“మా జీవితమే ఒక జూదం. మేము ఈ రెండేళ్లు ఎలా బతికామో ఆ దేవుడికే తెలుసు.” అన్నది వి థర్మ. “నా 47 ఏళ్ళ జానపద కళా జీవితంలో. ఈ రెండేళ్లు  తిండి సంపాదించుకోడానికి ఏ దారి దొరకలేదు.”

అరవైయేళ్ల థర్మ అమ్మ ఒక ట్రాన్స్ మహిళ. ఈమె తమిళనాడులోని మదురై నగరంలో ఉంటుంది. “మాకు ఒక నికరమైన సంపాదన అంటూ లేదు. ఈ కరోనా వలన మాకు సంపాదించుకోవడానికి దొరికే కొన్ని అవకాశాలు కూడా లేకుండా పోయినాయి.”

జిల్లాలో ట్రాన్స్ కళాకారులకు ఏడాదిలో మొదటి ఆరునెలలు చాలా ముఖ్యమైనవి. ఈ  సమయంలో గ్రామంలో ఉన్నవారు గ్రామ పండగలను చేసుకుంటారు, గుడులలో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కానీ ఈ లాక్ డౌన్ ల మూలంగా పెద్ద మొత్తంలో జనాభా ఒక చోట గుమిగూడడం పై ఉన్న ఆంక్షల  వలన ట్రాన్స్ మహిళల మీద అమితమైన ప్రభావం పడింది. రాష్టంలో దగ్గరగా 500 మంది ట్రాన్స్ మహిళా కళాకారిణులు ఉన్నారని థర్మ అమ్మ(ఆమెను అలా పిలుస్తారు), రాష్ట్ర ట్రాన్స్ మహిళల నాటక మరియు జానపద కళల సంఘం సెక్రటరీ చెబుతుంది.

థర్మ అమ్మ ఒక అద్దె ఇంట్లో రైల్వే స్టేషన్ దగ్గరగా తన తన మేనల్లుడితో కలిసి నివసిస్తుంది. ఆమె మేనల్లుడు పూలు అమ్ముకుంటాడు, అతనికి ఇద్దరు పిల్లలు. ఈ నగరంలో ఆమె తల్లిదండ్రులు రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నప్పుడు, ఆమె ట్రాన్స్ వ్యక్తులు గుడుల వద్ద కళాప్రదర్శన చేయడం చూసింది.

PHOTO • M. Palani Kumar

మదురైలోని ఆమె గదిలో థర్మ అమ్మ : “మాకు నికరమైన ఆదాయాలు లేదు. పైగా ఈ కరోనా వలన సంపాదనకు ఉన్న కొద్ధి అవకాశాలు కూడా పోయాయి”

థర్మ అమ్మ, తనకు 14 యేళ్ళున్నప్పటి నుంచి పాడడం మొదలుపెట్టింది. “డబ్బున్న వారు మమ్మల్నివారి ఇళ్లల్లో చావుల వద్ద పాడడానికి పిలిచేవారు.” అన్నది థర్మ అమ్మ. (ఆమె ట్రాన్స్ వర్గాన్ని గురించి చెప్పేటప్పుడు, తిరునంగై అనే తమిళ పదం వాడుతుంది). “మేము ఒప్పరి (చావులలో పాడే పాటలు), మరాది పాటు (గుండెలు బాదుకోవడం), చేస్తే డబ్బులు ఇచ్చేవారు. అలానే నేను జానపద కళల్లోకి ప్రవేశించాను.”

ఆ రోజులలో ఒక నలుగురు ట్రాన్స్ కళాకారులున్న సమూహానికి 101 రూపాయిలు ఇచ్చేవారు. థర్మ అమ్మ, మార్చ్ 2020 లో లాక్ డౌన్ జరిగేవరకు, ఈ పని అప్పుడప్పుడు చేసేది - అప్పటికి ఆమెకు 600 రూపాయిలు వచ్చేవి.

1970లలో ఆమె తలాట్టు (జోలపాటలు), నాటుపుర పాటు (జానపదాలు) పాడడం నేర్చుకుంది. కాలం గడుస్తున్న కొద్దీ ఆమె, ప్రదర్శనలు చూసి నేర్చుకుని, తమిళనాడు గ్రామీణప్రాంతాలలో సంప్రదాయ నృత్య నాటకం అయిన రాజా రాణి అట్టం లో రాణి పాత్ర వేస్తూ,  ప్రదర్శనలు ఇచ్చేది.

1970లలో, మదురైలో, ఈ నృత్య నాటకంలో నాలుగు పాత్రలు మగవారు, రాజులు, రాణులు, విదూషకులు పాత్రలలో ప్రదర్శించేవారు” అని థర్మ అమ్మ గుర్తు తెచ్చుకుంది. ఆమె మరో ముగ్గురిని కలుపుకుని, ఊరిలో మొట్టమొదటి ట్రాన్స్ వ్యక్తుల కళాప్రదర్శనను రాజా రాణి అట్టం ద్వారా  చేసింది.

A selfie of Tharma Amma taken 10 years ago in Chennai. Even applying for a pension is very difficult for trans persons, she says
PHOTO • M. Palani Kumar
A selfie of Tharma Amma taken 10 years ago in Chennai. Even applying for a pension is very difficult for trans persons, she says
PHOTO • M. Palani Kumar

పదేళ్ల క్రితం థర్మ అమ్మ చెన్నై లో తీసుకున్న సెల్ఫీ. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడం కూడా ట్రాన్స్ వ్యక్తులకు కష్టమే అని చెప్పింది

ఊరిలో ఉన్న గురువుల ద్వారా ఆమె నెత్తి మీద కుండ పెట్టుకుని నృత్యం చేసే కరగాట్టం కూడా నేర్చుకుంది. “దీని వలన నాకు  ప్రభుత్వ  సాంస్కృతిక కార్యక్రమం పాల్గొనే  అవకాశం వచ్చింది.” అని చెప్పింది.

తరవాత ఆమె తన కళానుభవాన్ని ఇంకా విస్తరించు కుంది. మాడు అట్టం (కళాకారులు జానపద సంగీతానికి అనుగుణంగా ఆవును తలపించే  వేషాన్ని వేసుకునే చేసే నృత్యం), మైయిల్ అట్టం ( నెమలిని పోలిన వేషధారణ), పోయి కాల్ కుదురై అట్టం (నిజం కాళ్ళు లేని గుర్రపు నృత్యం). ఈ ప్రదర్శనలు తమిళనాడులో చాలా గ్రామాలలో ఇచ్చారు. “మొహానికి పౌడర్ అద్దుకుని, మేము రాత్రి పది గంటలకు ప్రదర్శన మొదలుపెడితే ఉదయం నాలుగు ఐదింటి వరకు నడిచేది.” అన్నది థర్మ అమ్మ.

పని విపరీతంగా ఉండే జూన్-జులై నెలలలో, చాలా చోట్ల నుండి ఆమెకు, ప్రదర్శనలకు పిలుపులొచ్చేవి. ఆమెకు అప్పట్లో 8,000 రూపాయిల నుండి 10,000 రూపాయిల  వరకు ఆదాయం ఉండేది.

మహారోగం వలన వచ్చిన ఈ లాక్ డౌన్, పరిస్థితిని అంతా మార్చేసింది. “తమిళనాడులో సంగీతం, నాట్యం, నాటకం, సాహిత్యం సెంటర్ లో సభ్యురాలిగా చేరినా కూడా ఏమి లాభం లేకపోయింది. “మగ, ఆడ జానపద కళాకారులు తేలికగా పెన్షన్ ని దరఖాస్తు చేసుకుంటారు కానీ మా ట్రాన్స్ కళాకారులకు అది చాలా కష్టం. నా దరఖాస్తును చాలా సార్లు తిప్పికొట్టారు. అధికారులు నన్ను రికమండేషన్లు తెచ్చుకొమ్మని చెబుతారు. ఎవరి వద్ద నుంచి తెచ్చుకోవాలో నాకు తెలీదు. నాకు కొంత సహాయం అంది వుంటే, కొన్ని ఘోరమైన పరిస్థితులు తప్పించుకోగలిగేదాన్ని. మేము రేషన్ బియ్యాన్నే వండుకు తింటున్నాము, కూరగాయలు కొనుక్కునేందుకు అసలు డబ్బులు లేవు.”

*****

మదురై నుంచి పది కిలోమీటర్ల దూరంలోనే, విలాంగుడి పట్టణం ఉంది. అక్కడున్న మాగి పరిస్థితి కూడా ఇంతే. పోయిన ఏడాది వరకు, ఆమె మదురై, ఇంకా ఇతర జిల్లాలకు ప్రయాణించి అక్కడ కుమ్మి పాటు పాడేది. జిల్లాలో ఈ సంప్రదాయ కళాప్రదర్శన చేయగలగే ఉన్న అతికొద్ది మంది ట్రాన్స్ వ్యక్తులలో ఆమె ఒకరు. కుమ్మి పాటు ని విత్తనాలు మొలకెత్తే సమయంలో పాడతారు.

PHOTO • M. Palani Kumar

స్నేహితులతో, సహోద్యోగులతో , తన గదిలో మాగి(కెమెరా వెనుక): షాలిని(ఎడమ), భవ్యశ్రీ(షాలిని వెనుక), అరసి(యెల్లో కుర్తా), కె. స్వేస్థిక(అరసి పక్కన), షిఫానా(అరసి వెనుక). జులై లో ప్రదర్శనలకు ఆహ్వానాలు ఆగిపోతాయి, మిగిలిన ఏడాది వారికి ఇంకా ఏ ఆదాయావకాశాలు ఉండవు

“నేను ట్రాన్స్ మహిళను అయినందువలన నేను ఇంటిని వదిలి బయటకు రాక తప్పలేదు.”  అన్నది 30 ఏళ్ళ మాగి(ఆమె పెట్టుకున్న పేరు). ఆమె మదురై పట్టణంలో ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు దగ్గరలోని  గ్రామంలో ఉంటున్నారు. “ఆ సమయంలో నాకు 22 ఏళ్ళు. ఒక స్నేహితురాలు నన్ను ముళైపరి పండగకు తీసుకు వెళ్ళింది, అక్కడే కుమ్మిపాటు పాడడం నేర్చుకున్నాను.”

విలాంగుడి వీధిలో మాగి తన వర్గం వారితో కలిసి బతుకుతుంది. ఐతే అక్కడ ఉన్న 25 మంది ట్రాన్స్ మహిళలలో ఇద్దరికీ మాత్రమే కుమ్మి పాటు వచ్చు. ఆ పదిరాజుల ముళైపరి  పండగ ప్రతి ఏడాది తమిళనాడు రాష్ట్రంలో జులైలో జరుగుతుంది. దానికి పాడే పాట ఒక ప్రార్ధన వంటిది- గ్రామ దేవతను వర్షాలు, సారవంతమైన మట్టి, మంచి పంటలతో  దీవించమని పాడే పాట ఇది. “పండుగలలో, మాకు కనీసం 4,000 నుండి 5,000 వరకు ఇస్తారు.” అన్నది మాగి. “మాకు గుడులలో కూడా ప్రదర్శనలు ఇచ్చే అవకాశాలు వస్తాయి, కానీ అవి కచ్చితంగా వస్తాయని చెప్పలేము.”

కానీ జులై 2020లో పండగను జరపలేదు, ఈ నెల కూడా జరగలేదు. పైగా లాక్ డౌన్ పోయిన ఏడాది మార్చ్ లో మొదలైంది కాబట్టి, మాగి చాలా తక్కువ ప్రదర్శనలకు వెళ్లగలిగింది. “ఈ సంవత్సరం మార్చ్ మధ్యలో లాక్ డౌన్ కి ముందు మదురై గుడిలో మూడు రోజులు ప్రదర్శన ఇచ్చే అవకాశం దొరికింది.” అన్నది

ఇప్పుడు అన్ని ప్రదర్శనలు జులై లో ఆగిపోతాయి కాబట్టి మాగికి, ఆమెతో పని చేసేవారికి మిగిలిన సంవత్సరమంతా దాదాపు పని దొరకదు.

At Magie's room, V. Arasi helping cook a meal: 'I had to leave home since I was a trans woman' says Magie (right)
PHOTO • M. Palani Kumar
At Magie's room, V. Arasi helping cook a meal: 'I had to leave home since I was a trans woman' says Magie (right)
PHOTO • M. Palani Kumar

మాగి గదిలో వి అరసి వంటకి సాయం చేస్తోంది. “నేను ట్రాన్స్ మహిళను అయినందువలన ఇంటిని వదిలి ఇక్కడికి రావలసి వచ్చింది.” (కుడి)

పోయిన ఏడాది లాక్ డౌన్ మొదలైనప్పటినుంచి, స్వచ్చందంగా కొందరు ముందుకు వచ్చి ట్రాన్స్ కళాకారులకు కొన్నిసార్లు రేషన్ కిట్ లు పంచారు. మాగి డైరెక్టరేట్ అఫ్ ఆర్ట్ కల్చర్ లో  రిజిస్టర్ అయింది కాబట్టి ఆమెకి ఈ నెల మేలో ప్రభుత్వం నుండి 2000 అందాయి. “వేరే ఎవరికీ ఈ డబ్బులు రాకపోవడం దురదృష్టం” అన్నది మాగి.

మామూలుగా బాగా ప్రదర్శనలు ఉండే నెలల్లో కూడా, ఈసారి ఆహ్వానాలు తగ్గిపోతున్నాయి అన్నది మాగి. “చాలా మంది ఆడవారు,మగవారు కుమ్మి పాటలు నేర్చుకుంటున్నారు, గుడులలో ప్రదర్శనలకు వారినే పిలుస్తున్నారు. చాలా చోట్ల మేము ట్రాన్స్ మహిళలమవడం వలన మాకు వివక్ష ఎదురవుతుంది. ఇదివరకు ఈ కళ, జానపద కళాకారులకు, ట్రాన్స్ మహిళకు మాత్రమే సొంతమై ఉండేది, కానీ ఇప్పుడు దీనికి ఆదరణ పెరిగి, మాకు అవకాశాలు తగ్గుతున్నాయి.”

*****

మదురై నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుక్కోట్టై జిల్లాలోని విరాళిమలై పట్టణంలో, వర్ష 15 నెలలకు పైగా కష్టాలు పడుతోంది. కనీస వెచ్చాలు కొనే అవకాశం లేక ఆమె తన తమ్ముడి మీద ఆధార పడుతుంది. అతను మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసాడు, ఒక లోకల్ కంపెనీలో పని చేస్తున్నాడు.

మహారోగానికి ముందు నుండే, మదురై కామరాజు యూనివర్సిటీలో జానపద కళ పై పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న 29 ఏళ్ళ వర్ష, పండగలప్పుడు, గుడులలో రాత్రుళ్లు జానపద నృత్యం చేస్తూ సంపాదించుకుని, పగలు చదువుకుని, రోజుకు 2-3 గంటలే విశ్రమించేది.

Left: Varsha at her home in Pudukkottai district. Behind her is a portrait of her deceased father P. Karuppaiah, a daily wage farm labourer. Right: Varsha dressed as goddess Kali, with her mother K. Chitra and younger brother K. Thurairaj, near the family's house in Viralimalai
PHOTO • M. Palani Kumar
Left: Varsha at her home in Pudukkottai district. Behind her is a portrait of her deceased father P. Karuppaiah, a daily wage farm labourer. Right: Varsha dressed as goddess Kali, with her mother K. Chitra and younger brother K. Thurairaj, near the family's house in Viralimalai
PHOTO • M. Palani Kumar

ఎడమ :  పుదుక్కోట్టై జిల్లాలోని తన ఇంట్లో వర్ష. ఆమె వెనుకే వ్యవసాయ కూలిగా పనిచేసి చనిపోయిన ఆమె తండ్రి పి  కరుప్పయ్య ఫోటో ఉంది. కుడి: విరళీమలై లో వాళ్ళ ఇంటి  దగ్గర ఆమె తల్లి కె చిత్ర, తమ్ముడు కె తురైరాజ్ తో  కాళి అవతారంలో వర్ష

తాను కట్ట కాల్ అట్టం ప్రదర్శన ఇచ్చిన మొదటి ట్రాన్స్ మహిళను  అని చెబుతుంది వర్ష(ఈ విషయాన్ని చెబుతూ ఒక స్థానిక వార్తా పత్రిక ఆమె పై రాసిన వ్యాసాన్ని కూడా  చూపించింది.)ఈ నృత్యానికి ప్రదర్శనకారులు రెండు పొడవైన కర్ర కాళ్ళను వాడుతూ సంగీతానికి అనుగుణంగా నృత్యం చేయాలి. దీనికి చాలా అనుభవం, నైపుణ్యం కావాలి.

వర్ష ఇంకా చాలా వేరే నృత్యరూపక ప్రదర్శనలు చేస్తుంది. ఇందులో తప్పట్టం ఒకటి. ఇందులో ప్రదర్శన ఇచ్చేవారు తప్పు (డప్పు- ఎక్కువగా దళితులు వాయించేది) సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తారు. ఆమెకు మాత్రం దైవిగ నాదనం (దేవత నృత్యం) చాలా ఇష్టం అని చెబుతుంది. ఆమెకు తమిళనాడులో జానపద కళాకారిణిగా చాలా పేరుంది. ఆమె ప్రదర్శనలు పేరున్న తమిళ టీవీ ఛానెళ్లలో కూడా వచ్చాయి. ఆమెను స్థానిక సంస్థలెన్నో సన్మానించాయి. ఆమె బెంగుళూరు, చెన్నై, ఢిల్లీలో కూడా ప్రదర్శనలు ఇచ్చింది.

వర్ష(ఈ పేరుతో పిలిపించుకోవడానికి ఇష్టపడుతుంది) అర్ధనారి కలై కులు , అనే ట్రాన్స్ మహిళా కళాకారిణుల బృంద ప్రారంభ సభ్యులలో ఒకరు. ఈ సంస్థలోని ఏడుగురు మనుషులు వేరే వేరే  ఊర్లలో మదురై జిల్లాలో ఉన్నారు. మొదటి, రెండవ కోవిడ్ తరంగాల తరవాత, వారికి జనవరి నుండి జూన్ వరకు కనీసం 15 ప్రదర్శనలకు ఆహ్వానం వచ్చింది. “మేము నెలకు కనీసం 10,000 రూపాయిలు సంపాదించుకోగలిగాము.” అన్నది వర్ష.

“కళే నా జీవితం”, అన్నది వర్ష. “మేము ప్రదర్శనలు ఇవ్వగలిగినప్పుడే తిండి తినగలము. మొదటి ఆరు నెలలలో సంపాదించుకున్నదానితోనే తరవాత ఆరునెలలను గడపాలి.”  ఆమెకు, ఆమె వంటి ఇతర ట్రాన్స్ మహిళలకు ఈ సంపాదన వారి మౌలికావసరాల వరకు సరిపోతుంది. “ఈ డబ్బు పొదుపు చేసుకోవడానికి సరిపోదు.” అని ఆమె చెప్పింది. “పొదుపు చేసుకోవడం కష్టం, ఎందుకంటే మేము మా అలంకారణ సామాగ్రిని, ప్రదర్శనకు కావలసిన దుస్తుల్ని, ప్రయాణానికి, తిండికి వాడవలసి వస్తుంది. మేము పంచాయత్ ఆఫీస్ కి లోన్లు అడగడానికి వెళ్తే, మా దరఖాస్తులను తిప్పి కొడతారు. మాకు బ్యాంకుల నుండి లోన్లు రావు(సరిపడినన్ని కాగితాలు లేక). మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే మేము 100 రూపాయిలకు కూడా  ప్రదర్శన ఇవ్వడానికి  తయారుగా ఉన్నాము.”

Varsha, a popular folk artist in Tamil Nadu who has received awards (displayed in her room, right), says 'I have been sitting at home for the last two years'
PHOTO • M. Palani Kumar
Varsha, a popular folk artist in Tamil Nadu who has received awards (displayed in her room, right), says 'I have been sitting at home for the last two years'
PHOTO • M. Palani Kumar

తమిళ నాడు లో కళాకారిణిగా పేరు పొందిన వర్ష, చాలా అవార్డులు గెలుచుకుంది(ఆమె గదిలో  ప్రదర్శించబడి ఉన్నాయి, కుడివైపున) ‘నేను రెండేళ్ల బట్టి ఇంట్లోనే ఖాళీగా కూర్చుని ఉన్నాను’

వర్ష తన్న లైంగికత గురించి ఆమెకి పదేళ్లున్నప్పుడు, ఐదవ తరగతిలో తెలుసుకుంది. ఆ తరవాత ఆమె మొదటి జానపద నృత్యం 12 ఏళ్లకు ప్రదర్శించింది. ఈ నృత్యాన్ని ఆమె స్థానిక పండగలప్పుడు గమనించి నేర్చుకున్నది. ఆమె యూనివర్సిటీ లో జానపద కళల పై చదువుకున్నప్పుడు అసలైన శిక్షణ పొందింది.

“నా కుటుంబం నన్ను ఆమోదించలేదు. అందుకని నాకు 17 ఏళ్ళు వచ్చాక నేను ఇంటిని వదిలిపెట్టవలసి వచ్చింది. నాకు జానపద కళల మీద ఉన్న తపన వలన నా కుటుంబం మళ్ళీ నన్ను ఆదరించింది.” అన్నది వర్ష, ఆమె తన అమ్మా(ఇదివరకు కూలి పని చేసేది), తమ్ముడితో కలిసి విరాళీమలై గ్రామంలో ఉంటుంది.

“కానీ నేను రెండేళ్లుగా ఇంట్లోనే కూర్చుని ఉన్నాను(మార్చ్ 2020 లాక్ డౌన్ మొదటి సారి పెట్టిన దగ్గరనుంచి). మాకు ఇప్పటి వరకు స్నేహితుల వద్ద నుంచి తప్ప మరి ఎవరి వద్ద నుంచి ఏ సాయము అందలేదు. నేను స్వచ్చంద సంస్థలను, వ్యక్తులను సహాయం కోరాను.” అన్నది ఆమె. “ట్రాన్స్ జానపద కళాకారులకు ఏ విధమైన ఆర్ధిక సహాయం అందలేదు. పోయిన ఏడాదిలానే, ఈ ఏడాది కూడా మా తిండి మేమే వెతుక్కోవలసి వస్తుంది. ఎవరి కళ్ళకీ మేము  కనిపించము, అదృశ్యమయినట్లే.”

ఈ కథనానికి కావలసిన ఇంటర్వ్యూలు ఫోన్ లో జరిగాయి.

అనువాదం: అపర్ణ తోట

Reporting : S. Senthalir

S. Senthalir is a Reporter and Assistant Editor at the People's Archive of Rural India. She was a PARI Fellow in 2020.

Other stories by S. Senthalir
Photographs : M. Palani Kumar

M. Palani Kumar is PARI's Staff Photographer and documents the lives of the marginalised. He was earlier a 2019 PARI Fellow. Palani was the cinematographer for ‘Kakoos’, a documentary on manual scavengers in Tamil Nadu, by filmmaker Divya Bharathi.

Other stories by M. Palani Kumar
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota