చిన్న వెదురు షెడ్‌లోని ఒక ఇరుకైన మంచం మీద మోహిని కౌర్ కొలతలు మార్చడానికి లేదా కొత్తగా కుట్టడానికి అవసరమైన బట్టల కుప్పను ఉంచింది. నవంబర్ 2020లో సింగు నిరసన ప్రదేశానికి వచ్చిన న్యూ ఢిల్లీలోని స్వరూప్ నగర్‌కు చెందిన ఈ 61 ఏళ్ల వ్యక్తి ఇలా చెప్పింది. “నాకు టైలరింగ్ మరీ బాగా ఏమి రాదు, కానీ నేను చేయగలిగింది చేస్తాను. ఇక్కడ నిరసన తెలుపుతున్న రైతులు మనకు ఆహారాన్ని అందిస్తారు, నేను వారి కోసం చేయగలిగింది ఇది మాత్రమే, ” రైతు సంఘాలు తమ నిరసనను ఉపసంహరించుకునే వరకు మోహిని ఒక్కసారి కూడా ఇంటికి తిరిగి వెళ్లలేదు

ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని సింగు వద్ద ఆమె స్వచ్ఛంద సేవకురాలిగా పనిచేసిన వార్త పంజాబీ వార్తాపత్రిక అజిత్‌లో వచ్చినప్పుడు, మోహినికి సహాయం చేయడానికి పంజాబ్‌కు చెందిన పాఠకుడికి అది ప్రేరణనిచ్చింది. ఈ ఏడాది జూలైలో, 22 ఏళ్ల హర్జీత్ సింగ్ అనే యువకుడు మోహిని షెడ్‌లో చేరి, ఆమెతో కలిసి పనిచేయదు మొదలుపెట్టాడు.

పంజాబ్‌లోని లూథియానా జిల్లాలోని ఖన్నాలో హర్జీత్‌కు టైలరింగ్ దుకాణం ఉంది. అతని తండ్రి నాలుగు ఎకరాల పొలంలో వరి, గోధుమలు, మొక్కజొన్న పండించే రైతు. “నేను నా దుకాణాన్ని నా ఇద్దరు కరిగార్ల [పనివాళ్ల] కు అప్పజెప్పి, మోహిని జీకి సహాయం చేయడానికి ఈ సంవత్సరం జూలైలో సింగు వద్దకు వచ్చాను. ఇక్కడ చాలా పని ఉంది; ఇంట పనిని ఆమె ఒంటరిగా చేయడం కష్టం."

మంచం, పక్కనే పనిచేసుకునే చెక్కబల్లతో పాటు, రెండు కుట్టు మెషిన్లు, పెడెస్టల్ ఫ్యాన్ షెడ్‌లో నిండిపోవడంతో, అక్కడ కదలడానికి ఎక్కువగా స్థలం లేదు. నేలపై, పాలు కాయడానికి పోర్టబుల్ గ్యాస్ డబ్బా స్టవ్ ఉంది. మోహిని లేదా హర్జిత్‌తో మాట్లాడేందుకు ఒక సమయంలో ఒక్కరు మాత్రమే లోపలికి అడుగు పెట్టగలరు. నిరసన స్థలంలో ఉన్న 'కస్టమర్లు' - రైతులు ఇంకా ఇతరులు - తలుపు వద్ద నిలబడ్డారు.

The bamboo shed at Singhu, where Mohini Kaur set up her tailoring unit.
PHOTO • Namita Waikar
Harjeet Singh (left) and Mohini at their worktable
PHOTO • Namita Waikar

ఎడమవైపు: సింగు వద్ద వెదురు షెడ్డు కింద మోహిని కౌర్ టైలరింగ్ యూనిట్‌. కుడి: పనిచేసుకునే చెక్క బల్ల వద్ద హర్జీత్ సింగ్ (ఎడమ), మోహిని

చెక్కబల్లకు ఒక  చివర తాజా గుడ్డల కట్టలు పేర్చబడి ఉన్నాయి. “ఇది స్వచ్ఛమైన కాటన్ ధర మార్కెట్ ధరకు సమానంగా ఉంటుంది. నేను సింథటిక్స్ ఉంచను,” మోహిని ఒక నిర్దిష్ట వస్త్రం గురించి ఆరా తీస్తున్న వ్యక్తితో చెప్పింది. "దీని ధర 100 రూపాయలు." ఆమె తన కస్టమర్‌లకు మెటీరియల్‌ల ధరను వసూలు చేస్తుంది కానీ శ్రమ మాత్రం ఉచితం. టైలరింగ్ కోసం ప్రజలు ఆమెకు ఏదైనా చెల్లిస్తే, ఆమె దానిని తీసుకుంటుంది.

మోహిని 1987లో బెంగుళూరులో నర్సుగా శిక్షణ పొందింది. చిన్నవయసులోనే  తల్లి అయి ఉద్యోగాన్ని వదులుకోవడానికి ముందు ఆమె కొన్ని సంవత్సరాల పాటు పనిచేసింది. ఆమె ఇప్పుడు ఒంటరిగా జీవిస్తోంది - ఆమె భర్త 2011లో మరణించారు. ఆమె కూతురు పెళ్లి చేసుకుని సౌత్ వెస్ట్ ఢిల్లీ జిల్లాలోని ద్వారక పరిసరాల్లో నివసిస్తోంది. ఐదు సంవత్సరాల క్రితం, తన తీవ్రమైన చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్‌ వలన మోహిని తన ఇరవైయేళ్ల కొడుకును  కోల్పోయింది. “నా కొడుకును కోల్పోయిన బాధను ఎదుర్కోవడం అంత సులభం కాదు. అందుకే రైతులకు సాయం చేయాలని అనుకున్నాను. ఈ పని నన్ను ఉత్సాహపరుస్తుంది.  నాకు ఒంటరిగా అనిపించడం లేదు. హర్జీత్ ఆమెను ‘మా’ అని పిలుస్తాడు. "నేను ఇప్పుడు ఆమె కొడుకుని," అని అతను చెప్పాడు, బట్టలను కొలిచే టేప్ అతని మెడలో దండలా వేలాడుతోంది.

నవంబర్ 26న, రైతుల నిరసనల వార్షికోత్సవాన్ని స్మరించుకోవడానికి అక్కడ మహిళలు, పురుషులు గుమిగూడారు. రైతుల నుండి ప్రార్థనలు, ప్రసంగాలు, పాటలు, చప్పట్లతో సింగు నిరసన వేదిక ప్రతిధ్వనించింది. కానీ మోహిని, హర్జీత్ వారి చెక్కబల్ల వద్ద కుట్టుపనిలో బిజీగా ఉన్నారు - కొలవడం, కత్తిరించడం, కుట్టు మిషన్‌ను నడపడం. వారు భోజనానికి, రాత్రి నిద్రపోవడానికి మాత్రమే విరామం తీసుకుంటారు - మోహిని షెడ్‌లో, దానికి కొంత దూరంలో హర్జీత్ తన ట్రాక్టర్-ట్రాలీలో ఉంటారు.

వారు భోజనానికి, రాత్రి నిద్రపోవడానికి మాత్రమే విరామం తీసుకుంటారు - మోహిని షెడ్‌లో, దానికి కొంత దూరంలో హర్జీత్ తన ట్రాక్టర్-ట్రాలీలో ఉంటారు

వీడియో చూడండి: రైతుల సేవలో పెద్ద హృదయాలు, స్థిరమైన చేతులు

రైతులు నిరసన ప్రదేశంలో ఉన్నంత కాలం మోహిని, హర్జీత్ తమ టైలరింగ్ సేవను కొనసాగించాలని అనుకున్నారు - అలాగే చేశారు. " సేవా సే కభీ దిల్ నహీ భర్తా (ఎంత సేవ చేసినా హృదయాన్ని సంతృప్తిపరచలేము)" అని మోహిని చెప్పింది.

రైతుల నిరసనల 378వ రోజు డిసెంబర్ 9, 2021న, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన స్థలాలను ఖాళీ చేస్తారని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు ప్రకటించారు. జూన్ 5, 2020న ఆర్డినెన్స్‌లుగా ఆమోదించబడిన వ్యవసాయ చట్టాలు, ఆ తర్వాత సెప్టెంబర్ 14న పార్లమెంటులో వ్యవసాయ బిల్లులుగా ప్రవేశపెట్టి, సెప్టెంబర్ 20, 2020న చట్టాలను అమలులోకి తీసుకువచ్చాక, ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ వారు గత సంవత్సరం సైట్‌లను ఆక్రమించారు.

అవి ఆమోదించబడినంత వేగంగానే, నవంబర్ 29, 2021న పార్లమెంటులో చట్టాలు రద్దు చేయబడ్డాయి. అవి: ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020పై రైతులు (సాధికారత మరియు రక్షణ) ఒప్పందం ; రైతుల ఉత్పత్తి వాణిజ్యం (ప్రమోషన్ మరియు సులభతరం) చట్టం, 2020 ; మరియు ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) చట్టం, 2020 .

కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లలో చాలా వాటిని ఆమోదించిన తర్వాత డిసెంబర్ 9, 2021న రైతు సంఘాలు ఆందోళనను విరమించుకున్నాయి. కానీ కనీస మద్దతు ధర (లేదా MSP) చట్టపరమైన హామీ కోసం చర్చలు కొనసాగుతాయని వారు పేర్కొన్నారు.

Mohini Kaur came to the Singhu protest site in November 2020 and volunteered to stitch and mend the protesting farmers' clothes. "They grow food for us, this was something I could do for them," she says
PHOTO • Namita Waikar

మోహిని కౌర్ నవంబర్ 2020లో సింగు నిరసన ప్రదేశానికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల బట్టలు కుట్టడానికి, బాగుచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. "వారు మా కోసం ఆహారాన్ని పెంచుతారు, ఇది మాత్రమే వారి కోసం నేను చేయగలిగింది," అని ఆమె చెప్పింది

సింగు నుండి 40 కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ ఢిల్లీకి సమీపంలోని తిక్రీ సరిహద్దు ప్రదేశంలో, డాక్టర్ సాక్షి పన్నూ, వారం అంతా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు హెల్త్ క్లినిక్‌ని నడుపుతున్నారు. “నేను ఏ రోజునైనా ఇక్కడ 100 మందికి పైగా రోగులను చూస్తాను. చాలా మంది జలుబు, జ్వరానికి మందులు అడుగుతారు. కొందరికి మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నాయి. ఇక్కడ నివసిస్తూ, నిరసన శిబిరంలో ఉన్న చాలా మందికి కడుపు నొప్పి వస్తుంది,” అని ఆమె చెప్పింది.

నవంబర్‌లో మేము సాక్షిని కలిసినప్పుడు, క్లినిక్‌కి రోగులు వస్తూనే ఉన్నారు. మరుసటి రోజు దగ్గు మందు స్టాక్ అయిపోయినందున దాని కోసం తరవాత రోజు రమ్మని ఆమె ఒక వ్యక్తికి చెబుతోంది. క్లినిక్ కోసం మందులు, పరికరాలను గ్రామీణ హర్యానాలోని ఉజ్మా బైఠక్ అనే సామాజిక సేవా సంస్థ అందించింది.

క్లినిక్‌ని ఎక్కువ గంటలు తెరిచి ఉంచడమే తాను ఇష్టపడతానని సాక్షి చెప్పింది, అయితే, “నేను నా 18 నెలల కొడుకు వస్తిక్‌తో ఇంట్లో కొంత సమయం గడపాలి. నేను అతనిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి." అన్నది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి ఆమె స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. ఆమె క్లినిక్‌లో బిజీగా ఉన్నప్పుడు - ఆమె అత్తమామలు, నిరసనలకు తమ వంతు మద్దతుగా వారి మనవడిని వారితో తీసుకెళ్లారు. అంతేగాక వీరంతా క్లినిక్ కు అడుగుల దూరంలో ఉన్న సైట్‌లో ప్రార్థనలకు, సమావేశాలకు హాజరవుతారు.

ఆమె తాత జమ్మూలో రైతు. ఆమె అత్తమామలు హర్యానాలోని జింద్ జిల్లాలోని ఝమోలా గ్రామానికి చెందినవారు. "మాకు ఇప్పటికీ మా గ్రామీణ మూలాలతో చాలా అనుబంధం ఉంది.” రైతుల డిమాండ్లలో, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వారి నిరసనలకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాము" అని సాక్షి తెలిపింది.

The free health clinic (left) that was set up for  farmers camping at the Tikri border site. Dr. Sakshi Pannu (in the pink dress) ran it every day since April
PHOTO • Namita Waikar
The free health clinic (left) that was set up for  farmers camping at the Tikri border site. Dr. Sakshi Pannu (in the pink dress) ran it every day since April
PHOTO • Amir Malik

తిక్రీ సరిహద్దు ప్రదేశంలో క్యాంపింగ్ చేస్తున్న రైతుల కోసం ఉచిత ఆరోగ్య క్లినిక్ (ఎడమ) ఏర్పాటు చేయబడింది. డాక్టర్ సాక్షి పన్ను (పింక్ డ్రెస్‌లో) ఏప్రిల్ నుండి ప్రతిరోజూ దీన్ని నడిపారు

తిక్రీ నిరసన ప్రదేశం నుండి, హర్యానాలోని బహదూర్‌ఘర్ పట్టణంలో దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో సాక్షి ఇల్లు ఉంది. ఆమె వస్తిక్, ఆమె భర్త అమిత్, అతని తల్లిదండ్రులతో కలిసి నివసిస్తుంది. 2018లో న్యూఢిల్లీలోని లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీ నుండి MBBS డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, సాక్షి కళాశాల ఆసుపత్రిలో ఒక సంవత్సరం పని చేసింది. ఇప్పుడు విరామంలో, తన కొడుకు కొద్దిగా పెరిగిన తర్వాత జనరల్ మెడిసిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని చదవాలని ఆమె ఆశిస్తోంది.

‘సామాన్య ప్రజల కోసం నేను ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలనుకున్నాను,’ అని సాక్షి తెలిపింది. “కాబట్టి తిక్రీ సరిహద్దులో రైతులు ఇక్కడ గుమిగూడినప్పుడు, నేను ఈ క్లినిక్‌కి వచ్చి డాక్టర్‌గా సేవను అందించాలని నిర్ణయించుకున్నాను. రైతులు ఈ నిరసన ప్రదేశంలో ఉన్నంత కాలం నేను దీన్ని కొనసాగిస్తాను.”

ఇంటికి తిరిగి వెళ్ళడానికి రైతులు సర్దుకోవడం చూస్తూ, " ఫతే హో గయీ (మేము విజయం సాధించాము)" అని మోహిని ఆనందంగా చెప్పింది. ఉద్వేగంతో, ఆనందంగా, “[రైతుల] ఏడాది శ్రమ ఫలించింది” అని సాక్షి చెప్పింది. ఆమె సేవా స్ఫూర్తి ఎప్పటిలాగే బలంగా ఉంది, "చివరి రైతు ఇంటికి తిరిగి వెళ్ళేవరకు నేను ఇక్కడే ఉంటాను" అని ఆమె అన్నది.

ఈ కథనాన్ని నివేదించడంలో సహాయం చేసిన అమీర్ మాలిక్‌కు రచయిత ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

అనువాదం: అపర్ణ తోట

Namita Waikar is a writer, translator and Managing Editor at the People's Archive of Rural India. She is the author of the novel 'The Long March', published in 2018.

Other stories by Namita Waikar
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota