ఎస్. ముత్తుపేచి ఆమె కష్టాలన్నీ వరసగా ఏకరువు పెడుతోంది. సాంప్రదాయ కళ అయిన కరాగాట్ట నృత్యం ఆమెకు బ్రతుకు తెరువు.  దీనికి రాత్రంతా నృత్యం చేసే నైపుణ్యం, బలం ఉండాలి. ఇంత కష్టపడినా ప్రదర్శనకారులని చాలా చిన్నచూపు చూస్తారు. పైగా వారికి  డబ్బులు కూడా సరిగ్గా రావు. నలభైనాలుగేళ్ల ఈ కళాకారిణి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది.

పదేళ్ల క్రితం భర్త మరణించి ఆమె ఒంటరిదయింది. అయినా ముత్తుపేచి కష్టపడి ఇంటిని సంభాళించుకుంటూ తన సంపాదనతో ఇద్దరు కూతుర్లకు పెళ్ళి చేసింది. కానీ అప్పటికి కోవిడ్ మహమ్మారి వచ్చింది.

ఆమె గొంతులో కోపం, దుగ్ధ వినిపిస్తాయి. “ పళ పోనా కరోనా (మాయదారి  కరోనా)” అని ఆ జబ్బు ని శపిస్తుంది. “ప్రదర్శనలు ఏమి లేకపోవడం వలన ఆదాయం కూడా లేదు. నా కూతుర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవలసిన ఖర్మ పట్టింది.” అన్నది.

“పోయిన ఏడాది ప్రభుత్వం 2000 రూపాయిలు ఇస్తామని చెప్పింది. కానీ మాకు 1000 రూపాయిలు మాత్రమే వచ్చాయి. మేము మధురై కలెక్టర్ కు అర్జీ పెట్టుకున్నాము. కానీ ఇప్పటి వరకు ఏమి రాలేదు.” అని చెప్పింది ముత్తుపేచి.  2020 ఏప్రిల్- మే లలో తమిళనాడు ప్రభుత్వం, రాష్ట్ర జానపద కళాకారుల సంక్షేమ బోర్డులో నమోదు చేసుకున్న కళాకారులకు 1000 రూపాయిలు ప్రత్యేకంగా ఇస్తామని రెండుసార్లు  చెప్పింది.

మధురై జిల్లాలో ఉన్న 1200 పైగా కళాకారులు, మహమ్మారి మొదలైన దగ్గరనుంచి పనులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు, అని పేరుపొందిన కళాకారుడు, జానపద కళల గురువైన మధురై గోవిందరాజ్ చెప్పారు. దాదాపు 120 కరగాట్టం ప్రదర్శనకారులు అవనీయపురం పట్టణం లోని  అంబేద్కర్ నగర్ చుట్టుపక్కల ఉంటున్నారు. ఇక్కడే నేను ముత్తుపేచిని మే నెలలో కలిసాను.

చాలా పెద్ద పల్లెనృత్యరూపకం అయిన కరగాట్టం ప్రదర్శనలను పండుగలప్పుడు గుడులలో, సాంస్కృతిక ప్రదర్శనలలో, పెళ్లిళ్లలో, దినకర్మలలో ఏర్పాటు చేసేవారు. కళాకారులు ఆది ద్రావిడ కులానికి చెందినవారు, దళితులు. వారు తమ జీవికకు కళ మీద మాత్రమే ఆధారపడతారు.

కరగాట్టం అనేది మగవారు, ఆడవారు- అందరూ కలిసి చేసే ఒక బృంద నృత్యం. వారు నృత్యం చేసేటప్పుడు నెత్తి మీద ఒక కుండ(కరగం) పెట్టుకుని  దానిని తల మీదే నిలుపుతూ నృత్యం చేస్తారు. చాలాసార్లు వారు రాత్రంతా, అంటే రాత్రి 10 నుంచి పొద్దుట 3 గంటల వరకు నృత్యం చేస్తారు.

PHOTO • M. Palani Kumar

కరగాట్టం కళాకారిణి ముత్తులక్ష్మి(ఎడమ),అవనీయపురంలో ఆమె ఇంట్లో వంట చేయడానికి స్థలం లేక ఇంటి బయట కూర్చుని  వంట చేస్తోంది.

వారి ఆదాయం ఎక్కువగా గుడిలో జరిగే పండగలకి వస్తాయి, అవి కూడా ఫిబ్రవరి నుండి సెప్టెంబర్ మధ్యలో జరుగుతాయి కాబట్టి, ఆ కళాకారులు ఒక సంవత్సరం దాకా సరిపోయేంత ఆదాయాన్ని సంపాదించకోవడానికి కష్టపడతారు, లేదా అప్పులు చేసి ఇంటిని నడుపుతారు.

కానీ ఈ మహమ్మారి వారికి వచ్చే ఈ కొద్ది ఆదాయాన్ని కూడా మింగేసింది. వారి నగలు, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు తాకట్టుపెట్టి, ఇక ముందు ముందు వారి జీవితం ఎలా సాగబోతుందో అనే ఆందోళనలో ఈ కళాకారులు ఉన్నారు.

“కరగాట్టం ఒక్కటే నాకు వచ్చిన పని”, అన్నది నల్లుతాయి. ముప్పైఏళ్ళ ఒంటరి తల్లియైన ఈమె 15 ఏళ్లుగా కరగాట్టం చేస్తోంది. “ప్రస్తుతం నేను, నా ఇద్దరు పిల్లలు రేషన్ బియ్యం, పప్పుల మీద  బతుకుతున్నాము. కానీ మేము ఇలా ఎంతకాలం బతకగలమో మాకు తెలీదు. మాకు ఒక పూర్తినెల గడవడానికి కనీసం పది రోజుల పని ఉండాలి. అప్పుడే నేను ఇంటిని నడుపుకుని పిల్లల స్కూల్ ఫీజు కట్టగలను.” అన్నది.

నల్లుతాయి తన పిల్లలు వెళ్లే ప్రైవేట్ స్కూల్ కు 40,000 రూపాయిలు ఫీజు కడుతుంది. ఆమె పిల్లలు ఆమెను పని మానేయమని చెబుతారంటుంది. మంచి చదువు చదివితే వారికి ఇంకా  మంచి అవకాశాలు దొరుకుతాయని ఆమె ఆశపడింది. కానీ అది మహమ్మారి కబళించక ముందు. “ఇప్పుడు మా రోజువారీ అవసరాలు తీరడమే కష్టంగా ఉంది”, అన్నది.

కరగాట్టం నర్తకులు ఒక పండగకు, మనిషికి, 1500 - 3000 రూపాయిల వరకు సంపాదిస్తారు. అదే దహన కాండలకు అయితే ఈ మొత్తం కాస్త తక్కువ- అక్కడ వారు ఒప్పరి (చావు సమయాల్లో పాడే పాట)- పాడి 500-800  రూపాయిల వరకు  సంపాదిస్తారు.

మహమ్మారి సమయం లో వారికి వచ్చిన ఆదాయం చాలా భాగం దహనకాండల నుంచే అని చెబుతుంది 23 ఏళ్ళ ఏ. ముత్తులక్ష్మి. ఆమె నిర్మాణ కూలీలైన తన తల్లిదండ్రులతో, అంబేడ్కర్ నగర్ లోని 8 అడుగుల పొడవు,  8 అడుగుల వెడల్పు ఉన్న గదిలో ఉంటుంది. ఈ మహమ్మారి సమయం లో ఎవరు ఎక్కువగా ఏమి సంపాదించలేదని చెబుతుంది. లాక్డౌన్ ఎత్తివేసాక పనులు దొరకడంలో కాస్త తెరిపివచ్చినా కరగాట్టం ఆర్టిస్టులకు మామూలుగా వచ్చే చెల్లింపులు తగ్గిపోయాయి. గుడులలో జరిగే ఉత్సవాలకు కూడా ఇదివరకు ఇచ్చే చెల్లింపులో సగం కానీ, మూడోవంతుగాని ఇస్తున్నారు.

చాలా అనుభవం ఉన్న నర్తకి, యాభైఏడేళ్ల ఆర్. జ్ఞానమ్మాళ్, మారిన రోజుల వలన దీనంగా అయిపొయింది. “నాకు చాలా చికాకుగా ఉంటోంది, కొన్నిసార్లు చచ్చిపోవాలనిపిస్తుంది”, అని చెప్పింది.

PHOTO • M. Palani Kumar

అనుభవజ్ఞురాలైన నర్తకి, ఐదుగురికి నానమ్మ అయిన ఆర్. జ్ఞానమ్మాళ్ చాలామంది కరగాట్టం నర్తకులకు శిక్షణ ఇచ్చారు

జ్ఞానమ్మాళ్ ఇద్దరు కొడుకులూ చనిపోయారు. ఆమె, ఆమె ఇద్దరు కోడళ్ళు కలిసి ఐదుగురు మనవలున్న వారి ఇంటిని నడుపుతారు. ఆమె ఇప్పటికి తన చిన్న కోడలితో కలిసి  ప్రదర్శనలు ఇస్తుంటుంది. పెద్ద కోడలు బట్టలు కుడుతుంది. జ్ఞానమ్మాళ్, చిన్న కోడలు ప్రదర్శనలకు వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇంటిని చూసుకుంటుంది.

అంతకు ముందు పండగలప్పుడు వారికి తినడానికి కూడా సమయం ఉండనంత పని ఉండేది అని ముప్పైయైదేళ్ల ఎం. అలగుపండి చెప్పింది. “పైగా సంవత్సరానికి 120-150  రోజులు పని దొరికేది.” అని అన్నది

అలగుపండికి చదువు అందకపోయినా ఆమె పిల్లలకు చదువు పట్ల చాలా ఆసక్తి ఉందని చెప్పింది. “మా అమ్మాయి కాలేజీ లో చదువుతోంది. ఆమె కంప్యూటర్ సైన్స్ లో బి. ఎస్. సి చేస్తోంది. ఏదేమైనా ఆన్లైన్ క్లాసులంటే చాలా కష్టం, మమ్మల్ని మొత్తం ఫీజు కట్టమంటారు. మాకేమో డబ్బు లేక కనాకష్టంగా సాగుతోంది.” అంది.

ముప్పైమూడేళ్ల టి. నాగజ్యోతి, కరగాట్టం కళాకారిణి గా చాలా పేరుపొందిన తన అత్త వలన ఈ నృత్యం నేర్చుకున్నానని చెప్తుంది. ఆమె చాలా అవసరంలో ఉంది. ఆమె భర్త ఆరేళ్ళ క్రితం చనిపోయినప్పటి నుంచి ఆమె సంపాదించుకుంటోంది. “నా పిల్లలు 9, 10 తరగతుల్లో ఉన్నారు. వాళ్ళకి తిండి పెట్టడం కష్టమైపోతుంది”, అన్నది.

పండగ రోజులప్పుడు నాగజ్యోతి ఆపకుండా 20 రోజులు ప్రదర్శనలు ఇవ్వగలదు. ఒకవేళ జ్వరం వచ్చినా, మందులేసుకుని  ప్రదర్శనలు ఇస్తుంది. “ఏం జరిగినా నేను నృత్యం చేయడం మానను. నాకు కరగాట్టం ఆంటే చాలా ఇష్టం”, అని చెప్పింది.

ఈ మహమ్మారి వలన కరగాట్టం కళాకారుల బ్రతుకులు తలకిందులయ్యాయి. కొద్దిగా డబ్బులు పెట్టి వారు సంగీతం, రంగస్థలం మీద కొన్ని మార్పులను తెచ్చి, వారి కలలను నిజం చేసుకుందామనుకుంటున్నారు.

“మా పిల్లలు మమ్మల్ని ఈ పని మానెయ్యమంటున్నారు. మేము మానెయ్యగలం కానీ ముందు వారికి కాస్త చదువు, మంచి ఉద్యోగం రావాలి.” అంది అలగుపండి.

PHOTO • M. Palani Kumar

కరగం పట్టుకున్న ఎం అళగుపండి. కరగం అంటే అలంకరించిన కుండ - దీనిని నెత్తి మీద పెట్టుకుని కరగట్టం కళాకారులు నృత్యం చేస్తారు. ఆమె పిల్లలు ఆమెలాగా అవడం ఆమెకు ఇష్టం లేదు.

PHOTO • M. Palani Kumar

అరవైనాలుగేళ్ల సంగీత కళాకారుడు, ఎన్ జయరామన్, కరగాట్టం ప్రదర్శనలలో తావిల్(ఒకరకమైన మృదంగం), వాయిస్తారు.

PHOTO • M. Palani Kumar

ఉమా, ఆమె భర్త ఇద్దరు కళాకారులే. ఆమె కరగాట్టం నృత్యం చేస్తుంది, అతను పరాయి(డప్పు) వాయిస్తాడు.

PHOTO • M. Palani Kumar

కళాకారుల వాయిద్యాలు వారి ఇళ్లలో ఒక మూల పడి ఉన్నాయి. మహమ్మారి మొదలైన దగ్గరనించి వాటిని వాడట్లేదు.

PHOTO • M. Palani Kumar

ఎం నల్లతాయి పని లేక అప్పులపాలయింది. ఆ మహమ్మారి వలన ఆమె పిల్లల చదువులు ఆగిపోతాయేమో అని బెంగ పడుతుంది.

PHOTO • M. Palani Kumar

ఎస్. ముత్తుపేచీ కరగాట్టం మీద గౌరవం తగ్గిపోయి, కళాకారులని సరిగ్గా చూడట్లేదని చెప్పింది. కొన్నిసార్లు వారికి బట్టలు మార్చుకునే గది కూడా ఇవ్వరని చెప్పింది.

PHOTO • M. Palani Kumar

టి. నాగజ్యోతి, 12 సంవత్సరాల వయసులో ప్రదర్శన ప్రారంభించింది. అలంకరించిన కరాగం, కరాగట్టం ప్రదర్శన సన్నాహాలకి ప్రధాన సూచన

PHOTO • M. Palani Kumar

కరాగట్టం కళాకారిణి ఎం. సూర్యదేవి, 29, ఆమె భర్త వి. మహాలింగం, డప్పు కళాకారుడు. మహమ్మారి సమయంలో వారి ఇంటి అద్దె చెల్లించలేకపోయారు. సూర్యదేవి కొన్ని నెలలు తమ పిల్లలను తల్లి ఇంటికి పంపవలసి వచ్చింది. ఆ కుటుంబం ఇప్పుడు ఒక స్థానిక ఎన్జీఓ సహాయంతో  బ్రతుకుతోంది

PHOTO • M. Palani Kumar

ఎం. ముత్తుపండి తన అలంకరణలో పోజు ఇస్తున్నాడు. యాభైఏళ్లు ఉన్న ఈ కరగాట్టం కళాకారుడు డ్రామాలలో విదూషకుడిగా కూడా పనిచేస్తున్నాడు. ఈ మహమ్మారి ఇంకా కొనసాగితే తమ సంప్రదాయ  కళ అంతరించిపోతుందేమో అని భయపడుతున్నాడు.

PHOTO • M. Palani Kumar

ఎస్. దేవి, 33, అవనీయపురంలో ఉన్న అంబేడ్కర్ నగర్ దగ్గరలో ఉంటుంది. ఆమె తన చిన్నతనం నుంచే  కరగాట్టం కళాకారిణిగా ప్రదర్శనలిస్తోంది.

ఈ కథనం రాయడంలో రిపోర్టర్ కు అపర్ణ కార్తికేయన్ అక్షరసాయం అందించారు.

అనువాదం - అపర్ణ తోట

M. Palani Kumar

M. Palani Kumar is PARI's Staff Photographer and documents the lives of the marginalised. He was earlier a 2019 PARI Fellow. Palani was the cinematographer for ‘Kakoos’, a documentary on manual scavengers in Tamil Nadu, by filmmaker Divya Bharathi.

Other stories by M. Palani Kumar
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota