భార్యని పోలీస్ స్టేషన్ ముందే గాయపరుస్తున్నాననే విషయం అతనికి పట్టలేదు. హౌషాబాయి పాటిల్ తాగుబోతు భర్త,  హౌషబాయిని కనికరం లేకుండా కొడుతున్నాడు. “నా వీపు విపరీతంగా నొప్పి పుట్టింది  ఆ దెబ్బలతో,” ఆమె గుర్తుకు తెచ్చుకుంటూ చెప్పింది. “ఇది  భవానినగర్లో ఉన్న ఒక చిన్న పోలీస్ స్టేషన్ బయట జరిగింది. కానీ నలుగురు పోలీసుల్లో ఇద్దరు మాత్రమే అక్కడ ఉన్నారు. “ఇంకో ఇద్దరు మధ్యాహ్నం భోజనానికని బయటకి వెళ్లారు.” ఇక సోయలో లేని   ఆమె తాగుబోతు భర్త ఒక రాయినెత్తాడు. “ఇప్పుడు నిన్ను ఈ రాయి తో బాది చంపేస్తాను”, అని అతను రంకెలసేసాడు.

ఇక  దానితో లోపల పోలీస్ స్టేషన్ లో ఉన్న ఇద్దరు పోలీసులు పరిగెత్తుకుని బయటకు వచ్చారు. “మా గొడవ సర్దడానికి ప్రయత్నించారు.” హౌషాబాయి అక్కడే ఉన్న తన అన్నకి జరిగిన విషయం చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఆమె మళ్ళీ హింసించే భర్త దగ్గరకి వెళ్లనని చెప్తోంది. “నేను వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను, మీ ఇంటి పక్కనే చిన్న స్థలం ఇవ్వమని చెప్పాను.  నా భర్త దగ్గరకి వెళ్తే నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. నేను ఇక్కడే ఉండి ఉన్నదానితో తిని బతుకుతాను. అతనితో దెబ్బలు పడలేను.” అని చెప్పాను. కానీ ఆమె అన్న ఆమెని బతిమాలడం మొదలుపెట్టాడు.

పోలీసులు ఆ దంపతులతో చాలాసేపు మాట్లాడారు. వాళ్ళు ఆ జంటకు సంధి కుదిర్చి  రైలెక్కించి వాళ్ళ ఊరు పంపబోయారు. “చివరికి వాళ్ళు టికెట్లు కూడా తెచ్చి మా చేతిలో పెట్టారు. నా భర్త కి చెప్పారు - నీ భార్య నీతో ఉండాలి అని నువ్వు అనుకుంటే, ఆమెని సరిగ్గా చూసుకో. అంతేగాని కొట్టకు.”

ఇంతలో హౌషాబాయి కామ్రేడ్లు పోలీస్ స్టేషన్ ని లూటీ చేశారు. నాలుగు రైఫిళ్లు ఎత్తుకుపోయారు. దీనికోసమే హౌషాబాయి, ఆమె అబద్ధపు భర్తా, అన్నా అంత నాటకం ఆడి పోలీసుల దృష్టి మళ్లించారు. ఇది 1943 లో జరిగింది, ఆమెకు అప్పటికి 17 ఏళ్ళు, పెళ్లయి మూడేళ్ళయింది. తన కొడుకు సుభాష్ ని వాళ్ళ అత్త దగ్గర వదిలింది. ఎప్పుడు ఆమె బ్రిటిష్ రాజ్ కి వ్యతిరేకంగా పని చేస్తున్నా కొడుకుని అత్త దగ్గరే వదిలి వెళ్తుంది. ఇప్పటికీ ఆమె  కోపంగానే ఉంది.. దగ్గరగా 74 ఏళ్ళు గడిచిపోయినా ఆమె అబద్ధపు భర్త వారి నాటకం నిజం అని నమ్మించడానికి ఆమెను చాలా గట్టిగా కొట్టాడు. ఇప్పుడు ఆమెకి 91 ఏళ్ళు. ఇప్పుడు ఆమె మాకు ఈ కథ ఆమె మాకు, మహారాష్ట్రలో సాంగ్లీ జిల్లాలో విటా అనే నగరం లో చెప్తోంది. “నా కళ్ళు, చెవులు నన్ను ఇబ్బంది పెట్టి సవాలు చేస్తూనే ఉంటాయి, కానీ అంతా నేనే చెప్తాను.’

వీడియో చూడండి: హౌషాతాయి స్వాతంత్య్ర సమరయోధురాలిగా తన జీవిత కథను వివరిస్తోంది

నేను ఆ పెట్టె మీద నిద్రపోకూడదు , ఆ పెట్టెని  మునగనీయకూడదు. నాకు బావిలో ఈత కొట్టడం వచ్చుకాని ఈ నది నీళ్లతో పొంగుతోంది. మాండవి నది  ఏమి చిన్న నది కాదు.

హౌషాబాయి పాటిల్ ఈ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడింది. ఆమె, ఆమెతో పాటు పని చేసినవారు తూఫాన్ సేన లో భాగస్వాములు. 1943 లో బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్య్రం ప్రకటించిన ప్రతి సర్కార్ లేదా తాత్కాలిక, అండర్ గ్రౌండ్ ప్రభుత్వం యొక్క సాయుధ విభాగమే ఈ సేన. కుండల్‌లోని ప్రధాన కార్యాలయంతో, ప్రతి సర్కార్ దాదాపు 600 (లేదా అంతకంటే ఎక్కువ) గ్రామాలను ప్రభుత్వంలా నియంత్రించింది. హౌషాబాయి తండ్రి, గొప్ప పేరున్న నానా పాటిల్, ప్రతి సర్కార్ అధిపతి.

1943 నుండి 1946  మధ్యలో, హౌషాబాయి(ఎక్కువగా  హౌషాతాయి అని పిలుస్తారు, అంటే మరాఠి లో అక్క అని అర్ధం) బ్రిటిష్ రైళ్ల పై దాడి చేసి, పోలీసుల  ఆయుధాలను లూటీ చేసే, డాక్ బంగ్లాలను తగలబెట్టే బృందాలలో పనిచేసేది. ఆ రోజుల్లో డాక్ బంగ్లాలు పోస్ట్ ఆఫీసులుగా, ప్రయాణించే అధికారులకు రెస్ట్ హౌసులుగా, కొన్నిసార్లు తాత్కాలిక కోర్ట్ గదులుగా  కూడా వాడేవారు. 1944లో ఆమె పోర్చుగీస్ ఏలుతున్న గోవాలోని ఒక అండర్ గ్రౌండ్ పనిలో, మాండవి నది పై ఒక చెక్కపెట్టె మీద తేలుతూ అర్థరాత్రంతా ప్రయాణించింది. ఆమెతో ఉన్న కార్యకర్తలు ఆమెతో  పాటే పక్కనే ఈదుకుంటూ వచ్చారు. కానీ ఆమె చెప్తుంది, “నేను చాలా చిన్న పనులు చేశాను, మా అన్న(పెద్దమ్మ కొడుకు) బాపు లడ్ తో కలిసి. నేనేమి పెద్ద గొప్ప పనులు చేయలేదు.”

“మా అమ్మ నాకు మూడేళ్లుండగానే చనిపోయింది.” అని ఆమె చెప్పింది. “మా నాన్నఆ సమయానికి స్వాతంత్య్రస్పూర్తితో నిండిపోయి ఉన్నాడు. అంతకు ముందు కూడా అయన జ్యోతిబా ఫూలే ఆలోచనలతో ప్రభావితమై ఉన్నాడు. ఆ తరవాత మహాత్మ గాంధీ ఆలోచనల ప్రభావం ఉండేది. ఆయన తలతి(గ్రామ అకౌంటెంట్) ఉద్యోగం వదిలేసి పూర్తి స్థాయి పోరాట యోధుడిగా మారాడు. మన స్వంత ప్రభుత్వమే ఆయన  లక్ష్యం. అలానే బ్రిటిష్ ప్రభుత్వాన్ని కుదిరినంత కూలగొడితే వదిలించుకోవచ్చు అని కూడా అనుకున్నాడు.”

నానా పాటిల్, అతని అనుయాయుల పై వారెంట్లు వచ్చాయి. “వాళ్ళు ఎవరికీ తెలియకుండా  పని చేయవలసి వచ్చేది.” నానా పాటిల్ ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి తిరుగుతూ ప్రజలకు విప్లవం పై ఘాటైన ఉపన్యాసాలు ఇచ్చేవాడు. “ఆ తరవాత అతను మళ్లీ కనుమరుగయ్యేవాడు. అతని పాటు ఉన్న 500 మందికి వారంట్లు జారీ చేయబడ్డాయి.”

A photograph of Colonel Jagannathrao Bhosle (left) & Krantisingh Veer Nana Patil
Hausabai and her father Nana Patil

ఎడమ: 1940 లో  హౌషాబాయి తండ్రి నానాపాటిల్,  ‘ఆజాద్ హింద్ సేన’(నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వలన  స్ఫూర్తి పొందిన దళం) కల్నల్ జగన్నాథరావు  భోంస్లే(యూనిఫామ్ లో ఉన్న వ్యక్తి)తో. కుడి : స్వాతంత్య్రం తరవాత దిగిన ఫొటోలో హౌషాబాయి(కుడి),ఆమె వదినలు యశోద బాయి(ఎడమ) రాధాబాయి(మధ్యలో)

అటువంటి తెగింపుకి చాలా మూల్యం చెల్లించవలసి ఉంటుంది. బ్రిటిష్ వారు అతని పొలాన్ని, ఆస్తిని  అదుపులోకి తీసుకున్నారు. అతను అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు కానీ అతని కుటుంబం చాలా బాధలు పడింది.

“ప్రభుత్వం మా ఇంటిని సీల్ చేసేసింది. మేము వంట చేసుకుంటున్నాము. వాళ్ళు వచ్చేప్పటికి- వండుతున్న రొట్టెలు, వంకాయ పొయ్యి మీదే ఉన్నాయి. మాకోసం ఒక గది మాత్రమే వదిలారు. మా అమ్మమ్మ, నేను, మా అత్తా…. చాలా మంది అందులోనే ఉండేవాళ్ళము.”

బ్రిటిష్ అధికారులు అదుపులోకి తీసుకున్న హౌషబాయి కుటుంబ ఆస్తులను వేలం వేయడానికి ప్రయత్నించారు కానీ కొనేవారు లేకపోయారు. ప్రతి ఉదయం, సాయంత్రం గ్రామంలో చాటింపు వేసే వ్యక్తి(తలారి) వచ్చి గట్టిగా అరిచి చెప్పేవాడు- ‘నానా పాటిల్ పొలాన్ని వేలంపాట వేస్తున్నారు’ అని. కానీ జనాలు అనేవారు, “మనమెందుకు నానా పొలాన్ని తీసుకోవాలి? అతను ఎవరిని దోచుకోలేదు, చంపలేదు.”

అయినా, “ఆ పొలాన్ని మేము దున్నుకోలేకపోయాము కాబట్టి మేము కూలిపనికి వెళ్ళవలసి వచ్చేది. కూలిపని అంటే తెలుసుకదా - మేము వేరే వారి పని  చెయ్యాలన్నమాట.” కానీ పని ఇవ్వడానికి  అందరు భయపడేవారు. ఎందుకంటే మళ్లీ బ్రిటీష్ వారు వారిని ఇబ్బంది పెడతారని. “కాబట్టి మాకు మా ఊరిలో పని దొరకలేదు.” ఆ తర్వాత ఒక మేనమామ రెండు ఎద్దులని, ఒక  ఎడ్ల బండిని ఇచ్చాడు. “ఎడ్లబండిని అద్దెకు తిప్పి మేము కొంత సంపాదించుకోవచ్చు”, అని.

మేము బెల్లము, వేరుశెనగలు, జొన్న ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి తీసుకుపోయేవాళ్లం. ఆ బండి ఏడే మచ్చింద్ర(నానా  వాళ్ళ ఊరు) నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాకారి గ్రామానికి వెళ్తే  3  రూపాయిలు వచ్చేవి. అదే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కారాడ్ కి వెళ్తే 5 రూపాయిలు వచ్చేవి. ఆ బండి వలన మాకొచ్చిన అద్దె అంతే.

Yashodabai (left), Radhabai (mid) and Hausatai. They are her sisters in law
PHOTO • Shreya Katyayini

స్వాతంత్య్ర సంగ్రామంలో తాను 'కొన్ని చిన్న చిన్న పనులు' మాత్రమే చేశానని హౌషతాయి భావిస్తుంది

“మా అమ్మమ్మ పొలాల్లో నుంచి ఏవో తవ్వి తెచ్చేది. మా అత్తా నేను ఎద్దులను మేపేవాళ్ళము. మా బండి, జీవితాలు వాటి మీదే ఆధారపడి ఉన్నాయి, కాబట్టి వాటి  కడుపు నింపడం చాలా ముఖ్యం. ఊరివాళ్ళు మాతో మాట్లాడేవారు కాదు. కిరాణా కొట్టు అతను మాకు ఉప్పు కూడా ఇచ్చేవాడు కాదు. ఇంకెక్కడైనా తెచ్చుకొమ్మనేవాడు. కొన్నిసార్లు వేరే వారి ధాన్యం దంచడానికి, వాళ్లు పిలవక పోయినా మేము వెళ్ళేవాళ్ళం, రాత్రికి తినడానికి ఏదోటి పెడతారని. మేము అత్తి పళ్లను తెచ్చుకుని కూరొండుకునే వాళ్ళం.”

అండర్ గ్రౌండ్ లో హౌషాబాయి పని, సమాచారాన్ని సేకరించడం. ఆమె, మిగిలినవారు వాంగి(ఇప్పుడు సతారా జిల్లాలో ఉంది)లో చేసినట్లుగా డాక్ బంగ్లాలను తగలబెట్టడానికి కావలసిన సమాచారానికి కూపి లాగేవారు. “ఎంత మంది పోలీసువాళ్లు ఉన్నారు, ఎప్పుడెప్పుడు వచ్చి పోతుంటారు, ఇది కనుక్కోవడమే వీరి పని”, అని ఆమె కొడుకు అడ్వకేట్ సుభాష్ పాటిల్ చెప్పాడు. బంగ్లాలు తగలపెట్టే పని వేరేవారు చేసేవారు. ఆ ప్రాంతంలో చాలామంది ఉండేవారు. “వారు అన్నిటిని తగలబెట్టారు.”

హౌషాబాయి లాగా వేరే ఆడవారు కూడా అండర్ గ్రౌండ్ లో ఉండేవారా? అవును, ఆమె చెప్పింది. “షాలు తాయి(టీచర్ భార్య), లీల తాయి పాటిల్, లక్ష్మీబాయి నాయిక్ వాడి, రాజ్మతి పాటిల్ -  అలా కొందరుండేవారు.”

హౌషాబాయి సాహసాలు చాలా వరకు షెలర్ మామ, ప్రసిద్ధిపొందిన జి డి బాపు  సావాసంలోనే జరిగేవి.  షెలార్ మామ, కామ్రేడ్ కృష్ణ  సాలుంకి కి మారుపేరు. (అసలు షెలర్ మామ 17వ శతాబ్దానికి చెందిన మరాఠా సైనికుడు).

ప్రతి సర్కార్ , తూఫాన్ సేనలోని పెద్ద నాయకుడు బాపూ లాడ్. “అతను నా అన్న, నా పెద్దమ్మ కొడుకు”, ఆమె చెప్పింది. “ బాపు ఊరికూరికే కబురు పంపించేవాడు- ‘ ఇంటిలోనే కూర్చుండిపోకు!’ అని. నేను, అతను అన్నా చెల్లెళ్లుగా పనిచేశాము. అనుమానపడే అవకాశం వదులుకోరు జనాలు. కానీ నా భర్తకు మేమిద్దరం అన్నచెల్లెళ్ళం అని తెలుసు. నా భర్త పేరు మీద కూడా వారంట్ జారీ చేశారు. మేము గోవా వెళ్ళినప్పుడు నేను, బాపు కలిసే ఉండేవాళ్ళం.”

గోవాలో చేసిన సాహసం- సతారాలో ఉన్న సేనకు ఆయుధాలు రవాణా చేస్తూ పట్టుబడ్డ కామ్రేడ్ ని పోర్చుగీస్ పోలీసుల నుండి తప్పించడం. “అక్కడ బల్ జోషి అనే ఒక కార్యకర్త, ఆయుధాలు చేరవేస్తూ పట్టుబడ్డాడు. అతన్ని ఉరి తీసేవారు. ‘అతన్ని తప్పించే వరకు మనం వెనక్కి వెళ్లకూడదు’, అని బాపు చెప్పాడు.”

Hausatai and her family
PHOTO • Namita Waikar
Hausatai (left) and Gopal Gandhi
PHOTO • Shreya Katyayini

పోయిన ఏడాది - తన కుటుంబంతో హ షాతాయి(కుడి),  పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, మహాత్మాగాంధీ మనవడుఅయిన గోపాల్ గాంధీ తో. ఈయన కుండల్ కు ఆమెను, ఇతర స్వాతంత్ర్య పోరాట యోధులను సన్మానించడానికి జూన్2017 లో వచ్చారు

హౌషాబాయి జైల్లో ఉన్న జోషిని అతని చెల్లెలుగా వెళ్లి కలిసింది. “పారిపోయే ప్రణాళికను కాగితం పై రాసి, దాన్ని నా కొప్పుముడిలో దాచిపెట్టి అక్కడికి వెళ్లాను.” అంతేగాక సేన కోసం పోలీసుల పాలు కానీ ఆయుధాలు కూడా తీసుకెళ్ళాలి. వెనక్కి వెళ్లడం అంటే చాలా ప్రమాదమే.

“అప్పటికే పోలీసులు నన్ను చూసి గుర్తుపట్టేస్తున్నారు.” అందుకని రైలు కన్నా రోడ్డు మీద ప్రయాణించడం మంచిదని నిర్ణయించుకున్నారు. “కానీ మండవి నదిలో పడవ లేదు, కనీసం చేపలు పట్టే చిన్న పడవ కూడా లేదు. తరవాత ఇక ఈదుకుంటూనే పోవాలని అర్థమైంది, లేదంటే మేము కచ్చితంగా అరెస్ట్ అవుతాము. కానీ ఎలా దాటాలి?  మేము చేపలు పట్టే వల లోపల ఉన్న ఒక పెద్ద పెట్టె ని చూసాము.” పెట్టె మీద ఆమె బోర్లా పడుకొని ఆమె ఆ నదిని దాటింది. ఆమెతో పాటు ఆమె కామ్రేడ్లు పక్కనే ఈదుతూ వచ్చారు.

“ఆ పెట్టె మీద పడుకుని ఉన్న నేను  నిద్రలోకి జారుకోకూడదు. ఆ పెట్టె నీటిలో మునగకూడదు. నేను బావిలో ఈతకొట్టగలను కానీ ఈ నది నిండుగా నీళ్లు ఉన్నాయి. మాండవి నది చిన్నదేమీ కాదు. మా బృందంలో మిగిలిన వారు ఈతకొడుతున్నారు. నది నుండి  బయటకు రాగానే వేసుకోవడానికి, వాళ్ళ తలలకు పొడి బట్టలు చుట్టుకున్నారు.” అలా ఈదుతూ వాళ్ళు ఆ నదిని దాటారు.

“అలా మేము అడవిలోంచి నడుచుకుంటూ రెండు రోజుల్లో వచ్చేశాము. ఎలాగోలా అడవినుండే  దారిని వెతుక్కున్నాం. మేము ఇల్లు చేరడానికి 15 రోజులు పట్టింది.”

బాపు, హౌషాబాయిలు ఆయుధాలు వాళ్లతో తీసుకురాలేదు కానీ రవాణా కు కావలసిన ఏర్పాట్లు చేశారు. ఇక జోషి చాలా రోజుల తరవాత  జైలు నుంచి విజయవంతంగా తప్పించుకుని వచ్చాడు.

ఆమె కళ్ళు మెరుస్తుండగా హౌషాబాయి PARI బృందాన్ని అడిగింది, “అయితే ఇప్పుడు నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు?”

“కానీ ఎక్కడికి, హౌషాబాయి ?

“మీ అందరితో పని చేయడానికి”, అంది ఆమె నవ్వుతూ.

అనువాదం: అపర్ణ తోట

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota