సోహన్ సింగ్ టీటాకు ఉన్న దేనికీ వెరువని స్వభావం నేలమీదా నీళ్లలోనూ అనేక ప్రాణాలను కాపాడటానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా ఆయన, భులే చక్ గ్రామం వీధుల్లోనూ, ఆ చుట్టుపక్కలా పొగ, ధూళి కమ్మిన మేఘాల మధ్య నుండి వస్తూ కనబడతారు. కూరగాయలను అమ్మటానికి తన మోటర్ సైకిల్ మీద ఆయన స్వారీ చేస్తూ వస్తుంటే దేవుడు ప్రత్యక్షమైనట్లే ఉంటుంది. కానీ మునక ఈతలో ఆయనకున్న ప్రావీణ్యం వల్లనే ఆయన అందరికీ తెలుసు. ప్రజలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చటానికి సోహన్ పంజాబ్ రాష్ట్రం, గుర్‌దాస్‌పుర్ జిల్లాలోని తన గ్రామానికి దగ్గరలో ఉన్న పంట కాలవలలోకి తరచుగా దూకుతుంటారు.

“నీటిలో మునిగిపోతున్న ప్రజలను కాపాడటం నా పని కాదు, నేనలా చేస్తానంతే,” అంటారు 42 ఏళ్ళ సోహన్. అతనాపనిని గత 20 సంవత్సరాల నుండి చేస్తున్నారు. “మీరు ‘నీళ్ళే ప్రాణం’ అనుకుంటుంటారు. కానీ నిజ అర్థంలో అది మరణం అవటాన్ని నేను ఒక వెయ్యిసార్లు చూశాను,” సంవత్సరాల తరబడి తాను నీటి నుంచి బయటకు తీసిన శవాల సంఖ్యను ఎత్తి చూపుతూ అంటారు సోహన్.

కాలువలో ఎవరైనా పడినపుడు రక్షించటానికో, లేదా శవాన్ని బయటకు తీయటానికో గుర్‌దాస్‌పుర్, దాని పక్కనే ఉండే పఠాన్‌కోట్ జిల్లాలలో మొట్టమొదటిగా పిలిచేవారిలో సోహాన్ ఉంటారు. ఆ మనిషి ప్రమాదవశాత్తు నీటిలో పడ్డాడా లేక ఆత్మహత్య చేసుకొని మరణించాడా అనే విషయం తెలుసుకోవటానికి వేచి ఉండకుండానే, “ఎవరైనా నీటిలో పడ్డారని తెలియగానే నేను నీళ్లలోకి ప్రవేశిస్తాను. ఆ మనిషిని సజీవంగా పట్టుకోవాలనుకుంటాను,” అంటారు సోహన్. కానీ వారు చనిపోయి దొరికితే, “బంధువులు చివరిసారి వారి ముఖం చూడాలనుకుంటాను” అని నెమ్మదిగా అంటారు. అప్పుడాయన మాటలు వెయ్యి ప్రాణాలు పోయిన వేదనతో నిండి ఉంటాయి.

సోహన్ ప్రతి నెలా కాలువల నుండి రెండు మూడు శవాలను బయటకు తీస్తుంటారు. “జీవితం ఒక పెద్ద తుఫానులాంటిది” అనే వేదాంతధోరణిలో ఆయన తన అనుభవాలకు అర్థం చెబుతారు. “ఒక్క క్షణంలోనే మొదలయ్యి, అంతలోనే ముగిసిపోయే చక్రం అది” అని నాతో చెప్తారాయన..

PHOTO • Amir Malik

తన మోటార్ సైకిల్‌కు కూరగాయల బండిని తగిలించుకుని, గుర్‌దాస్‌పుర్ జిల్లాలోని భులే చక్ గ్రామం, దాని చుట్టుపక్కల ప్రదేశాలలో తిరిగుతున్న సోహన్ సింగ్ టీటా

భులే చక్ గ్రామం సమీపంలోని కాలువలు ఎగువ బారీ దోఆబ్ కాలువకున్న (UBDC) 247 ఉప కాలువల సమూహానికి చెందినవి. ఈ ఉప కాలువలు రావి నది నుండి పంజాబ్‌లోని గుర్‌దాస్‌పుర్, పఠాన్‌కోట్‌తో సహా అనేక జిల్లాలకు నీటిని తీసుకొని వెళతాయి. చారిత్రాత్మక ప్రాముఖ్యం గలిగిన జలాశయమైన ఈ కాలువల వ్యవస్థ రావి, బియాస్ నదుల మధ్య ఉన్న బారీ దోఆబ్ ప్రాంతానికి నీటిని సరఫరా చేస్తుంది. (‘ దోఆబ్ అంటే రెండు నదుల మధ్యనున్న భూమి అని అర్థం)

ఇప్పటి ఈ కాలువకు 17వ శతాబ్దంలో మొఘల్ రాజు షా జహాన్ నిర్మించిన ప్రాచీన రూప మూలాలు ఉన్నాయి. తరువాత కాలంలో మహారాజా రంజిత్ సింగ్ పాలనలో ఈ కాలువను విస్తరించారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని పంట కాలువగా అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఈ UBDC దోఆబ్ జిల్లాల గుండా ప్రవహిస్తూ, 5.73 లక్షల హెక్టార్ల భూమిని సస్యశ్యామలం చేయగలుగుతోంది..

భులే చుక్ ప్రజలు ఈ కాలువను బడీ నహర్ (పెద్ద కాలువ) అని పిలుస్తారు. ఈ జల ప్రవాహం దగ్గర పెరిగిన సోహన్‌కు ఈ కాలువల దగ్గర సమయాన్ని గడిపే అలవాటు చాలా సహజంగానే అబ్బింది. “నా స్నేహితులతో కలిసి ఈత కొట్టేవాణ్ణి. మేమప్పుడు పిల్లలం. కాలువలు, ప్రవాహాలు ఎంత ఘాతుకంగా మారగలవో అనే విషయం మాకసలు పట్టేదే కాదు.” అన్నారు సోహన్.

అతను మొట్టమొదటిసారి 2002లో ఒక శవం కోసం కాలువలో ప్రవేశించే సాహసం చేశారు. కాలువలో మునిగిపోయిన ఒకరిని వెతకమని గ్రామ సర్పంచి అతనిని ఆదేశించాడు. “నేను శవాన్ని పట్టుకొని ఒడ్డుకు తెచ్చాను. అతనొక పిల్లవాడు. అతని శవాన్ని నేను చేతుల్లో మోస్తుండగానే, నీటితో నా బాంధవ్యం శాశ్వతంగా మారిపోయింది. ఆ నీళ్లూ, నా హృదయం- రెండూ బరువెక్కాయి. ప్రతి జలాశయం- నది, కాలువ, సముద్రం, మహాసముద్రం- బలిని కోరతాయని నాకారోజు అర్థం అయ్యింది. అది ప్రాణాన్ని కోరుతుంది,” అన్నారు సోహన్. “కాదంటారా?”

తన గ్రామానికి 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న బటాలా, ముకేరియా, పఠాన్‌కోట్, తిబ్‌డీలకు చెందిన ప్రజలు అతని సేవల కొరకు వస్తారు. దూరప్రాంతాల నుండి పిలిచినపుడు, సోహన్ ఎవరిదైనా బండి ఎక్కి వెళతారు. లేదంటే కూరగాయల బండితో సహా తన మోటార్ బైక్‌నే ప్రమాద స్థలం వరకూ నడిపిస్తారు.

PHOTO • Amir Malik
PHOTO • Amir Malik

ఎడమ: కూరగాయలను అమ్మటం ఒక్కటే సోహన్ ఆదాయవనరు. కుడి: భులే చక్‌కు 2 కిలోమీటర్ల దూరంలోని తిబ్‌డీ దగ్గరున్న ఎగువ బారీ దోఆబ్ కాలువ

తాను రక్షించిన వారి బంధువులు, లేక చనిపోయిన వ్యక్తుల బంధువులు తనకు ఒక్కోసారి రూ. 5000 నుండి 7000 వరకూ ఇస్తామంటారని సోహన్ చెప్పాడు. కానీ అతనికి డబ్బు తీసుకోవటం ఇష్టం ఉండదు. కూరగాయలు అమ్మటం వలన రోజుకు 200-400 రూపాయల వరకూ వచ్చే ఆదాయమే అతనికున్న ఒకే ఒక ఆర్థిక వనరు. అతనికి ఎలాంటి భూమీ లేదు. 8 సంవత్సరాల క్రితం భార్యతో విడాకులు తీసుకొన్న తరువాత, అతని 13 సంవత్సరాల కూతురుకు అతనే తల్లీ, తండ్రి. 62 సంవత్సరాల తల్లిని కూడా అతనే చూసుకుంటారు.

ఒక్కోసారి ప్రమాదం అనుకోని చోట్ల దాగి ఉంటుందని సోహన్ చెప్పారు. మూడు సంవత్సరాల క్రితం ఒక మహిళ తిబ్‌డీ దగ్గరి(భులే చక్ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో) కాలువలో దూకటం చూసిన ఘటనను సోహన్ గుర్తు చేసుకున్నారు. చూసిన వెంటనే ఆయనా దూకేశారు. “ఆమెకు 40 ఏళ్ల పైనే ఉంటాయి. ఆమె నన్ను తనను రక్షించనీయలేదు. నన్ను పట్టుకొని కిందకు లాగటం మొదలుపెట్టింది,” సోహాన్ చెప్పారు. ఒక ప్రాణాన్ని కాపాడటానికి జరిగిన ఆ 15-20 నిమిషాల పోరాటంలో, అతను ఆమె జుట్టు పట్టుకొని బయటకు లాగారు. “అప్పటికి ఆమె స్పృహతప్పిపోయింది.”

సోహన్ నైపుణ్యం లోతు నీటిలో ఊపిరి ఎక్కువకాలం బిగపట్టే సామర్థ్యంలో ఉంది. “నేను 20-30 ఏళ్ల మధ్య వయసులో ఉన్నపుడు నీటిలో నాలుగు నిమిషాలు ఊపిరి బిగపట్టగలిగేవాడిని. అదిప్పుడు మూడు నిమిషాలకు తగ్గిపోయింది.” కానీ అతను ఆక్సిజన్ సిలిండర్ వాడరు. “అది నాకెక్కడ దొరుకుతుంది? అది కూడా అంత అత్యవసర సమయంలో,” అని ప్రశ్నించారతను.

గుర్‌దాస్‌పుర్‌లోని ఎగువ బారీ దోఅబ్ కాలువ నుండి నాలుగు శవాలను వెలికితీయటానికి, 2020లో పోలీసులు గజ ఈతగాళ్ల సహాయం తీసుకున్నారని అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ రాజిందర్ కుమార్ చెప్పాడు. అతను జిల్లా నేర నమోదు సంస్థకు బాధ్యుడు కూడా. 2021లో గజ ఈతగాళ్లు ఐదు శవాలను బయటకు లాగారు. ఈ ఘటనలలో, నేర విచారణా స్మృతిలో సెక్షన్ 174 కింద ఒక కేసు నమోదు అయ్యింది. అలా అవటం వలన ఆ మరణం ఆత్మహత్యా, లేక హత్యా అనే పరిశోధన చేసే అవకాశం పోలీసులకు కలిగింది. ప్రమాదవశాత్తు జరిగిందా, లేక అనుమానాస్పద పరిస్థితుల్లో జరిగిందా అని కూడా విచారణ చేసే అవకాశం వారికి కలిగింది.

“ప్రజలు ఆత్మహత్య చేసుకొని చనిపోవటానికి నదుల్లోకి, కాలువల్లోకి దూకుతారు” అని సబ్ ఇన్స్పెక్టర్ చెప్పాడు. “చాలాసార్లు నదికి స్నానం చేయటానికి వెళ్లి, ఈత కొట్టటం తెలియక తమ ప్రాణాలను పోగొట్టుకుంటారు. ఒక్కోసారి జారి పడిపోయి మునిగిపోతారు. ఎవరినైనా నీటిలో ముంచి చంపేసినట్లుగా ఇటీవల కాలంలో మా దగ్గర ఎలాంటి రికార్డ్ లేదు,” కొనసాగింపుగా చెప్పాడు రాజిందర్ కుమార్..

PHOTO • Amir Malik

ఒక హిందీ దినపత్రికలో వచ్చిన సోహన్ సింగ్ టీటా వివరాలు. అతను చేసే పని అందరికీ తెలిసినప్పటికీ, ప్రభుత్వం గజ ఈతగాళ్లకు ఇప్పటి వరకూ ఎలాంటి సహాయం అందించలేదని అతను చెప్పారు

గుర్‌దాస్‌పుర్‌లోని ఎగువ బారీ దోఅబ్ కాలువ నుండి నాలుగు శవాలను వెలికితీయటానికి, 2020లో పోలీసులు గజ ఈతగాళ్ల సహాయం తీసుకున్నారు

చాలావరకు ఈ కాలువలలో మరణాలు వేసవి కాలంలో జరుగుతాయని సోహన్ చెప్పారు. “మండే ఎండ నుండి తప్పించుకోవటానికి గ్రామ ప్రజలు నీళ్లలోకి వెళ్లి, ప్రమాదవశాత్తు మునిగిపోతారు. శవాలు తేలిపోతుంటాయి. వాటిని కాలువలో పట్టుకోవటం చాలా కష్టం. కాబట్టి నేను నీటి ప్రవాహాన్ని అనుసరిస్తూ రకరకాల స్థలాల్లో వెతకాల్సి ఉంటుంది. చాలా ప్రమాదకరమైన పని అది. నా ప్రాణాన్ని అపాయంలో పెట్టుకునే పని.” అంటారు సోహన్.

ప్రమాదాలు ఉన్నా సోహన్ ఈ పనిని కొనసాగిస్తూనేవున్నారు. “నీటిలోకి మునక వేసి వెతికేటప్పుడు శవాన్ని కనిపెట్టటంలో నేనెప్పుడూ విఫలం అవలేదు. నీళ్లలో పడిన ప్రజలను రక్షించేవారికి ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. అలా ఇవ్వటం వలన నాలాంటి వాళ్లకు ఊతం దొరుకుతుంది,” అన్నారతను

“మా గ్రామంలో సుమారు డజను మంది గజ ఈతగాళ్లు ఉన్నారు. వాళ్లంతా పంజాబ్‌లో ఒబిసిల కిందకు వచ్చే లబానా సిక్కు వర్గానికి చెందినవారు,” చెప్పుకొచ్చారు సోహన్. “ఈ పనికి డబ్బు ఇవ్వటం అటుంచి,  ప్రభుత్వం అసలు దీన్ని ఒక పనిగానే చూడదు,” అన్నారు కోపంగా.

ఒక శవాన్ని పట్టుకోవటం కష్టం అయినపుడు కనీసం నలుగురైదుగురు ఈతగాళ్లు సోహన్‌తో పాటు వస్తారు. వారిలో 23 ఏళ్ల గగన్‌దీప్ సింగ్ ఒకడు. అతను కూడా లబానా సిక్కు వర్గానికి చెందినవాడే. అతను 2019లో ఒక శవాన్ని పట్టుకోవటానికి సోహాన్‌తో కలిశాడు. “శవాన్ని పట్టుకోవటానికి మొదటసారి నీళ్లలోకి ప్రవేశించినపుడు నేను భయపడ్డాను. నా భయాన్ని జయించటానికి వాహేగురు (ప్రార్థన)ను పఠించాను,” అని గుర్తు చేసుకున్నాడతను.

PHOTO • Amir Malik
PHOTO • Amir Malik

ఎడమ: గత 20 సంవత్సరాలుగా గుర్‌దాస్‌పుర్, పఠాన్ కోట్‌లలోని కాలువలలో మునక వేసి ఈదుతున్న సోహన్. కుడి: 2019 నుండి సోహన్‌కు సహాయకుడిగా పనిచేస్తున్న గగన్‌దీప్ సింగ్

ఒక పదేళ్ళ పిల్లాడి శవాన్ని బయటకుతీసే పని అతన్ని తీవ్రంగా భయపెట్టింది. “ఆ పిల్లాడు ఈ పక్కనే ఉన్న ఘోట్ పోఖర్ అనే గ్రామానికి చెందినవాడు. పబ్-జి ఆడుతున్నాడని వాళ్ళమ్మ తిట్టి, చదవటం లేదని ఒక చెంప దెబ్బ కొట్టినందుకు వాడు గాజీకోట్‌లో నీళ్లలోకి దూకేశాడు. కాలువ దగ్గరకు వెళ్లి దూకేశాడు” అని గగన్‌దీప్ చెప్పాడు

అతనితోబాటు ఇద్దరు గజ ఈతగాళ్లు ఉన్నారు. వాళ్ళలో భులే చక్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధారీవాల్ గ్రామం నుండి వచ్చిన ఒకరు ఆక్సిజన్ సిలిండర్ తెచ్చారు. “అతను దాన్ని నాకు ఇచ్చాడు. నేను దాన్ని నీళ్లలోకి తీసుకొని వెళ్లాను. అక్కడ దాదాపు రెండు గంటలు ఉన్నాను. రోజంతా వెతికిన తరువాత, బ్రిడ్జి కింద ఇరుక్కొని వున్న ఆ శవాన్ని పట్టుకున్నాం. అది ఉబ్బిపోయి ఉంది. అతను అందమైన పిల్లవాడు. వాడికి అమ్మానాన్నా, ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్నారు,” చెప్పాడతను. ఒకప్పుడు ఈ ఆన్‌లైన్ ఆటను ఆడిన గగన్‌దీప్, ఈ ఘటన జరిగాక ఆడటం మానేశాడు. “నా ఫోన్ లో పబ్-జి ఉంది. కానీ నేనిక దాన్ని ఆడను.”

ఇప్పటివరకూ గగన్‌దీప్ మూడు శవాలను కాలువల నుండి బయటకు తీశాడు. “ఇందుకు నేను డబ్బులు తీసుకోను. వాళ్లు ఇచ్చినా, తీసుకోను,” చెప్పాడతను. గగన్‌దీప్ సైన్యంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. రెండు గదుల ఇంటిలో తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. ఒక స్థానిక గ్యాస్ పంపిణీ సంస్థలో ఇళ్లకు సిలిండర్స్ సరఫరా చేసే పని చేస్తూ, నెలకు 6000 రూపాయలు సంపాదిస్తాడు. అతను కుటుంబానికి ఒక ఎకరం భూమి ఉంది. అక్కడ వాళ్లు గోధుమ, పశుగ్రాసం పెంచుతారు. కొన్ని గొర్రెలను కూడా సాకుతారు. 60 ఏళ్ల అతని తండ్రికి ఒక ఆటోరిక్షా ఉంది. దాన్ని ఒక్కోసారి గగన్‌దీప్ కూడా నడుపుతుంటాడు.

ఈతగాళ్లు కాలువల్లోపల విచ్చలవిడిగా పోగుపడి ఉండే చెత్తాచెదారాల కుప్పల గుండా వెళ్ళాల్సి వస్తుంది. అలా చొచ్చుకొని పోతూనే- శవాల కోసం వెతుకుతూ గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది.

ధారీవాల్ గ్రామంలోని కాలువను దాటడానికి ప్రయత్నిస్తూ మునిగిపోయిన 19 సంవత్సరాల బాలుడి శవాన్ని బయటకు తీయటానికి 2020లో పోలీసులు గగన్‌దీప్‌ను పిలిచారు. “అతని శరీరం మునిగిపోయిన రెండు గంటల తరువాత నేను అక్కడికి చేరుకున్నాను," అని అతను గుర్తు చేసుకున్నాడు. “ఉదయం పది గంటల నుండి ఆ శవం కోసం వెతకటం మొదలుపెట్టాను. కానీ సాయంకాలం 4 వరకు దాన్ని పట్టుకోలేకపోయాను.” కాలువ గట్టు ఒక చివర నుండి రెండవ చివర వరకు ఒక తాడుని కట్టి, మరో ముగ్గురు మనుషులతో మానవ హారం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అందరూ ఒకేసారి నీటిలోకి మునిగారు. “చాలా చెత్త పేరుకుపోయి ఉండటం వలన పిల్లాడి శరీరాన్ని పట్టుకోవటం చాలా కష్టం అయ్యింది. ఒక పెద్ద రాయి బాలుడి శరీరాన్ని ఎటూ కదలకుండా ఆపేసింది” చెప్పాడు గగన్‌దీప్.

PHOTO • Amir Malik

తిబ్‌డీ వద్ద కాలువను చూస్తూ బ్రిడ్జి మీద నిలబడి ఉన్న గగన్‌దీప్. ‘నేనేం చేస్తున్నానా అని ఒక్కోసారి నన్ను నేను ప్రశ్నించుకుంటాను... కానీ నేను చేస్తున్న పనిని వదిలేయాలని మాత్రం అనుకోలేదు’

తాను చేస్తోన్న ఈ పని ద్వారా అతను భౌతికశాస్త్ర సిద్ధాంతాలు నేర్చుకున్నాడు. “శవాలు పైకి తేలటానికి కనీసం 72 గంటలు తీసుకొంటాయి. అవి నీళ్లలో ప్రయాణం చేస్తాయి. ఒక వ్యక్తి పాయింట్ ‘ఎ’ దగ్గర నీళ్లలోకి దూకితే, అతనక్కడ దొరకడు,” 2021లో తిబ్‌డీ కాలువలోంచి 16 ఏళ్ల బాలుడి శవాన్ని వెలికితీసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పాడు గగన్‌దీప్. “అతను దూకిన దగ్గరే పిల్లాడి కోసం వెతికాను. కానీ అతనక్కడ దొరకలేదు. అప్పుడు నేను నీళ్లలో ఉండగా నా శ్వాసను పోగొట్టుకోకుండా ఉండేందుకు ముక్కులో ఒక ట్యూబు పెట్టుకొని, దానిని ఒక పైపుకు కలిపాను” చెప్పాడతను.

వాళ్లు సాయంకాలం బాగా పొద్దుపోయాక శవం ఉన్న చోటును గుర్తించగలిగారు. “అది కాలువకు అవతలవైపు చివర, దాదాపు 25 అడుగుల లోతు నీటిలో ఉంది. సోహన్, నేనూ ఇద్దరం దానికోసం వెతికాం,” అని అతను గుర్తుకు తెచ్చుకున్నాడు. “దాన్ని బయటకు లాగటానికి మరుసటి రోజు వద్దామని సోహన్ అన్నాడు. కానీ మేం అక్కడకు వెళ్ళేసరికి శవం మాయం అయ్యింది. అది అవతలి ఒడ్డుకు చేరి కాలువ అడుగుభాగాన నిలిచిపోయింది”. దాన్ని వెలికితీయటానికి గజ ఈతగాళ్లకు మూడు గంటల సమయం పట్టింది. “మేం కనీసం 200 సార్లయినా నీటి లోపలకూ, బయటకూ మునిగి తేలివుంటాం. నేనేం చేస్తున్నానని కొన్నిసార్లు నన్ను నేను ప్రశ్నించుకుంటాను. కానీ దీన్ని వదిలేయాలనే ఆలోచన మాత్రం రాలేదు. మనుషులకు సేవ చేయాలని నా నుదుటన రాసి ఉంటే, నేను దాన్ని చెరపలేను కదా,” చెప్పాడు గగన్‌దీప్.

అయితే సోహన్ నీటిలోని బ్రతుక్కి ఉన్న సంక్లిష్టతలను చూస్తారు. ప్రతి సాయంకాలం, ఇంకా సమయం ఉన్నప్పుడల్లా తిబ్‌డీ వంతెన దగ్గరకు అతను వెళుతూ ఉండటానికి అదొక కారణం. “ఈత కొట్టటాన్ని నేనిక ఆనందించలేను. ప్రతి (విషాద) ఘటనకు సంబంధించిన గుర్తులను నేను నా మనసు నుండి తొలగించేస్తాను” అంటారతను. “శవాన్ని బయటకు తెచ్చిన ప్రతిసారి, ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులు కొద్దిగా మరణించటాన్ని మేం చూస్తాం. వాళ్లు ఏడ్చి, శరీరాన్ని ఒకే ఒక పశ్చాత్తాపంతో మోసుకొని వెళతారు- ఇలా మాత్రం చనిపోకూడదని.”

కాలువకూ, దాని నీళ్లకూ సోహన్ మనసులో ఒక ముఖ్య స్థానం ఉంది. 2004లో అతనికి మొరాకోలో నివాసముండి, పని చేసే అవకాశం వచ్చినపుడు, ఆ ఉత్తర ఆఫ్రికా దేశపు సరిహద్దుల్లో ఉన్న అట్లాంటిక్ మహాసముద్రం, మధ్యధరా సముద్రాలు కూడా అతనికి సుపరిచితమైన కాలువను మర్చిపోయేటట్లు చేయలేకపోయాయి. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ బతకలేక అతను నాలుగేళ్ళలోనే తిరిగివచ్చారు. “అక్కడ ఉన్నప్పుడు తిబ్‌డీని మర్చిపోలేకపోవటం నాకు గుర్తుంది. ఇప్పటికీ కూడా నా ఖాళీ సమయాన్ని ఊరికే కాలువను చూస్తూ గడిపేస్తాను” పనికి వెళ్లబోతూ చెప్పారు సోహన్. కూరగాయల బండిని మోటర్ బైక్‌కు కట్టుకొని, పక్క వీధి మూలలో ఉన్న కొనుగోలుదార్లను కలవటానికి దాన్ని తోలుకుంటూ వెళ్లిపోయారు సోహన్.

ఈ కథనాన్ని రాయటానికి సహాయం చేసిన సుమేధ మిత్తల్‌కు రిపోర్టర్ ధన్యవాదాలు తెలియచేస్తున్నారు.

మీకు ఆత్మహత్య గురించిన ఆలోచనలు వస్తుంటే , లేదా అటువంటి ధోరణి ఉన్నవారి గురించి మీకు తెలిస్తే , దయచేసి నేషనల్ హెల్ప్ లైన్‌కు చెందిన కిరణ్‌కు 1800 -599 -0019 (24/7 టోల్ ఫ్రీ) ఫోన్ చేయండి. లేదంటే మీ దగ్గరలో ఉన్న ఈ హెల్ప్‌లైన్‌లలో దేనికైనా ఫోన్ చేయండి. మానసిక ఆరోగ్య నిపుణుల , లేక సేవల సమాచారం కోసం దయచేసి SPIF మానసిక ఆరోగ్య డైరెక్టరీ ని సందర్శించండి సందర్శించండి

అనువాదం: రమాసుందరి

Amir Malik

Amir Malik is an independent journalist, and a 2022 PARI Fellow.

Other stories by Amir Malik
Editor : S. Senthalir

S. Senthalir is Senior Editor at People's Archive of Rural India and a 2020 PARI Fellow. She reports on the intersection of gender, caste and labour. Senthalir is a 2023 fellow of the Chevening South Asia Journalism Programme at University of Westminster.

Other stories by S. Senthalir
Translator : Ramasundari

Ramasundari is from Andhra Pradesh. She is a member of the Editorial Board of Telugu monthly, Matruka.

Other stories by Ramasundari