మధురైలో మా ఇంటికి ఎదురుగా ఒక దీపస్థంభం ఉండేది. దానితో నేను ఎల్లప్పుడూ సంభాషిస్తూ ఉండేవాడిని. దానితో నాకు ఒక ప్రత్యేకానుబంధం ఉండేది. చాలా ఏళ్ల వరకు, అంటే నేను స్కూల్ చదువు ముగించేవరకు మా ఇంట్లో కరెంటు ఉండేది కాదు. 2006లో మాకు కరెంటు వచ్చినా, మేమంతా 8x 8 అడుగుల ఇంట్లో ఉండేవారమి. అంటే ఒకే గదిలో ఐదుగురం ఉండేవాళ్ళము. దాని వలన ఆ వీధీ స్థంభం నన్ను ఇంకా దగ్గరకు తీసుకుంది.

మేము చిన్నప్పుడు చాలా ఇళ్లు మారాము. ఒక గుడిసె నుండి మట్టి ఇంటికి, ఆ తరవాత ఒక అద్దె ఇంటికి, ఇప్పుడు మేము 20x 20 అడుగుల ఇంట్లో ఉన్నాము. ఈ ఇల్లు నా తల్లిదండ్రులు పన్నేపన్నెండేళ్లుగా ఇటుక పై ఇటుక పేర్చి కట్టింది. నిజమే వారు ఒక మేస్త్రి ని పెట్టుకున్నా వారి స్వంత ఈ ఇంటిపై ధారబోశారు. ఈ ఇల్లు కడుతుండగానే మేము ఇక్కడ నివసించడం మొదలుపెట్టాము. ఇలా నేను ఉన్న ఇళ్లన్నీ దీపస్థంబాలకు దగ్గరగానే ఉండేవి. నేను చే గువేరా, నెపోలియన్, సుజాత, ఇంకా  ఇతరుల కథలు ఈ దీపస్థంబపు వెలుగు వలయంలోనే చదువుకున్నాను.

ఇప్పుడు కూడా ఆ దీపస్థంభమే ఈ రచనకు సాక్షి.

*****

కరోనా దయవలన మా అమ్మతో చాలాకాలం తరవాత సంతోషంగా గడిపాను. 2013 లో నా మొట్టమొదటి కెమెరాని కొన్నప్పటి నుండి, నేను ఇంట్లో ఉండడం నెమ్మదిగా తగ్గిపోసాగింది. బడి రోజుల్లో నా ఆలోచనా విధానం వేరేగా ఉండేది, కాని కెమెరా వచ్చాక నా ఆలోచన ధోరణి మళ్ళీ మారిపోయింది. కానీ ఈ మహారోగ సమయంలో కోవిడ్ లాక్డౌన్ల వలన, నేను నెలల తరబడి మా అమ్మ తో  ఇంట్లోనే ఉన్నాను. ఇంతకు ముందెప్పుడూ ఇంత సమయం మా అమ్మతో గడిపింది లేదు.

My mother and her friend Malar waiting for a bus to go to the Madurai Karimedu fish market.
PHOTO • M. Palani Kumar
Sometimes my father fetches pond fish on his bicycle for my mother to sell
PHOTO • M. Palani Kumar

ఎడమ: మా అమ్మా , తన స్నేహితురాలు మలర్ , మదురై కొరమీడు చేపల మార్కెట్ కు వెళ్ళడానికి బస్  కోసం ఎదురుచూస్తున్నారు. కుడి: కొన్నిసార్లు మా నాన్న సైకిల్ మీద చెరువులో  చేపలు పట్టుకొచ్చి , మా అమ్మ అమ్ముకోవడానికి ఇస్తాడు

నాకు అమ్మ ఒక చోట కూర్చోవడం అనేది ఎప్పుడు గుర్తులేదు. ఆమె ఎప్పుడూ ఒకదాని తరవాత ఒకటి, అలా ఏదోక పని  చేస్తూనే ఉండేది. కానీ ఆమెకు కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన  కీళ్ళనొప్పుల వలన, ఆమె కదలికలు చాలావరకు తగ్గిపోయాయి. దీని ప్రభావం నా పై తీవ్రంగా పడింది. మా అమ్మ ని నేను ఎప్పుడూ ఇలా చూసి ఉండలేదు.

ఆమె కూడా చాలా ఆందోళన పడేది. “ చూడు ఈ  వయసులో నా పరిస్థితి ఎలా అయిపోయిందో. నా పిల్లలను ఇప్పుడెవరు చూసుకుంటారు?” అనేది. ఆమె ఎప్పుడైనా, “నా కాళ్ళను మామూలుగా చెయ్యి కుమార్”,  అంటే ఆమెకు నేను ఏ సహాయం చేయలేనందుకు సిగ్గుగా  అనిపించేది. నేను ఆమెను సరిగ్గా చూసుకోలేకపోయాను అనిపిస్తుంది.

మా అమ్మ గురించి చెప్పడానికి చాలా ఉంది. ఇప్పుడు నేను ఒక ఫోటోగ్రాఫర్ ని అయ్యాను, మనుషులను కలుస్తున్నాను. ఇప్పటి నా విజయాల వెనుక మా అమ్మే ఉంది. నా తల్లిదండ్రులు వెన్ను విరిగేలా కష్టపడడం నాకు తెలుసు. ముఖ్యంగా మా అమ్మ- ఆమె చాలా ఎక్కువే చేసింది నాకు.

అమ్మ ఉదయం 3 గంటలకే లేచి, ఇల్లు వదిలి చేపలు అమ్మడానికి వెళ్లిపోయేది. ఆమె అటువంటి అర్ధం లేని సమయంలో లేపి నన్నుచదువుకోమనేది. ఆమె వెళ్ళిపోగానే నేను మళ్ళీ వెళ్లి నిద్రపోయేవాడిని. చాలాసార్లు నేను  చేసిన పనులకు ఆ దీపస్థంభమే సాక్షి.

My mother carrying a load of fish around the market to sell.
PHOTO • M. Palani Kumar
My mother selling fish by the roadside. Each time the government expands the road, she is forced to find a new vending place for herself
PHOTO • M. Palani Kumar

ఎడమ:  మా అమ్మ చేపలు అమ్మడానికి బుట్ట ఎత్తుకుని బజార్‌లో తిరుగుతోంది. కుడి: మా అమ్మ రోడ్డు పక్కన చేపలు అమ్ముతోంది. ప్రభుత్వం రోడ్డు వెడల్పు చేసినప్పుడల్లా మా అమ్మ ఆ ప్రదేశం ఖాళీ చేసి  తన చేపల అమ్మకానికి వేరే ప్రదేశం వెతుక్కోవాలి

మా అమ్మ ఆత్మహత్య చేసుకోవడానికి మూడు సార్లు ప్రయత్నించింది. మూడుసార్లు మా అమ్మ బతికిందంటే అదేమీ చిన్న విషయం కాదు.

నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను పాకే వయసులో ఉన్నప్పుడు, మా అమ్మ ఉరి వేసుకోవడానికి ప్రయత్నించింది. నేను అప్పుడే చాలా బిగ్గరగా ఏడ్చాను. నా ఏడుపు విని చుట్టుపక్కల వారు, ఏమయిందో తెలుసుకోవాలని  పరిగెత్తుకు వచ్చారు.  మా అమ్మ వేలాడి ఉండడం చూసి ఆమెని రక్షించారు. కొందరైతే ఆమె నాలుక  బయటికి వచ్చేసిందని చెప్పారు. “ నువ్వు కనక ఏడవకపోయుంటే, నన్ను రక్షించడానికి ఎవరు వచ్చేవారు కాదు”, అని అమ్మ ఇప్పటికి అంటుంది.

నా వద్ద మా అమ్మలాగా  వారిని వారు అంతం చేసుకోవాలనుకున్న ఎందరో తల్లుల కథలు ఉన్నాయి. అయినా ఎలానో వారు వారి పిల్లల కోసం ధైర్యాన్ని మూటగట్టుకుని బ్రతుకుతూ ఉండేవారు. మా అమ్మ ఈ విషయం మాట్లాడినప్పుడల్లా కళ్ళు నిండేవి.

ఒకసారి ఆమె నాట్లు వేయడడానికి పక్కూర్లో పొలానికి వెళ్ళింది. ఆమె దగ్గరలో ఉన్న చెట్టుకు ఒక తూలి (గుడ్డ ఉయ్యాల)కట్టి నన్ను అందులో పడుకోబెట్టింది. మా నాన్న అక్కడికి వచ్చి మా అమ్మని  కొట్టి నన్ను ఉయ్యాలలో నుండి బయటకు విసిరేశాడు. నేను కొద్ధిదూరంలో బురదగా ఉన్న పొలం గట్టు మీద పడ్డాను. నా ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది.

మా అమ్మ నన్ను తిరిగి స్పృహలోకి తీసుకురావటానికి తనకు చేతనైనంత చేసింది. మా చిత్తి (అమ్మ చెల్లెలు), నన్ను నిలువునా తిరగేసి, నా వెన్ను పై చరిచింది. వెంటనే  నేను ఏడవడం, ఊపిరి తీయడం మొదలు పెట్టానని చెబుతారు. అమ్మ ఈ విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నప్పుడల్లా, ఆమె వెన్నులో చలి పుడుతుంది. నేను చచ్చి బతికాను అని ఆమె చెబుతుంది.

My mother spends sleepless nights going to the market to buy fish for the next day’s sale in an auto, and waiting there till early morning for fresh fish to arrive.
PHOTO • M. Palani Kumar
She doesn’t smile often. This is the only one rare and happy picture of my mother that I have.
PHOTO • M. Palani Kumar

ఎడమ: మా అమ్మ ఆటోలో నిద్రలేని రాత్రులు గడిపి , బజారులో పొద్దున్నే వచ్చే తాజా చేపలు కొని తర్వాత రోజు అమ్ముతుంది. కుడి: ఆమె ఎక్కువగా నవ్వదు. ఇదొక్కటే ఆమె సంతోషంగా కనిపించే అరుదైన ఫోటో

*****

నాకు రెండేళ్లున్నప్పుడు, మా అమ్మ పొలాల్లో పని చేయడం మాని చేపలు అమ్మడం మొదలు పెట్టింది. ఇక అప్పటి నుండి అదే ఆమె ఆదాయానికి వనరు అయింది. నేను డబ్బులు సంపాదించి ఇంట్లో ఇవ్వడం అనేది పోయిన ఏడాది మాత్రమే మొదలయ్యింది. అప్పటిదాకా, మా ఇంటిలో అమ్మ మాత్రమే సంపాయించేది. ఆమెకు కీళ్లనొప్పులు మొదలయ్యాక కూడా ఆమె మందు మాత్రలు మింగి, చేపలు అమ్మడానికి వెళ్లిపోయేది. ఆమె నిరంతర కష్టజీవి.

మా అమ్మ పేరు తిరుమాయి. గ్రామస్తులంతా ఆమెను ‘కుప్పి’, అని పిలిచేవారు. నన్ను ‘కుప్పి కొడుకు’, అని పిలిచేవారు. కలుపు తీయడం, వరి కోయడం, కాలువలు తవ్వడం, ఆమెకు ఏళ్ల తరబడి ఇటువంటి పని మాత్రమే దొరికేది. మా తాత కౌలుకు పొలం తీసుకుంటే ఆమె ఒకతే ఆ  పొలమంతా ఎరవు వేసి, భూమిని సత్తువ చేసి నాట్లకు సిద్ధం చేసింది. ఈ రోజు వరకు నేను మా అమ్మ అంతగా కష్టపడేవారిని చూడలేదు. నా అమ్మయి (అమ్మమ్మ), శ్రమకు అర్థం మా అమ్మ, అని చెప్పేది. ఎవరైనా అంత కష్టం ఎలా పడగలరూ, అని నేను ఆశ్చర్యపోయేవాడిని.

మామూలుగా  దిన వేతనం పై పనిచేసే కూలీలు చాలా కష్టపడతారని నేను గమనించాను- ముఖ్యంగా  స్త్రీలు . నా అమ్మమ్మకు, మా అమ్మ తో కలిపి 7 గురు పిల్లలు ఉండేవారు- 5 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. మా అమ్మే అందరిలోనూ పెద్దది. మా తాత ఒక తాగుబోతు, ఇంటిని అమ్మేసి తాగుడుకు ఖర్చుపెట్టిన ఘనుడు. మా అమ్మమ్మ తాను చేయగలిగినదంతా చేసింది, ఆమె సంపాదించడమేగాక, పిల్లల పెళ్లిళ్లు చేసింది, మనవలను  కూడా పెంచింది.

మా అమ్మలో ఇప్పటికి పని పైన ఉన్న శ్రద్ధ చూస్తాను నేను. మా పిన్ని తాను ప్రేమించినవాడిని పెళ్లిచేసుకోవాలనుకున్నప్పుడు, మా అమ్మ ధైర్యంగా వెళ్లి ఆమె పెళ్లికి సహాయం చేసి వచ్చింది. ఒకసారి మేము గుడిసెలో ఉంటున్న కాలంలో, గుడిసె హఠాత్తుగా కాలిపోయింది, మా అమ్మ నన్ను, మా తమ్ముడిని, చెల్లిని  గట్టిగా పట్టుకుని రక్షించింది . ఆమె భయమన్నది ఎరుగదు. తల్లులు మాత్రమే మొదట వారి పిల్లల గురించి అలోచిస్తారు. పిల్లలను రక్షించుకొవడానికి వారి ప్రాణాలను సైతం లెక్కచేయరు.

Amma waits outside the fish market till early in the morning to make her purchase.
PHOTO • M. Palani Kumar
From my childhood days, we have always cooked on a firewood stove. An LPG connection came to us only in the last four years. Also, it is very hard now to collect firewood near where we live
PHOTO • M. Palani Kumar

ఎడమ: అమ్మ  పొద్దున్నే వెళ్ళి, చేపల మార్కెట్ ముందు చేపలు కొనడానికి ఎదురుచూస్తూ కూర్చుంది. కుడి: నా చిన్నప్పటి రోజులనుండి, మేమెప్పుడూ కర్రపొయ్యి మీదే వంటచేసుకున్నాము. నాలుగేళ్ళ క్రితమే మా ఇంట్లో LPG కనెక్షన్ వచ్చింది. మా ఇంటి చుట్టుపక్కల, పొయ్యికి కావలసిన కట్టెపుల్లలు దొరకడం చాలా కష్టం

ఆమె ఇంటి బయట, కర్రలపొయ్యి మీద పణియారం (గుంతపొంగణాలు- కారంగా కానీ తీపిగా  కానీ ఉంటాయి) వండేది. మనుషులు చుట్టూ మూగేవారు, పిల్లలు తినడానికి ఇవ్వమనేవారు. “అందరితో పంచుకోవాలి”, అని ఎప్పుడూ చెప్పేది. నేను మా చుట్టుపక్కల పిల్లలకి చేతికి పట్టినన్ని ఇచ్చేవాణ్ని.

ఇతరుల పట్ల ఆమె కరుణ చాలా రకాలుగా బయట పడేది. ప్రతిసారి నేను బైక్ నడిపే ముందు, “నీకు దెబ్బ తగిలినా పర్లేదు, కానీ దయచేసి ఎవరిని గుద్దకుండా చూసుకో…” అని అనేది.

మా  నాన్న ఒక్కసారి కూడా ఆమెను తిన్నావా అని అడిగింది లేదు. వారిద్దరూ ఒక సినిమా కి కాని, గుడికి కాని కలిసివెళ్ళింది లేదు. ఆమె ఎప్పుడు పనిచేస్తూనే ఉండేది. పైగా నాతో, “నువ్వు లేకపోయి ఉంటే ఈ పాటికి నేను ఎప్పుడో చనిపోయేదాన్ని”, అని అనేది.

నేను కెమెరా కొన్న తరవాత, నా కథల కోసం ఆడవారిని కలిసినప్పుడు, వారెప్పుడూ, “నేను నా పిల్లల కోసమే బతుకుతున్నాను,”  అని అనేవారు. ఇప్పుడు నాకు 30 ఏళ్ళు వచ్చాక ఆ మాటాలన్ని నిజమే అని అర్థమవుతుంది నాకు.

*****

మా అమ్మ చేపలు అమ్మడానికి వెళ్లిన ఇళ్లలో, ఆ కుటుంబంలోని పిల్లలు గెలుచుకొచ్చిన కప్పులు, మెడళ్ల్లు బయటకు కనపడేలా అమర్చి ఉండేవి. మా అమ్మ తన పిల్లలు కూడా అలా ట్రోఫీలను తెస్తే బాగుండును అనుకునేది. కానీ నా వద్ద చూపించడానికి,  ఇంగ్లీష్ పేపర్ లో నాకు వచ్చిన ఫెయిల్ మార్కులు మాత్రమే ఉండేవి. ఈ విషయానికి ఆమెకి కోపం వచ్చేది. “ నేను ప్రైవేట్ స్కూల్ కి ఫీజు కట్టేదేందుకు? నువ్వు ఇంగ్లీష్ లో ఫెయిల్ అవడానికా, అని  అనేదామె కోపంగా.

My mother waiting to buy pond fish.
PHOTO • M. Palani Kumar
Collecting her purchase in a large bag
PHOTO • M. Palani Kumar

ఎడమ: అమ్మ చెరువు చేపలు కొనడానికి చూస్తోంది. కుడి: కొన్నవాటిని  సంచిలో వేసుకుంటుంది

ఆమె కోపం వలనే నాలో ఏదో సాధించాలన్న తపన మొలకెత్తింది. మొదటి గెలుపు ఫుట్ బాల్ ఆటలో దక్కింది. కు చాలా ఇష్టమైన ఆట అది. మా స్కూల్ ఫుట్ బాల టీమ్ లో చేరడానికి నేను రెండేళ్లు ఎదురుచూశాను. ఇక నేను ఆడిన మొదటి ఆటలోనే మేము ఒక టోర్నమెంట్లో కప్పుని గెలుచుకున్నాము. ఆ రోజు నేను గర్వంగా ఇంటికొచ్చి, నా కప్పుని మా అమ్మకి చూపించాను.

ఫుట్ బాల్ ఆడడం వలన నా చదువుకు కూడా మేలు జరిగింది. నాకు స్పోర్ట్స్ కోట లోనే హోసూర్ ఇంజనీరింగ్ కాలేజీ లో సీట్ వచ్చి పట్టభద్రుడిని అయ్యాను. అయినా నేను నా ఇంజనీరింగ్ ని ఫోటోగ్రఫీ కోసం వదిలేసాననుకోండి. కాని ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఇలా ఉన్నానంటే మా అమ్మే కారణం.

నేను చిన్నప్పుడు ఆమెతో పాటే బజారుకు వెళ్ళేవాణ్ణి, పరుత్తిప్పాల్ పనీయారం (పత్తి గింజల పాలు, బెల్లంతో చేసిన తీపి గుంతపునుగులు) కొనేది.

ఆ నిద్రలేని రాత్రులు దోమలతో కొట్లాడుతూ, రోడ్  పక్కన ప్లాట్ఫారం మీద మేము మార్కెట్లో వచ్చే తాజా చేపల కోసం ఎదురుచూసేవారిమీ- పొద్దున్నే చేపలు కొనడం కోసం త్వరగా లేచేవారిమి. ఇప్పుడు ఆలోచిస్తే అవన్నీ ఎలా దాటామా అనిపిస్తుంది. కానీ అప్పట్లో అది సాధారణంగానే అనిపించేది. ఒక చిన్నమెత్తు లాభం కోసం, మా వద్దనున్న చివరి చిన్న  చేపను కూడా అమ్మేయవలసి వచ్చేది.

My father and mother selling fish at one of their old vending spots in 2008.
PHOTO • M. Palani Kumar
During the Covid-19 lockdown, we weren’t able to sell fish on the roadside but have now started again
PHOTO • M. Palani Kumar

ఎడమ: 2008 లో , తమ పాత వ్యాపార స్థలంలో మా అమ్మానాన్నా. కుడి: కోవిడ్ లాక్డౌన్ సమయంలో చేపలు అమ్మలేకపోయాము. ఇప్పుడు మళ్ళీ అమ్ముతున్నాము

అమ్మ మదురై కరిమెడు చేపల మార్కెట్ లో ఐదు కిలోల చేపల బుట్టను కొనేది. ఈ బుట్ట బరువులో చేపను తాజా గా ఉంచడానికి పెట్టే ఐస్ బరువు కూడా కలిపి ఉండేది. కాబట్టి ఆమె చేపల తట్టను నెత్తి మీద పెట్టుకుని మదురై వీధులలో అమ్మడానికి బయలుదేరేప్పటికి  ఐస్ నీళ్లుగా కరిగిపోయి, ఆ బుట్ట ఒక కిలో బరువు తగ్గిపోయేది.

25 ఏళ్ళ క్రితం ఆమె ఈ పనిని మొదలుపెట్టినప్పుడు, రోజుకు 50  రూపాయిలు సంపాదించేది. తరవాత అది 200-300 రూపాయలకు చేరింది. ఈ రోజుల్లో అయితే, ఆమె తిరిగి అమ్ముకోవడానికి బదులుగా ఆమె స్వంతంగా ఒక రోడ్ పక్కన దుకాణం పెట్టుకుంది. ఇప్పుడు ఆమె నెలకు మొత్తం ముప్ఫయి రోజులు పనిచేస్తే  12,000 రూపాయలు వస్తాయి.

నేను పెద్దయ్యాక, ఆమె వారపు రోజులలో(సోమవారం నుండి శుక్రవారం దాకా, ఐదురోజుల పాటు), కరీమీడు మార్కెట్లో చేపలు కొనడానికి, రోజుకు 1000 రూపాయిలు పెట్టుబడిగా పెట్టేదని అర్థం చేసుకున్నాను. ఇక శని ఆదివారాలు ఆమెకు అమ్మకాలు బాగా సాగేవి, అందుకని ఆమె 2,000 రూపాయిల వరకు పెట్టుబడి పెట్టేందుకు ధైర్యం చేసేది. ఇప్పుడు ఆమె రోజుకు 1500 రూపాయిలు, వారాంతాల్లో 5,000-6,000 రూపాయిలు, పెట్టుబడి పెడుతుంది. కానీ అమ్మకు చాలా  తక్కువ లాభం అందుతుంది ఎందుకంటే ఆమె ఇచ్చే స్వభావం ఉన్న మనిషి. ఆమె ఎప్పుడు తూచడంలో మోసం చేయదు, ఆమె కస్టమర్లకు ఇంకా ఎక్కువ ఇవ్వడానికే చూస్తుంది.

కరిమెడులో చేపలు కొనడానికి, మా అమ్మ ఒక షావుకారు నుండి అప్పు తెస్తుంది. ఈ అప్పు తరవాత రోజే చెల్లించాలి. కాబట్టి ఆమె వారంలో ఒక రోజు ఎప్పటిలానే 1500 రూపాయిలు తీసుకుంటే, 24 గంటలు దాటగానే 1600 రూపాయిలు ఆ షావుకారుకు ఆమె తిరిగి ఇచ్చేయాలి. అంటే రోజుకు 100 రూపాయిలు ఇవ్వాలి. ఎక్కువ లావాదేవీలు ఆ వారంలోనే ముగుస్తాయి కాబట్టి, ఏడాదిలో దీని వడ్డీ లెక్క ఎంతో ఎవరూ చూడరు. లేదంటే ఏడాదికి 2400 శాతం కన్నా ఎక్కువ  వడ్డీని కట్టవలసి ఉంటుంది.

These are the earliest photos that I took of my mother in 2008, when she was working hard with my father to build our new house. This photo is special to me since my journey in photography journey began here
PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

నేను ఫోటోలు తీయడం మొదలుపెట్టివప్పుడు తీసిన అమ్మ(ఎడమ) , నాన్న(కుడి) ఫోటో. 2008 లో వారిద్దరూ మా కొత్తఇంటిని కట్టడానికి రెక్కలుముక్కలు చేసుకున్నారు. ఈ రెండు ఫోటోలు నాకు చాలా ఇష్టం , ఎందుకంటే వీటితోనే ఫోటోగ్రాఫర్ గా నా ప్రయాణం మొదలైంది

ఆమె అతని వద్ద నుండి వారాంతపు చేప కొనుగోలుకు 5,000 రూపాయిలు తీసుకుంటే, ఆమె సోమవారానికి అతనికి 5,200 రూపాయిలు తిరిగి ఇవ్వాలి. ఇది ఎటువంటి రోజైనా వారపు రోజులలో, లేదా వారాంతంలో ప్రతి ఒక్క రోజుకు 100 రూపాయిలు వడ్డీ చెల్లించాలి. ఈ లెక్కలో వారాంతానికి ఆమె అసలు మీద,  ఏడాదికి 730 శాతం వడ్డీ చెల్లించాలి.

చేపల మార్కెట్టుకు వెళ్లడం వలన నేను చాలా కథలను వినగలిగాను. కొన్ని నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఫుట్ బాల్ మ్యాచులలో విన్న కథలు, మా నాన్నతో కలిసి ఇరిగేషన్ కాలువలలో చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు విన్న కథలు, ఈ  చిన్నచిన్న విహార యాత్రలు నాకు సినిమా పైనా, దృశ్య మాధ్యమం పైనా ఆసక్తిని పెంచాయి. మా అమ్మ ప్రతివారం ఇచ్చిన పాకెట్ మనీతో  కొన్న చే గువేరా, నెపోలియన్, సుజాత పుస్తకాలు నన్ను దీపస్థంభానికి దగ్గర చేశాయి.

*****

ఒకానొక దశ లో మా నాన్న కూడా మారిపోయి డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు. వివిధ రకాల రోజువారీ కూలి పనులు చేస్తూ, ఆయన మేకలను కూడా పెంచేవాడు. ఇంతకు ముందు ఆయన వారానికి 500 రూపాయిలు సంపాదించేవాడు. ఆ తరవాత ఆయన హోటళ్లలోనూ, రెస్టారెంట్లలోనూ పని చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయన రోజుకు 250 రూపాయిలు సంపాదిస్తున్నాడు. 2008లో ముఖ్యమంత్రి హౌసింగ్ ఇన్సూరెన్స్ పథకాల క్రింద మా తల్లిదండ్రులు కొంత డబ్బు అప్పుగా తీసుకుని మేము ప్రస్తుతం ఉంటున్న ఇంటిని కట్టడం మొదలు పెట్టారు. ఇది జవహర్లాల్  పురంలో ఉంది. ఇది వరకు ఈ ప్రదేశం మదురైకి దూరంగా ఒక గ్రామంగా ఉండేది. ఇప్పుడు పెరుగుతున్న నగరం, ఈ గ్రామాలను మింగేసింది.

నా తల్లిదండ్రులకు ఈ ఇల్లు కట్టడానికి 12 ఏళ్ళు పట్టింది. మధ్యలో వారు ఎన్నో కష్టాలను ఓర్చుకున్నారు. మా నాన్నగార్మెంట్ డైయింగ్ ఫ్యాక్టరీలలో, హోటళ్లలో, గొడ్లను కాసి, ఇలా ఎన్నో పనులు చేసి,  కొద్దికొద్దిగా పొదుపు చేస్తూ వచ్చాడు. వారు పొదుపు చేసిన డబ్బుతో  నన్ను, నా ఇద్దరు తోబుట్టువులను స్కూళ్లలో వేశారు, అలానే ఇంటిని కూడా ఇటుక పై ఇటుక పేరుస్తూ కట్టుకున్నారు. వారి త్యాగంతో కట్టిన మా ఇల్లు వారి పట్టుదలకు ప్రతీక.

The house into which my parents put their own hard labour came up right behind our old 8x8 foot house, where five of us lived till 2008.
PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: మా తలిదండ్రులు వారి కష్టాన్ని పిండి స్వంత ఇంటిని కట్టుకొనక పూర్వం , మేము అయిదుగురమూ ఉన్న 8X8 అడుగుల ఇల్లు. కుడి: మా అమ్మ , అమ్మమ్మ(ఎడమ) , పిన్ని(కుడి) మా కొత్తఇంటి పైన పెంకులు పరుస్తున్నారు. కడుతుండగానే మేము ఈ ఇంటిలోకి మారిపోయాము

మా అమ్మ గర్భ సంచిలో ఏవో ఇబ్బందులు ఉండి ఆమె ఆరోగ్యం పాడైంది. ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకుంది. మాకు 30,000 రూపాయిలు ఖర్చయ్యాయి. నేను అప్పటికి గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను, ఆర్ధికంగా ఏమి సహాయం చేయలేకపోయాను. మా అమ్మ ని దగ్గర ఉన్న నర్స్, సరిగ్గా చూసుకోలేదు. ఆమెను మంచి ఆసుపత్రిలో చేర్పించుదాం అని మా కుటుంబం అనుకున్నా, అప్పట్లో ఆ ఖర్చు భరించే పరిస్థితిలో నేను లేను. నేను PARI లో పని చేయడం మొదలుపెట్టాక, ఆ పరిస్థితి మారింది.

నా తమ్ముడి ఆపరేషన్ కి అయినా ఖర్చులకు కూడా PARI సహాయం చేసింది. నేను అమ్మ కి నా నెలసరి జీతం ఇవ్వగలిగాను. నాకు వికటన్ అవార్డు  వంటి చాలా ప్రైజులు వచ్చాక మా అమ్మకి నేనేదో సాధిస్తున్నానన్న ఆశ కలిగింది. మా నాన్న అప్పటికి నన్ను ఏడిపించేవారు- “నువ్వెన్నో అవార్డులు గెలుచుకుంటున్నావు కాని, ఇంటికి ఏమన్నా డబ్బులు సంపాదించి ఇస్తున్నావా,” అని.

ఆయన చెప్పింది నిజమే. నేను 2008 లో వారిని, వీరిని మొబైల్  ఫోన్ అడిగి ఫోటోలు తీసేవాడిని కానీ,  2014 వరకు మా కుటుంబం మీద ఆర్ధికంగా ఆధారపడ్డాను. అప్పటిదాకా నేను ఏవేవో  పనులు- హోటళ్లలో గిన్నెలు కడగడం, పెళ్లి ఫంక్షన్లలో లేదా వేరే వేడుకలలో భోజనం వడ్డించడం, ఇంకా ఇటువంటి పనులెన్నో చేసేవాడిని.

నేను  కాస్త చెప్పుకోదగ్గ  డబ్బులు సంపాదించి ఇంట్లో ఉన్న మా అమ్మకి ఇవ్వడానికి 10 ఏళ్ళు పట్టింది. పోయిన దశాబ్దంలో మేమెన్నో తట్టుకున్నాం. మా చెల్లికి కూడా జబ్బు చేసింది. మా అమ్మ, మా చెల్లి జబ్బు పడడం ఒకరి తరవాత మరొకరు ఆసుపత్రిలో చేరడం తో ఆసుపత్రి మా రెండో ఇల్లులా తయారైంది. అమ్మ తన గర్భసంచి వలన చాలా ఇబ్బంది పడింది. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. మా అమ్మకి నాన్నకి ఏదన్న చేయగలనని ఇప్పుడు నమ్ముతున్నాను. లేబర్ వర్గాల పై నేను చేసే ఫోటో జర్నల్ కథనాలు, నేను చూసిన, విన్న కథల  ద్వారా స్ఫూర్తి పొందినవే. వారి పట్టుదలే నాకు పాఠం. ఆ దీపస్థంబమే నాలో ప్రకాశాన్ని నింపుతుంది.

PHOTO • M. Palani Kumar

మా అమ్మ మూడుసార్లు తన ప్రాణాలు తీసుకోవాలనుకుంది. కానీ ఆ మూడుసార్లు ఆమె బ్రతకడం సాధారణ విషయం కాదు


PHOTO • M. Palani Kumar

అమ్మ ఒక చోట తీరిగ్గా కూర్చోవడం ఎప్పుడూ చూడలేదు. ఆమె ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఇక్కడ ఆమె తన పని పూర్తి అయిన తరవాత అల్యూమినియం గిన్నెని కడుగుతోంది


PHOTO • M. Palani Kumar

మా అమ్మ ఎప్పుడూ రైతు అవ్వాలని అనుకుంది, కానీ ఆ కోరిక తీరలేదు. ఆ తరవాత చేపలు అమ్మటం మొదలుపెట్టింది, కానీ ఆమె రైతు పని పై ఆసక్తి ఇంకా కోల్పోలేదు. మా ఇంటి పెరట్లో మేము 10 అరటి చెట్లను నాటాము. ఒక్క దానికి పూత పూసినా, ఆమె ఒకటే సంతోషపడిపోయి  తీపి పొంగలి వండి, పూజచేస్తుంది

PHOTO • M. Palani Kumar

మా నాన్న మేకలు పెంచడం మొదలుపెట్టాడు. మా అమ్మ మేకల చావిడిని శుభ్రపరుస్తుంది


PHOTO • M. Palani Kumar

మా నాన్నకు తన చుట్టూ జంతువులు, పక్షులు ఉంచుకోవడం ఇష్టం. ఆయనకు ఐదేళ్లు ఉండగానే ఆయన మేకలను మేపడానికి తీసుకెళ్లేవాడు

PHOTO • M. Palani Kumar

అమ్మకు సైకిల్ తొక్కాలన్నా, మోటార్ బైక్ నడపాలన్నా ఇష్టం. కానీ ఎలా నడపాలో తెలీదు

PHOTO • M. Palani Kumar

అది నేనే. అమ్మకు చేపలు అమ్మడంలో సాయం చేస్తున్నా


PHOTO • M. Palani Kumar

మా అమ్మకు కీళ్లనొప్పులు ఎక్కువగా ఉంటున్నాయి. అందువలన పనిచేయడం కష్టమవుతోంది. కానీ ఇంకా వంటకు కర్రపుల్లలు పోగుచేస్తుంది. కానీ పొయ్యికి కర్రపుల్లలు దొరకడం రోజురోజుకి కష్టమవుతోంది


PHOTO • M. Palani Kumar

ప్రతి నెల ఆమె ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తన కీళ్ల నొప్పులకు మందులు తెచ్చుకుంటుంది. వాటి వలనే ఆమె పనులు చేసుకోగలుగుతుంది. ఎప్పుడైనా, “నా కళ్ళను మామూలుగా చేయి కుమార్”, అని నాతో అంటే నాకు తప్పు చేసినట్లు అనిపిస్తుంది


PHOTO • M. Palani Kumar

మా నాన్న కి పదిహేనేళ్లుగా కిడ్నీ జబ్బు ఉండేది. మా దగ్గర అతనికి ఆపరేషన్ చేయించడానికి సరిపడా డబ్బు ఉండేది కాదు. నాకు PARIలో ఉద్యోగం వచ్చాక అతనికి ఆపరేషన్ చేయించగలిగాను


PHOTO • M. Palani Kumar

మేము ప్రస్తుతం ఉండేది ఈ  ఇంట్లొనే. ఈ ఇల్లు కట్టడానికి 12 ఏళ్ళు పట్టింది, చివరికి మా అమ్మ కల నిజమైంది


PHOTO • M. Palani Kumar

మా అమ్మ చేపలు పట్టుకెళ్లిన గిన్నెలను, ఇంటికి  తిరిగి వచ్చాక  కడుగుతుంది. చాలా సార్లు ఆమె నాకు ఆకాశంలాగా కనపడుతుంది. అలానే స్వాగతిస్తుంది, ఇచ్చే స్వభావం కూడా ఉంది. ఆమె గురించి ఆమె అసలు ఆలోచించదు

అనువాదం: అపర్ణ తోట

M. Palani Kumar

M. Palani Kumar is Staff Photographer at People's Archive of Rural India. He is interested in documenting the lives of working-class women and marginalised people. Palani has received the Amplify grant in 2021, and Samyak Drishti and Photo South Asia Grant in 2020. He received the first Dayanita Singh-PARI Documentary Photography Award in 2022. Palani was also the cinematographer of ‘Kakoos' (Toilet), a Tamil-language documentary exposing the practice of manual scavenging in Tamil Nadu.

Other stories by M. Palani Kumar
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota