కోవిద్-19 పరీక్ష లో పాజిటివ్ అని వచ్చిన ఎనిమిది రోజులకి రాంలింగ్ సనప్, తాను చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే మరణించాడు. కానీ అతనిని చంపింది వైరస్ కాదు.

అతను చనిపోయే కొన్ని గంటలు ముందు, నలభయ్ ఏళ్ళ  రాంలింగ్, తన భార్య రాజుబాయికి ఫోన్ చేసాడు. “అతని చికిత్స కు అయిన ఖర్చుని తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు”, అని అతని మేనల్లుడు 23 ఏళ్ళ రవి మొరలె చెప్పాడు. “అతని రెండెకరాల పొలాన్ని అమ్మేయాలేమో అని ఆలోచించాడు.”

మహారాష్ట్ర బీడ్ నగరంలోని  డీప్ హాస్పిటల్ లో రాంలింగ్ అడ్మిట్ అయ్యాడు. మే 13 నుంచి ఆసుపత్రిలో ఉన్న ఇతని చికిత్స కోసం 1.6  లక్షలు తీసుకున్నారని, రాజుబాయి అన్న చెప్పాడు. “మేము  ఎలానో రెండు విడతలు గా ఇచ్చాము. కానీ ఆ ఆసుపత్రి ఇంకా 2 లక్షలు అడుగుతోంది.” అని చెప్పాడు. “వాళ్ళు ఈ విషయాలు రోగి అటెండెంట్ కు చెప్పకుండా రోగికి చెప్పారు. అతనిని ఎందుకు కష్టపెట్టడం?”

తన సంవత్సర ఆదాయం కన్నా రెట్టింపు డబ్బు ఆసుపత్రి బిల్ కు  కట్టాలన్న ఆలోచన రాంలింగ్ ను విపరీతంగా  కలవరపెట్టింది. మే 21, పొద్దున్నే, అతను కోవిడ్ వార్డ్ నుంచి బయటకు వచ్చి ఆసుపత్రి కారిడార్ లో ఉరి వేసుకున్నాడు.

మే 20 వ రాత్రి తనకు ఫోన్ చేసి బాధపడిన భర్త ను ఓదార్చడానికి ముప్పయి అయిదేళ్ల రాజూబాయి ప్రయత్నించింది. అతని మోటార్ సైకిల్ ని అమ్మేసి, పడమర మహారాష్ట్ర లో వారిద్దరూ పని చేసే షుగర్ ఫ్యాక్టరీ లో అప్పు తీసుకొవచ్చని చెప్పింది. అతని ఆరోగ్యం బాగుపడడమే ఆమెకు కోరుకునేది అని ఆమె అతనికి పదేపదే చెప్పింది. బహుశా రాంలింగ్ ఆ డబ్బును కూడగట్టలేనేమో అని అనుమానపడ్డాడనుకుంటాను.

ప్రతి సంవత్సరం, రాంలింగ్ రాజుబాబు  దంపతులు బీడ్ జిల్లా, కైజో తాలూకా లో ఉన్న వారి  కుగ్రామం నుంచి వలస వెళ్లి పడమర మహారాష్ట్ర లో ఉన్న చెరుకు తోటలలో పనిచేసేవారు. వారిద్దరూ కలిసి, నవంబరు నుంచి  ఏప్రిల్ వరకు 180 రోజులు పని చేసి 60,000 రూపాయిల వరకు సంపాదించేవారు.  వారు ఇక్కడ లేనప్పుడు 8 నుంచి 16 ఏళ్ళ లోపు ఉన్న వారి ముగ్గురు పిల్లలను, రాంలింగ్ తండ్రి చూసుకునే వాడు. రాంలింగ్ తల్లి చనిపోయింది.

Ravi Morale says they took his uncle Ramling Sanap to a private hospital in Beed because there were no beds in the Civil Hospital
PHOTO • Parth M.N.

సివిల్ ఆసుపత్రిలో పడకలు లేకపోవడం వలన రాంలింగ్ ను బీడ్ లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి  తీసుకువెళ్లవలసి వచ్చిందని రవి మొరలె చెప్పాడు

బీడ్  పట్టణానికి 50 కిలోమీటర్ల దూరం లో ఉన్న వారి కుగ్రామానికి తిరిగి వచ్చాక, రాంలింగ్ రాజుబాయి దంపతులు జొన్న, సజ్జ , సోయాబీన్ పంటలు వారి పొలం లో వేసేవారు. అంతేగాక రాంలింగ్ వారం లో మూడు రోజులు వేరే వారి పొలాలలో ట్రాక్టర్ నడిపి 300 రూపాయిలు సంపాదించేవాడు.

ఇంత  కష్టపడి బతుకు ఈడుస్తున్న ఈ కుటుంబం, రాంలింగ్ కి ఒంట్లో బాగుండనప్పుడు మొదట బీడ్ లో ఉన్న సివిల్ ఆసుపత్రిలో చేర్చాలనే ప్రయత్నించారు. “కానీ అక్కడ పడకలు(బెడ్లు) లేవు,  అందుకని మేము అతనిని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళాము.” అని చెప్పాడు రవి.

రెండో వేవ్ లో వేగంగా  వ్యాపించిన కరోనా వైరస్, మన దేశ గ్రామలలో ప్రజా ఆరోగ్య సదుపాయాల లేమిని ఎత్తిచూపించింది. ఉదాహరణకు బీడ్ లో, 26 లక్షలమంది జనాభాకి రెండే ప్రభుత్వ ఆసుపత్రులున్నాయి.

ప్రభుత్వ ఆసుపత్రులలో అప్పటికే కోవిడ్ పేషెంట్లు ఎక్కువవడం వలన, పడకలు దొరకక, డబ్బులు లేకపోయినా, రోగులు  ప్రైవేట్ ఆసుపత్రుల వైపు మరలవలసి వచ్చింది.

ఒకసారి అవసరమైన ఈ అత్యవసర ఆరోగ్యసేవ,  చాలామందిని  దీర్ఘకాలిక అప్పులలో ముంచేసింది.

US లో ఉన్న ప్యూ రీసెర్చ్ సెంటర్ మార్చ్ 2021 కు ఇచ్చిన నివేదిక లో, “ఇండియా లో కోవిడ్ వలన రోజుకు 2 డాలర్లు లేక అంతకన్నా తక్కువ ఆదాయం ఉన్న పేదప్రజలు  75 మిలియన్ మంది వరకు పెరిగారని అంచనా.” అని ఉంది. “2020 లో భారతదేశంలో మధ్యతరగతి 32 మిలియన్ల కు  తగ్గిపోవటం, ప్రపంచ పేదరికంలో 60 శాతం పెరుగుదలకు కారణం” అని ఈ నివేదిక చెప్పింది.

మహమ్మారి ప్రభావం బీడ్, ఉస్మానాబాద్- ఈ రెండు చోట్ల చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవి మరాఠ్వాడా ప్రాంతానికి పక్కనే ఉన్న జిల్లాలు - అప్పటికే వాతావరణ మార్పు, నీటి కరువు, వ్యవసాయ సంక్షోభం వంటి దీర్ఘకాలిక ఇబ్బందులు ఉన్న జిల్లాలో ఇప్పుడు కోవిడ్ 19 కూడా చేరింది. జూన్ 20, 2021 నాటికి  బీడ్ లో 91,600 కోవిడ్ కేసులు, 2, 450 ల చావులు సంభవించాయి. ఉస్మానాబాద్ 61,000 కోవిడ్ కేసులు, 1500 పైగా మరణాలు చూసింది.

Left: A framed photo of Vinod Gangawane. Right: Suresh Gangawane fought the hospital's high charges when his brother was refused treatment under MJPJAY
PHOTO • Parth M.N.
Suvarna Gangawane (centre) with her children, Kalyani (right) and Samvidhan

ఎడమ: ఫ్రేమ్ లో వినోద్ గంగవానే ఫోటో. కుడి: ఆమె పిల్లలు కళ్యాణి, సంవిధాన్ లతో  సువర్ణ గంగవానే (మధ్యలో)

కానీ కాగితాల పైన, పేదలను బాగా చూసుకుంటున్నామనే ఉంటుంది.

మహారాష్ట్ర ప్రభుత్వం, కోవిడ్ రోగులు చికిత్స కోసం వారి డబ్బును పోగొట్టుకోకుండా, ప్రైవేట్ ఆసుపత్రుల చార్జీల పై పరిమితి పెట్టారు. ఈ ఆసుపత్రులు జనరల్ వార్డ్ లో పడకకు రోజుకు 4000 రూపాయిలు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో పడక కు 7500, ICU లో వెంటిలేటర్ పై ఉన్న వారికి 9000 రూపాయిలు - ఇంతకన్నా ఎక్కువ డబ్బును వసూలు చేయకూడదని చెప్పారు.

రాష్ట్ర ప్రధాన ఆరోగ్య బీమా పథకం - మహాత్మా జ్యోతిరావు ఫులే జన్ ఆరోగ్య యోజన (MJPJAY) - వైద్య ఖర్చులను (రూ .2.5 లక్షల వరకు) భరిస్తుంది. లక్ష కన్నా తక్కువ సంవత్సర ఆదాయం ఉన్నవారికి , వ్యవసాయ క్షోభకు గురైన 14 జిల్లాల వారికి  (ఇందులో బీడ్, ఉస్మానాబాద్ కూడా ఉన్నాయి) ఈ పధకానికి అర్హత ఉంది. MJPJAY యొక్క నెట్‌వర్క్ క్రింద ఉన్న 447  ప్రభుత్వ, ప్రైవేటు ఎంపానెల్డ్ ఆస్పత్రులలో, అనారోగ్యానికి, శస్త్ర చికిత్సకు నగదు రహిత చికిత్సను ఈ పథకం కింద అందిస్తుంది.

కానీ ఏప్రిల్ లో, ఉస్మానాబాద్ లో ఉన్న చిరాయు ఆసుపత్రిలో, 48 ఏళ్ళ వినోద్ గాంగ్వాన్ ని MJPJAY క్రింద చికిత్సను అందించడానికి నిరాకరించారు. “ ఇది ఏప్రిల్ మొదటి వారం లో జరిగింది, అప్పుడు ఉస్మానాబాద్ లో కేసులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి.” అని వినోద్ అన్న, 50 ఏళ్ళ   సురేష్ గంగవానే అన్నారు. “చిరాయు ఆసుపత్రి లో డాక్టర్ చెప్పారు, ‘మావద్ద ఈ స్కీం లేదు, మీకు బెడ్ కావాలో వద్దో చెప్పండి.’ ఆ సమయంలో మేము ఎంత కంగారులో ఉన్నామంటే, ముందు చికిత్సని మొదలుపెట్టమని చెప్పాము.”

సురేష్, ఉస్మానాబాద్ లో జిల్లాపరిషద్ ఆరోగ్య విభాగం లో పనిచేస్తాడు. కాబట్టి అతను స్వయంగా  విచారించి, ఆ ఆసుపత్రి MJPJAY లిస్టులో ఉందని తెలుసుకున్నాడు. “నేను ఆసుపత్రికి వెళ్లి అడిగాను, కానీ వాళ్ళు నాకు స్కీం కావాలో లేక తమ్ముడు కావాలో తేల్చుకోమని  వారు అడిగారు.” అని చెప్పాడు. “అంతేగాక, బిల్లులు సరైన టైంకి చెల్లించక పొతే చికిత్స ఆపేస్తామని కూడా చెప్పారు.”

Left: A framed photo of Vinod Gangawane. Right: Suresh Gangawane fought the hospital's high charges when his brother was refused treatment under MJPJAY
PHOTO • Parth M.N.

సురేష్ గంగవానే తన తమ్ముడిని MPJPAY స్కీం లో చేర్చకుండా  ఆసుపత్రి తమ పై భారీ బిల్లులు వేయడాన్ని గురించి గట్టిగా పోరాడారు

గంగవానే కుటుంబానికి ఉస్మానాబాద్ ఊరిచివర నాలుగెకరాల పొలం ఉంది. వాళ్లు మొత్తం 3.5 లక్షలు మందులకు, లాబ్ పరీక్షలకు, ఆసుపత్రి పడకకు, వినోద్ అక్కడ 20 రోజులు ఉన్నందుకు ఖర్చుపెట్టారు. అతను ఏప్రిల్ 26 న చనిపోయినప్పుడు ఆసుపత్రి ఇంకో రెండు లక్షలు ఇవ్వమని అడిగింది, అన్నాడు సురేష్. అతను ఇవ్వడానికి అంగీకరించలేదు. అతనికి, అక్కడి అధికారులకి మధ్య వాగ్వాదం జరిగింది. “నేను శవాన్ని తీసుకెళ్ళను అని చెప్పాను,” అన్నాడు. వినోద్ శవాన్ని ఒక రోజు అలానే హాస్పిటల్ లో ఉంచేశారు.  చివరికి ఆసుపత్రి శవాన్ని ఇచ్చింది.

చిరాయు ఆసుపత్రి యజమాని  డా. వీరేంద్ర గాలి అన్నారు, “వినోద్ ని ఆరోగ్య ఆరోగ్య బీమా స్కీం లో చేర్పించకపోవడానికి కారణం అతను ఆధార్ కార్డు ను ఇవ్వకపోవడమే.” కానీ అది నిజం కాదు తిరిగి బదులిచ్చాడు సురేష్. “ఆ ఆసుపత్రి అసలు MJPJAY గురించి ఏ ప్రశ్నలు అడిగిన సమాధానం చెప్పలేదు.”

చిరాయులో సదుపాయాలు కూడా చాలా మౌలికంగా ఉన్నాయి, అన్నారు డా గాలి. “కేసులు పెరగడం మొదలయ్యాయాక, జిల్లా అధికార యంత్రాంగం కోవిడ్ పేషెంట్లను కూడా చేర్చుకోమని విజ్ఞప్తి చేశారు. అది కూడా మాట మాత్రంగా చెప్పారు. ఒకవేళ రోగి పర్యవేక్షణ మరీ ఇబ్బంది అయితే వేరే ఆసుపత్రికి తరలించమని చెప్పారు.” అని అన్నారు.

వినోద్  ఆసుపత్రిలో చేరిన 12-15 రోజుల తరువాత వేరే ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అందుకని డా. గాలి, తాను అతనిని వేరే ఆసుపత్రి లో చేర్చమని, అతని కుటుంబానికి చెప్పానని అన్నాడు.  “కానీ వారు ఒప్పుకోలేదు. మేము అతనిని బతికించడానికి అన్ని ప్రయత్నాలు చేసాము. కానీ అతనికి ఏప్రిల్ 25 న  గుండె పోటు వచ్చి, ఆ తరవాత రోజు చనిపోయాడు.”

వినోద్ ని వేరే ఆసుపత్రిలో మార్చడం అంటే వేరే ఆక్సిజన్ పడకను ఉస్మానాబాద్ లో వెతకడమని అర్థం, అంటాడు సురేష్. అప్పటికే ఆ కుటుంబం అంతా ఒక వారంగా చాలా కష్టంలో ఉన్నారు. వినోద్, సురేష్ ల - 75  ఐదేళ్ల తండ్రి విట్టల్ గంగవానే కొన్ని రోజుల క్రితమే చనిపోయారు. వినోద్ కి ఆ విషయం ఇంకా చెప్పలేదు. “అతను అప్పటికే భయపడి పోయున్నాడు. అతని వార్డులో ఎవరు చనిపోయినా విపరీతంగా ఆందోళన పడిపోయేవాడు.” అని 40 ఏళ్ళ వినోద్ భార్య సువర్ణ చెప్పింది.

The Gangawane family at home in Osmanabad. From the left: Suvarna, Kalyani, Lilawati and Suresh with their relatives
PHOTO • Parth M.N.

ఉస్మానాబాద్ లో గంగవనే కుటుంబం. ఎడమ నుంచి కుడికి: సువర్ణ, కళ్యాణి, లీలావతి, సురేష్, సంవిధాన్, కుటుంబ శ్రేయోభిలాషి

వినోద్ తన తండ్రి గురించి అడుగుతూనే ఉన్నాడు, అని అతని 15 ఏళ్ళ కూతురు కళ్యాణి చెప్పింది. “కానీ ప్రతిసారి మేము ఏదొక కథ చెబుతూ వచ్చాము. అతను చనిపోయే రెండు రోజుల ముందు మా నాయనమ్మ లీలావతి ని ఆసుపత్రికి తీసుకెళ్లి అతనికి చూపించాము.” అన్నది.

తన కొడుకుని చూద్దామని వెళ్ళినప్పుడు లీలావతి బొట్టు కూడ పెట్టుకుని వెళ్ళింది- వితంతువులు అలా పెట్టుకుంటే మాటలంటారని తెలిసినా. “అతను ఏమి అనుమానపడకూడదని అలా  చేసాను”, అన్నదామె. కొద్ది రోజుల తేడా తోనే భర్తను, కొడుకుని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో మునిగి ఉన్నది ఆమె.

ఇక ఆ కుటుంబం చికిత్స కోసం చేసిన అప్పులను తీర్చడానికి  కష్టపడాలి, అన్నది సువర్ణ. ఆమె ఇంటిలోనే ఉంటుంది. “నేను నా నగలను తాకట్టు పెట్టాను, మేము పొదుపు చేసుకున్న డబ్బులన్నీ పోగొట్టుకున్నాను.” ఆమె కూతురు కళ్యాణి డాక్టర్ అవ్వాలనుకుంది. “అమె  కలలు ఎలా  నెరవేర్చగలను? ఒకవేళ ఆ ఆసుపత్రి మాకు స్కీం వాడుకునే సౌకర్యం కలిగించి ఉంటే నా కూతురు భవిష్యత్తు ఇలా ప్రశ్నలా మిగిలేది కాదు.” అన్నది.

MJPJAY స్కీం జిల్లా కోఆర్డినేటర్  విజయ్ భూటేకర్, ఉస్మానాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రులలో, ఏప్రిల్ 1 నుండి మే 12 వరకు, 82 మంది కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందారు అని చెప్పారు. బీడ్ జిల్లా కోఆర్డినేటర్ అశోక్  గాయక్వాడ్,  ఏప్రిల్ 17 నుండి  మే 27 వరకు 179 పేషెంట్లు ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ స్కీంని వాడారని చెప్పారు. ఈ సంఖ్య మొత్తం ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య లో కొద్ది శాతం మాత్రమే.

ప్రజారోగ్య సేవలను మెరుగుపరిచి బలపరచాలని, అందువలన పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళవలసిన అవసరం ఉండదని అనికేత్ లోహియా, మానవలోక్ సెక్రటరీ అన్నారు. మానవలోక్ అంబేజాగోయ్ పట్టణంలో గ్రామీణ అభివృద్ధి కోసం పని చేసే సంస్థ. “మన ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, గ్రామీణ సబ్ సెంటర్లు చాలా తక్కువ సిబ్బందితో నడుస్తున్నాయి, అందుకే సరైన ఆరోగ్య సేవలు మనకు అందుబాటులో లేవు”, అని చెబుతారు.

Ever since the outbreak of coronavirus in March 2020, the MJPJAY office in Mumbai has received 813 complaints from across Maharashtra – most of them against private hospitals. So far, 186 complaints have been resolved and the hospitals have returned a total of Rs. 15 lakhs to the patients
PHOTO • Parth M.N.

రాగిణి ఫాడ్కే, ముకుందరాజ్

మార్చ్ 2020 లో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన దగ్గర నుంచి, మహారాష్ట్ర  MJPJAY కార్యాలయం లో ఇప్పటిదాకా 813 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ఎక్కువగా ప్రైవేట్ ఆసుపత్రుల గురించే. ఇప్పటిదాకా 186 ఫిర్యాదులను పరిష్కరించారు. ఆసుపత్రులు రోగులకు, 15 లక్షల దాకా డబ్బులు వెనక్కి ఇచ్చారు.

“పెద్ద ప్రజారోగ్య ఆసుపత్రులలో కూడా సరిపడా సిబ్బంది లేరు, డాక్టర్లు నర్సులు కూడా రోగులకు ఇవ్వవలసిన సేవలను అందించడం లేదు”, అని లోహియా చెప్పారు. “చాలా కేసుల్లో ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులు ఇవ్వవలసిన ధైర్యాన్ని ఇవ్వకపోవడం వలన, వారి స్థాయికి మించిన ఖర్చు ఉన్నా, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తారు.” అని చెప్పారు.

అందుకే మే నెల లో విమల్ ఫాడ్కే కు కోవిడ్ లక్షణాలు కనిపించినా అతను దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో పడక కోసం ప్రయత్నించలేదు. అతని తమ్ముడు లక్ష్మణ్ ప్రభుత్వ ఆసుపత్రిలో, రెండు రోజుల క్రితమే  కోవిడ్ నిమోనియా తో మరణించాడు.

ఏప్రిల్ చివరి వారం నుండి లక్ష్మణ్ లో  కోవిడ్ లక్షణాలు కనిపించడం మొదలయ్యాయి. అతని ఆరోగ్యం వేగంగా దిగజారడం తో విఠల్ అతనిని వారి ఊరు పర్లి కి 25 కిలోమీటర్ల దూరం లో ఉన్న అంబేజోగోయ్ లోని , స్వామి రామానంద్ తీర్థ్ రూరల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ(SRTRMCA)లో చేర్పించాడు. లక్ష్మణ్ ఆ ఆసుపత్రిలో రెండు రోజులు మాత్రమే ఉన్నాడు.

అతని తమ్ముడి చావుతో ఖేదపడిన విఠల్, తనకి  ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది మొదలయినప్పుడు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి చేరాడు. “ఆ ఆసుపత్రి(SRTRMCA) లో ప్రతి రోజు ఆక్సిజన్ లేక పరుగులు పెట్టవలసి వచ్చేది. డాక్టర్లు కానీ నర్సులు కాని గట్టిగా అరిస్తే గాని పట్టించుకోరు. వాళ్ళు ఒకేసారి చాలా మంది రోగులని చూస్తున్నారు.” అన్నది 28 ఏళ్ళ లక్ష్మణ్ భార్య రాగిణి. “ప్రజలు వైరస్ అంటే భయపడుతున్నారు, వారిని అర్ధం చేసుకోవాలి. డాక్టర్లు ధైర్యం చెప్పాలి. కాబట్టి విఠల్ డబ్బులు కోసం చూడలేదు(ప్రైవైట్ ఆసుపత్రి లో చికిత్స కోసం).”

విఠల్ ఆరోగ్యం బాగుపడి ఒక వారం తరవాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. కానీ ఆ సాంత్వన ఎక్కువగా నిలవలేదు.

ఆసుపత్రి అతనికి 41, 000 రూపాయిల  బిల్లు వేసింది. అదే గాక అతను 50,000 రూపాయిలు మందులకు ఖర్చుపెట్టాడు. అతను లేదా లక్ష్మణ్,  280 రోజులు కష్టపడితే వచ్చే ఆదాయం అది. అతని ఆసుపత్రి  వారిని తగ్గించమని బతిమాలాడు. “మేము అప్పుతీసుకుని బిల్ కట్టాము,” అన్నది రాగిణి.

Ragini Phadke with her children outside their one-room home in Parli. The autorickshaw is the family's only source of income
PHOTO • Parth M.N.

రాగిణి ఫాడ్కే ఆమె పిల్లల్తో పర్లి లో వారి ఒక గది ఇంట్లో ఉంది. వారికున్న ఆటో ఒకటే వారి  కుటుంబానికి ఆధారం.

విఠల్, లక్ష్మణ్ పర్లి లో ఆటో నడుపుతారు. “లక్ష్మణ్ పగలు నడుపుతాడు, విఠల్ రాత్రుళ్ళు నడుపుతాడు. వారికి రోజుకు 300-350 వస్తుంది. కానీ లొక్డౌన్ మొదలైన దగ్గరనించి వారు పెద్దగా సంపాదించలేక పోయారు. ఆటో ఎక్కేవారు తగ్గిపోయారు. ఎలా బతికామో మాకే తెలుసు.” అంది రాగిణి.

రాగిణి ఇంట్లో ఉండి తన ఇద్దరి పిల్లలని చూసుకుంటుంది. ఆమె MA డిగ్రీ చేసింది, కానీ తన పిల్లల్ని ఎలా పెంచుకోవాలో అర్ధం కావట్లేదు అని చెప్పింది. ఆమెకు ఏడేళ్ల కార్తీకి, చంటిపాప ముకుంద్ రాజ్ ఉన్నారు. “లక్ష్మణ్ లేకుండా పిల్లలను పెంచాలంటే భయమేస్తుంది. మా  దగ్గర డబ్బులేదు. అతని దహనానికి  కూడా అప్పు చేయాల్సి వచ్చింది.” అన్నది.

ఆ అన్నదమ్ముల ఆటో, వారి ఒక గది ఇంటి పక్కన చెట్టుకింద పార్క్ చేసి ఉంది, అక్కడే వారి అమ్మానాన్న ఉంటారు. ఈ ఆటో ఒకటే వారి అప్పులని తీర్చే మార్గం. కానీ అప్పు తీరాలంటే చాలా కాలం పడుతుంది. ప్రస్తుతం వారి ఆర్ధిక పరిస్థితి కూడా బాలేదు కాబట్టి అప్పు తీరడానికి చాలా సమయం పడుతుంది. పర్లిలో నడిచే ఈ ఆటో కి ఒక డ్రైవర్ తగ్గిపోయాడు.

ఉస్మానాబాద్ జిల్లా మేజిస్ట్రేట్, కౌస్తుభ దివేగొంకర్ ప్రైవేట్ ఆసుపత్రుల ఎక్కువ బిల్లులు వేయడం గురించి చర్యలు తీసుకుంటున్నారు. ఆయన మే 9న సహ్యాద్రి మల్టీస్పెషలిటీ హాస్పిటల్ కి నోటీసుని పంపారు. ఈ ఆసుపత్రి ఏప్రిల్ 1 నుండి మే 6 వరకు MJPJAY స్కీం తరఫున 19 మంది రోగులను మాత్రమే తీసుకుంది. కానీ ఆ ఆసుపత్రి లో ఈ కాలంలో మొత్తం 486 రోగులు చేరారు.

ఈ విషయాని పై స్పందన ఇవ్వడానికి తిరస్కరిస్తూ సహయాద్రి ఆసుపత్రి డైరెక్టర్ డా. దిగ్గజ్ దాప్కే-దేశముఖ్, ఆసుపత్రి న్యాయబృందం, మేజిస్ట్రేట్ నోటీసును దృష్టిలోకి తీసుకున్నారని చెప్పారు.

Pramod Morale
PHOTO • Parth M.N.

ప్రమోద్ మొరలె

డిసెంబర్ 2020 లో దివేగొంకర్, MJPJAY లిస్టులోంచి షాంగ్దే ఆసుపత్రి, పరిశోధన కేంద్రాన్ని తొలగించమని ఆరోగ్య హామీ సొసైటీకి రాశారు. అతని లేఖలో, ఉస్మానాబాద్ నుండి 100 కిలోమీటర్ల దూరం లో ఉమార్గ లో ఉన్న ఈ ఆసుపత్రి పై రోగుల ఫిర్యాదుల చిట్టాను జతపరిచారు.

షాంగ్దే ఆసుపత్రి ఉన్న అనేక ఫిర్యాదులలో ఒకటి వారి రోగుల పై  వారు వాడే బోగస్ ఆర్టెరియల్ బ్లడ్ గ్యాస్ టెస్ట్ . అదే గాక ఈ ఆసుపత్రి ఒక రోగి వెంటిలేటర్ బెడ్ కి మోసపూరిత బిల్ వేసిందని చెప్పారు.

మేజిస్ట్రేట్ చర్యల వలన, ఆ ఆసుపత్రి ఇక MJPJAY నెటవర్క్ లో ఇక భాగం కాదు. అయినా డా ఆర్  డి  షాంగ్దే,  ఆయన  తన వయసును దృష్టిలో ఉంచుకుని కావాలనే అందులోంచి బయటపడ్డాను అని చెబుతున్నారు.  తన ఆసుపత్రి మీద ఉన్న ఫిర్యాదుల గురించి ఏమి చెప్పకుండా, “నాకు చక్కర వ్యాధి కూడా ఉంది”, అని చెప్పారు.

ప్రైవేట్ ఆసుపత్రులు MJPJAY తమకు ఆర్ధికంగా పనికి వచ్చే స్కీం కాదని చెబుతారు. ‘ప్రతి స్కీం ని సమయానుకూలంగా మార్చవలసి ఉంటుంది. తొమ్మిదేళ్లయినా ఈ పాకేజ్ ఖర్చులు మొదట్లో(2012) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అంకెల కన్నా ఏమి మారలేదు.” అన్నారు నాందేడ్ లో ప్లాస్టిక్ సర్జన్ గా పనిచేస్తున్న సంజయ్ కదం. ఈయన రాష్ట్ర ప్రైవేట్ ఆసుపత్రుల సంఘానికి ప్రాతినిధ్యం వహించే ఆసుపత్రి వెల్ఫేర్ అసోసియేషన్ లో సభ్యుడు కూడా. “మీరు 2012 నుండి జరిగిన  ద్రవ్యోల్బణాన్ని గురించి ఆలోచిస్తే  MJPJAY ప్యాకేజ్ మామూలు చార్జీలకన్నా చాలా తక్కువగా ఉన్నాయని గ్రహిస్తారు.” అని వివరించారు.

ఒక ఎంపానెల్డ్ హాస్పిటల్ లో 25 శాతం పడకలు MJPJAY  రోగుల కోసం రిజర్వు చేసి ఉంచాలి. ఒక వేళ ఆ 25 శాతం కూడా నిండిపోతే ఆ  ఆసుపత్రులు, మరో రోగిని ఈ స్కీం కింద చేర్చుకోవడానికి కుదరదు.

“చాలా కేసుల్లో ప్రైవేట్ ఆసుపత్రులు చేసే దుర్వినియోగం, అవకతవకలు కనుక్కున్నాము. వీటి గురించి ఇంకా వివరాలు సేకరిస్తున్నాము.” అని MJPJAY చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా. సుధాకర్ షాంగ్దే అన్నారు.

మార్చ్ 2020 లో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన దగ్గర నుంచి, మహారాష్ట్ర లో MJPJAY కార్యాలయం లో ఇప్పటిదాకా 813 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ఎక్కువగా ప్రైవేట్ ఆసుపత్రుల గురించే. ఇప్పటిదాకా 186 ఫిర్యాదులను పరిష్కరించారు. ఆసుపత్రులు రోగులకు, 15 లక్షల దాకా డబ్బులు వెనక్కి ఇచ్చాయి.

ఇలా దుర్వినియోగాలు చేసి, ఎక్కువగా డబ్బులు తీసుకునే ఆసుపత్రుల వెనుక చాలా శక్తిమంతుల బలం ఉంటుంది అన్నారు మానవలోక్ కు చెందిన లోహియా. “అందువలన సగటు ప్రజలకు వీరితో పోరాడడం చాలా కష్టమవుతుంది.” అంటారు.

కానీ ఆ తెల్లవారుఝామున రాంలింగ్ సనప్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతని కుటుంబం కోపంగా దీనికి ఆసుపత్రి మాత్రమే కారణం అని  చెప్పింది. వాళ్ళు అక్కడికి వెళ్లిన రోజున డాక్టర్లు ఎవరూ అక్కడ లేరు. “అక్కడి సిబ్బంది, శవాన్ని  పోలీసులకి అప్పజెప్పామని చెప్పారు.” అన్నాడు రవి.

Ramling Sanap's extended family outside the superintendent of police's office in Beed on May 21
PHOTO • Parth M.N.

మే 21న బీడ్ నగరం లో రాంలింగ్ సనప్ దూరపు బంధువులు సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ కార్యాలయం బయట నుంచుని ఎదురు చూస్తున్నారు.

ఆతని కుటుంబం వెంటనే పోలీస్ సూపరింటెండెంట్ వద్దకు వెళ్లి రాంలింగ్ ఆత్మహత్య గురించి కంప్లైంట్ ఇచ్చారు. రాంలింగ్ ను డబ్బు గురించి అడగడం వలెనే ఇదంతా జరిగిందని చెప్పారు. అతని విషాదకరమైన చావు వెనుక ఆసుపత్రి నిర్లక్ష్యం ఉందని, ఆ సమయం లో ఆసుపత్రి సిబ్బంది ఎవరు అక్కడ లేరని చెప్పారు.

డీప్ ఆస్ప్రత్రి  వారు తమ ప్రెస్ స్టేట్మెంట్ లో రాంలింగ్, హాస్పిటల్ లో వారెవరు చూడలేని ప్రదేశానికి వెళ్ళాడు, అందుకే వార్డ్  లో ని సిబ్బంది అతనిని చూడలేకపోయారు అని చెప్పారు. “ఆసుపత్రి డబ్బు గురించి పదేపదే అడిగింది అనే ఆరోపణ నిజం కాదు. ఆసుపత్రి ఇప్పటిదాకా 10,000 రూపాయిలు మాత్రమే రోగి కుటుంబం నుండి  తీసుకుంది. అతను ఆత్మహత్య చేసుకోవడమే బాధాకరం. అతని మానసిక స్థితి ని మేము అంచనా వేయలేకపోయాము,” అని స్టేట్మెంట్ లో ఉంది.

ప్రమోద్  మొరలె హాస్పిటల్ బిల్ లో 10, 000 రూపాయిలు వేశారన్నది ఒప్పుకున్నాడు. “కానీ  వాళ్ళు మా వద్ద 1. 6 లక్షలు తీసుకున్నారు”, అన్నాడు.

రాంలింగ్ బానే ఉన్నాడు అని చెప్తుంది రాజుబాయి. “ అతను చనిపోయే ఒకటి రెండు రోజుల ముందు వరకు, గుడ్లు మటను తింటున్నానని చెప్పాడు. పిల్లల గురించి కూడా అడిగాడు.” తరవాత అతను ఆసుపత్రి ఖర్చు గురించి అడిగాడు. ఆ సమయం లో అతను పడిన ఆందోళన అతను చివరలో చేసిన ఫోన్ కాల్ లో బయటపెట్టాడు.

“పోలీసులు ఈ విషయాన్ని చూస్తామని చెప్పారు కానీ ఇప్పటి దాకా ఆసుపత్రి జోలికి వెళ్ళలేదు”, అన్నాడు ప్రమోద్.  “ఆరోగ్యసేవలు అందుకోడానికి పేదలకు ఏ హక్కు లేదని అనిపిస్తుంది.” అని భారంగా నిట్టూర్చాడు.

అనువాదం : అపర్ణ తోట

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota