ఒక వ్యక్తి తన ఏడేళ్ళ కుమార్తెతో కలిసి పంఢర్‌పూర్ వైపు కాలినడకన ప్రయాణిస్తున్నాడు. వాళ్ళు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది వార్కరీలు విఠల్ స్వామి ఆలయాన్ని సందర్శించే పండుగ, ఆషాఢీ వారీ వార్షిక తీర్థయాత్రకు వెళ్తున్నారు. దారిలో లాతూర్‌లోని మ్‌హైస్‌గావ్ అనే గ్రామంలో విడిది చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. సాయంత్రం అవుతుండగా, గాలి అంతా కీర్తనల శబ్దాలతో నిండిపోయింది. ఆ చిన్న అమ్మాయి , ఖంజిరి (కంజీరా) చేసే మంద్రమైన గలగలల శబ్దాన్ని విని, తననూ అక్కడికి తీసుకెళ్ళమని తండ్రిని పోరుపెట్టడం ప్రారంభించింది.

కానీ ఆమె తండ్రికి అక్కడికి వెళ్లడం ఇష్టం లేదు. "ఇక్కడి జనం మనలాంటి మహార్, మాంగ్‌లను తాకరు," అని అతను వివరించే ప్రయత్నం చేశాడు. "వాళ్ళు మనల్ని హీనంగా చూస్తారు. మనల్ని లోనికి రానివ్వరు." కానీ ఆమె వినలేదు. చివరకు, దూరంగా నిలబడి వినాలనే షరతుతో ఆమె తండ్రి ఆమె కోరికకు అంగీకరించాడు. సంగీత వాయిద్యాల శబ్దాల ఆధారంగా వాళ్ళు పండాల్‌ను చేరుకున్నారు. వారిద్దరూ ఒక కీర్తనను పాడుతూ ఖంజిరి ని వాయిస్తోన్న మహారాజ్ ను పరవశిస్తూ చూస్తూ నిలబడ్డారు. ఇంతలో, భావావేశాన్ని ఆపుకోలేని ఆ చిన్నారి వేదిక మీదికి వెళ్ళాలనుకుంది. ఆమె హఠాత్తుగా పరుగు తీసి, వేదిక దగ్గరకు వెళ్లింది.

"నేనొక భారుడ్‌ ను [సామాజిక జ్ఞానాన్ని కలిగించటం కోసం వ్యంగ్యాన్నీ, హాస్యాన్నీ ఉపయోగించుకునే ఒక రకమైన పురాతన కవిత్వం] పాడాలనుకుంటున్నాను," వేదికపై ప్రదర్శన ఇస్తున్న సాధువుకు చెప్పిందామె. ప్రేక్షకులు నోరు తెరచుకుని చూస్తుండిపోయారు. కానీ మహారాజ్ మాత్రం ఆమె పాడేందుకు అవకాశమిచ్చారు. ఆ తర్వాతి కొన్ని నిముషాలు ఆ చిన్నారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. లయ కోసం ఒక లోహపు కుండపై దరువు వేస్తూ, అదే మహారాజ్ రాసి, బాణీ కట్టిన పాటను ఆమె పాడింది.

माझा रहाट गं साजनी
गावू चौघी जनी
माझ्या रहाटाचा कणा
मला चौघी जनी सुना

ఓ ప్రియా, నాతో కలిసి పాడు
మనం నలుగురం కలిసి పాడుదాం
నా ఆత్మ నివాస స్థలాన్ని
మీ నలుగురి కోసం పాడనివ్వండి

ఆ బాల గాయని పాటకు ముగ్ధుడైన సాధువు, “నీకు ఎల్లప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయి. నువ్వు నీ సంగీతంతో ఈ ప్రపంచాన్ని వెలిగిస్తావు,” అంటూ తన ఖంజిరి ని ఆమెకు బహుమతిగా ఇచ్చారు.

వీడియో చూడండి: వ్యంగ్యాన్నీ హాస్యాన్నీ మిళాయించి, ఒకే భారుడ్‌లో వేర్వేరు అర్థాలను స్ఫురింపజేసే సంప్రదాయ భారుడ్‌ని పాడుతోన్న మీరా ఉమప్

అది 1975. ఆ సాధువు తుకడోజీ మహారాజ్ - పల్లె జీవితంలోని దురలవాట్లు, దుష్ట సంప్రదాయాలను నిరసిస్తూ, వాటిని ఎలా అధిగమించాలో తెలిపే గ్రామ గీతలో సంకలనం చేసిన పద్యాలను పాడడంలో ప్రసిద్ధి చెందినవారు. ఆ చిన్నారి, ఇప్పుడు, 50 ఏళ్ళ తర్వాత కూడా, తన ప్రదర్శనలతో వేదికలపై నిప్పులు కురిపిస్తోంది. నవ్వారీ నూలు చీర ధరించి, నుదుటిపై పెద్ద బొట్టు, ఎడమచేతిలో దిమడి అనే చిన్న తాళ వాయిద్యంతో మీరా ఉమప్ భీమ్ గీతాన్ని ఆలపిస్తుంటే, ఆమె కుడి చేతి వేళ్ళు దిమడి తోలు పొరపై లయబద్ధంగా, శక్తివంతంగా నాట్యం చేస్తాయి. ఆమె మణికట్టుకు ఉన్న గాజులు ఆమె వాయించే వాయిద్యం అంచుకు ఉన్న గజ్జెలతో కలిసి తాళం వేస్తాయి. అలా ఆమె పాటతో అన్నీ సజీవంగా మారతాయి.

खातो तुपात पोळी भीमा तुझ्यामुळे
डोईवरची
गेली मोळी भीमा तुझ्यामुळे
काल
माझी माय बाजारी जाऊन
जरीची
घेती चोळी भीमा तुझ्यामुळे
साखर
दुधात टाकून काजू दुधात खातो
भिकेची
गेली झोळी भीमा तुझ्यामुळे

నీ వల్లనే నేను నా రొట్టెను నెయ్యిలో ముంచి తింటున్నాను, ఓ భీమ్
నీ వల్లనే నేను ఇక కట్టెల మోపులను మోయడం ఆపేసాను, ఓ భీమ్

అమ్మ నిన్న బజారుకి వెళ్ళింది
ఒక జరీ రవిక తెచ్చింది, ఇదంతా నీ వల్లనే ఓ భీమ్

నా దగ్గర చక్కెర, పాలున్నాయి, జీడిపప్పుతో కలిపి వాటిని తింటాను
నేనిప్పుడు భిక్షాపాత్రను వదిలించుకున్నాను, ఇదంతా నీ వల్లనే ఓ భీమ్

*****

మీరాబాయికి తన పుట్టిన రోజు ఎప్పుడో తెలీదు, కానీ ఏడాది మాత్రం 1965 అని మాతో చెప్పారు. ఆమె మహారాష్ట్రలోని అంతర్వలీ గ్రామంలోని పేద మాతంగుల కుటుంబంలో జన్మించారు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్న మాతంగులను చారిత్రాత్మకంగా 'అంటరానివారు'గా పరిగణిస్తారు. వారు నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో అతి కింది స్థానంలో ఉన్నారు.

ఆమె తండ్రి వామన్‌రావ్, తల్లి రేష్మాబాయి బీడ్ జిల్లాలో గ్రామగ్రామాన తిరుగుతూ శ్రావ్యమైన భజనలు , అభంగ్‌లు పాడుతూ భిక్షను అడుక్కునేవారు. దళిత సమాజంలో గాన కళను సంరక్షించే అత్యంత గౌరవం కలిగిన జ్ఞానులు, ఉపాధ్యాయుల వర్గమైన 'గురు ఘరానా'కు చెందిన కుటుంబంగా వీరికి గౌరవం లభిస్తుంది. అందుకే మీరాబాయి ఎప్పుడూ పాఠశాలకు వెళ్ళకున్నా, తన తల్లిదండ్రుల నుండి పొందిన గొప్ప గొప్ప అభంగ్, భజనలు, కీర్తనల కచేరీలతోనే పెరిగి పెద్దయ్యారు.

PHOTO • Vikas Sontate

మహారాష్ట్ర మొత్తమ్మీద దిమడినీ, ఖంజిరినీ వాయించగలిగే ఒకే ఒక్క మహిళ షాహిర్ మీరా ఉమప్. సంప్రదాయంగా కేవలం మగవాళ్ళు మాత్రమే వాయించే ఆ వాయిద్యాలను వాయించటంలో ఆమె అబ్బురపరిచే ప్రతిభను ప్రదర్శిస్తారు

ఐదుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలున్న ఆ జంటకు తమ ఎనిమిది మంది పిల్లల తిండి, సంరక్షణలు చూసుకోవడం చాలా కష్టమయ్యేది. పిల్లలలో పెద్దదైన మీరాబాయికి ఏడేళ్ళు వచ్చాక, తల్లితండ్రులు పాడటానికి వెళ్తున్నప్పుడు తాను కూడా వాళ్ళ వెంట వెళ్ళడం ప్రారంభించింది. వామన్‌రావు ఏక్‌తారీ ని, అతని తమ్ముడు భవురావు దిమడి ని వాయించేవాళ్ళు. "మా నాన్న, బాబాయి ఇద్దరూ కలిసి భిక్ష అడుక్కునేవారు," ఆమె తన గానానికి సంబంధించిన కథను మాకు వివరించారు. “ఒకసారి, వచ్చిన ఆదాయాన్ని పంచుకోవడం గురించి వాళ్ళిద్దరూ గొడవపడ్డారు. అది విడిపోవాలని నిర్ణయించుకునే వరకు వచ్చింది."

ఆ రోజు తర్వాత, ఆమె బాబాయి బుల్డానాకు వెళితే, తండ్రి ఆమెను తనతో పాటు తీసుకెళ్ళారు. తన లేత స్వరంతో ఆమె తండ్రి పాటకు గొంతు కలిపేది. అలా ఆమె అనేక భక్తి పాటలను నేర్చుకుంది. "నేను ఏదో ఒక రోజు గాయనిని అవుతానని మా నాన్న నమ్మేవాడు," అని ఆమె చెప్పారు.

తరువాత, జీతం కోసం పశువులను మేపుతూ ఆమె దిమడి ని నేర్చుకునే ప్రయత్నం చేసింది. “నా చిన్నతనంలో లోహపుపాత్రలే నా వాయిద్యాలు. నీళ్ళు మోసుకొస్తున్నప్పుడు, నా వేళ్ళు లోహపు కుండ కల్శీ ని తట్టేవి. ఇది ఒక అభిరుచిగా కాకుండా అలవాటుగా మారింది. నేనిలానే జీవితంలో అన్నీ నేర్చుకున్నాను, అంతే తప్ప ఏదో బడిలో చేరి కాదు," అన్నారు మీరాబాయి.

వారి ఇరుగుపొరుగు వారంతా నియమంగా భజనలు చేసేందుకు ఒకచోట చేరేవారు. మీరాబాయి ఆ బృందాలలో చేరి మెల్లగా భజన చేయడం ప్రారంభించింది.

राम नाही सीतेच्या तोलाचा
राम बाई हलक्या दिलाचा

సీతకు రాముడు సరితూగడు
లోతైన హృదయం లేని రాముడు

"నేనెప్పుడూ బడికి వెళ్లలేదు, కానీ 40 రకాల రామాయణాలు నాకు కంఠతా వచ్చు," అని ఆమె చెప్పారు. " శ్రావణ బాలుడి కథ, మహాభారతంలోని పాండవుల కథలు, కబీర్ రాసిన వందలాది దోహాలు అన్నీ నా మెదడులో ఉన్నాయి." రామాయణం ఒకే వరుసన శిలపై చెక్కిన కథ కాదని, ప్రజలు తమ సంస్కృతి, ప్రాపంచిక దృక్పథం, తమ పరిశీలన ఆధారంగా రకరకాల రామాయణాలను సృష్టించుకున్నారని ఆమె నమ్ముతారు. అనేక సమూహాలు ఎదుర్కొన్న చారిత్రక సవాళ్ళు, వారు ఎదుర్కొన్న సమస్యలు ఈ ఇతిహాసాలలో మార్పులను తీసుకువచ్చాయి. పాత్రలు అలాగే ఉంటాయి కానీ కథలు మాత్రం బహుళ వర్ణాలుగా, బహుముఖాలుగా మారతాయి.

మీరాబాయి సమాజంలో తన స్థానం, స్థితి ఏమిటి అన్న దృక్పథం నుంచి వాటిని ప్రదర్శిస్తారు. ఇది ఉన్నత కులాల హిందువులు ప్రదర్శించే విధానానికి భిన్నం. ఆమె రామాయణానికి కేంద్రం ఒక దళిత మహిళ. వనవాసంలో రాముడు సీతను ఒంటరిగా ఎందుకు విడిచిపెట్టాడు? శంభూకుడిని ఎందుకు చంపాడు? వాలిని ఎందుకు హత్య చేశాడు? ఇతిహాసంలోని సుప్రసిద్ధ కథలను తార్కికంగా అర్థం చేసుకునేలా ఆమె ప్రేక్షకుల ముందు అనేక ప్రశ్నలను లేవనెత్తుతారు. "నేను ఈ కథలను ప్రదర్శించేటప్పుడు హాస్యాన్ని కూడా ఉపయోగిస్తాను," అని ఆమె చెప్పారు.

PHOTO • Ramdas Unhale
PHOTO • Labani Jangi

ఎడమ: కేవలం ఏడేళ్ళ వయసులో ఆమె ప్రదర్శనను చూసిన సాధు కవి తుకడోజీ మహరాజ్ బహుమతిగా ఇచ్చిన ఖంజిరితో మీరా ఉమప్. కుడి: మీరాబాయి వాయించే చిన్న తాళ వాద్యమైన దిమడి బొమ్మ. చెక్క రింగునూ, తోలు పొరనూ ఉపయోగించి ఈ దిమడిని తయారుచేస్తారు. దిమడిలా కాకుండా ఖింజరికి బయటవైపుకు ఉన్న రింగులో కొన్ని అదనపు లోహ రేకులుగానీ గజ్జెలుగానీ ఉంటాయి. దీనిని జానపద కళాకారులు దేవతల కథలను చెప్పేటపుడు ఉపయోగిస్తారు. ఖంజిరిని తమ పూజలలో ఒక తప్పనిసరి భాగంగా వారు భావిస్తారు

సంగీతం గురించి లోతైన పరిజ్ఞానం, సాంకేతికత, ప్రదర్శనల గురించి మంచి అవగాహన ఉన్న మీరాబాయి సంగీతం, దానికదే ఓ అద్భుతమైన విషయం. విదర్భ, మరాఠ్వాడాలో పెద్ద సంఖ్యలో అనుచరులున్న ప్రభావవంతమైన సాధు కవి, సంస్కర్త తుకడోజీ మహారాజ్ అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన శైలిని అనుసరించే మీరాబాయి కూడా అనేక సంగీత శిఖరాలను అధిరోహించారు.

తుకడోజీ మహారాజ్ తన కీర్తనల ప్రదర్శనలలో ఖంజిరి ని వాయించేవారు. ఆయన శిష్యుడు సత్యపాల్ చించోలీకర్ సప్త-ఖంజిరి ని వాయిస్తారు. దీనిలో ఏడు ఖంజిరి లు వేర్వేరు స్వరాలను, శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి. సాంగ్లీకి చెందిన దేవానంద్ మాళీ, సాతారాకు చెందిన మ్హారి గజభరే కూడా అదే వాయిద్యాన్ని వాయించేవాళ్ళు. కానీ ఖంజిరి వాయించే స్త్రీ మీరాబాయి ఉమప్ ఒక్కరే, అది కూడా అత్యంత నైపుణ్యంతో.

పాటలు రాసి, డఫ్ ( షాహిర్లు తరచుగా ఉపయోగించే డప్పులాంటి వాయిద్యం) వాయించే లాతూర్‌కు చెందిన షాహిర్ రత్నాకర్ కులకర్ణి, ఆమె చాలా నైపుణ్యంతో ఖంజిరి ని వాయించడం చూశారు. ఆమె మధురమైన గాత్రాన్నీ గమనించారు. షాహిరీ (సామాజిక జ్ఞానాన్ని అందించే పాటలు) ప్రదర్శించడానికి ఆమెకు సహాయపడాలని అతను నిర్ణయించుకున్నారు. 20 ఏళ్ళ వయసులో ఆమె షాహిరీ రంగంలోకి దిగి బీడ్‌లో ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రదర్శన ఇచ్చింది.

“నాకు అన్ని మత గ్రంథాలూ కంఠతా వచ్చు. కథ , సప్తాహ్ , రామాయణం, మహాభారతం, సత్యవాన్, సావిత్రిల కథ, మహాదేవ్‌కు సంబంధించిన అన్ని పాటలు, కథలు, ఇంకా పురాణాలు నా నాలుక కొనపైనే ఉంటాయి,” అని ఆమె చెప్పారు. “నేను వాటిని వర్ణించాను, వాటిని పాడాను, రాష్ట్రం నలుమూలల్లో ప్రదర్శించాను. కానీ అదంతా నాకెప్పుడూ సఫలతా భావననూ, సంతృప్తినీ ఇవ్వలేదు. ఆ పాటలు విన్న ప్రజలకు అవి ఏ కొత్త మార్గాన్నీ చూపలేదు.”

సామాజిక అన్యాయాలు, బహుజన వర్గాల వేదన గురించి మాట్లాడిన బుద్దుడు, ఫూలే, శాహూ, అంబేద్కర్, తుకడోజీ మహారాజ్, గాడ్గే బాబాలాంటి వారే మీరాబాయి హృదయాన్ని తాకారు. "విజయ్‌కుమార్ గవయీ నాకు మొదటి భీమ్ గీతాన్ని నేర్పించారు. నేను ప్రదర్శించిన వామన్‌దాదా కర్దక్‌ మొదటి పాట అదే," అని మీరాబాయి గుర్తు చేసుకున్నారు.

पाणी वाढ गं माय, पाणी वाढ गं
लयी नाही मागत भर माझं इवलंसं गाडगं
पाणी वाढ गं माय, पाणी वाढ गं

నా ప్రియా, నాకు నీరు ఇవ్వు, నాకు నీరు ఇవ్వు
నేనేం ఎక్కువ అడగడం లేదు, నా చిన్న గడగ [మట్టి కుండ] నింపు చాలు
నా ప్రియా, నాకు నీరు ఇవ్వు, నాకు నీరు ఇవ్వు

“ఆ రోజు నుండి నేను మొత్తం పోథీ పురాణ్ (పుస్తక జ్ఞానం) పాడటం మానేసి, భీమ్ గీతాలు పాడటం మొదలుపెట్టాను." 1991లో బాబాసాహెబ్ అంబేద్కర్ శత జయంతి సంవత్సరం నుండి, ఆమె ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయన సందేశాన్ని వ్యాప్తి చేసే భీమ్ గీత్ పాటలకు తనను తాను అంకితం చేసుకుంది. "ప్రజలు దీన్ని ఇష్టపడి, చాలా ఉత్సాహంతో ప్రతిస్పందించారు," అని షాహిర్ మీరాబాయి చెప్పారు.

మీరా ఉమప్ పాడుతోన్న భీమ్ గీత్‌ను వినండి

షాహిర్ అనే పదం ఫార్సీ పదమైన ' షాయర్ ' లేదా ' షైర్ ' నుంచి పుట్టింది. మహారాష్ట్రలోని పల్లెల్లో షాహిర్లు పాలకులను కీర్తిస్తూ పొవాడా అనే పాటలు రాసి పాడారు. ఆత్మారామ్ సాళ్వే తన ఖంజిరి తో, దాదు సాళ్వే తన హార్మోనియంతో, కడూబాయి ఖరాత్ తన ఏక్‌తారీ తో తమ పాటల ద్వారా దళిత చైతన్యాన్ని మేల్కొలిపారు. మీరాబాయి తన దిమడి తో మహారాష్ట్రలోని కొద్దిమంది మహిళా షాహిర్‌ లలో ఒకరుగా మారారు. దిమడి ని అప్పటి వరకు పురుషులే ప్రత్యేకంగా వాయించే యుద్ధ వాయిద్యంగా పరిగణించేవాళ్ళు. మీరాబాయి తన దిమడి వాదనతో ఆ సంప్రదాయాన్ని బద్దలు కొట్టారు .

ఆమె వాద్య సంగీతాన్ని, పాడటాన్ని వినడం, వివిధ రకాలైన కీర్తనలు , భజనలు, పొవాడా లకు అవసరమైన రకరకాల స్వరాల రూపకల్పనకు తన వేళ్ళను వాయిద్యపు తోలు పొరపై వివిధ ప్రాంతాలలో నేర్పుగా ఉపయోగించడాన్ని చూడడం ఒక గొప్ప అనుభవం. ఆమె గానం నెమ్మదిగా వేగం పుంజుకుంటుంది; ఆ ధ్వని, ఆ ప్రదర్శన మట్టితో లోతుగా పెనవేసుకుపోయిన బంధనాలు లేని ధీర స్ఫూర్తిని ప్రదర్శిస్తాయి. దిమిడి, ఖంజిరి ల వాద్యకళ ఇప్పటికీ సజీవంగా, అభివృద్ధి చెందుతూ ఉన్నాయంటే దానికి కారణం ఆమెకున్న అంకిత భావమే.

మహారాష్ట్రలోని అనేకమంది సాధు కవులు ఉపయోగించే జానపద రూపమైన భారుడ్‌ ను ప్రదర్శించే కొద్దిమంది మహిళా షాహిర్‌ లలో మీరాబాయి ఒకరు. భారుడ్‌ లో రెండు రకాలున్నాయి – మతం, ఆధ్యాత్మికత చుట్టూ తిరిగే భజనీ భారుడ్ , పురుషులు స్త్రీలలా దుస్తులు ధరించి వేదికపై ప్రదర్శించే సొంగీ భారుడ్ మరొకటి. సాధారణంగా భారుడ్‌ తో పాటు చారిత్రక, సామాజిక ఇతివృత్తాలపై పొవాడా లను ప్రదర్శించేది కూడా పురుషులే. కానీ మీరాబాయి దీనిని సవాలు చేసి, అదే ఉత్సాహం, శక్తితో అన్ని కళారూపాలను ప్రదర్శించడం ప్రారంభించింది. నిజానికి, ఇతర మగ ప్రదర్శకుల కంటే ఆమె ప్రదర్శనలే ఎక్కువ జనాదరణను పొందాయి.

మీరాబాయికి దిమడి , పాటలు, నాటకాల ద్వారా ప్రేక్షకులకు సందేశాన్నిచ్చే ఈ ప్రదర్శనలంటే కేవలం వినోదమాత్రం కాదు, అంతకంటే ఎక్కువ.

*****

ఈ దేశంలో కళ, దాని సృష్టికర్తలు కులంతో ముడిపడి ఉంటారు, కులం ద్వారానే ఆ కళను నిర్ణయిస్తారు. ఇక్కడ కులం ద్వారానే మనుషులు సంగీతం, ఇతర కళలను నేర్చుకుంటారు. దళితులు కానివారు, బహుజనులు కానివారు ఈ వాయిద్యాలకు సంబంధించిన స్వరలిపిని అనుసరించి వాటిని వాయించడం నేర్చుకోగలరా? ఒకవేళ బయటి వ్యక్తి దిమడి, సంబళ్ లేదా జుంబురుక్‌ ను నేర్చుకోవాలనుకున్నా, దానికి సంబంధించి క్రోడీకరించిన వ్యాకరణం ఏదీ లేదు.

ముంబై విశ్వవిద్యాలయంలోని సంగీత విభాగానికి చెందిన విద్యార్థులు ఖంజిరి, దిమడి లను ఎలా వాయించాలో నేర్చుకుంటున్నారు. ప్రసిద్ధ కళాకారులు కృష్ణ ముసళె, విజయ్ చవ్హాణ్ ఈ తాళ వాయిద్యాలకు స్వరలిపిని రూపొందించారు. కానీ దీనికి అనేక సవాళ్ళు ఎదురవుతున్నాయని విశ్వవిద్యాలయంలోని లోక్-కళా అకాడమీ సంచాలకులు గణేశ్ చందన్‌శివే తెలిపారు.

PHOTO • Medha Kale
PHOTO • Ramdas Unhale

ముంబై విశ్వవిద్యాలయంలోని లోక్-కళా అకాడమీ సంచాలకులు గణేశ్ చందన్‌శివే. దిమడికి గానీ సంబళ్‌కు గానీ వాటి సొంత సంగీతశాస్త్రమేదీ లేదని ఆయన పేర్కొన్నారు. 'ఎవరూ స్వరలిపిని రాయలేదు, వీటికి శాస్త్రీయ వాయిద్యమనే హోదాను ఇచ్చే ఒక "శాస్త్రాన్ని" కూడా రాయలేదు,' అంటారాయన. కుడి: మీరాబాయి ఏ శాస్త్రం, స్వరం, లేదా సంగీత వ్యాకరణం తెలియకుండానే ఆ పరికరం గురించిన జ్ఞానాన్ని సంపాదించారు

"ఇతర శాస్త్రీయ వాయిద్యాలను నేర్పించే పద్ధతిలో మీరు దిమడి, సంబళ్ లేదా ఖంజిరి ని నేర్పించలేరు," అన్నారాయన. “ఎవరైనా తబలా ను దానికి సంబంధించిన స్వరలిపిని అనుసరించే నేర్చుకోగలరు. దిమడి లేదా సంబళ్‌ ని కూడా నేర్పించడానికి ప్రజలు ఇలాంటి స్వరలిపినే ఉపయోగించే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఈ వాయిద్యాలలో దేనికీ స్వంత సంగీతశాస్త్రమంటూ లేదు. వీటికి శాస్త్రీయ వాయిద్యమనే హోదాను ఇచ్చే స్వరలిపిని గానీ ఒక ‘శాస్త్రాన్ని’ గానీ ఎవరూ రాయలేదు," అని ఆయన వివరించారు.

మీరాబాయికి దిమడి, ఖంజిరి లపై పాండిత్యం ఏ శాస్త్రం, స్వరలిపి, లేదా దాని సంగీత వ్యాకరణం అనేవి తెలీకుండానే వచ్చింది. ఆమె వాటిని నేర్చుకునేటప్పుడు అది ‘ ధ’ లేక ‘ త’ ’ అని ఆమెకు తెలీను కూడా తెలీదు. కానీ ఆమె వేగం, లయ, స్వరాలలో ఆమె సాధించిన పరిపూర్ణతను శాస్త్రీయ వాయిద్యం వాయించే ఏ కళాకారుడితోనూ సరిపోల్చలేము. ఆ వాయిద్యం ఆమె సొంతం. మీరాబాయి దిమడి వాయించే నైపుణ్యానికి లోక్-కళా అకాడమీలో ఎవరూ సాటిరారు.

బహుజన కులాలు మధ్యతరగతిగా మారుతున్న నేపథ్యంలో, వారి సొంత సంప్రదాయ కళలను, వ్యక్తీకరణలను కోల్పోతున్నారు. విద్య కోసం, పని కోసం నగరాలకు వలస వెళుతున్న వారు తమ సంప్రదాయ వృత్తులను, వాటి అనుబంధ కళారూపాలను ప్రదర్శించడం మానేశారు. వాటి మూలం, అభ్యాసాల చారిత్రక, భౌగోళిక సందర్భాలను అర్థం చేసుకోవడానికి, మనకు ఎదురయ్యే అనేక ప్రశ్నలను పరిష్కరించడానికి ఈ కళారూపాలకు అక్షరరూపం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం ఎదుర్కొనే అనేక సమస్యలను పరిష్కరించడానికి. ఉదాహరణకు, కుల సంఘర్షణ, ఇతర పోరాటాల అంశాలు వారి వ్యక్తీకరణల్లో ప్రతిబింబిస్తాయా? దీనికి సమాధానం అవును అయితే, వాటిని వ్యక్తీకరించే రూపాలు ఏమిటి? విద్యాపరంగా ఈ కళారూపాలను చూస్తే, విశ్వవిద్యాలయాలు లేదా విద్యా సంస్థలకు అలాంటి దృష్టి లేదు.

ప్రతి కులానికి ఒక నిర్దిష్ట జానపద కళ ఉంటుంది, దాని వైవిధ్యం చాలా ఎక్కువ. కళా సంపదను, సంప్రదాయాలను అధ్యయనం చేయడానికి, వాటిని భద్రపరచడానికి ఒక ప్రత్యేక పరిశోధనా కేంద్రం అవసరం. అయితే ఇది ఏ బ్రాహ్మణేతర ఉద్యమం ఎజెండాలోనూ లేదు. మీరాబాయి ఈ పరిస్థితిని మార్చాలనుకుంటున్నారు. "నేను యువకుల కోసం ఖంజిరి, ఏక్‌తారీ, ఢోలకీ లను నేర్చుకునే ఒక సంస్థను ప్రారంభించాలని అనుకుంటున్నాను," అని చెప్పారామె.

అయితే రాష్ట్రస్థాయిలో ఆమెకు ఎలాంటి మద్దతూ లభించడం లేదు. ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందా? "నాకు చదవడం, రాయడం వచ్చా?" అని ఆమె ఎదురు ప్రశ్నించారు. “నేను ఎప్పుడు, ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఎవరైనా రాష్ట్రాధికారులు ఉంటే, ఈ కలను నిజం చేయడంలో నాకు సహాయం చేయమని అభ్యర్థిస్తున్నాను. కానీ ఈ పేదప్రజల కళకు ప్రభుత్వం విలువ ఇస్తుందా?’’

PHOTO • Labani Jangi
PHOTO • Labani Jangi

షాహిర్‌లు పొవాడా (కీర్తి గురించినపాటలు)ను ప్రదర్శించే సమయంలో ఉపయోగించే తాళ వాయిద్యం, డఫ్. 'భవానీ ఆయి' (తుల్జాభవాని) ఆశీర్వాదం కోసం గోంధళీలు (ఒక సముదాయం) ఉపయోగించే ఒకే తీగ ఉండే వాయిద్యం, తుణతుణ్. కుడి: డక్కల్‌వార్ సముదాయం కింగ్రీని సృష్టించింది. ఇది అనునాదాన్నిచ్చే కుండల గుండా ఒక కర్రను చొప్పించి ఉండే ఒకే తీగ ఉన్న వాయిద్యం. మరొక రకమైన కింగ్రీలో స్వరపరిచి, వాయించేందుకు మూడు అనునాదాన్నిచ్చే కుండలతో పాటు ఒక చెక్క నెమలి ఉంటుంది

PHOTO • Labani Jangi
PHOTO • Labani Jangi

ఎడమ: స్త్రీ దేవతలను కొలిచే ఆచారమైన గోంధళ్‌లో ఉపయోగించే సంబళ్. ఇవి తోలు పొరతో ఒక వైపు నుండి ఏకం చేయబడిన రెండు చెక్క డోళ్ళు. ఈ వాయిద్యాన్ని రెండు చెక్క కర్రలతో వాయిస్తారు, ఈ కర్రలలో ఒకదాని మొన వంపు తిరిగి ఉంటుంది. దీనిని గోంధాళీలు వాయిస్తారు. కుడి: హల్గీ అనేది గుళ్ళు, దర్గాల వద్ద, పండుగలు, వివాహ ఊరేగింపులు, ఇతర ఆచారాల సమయంలో మాంగ్ సముదాయానికి చెందిన పురుషులు వాయించే వృత్తాకార చెక్క చట్రం ఉన్న ఒక డోలు

*****

అయితే రాష్ట్ర ప్రభుత్వం మీరాబాయిని కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానించింది. మీరాబాయి షాహిరీ, గానం పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షిస్తుండటంతో, మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెను తాము చేపడుతున్న అనేక అవగాహన కార్యక్రమాలకు సహకరించమని కోరింది. దీంతో ఆమె రాష్ట్రం నలుమూలలా పర్యటించి ఆరోగ్యం, చెడు వ్యసనాలు, వరకట్న నిషేధం, మద్యపాన నిషేధం వంటి సమస్యలపై జానపద సంగీత అంశాలతో చిన్న చిన్న స్కిట్‌లను ప్రదర్శించారు.

बाई दारुड्या भेटलाय नवरा
माझं नशीब फुटलंय गं
चोळी अंगात नाही माझ्या
लुगडं फाटलंय गं

వ్యసనాలకు బానిస నా భర్త
విధి చేసింది నన్ను మోసం
తొడుక్కునేందుకు లేదు నాకు రవిక
కన్నీళ్ళతో తడిసిన చిరుగుల చీర తప్ప

వ్యసనాలను వదిలించుకోవడం [డి-అడిక్షన్‌]పై ఆమె చేసిన అవగాహనా కార్యక్రమాలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెను వ్యసన్‌ముక్తి సేవా అవార్డుతో సత్కరించింది. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌లు ఆమెను ప్రదర్శనలు ఇమ్మని ఆహ్వానించాయి.

*****

అయితే ఇన్ని మంచి పనులు చేసినా, మీరాబాయి జీవితం చాలా కష్టతరమైనది. ఆమె ఇటీవల జరిగిన ఒక దురదృష్ట సంఘటనను వివరిస్తూ, "నేను నిరాశ్రయురాలిగా మారాను, నాకు సహాయం చేసే వాళ్ళెవరూ కనిపించలేదు," అన్నారు. “లాక్‌డౌన్ సమయంలో [2020] షార్ట్ సర్క్యూట్ కారణంగా మా ఇంటికి మంటలు అంటుకున్నాయి. ఆ ఇంటిని అమ్మడం తప్ప వేరే మార్గం లేని నిస్సహాయ స్థితిలో పడ్డాం. అలా మేం వీధిన పడిపోయాం. అయితే చాలామంది అంబేద్కర్‌ అనుచరులు ఈ ఇంటిని పునర్మించుకోవడంలో నాకు సహాయం చేశారు,” అని మేం కూర్చొనివున్న రేకుల గోడలు, పైకప్పు ఉన్న తన కొత్త ఇంటిని చూపిస్తూ చెప్పారామె.

PHOTO • Ramdas Unhale
PHOTO • Ramdas Unhale

ఎన్నో ప్రశంసలు, అవార్డులు అందుకున్న జానపద కళాకారిణి, ప్రదర్శకురాలు మీరాబాయి జీవితం చాలా కష్టతరమైనది. ఛత్రపతి శంభాజి నగర్, చిఖల్‌ఠాణాలో ఉన్న ఆమె చిన్న రేకుల ఇంటి చిత్రాలివి

అన్నాభవు సాఠే, బాలగంధర్వ, లక్ష్మీబాయి కొల్హాపుర్కర్ వంటి ఎందరో మహానుభావుల పేరుతో ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్న కళాకారిణి పరిస్థితి ఇప్పుడిలా ఉంది. ఆమె చేసిన సాంస్కృతిక కృషికి, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమెను రాష్ట్ర అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డులు ఒకప్పుడు ఆమె ఇంటి గోడలను అలంకరించాయి.

"అవి చూసేందుకు మాత్రమే బాగా అనిపిస్తాయి," అని మీరాబాయి నీళ్ళు నిండిన కళ్ళతో చెప్పారు. "వీటిని చూసినంత మాత్రాన కడుపు నిండదు. కరోనా సమయంలో మేం ఆకలితో అలమటించాము. నిరాశ నిండిన ఆ సమయంలో, నేను భోజనం వండడానికి ఈ అవార్డులను కట్టెలుగా ఉపయోగించుకోవాల్సివచ్చింది. అవార్డుల కంటే ఆకలి చాలా శక్తివంతమైనది.’’

గుర్తింపు ఉన్నా లేకున్నా, మీరాబాయి తన కళను అచంచలమైన శ్రద్ధతో కొనసాగిస్తూ, మానవత్వం, ప్రేమ, కరుణల సందేశాన్ని వ్యాప్తి చేయడానికి గొప్ప సంఘ సంస్కర్తల మార్గంలోనే నడుస్తున్నారు. మతపరమైన, విభజన మంటలను ఆర్పడానికి ఆమె తన కళను, ప్రదర్శనలను ఉపయోగించుకుంటున్నారు. "నేను నా కళను వ్యాపారంగా చేయకూడదనుకుంటున్నా," అన్నారామె. “ సాంభాళలీ తర్ కళా ఆహే, నహీ తర్ బలా ఆహే [ఎవరో ఒకరు గౌరవిస్తేనే, అది కళ. లేకపోతే, అదొక శాపం].

“నేను నా కళను తన స్వభావాన్ని కోల్పోనివ్వలేదు. గత 40 సంవత్సరాలుగా నేను ఈ దేశంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించి కబీర్, తుకారామ్, తుకడోజీ మహరాజ్, ఫూలే-అంబేద్కర్‌ల సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నాను. నేను నా ప్రదర్శనల ద్వారా వాళ్ళ పాటలను, వాళ్ళ వారసత్వాన్ని గానం చేస్తున్నాను.

“నా చివరి శ్వాస వరకు నేను భీమ్ గీతాలను పాడతాను. అదే నా జీవితానికి ముగింపు అవుతుంది, అదే నాకు అపారమైన సంతృప్తిని ఇస్తుంది.’’

ఈ మల్టీ మీడియా కథనం ‘Influential Shahirs, Narratives from Marathwada’' అనే ప్రాజెక్ట్‌లో భాగం. ఈ ప్రాజెక్ట్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా సహకారంతో ఇండియా ఫౌండేషన్ ఫర్ ఆర్ట్స్ ద్వారా వారి ఆర్కైవ్స్ అండ్ మ్యూజియమ్స్ ప్రోగ్రామ్ కింద చేయబడినది. ఈ ప్రాజెక్ట్‌కు న్యూ ఢిల్లీలోని గోట (Goethe) ఇన్‌స్టిట్యూట్ /మాక్స్ ముల్లర్ భవన్ నుండి పాక్షిక మద్దతు కూడా లభించటం వల్లనే ఇది సాధ్యమయింది.

అనువాదం : రవి కృష్ణ

Keshav Waghmare

Keshav Waghmare is a writer and researcher based in Pune, Maharashtra. He is a founder member of the Dalit Adivasi Adhikar Andolan (DAAA), formed in 2012, and has been documenting the Marathwada communities for several years.

Other stories by Keshav Waghmare
Editor : Medha Kale

Medha Kale is based in Pune and has worked in the field of women and health. She is the Translations Editor, Marathi, at the People’s Archive of Rural India.

Other stories by Medha Kale
Editor : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya
Illustrations : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi
Translator : Ravi Krishna

Ravi Krishna is a freelance Telugu translator. Along with translating George Orwell's 'Animal Farm' for 'Chatura', a Telugu monthly magazine, he has published a few translations and parodies in the Telugu magazines 'Vipula' and 'Matruka'.

Other stories by Ravi Krishna