కరుప్పయ్య కొంబు వాయిస్తూనే చనిపోవాలనుకున్నాడు. కొంబు కు చారిత్రాత్మకమైన విశిష్టత ఉంది. శత్రువులతో యుద్ధాన్ని ప్రారంభించేముందు దీనిని ఊదేవారు. ఈ శబ్దం కోసం చెవి కోసుకోవచ్చు. కానీ ఇత్తడి లేదా కాంస్యంతో తయారు చేయబడిన, ఏనుగు తొండం ఆకారంలో ఉన్న, ఈ కొమ్మును వాయిస్తూ ప్రపంచం నుండి వెళ్లిపోవాలని కోరుకోవడానికి కరుప్పయ్య వేరే కారణం ఉంది.

నలభై తొమ్మిదేళ్ల కరుప్పయ్యకు ‘కొంబు’ అనేది ఒక గొప్ప కళారూపం. అతను నాలుగో తరం వాయిద్యకారుడు. తన ఇల్లు గడవడానికి బలవంతంగా నడిపే ఆటో కన్నా,అతనికి కొంబు తోనే చేరిక ఎక్కువ.

మూడు దశాబ్దాల క్రితం, “ఈ కళను చాలా గొప్పగా చూసేవారు,” అన్నాడు కరుప్పయ్య. అతను 1991 లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత కోసం వాయించడం గుర్తు చేసుకున్నాడు. “ఆమె మమ్మల్ని మళ్లీ వాయించమని అడిగింది. ఆమెకు బాగా నచ్చింది.”

కానీ ఈ రోజుల్లో అతనికి, తిరుపరకుండ్రం బ్లాక్ లోని  అతని ఊరు మేలకుయిల్కుడిలో ఉండే మిగిలిన కొంబు వాయిద్యకారులకు,  పని ఎక్కువగా దొరకట్లేదు. లయబద్ధంగా సాగే ఈ కళారూపం పాప్ సంగీతం వలన నెమ్మదిగా క్షీణించిపోతోంది. పైగా ఈ మార్చ్ నుంచి మొదలైన కోవిడ్ లాక్డౌన్ వలన పరిస్థితి ఇంకా  ఘోరమైంది. ఈ వాయిద్యకారులకు ప్రస్తుతం పని దొరకడం లేదు, కాబట్టి సంపాదన కూడా లేదు.

ఐతే కరుప్పయ్యకి పని దొరికినప్పుడు - గుళ్ళలో, జాతరలలో, చావులలో కొంబు వాయించినప్పుడు, అతనికి 700-1000 రూపాయిల దాకా డబ్బులు వస్తాయి. “పోయిన ఏడాది, లాక్డౌన్ కారణంగా మేము అళగర్ కోయిల్ తిరువళలో వాయించలేకపోయాము. మామూలుగా అయితే, ఎనిమిది రోజులు వరసగా  వాయించేవాళ్ళము.” కొంబు కళాకారులు వార్షిక పండుగ(ఏప్రిల్- మే) సమయంలో లక్షలాది భక్తులు మధురై  నగరంలో అళగర్ కొయిల్ గుడి వద్ద కూడినప్పుడు వాయిస్తారు.

“అందరూ కొంబు వాయించలేరు, దానికి  ప్రత్యేక నైపుణ్యం కావాలి.” అన్నాడు కాళీశ్వరన్.  ఇతను  ఆల్ట్రనేటివ్ మీడియా సెంటర్(AMC) వ్యవస్థాపకుడు. చెన్నైలో ఉన్న AMC, జానపద  కళాకారులకు, కళలకు ఆలంబన ఇచ్చే సంస్థ. ఈ వాయిద్యాన్ని వేడుక మొదలులో, మధ్యలో వాయిస్తారు. కాని వేడుక జరుగుతున్న సమయమంతా వాయించరు. కాబట్టి కళాకారులు ఒక 15 నిముషాలు వాయించి, ఐదు నిముషాలు విశ్రాంతి తీసుకుని మళ్లీ 15 నిముషాలు వాయిస్తారు. “సాధారణంగా వాయిద్యకారుడు చాలా దీర్ఘ నిశ్వాసం తీసుకుని కొంబు ని ఊదుతారు. వారు ఊపిరి బిగపట్టడం పై పట్టు సాధిస్తారు”,అని కాళీశ్వరన్ చెప్పాడు. ఇందువల్లనే కొంబు కళాకారులలో చాలామంది 100 ఏళ్ళకు దగ్గరగా ఉన్నవారు ఇంకా బ్రతికే ఉన్నారు, అని చెప్పాడు.

Left: M. Karuppiah is a fourth-generation kombu artiste. Right: K. Periasamy is the leader of the artistes' group in Melakuyilkudi
PHOTO • M. Palani Kumar
Left: M. Karuppiah is a fourth-generation kombu artiste. Right: K. Periasamy is the leader of the artistes' group in Melakuyilkudi
PHOTO • M. Palani Kumar

ఎడమ : ఎం కరుప్పయ్య నాలుగో తరం కొంబు కళాకారుడు. కుడి: కె పెరియస్వామి మేలకుయిల్కుడిలో కళాకారుల గుంపుకు నాయకుడు

అరవైయేళ్ల కె పెరియస్వామి  మేలకుయిల్కుడిలోని  కొంబు కలై కుళు అనే ఒక కళాకారుల బృందానికి నాయకుడు. అతనికి తెలిసిన విద్య కొంబు ని  వాయించడం ఒక్కటే. అతను ఇంకా చాలా మంది కళాకారులకు కొంబు వాయించడం నేర్పాడు. వీరంతా ఇప్పుడు 30-65 ఏళ్ళ వయసులో  ఉన్నారు. “మాకు ఇంకా వేరే పని దొరకడం లేదు. మాకున్నదంతా చవక రకం రేషన్ బియ్యం. మేము ఎలా బతుకుతాము?”, అన్నాడు పెరియస్వామి.

అతని ఇంట్లో ఉన్న విలువైనవి వస్తువులు అన్ని తాకట్టు పెట్టేశారు- ఒక స్టీలు బిందె, ఒక ఇత్తడి అన్నం మూకుడు, అతని  భార్య మంగళసూత్రం, అన్నీ. “ఇప్పుడు మా అందరి దగ్గర ప్లాస్టిక్ బిందెలు మాత్రమే ఉన్నాయి.” అని పెరియస్వామి ఒక నిట్టూర్పు తో చెప్పాడు. కానీ అతని చింత కళ గురించే. ప్రభుత్వం కళ కోసం, కళాకారుల కోసం ఏమన్నా చేస్తుందా?  అలా జరగకపొతే కొంబు కళ తనతోనే అంతరించి పోతుందా ?

మేలకుయిల్కుడిలో ఉన్న ఇరవై కొంబు కళాకారుల వద్ద, అందరివీ కలిపి 15 వాయిద్యాలు ఉన్నాయి. ఇవి వారి వద్ద 40 ఏళ్లుగా ఉన్నాయి.  వారి వారసత్వ వాయిద్యమైన పాత కొంబు , ఇన్సులేషన్ టేప్తో జాగ్రత్తగా అతికించి ఉంది. రోజులు బాలేనప్పుడు వాయిద్యగాళ్ళు తమ కొంబు ను తాకట్టు పెట్టడం కానీ  అమ్మడం కానీ చేస్తారు. కొత్త వాయిద్యాలు ఖరీదైనవి, వీటి ధర రూ. 20,000-25,000 ఉంటుంది. ఇవి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంబకోణం లో మాత్రమే లభిస్తాయి.

పి మగరాజన్, జి పాల్పండి, వారికి పదేళ్లు రాక ముందు నుంచి కొంబు ని వాయిస్తున్నారు. ఇప్పుడు వారు ముప్పైయేళ్ళ వయసుకి దగ్గరగా ఉన్నారు. వారిద్దరూ ఆ కళ మధ్యనే పెరిగారు, అలానే వారు తీసుకునే రొక్కం విలువ కూడా అలానే పెరిగింది. “నాకు పదేళ్లు ఉన్నప్పుడు, కొంబు వాయించినందుకు నాకు 50 రూపాయిలు వచ్చేవి. నాకు భలే అనిపించేది. ఇప్పుడు నాకు 700 ఇస్తున్నారు.” అన్నాడు మగరాజన్.

పాల్పండి మేస్త్రి పని చేసి రోజుకి 700 రూపాయిలు సంపాదిస్తాడు. అతని సంపాదన నిలకడగా సాగుతోంది. కానీ అతనికి కొంబు వాయించడమే ఇష్టం. అతను కొంబు వాయించడం అతని తాత దగ్గర నుంచి నేర్చుకున్నాడు. “తాత బతికుండగా, ఈ కళ ఎంత ముఖ్యమో  అర్థం చేసుకోలేకపోయాను.” అన్నడతను. ఈ లాక్డౌన్ అతనికి రెండో పెద్ద దెబ్బ. నిర్మాణం పని ఆగిపోవడం తో పాటుగా కొంబు వాయించడం కూడా ఆగిపోయింది. “ నేను ఏదైనా సహాయం దొరుకుతుందేమోనని ఎదురు చూస్తున్నాను.” అన్నాడతను.

“కాళీశ్వరన్ సర్ దగ్గర నుంచి సహాయం అందింది,” అన్నాడు కరుప్పయ్య. మే లో, తమిళనాడు లో లాక్డౌన్ ఉన్నప్పుడు,  కాళీశ్వరన్ AMC ద్వారా ఒక్కో కళాకారుడికి  పది కిలోల బియ్యాన్ని ఇప్పించాడు. నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్న కరుప్పయ్యది  పెద్ద సంసారం. కానీ మేము ఎలాగోలా బతకగలము, అని చెప్తాడు కరుప్పయ్య. “మేము పొలం నుండి కొన్ని కూరగాయలు  తెచ్చుకొని తినొచ్చు. బహుశా వంకాయలు మరియు ఉల్లిపాయలు తింటామేమో. కానీ నగరాల్లో ఉండే వారు ఏమి చేస్తారు? ”

PHOTO • M. Palani Kumar

కొంబు కలై కుళు ప్రదర్శనకారులు, మేలకుయిల్కుడిలోని కొంబు కళాకారుల సమిష్టి, ఇంకొందరు కుటుంబసభ్యులు

PHOTO • M. Palani Kumar

తన మనవలతో కె. పెరియసామి. ఇతను తమ సాంప్రదాయ వాయిద్య కళను చాలా మందికి నేర్పించాడు

PHOTO • M. Palani Kumar

జి. పాల్పండికి కొంబు అంటే చాలా ఇష్టం. అతను తన తాత దగ్గర కొంబు వాయించడం నేర్చుకున్నాడు.

PHOTO • M. Palani Kumar

సతీష్, 10 (ఎడమ),  కె అరుసమే, 17(కుడి)  మేలకుయిల్కుడిలో తరవాత తరం కొంబు వాయిద్యకారులు. వారు ఆ  వాయిద్యాన్ని వాయిస్తూనే ఉండాలన్న ఆసక్తి తో ఉన్నారు

PHOTO • M. Palani Kumar

ఎడమ: ఎ. మలార్, 55, 1991 లో కొంబు వాయించినప్పుడు రోజుకు 100 రూపాయలు వచ్చేవి. ఇప్పుడు అతనికి రూ. 800-1000 వస్తున్నాయి. కుడి: ఎం. కరుప్పయ్య ఇప్పుడు తగినంత పని లేదని చెప్పాడు

PHOTO • M. Palani Kumar

పి. మగరాజన్, 35, అతను ఏడు సంవత్సరాల వయసులో వాయించడం ప్రారంభించాడు

PHOTO • M. Palani Kumar

పి. ఆండి, 57, మేలంకుయిల్కుడిలోని పిల్లలకు కొంబు వాయించడానికి శిక్షణ ఇస్తాడు

PHOTO • M. Palani Kumar

ఎడమ నుండి కుడికి : వారి వాయిద్యాలతో పి. ఆండీ, పి. మగరాజన్, మరొక కళాకారుడు (పేరు తెలియదు),కె. పెరియసామి. ఈ S ఆకారపు కొమ్ము, ఇత్తడి లేదా కాంస్యంతో తయారు చేయబడింది

ఈ కథనానికి రిపోర్టర్ కు అపర్ణ కార్తికేయన్ అక్షరసాయం అందించారు.

అనువాదం : అపర్ణ తోట

M. Palani Kumar

M. Palani Kumar is PARI's Staff Photographer and documents the lives of the marginalised. He was earlier a 2019 PARI Fellow. Palani was the cinematographer for ‘Kakoos’, a documentary on manual scavengers in Tamil Nadu, by filmmaker Divya Bharathi.

Other stories by M. Palani Kumar
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota