వేలి గోరంతైనా ఉండని ప్రతి ఒక్క మొగ్గా లేతగా తెల్లగా అందంగా ఉంటుంది. అక్కడక్కడా పూర్తిగా విచ్చుకున్న పూలతో మెరుస్తోన్న తోటనుంచి మత్తెక్కించే పరిమళం ముక్కుపుటాలను నింపుతోంది. ధూళి కమ్మిన భూమి, దృఢమైన మొక్కలు, మేఘాలతో గాయపడిన ఆకాశం. మల్లెపూవు ఒక వరం.

కానీ ఇక్కడి కార్మికులకు దాని వ్యామోహం రేకెత్తించే ఆకర్షణను అనుభవించే సమయం లేదు. వారు మల్లి (మల్లెమొగ్గలు)ని అవి వికసించక ముందే పూకడై (పూల మార్కెట్)కి తీసుకుపోవాలి. వినాయక చతుర్థికి, అంటే వినాయకుడి పుట్టినరోజు, ఇంకా నాలుగు రోజులే ఉంది. అంటే మీరు మంచి ధరలను ఆశించవచ్చు.

బొటనవేలునూ, మునివేళ్ళనూ మాత్రమే ఉపయోగించి పూలుకోసే ఆడా మగా గబగబా మొగ్గల్ని తుంచుతున్నారు. చేతినిండా కోసిన మొగ్గల్ని సంచుల్లా చేసిన తమ చీర కొంగులోనో ధోవతి అంచుల్లోనో వేసుకొని తర్వాత వాటిని గోతాల్లోకి నింపుతారు. ఆ పనికొక ఖచ్చితత్వం ఉంది: కొమ్మని వంచటం(ఆకుల రవ రవ), మొగ్గలు కోయటం (చక చక చకా), ఆ పక్కనే మూడేళ్ళ పసిబిడ్డలా నిలుచొనివున్న మరో మొక్క దగ్గరకు వెళ్ళటం, మరిన్ని మొగ్గలను కోయడం, ముచ్చట్లాడుకోవటం. తూర్పు ఆకాశంలో సూర్యుడు మెల్లమెల్లగా పైకి వస్తుండగా రేడియోలో ప్రజాదరణ పొందిన తమిళ పాటలు వింటూ...

త్వరలోనే ఆ మొగ్గలు మదురై నగరంలోని మాట్టుదావణి మార్కెట్‌కు, అక్కడి నుంచి తమిళనాడులోని ఇతర పట్టణాలకూ వెళ్తాయి. ఒక్కోసారి సముద్రాలమీదుగా వేరే దేశాలకు కూడా.

మదురై జిల్లాలోని తిరుమంగళం, ఉసిలంపట్టి తాలూకాలను PARI వరుసగా 2021, 2022, 2023లలో సందర్శించింది. మీనాక్షి అమ్మన్ కోవెల, సందడిగా ఉండే పూల బజారులకు పేరొందిన మదురై నగరానికి కేవలం ఒక గంట లోపు కారు ప్రయాణపు దూరంలోనే మల్లె తోటలుంటాయి. ఈ నగరంలో మల్లి ని దోసిళ్ళతోనూ కుప్పలుగానూ అమ్ముతుంటారు.

PHOTO • M. Palani Kumar

మదురై జిల్లా, తిరుమంగళం తాలూకాలోని మేలవుప్పిలిగుండు అనే కుగ్రామంలోని తన చేల మధ్యన నిల్చొని వున్న గణపతి. అప్పుడప్పుడే మల్లెపూల మంచి పూతకాలం ముగిసిపోవడంతో ఇప్పుడు ప్రతి రోజూ కిలో మొగ్గలకంటే రావటంలేదు

PHOTO • M. Palani Kumar

దోసెడు పరిమళాల మల్లెమొగ్గలు

మదురై ప్రాంతానికంతా పేరు తేవడమే కాక తానూ ప్రసిద్ధి చెందిన ఈ పువ్వు గురించి తిరుమంగళం తాలూకా మేలవుప్పిలిగుండు కుగ్రామానికి చెందిన 51 ఏళ్ళ పి. గణపతి నాకు వివరించారు. "ఈ ప్రాంతం సుగంధం వెదజల్లే మల్లి కి ప్రసిద్ధిచెందింది. ఎందుకంటే, ఒక్క అరకిలో మల్లెలను మీరు ఇంట్లో ఉంచుకుంటే దాని పరిమళం ఒక వారమంతా మీ ఇంట్లో తిరుగుతూనే ఉంటుంది."

మచ్చలేని తెల్లని తెలుపు రంగు చొక్కా - జేబులో కొన్ని రూపాయినోట్లు పెట్టుకొని - నీలిరంగు లుంగీ ధరించిన గణపతిది నవ్వుమొహం. మదురై తమిళంలో వేగంగా మాట్లాడతారు. "ఏడాది వయసు వచ్చేవరకూ మొక్క చిన్న పాపాయిలాంటిది. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది," గణపతి వివరించారు. ఈయనకు రెండున్నర ఎకరాల సొంత భూమి ఉంది. అందులో ఒక ఎకరంలో మల్లెలను సాగుచేస్తున్నారు.

మొక్క ఆరునెలల్లో పూతకొస్తుంది కానీ ఎప్పుడూ ఒకేరకంగా పూయదు. అలాగే ఒక కిలో మల్లెపూల ధర కూడా ఒకే రకంగా ఉండక పెరిగీ తగ్గుతుంటుంది. ఒక్క ఎకరం తోట నుంచి గణపతికి ఒక కిలో మల్లెలు వస్తాయి. ఒక్క రెండువారాల్లోనే దిగుబడి 50 కిలోల వరకూ రావొచ్చు. "పెళ్ళిళ్ళు, పండుగల కాలంలో చాలా మంచి ధర వస్తుంది: వెయ్యి, రెండు వేలు, మూడు వేలు... ఇదంతా ఒక కిలో మల్లెల ధరే. కానీ అందరి తోటలూ పూలతో నిండిపోయి - ముమ్మరంగా పూసే కాలం అయితే కూడా - ధరలు పడిపోతూ ఉంటాయి." వీటిని సాగుచేయటంలో ఎలాంటి హామీ లేకపోయినా ఖర్చు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది.

ఇకపోతే, పనివాళ్ళ గురించి. కొన్ని ఉదయాలు, తానూ తన వీట్టుకారమ్మ (ఇంటామె) - గణపతి తన భార్య పిచ్చయమ్మ గురించి అలా చెప్తారు - కలిసి ఎనిమిది కిలోల వరకూ మొగ్గలు తెంపుతారు. "మా వీపులు నెప్పెడతాయి, చాలా ఘోరంగా," అంటారాయన. అంతకంటే ఆయన్ని బాధించేవి పెరిగిపోతోన్న ఖర్చులు - ఎరువులు, పురుగుమందులు, కూలీలకివ్వవలసిన జీతం, ఇంధనం. "మేం మంచి లాభాన్ని ఎలా చూడగలం?" ఇదంతా సెప్టెంబర్ 2021 నాటి సంగతి.

ప్రతి వీధి మూలలో మామూలుగా కనిపించేది, తమిళ సంస్కృతికి ప్రతీక; ఒక నగరానికి పర్యాయపదమైన మల్లి , ఒక రకమైన ఇడ్లీ, బియ్యంలో ఒక రకం; ప్రతి గుడినీ, పెళ్ళిళ్ళనూ, బజార్లనూ పరిమళింపజేసేది, ప్రతి జనసమూహంలోనూ, బస్సుల్లోనూ, పడకగదిలోనూ సుపరిచితమైన సువాసననిచ్చేది - అయిన ఈ రోజువారీ పువ్వును పెంచడం అంత సులభమేమీ కాదు…

*****

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

గణపతికి చెందిన పొలాల్లో కొత్తగా మల్లెమొక్కలు నాటిన తోట, మల్లె మొగ్గలు (కుడి)

PHOTO • M. Palani Kumar

కొంతమంది కూలీలతో కలిసి మల్లె చేనును శుభ్రం చేస్తోన్న పిచ్చయమ్మ

ఆగస్ట్ 2022లో మేం రెండోసారి అక్కడికి వెళ్ళినపుడు గణపతి తన ఎకరం పొలంలో కొత్త మల్లె మొక్కలు నాటారు: ఏడు నెలల వయసున్న 9000 మొక్కలు. రామనాథపురం జిల్లా, రామేశ్వరం దగ్గర ఉన్న తాంగజిమడం నర్సరీల నుంచి కొనితెచ్చిన ఆ మూరెడు పొడవున్న మొక్కలు ఒక్కొక్కటీ నాలుగు రూపాయలు. మంచి పూల దిగుబడినిచ్చే బలమైన మొక్కలను అతనే స్వయంగా ఎంపికచేసి కొనుక్కొచ్చారు. ఎర్రని సారవంతమైన ఒండ్రుమట్టి నేలలైతే, "ఒక్కో మొక్కను నాలుగేసి అడుగుల దూరంలో పెట్టవచ్చు. ఆ మొక్క చాలా పెద్దగా పెరుగుతుంది," మొక్క పెరిగే పరిమాణాన్ని సూచించేలా తన చేతుల్ని సాధ్యమైనంత వెడల్పుగా చేసి ఒక వృత్తాన్ని చుడుతూ, నాతో చెప్పారు గణపతి. "కానీ ఇక్కడున్నది ఇటుకల తయారీకి బాగా సరిపోయే మట్టి." అంటే బంకమట్టి నేల.

మల్లి సాగుకోసం ఒక ఎకరం నేలను సిద్ధంచేయడానికి గణపతి 50 వేల రూపాయలు ఖర్చు చేస్తారు. "మీకు తెలుసుగదా, నేలను చక్కగా సిద్ధం చేయాలంటే డబ్బు ఖర్చవుతుంది." వేసవి కాలంలో అతని పొలం పూలతో వెలిగిపోతుంటుంది. " పళిచ్చిన్ను పూక్కుమ్ " అంటూ తమిళంలో చెప్పారతను. 10 కిలోల మల్లెమొగ్గలను కోసిన రోజు గురించి - కొన్ని మొక్కలు 100 గ్రాముల మల్లెలనిస్తే, మరికొన్ని 200 గ్రాములు కూడా - కళ్ళలో ఆసక్తి, స్వరంలో ఉత్సాహం, త్వరలోనే మళ్ళీ ఇలా జరుగుతుందనే ఆశాభావం వ్యక్తంచేసే చిరునవ్వుతో అతను వర్ణించారు

గణపతి పనిదినం తెల్లవారుఝాము నుండే మొదలవుతుంది. ఇంతకుముందు పని ఇంకా ఒక గంటా రెండు గంటలు ముందే మొదలయ్యేది. కానీ ఇప్పుడు "పనివాళ్ళు ఆలస్యంగా వస్తున్నారు," అంటారతను. మొగ్గలను తెంపడానికి ఆయన పనివాళ్ళ సాయం తీసుకుంటారు. వారికి గంటకు 50 రూపాయల లెక్కన గానీ, దాదాపు కిలో మల్లెమొగ్గలు పట్టే ఒక ' డబ్బా 'కు రూ. 35 నుండి రూ. 50 లెక్కన గానీ చెల్లిస్తారు.

PARI అక్కడికి చివరిసారి వెళ్ళినప్పటికీ ఇప్పటికీ, ఈ 12 నెలలలో, పూల ధరలు పెరిగిపోయాయి. కనీస ధరను 'సెంట్'(అత్తరు) తయారుచేసే కర్మాగారాలు నిర్ణయిస్తాయి. ఇవి మల్లెలు విరివిగా పూసే సమయంలో కిలో పూలకు 120-200 రూపాయల ధర చెల్లించి పెద్ద ఎత్తున పూలను కొనుగోలు చేసే అత్తరు తయారీ యూనిట్లు. కిలో పూలకు రెండు వందల రూపాయలంటే, తనకు నష్టాలు రావని గణపతి చెప్తారు.

ఉత్పత్తి తక్కువగా ఉండి, డిమాండ్ ఎక్కువగా ఉన్న రోజులలో ఒక కిలో మల్లెపూలు ఇంకా అనేక రెట్లు ఎక్కువ ధర పలుకుతాయి. పండుగల రోజుల్లో వాటి ధర కిలో ఒక్కింటికి వెయ్యి రూపాయల వరకూ ఉంటుంది. అయితే మొక్కలు కేలండర్‌లను అనుసరించవు; 'ముహూర్త నాళ్ ', 'కరి నాళ్ ' వంటి మంగళకరమైన, అమంగళకరమైన రోజులను కూడా పాటించవు.

అవి కేవలం ప్రకృతికి విధేయంగా ఉంటాయి. మంచి తీక్షణమైన సూర్యకాంతి, ఆపైన ఒక మంచి వాన కొట్టిందంటే భూమి పూలతో వికసిస్తుంది. అప్పుడు "నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ మల్లెపూలే ఉంటాయి. మనం పూలను పూయకుండా మొక్కలను ఆపలేం, కదా?" గణపతి చిరునవ్వు నవ్వుతూ నన్ను అడిగారు.

PHOTO • M. Palani Kumar

మేం తినడం కోసం మంచి కండగల జామకాయలను కోస్తోన్న గణపతి

వాన పూలుగా గణపతి పిలిచే ఈ పూలు, మదురై చుట్టుపక్కల ఉన్న మార్కెట్లను ముంచెత్తుతుంటాయి. "టన్నులకొద్దీ మల్లెలు వస్తాయి. ఐదు టన్నులు, ఆరు టన్నులు, ఏడు టన్నులు, ఇంకేంటి, ఒక్కో రోజు పది టన్నులు కూడా!" వాటిలో చాలా భాగం అత్తరు తయారీ కర్మాగారాలకు వెళ్తాయని ఆయన వివరించారు.

దండలు, మాలలు తయారుచేయడం కోసం పూలను కొని కిలో 300 రూపాయల వరకూ మారుబేరానికి అమ్ముతుంటారు. "కానీ పూత బాగా ఉన్న కాలంలో, కనాకష్టంగా ఒక కిలో మొగ్గలు తెగుతాయి, తక్కువ సరఫరా ఉండటం ధరను పెంచుతూపోతుంది. డిమాండ్ బాగా ఎక్కువగా ఉన్నపుడు నాకు 10 కిలోల మొగ్గలు మాత్రమే దొరికితే, ఒక్కరోజులో నాకు 15,000 రూపాయలు వస్తాయి. అది చాలా పెద్ద ఆదాయమే కదా?" కళ్ళు చికిలించి తేటగా నవ్వుతారు గణపతి. ఇంకా మాట్లాడుతూ, "అప్పుడు నేను కొన్ని కుర్చీలు వేసి, మంచి భోజనాలు ఏర్పాటు చేసి, ఇక్కడ కూర్చొని మీకు ఇంటర్వ్యూలిస్తాను, ఏం!"

వాస్తవమేమిటంటే, ఆయనలా చేయలేరు. ఆయన భార్య కూడా. పని చాలా ఉంటుందక్కడ. ఆ పనిలో ఎక్కువభాగం, మంచి గుబాళించే పంటను ఇచ్చేలా నేలను బుజ్జగించడం. మిగిలిన 1.5 ఎకరాల తన భూమిలో గణపతి జామ మొక్కలను పెంచుతున్నారు. "ఈ ఉదయం, 50 కిలోల జామ పండ్లను మార్కెట్‌కి తీసుకుపోయాను. అవి కిలో రూ. 20కి మాత్రమే అమ్ముడయ్యాయి. ఇంధనం ఖర్చులు పోను నాకు 800 రూపాయలు మిగిలాయి. ఒకప్పుడు జామ పంట ఇంత విరివిగా లేని ఈ ప్రాంతంలో, కొనేవాళ్ళే నా దగ్గరకు వచ్చి, నా తోటలో పళ్ళను కోసుకొని, కిలో రూ. 25 చొప్పున నాకు చెల్లించేవాళ్ళు. ఇప్పుడా రోజులు పోయాయి..."

తన ఎకరం మల్లె తోటలో మల్లె అంట్ల కోసం, పంటకు పొలాన్ని సిద్ధంచేయటం కోసం గణపతి సుమారు ఒక లక్ష రూపాయలు ఖర్చుచేస్తారు. మొక్కలపై పెట్టిన ఇంత పెట్టుబడి, ఆయనకు పదేళ్ళ వరకూ పూలనిస్తుంది. ప్రతి సంవత్సరం, సాధారణంగా మార్చి నుండి నవంబర్ వరకు, ఎనిమిది నెలలపాటు మల్లి పూల కాలం సాగుతుంది. మంచి రోజులు, గొప్ప రోజులు, మొగ్గలు లేనప్పుడు అసలు గడవని రోజులు కూడా ఉంటాయని గణపతి అంటారు. ఒక ఎకరం పొలంలో, పూలకాలంలో సరాసరిన నెలకు రూ. 30,000 నికర ఆదాయం వస్తుందని ఆయన అంచనా వేశారు.

ఈ లెక్కలన్నీ అతను ఇప్పుడున్నదానికంటే భాగ్యవంతుడన్నట్టు ధ్వనిస్తాయి. చాలామంది రైతులు చేసినట్టే ఆయన కూడా ఈ సాగుచేయడానికి అయ్యే ఖర్చులలో డబ్బులు చెల్లించని శ్రమను - ఆయనదీ, ఆయన భార్యదీ - లెక్కించరు. వాటికి కూడా లెక్కగడితే ఆ శ్రమశక్తి ఖరీదు ఎంతవుతుంది? "నా శ్రమకు రోజుకు రూ. 500, నా భార్యకు రూ. 300," అంటూ లెక్కగట్టారు. అతను దానిని పరిగణనలోకి తీసుకుంటే, ఆయన లెక్కవేసిన రూ. 30,000 లాభం కాస్తా కుదించుకుపోయి రూ. 6,000 నికర లాభంగా మిగులుతుంది.

అలా రావడానికి కూడా, "మీరు అదృష్టవంతులై ఉండాలి," అని ఆయన ఎత్తి చూపారు. అతని మోటారు షెడ్‌లోకి వెళ్ళాక, అది అదృష్టంతో పాటు కొన్ని రసాయనాలు అని కూడా మాకు తెలియవచ్చింది.

*****

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

గణపతి పొలంలో ఉన్న మోటార్ షెడ్. నేలపై పడివున్న వాడేసిన పురుగుమందుల సీసాలు, డబ్బాలు (కుడి)

మోటార్ షెడ్ ఒక చిన్న గది. గణపతిగారి కుక్కలు మధ్యాహ్నం వేళల్లో ఈ గదిలోనే నిద్రపోతాయి. ఆ గది మూలన కొన్ని కోళ్ళు కూడా ఉన్నాయి. మేమసలు అక్కడికి వెళ్ళగానే ఒక గుడ్డును చూశాం. గణపతి తనలో తాను నవ్వుకుంటూ దాన్ని తీసి జాగ్రత్తగా తన అరచేతిలో పట్టుకున్నారు. అక్కడ నేలమీదంతా చిన్న చిన్న పురుగుమందుల డబ్బాలూ సీసాలూ ఉన్నాయి. ఆ గది దాదాపు వాడేసిన రసాయనాల షోరూమ్‌లా కనిపిస్తోంది. మల్లె మొక్కలు పూలు పూయాలంటే - ' పళిచ్చు (తేటగా)' బలమైన బరువైన తెల్లని మల్లెమొగ్గలు, ఒక మంచి కొమ్మతో - ఇవన్నీ కావాలంటూ గణపతి మనకు ఓపిగ్గా వివరిస్తారు.

కొన్ని డబ్బాలను ఎత్తి పట్టుకుని, "దీన్ని ఇంగ్లిష్‌లో ఏమంటారు?" అని గణపతి నన్నడిగారు. ఒక దానివెంట ఒకటిగా నేను వాటి పేర్లన్నిటినీ చదివాను. "ఇది ఎర్ర నల్లిని చంపుతుంది, అది క్రిముల కోసం. ఇదుగో ఇది అన్ని తెగుళ్ళనూ నాశనం చేస్తుంది. అనేక తెగుళ్ళు మల్లె మొక్కలపై దాడిచేస్తాయి," గణపతి గుర్రుమన్నారు.

గణపతి కొడుకే ఆయన సలహాదారు. "అతను ఒక ‘ మరుందు కడై ’ (పురుగుమందుల దుకాణం)లో పనిచేస్తాడు," అతని మల్లెపూలలాగానే తెల్లగా మండిపోతోన్న ఎండలోకి నడుస్తుండగా చెప్పారతను. ఒక కుక్కపిల్ల తడిగా ఉన్న మన్నులో పొర్లాడుతోంది, దాని తెల్లటి బొచ్చు నెమ్మదిగా ఎర్రబడుతోంది. ఒక మట్టిరంగు కుక్క షెడ్డు దగ్గర తిరుగుతూవుంది. "వాటినేమని పిలుస్తారు?" అతన్ని అడిగాను. " కరుప్పు అని కేకవేయగానే పరుగెట్టుకుంటూ వస్తాయి," ఇకిలిస్తూ అన్నారతను. కరుప్పు అంటే తమిళంలో నలుపు అని అర్థం. ఆ కుక్కలు నల్లటివి కావు కదా అని నేనడిగాను.

"అయినాగానీ వచ్చేస్తాయి," గణపతి నవ్వుతూ మరో పెద్ద షెడ్ లోపలికి నడిచారు. అక్కడ కొబ్బరికాయలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. బాగా ముగ్గిపోయిన జామపళ్ళు ఒక బక్కెట్‌లో ఉన్నాయి. "మా ఆవు వీటిని తింటుంది. ఇప్పుడది ఆ పొలంలో గడ్డి మేస్తోంది," ముక్కులతో పొడుచుకుంటూ, పిల్లలను పిలుస్తూ, పరుగులు తీస్తోన్న కొన్ని నాటు కోళ్ళతో కలిసి.

తర్వాత, ఆయన నాకు కొన్ని ఎరువులను చూపించారు - దుకాణం నుంచి రూ. 800కు కొనుక్కొచ్చిన 'సాయిల్ కండిషనర్ (మట్టిని సమస్థితిలో ఉంచేవి)', గంధకపు గుళికలు, కొంత సేంద్రియ ఎరువు - ఒక పెద్ద తెల్లని కడవలో ఉన్నాయి. " కార్తిగై మాసం (కార్తీక మాసం- నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు)లో నాకు మంచి దిగుబడి కావాలి. అది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అప్పుడు మంచి ధర ఉంటుంది." బయట ఉన్న షెడ్డులోని గ్రానైట్ స్థంభానికి ఆనుకుంటూ, మంచిగా వ్యవసాయం చేయటంలోని రహస్యాన్ని చిరునవ్వు నవ్వుతూ చెప్పారు: "నువ్వు మొక్కని గౌరవించాలి. నువ్వలా చేస్తే, మొక్క కూడా నిన్ను గౌరవిస్తుంది

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

తన ప్రాంగణంలో, తన రెండు కుక్కలతో కలిసివున్న గణపతి. ఆ రెండు కుక్కలనూ కరుప్పు (నలుపు) అనే పిలుస్తారు. కుడి: తన ఆహారాన్ని పొడుచుకు తింటోన్న కోడి

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: ఒక ఎరువుల డబ్బా. కుడి: మల్లె మొక్కను ఆశించిన తెగుళ్ళను చూపిస్తోన్న గణపతి

గణపతి మంచి కథకుడు. అతనికి పొలాలంటే రోజూ ఏదో కొంత నాటకం ఉండే రంగస్థలాలు. "రాత్రి 9.45 గంటల సమయంలో ఆ వైపు నుంచి నాలుగు పందులు వచ్చాయి. అవి ముగ్గిన జామపళ్ళ వాసనకు ఆకర్షితులై వచ్చాయి. కరుప్పు ఇక్కడే ఉంది. అది ఆ పందులను చూసింది. వాటిలో మూడింటిని అది తరుముకుంది. ఇంకోటి ఆ పక్కకు పరుగెత్తింది," అతను తన చేతుల్ని మెయిన్ రోడ్డువైపుకు, అటువైపున్న గుడివైపుకు, చుట్టూ ఉన్న ఖాళీ పొలాలవైపుకు తిప్పుతూ చెప్పారు. "ఏం చేయగలం? ఇంతకుముందెప్పుడో జంతువులను చంపి తినే నక్కలుండేవి. ఇప్పుడవేవీ లేవు."

పందులు ఒక సమస్య ఎలాగో, చీడలూ అంతే. మల్లె తోట వెంటే తిరుగుతూ, కొత్తగా వస్తోన్న పూవులపై తెగుళ్ళు ఎంత వేగంగా, దుర్మార్గంగా దాడిచేస్తాయో గణపతి వివరించారు. తర్వాత చదరాలనూ, గుండ్రాలనూ గాలిలో గీసి చూపిస్తూ మొక్కలను ఏ కొలతలలో ఎలా నాటాలో వివరించారు. కొన్ని ముత్యాల తెలుపు మల్లెపూలను నా సంబరం కోసం కోసి ఇచ్చారు. ఆ సువాసన! "మదురై మల్లి అత్యుత్తమ సువాసనను కలిగివుంటుంది," అని ఆయన నొక్కిచెప్పారు.

నేనొప్పుకుంటాను. అది ఒక మాదక పరిమళం. చక్కగా తవ్విన, తుప్పురంగు మట్టిలో, కరకరలాడే కంకరను తొక్కుకుంటూ- అతని పొలమంతా నడవటం కూడా ఒక గౌరవమే. వ్యవసాయం గురించి విజ్ఞానంతోనూ, తన భార్య పిచ్చయమ్మ గురించి గౌరవంగానూ గణపతి మాట్లాడుతున్నారు. "మేం పెద్ద భూస్వాములం కాదు, మేమొక చిన్న సంసారులం . అలా కూర్చొని మనుషులకు పనులు పురమాయించే స్థితి కాదు మాది. పనివాళ్ళతో కలిసి నా భార్య కూడా పనిచేస్తుంది. మేం అలా జీవనం సాగిస్తున్నాం."

*****

మల్లెపూలు కనీసం 2000 సంవత్సరాలుగా ఈ భూమ్మీద మనుగడ సాగిస్తున్నాయి. వాటికి అసాధారణమైన చరిత్ర ఉంది. ఈ పువ్వు - దాని ఆకృతి, పరిమళాల వలన - ఒక దారంతో కలిపి మాల అల్లినంత సొగసుగా గతకాలపు తమిళంతో అల్లుకుపోయింది. సంగమ్ సాహిత్యంలో అనేక పూవులతో పాటు వందసార్లకు పైగా ఈ ముల్లై ప్రస్తావన _ ఆ కాలంలో మల్లెపూలను ముల్లై గా పిలిచేవారు - ఉన్నదని వైదేహి హెర్బర్ట్ చెప్తారు. ఈమె హవాయీలో నివాసముండే సంగమ్ తమిళ పండితురాలు, అనువాదకురాలు కూడా. వైదేహి క్రీ.పూ. 300 నుండి క్రీ. శ. 250 వరకూ రచించబడిన సంగమ్ కాలం నాటి మొత్తం 18 పుస్తకాలను ఆంగ్లంలోకి అనువాదం చేసి, ఉచితంగా చదువుకునేందుకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.

ముల్లై అనే పదం మల్లిగై అనే పదానికి మూల పదం అని ఆమె వివరిస్తారు. ఈ మల్లిగైని మనమిప్పుడు మల్లి గా పిలుస్తున్నాం. సంగమ్ కవిత్వంలో, ముల్లై అనేది ఐదు అంతర్గత ప్రకృతి దృశ్యాలలో ఒకటి - అగం తిణ్ణైలు - అడవులను, వాటిని ఆనుకుని ఉన్న భూములను సూచిస్తుంది. మిగిలిన నాలుగు కూడా పువ్వులు లేదా చెట్ల పేర్లతో ఉన్నాయి: కుఱింజి (పర్వతం), మరుదం (పొలాలు), నెయ్దల్ (సముద్ర తీరం), పాలై (నిర్జనమైన అడవి)

PHOTO • M. Palani Kumar

మదురై జిల్లా, ఉసిలంపట్టి తాలూకా నడుముదలైకుళం లోని పాండీకి చెందిన మల్లెతోటలోని మల్లె మొగ్గలు, పూలు

సంగమ్ రచయితలు "కవిత్వ ప్రభావాన్ని సాధించడానికి అగం===== తిణైలను ఉపయోగించారని వైదేహి తన బ్లాగు లో పేర్కొన్నారు." రూపకాలు, అనుకరణలు "నిర్దిష్ట ప్రకృతి దృశ్యంలోని అంశాల ఆధారంగా ఉంటాయి. వృక్షజాలం, జంతుజాలం, ఆ ప్రకృతి దృశ్యం కూడా ​​పద్యాల్లోని పాత్రల భౌతిక లక్షణాలను. భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి  ఉపయోగించారు." అని ఆమె వివరిస్తారు. ముల్లై రూపకంలో జతచేసిన ఆ పద్యాలలో ఇతివృత్తం, ‘ఓపికగా వేచి ఉండటం’. అంటే, నాయిక తన నాయకుడు ప్రయాణం నుండి తిరిగి వచ్చే వరకు వేచి ఉంటుంది.

ఐంగుఱునూఱు పద్యంలో, 2000 సంవత్సరాలు వెనక్కు వెళితే, తన స్త్రీ చక్కని లక్షణాలను గురించి ఆరాటపడే పురుషుడు కనిపిస్తాడు:

నెమలి నీలాగే నాట్యం చేస్తున్నట్టుగా
మల్లెలు సువాసనగా వికసించినట్లుగా
నీ నుదిటి పరిమళంలా,
ఒక లేడి నీవలె పిరికిగా చూస్తున్నట్లుగా,
నీ గురించి ఆలోచిస్తూ ఇంటికి పరుగెత్తాను,
నా అమ్మాయి, రుతుపవన మేఘం కంటే చురుకైనది.

సంగమ్ యుగం నాటి పద్యాల అనువాదకుడు, OldTamilPoetry.comని నడిపించే సెందిల్ నాథన్ నాకోసం మరో పద్యాన్ని కనుగొన్నారు. ఇది సంగమ్ కవిత్వంలో ప్రస్తావించిన ఏడుగురు గొప్ప పోషకులలో ఒకరైన నాయకుడు పారి ప్రసిద్ధ జ్ఞాపకార్థం చెక్కినది. అది చాలా పెద్ద పద్యమని సెందిల్ అన్నారు కానీ అందులోని ఈ నాలుగు వరసలు చాలా అందమైనవి, సందర్భానికి తగినట్టుగా ఉన్నవి.

...పారీ, విస్తారమైన యశస్సు గడించినవాడా
తన ఘనమైన గంటల రథాన్ని ఇచ్చిందెవరు
ఆసరా లేక అల్లల్లాడుతున్న మల్లె పూతీగెకు
అది ఎన్నటికీ అతనికై ప్రశంసాగీతాన్ని పాడలేనప్పటికీ…

పుఱనానూరు 200, 9-12వ వరస వరకు

ప్రస్తుతం తమిళనాడులో ఎక్కువగా సాగుచేస్తోన్న మల్లి రకం శాస్త్రీయ నామం జాస్మినమ్ సంబక్ . విడిపూల (అలంకరణకు ఉపయోగించే కట్‌ఫ్లవర్స్‌కు విరుద్ధంగా) సాగులో ఈ రాష్ట్రం దేశంలోనే ముందుంది. మల్లెల ఉత్పత్తి లో కూడా మొదటిదిగానే ఉంది. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం 2,40,000 టన్నుల మల్లెపూలలో 1,80,000 టన్నుల మల్లెలు తమిళనాడు నుంచే వస్తాయి.

భౌగోళిక గుర్తింపు పొందిన ఈ మదురై మల్లి కి అనేక ప్రత్యేక లక్షణాలున్నాయి. వాటిలో కొన్ని: 'చిక్కటి సువాసన, మందపాటి పూరేకులు, పొడవైన పూలకాడలు, మొగ్గలు ఆలస్యంగా పూలుగా వికసించటం, రేకుల రంగు అంత తొందరగా రంగు మారకపోవటం, నిలిచి ఉండే నాణ్యత (ఎక్కువకాలం వాడిపోకుండా ఉండటం).'

PHOTO • M. Palani Kumar

మల్లెపూవుపై వాలి మకరందాన్ని తాగుతోన్న సీతాకోకచిలుక

మిగిలిన మల్లెపూల పేర్లు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. మదురై మల్లి కాకుండా, గుండు మల్లి, నమ్మ ఊరు మల్లి, రామబాణం, మదనబాణం, ఇరువాచ్చి, ఇరువాచ్చిప్పూ, కస్తూరి మల్లి, ఊసి మల్లి, సింగిల్ మోగ్రా.

మదురై మల్లి కేవలం మదురైలోనే కాకుండా విరుదునగర్, తేని, దిండుక్కల్, శివగంగై వంటి జిల్లాలలో కూడా పెరుగుతోంది. తమిళనాడులోని మొత్తం సాగుభూమిలోని 2.8 శాతం భూమిలో అన్ని రకాల పూలను సాగుచేస్తుండగా, ఆ భూమిలో 40 శాతాన్ని ఈ మల్లెల సాగు ఒక్కటే ఆక్రమిస్తోంది. రాష్ట్రంలోని 13, 719 హెక్టార్లలో ఉన్న మల్లె తోటలలోని ప్రతి ఆరవ క్షేత్రం, అంటే మొత్తమ్మీద 1,666 హెక్టార్లు, ఈ మదురై ప్రాంతంలోనే ఉన్నాయి.

ఈ సంఖ్యలు కాగితంపై మనోహరంగా కనిపిస్తున్నప్పటికీ, వాస్తవానికి, ధరలలో ఉండే హెచ్చుతగ్గులు రైతును దించుకుపోయేలా చేస్తాయి, ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చెక్కించేస్తాయి. 'అత్తరు ' తయారీకోసం వాడే పూలకు నిలక్కోట్టై మార్కెట్‌లో పలికే కిలో ధర కనిష్ఠంగా 120 రూపాయలు మొదలుకొని, మాట్టుదావణి పూల మార్కెట్‌లో (సెప్టెంబర్ 2022, డిసెంబర్ 2021లలో) 3,000, 4,000 రూపాయలకు కూడా ఎగబాకింది. ఆకాశాన్నంటే ఈ ధరలు అసంబద్ధంగానూ, భరించలేనివిగానూ అనిపిస్తాయి.

*****

పూల సాగు ఒక జూదం, అదంతా సమయాన్ని బట్టి ఉంటుంది. "పండుగల కాలంలో నీ మొక్కలు పూలు పూశాయంటే, నీకు లాభాలొస్తాయి. లేదంటే, ఈ వృత్తిని చేపట్టడానికి ముందు నీ పిల్లలు రెండుసార్లు ఆలోచిస్తారు. అంతేగదా? తమ తల్లిదండ్రులు కష్టపడుతుండటాన్ని మాత్రమే పిల్లలు చూస్తారు, కదా?" మన జవాబు కోసం గణపతి ఆగరు. ఆయనిలా కొనసాగిస్తారు: "ఒక చిన్న రైతు పెద్ద రైతుతో పోటీ పడలేడు. ఒక పెద్ద తోటలో 50 కిలోల మొగ్గలను తెంచడానికి పనివాళ్ళు అవసరమైనవారు, వారికి ఓ పది రూపాయలు ఎక్కువ చెల్లించి, తమ వాహనంలో వారిని తీసుకువెళ్ళి, వారికి టిఫిన్ కూడా పెట్టిస్తారు. అదంతా మేం చేయగలమా?"

తన సాటి చిన్న రైతుల వలెనే ఇతను కూడా 'అడైక్కలమ్' పెద్ద వ్యాపారస్తులను ఆశ్రయిస్తుంటారు. "ముమ్మరమైన పూలకాలంలో నేను చాలాసార్లు - ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం - మార్కెట్‌కు పూల బస్తాలతో వెళ్తుంటాను. నా సరుకును అమ్మిపెట్టడానికి నాకు ఆ వ్యాపారుల సాయం అవసరం," గణపతి పేర్కొన్నారు. ఈయన మల్లెపూలను అమ్మిన ప్రతి రూపాయిలో ఆ వ్యాపారి 10 పైసలు తన కమీషన్‌గా తీసుకుంటాడు.

ఐదేళ్ళ క్రితం గణపతి పూకడై రామచంద్రన్ అనే ఒక పెద్ద మదురై పూల వ్యాపారి వద్ద కొన్ని లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. ఈ రామచంద్రన్ మదురై పూల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా. గణపతి ఆ అప్పును తన పూలను ఆ వ్యాపారికి అమ్మడం ద్వారా తీర్చారు. ఇటువంటి లావాదేవీలలో వ్యాపారి తీసుకునే కమిషన్ ఎక్కువగా ఉంటుంది. అది 10 శాతం నుంచి 12.5 శాతానికి పెరిగిపోతుంది.

చిన్న రైతులు ఇతర పెట్టుబడులతో పాటు పురుగు మందులను కొనడానికి కూడా తక్కువ కాలంలో తీర్చే అప్పులను తీసుకుంటుంటారు. మొక్కకూ తెగుళ్ళకూ మధ్య ఈ ఘర్షణ నిరంతరంగా ఉంటుంది. హాస్యాస్పదమేమిటంటే, రాగుల మాదిరిగానే పంట గట్టిగా ఉన్నప్పుడు కూడా, ఒక ఏనుగు వంటి చాలా పెద్ద జీవి పొలాలపై దాడి చేయగలదు. రైతులు తమ రాగుల పంటను కాపాడుకునే తెలివైన పరిష్కారాలను కనుక్కోవడానికి పోరాడుతున్నారు. ఇందులో విజయవంతం కానివారు అనేకమంది పూల సాగుకు మారారు. మదురైలోని పూల తోటలు పెంచే ప్రాంతాలలో, సాగుదారులు చిన్న జీవులతో పోరాడుతారు - మొగ్గ పురుగులు, సన్నదోమ, ఆకు గూడు పురుగులు, తవిటి పురుగు వంటివి. ఇవి రంగు మారిన పువ్వులను, దెబ్బతిన్న మొక్కలను, సర్వనాశనమైన రైతులను మిగులుస్తాయి.

PHOTO • M. Palani Kumar

మదురై జిల్లాలోని తిరుమల్ గ్రామంలో అనేక తెగుళ్ళు సోకిన తన మల్లె తోటలో పనిచేస్తోన్న చిన్నమ్మ

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ మొగ్గలు తెంపుతుంటారు. కుడి: తిరుమల్ గ్రామంలో మల్లె తోటల పక్కనే ఉన్న కబడ్డీ అడే మైదానం

గణపతి ఇంటికి కొద్ది ప్రయాణం దూరంలో ఉన్న తిరుమల్ గ్రామంలో ఒక పొలం మొత్తం నాశనమై ఉండటాన్ని చూశాం. ఆ పొలంతో పాటే వారి కలలు కూడా. ఆ మల్లి తోట్టమ్ (మల్లె తోట) 50 ఏళ్ళ ఆర్. చిన్నమ్మకూ, ఆమె భర్త రామర్‌కూ చెందినది. రెండేళ్ళ వయసున్న ఆ మొక్కలన్నీ మల్లెమొగ్గలతో తెల్లగా ఉన్నాయి. కానీ అవన్నీ "రెండవ రకం నాణ్యత ఉన్న పూలు. వాటికి చాలా తక్కువ ధర వస్తుంది," అని చిన్నమ్మ చెప్పారు. వాటికి రోగం తగిలింది. "ఆ మొగ్గలు విచ్చుకోవు; పెద్దగా కూడా కావు," అన్నారామె నిట్టూరుస్తూ, నాలుకని కటుక్కుమనిపిస్తూ, తల విదిలిస్తూ.

అయితే ఇందులోని శ్రమ కనికరంలేనిది. వృద్ధులు, చిన్న పిల్లలు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు - అందరూ మొగ్గలు తెంపుతారు. చిన్నమ్మ కొమ్మలను సున్నితంగా కదిలిస్తూ, మొగ్గల కోసం వెతుకుతూ, వాటిని తెంపి కండాంగి పద్ధతిలో కట్టుకున్న చీరలో వాటిని జారవిడుస్తూ మాతో మాట్లాడుతున్నారు. ఆమె భర్త రామర్ ఆ పొలాల్లో చాలా పురుగుమందులను ప్రయోగించారు. “అతను చాలా ‘ఘాటైన మందులు’ వాడాడు, అవి మామూలువి కావు. వాటి ధర లీటరు 450 రూపాయలు. కానీ ఏమీ పని చేయలేదు! ఇకపై డబ్బు వృధా చేయవద్దని షాపు యజమాని చెప్పే స్థితి వచ్చింది." రామర్ చిన్నమ్మతో చెప్పేశారు, “మొక్కలను పీకేద్దాం. 1.5 లక్షలు పోగొట్టుకున్నాం."

అందుకనే తన భర్త పొలంలో లేరని చిన్నమ్మ చెప్పారు. " వయిత్తెరిచ్చల్ ," అన్నారామె. అంటే దుఃఖం, ఈర్ష్యలతో కలిగే కడుపుమంట అని తమిళంలో అర్థం. "మిగిలినవాళ్ళకు ఒక కిలో మల్లెలకు రూ. 600 వస్తే మాకు రూ. 100 మాత్రమే వస్తాయి." కానీ ఆమె కోపం గానీ చిరాకు గానీ మొక్కల మీదికి పోవడంలేదు. ఆమె కొమ్మలను సున్నితంగా పట్టుకొని, కింద వున్న మొగ్గలను అందుకోవడానికి అవసరమైన మేరకు మాత్రమే వాటిని వంచుతున్నారు. "మాకు మంచి పంట పండినట్లయితే, ఒక పెద్ద మొక్కకున్న మొగ్గలను తెంపడానికే చాలా నిముషాలు పట్టేది. కానీ ఇప్పుడు..." వెంటనే పక్కనే ఉన్న మొక్క వేపుకు తిరుగుతూ అన్నారామె.

పంట దిగుబడి అనేక విషయాలపై ఆధారపడివుంటుంది, తన తువ్వాలును భుజం మీదకు వేసుకొని, చిన్నమ్మకు సాయంగా మొగ్గలు కోస్తూ అన్నారు గణపతి. "నేలను బట్టి, పెరుగుదలను బట్టి, ఆ రైతు నైపుణ్యాన్ని బట్టి అది మారుతుంటుంది. ఒక చిన్న బిడ్డను పెంచినట్టు దాన్ని పెంచాలి. నాకిది కావాలి, అది కావాలని పసిబిడ్డ అడగలేదు, అవునా? మనమే ముందుగా గ్రహించి వారికి అవసరమైనవి అందిస్తాం. మొక్కలు పసిబిడ్డలాగా ఏడవలేవు కూడా. కానీ నీకు అనుభవమ్మీద తెలుస్తుంది... అది జబ్బుగా ఉన్నా, రోగాలబారిన పడినా, చనిపోతున్నా." అన్నారు గణపతి.

ఈ తెగుళ్ళలో చాలావాటిని రసాయనాల మిశ్రమంతో 'నయం' చేయవచ్చు. సేంద్రియ పద్ధతిలో మల్లె తోటను పెంచడం గురించి నేనాయన్ని అడిగాను. ఆయనిచ్చిన జవాబు చిన్న రైతుల యెటూ తోచని స్థితిని తెలుపుతోంది. "చేయొచ్చు, కానీ అందులో మరిన్ని చిక్కులు ఇమిడివున్నాయి. సేంద్రియ వ్యవసాయ శిక్షణా తరగతులకు నేను హాజరయ్యాను. కానీ అలా పండించినందుకు మరింత మెరుగైన ధరను ఎవరిస్తారు?" ఆయన సూటిగా ప్రశ్నించారు.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: ఆరోగ్యంగా ఉన్న మల్లెమొక్కల మధ్యనున్న చనిపోయిన మొక్క. కుడి: ఒక తట్టలో మల్లెమొగ్గలు, ఒక పడి (కొలత). పనివాళ్ళు కోసిన మొగ్గలను ఈ పడితో కొలిచి, దాన్ని బట్టి వారికి కూలిని చెల్లిస్తారు

PHOTO • M. Palani Kumar

కలిసిమెలిసి మల్లెమొగ్గలు తెంపే యజమానులు, కూలివారు. కబుర్లు చెప్పుకుంటూ, పాటలు వింటూ, మొగ్గలు పూలుగా విచ్చుకోకముందే వాటిని మార్కెట్‌కి తీసుకువెళ్ళడానికి కాలంతో పోటీ పడుతున్నారు

"రసాయనిక ఎరువులు మంచి మెరుగైన దిగుబడినిస్తాయి. అది చాలా సులభం కూడా. సేంద్రియమంటే అదొక పీకులాట, గందరగోళం- పదార్థాలన్నిటినీ ఒక తొట్టెలో నానబెట్టి ఆ ద్రావణాన్ని జాగ్రత్తగా పిచికారీ చేయాలి. ఇంతా చేసి అంగడికి తీసుకుపోతే ధరలో ఏం తేడా ఉండదు! ఇది చాలా విచారించాల్సిన సంగతి, ఎందుకంటే సేంద్రియ మల్లె పెద్దదిగానూ కాంతివంతంగానూ ఉంటుంది. అయినా అది మరింత మెరుగైన ధరను పొందలేకపోతే - రెట్టింపు ధర అనుకోండి - నేను చేసే కృషికీ, వెచ్చించే సమయానికీ విలువ లేకుండా పోతుంది."

తన ఇంటి వాడకానికి ఆయన సేంద్రియ కూరగాయలనే పెంచుతారు. "మాకోసం, పెళ్ళి చేసుకొని మా పక్క గ్రామంలోనే నివాసముంటోన్న మా అమ్మాయికోసం మాత్రమే. నాక్కూడా రసాయనాల నుంచి దూరం తొలగాలని ఉంది. వాటి వలన అనేక దుష్ప్రభావాలు ఉంటున్నాయని అందరూ చెప్తున్నారు. ఘాటైన పురుగు మందులతో ఎక్కువకాలం గడపడం వలన మన ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుసు. కానీ ఇంకో అవకాశమేముంది?"

*****

గణపతి భార్య పిచ్చయమ్మకు కూడా వేరే గత్యంతరమేమీ లేదు. ఆమె రోజంతా పని చేస్తూనే ఉంటారు. ప్రతి రోజూ. ఎన్నడూ చెదరని విశాలమైన నవ్వు ఆమె జీవన రహస్యం. అది ఆగస్టు 2022 చివరిపాదం. వారి ఇంటికి PARI వెళ్ళటం ఇది రెండవసారి. ఇంటిముందు వేప చెట్టు చల్లని నీడకు వేసివున్న మంచమ్మీద కూర్చొని ఆమె తన పని దినం గురించి వివరిస్తున్నారు.

"ఆడ పాక్కా, మాడ పాక్కా, మల్లిగపు తోట్టం పాక్క, పూవ పరిక, సామైక, పుల్లైగాల అన్నుపివిడ.. .(మేకలను, ఆవులను, మల్లె తోటలను చూసుకోవడం; మల్లి మొగ్గలను కోయటం; వంట చేయటం, పిల్లలను బడికి పంపించడం...) ఇదంతా గుక్కతిప్పుకోకుండా చెప్పుకొచ్చిన జాబితా.

ఇంత విరామం లేకుండా పనిచేయడమంతా పిల్లల కోసమే అంటారు పిచ్చయమ్మ (45). "నా కొడుకూ కూతురూ బాగా చదువుకున్నారు. ఇద్దరూ డిగ్రీలు పొందారు." ఆమె ఎన్నడూ బడికి వెళ్ళలేదు. చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి తన తల్లిదండ్రుల పొలంలోనూ, ఇప్పుడు తన పొలంలోనూ పని చేస్తూనే ఉన్నారు. ఆమె చెవుల్లోనూ ముక్కుకూ కొన్ని నగలు ధరించారు, మెడలో తాళి ఉన్న పసుపుతాడు (మంగళసూత్రం) ఉంది.

మేం ఆమెను కలుసుకున్న రోజున ఆమె మల్లెతోటలో కలుపు తీస్తున్నారు. అది చాలా కష్టమైన పని - ఎర్రటి ఎండలో పనిచేస్తున్నంతసేపూ ముందుకు వంగి చిన్న చిన్న అడుగులతో జరుగుతూ పనిచేయాలి. ఇప్పుడు మాత్రం ఆమె తన అతిథులమైన మాకోసం హైరానాపడుతున్నారు. "దయచేసి ఏదైనా తినండి," అంటారామె. గణపతి మాకోసం మంచి కండగలిగిన తాజా జామ పండ్లనూ, లేత కొబ్బరి నీళ్ళనూ తీసుకొచ్చారు. మేం వాటిని తింటూ తాగుతుండగా, గ్రామంలోని చదువుకున్నవారూ, యువకులూ నగరానికి వెళ్ళిపోతున్నారని వివరించారు. ఇక్కడి భూమి ఎకరం 10 లక్షలకు తక్కువ కాకుండా ధర పలుకుతుంది. అదే ప్రధాన రహదారికి దగ్గరగా ఉన్న పొలమైతే ఇంతకు నాలుగు రెట్ల ధర పలుకుతుంది. "తర్వాత అది ఇళ్ళ 'ప్లాట్లు'గా అమ్ముడవుతుంది."

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

తన రోజు గురించి నాతో చెబుతోన్న పిచ్చయమ్మ. మల్లె తోటలో తమ గ్రామానికే చెందిన ఒక కూలీ (కుడి)తో కలిసి కలుపు మొక్కలు తొలగిస్తున్న పిచ్చయమ్మ

సొంత భూమి కలిగివున్న వారిలో కూడా తమ సొంత 'ఉచిత' శ్రమను పెడితేనే లాభానికి ఎంతో కొంత గ్యారంటీ ఉంటుంది. ఇందులో మహిళలదే ఎక్కువ శ్రమ అని గణపతి గుర్తిస్తారు. ఇదే పని వేరొకరి పొలంలో చేస్తే మీకెంత కూలి దొరుకుతునదని నేను పిచ్చయమ్మను అడిగాను. "300 రూపాయలు," అని ఆమె జవాబిచ్చారు. అందులో ఇంటికోసం గానీ పశుపెంపకంలోగానీ ఆమె పడే శ్రమను కలపలేదు.

"మీరు మీ కుటుంబానికి 15,000 రూపాయలు పొదుపు చేశారని అనుకోవచ్చు కదా?" అని నేనడిగాను. ఆమె, గణపతి కూడా వెంటనే ఒప్పుకున్నారు. ఆ డబ్బుని ఆమెకు తిరిగి ఇవ్వాలని నేను తమాషాకి అన్నాను. అందరూ నవ్వారు, పిచ్చయమ్మ మరీ చాలాసేపు నవ్వారు.

ఆ తర్వాత సన్నగా నవ్వుతూ, సూటిగా చూస్తూ ఆమె నా కూతురి గురించీ, ఆమె పెళ్ళికి నేను ఎంత బంగారం ఇవ్వబోతున్నానో అనేదాని గురించీ అడిగారు. "ఇక్కడ మేం 50 సవర్ల బంగారం ఇస్తాం. మనవరాలు పుడితే ఒక బంగారు గొలుసు, వెండి పట్టీలు బహుమతిగా ఇస్తాం; ఆమెకు చెవులు కుట్టినపుడు విందు చేయడం కోసం ఒక మేకను ఇస్తాం; ఇలా అది సాగుతూనే వుంటుంది. ఇదంతా మా సంపాదనలోంచే వస్తుంది. ఇప్పుడు చెప్పండి, నాకు జీతం తీసుకునేంత స్తోమత ఉందా?"

*****

జీతం రావడమనేది మంచిదేననీ, అవసరమనీ, వ్యవసాయానికి సహాయకంగా ఉంటుందనీ- ఆ సాయంత్రం నేనొక మల్లెలు సాగుచేసే యువ రైతు ద్వారా తెలుసుకున్నాను. అది పనిభారాన్ని రెట్టింపు చేసినప్పటికీ, స్థిరమైన ఆదాయం ఉండటమనేది ఒక ముఖ్యమైన నిశ్చింత. ఆరేళ్ల క్రితం మదురై జిల్లా, ఉసిలంపట్టి తాలూకా లోని నడుముదలైకుళం కుగ్రామంలో వరి పండించే రైతులు జయబాల్, పోదుమణిల నుండి నేను ఇదే తర్కం విన్నాను. ఈ పర్యటనలో, ఆగస్ట్ 2022లో, జయబాల్ తన చిన్ననాటి స్నేహితుడు, ఆర్థికశాస్త్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న ఎమ్. పాండీని నాకు పరిచయం చేశారు. ఈయన తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (TASMAC)లో పూర్తికాల ఉద్యోగం చేస్తున్నారు. రాష్ట్రంలో తయారైన విదేశీ మద్యం (ఐఎంఎఫ్ఎల్) అమ్మడానికి ఒక్క ఈ సంస్థకే హక్కులున్నాయి.

నలబై ఏళ్ళ పాండీ మొత్తంగా రైతు కాదు. గ్రామం నుండి పది నిముషాల ప్రయాణం దూరంలో ఉన్న అతని పొలాల వైపుకు వెళ్తుండగా మాకు ఆయన తన కథ చెప్పటం మొదలెట్టారు. మా చుట్టుపక్కలంతా మైళ్ళకొద్దీ పచ్చదనం వ్యాపించి ఉంది- కొండలు, నీటి తావులు, తెల్లని మల్లె మొగ్గల మెరుపులు.

PHOTO • M. Palani Kumar

అందమైన నడుముదలైకుళం కుగ్రామంలోని తన మల్లె తోటలలో పాండీ. ఇక్కడ అనేక మంది రైతులు వరిని కూడా పండిస్తారు

"నా చదువు పూర్తి అవగానే, 18 ఏళ్ళ క్రితం నేను TASMACలో చేరాను. నేనింకా అక్కడే పనిచేస్తున్నాను. ఉదయం వేళల్లో నా మల్లెతోటలకు వస్తుంటాను. 2016లో అప్పుడు కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి, ఎ ఐఎడిఎంకె అధినేత్రి జె. జయలలిత TASMAC పనివేళలను 12 నుంచి 10 గంటలకు తగ్గించారు. ఆమె గురించి మాట్లాడినప్పుడల్లా పాండీ, 'మన్బుమిగు పురచ్చి తలైవి అమ్మ అవర్‌గళ్ ' (పూజ్యనీయులైన విప్లవనాయకి, అమ్మ) అని నమ్రతతోనూ గౌరవంగానూ మాట్లాడుతున్నారు. ఆమె నిర్ణయం అతని ఉదయపు వేళలను స్వేచ్ఛగా చేసింది. అతనిప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు (ఉదయం 10 గంటలకు బదులు) పనిలోకి వెళ్తారు. ఆ మిగిలిన రెండు గంటలను ఆయన తన భూమికే అంకితం చేశారు.

తన మల్లె తోటలో పురుగుమందును పిచికారీ చేస్తూ పాండీ తన వృత్తుల గురించి స్పష్టంగానూ, నిశ్చయంతోనూ మాట్లాడారు. "చూడండి, నేనొక ఉద్యోగిని. అదేసమయంలో ఒక పదిమంది పనివాళ్ళకు నా పొలంలో పనిని కల్పిస్తున్నాను కూడా," అతని గొంతులో గర్వం తొణికిసలాడుతోంది. అయితే అది వాస్తవికతతో పదునెక్కిన గర్వం. "కానీ ఇప్పుడు, నీకు సొంత భూమి ఉంటేనే నువ్వు సాగు చేయగలవు. పురుగు మందులు వందలాది రూపాయలకు, చివరకు వేల రూపాయలకు కూడా కొనాల్సివస్తుంది. నాకు జీతం వస్తుంది కాబట్టి, నేను కొనగలుగుతున్నాను. లేకపోతే, సాగుచేయటమంటే చాలా చాలా కష్టమైన పని."

మల్లెపూల సాగు మరింత కష్టమైనదని అతను పేర్కొన్నారు. అదీగాక నీ జీవితాన్ని ఆ మొక్కలచుట్టూ యేర్పాటు చేసుకోవాల్సివుంటుంది. "నువ్వు ఎక్కడికీ వెళ్ళలేవు; నీ ఉదయపు వేళలన్నీ మొగ్గలు తెంపి అంగడికి తీసుకువెళ్ళటానికే అంకితమవుతాయి. దాంతోపాటు, ఈరోజు నీకు ఒక్క కిలో మొగ్గలే దొరకవచ్చు. వచ్చే వారం అది 50 కిలోలు కావచ్చు. దేనికైనా నువ్వు సిద్ధపడాల్సి ఉంటుంది!"

పాండీ తాను పెంచే ఒక ఎకరం మల్లె తోటలో కొంచం కొంచంగా మల్లె మొక్కల సంఖ్యను పెంచుకుంటూ పోయారు. రైతు మల్లె మొక్కల చుట్టూతా అనేక గంటలు గడుపుతూ తిరగాలి. "నేను నా పని నుండి అర్ధరాతి అవుతుండగా ఇంటికొచ్చాను. పొద్దున్నే 5 గంటలవుతుండగా ఇక్కడ పొలంలో ఉన్నాను. మా ఇద్దరు పిల్లలను బడికి పంపించిన తర్వాత నా భార్య కూడా ఇక్కడకు వస్తుంది. మేం సోమరిగా నిద్రపోతే, నేను వజయం సాధించగలిగేవాడినా? ఒక పదిమందికి పని ఇవ్వగలిగేవాడినా?"

మొత్తం ఎకరం తోటంతా పూర్తిగా పూతకొచ్చిందంటే - పాండీ తన చేతులను ఉపయోగించి పూలు నిండుగా పూయడాన్ని చూపెడుతూ - “అప్పుడు మీకు 20-30 మంది కూలీలు అవసరమవుతారు.” ప్రతి ఒక్కరికి నాలుగు గంటల - ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు - పనికి 150 రూపాయలు చెల్లిస్తారు. పూత తగ్గిపోయి కేవలం ఒక కిలో మొగ్గలే తెగేది ఉంటే పాండీ, అతని భార్య శివగామి, వారి ఇద్దరు పిల్లలు వాటిని తెంపుతారు. "ఇతర ప్రాంతాలలో ధరలు తక్కువగా ఉండవచ్చు, కానీ ఇది వరి పండే పొలాలతో కూడిన సారవంతమైన ప్రాంతం. కూలీలకు ఇక్కడా బాగా గిరాకీ ఉంది. మీరు వారికి బాగా డబ్బు చెల్లించాలి, వారికి టీ, వడై (వడలు) తెప్పించాలి..."

వేసవి నెలల్లో (ఏప్రిల్, మే నెలలు) మల్లెలు ధారాళంగా పూస్తాయి. "40-50 కిలోల వరకూ వస్తాయి. ధరలు మాత్రం చాలా తక్కువగా, కొన్నిసార్లు కిలో మొగ్గలకు 70 రూపాయలు మాత్రమే వస్తాయి. దేవుడి దయవలన ఇప్పుడు 'అత్తరు ' కంపెనీలు ధరలు పెంచి, కిలో మల్లెలకు 220 రూపాయలు ఇస్తున్నారు." అంగడిలో టన్నులకొద్దీ పూలు ఉన్నపుడు ఇదే రైతులకు దక్కే ఉత్తమ ధర. ఆ ధర నీకు నష్టాన్ని గానీ లాభాన్ని గానీ తీసుకురాదని పాండీ చెప్పారు.

PHOTO • M. Palani Kumar

పురుగుమందు, ఎరువు కలిసిన మిశ్రమాన్ని తన మల్లెమొక్కలకు జల్లుతోన్న పాండీ

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

మల్లె అంట్ల వరసల మధ్య నడుస్తోన్న గణపతి. కుడి: తమ ఇంటి ముందర, పిచ్చయమ్మ

ఈయన తన మల్లెలను అక్కడికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో పొరుగునున్న దిండిక్కల్ జిల్లాలోని నిలక్కోట్టై అంగడికి తీసుకువెళ్తారు. "మాట్టుదావణిలో - అది గొప్పదే, నన్ను తప్పుగా అనుకోకండి - మనం కిలోల లెక్కన అమ్మాల్సివుంటుంది. నిలక్కోట్టైలో సంచీల లెక్కన అమ్ముతాం. వ్యాపారి కూడా దగ్గరలోనే కూర్చొని ఉంటాడు. అనుకోని ఖర్చులకు. పండుగలకు, కొన్నిసార్లు పూల మీద చల్లే రసాయనిక ఎరువుల కోసం ఆ వ్యాపారి నీకు ముందస్తుగానే డబ్బులిస్తాడు."

పిచికారీ చేయటమే కీలకం- షార్ట్సు, గీతలున్న టీ చొక్కాలోకి మారుతూ అన్నారు పాండీ. మల్లెపూలను ఇష్టపడేవారు అనేకమంది. అది అనేక పురుగులను ఆకర్షిస్తుంది. ఇంట్లోనే పురుగుమందుల విషయంలో నిపుణుడైన కొడుకున్న గణపతిలా కాకుండా, పాండీ తానే దుకాణానికి వెళ్ళి కావలసిన రసాయనాలను కొనుగోలు చేస్తారు. నేలమీద పడివున్న వాడేసిన డబ్బాలనూ సీసాలనూ చూపిస్తూ షెడ్డు లోపలి నుండి ఒక టాంకునూ, పిచికారీ చేసే సాధనాన్నీ బయటకు తీసుకువచ్చారు పాండీ. అందులో రోగోర్ (పురుగుమందు)ను, ఆస్తా (ఒక ఎరువు)ను నీళ్ళతో కలిపారు. తన ఎకరం పొలంలో ఒక్కసారి పిచికారీ చేయడానికి అతనికి 500 రూపాయలు ఖర్చవుతాయి. అతనిలా నాలుగైదు రోజులకొకసారి చేస్తారు. "మొగ్గలు దండిగా వచ్చే కాలంలోనైనా, తక్కువగా వచ్చే కాలంలోనైనా ఇలా పిచికారీ చేయాల్సిందే. ఇంకో మార్గం లేదు..."

ముక్కుకు అడ్డంగా ఒక గుడ్డను మాత్రమే కట్టుకొని, సుమారు 25 నిముషాల పాటు తన మొక్కలను పురుగుమందు, ఎరువులు కలిపిన నీటితో తడిపారు పాండీ. వీపుకు బరువైన టాంకును తగిలించుకొని, గుబురుగా ఉన్న పొదల మధ్య తిరుగుతూ, పిచికారీ గొట్టంలోంచి వచ్చే ద్రావణం ప్రతి ఆకును, మొక్కను, పువ్వును, మొగ్గను తడిపేలా చూశారు. ఆ మొక్కలు అతని నడుము భాగం వరకూ వచ్చాయి; సన్నటి తుంపరలు అతని మొహానికి తగులుతున్నాయి. ఆ యంత్రం చాలా శబ్దం చేస్తోంది, రసాయనాల తేమ గాలిలో తేలియాడుతోంది. పాండీ నడుస్తూ, డబ్బాను నింపుకోవడానికి మాత్రమే ఆగుతూ, అది నిండగానే పిచికారీ చేస్తూపోతున్నారు.

తర్వాత స్నానం చేసి తన మామూలు తెల్ల చొక్కా, నీలి రంగు లుంగీలోకి మారిన తర్వాత, రసాయనాలకు వెల్లడికావటం గురించి అతనిని అడిగాను. "నువ్వు మల్లెల సాగులోకి దిగాక, దానికి ఏది అవసరమో అది నువ్వు చేయాల్సిందే. (పిచికారీ) చేయాలని నీకు లేకపోతే, నువ్విక ఇంటిదగ్గర కూర్చోవచ్చు," ప్రార్థన చేస్తున్నట్లుగా అరచేతులను దగ్గరగా తీసుకుంటూ నెమ్మదిగా చెప్పారతను.

మేం తిరిగివచ్చేటపుడు గణపతి కూడా అదే విషయం చెప్పారు. నా చేతి సంచీని జామకాయలతో నింపి, ప్రయాణం మంచిగా జరగాలని కోరుకుంటూ, మళ్ళీ ఓసారి రావాలంటూ మాకు వీడ్కోలు చెప్పారు. "వచ్చేసారికి ఈ ఇల్లు సిద్ధం అవుతుంది," తన వెనుకనున్న సిమెంటు పూతపూయని ఇటుకరాతి ఇంటిని చూపిస్తూ అన్నారతను. "మనం అప్పుడు ఇక్కడ కూర్చొని మంచి విందు భోజనం చేద్దాం."

పాండీ, గణపతిలు వేలమంది మల్లెలు సాగుచేసే రైతులలాగే తమ ఆశలను, కలలను - ఒక చిన్న తెల్లని పువ్వుపై, ఒక మాదక సుగంధంతో, ఆదరణీయమైన గతంతో, ఒకోసారి జోరుగానూ, మరోసారి ఒడిదుడుకులతోనూ సాగే వ్యాపారంతో, ఐదు నిమిషాల్లోనే వేల రూపాయలు, కిలోలకొద్దీ చేతులు మారే మదురై మల్లి పై - పెట్టుకున్నారు.

కానీ అదంతా మరో రోజు కథ.

ఈ పరిశోధనా అధ్యయనానికి అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం తన పరిశోధనా నిధుల కార్యక్రమం 2020లో భాగంగా నిధులు సమకూరుస్తోంది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Aparna Karthikeyan

Aparna Karthikeyan is an independent journalist, author and Senior Fellow, PARI. Her non-fiction book 'Nine Rupees an Hour' documents the disappearing livelihoods of Tamil Nadu. She has written five books for children. Aparna lives in Chennai with her family and dogs.

Other stories by Aparna Karthikeyan
Photographs : M. Palani Kumar

M. Palani Kumar is Staff Photographer at People's Archive of Rural India. He is interested in documenting the lives of working-class women and marginalised people. Palani has received the Amplify grant in 2021, and Samyak Drishti and Photo South Asia Grant in 2020. He received the first Dayanita Singh-PARI Documentary Photography Award in 2022. Palani was also the cinematographer of ‘Kakoos' (Toilet), a Tamil-language documentary exposing the practice of manual scavenging in Tamil Nadu.

Other stories by M. Palani Kumar

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli