“కిత్‌కిత్ (తొక్కుడుబిళ్ళ), లట్టూ (బొంగరం), తాస్ ఖేలా (పేకాట),” ఏకరువు పెట్టేశాడు అహ్మద్. దాదాపు వెంటనే తనను తాను సరిదిద్దుకున్న ఆ పదేళ్ళ పిల్లవాడు, "నేను కాదు, అల్లారఖాయే తొక్కుడుబిళ్ళ ఆడేది," అని స్పష్టం చేశాడు.

తమ వయసుల మధ్య ఉన్న ఒక ఏడాది వ్యత్యాసాన్ని నిరూపించడానికీ, ఆటలో తనకున్న అత్యుత్తమ సామర్థ్యాలను తెలియపర్చడానికీ ఆసక్తిగా ఉన్న అహ్మద్, “ఈ ఆడపిల్లల ఆటలు నాకు నచ్చవు. నేను మా బడి మైదానంలో బ్యాట్-బాల్ (క్రికెట్) ఆడతాను. ఇప్పుడు బడి మూసేశారు, కానీ మేం గోడ ఎక్కి మైదానంలోకి ప్రవేశిస్తాం!" అన్నాడు.

ఈ దాయాదులిద్దరూ ఆశ్రమ్‌పారా ప్రాంతంలోని బాణీపీఠ్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు- అల్లారఖా మూడో తరగతిలోనూ, అహ్మద్ నాలుగవ తరగతిలోనూ ఉన్నారు.

అవి 2021 డిసెంబర్ నెల మొదటి రోజులు. మేం పశ్చిమ బెంగాల్‌లోని బేల్‌డాంగా-1 బ్లాక్‌లో ఉన్నాం. జీవనోపాధి కోసం బీడీలు చుట్టే మహిళలను కలవడానికి వెళ్ళాం.

మేమొక ఒంటిమామిడి చెట్టు దగ్గర ఆగాం. అది ఒక పాత శ్మశానం గుండా వెళ్తోన్న ఇరుకుదారిలో ఒక అంచున నిల్చొని ఉంది; దూరంగా ఆవాల చేలున్నాయి. చనిపోయినవారి ఆత్మలు శాశ్వత నిద్రలో విశ్రాంతి తీసుకుంటోన్న ఆ ప్రదేశం ఒక నిశ్శబ్దమైన ప్రశాంతతతో కూడిన ప్రపంచం; ఎత్తుగా ఉన్న ఆ ఒంటరిచెట్టు ఆ నిశ్శబ్ద జాగారంలో నిలబడి ఉంది. వసంతకాలంలో మళ్ళీ ఫలాలు ఇచ్చేవరకూ- పక్షులు కూడా ఆ చెట్టును వదిలి ఎగిరెళ్ళిపోయాయి.

పరుగుల శబ్దానికి నిశ్శబ్దం చెదిరిపోయింది - అహ్మద్, అల్లారఖాలు తెరమీదకు విరగబడ్డారు. గెంతుతూ దూకుతూ ఎగురుతూ- మూడిట్నీ ఒకేసారి చేస్తూ కూడా. వాళ్ళు మా ఉనికిని గుర్తించినట్టు లేదు.

Ahmad (left) and Allarakha (right) are cousins and students at the Banipith Primary School in Ashrampara
PHOTO • Smita Khator
Ahmad (left) and Allarakha (right) are cousins and students at the Banipith Primary School in Ashrampara
PHOTO • Smita Khator

ఆశ్రమ్‌పారాలోని బాణీపీఠ్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులైన దాయాదులు అహ్మద్ (ఎడమ), అల్లారఖా (కుడి)

Climbing up this mango tree is a favourite game and they come here every day
PHOTO • Smita Khator

ఈ మామిడి చెట్టెక్కడం వారికెంతో ఇష్టమైన ఆట. అందుకోసం వాళ్ళు రోజూ ఇక్కడికొస్తుంటారు

చెట్టు దగ్గరకు రాగానే, మానును ఆనుకొని నిలబడి ఇద్దరూ తమ ఎత్తును కొల్చుకున్నారు. ఇది వాళ్ళ రోజువారీ అలవాటని ఆ మాను మీద ఉన్న గుర్తులనుబట్టి తెలుస్తోంది.

"నిన్నటికన్నా ఏమైనా ఎక్కువుందా?" ఆ దాయాదుల్ని అడిగాను. మరీ చిన్నగా కనిపిస్తోన్న అల్లారఖా దంతాలు లేని చిరునవ్వును మెరిపిస్తూ చిలిపిగా అన్నాడు, "అయితే ఏంటి? మేం చాలా బలంగా ఉన్నాం!" తన స్థాయిని నిరూపించుకోవడానికన్నట్టు ఊడిపోయిన పంటి వైపు చూపిస్తూ, “చూడు! ఎలుక నా పాలపన్నును ఎత్తుకుపోయింది. నాకు త్వరలోనే అహ్మద్‌కున్నట్టుగా బలమైన పళ్ళు వస్తాయి."

అతనికన్నా కేవలం ఒక్క వేసవి కాలం పెద్దవాడైన అహ్మద్ నోటి నిండా పళ్ళతో ఇలా అన్నాడు, “నా దూధేర్ దాంత్ (పాల పళ్ళు) అన్నీ ఊడిపోయాయి. నేనిప్పుడు పెద్ద పిల్లాడ్ని. వచ్చే ఏడాది పెద్ద బడికి వెళ్తాను."

వారికెంత బలముందో నిరూపించుకోడానికి ఉడుతల్లాంటి చురుకుదనంతో చెట్టుపైకి ఎక్కారు. లిప్తకాలంలో ఇద్దరూ చెట్టు మధ్య కొమ్మలకు చేరుకుని స్థిరపడ్డారు, వారి చిన్న కాళ్ళు కొమ్మలమీంచి క్రిందికి వేలాడుతూ ఉన్నాయి

"ఇది మాకు చాలా ఇష్టమైన ఆట," ఆనందంతో ఉప్పొంగిపోతూ అన్నాడు అహ్మద్. "మాకు బడి జరిగే రోజుల్లో, బడి అయిపోగానే ఈ ఆట ఆడుకునేవాళ్ళం" అల్లారఖా జతచేశాడు. ఈ పిల్లలు ప్రాథమిక తరగతులలో ఉన్నారు. ఇంకా బడికి తిరిగి పోలేదు. కోవిడ్-19 విరుచుకుపడిన నేపథ్యంలో మార్చి 25, 2020 నుండి చాలా కాలం పాటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. డిసెంబర్ 2021లో పాఠశాలలను తిరిగి తెరిచినప్పటికీ, ఉన్నత తరగతుల విద్యార్థులు మాత్రమే బడికి హాజరవుతున్నారు.

"నా స్నేహితుల మీద బెంగగా ఉంది," అహ్మద్ చెప్పాడు. "మేం వేసవికాలంలో ఈ చెట్టెక్కి పచ్చి మామిడికాయలను దొంగిలించేవాళ్ళం." బడిలో ఉన్నప్పుడు ఇచ్చే సోయా చిక్కుడు ముక్కలు, గుడ్లు కూడా ఇప్పుడీ పిల్లలకు లేవు. ఇప్పుడు వారి తల్లులు మధ్యాహ్న భోజనం (కిట్) తీసుకోవడానికి నెలకొకసారి పాఠశాలకు వెళుతుంటారు. ఆ కిట్‌లో బియ్యం, మసూర్ పప్పు, బంగాళదుంపలు, సబ్బు ఉంటాయి

The boys are collecting mango leaves for their 10 goats
PHOTO • Smita Khator

తమకున్న పది మేకలకోసం మామిడి ఆకులను సేకరిస్తోన్న పిల్లలు

'You grown up people ask too many questions,' says Ahmad as they leave down the path they came
PHOTO • Smita Khator

'మీ పెద్దోళ్ళు మరీ చాలా ప్రశ్నలు అడుగుతారు,' వచ్చిన దారినే తిరిగి వెళ్తూ అన్నాడు అహ్మద్

"మేం ఇంటి దగ్గర చదువుకుంటాం. మా అమ్మవాళ్ళు మాకు చదువుచెప్తారు. నేను రోజుకు రెండుసార్లు చదివి, రాస్తుంటాను," అన్నాడు అహ్మద్

"కానీ నువ్వు చాలా అల్లరిపిల్లాడివనీ, అస్సలు తన మాట వినవనీ మీ అమ్మ నాతో చెప్పిందే!" అన్నాను నేను

"నువ్వు చూస్తున్నావుకదా, మేం చాలా చిన్నపిల్లలం... అమ్మీ (అమ్మ)కి అర్థంకాదు," అన్నాడు అల్లారఖా. వారి తల్లులు తెల్లవారుఝాము నుంచి అర్ధరాత్రి వరకూ ఇంటి పనులతోనూ, ఇల్లు నడపడం కోసం మధ్యమధ్యలో బీడీలు చుడుతూనూ విరామంలేకుండా పనిలో మునిగిపోయి ఉంటారు. వారి తండ్రులు పనికోసం దూరప్రాంతాలలోని నిర్మాణస్థలాలకు వలసపోతుంటారు. "అబ్బా (నాన్న) ఇంటికి వచ్చినపుడు, మేం ఆయన మొబైల్‌ని తీసుకొని ఆటలాడుకుంటాం. అందుకే అమ్మీ కి కోపమొస్తుంది," అన్నాడు అల్లారఖా.

వాళ్ళు ఫోన్‌లో ఆడే ఆటలు పెద్దపెద్ద శబ్దాలతో గోలగోలగా ఉంటాయి: “ఫ్రీ-ఫైర్. పూర్తి పోరాటాలు, తుపాకీ యుద్ధాలు." వారి తల్లులు వద్దని వారించినప్పుడు, పిల్లలు ఫోన్‌ తీసుకొని మిద్దెమీదకో లేదా ఆరుబయటకో తప్పించుకుపోతుంటారు

మేం మాట్లాడుతుండగానే ఆ అబ్బాయిలిద్దరూ కొమ్మల మధ్య కదులుతూ ఒక్క ఆకును కూడా వృథా చేయకుండా జాగ్రత్తగా ఆకులను సేకరించారు. దీనికి కారణాన్ని ఆ తర్వాత అహ్మద్ మాతో చెప్పాడు: “ఇవి మా మేకల కోసం. మా దగ్గర 10 మేకలున్నాయి. వాటికి ఈ ఆకులు తినడమంటే చాలా ఇష్టం. మా అమ్మీలు వాటిని మేతకు తీసుకువెళుతుంటారు.”

కొద్దిసేపటికే వాళ్ళు కొమ్మలపైనుండి దిగి, విశాలమైన మానును పట్టుకొని కోసిన మామిడి ఆకులు చెక్కుచెదరకుండా నేలపైకి దూకారు. “మీ పెద్దోళ్ళు చాలా ప్రశ్నలు అడుగుతారు. మాకు ఆలస్యం అవుతోంది,” అన్నాడు అహ్మద్ మమ్మల్ని బెదిరిస్తున్నట్టుగా. ఆ తర్వాత ఆ ఇద్దరబ్బాయిలూ తామక్కడికి వచ్చిన ఆ మట్టి దారివెంటే నడుస్తూ, గెంతుతూ, దుంకుతూ వెళ్ళిపోయారు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Smita Khator

Smita Khator is the Translations Editor at People's Archive of Rural India (PARI). A Bangla translator herself, she has been working in the area of language and archives for a while. Originally from Murshidabad, she now lives in Kolkata and also writes on women's issues and labour.

Other stories by Smita Khator
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli