyan
PHOTO • Aparna Karthikeyan
PHOTO • Aparna Karthikeyan

ఎడమ: ప్రభ చేసిన రాగిముద్ద. మధ్యలో, కుడివైపు: గ్రానైట్ బండపై తన అరచేతితో వేడి పిండిని తిప్పుతూ ముద్దె (ముద్దలు) చేస్తున్న ప్రభ

అత్తమామలు పక్కన ఉండడం వల్లనేమో, ప్రభ మితంగా మాట్లాడుతోంది. పాత్రను వంటగదిలో ఓ మూలనున్న గ్రానైట్ బండపైకి తీసికెళ్లి పొగలు కక్కే రాగి పిండిని దానిపై వేసింది. వేడివేడి పిండిని అరచేతితో తిప్పుతూ చక్కగా పొడవాటి ముద్దలా సాగదీసింది. నీటిలో చేయి తడిచేసుకుని పెద్ద రాగిముద్దను తీసుకుని అరచేతికీ, బండకూ మధ్య తిప్పుతూ ఒక బంతిలా చేసింది

అలా కొన్ని ముద్దలు చేశాక మాకు స్టీలు పళ్లాల్లో భోజనం వడ్డించారు. “ఇలా తినాలి” అంటూ నాగన్న నా రాగిముద్ద లోంచి కొంచెం తీసుకుని ఉండలు చేసి ఉలవ చారులో ముంచారు. ప్రభ ఓ గిన్నెలో వేయించిన కూరగాయలను తెచ్చిపెట్టింది. మాంచి రుచికర మైన భోజనం అది. చాలాసేపు మాకు ఆకలే కాలేదు.

దగ్గర్లోనే, కృష్ణగిరి జిల్లాలోనే ఉన్న బర్గూర్‌లోని లింగాయతులు రాగి పిండితో రొట్టెలు చేస్తారు. చాన్నాళ్ల కిందటెప్పుడో వెళ్లినప్పుడు పార్వతి సిద్ధయ్య అనే రైతు మహిళ నాకోసం ఆరుబయట కట్టెల పొయ్యిపై వాటిని చేసి పెట్టింది. మందంగా రుచిగా ఉండే ఆ రొట్టెలు చాలా రోజులు నిల్వ ఉంటాయి. పశువుల్ని మేపడానికి అడవికి వెళ్లినప్పుడు కుటుంబంలోని పశుల కాపరులకు ఇదే ప్రధాన భోజనం .

చెన్నైకి చెందిన ఆహార చరిత్రకారుడు, జానపద కథకుడు, షో నిర్వాహకుడు రాకేశ్ రఘనందన్ వాళ్లంట్లో చేసుకునే రాగి వెల్ల అడై (రాగి బెల్లం అట్టు) అనే తీపి రొట్టెల గురించి చెప్పారు. రాగి పిండి, బెల్లం, కొబ్బరిపాలు, యాలకల పొడి, శొంఠి పొడి, నెయ్యి కలిపి వీటిని తయారుచేస్తారు. ‘మా అమ్మవాళ్ళ అమ్మమ్మ ఆమెకు అడై ని ఎలా చేయాలో నేర్పింది. తంజావూరు చుట్టుపక్కల దీన్ని చేస్తారు. కార్తీగై దీపం పండుగ(సంప్రదాయ దీపాల పండుగ) రోజున ఉపవాసం ముగిస్తూ తింటారు. ”మృదువుగా, మందంగా, కొద్దిగా నెయ్యి వేసి చేసే ఈ రొట్టెలు బలవర్ధకమైనవి, ఉపవాసం తర్వాత తినేందుకు మంచి ఆహారం.

పుదుక్కోట్టై జిల్లా చిన్న వీరమంగళం గ్రామంలో విలేజ్ కుకింగ్ చానల్‌కు చెందిన ప్రసిద్ధ షెఫ్‌లు రాగుల భోజనాన్ని చికటికెలో చేస్తారు: కలి, కరువాడు (ఎండుచేప). పాతకాలం వంటలను తిరిగి వ్యాప్తిలోనికి తేవడం వల్లనే వారి యూట్యూబ్ చానల్ పేరుకెక్కింది. “నాకు ఏడెనిమిదేళ్ళ వయసు వరకూ రాగుల ను బాగా తినేవారు. తర్వాత అవి కనుమరుగై బియ్యం వచ్చేశాయి,” అన్నారు చానల్ పెట్టినవారిలో ఒకరైన 33 ఏళ్ళ సుబ్రమణియన్ మాతో ఫోన్ ఇంటర్వ్యూలో.

1.5 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న ఆ చానల్లో రెండేళ్ల నాటి వీడియోను 80 లక్షల మంది చూశారంటే వింతేం లేదు. విసుర్రాయితో రాగులు విసరడం దగ్గర్నుంచి తాటాకు దొన్నెలో పెట్టుకుని తినేవరకు మొత్తం అందులో చూపించారు.

PHOTO • Aparna Karthikeyan
PHOTO • Aparna Karthikeyan

ఎడమ: గత యాభై ఏళ్లుగా రాగుల వినియోగం చాలా వేగంగా తగ్గిపోతోంది. కుడి: నాగన్న పెరట్లో పశువు లతో లాగించే రాగికంకులను నలిచే గుండురాయి

రాగి ముద్ద తయారీ చాలా ఆసక్తికరం. సుబ్రమణియన్ తాత, 75 ఏళ్ల పెరియతంబి రాగి పిండిని గుప్పెడు అన్నంతో కలపడం, వాటిని ముద్దలు చేసి, ముద్దల్ని బియ్యం నీటిలో వేయడం దగ్గరుండి పర్యవేక్షిస్తారు. ఉప్పు వేసిన ఈ ముద్దని కట్టెల పొయ్యిపై కాల్చిన ఎండు చేపలు నంజుకుని తింటారు. “ప్రతిసారి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలతో కలిపే తింటాం,” అంటారతను.

సుబ్రమణియన్ స్థానిక వరి రకాలు, చిరుధాన్యాలలోని పోషక విలువల గురించి ఉద్వేగభరితంగా చెప్తారు. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు పర్యటనలో రాహుల్ గాంధీని ఆయనతో పాటు ఆయన సోదరులు, బంధువులు ఆకట్టుకున్నారు. ప్రతి వీడియోతో, అదృశ్యం అంచున ఉన్న వంటకాలను తిరిగి ఉనికిలోకి తేవడం గురించి వారి వంట ఛానెల్ దృష్టిపెట్టింది.

*****

రసాయనాలు పిచికారీ చేసే రైతులు తమ లాభాలను ఆస్పత్రులకు విరాళంగా ఇస్తారు.
ఆనందరాము, కృష్ణగిరి జిల్లా రాగులు పండించే రైతు

నాగన్న గ్రామం చుట్టుపక్కల రాగి పంట అంతరించిపోవడానికి మూడు కారణాలు ఉన్నాయి. పెట్టుబడి, ఏనుగులు, వాటికంటే తీవ్రమైనది- వాతావరణ మార్పులు. మొదటి కారణం తమిళనాడు అంతటా ఉన్నదే. ఎకరా రాగిపంటకు 16 వేల నుంచి 18 వేల వరకు పెట్టుబడి పెట్టాలి. “వానలు పడ్డప్పుడు, ఏనుగులు దాడి చేసినప్పుడు కోత కోసం కూలీల వెంటపడాలి. అందుకు మరో 2 వేల అదనపు ఖర్చు” అని వివరించారు ఆనంద.

‘‘తమిళనాడులో 80 కిలోల బస్తా అమ్మకం ధర 2,200 రూపాయలు. అంటే కిలోకు 27.50 రూపాయలు. మంచి పంట వచ్చినప్పుడు ఏడాదికి 15 సంచులు వస్తాయి. ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనాలు వాడితే 18 కూడా రావొచ్చు. కానీ, పశువులు హైబ్రిడ్‌ చొప్పను తినడానికి ఇష్టపడవు. అవి నాటు రకాన్నే ఇష్టంగా తింటాయి.’’ అని ఆనంద హెచ్చరిస్తారు.

అదొక ముఖ్యమైన సంగతి, ఎందుకంటే ఒక లోడు రాగి చొప్ప 15,000 రూపాయలకు అమ్ముడవుతుంది. ఒక ఎకరాకు రెండు లోడుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. పశువులు ఉన్న రైతులు దీన్ని మేతగా ఉపయోగిస్తారు. దాన్ని వామి వేసి ఉంచుతారు. అది సంవత్సరం పైవరకూ చక్కగా పాడుకాకుండా ఉంటుంది. “మరుసటి ఏడాది మంచి పంట వచ్చేవరకు మేము రాగుల ను కూడా అమ్మం.  మేము మాత్రమే కాదు, మా కుక్కలు, కోళ్లు కూడా చిరుధాన్యాలే తింటాయి. అందరూ తినడానికి సరిపడినంత మాకు కావాలి.’’ అని ఆనంద ఎత్తిచూపుతారు

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: తన గొర్రెలు, మేకలతో ఆనంద; రాగి చొప్పను జీవాలు తింటాయి. కుడి: నాగన్న పాత ఇంట్లో ప్లాస్టిక్‌ సంచుల్లో నిల్వ చేసివున్న పొట్టుతీసిన ధాన్యం

ఆనంద ప్రాథమికంగా ఒక సత్యాన్ని నిర్ధారిస్తున్నారు: ఈ నేలకూ, ఈ జనానికీ కేవలం ప్రాచీనమైనందునే రాగులు అతి కీలకమైనవి కాదు. పంట గట్టిది, ‘‘రిస్క్‌ లేనిది’’, అంటారు ఆనంద. ‘‘రెండు వారాల దాకా అది వాన, నీళ్లు లేకపోయినా ఉంటుంది. చీడ పురుగులు కూడా ఎక్కువ ఉండవు, కాబట్టి టొమాటో, బీన్సుకు చేసినట్టుగా క్రిమి సంహారక రసాయనాలను పిచికారీ చేస్తూనే ఉండక్కర్లేదు. ఈ రసాయనాలను పిచికారీ చేసే రైతులు తమ లాభాలను ఆసుపత్రులకు విరాళంగా ఇస్తుంటారు.’’

తమిళనాడు ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చొరవ జీవితాన్ని కొంత సులభతరం చేసేట్టుగా ఉంది. చెన్నై, కోయంబత్తూరుల్లోని ప్రజా పంపిణీ కేంద్రాల్లో రాష్ట్రం చిరుధాన్యాలను పంపిణీ చేయడం మొదలుపెట్టింది. ఇదిలావుండగా, మంత్రి ఎం.ఆర్‌.కె.పన్నీర్‌సెల్వమ్ ప్రవేశపెట్టిన 2022 వ్యవసాయ బడ్జెట్‌ ప్రసంగంలో చిరుధాన్యాల ప్రస్తావన 16 సార్లు తెచ్చారు (బియ్యం, వరి కలిపి 33 సార్లు ప్రస్తావనకొచ్చింది). చిరుధాన్యాలకు మరింత ఆదరణ పెంచడానికి చేసిన ప్రతిపాదనల్లో “చిరుధాన్య పోషణ ప్రాధాన్యత మీద అవగాహన కల్పించేందుకుగానూ” రెండు ప్రత్యేక జోన్లను నెలకొల్పడం, రాష్ట్ర, జిల్లా స్థాయిలో మేళా నిర్వహించడం ఉన్నాయి. దీనికోసం 92 కోట్ల రూపాయలు కేటాయించారు.

ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం గా ప్రకటించడం కూడా- ఈ ఆలోచనను ప్రతిపాదించినది ఇండియా- రాగుల తో సహా ‘పోషక ధాన్యాల’ మీద దృష్టి పడేలా చేయనుంది.

అయినప్పటికీ నాగన్న కుటుంబానికి ఈ సంవత్సరం ఒక సవాలుగానే నిలవనుంది. రాగి పంట కోసం కేటాయించిన అర ఎకరం నుంచి కేవలం మూడు సంచులు మాత్రమే వారికి దక్కింది. మిగిలినదంతా వానలు, వన్య ప్రాణుల వల్ల నాశనమైంది. “ రాగి చేతికి వచ్చే కాలంలో ప్రతి రాత్రీ మేము వెళ్లి పొలంలోని మచ్చాన్ (మంచె) మీద పడుకుని కాపలా కాయాల్సి ఉంటుంది.” అంటారు ఆనంద.

ఆయన ఇతర తోడబుట్టినవాళ్లు- ముగ్గురు తమ్ముళ్లు, ఒక చెల్లె ఉన్నారు- వ్యవసాయంలోకి రాలేదు. బదులుగా దగ్గరి పట్టణం థళ్ళిలో రోజువారీ పనులు చేస్తున్నారు. ఆనంద ఆసక్తి అంతా వ్యవసాయం మీదనే. ‘‘నేను బడికి ఎక్కడ పోయానని? పోయి మామిడి చెట్లు ఎక్కి కూర్చునేవాణ్ని, మళ్లీ ఇతర పిల్లలతో కలిసి ఇంటికి తిరిగి వచ్చేవాణ్ని. ఇదీ నేను చేయాలనుకున్నది,’’ తన పొలంలో తిరుగుతూ, ఉలవ పంటను పరిశీలిస్తూ చెబుతారు.

PHOTO • M. Palani Kumar
PHOTO • Aparna Karthikeyan

ఎడమ: తన భూమిలో ఉలవ పంటను పరిశీలిస్తున్న ఆనంద. కుడి: రాగులు చేతికొచ్చే కాలంలో ఏనుగుల కావలికి నాగన్న పొలంలో చెట్టుకు వేసిన మంచె

వాన చేసిన నష్టాన్ని ఆయన మనకు చూపిస్తారు - అది అంతటావుంది. ‘‘నా 86 ఏళ్ల జీవితంలో ఇంత వానను ఎప్పుడూ చూడలేదు,’’ ఆగ్రహంతో చెబుతారు నాగన్న. ఆయన ప్రకారం- ఆయన నమ్మిన పంచాంగాన్ని బట్టి, ఈ సంవత్సరం వాన పేరు ‘విశాఖ’, ప్రతి రకానికీ నక్షత్రాల మీదుగా చేసిన నామకరణం. “ ఒరు మాసం, మళై, మళై, మళై .” నెలంతా వాన, వాన, వాన. “ఈరోజే కొంచెం ఎండొచ్చింది.” ఆయన మాటల్ని వార్తాపత్రికలు కూడా నిర్ధారిస్తాయి. 2021లో తమిళనాడులో 57 శాతం అధిక వర్షాలు కురిసినట్టు అవి ప్రకటిస్తున్నాయి.

మేం గోపా పొలానికి తిరిగి నడిచి వెళ్తూండగా, శాలువాలు, క్యాపులు, గొడుగులు ధరించివున్న ఇద్దరు వృద్ధ రైతులు కనబడ్డారు. శుద్ధ కన్నడంలో వాళ్లు రాగి సాగుచేయడం ఎంతగా తగ్గిపోయిందో వివరించారు. దాన్ని గోపా నాకోసం అనువదించారు.

కొన్ని దశాబ్దాల క్రితంతో పోల్చితే ఇప్పుడు “సగం పొలాల్లోనే” రాగి ని పండిస్తున్నారని 74 ఏళ్ల కె. రామ్‌ రెడ్డి నాకు చెప్పారు. “కుటుంబానికి రెండు ఎకరాలు. అంత మాత్రమే మేము పండిస్తున్నాం.” మిగిలినదంతా టమోటా, బీన్సుతో నిండిపోతోంది. ఆ పండించే రాగి కూడా, “హైబ్రిడ్, హైబ్రిడ్, హైబ్రిడ్,” 63 ఏళ్ల కృష్ణారెడ్డి అదే మాటను నొక్కి చెప్పారు.

“నాటు రాగి, శక్తి జాస్తి (నాటు రకం రాగికి బలమెక్కువ),” తన బలాన్ని చూపడానికి తన కండలను చాపుతూ అంటారు రామ్‌ రెడ్డి. యువకుడిగా ఉన్నప్పుడు తాను తిన్న నాటు రాగులే తన ఆరోగ్యానికి కారణం అంటారు.

కానీ ఈ సంవత్సరం వానలతో ఆయన సంతోషంగా లేడు. “అది దారుణం,” రామ్‌ రెడ్డి గొణుగుతారు

ఏదైనా నష్టపరిహారం వస్తుందన్న నమ్మకం కూడా ఆయనకు లేదు. “నష్టానికి  ఏది కారణమైనా, లంచం లేకుండా మాకు ఏదీ రాదు. పైగా, పట్టా (టైటిల్ డీడ్) కచ్చితంగా మన పేరు మీద ఉండాలి.” కౌలు రైతులు ఏదైనా పరిహారం పొందే అవకాశాన్ని అది కొట్టేపడేస్తుంది.

PHOTO • Aparna Karthikeyan
PHOTO • Aparna Karthikeyan

ఎడమ: గొల్లపల్లిలో రైతులు కృష్ణా రెడ్డి, రామ్‌ రెడ్డి (ఎర్ర టోపీ). కుడి: ఏనుగుల వల్ల నష్టపోయిన పంట ఫొటోలతో ఆనంద

అది ఎప్పుడూ సులభంగా లేదు, విషాదంగా వివరిస్తారు ఆనంద. వాళ్ల నాన్నను వాళ్ల చిన్నాన్న మోసం చేశాడు. ఆ మోసాన్ని ఆనంద నాటక ఫక్కీలో ప్రదర్శించి చూపుతారు. ఒక నాలుగు అడుగులు ఈ దిశలో వేస్తారు, ఇంకో నాలుగు అడుగులు మరో దిశలో వేస్తారు. “ఇన్ని అడుగులు మీవి, ఇవి నావి. మాకు ఆయన భూమిని పంచింది ఇలాగే. మా నాన్న చదువుకోలేదు కాబట్టి దానికి ఒప్పేసుకున్నాడు. కేవలం నాలుగు ఎకరాలకే మాకు రిజిస్ట్రేషన్‌ కాగితాలు ఉన్నాయి.” వాస్తవంలో వాళ్లు ఇంకా ఎక్కువ సాగు చేస్తున్నారు, కానీ అధికారికంగా వాళ్లకు ఉన్న నాలుగు ఎకరాలకు తప్పించి మిగిలినదానిలో జరిగిన నష్టానికి పరిహారం కోసం అడగలేరు.

వాళ్ల వరండాకు తిరిగి వచ్చాక, ఫొటోలు, డాక్యుమెంట్లు చూపెట్టారు. ఒకచోట ఏనుగు దాడి, ఇంకో చోట అడవిపంది దాడి. ఒక పడిపోయిన చెట్టు. తొక్కిపడేసిన పంటలు. పడిపోయిన పనస చెట్టు ముందు పొడుగ్గా, దిగులుగా ఉన్న వాళ్ల నాన్న.

“వ్యవసాయంలో డబ్బులు ఎలా సంపాదిస్తావు? ఒక మంచి వాహనం కొనుక్కోగలమా? మంచి బట్టలు? సంపాదన చాలా తక్కువ, అదీ ఎంతోకొంత భూమి ఉన్న నా పరిస్థితి,” వాదిస్తారు నాగన్న. బయటికి వెళ్లేటప్పుడు వేసుకునే బట్టల్లోకి ఆయన మారారు: తెల్ల చొక్కా, కొత్త ధోవతి, టోపీ, మాస్కు, దస్తీ. ‘“గుడికి పోదాం, నాతో రండి,” అని మాకు చెప్పారు. మేము సంతోషంగా దానికి ఒప్పుకున్నాం. ఆయన వెళ్తున్న ఉత్సవం కూడా తేన్కనికోట్టై తాలూకాలోనే జరుగుతోంది, ‘స్టార్‌’(మంచి నాణ్యత కలిగిన) రోడ్డు మీద అరగంట దూరం.

ఎలా రావాలో నాగన్న మాకు స్పష్టంగా చెబుతున్నారు. ఆ ప్రాంతం ఎలా మారుతున్నదో రన్నింగ్‌ కామెంట్రీ ఇస్తారు. గులాబీ రైతులు పెద్ద అప్పులు చేశారు, అని చెబుతారు. వాళ్లు 50 నుంచి 150 రూపాయలకు కిలో చొప్పున తెస్తారు, ఉత్సవాల కాలంలో ధర పెరుగుతుంది. గులాబీల్లో ఆకర్షించే లక్షణం ఏమిటంటే, నేను విన్నంతవరకూ, దాని రంగు గానీ, వాసన గానీ కాదు- ఏనుగులు వాటిని తినడానికి ఇష్టపడవనేది నిజం.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: తేన్కనికోట్టై ఆలయ ఉత్సవానికి బయల్దేరుతున్న నాగన్న. కుడి: ఊరేగింపులో ముందున్న ఏనుగును ఇంకో గుడి నుంచి తెచ్చారు

మేము గుడికి దగ్గరవుతున్నకొద్దీ రోడ్లు మరింత రద్దీ అవుతున్నాయి. అక్కడ ఒక పెద్ద ఊరేగింపు- ఆశ్చర్యకరంగా ఏనుగు కూడా ఉంది. “ ఆనై ని మనం కలుస్తాం,” నాగన్న జోస్యం చెప్పారు. ఆలయ వంటశాలలో టిఫిన్‌ చేయడానికి ఆయన మమ్మల్ని ఆహ్వానించారు. కిచిడీ, బజ్జీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంతలోనే, తమిళనాడులోని మరోచోటు నుంచి తెచ్చిన ఏనుగు మావటీ , పూజారితో వచ్చింది. “ పళుత్త ఆనై ,” అన్నారు నాగన్న. ముసలి ఏనుగు. అది మెల్లగా, సాధువుగా కదులుతోంది. వాళ్ల మొబైల్‌ ఫోన్లను లేపి జనాలు వందల సంఖ్యలో ఫొటోలు తీశారు. అడవికి కేవలం ముప్పై నిమిషాల దూరంలోనే ఉన్నా ఇక్కడి ఏనుగు కథ మరింత భిన్నం.

తన గొగ్గికాళ్ల మీద వరండాలో కూర్చుని, మెడ చుట్టూ తువ్వాల వేసుకున్న ఆనంద చెప్పింది నాకు గుర్తొచ్చింది. “ఒకటి రెండు ఏనుగులు వస్తే మేము పట్టించుకోం. కానీ వయసు మీదున్న మగ ఏనుగులను ఏదీ అడ్డుకోలేదు. కంచె మీది నుంచి రౌడీలా దూకి మరీ తింటాయి.”

వాటి ఆకలి ఆనందకు అర్థమవుతుంది. “ఒక్క అరకిలో ఆహారం కోసం మనం ఎంతగానో పోరాడతాం. మరి ఏనుగులు ఏం చేయగలవు? ప్రతిరోజుకూ వాటికి 250 కిలోల మేత కావాలి. పనస చెట్టు నుంచి 3,000 రూపాయలు సంపాదించగలం. ఏనుగు వచ్చి మొత్తం తినేసిన సంవత్సరం దేవుడు మా దగ్గరికి వచ్చాడనుకుంటాం,” అని నవ్వుతారు.

అయినా, ఆయనకు ఒక కోరిక ఉంది: ఏదో ఒకరోజున 30 నుంచి 40 సంచుల రాగి పంటను తీయడం. “సెయ్యనుం, మేడమ్‌.” “నేను కచ్చితంగా చేయవలసిందే.”

మొట్టై వాల్‌ సిద్ధమయ్యాడు…

పరిశోధన అధ్యయనానికి అజీమ్ ప్రేమ్ జీ విశ్వవిద్యాలయం దాని పరిశోధన నిధుల కార్యక్రమం 2020 లో భాగంగా నిధులు సమకూరుస్తుంది .

కవర్ ఫోటో : ఎం . పళని కుమార్

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Aparna Karthikeyan

Aparna Karthikeyan is an independent journalist, author and Senior Fellow, PARI. Her non-fiction book 'Nine Rupees an Hour' documents the disappearing livelihoods of Tamil Nadu. She has written five books for children. Aparna lives in Chennai with her family and dogs.

Other stories by Aparna Karthikeyan
Photographs : M. Palani Kumar

M. Palani Kumar is Staff Photographer at People's Archive of Rural India. He is interested in documenting the lives of working-class women and marginalised people. Palani has received the Amplify grant in 2021, and Samyak Drishti and Photo South Asia Grant in 2020. He received the first Dayanita Singh-PARI Documentary Photography Award in 2022. Palani was also the cinematographer of ‘Kakoos' (Toilet), a Tamil-language documentary exposing the practice of manual scavenging in Tamil Nadu.

Other stories by M. Palani Kumar
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli