"మా లాంటి మహిళలు తమ ఇళ్లను, పొలాలను విడిచిపెట్టి, నిరసన తెలపడానికి నగరానికి వచ్చారంటే, వారు తమ కాళ్ళ క్రింద ఉన్న మాటి [భూమిని] కోల్పోతున్నారని అర్థం" అని అరుణ మన్నా అన్నది. "గత కొన్ని నెలల్లో మేము తినడానికి ఇంట్లో ఏమీ లేని రోజులు ఉన్నాయి. దానికి ముందు మేము కేవలం ఒక పూట మాత్రమే తిని బతికాము. ఈ చట్టాలను ఆమోదించడానికి ఇదా సమయం? మమ్మల్ని చంపడానికి ఈ మహమ్మారి [కోవిడ్ -19 మహమ్మారి] సరిపోదా! ” అని ఆవేదనగా అడిగింది.

నలభైరెండేళ్ల అరుణా, సెంట్రల్ కోల్‌కతాలోని నిరసన ప్రదేశమైన ఎస్ప్లానేడ్ వై-ఛానెల్‌లో మాట్లాడుతోంది. జనవరి 9 నుండి 22 వరకు రైతులు, వ్యవసాయ కూలీలు కలిసి ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ (ఎఐకెఎస్‌సిసి) బ్యానర్ పై ఇక్కడకు వచ్చారు. విద్యార్థులు, పౌరులు, కార్మికులు, సాంస్కృతిక సంస్థలు- 2020 సెప్టెంబర్‌లో పార్లమెంటులో ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంఘీభావం తెలపడానికి ఇక్కడ సమావేశమయ్యారు.

అరుణ రాజువాకి గ్రామం నుండి సుమారు 1,500 మంది మహిళలతో కలిసి వచ్చారు. వీరిలో ఎక్కువ మంది దక్షిణ 24 పరగణాల జిల్లాలోని వివిధ గ్రామాలనుంచి వచ్చారు.  దేశవ్యాప్తంగా ఉన్న మహిళా రైతులకు, కూలీలకు వారి  హక్కులను పొందడానికి ‘మహిళా కిసాన్ దివాస్’ గా అంకితం చేయబడిన జనవరి 18 ను జరుపుకోవడానికి రైళ్లు, బస్సులు మరియు టెంపోల ద్వారా అందరూ కోల్‌కతాకు  చేరుకున్నారు.  40 కి పైగా మహిళా రైతులు మరియు వ్యవసాయ కూలీల యూనియన్లు, మహిళా సంస్థలు మరియు AIKSCC యొక్క యూనియన్లు ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ ఎడిషన్‌ను నిర్వహించాయి.

కోల్‌కతా వరకు చేసిన సుదీర్ఘ ప్రయాణం తర్వాత వారి గొంతుకలు అలసిపోయినప్పటికీ, ఈ మహిళలలో కోపం ఇంకా స్పష్టంగా ఉంది. “ మా తరఫున ఎవరు నిరసన తెలుపుతారు? న్యాయస్థానమా లేక న్యాయమూర్తులా ? మాకు కావలసింది లభించేంత వరకు మేము నిరసన చేస్తూనే ఉంటాము! ” అని శ్రమజీవి మహిళా సమితి సభ్యురాలు  సుపర్ణ హల్దార్ (38) అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలను విడిచిపెట్టడానికి మహిళా మరియు వృద్ధ నిరసనకారులను ‘ఒప్పించాలి’ అని భారత ప్రధాన న్యాయమూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యపై ఆవిడ పై సమాధానమిచ్చారు.

కోల్‌కతా నిరసన స్థలంలో జనవరి 18 న ఉదయం 11:30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన మహిళా కిసాన్ మజూర్ విధానసభ సమావేశాల్లో సుపర్ణ ప్రసంగించారు. మహిళా కిసాన్ దివాస్‌లో భాగంగా వ్యవసాయంలో మహిళల సంక్లిష్ట ఆందోళనలు, వారి శ్రమ, భూమి మరియు ఇతర హక్కుల యాజమాన్యం కోసం వారు చేసిన సుదీర్ఘ పోరాటం, వారి జీవితాలపై కొత్త వ్యవసాయ చట్టాల ప్రభావం గురించి ఈ సెషన్ దృష్టి సారించింది.

On January 18, women from several districts of West Bengal attended the Mahila Kisan Majur Vidhan Sabha session in Kolkata
PHOTO • Smita Khator
On January 18, women from several districts of West Bengal attended the Mahila Kisan Majur Vidhan Sabha session in Kolkata
PHOTO • Smita Khator

జనవరి 18 న కోల్‌కతాలో జరిగిన మహిళా కిసాన్ మజూర్ విధానసభ సమావేశానికి పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాల మహిళలు హాజరయ్యారు

దక్షిణ 24 పరగణాల జిల్లాలోని రైదిగి గ్రామ పంచాయతీలోని పాకుర్తాలా గ్రామం నుండి వచ్చిన సుపర్ణ, పెరుగుతున్న ఖర్చులు మరియు తరచూ వచ్చే తుఫానుల వలన తమ ప్రాంతంలో తమ జీవనాధారమైన  వ్యవసాయం ఎలా స్థిరత్వాన్ని కోల్పోతుందో చెప్పారు. దీని  వలన, MGNREGA సైట్లలో (స్థానికంగా ఎక్షో డైనర్ కాజ్ లేదా 100 రోజుల పని అని పిలుస్తారు), ఇతర ప్రభుత్వ-నిధులతో పంచాయతీలు నడిపే వర్క్‌సైట్‌లలో దొరికే పని, చాలా తక్కువ భూమిని కలిగి ఉన్న వ్యవసాయ కూలీలకు, వారి కుటుంబాలకు కీలకమైన జీవనాధారంగా మారింది.

కోల్‌కతా నిరసన సమావేశం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపై దృష్టి సారించినప్పటికీ, MGNREGA పని దినాల కొరత మరియు స్థానిక పంచాయతీల కింద పని చేయడం కూడా ప్రస్తుతం మహిళల్లో తరచూ కనపడే ఆందోళనల్లో ఒకటి.

"పని అందుబాటులో లేదు. మనందరికీ చెల్లుబాటు అయ్యే జాబ్ కార్డులు ఉన్నాయి [అయినప్పటికీ జాబ్ కార్డులు సాధారణంగా భర్త లేదా తండ్రి పేర్ల పై జారీ చేయబడతాయి, ఇది చాలా మంది మహిళలకు వివాదాస్పద సమస్య]. అయినా మాకు పని దొరకదు ”అని మధురపూర్ II బ్లాక్‌లో ఉన్న రైదిగి పంచాయతీలోని బలరాంపూర్ గ్రామంలో 100 రోజుల పనిని చేసుకుంటున్న 55 ఏళ్ల సుచిత్రా హల్దార్ అన్నారు. "మేము దీనికి వ్యతిరేకంగా చాలాకాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నాము.  ఒకవేళ మాకు పని దొరికినా, మాకు డబ్బులు త్వరగా రావు. కొన్నిసార్లైతే అసలు రావు కూడా. “

"మా గ్రామంలో వయసులో ఉన్న పిల్లలంతా   పనిలేకుండా కూర్చొని ఉన్నారు.” అని రాజుఖాకి గ్రామానికి చెందిన రంజిత సమంతా (40) అన్నారు. "చాలా మంది మగవాళ్ళు వారు పనికి వెళ్ళిన ప్రదేశాల నుండి లాక్డౌన్ సమయంలో తిరిగి వచ్చారు. అమ్మానాన్న నెలల తరబడి పనులకి దూరంగా ఉన్నారు, కాబట్టి పిల్లలు కూడా బాధపడుతున్నారు. మాకు 100 రోజుల పని కూడా లేకపోతే మేము ఎలా బతకాలి? ”

కొంత దూరంలో కూర్చొని 80 ఏళ్ల దుర్గా నయ్య తన మందపాటి కళ్ళద్దాలను తెల్లటి కాటన్ చీర అంచుతో తుడుచుకుంటోంది. మధురపూర్ II బ్లాక్‌లోని గిలార్‌చాట్ గ్రామానికి చెందిన వృద్ధ మహిళల బృందంతో ఆమె వచ్చింది. "నా శరీరంలో బలం ఉన్నంత వరకు నేను ఖెట్-మజుర్ [వ్యవసాయ కూలి] గా పని చేసేదాన్ని" అని ఆమె చెప్పింది. “చూడండి, నేను ఇప్పుడు ముసలిదాన్నయ్యాను. నా భర్త చాలా కాలం క్రితం చనిపోయాడు. నేను ఇప్పుడు పని చేయలేకపోతున్నాను. పాత రైతులకు, ఖేత్-మజూర్లకు పెన్షన్ ఇవ్వమని సర్కార్కు చెప్పడానికి నేను ఇక్కడకు వచ్చాను. ”అన్నది.

దుర్గా నయ్య రైతుల నిరసనలలో అనుభవజ్ఞురాలు. "దేశంలోని ఇతర రైతులతో కలిసి నిరసన చేయడానికి నేను 2018 లో ఆమెతో పాటు ఢిల్లీ  వెళ్ళాను" అని మధురపూర్ II బ్లాక్ లోని రాధాకాంతపూర్ గ్రామానికి చెందిన పరుల్ హాల్డర్ అన్నారు. ఇప్పుడు అతను తన యాభయ్యేళ్లలో ఉన్న భూమిలేని వ్యవసాయకూలి. కిసాన్ ముక్తి మోర్చా కోసం 2018 నవంబర్‌లో న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి రామ్‌లీలా మైదాన్ వరకు వీరిద్దరూ కలిసి నడిచారు.

Ranjita Samanta (left) presented the resolutions passed at the session, covering land rights, PDS, MSP and other concerns of women farmers such as (from left to right) Durga Naiya, Malati Das, Pingala Putkai (in green) and Urmila Naiya
PHOTO • Smita Khator
Ranjita Samanta (left) presented the resolutions passed at the session, covering land rights, PDS, MSP and other concerns of women farmers such as (from left to right) Durga Naiya, Malati Das, Pingala Putkai (in green) and Urmila Naiya
PHOTO • Smita Khator

రంజితా సమంతా (ఎడమ) మరియు మహిళా రైతులైన (ఎడమ నుండి కుడికి) దుర్గా నయ్య, మలతి దాస్, పింగళ పుట్కాయ్ (ఆకుపచ్చ రంగులో) ఊర్మిళా నయ్య, భూ హక్కులు, పిడిఎస్, ఎంఎస్పి వంటి ఇతరుల సమస్యలను  విశదీకరిస్తూ తీర్మానాలను సమర్పించారు.

నిరసన స్థలంలో వృద్ధ మహిళలతో ఎందుకు చేరారు అని అడిగినప్పుడు "మేము ఎలాగో బతికి బట్ట కడుతున్నాము" అని పరుల్ చెప్పింది. “పొలాలలో ఎక్కువ పని దొరకడం లేదు. పంట, విత్తనాల సీజన్లలో, మాకు కొంత పని దొరికి రోజుకు 270 రూపాయలు వరకు వస్తాయి. కానీ అది సరిపోదు. నేను బీడీలు చుడతాను. ఇంకా వేరే చిన్న చిన్న పనులు కూడా చేస్తాను. మహమ్మారి సమయంలో, ముఖ్యంగా అమ్ఫాన్[2020 మే 20 న పశ్చిమ బెంగాల్‌ను తాకిన తుఫాను] తరువాత మేము చాలా అవస్థలు పడ్డాము… ” అని చెప్పింది

ఈ గుంపులోని వృద్ధ మహిళలు మాస్కులు ధరించడం గురించి చాలా జాగ్రత్తగా ఉన్నారు, మహమ్మారి సమయంలో వారి దుర్బలత్వం గురించి వారికి తెలుసు - అయినా, వారు నిరసనలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. “మేము చాలా త్వరగా లేచి బయలుదేరాము. సుందర్‌బన్లోని మా గ్రామాల నుండి కోల్‌కతాకు చేరుకోవడం అంత సులభం కాదు, ”అని గిలార్‌చాట్ గ్రామానికి చెందిన 75 ఏళ్ల పింగల పుట్కాయ్ అన్నారు. “మా సమితి [శ్రామాజీవి మహిళా సమితి] మాకు బస్సు ఏర్పాటు చేసింది. మాకు ఇక్కడ భోజనం [బియ్యం, బంగాళాదుంప, లడ్డూ మరియు మామిడి పానీయంతో] ప్యాకెట్ ఇచ్చారు. ఇది మాకు ప్రత్యేకమైన రోజు. ”

అదే గుంపులో 65 ఏళ్ల మలతి దాస్ నెలకు 1,000 వచ్చే తన వితంతు పింఛను కోసం ఎదురుచూస్తోంది.  ఇప్పటిదాకా ఆమె ఒక్కసారి కూడా తన పింఛను అందుకోలేదు. "వృద్ధులు, మహిళలు నిరసనలో పాల్గొనకూడదని న్యాయమూర్తి చెప్పారు. జెనో బురో ఆర్ మేయనముష్దర్ పెట్ భోరె  రోజ్ పోలావు అర్ మాంగ్షో డిచే ఖేటే [వారేదో ముసలివాళ్ళకి, ఆడవాళ్ళకి పులావ్,  మాంసం కూర రోజూ తినిపిస్తున్నట్లు ]! ”

వ్యవసాయ పనులు మానేయవలసి వచ్చిన ఈ బృందంలోని చాలా మంది మహిళలు, వృద్ధ రైతులు, వ్యవసాయ కూలీలకు గౌరవప్రదమైన పెన్షన్ కావాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌ను గట్టిగా చెప్పారు.

నేను మాట్లాడిన సమావేశంలో సుందర్బన్ల నుండి వచ్చిన వాళ్లలో చాలా మంది మహిళలు వివిధ షెడ్యూల్డ్ కులాలకు చెందినవారున్నారు. వీరేగాక ఆదివాసీ తెగలకు చెందిన వారు కూడా చాలా మంది ఉన్నారు. వారిలో జమాల్పూర్ బ్లాక్ లోని మోహన్పూర్ గ్రామం నుండి వచ్చిన భూమిజ్ వర్గానికి చెందిన భూమిలేని వ్యవసాయ కూలి మంజు సింగ్ (46) కూడా ఉంది.

"బిచార్పతి [న్యాయమూర్తి]ని  మా పిల్లలకు ఆహారం, మందులు, ఫోన్లు అన్నింటినీ మా ఇంటికి పంపమనండి-" అని ఆమె చెప్పారు. “మేము ఇంట్లో ఉంటాం. ఎవరికీ మేము చేసే హర్బంగా ఖాతుని [వెన్నువిరిగేంత కష్టపడి పని చేయడం] ఇష్టం లేదు. నిరసన వ్యక్తం చేయకపోతే ఇక మేము ఏమి చేయాలి? "

'The companies only understand profit', said Manju Singh (left), with Sufia Khatun (middle) and children from Bhangar block
PHOTO • Smita Khator
'The companies only understand profit', said Manju Singh (left), with Sufia Khatun (middle) and children from Bhangar block
PHOTO • Smita Khator
'The companies only understand profit', said Manju Singh (left), with Sufia Khatun (middle) and children from Bhangar block
PHOTO • Smita Khator

‘కంపెనీలు లాభాలను మాత్రమే అర్థం చేసుకుంటాయి 'అని మంజు సింగ్ (ఎడమ), సుఫియా ఖాతున్ (మధ్య), భంగర్ బ్లాక్ నుండి వచ్చిన పిల్లలు అన్నారు

పూర్బా బర్ధమాన్ జిల్లాలోని తన గ్రామంలో, “100 రోజుల పని పథకం ఉన్నా, మాకు 25 రోజుల పని [సంవత్సరంలో] కూడా దొరకదు. రోజు వేతనం రూ. 204. పనిని దొరకకపోతే మా జాబ్ కార్డ్ వలన ఉపయోగం ఏమిటి? ఎక్షో డైనర్ కాజ్ షుదు నామ్-కా-వాస్తే[దీనిని 100 రోజులు అంటారు ’పని మాత్రం  ఏమీ దొరకదు]! నేను ఎక్కువగా ప్రైవేట్ వ్యవసాయ భూములలో పనిచేస్తాను. బాగా పోట్లాడితే గాని మా ప్రాంతంలో మాకు [భూస్వాముల నుండి]  రోజువారీ వేతనమైన 180 రూపాయలు, రెండు కిలోల బియ్యం అందవు. ”

అరతి సోరెన్, 30 ఏళ్ల మధ్యలో సంతల్ ఆదివాసీ. ఆమె భూమిలేని వ్యవసాయ కూలి. ఈమె కూడా  మంజు  గ్రామమైన  మోహన్పూర్ నుండే వచ్చింది. "వేతనాల గురించి మాత్రమే కాదు, మేము ఇంకా చాలా పోరాటాలు చెయ్యాలి" అని ఆమె చెప్పింది. “మిగిలినవారిలా కాక, మేము ప్రతి విషయం కోసం పోరాడాలి. మా సంఘం మహిళలు BDO కార్యాలయం మరియు పంచాయతీల ముందు అరవడం మాత్రమే వారు వింటారు. ఈ చట్టాలు మమ్మల్ని ఆకలితో మాడేలా చేస్తాయి. ఇంటికి తిరిగి వెళ్ళమని చెప్పడానికి బదులు బిచార్పతీలు చట్టాలను ఎందుకు వెనక్కి తీసుకోరు? ” అని ప్రశ్నించింది.

కోల్‌కతా చుట్టుపక్కల ఉన్న చిన్న ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు కోల్పోయిన తరువాత, గత 10 నెలలుగా, ఆరతి, మంజుల  భర్తలు ఇంట్లోనే  ఉన్నారు. వారి పిల్లలు ఆన్‌లైన్ పాఠశాల విద్య కోసం స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయలేరు. MGNREGA కింద తీవ్రమైన పని కొరత వారి సమస్యలకు తోడయ్యింది. మహమ్మారితో వచ్చిన లాక్డౌన్ చాలా మంది మహిళా వ్యవసాయ కూలీలను మహాజన్లు (మనీలెండర్లు) నుండి తీసుకున్న రుణాలపై బతికేలా చేసింది. "ప్రభుత్వం కేటాయించిన బియ్యం మీద మేము బతికాము" అని మంజు చెప్పింది. “అయితే పేదవాళ్లకు బియ్యం మాత్రమే సరిపోతాయా?” అని అడిగింది.

"గ్రామాల్లోని మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు" అని దక్షిణ 24 పరగణాలోని రైదిగి గ్రామ పంచాయతీలోని రైదిగి గ్రామానికి చెందిన పస్చిమ్ బంగా ఖేత్మాజూర్ సమితి సభ్యురాలు నలభయొక్క యేళ్ళ నమితా హాల్డర్ ఇలా అన్నారు. "మాకు మంచి ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత చికిత్స అవసరం; మేము పెద్ద ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లను భరించలేము. ఈ చట్టాలను వెనక్కి తీసుకోకపోతే వ్యవసాయం విషయంలో కూడా అదే జరుగుతుంది! పెద్ద ప్రైవేట్ సంస్థల కోసం సర్కార్ ప్రతిదీ తెరిస్తే, అప్పుడు పేదలు ఏదో మార్గాన సంపాదించుకునే ఆ కొద్దిపాటి ఆహారాన్ని కూడా పొందలేరు. కంపెనీలు లాభాల కోసం వస్తాయి. వాటికి మా బాగోగులు చచ్చినా పట్టవు. మేము పందించే ఆహారాన్ని మేమే కొనలేని స్థితి వస్తుంది.”

మహిళలు నిరసన ప్రదేశాలలో ఉండకూడదు అనే  మాటనే ఆమె ఒప్పుకోదు. "నాగరికత ప్రారంభం అయినప్పటి నుండి మహిళలు వ్యవసాయంలో భాగస్వాములై  ఉన్నారు," అని ఆమె అంటుంది.

Namita Halder (left) believes that the three laws will very severely impact women farmers, tenant farmers and farm labourers,
PHOTO • Smita Khator
Namita Halder (left) believes that the three laws will very severely impact women farmers, tenant farmers and farm labourers,
PHOTO • Smita Khator

ఈ మూడు చట్టాలు మహిళా రైతులు, కౌలు రైతులు మరియు వ్యవసాయ కూలీలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని నమితా హాల్డర్ (ఎడమ) అభిప్రాయపడింది.

ఈ మూడు చట్టాలు తనలాంటి మహిళలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని నమిత అభిప్రాయపడ్డారు - మహిళా కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు భూమిని లీజుకు తీసుకొని వరి, కూరగాయలు మరియు ఇతర పంటలను పండిస్తారు. "మా ఉత్పత్తులకు సరైన ధర లభించకపోతే, మేము చిన్న పిల్లలకు, వయసైపోయిన అత్తమామలకు, మా  తల్లిదండ్రులకు తిండి ఎలా పెడతాము?" ఆమె అడిగింది. "పెద్ద కంపెనీ సేటులు మా నుండి పంటలను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేసి నిల్వలుంచుకొని ధరలను నియంత్రిస్తారు."

రైతులు నిరసన తెలిపే చట్టాలు- రైతుల (సాధికారత మరియు రక్షణ) ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020 ; రైతు ఉత్పత్తి వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం, 2020 ; మరియు ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) చట్టం, 2020 . భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ను బలహీనం చేస్తూ, పౌరులందరికీ దావా వేయగల చట్టబద్దమైన హక్కును నిలిపివేస్తున్నందున ఈ చట్టాలు ప్రతి భారతీయుడిని ప్రభావితం చేస్తాయని విమర్శించారు.

మహిళా రైతులు, వ్యవసాయ కార్మికుల వివిధ డిమాండ్లు ఈ విధానసభ ఆమోదించిన తీర్మానాల్లో ప్రతిబింబించాయి. వీటిలో మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయడం; రైతుల హోదా ఇవ్వడం ద్వారా వ్యవసాయంలో మహిళల శ్రమను గుర్తించడం; రైతులపై జాతీయ కమిషన్ (స్వామినాథన్ కమిషన్) సిఫారసు ప్రకారం కనీస మద్దతు ధరలకు (ఎంఎస్‌పి) హామీ ఇచ్చే చట్టం; మరియు రేషన్ల కోసం PDS (ప్రజా పంపిణీ వ్యవస్థ) ను బలోపేతం చేయడం వంటివి ఉన్నాయి.

రోజు గడిచేసరికి/సాయంత్రం అయ్యేసరికి , దక్షిణ 24 పరగణాలలోని భంగర్ బ్లాక్‌లోని 500 మంది ముస్లిం మహిళా రైతులతో కూడిన ఒక పొడవైన మషాల్ మిచిల్ (టార్చ్ ర్యాలీ) సాయంత్రం చీకటిగా ఉన్న ఆకాశాన్ని వెలిగించింది.

చిత్రం : పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలోని ఒక చిన్న పట్టణానికి చెందిన లాబని జంగి, కోల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో బెంగాలీ కార్మిక వలసలపై పిహెచ్‌డి చేస్తున్నారు. ఆమె చిత్రకళను సొంతంగా నేర్చుకున్నారు. ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు.

అనువాదం : అపర్ణ తోట

Smita Khator

Smita Khator is the Translations Editor at People's Archive of Rural India (PARI). A Bangla translator herself, she has been working in the area of language and archives for a while. Originally from Murshidabad, she now lives in Kolkata and also writes on women's issues and labour.

Other stories by Smita Khator
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota