డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజకీయాకాశంలో ప్రవేశించాక, మహారాష్ట్ర నలుమూలలా జ్ఞానోదయం కలిగించేందుకు ఆయన ఉద్యమాన్ని ప్రచారం చేయడంలో, వ్యాప్తి చేయడంలో షాహిర్లు , కవి-గాయకులు ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన జీవితం, ఆయనిచ్చిన సందేశం, దళిత పోరాటాలలో ఆయన పాత్ర గురించి అందరికీ అర్థమయ్యే భాషలో ప్రజలకు వివరించారు. వారు పాడిన పాటలే గ్రామాల్లో దళితులకు ఏకైక విశ్వవిద్యాలయమయింది. ఈ పాటల ద్వారానే కొత్త తరానికి బుద్ధుడు, అంబేద్కర్‌లతో పరిచయం ఏర్పడింది.

ఆత్మారామ్ సాల్వే (1953-1991) షాహీర్ల సమూహానికి చెందినవారు. అల్లకల్లోలంగా ఉన్న 70వ దశకంలో పుస్తకాల ద్వారా బాబాసాహెబ్ లక్ష్యాల గురించి తెలుసుకున్నవారు. సాల్వే జీవితం డాక్టర్ అంబేద్కర్‌కూ, ఆయన విముక్తి సందేశానికీ సంబంధించినదిగా మారిపోయింది.  రెండు దశాబ్దాల పాటు సాగిన నామాంతర్ ఆందోళన్‌కు అతని వెలుగులు చిమ్మే కవిత్వం ఒక రూపునిచ్చింది. ఈ ఉద్యమం మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి డాక్టర్ అంబేద్కర్ పేరు పేట్టాలని సాగిన పోరాటం, దీని కారణంగా మరాఠ్వాడా ప్రాంతం కుల పోరాటాలకు కేంద్రంగా మారింది. తన స్వరంతో, మాటలతో, షాహిరీ తో, మహారాష్ట్ర గ్రామాలను ఎలాంటి ప్రయాణ సాధనాలూ లేకుండా కేవలం కాలినడకతో చుట్టుతూ, అణచివేతకు వ్యతిరేకంగా జ్ఞాన జ్యోతిని సాల్వే మోసుకెళ్ళేవారు. ఆత్మారామ్ పాట వినడానికి వేలాది మంది తరలివచ్చేవారు. "విశ్వవిద్యాలయం పేరును అధికారికంగా మార్చినప్పుడు, నేను అంబేద్కర్ పేరును విశ్వవిద్యాలయ ప్రవేశ ద్వారం మీద బంగారు అక్షరాలతో రాస్తాను" అని అతను తరచుగా చెబుతుండేవారు.

షాహిర్ ఆత్మారామ్ సాల్వే నిప్పులు చెరిగే మాటలు కుల అణచివేతకు వ్యతిరేకంగా వారు చేసే పోరాటాలలో మరాఠ్వాడా దళిత యువతకు నేటికీ స్ఫూర్తినిస్తాయి. బీడ్ జిల్లాలోని ఫూలే పింపల్‌గావ్ గ్రామానికి చెందిన 27 ఏళ్ల విద్యార్థి సుమిత్ సాల్వే తనకు ఆత్మారామ్ అంటే ఏమిటో వివరించడానికి "ఒక రాత్రే కాదు, ఒక రోజంతా కూడా సరిపోదు" అని చెప్పారు. డాక్టర్ అంబేద్కర్, ఆత్మారామ్ సాల్వేలకు నివాళులు అర్పిస్తూ సుమిత్, ఆత్మారామ్ రాసిన ఒక ఉత్తేజకరమైన పాటను అందించారు. అంబేద్కర్ మార్గాన్ని అనుసరించాలని, పాత పద్ధతులను విడనాడమని శ్రోతలకు ఉద్బోధించారు. "ఈ కాలం చెల్లిన బొంతను ఇంకా ఎంతకాలం ఒంటికి చుట్టుకుంటావ్?" అనే ప్రశ్నతో తన శ్రోతలను రెచ్చగొట్టారు. "రాజ్యాంగాన్నే తన ఆయుధంగా, మన రక్షకుడు భీమ్ బానిసత్వపు సంకెళ్ళను తెంచాడు". అని షాహిర్ మనకు గుర్తు చేస్తుంది. సుమిత్ పాడిన పాటను వినండి.

వీడియో చూడండి : ' అంబేద్కర్ మిమ్మల్ని మనిషిని చేశారు'

రాజ్యాంగాన్నే ఆయుధంగా చేపట్టి
నీ రక్షకుడైన భీమ్
బానిసత్వపు సంకెళ్లను బద్దలు చేశారు.
ఈ కాలం చెల్లిన బొంతను ఇంకా ఎంతకాలమని ఒంటికి చుట్టుకుంటావ్?

నీ జీవితం చితికిపోయి ఉన్నప్పుడు భీమ్‌జీ నిన్నో మనిషిగా మల్చారు.
నా మాట విను పిచ్చివాడా,
రనోబా దేవుణ్ని గుడ్డిగా నమ్ముతూ జుట్టూ, గడ్డాలూ పెంచుకోవడం ఆపెయ్.
ఈ కాలం చెల్లిన బొంతను ఇంకా ఎంతకాలమని ఒంటికి చుట్టుకుంటావ్?

నాలుగు వర్ణాలు అద్దిన బొంత అది.
దాన్ని భీమ్ దగ్ధం చేసి, శక్తివిహీనంగా చేశారు.
నువ్వు బుద్ధ నగరి లో ఉంటూనే
మరెక్కడో ఉండాలనుకుంటున్నావ్.
మరి భీమ్ వాడీ (దళిత బస్తీ) మంచి రోజులు చూసేదెలా?
ఈ కాలం చెల్లిన బొంతను ఇంకా ఎంతకాలమని ఒంటికి చుట్టుకుంటావ్?

నీ బొంతలోంచి పేలు నీ మాసిన తల వెంట్రుకల్లోకి పాకిపోయాయ్.
నువ్వేమో ఇంట్లో, మఠంలో రనోబా పూజ చేస్తూ ఉన్నావ్.
ఈ అజ్ఞానపు మార్గాన్ని వదిలెయ్.
సాల్వేను నీ గురువుగా అనుసరించు.
జనాలను తప్పుదారి పట్టించడం మానెయ్. మానేస్తావ్ కదూ?
ఈ కాలం చెల్లిన బొంతను ఇంకా ఎంతకాలమని ఒంటికి చుట్టుకుంటావ్?

వీడియో ' ఇన్ ఫ్లుయెన్షియల్ షాహిర్స్ , నరేటివ్స్ ఫ్రమ్ మరాఠ్వాడా ' అనే ప్రాజెక్ట్ లో భాగం . ప్రాజెక్ట్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా సహకారంతో ఇండియా ఫౌండేషన్ ఫర్ ఆర్ట్స్ ద్వారా వారి ఆర్కైవ్స్ అండ్ మ్యూజియమ్స్ ప్రోగ్రామ్ కింద చేయబడినది . ప్రాజెక్ట్ కు న్యూ ఢిల్లీలోని గోట ( Goethe ) ఇన్ స్టిట్యూట్ ( మాక్స్ ముల్లర్ భవన్ ) నుండి పాక్షిక మద్దతు కూడా లభించింది .

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Keshav Waghmare

Keshav Waghmare is a writer and researcher based in Pune, Maharashtra. He is a founder member of the Dalit Adivasi Adhikar Andolan (DAAA), formed in 2012, and has been documenting the Marathwada communities for several years.

Other stories by Keshav Waghmare
Illustration : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli