గత మూడేళ్లలో మీరు ఎన్ని ఆసుపత్రులను సంప్రదించారు?

ఆ ప్రశ్నతో సుశీలా దేవి మరియు ఆమె భర్త మనోజ్ కుమార్ ముఖాల్లో అలసట, నిరాశ నీడలు కమ్ముకున్నాయి. జూన్ 2017లో బండికుయ్ పట్టణంలోని మధుర్ హాస్పిటల్‌లో సుశీల మొదటిసారిగా నస్బంది (స్టెరిలైజేషన్ ప్రక్రియ) పొందినది. అపటి నుండి ఆల్లీద్ధరు (వారి పేర్లు ఇక్కడ మార్చబడ్డాయి) మస్త్ ఆసుపత్రుల సుట్టు తిరిగి, లెక్క లేనన్ని పరీక్షలు, వైరుధ్య నిర్ధారణలు చేయిన్చుకున్నరు.

పెళ్లయిన 10 సంవత్సరాలలో ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిన తరువాత నాల్గవ సంతానంగా , వారికి కొడుకు పుట్టాడు. ఆ అబ్బాయి పుట్టిన ఒక సంవత్సరం తర్వాత, ఈ జంట తమ కుటుంబాన్ని, జీవితాన్ని మెరుగ్గా నిర్వహించాలనే ఆశతో, 27 ఏళ్ల సుశీలకు ట్యూబల్ లిగేషన్‌ చేయించాలని నిర్ణయించుకున్నారు. రాజస్థాన్‌లోని దౌసా తహసీల్‌లోని ధని జమాని గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే కుండల్ PHC ఉండగా కూడా, వారు  20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బండికుయ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రినే ఎంచుకున్నారు.

“ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో స్టెరిలైజేషన్ శిబిరాలు ఎక్కువగా శీతాకాలంలో నిర్వహించబడతాయి. మహిళలు చల్లని నెలల్లో ప్రక్రియను ఇష్టపడతారు. ఎందుకంటే ఇది వేగంగా నయం అవుతుంది. వేసవి నెలల్లో శస్త్రచికిత్స చేయాలనుకుంటే మేము వారిని దౌసా మరియు బండికుయ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకువెళతాము, ”అని గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త (ఆశా) సునీతా దేవి, 31, చెప్పారు. ఆమె దంపతులతో కలిసి 25 పడకల సాధారణ ఆసుపత్రి అయిన మధుర్ ఆసుపత్రికి వెళ్లింది. ఇది రాష్ట్ర కుటుంబ సంక్షేమ పథకం కింద రిజిస్టర్ చేయబడింది, కాబట్టి సుశీల ట్యూబెక్టమీకి ఛార్జీ విధించలేదు. బదులుగా, ఆమెకు ప్రోత్సాహక మొత్తం రూ. 1,400 ఇచ్చారు.

శస్త్రచికిత్స జరిగిన కొన్ని రోజుల తర్వాత, సుశీలకు ఋతుస్రావం వచ్చింది. దానితో విపరీతమైన నొప్పి, ఆ తరవాత అలసట ఉండేది, ఇలా మూడు సంవత్సరాల వరకు కొనసాగింది.

“మొదట నొప్పి ప్రారంభమైనప్పుడు, మేము ఇంట్లో ఉన్న నొప్పి నివారణ మందులను ఆమెకు ఇచ్చాము. ఇది కొద్దిగా సహాయపడింది. ఋతుస్రావం అయినప్పుడు ఆమె ప్రతి నెలా ఏడుస్తూ ఉంటుంది” అని 29 ఏళ్ల మనోజ్ చెప్పాడు.

“నొప్పి తీవ్రమైంది. అధిక రక్తస్రావం వలన తల తిరిగిపోయేది. నేను ఎప్పుడూ బలహీనంగా ఉండేదానిని” అని 8వ తరగతి వరకు చదివిన గృహిణి సుశీల చెప్పారు.

ఇలా మూడు నెలల పాటు కొనసాగడంతో భార్యాభర్తలు సంకోచిస్తూ కుండల్‌లోని పీహెచ్‌సీకి వెళ్లారు.

Susheela and Manoj from Dhani Jama village have been caught in a web of hospitals, tests and diagnoses since Susheela's nasbandi
PHOTO • Sanskriti Talwar
Susheela and Manoj from Dhani Jama village have been caught in a web of hospitals, tests and diagnoses since Susheela's nasbandi
PHOTO • Sanskriti Talwar

సుశీలకు నస్బంది అయినప్పటి నుండి, ధని జామా గ్రామానికి చెందిన సుశీల, మనోజ్‌లు- ఆసుపత్రులు, పరీక్షలు మరియు రోగ నిర్ధారణల వలయంలో చిక్కుకున్నారు

" వాహన్ జ్యాదాతార్ స్టాఫ్ హోతా కహన్ హై ? [అక్కడ ఎప్పుడూ సిబ్బంది ఎక్కువ ఉండకుంటుండే]," అని మనోజ్ చెప్పాడు. PHC వాళ్ళు సుశీలను తనిఖీ కూడా చేయకుండా నొప్పిని తగ్గించడానికి టాబ్లెట్‌లను అందచేసిర్రని మాకు మనోజ్ చెప్పాడు.

అప్పటికి, ఆమెను బలహీనపరిచే నొప్పి, వారి వైవాహిక జీవితంలో ప్రతిదానిపై ప్రభావం చూపడం ప్రారంభించింది. స్టెరిలైజేషన్ అయిన ఐదు నెలల తర్వాత, సుశీల తిరిగి బండికుయ్‌లోని మధుర్ ఆసుపత్రికి వెళ్లి, ఆ ప్రక్రియను నిర్వహించిన వైద్యుడిని కలిసింది.

పరీక్షల శ్రేణిలో ఉదర సోనోగ్రఫీని కూడా ఉంది. డాక్టర్ అది ఫెలోపియన్ ట్యూబ్‌లలో ఇన్ఫెక్షన్ అని ప్రకటించి, మూడు నెలల మందుల కోర్సును సూచించాడు.

“నా భార్యకు ఇన్ఫెక్షన్ ఎలా వచ్చింది? మీరు సర్జరీ సరిగ్గా చేయలేదా?" అని మనోజ్ డాక్టర్‌ని కోపంగా అడిగాడు. ఆ జంట తమకు వచ్చిన సమాధానాన్ని గుర్తుచేసుకున్నారు: " హమ్నె అప్నా కామ్ సహీ కియా హై, యే తుమ్హారీ కిస్మత్ హై [మా పని మేము బానే చేసాము. ఇది మీ విధి]," అని వైద్యుడు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు .

తర్వాతి మూడు నెలలు, ప్రతి 10 రోజులకు ఒకసారి, దంపతులు తమ మోటార్‌సైకిల్‌పై ఉదయం 10 గంటలకు ఇంటి నుండి మధుర్ ఆసుపత్రికి బయలుదేరి వెళ్ళే వారు. రోజంతా చెక్-అప్‌లు, పరీక్షలు, సూచించిన మందులను కొనుగోలు చేయడంలోనే గడిపారు. మనోజ్ పని మానేశాడు. వారి ముగ్గురు కుమార్తెలు (ఇప్పుడు తొమ్మిది, ఏడు, ఐదు సంవత్సరాల వయస్సు), కుమారుడు (ఇప్పుడు నాలుగు సంవత్సరాలు), ధని జమాలో వారి తాతయ్యల వద్ద ఉన్నారు. ఒక్కో ప్రయాణానికి వారికి రూ. 2,000 నుండి రూ. 3,000 వరకు ఖర్చవుతుంది.

మూడు నెలల చికిత్స ముగిసే సమయానికి మనోజ్  బంధువుల నుంచి అప్పుగా తీసుకున్న రూ. 50 వేలు దాదాపు ఖర్చయిపోయాయి. BA గ్రాడ్యుయేట్ అయినప్పటికీ, అతనికి బెల్దారి (నిర్మాణ స్థలాలు లేదా పొలాల్లో పని చేయడం) ఉద్యోగాలే వచ్చేవి. అతనికి సాధారణ పని దొరికినప్పుడు నెలలో రూ 10,000 వరకు వచ్చేవి. సుశీల పరిస్థితి మారకపోగా, ఆ కుటుంబం అప్పులు చేసి ఆదాయాన్ని కోల్పోతోంది. జీవితం అస్పష్టంగా మారుతోంది, అని సుశీల చెప్పింది.

"నేను బహిష్టు సమయంలో నొప్పితో కుప్పకూలిపోయేదాన్ని లేదా రోజుల తరబడి పనిచేయలేనంత బలహీనంగా అయ్యేదాన్ని" అని ఆమె చెప్పింది.

Susheela first got a nasbandi at Madhur Hospital, Bandikui town, in June 2017
PHOTO • Sanskriti Talwar

జూన్ 2017లో బండికుయ్ పట్టణంలోని మధుర్ హాస్పిటల్‌లో సుశీల మొదటిసారిగా నస్బందీ చేయించుకున్నది

నవంబర్ 2018లో, మనోజ్ తన భార్యను తమ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దౌసాలోని జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మాతా మరియు శిశు ఆరోగ్య సేవల కోసం ఒక ప్రత్యేక విభాగం ఉంది. ఆ 250 పడకల ఆసుపత్రికి వారు వెళ్లిన రోజు, కారిడార్‌లో రోగుల క్యూ చాలా పెద్దగా ఉండే.

“నేను రోజంతా లైన్‌లో నిలబడే గడిపాను. చాలా అసహనానికి గురయ్యాను. కాబట్టి మేము దౌసాలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలని నిర్ణయించుకున్నాము, ”అని మనోజ్ చెప్పారు. అంతులేని ఆసుపత్రి సందర్శనలు, పరీక్షల సుడిగుండంలో మరొకసారి చిక్కుకుంటారని వారికి అప్పటికి తెలియదు. ఇప్పటికీ ఆమె అనారోగ్యానికి స్పష్టమైన నిర్ధారణ జరగనే లేదు.

దౌసాలోని రాజధాని హాస్పిటల్ మరియు మెటర్నిటీ హోమ్‌ క్యూలో ఎవరో చెప్పినట్లుగానే, సుశీల పాత సోనోగ్రఫీ రిపోర్ట్ తిరస్కరించి, తాజాది అడిగారు అక్కడి స్టాఫ్.

తరువాత ఏమి చేయాలో తెలియక అయోమయంలో ఉన్న మనోజ్, గ్రామంలోని ఒకరి సలహా తీసుకున్నాడు. కొన్ని వారాల తర్వాత దౌసాలోని ఖండేల్వాల్ నర్సింగ్ హోమ్‌కు సుశీలను తీసుకెళ్లాడు. ఇక్కడ మరొక సోనోగ్రఫీ టెస్ట్ జరిగింది. ఆ రిపోర్ట్ సుశీల ఫెలోపియన్ ట్యూబ్స్‌లో వాపు ఉందని సూచించింది. మరో దఫా మందులు వాడారు.

“ప్రైవేట్ ఆసుపత్రులలో పనిచేసే వ్యక్తులకు, ఇలాంటి విధానాల గురించి గ్రామస్తులకు ఏం అర్థం కాదని తెలుసు. వారు ఏది చెప్పినా మేము అంగీకరిస్తాము,” అని మనోజ్ చెప్పారు. వారు దౌసాలోని శ్రీ కృష్ణ హాస్పిటల్‌లో ఎలా చేరారు అనే దానిపై ఇప్పుడు చాలా గందరగోళం ఉంది. అక్కడ ఆసుపత్రిలో డాక్టర్ మరిన్ని పరీక్షలు మరియు మరొక సోనోగ్రఫీ తర్వాత, సుశీలకు కొద్దిగా ప్రేగులు వాచాయని చెప్పారు.

“ఒక ఆసుపత్రి, ట్యూబ్‌లు ఉబ్బినట్లు మాకు చెబుతుంది. మరొకరు ఇన్ఫెక్షన్ ఉందని చెబుతారు. మరియు మూడవది నా అంటరియా [పేగులు] గురించి మాట్లాడతారు. ప్రతి ఆసుపత్రికి అనుగుణంగా మందులు రాశారు. మేము ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పిచ్చిగా వెళ్తున్నాము. ఎవరు నిజం చెబుతున్నారో, ఏమి జరుగుతుందో తెలియదు, ”అని సుశీల చెప్పింది. ఆమె ప్రతి ఆసుపత్రిలో సూచించిన చికిత్సను తీసుకుంది, కానీ ఆమె లక్షణాలను ఏదీ తగ్గించలేదు.

దౌసాలోని ఈ మూడు ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించడం వల్ల మనోజ్ అప్పులు మరో రూ. 25,000 లకు పెరిగింది.

జైపూర్‌లో నివసించే దూరపు బంధువుతో సహా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ, తమ గ్రామానికి 76 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ట్ర రాజధానిలో మంచి ఆసుపత్రిని ఉంది అని సూచించారు.

మరోసారి దంపతులు తమ వద్ద లేని డబ్బును వెచ్చించి, జైపూర్‌కు వెళ్లేందుకు బయలుదేరారు. అక్కడ డాక్టర్. సర్దార్ సింగ్ మెమోరియల్ హాస్పిటల్‌లో, సుశీలకు గర్భాశయంలో 'గాంత్' (ఎదుగుదల) ఉందని మరొక సోనోగ్రఫీ వెల్లడించింది.

" గాంత్ పెద్దదిగా పెరుగుతుంది అని డాక్టర్ మాకు చెప్పారు. నేను బచ్చెదాని కా ఆపరేషన్ [గర్భాశయాన్ని తొలగించడానికి హిస్టరెక్టమి] చేయించుకోవాలని అతను చాలా స్పష్టంగా చెప్పాడు,” అని సుశీల మాకు చెప్పారు.

Illustration: Labani Jangi

ఇల్లస్ట్రేషన్: లాబాని జంగి

RTI ప్రకారం రాజస్థాన్‌లోని బండికుయ్ పట్టణంలో, ప్రతీ ఐదు ప్రైవేట్ ఆసుపత్రుల్లో మూడింటిలో (ఏప్రిల్ మరియు అక్టోబర్ 2010 మధ్యకాలంలో) మహిళలకు నిర్వహించిన 385 శస్త్రచికిత్సలలో 286 గర్భాశయ శస్త్రచికిత్సలు జరిగినట్లు ఆర్టీఐ చూపింది.ఈ మహిళల్లో అత్యధికులు 30 ఏళ్లలోపు వారే. అందులోనూ అతి చిన్న వయస్సు కేవలం 18 సంవత్సరాలే

చివరకు డిసెంబర్ 27, 2019న, 30 నెలల బాధ, కనీసం ఎనిమిది ఆసుపత్రుల తిరిగిన తర్వాత, సుశీలకు దౌసాలోని మరో ప్రైవేట్ ఆసుపత్రి అయిన శుభి పల్స్ హాస్పిటల్ మరియు ట్రామా సెంటర్‌లో ఆమె గర్భాశయాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స జరిగింది. మనోజ్ గర్భాశయ శస్త్రచికిత్స పై రూ. 20,000, అదనంగా రూ. 10,000  మందులపై ఖర్చు చేశాడు.

నొప్పిని, ఈ  అప్పుల చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి గర్భాశయాన్ని తొలగించడం మాత్రమే మార్గమని దంపతులు బలవంతంగా అంగీకరించవలసి వచ్చింది.

బాండికుయ్‌లో ఐదు ప్రైవేట్ ఆసుపత్రులలో నిర్వహించిన గర్భాశయ శస్త్రచికిత్సల సంఖ్యను పరిశోధించడానికి నవంబర్ 2010లో సమాచార హక్కు (RTI) దరఖాస్తును దాఖలు చేసిన ప్రభుత్వేతర సంస్థ అయిన అఖిల్ భారతీయ గ్రాహక్ పంచాయితీలో న్యాయవాది దుర్గా ప్రసాద్ సైనీకి, మనోజ్ మరియు సుశీల పడిన కష్టాలను మేము వివరించాము.

సమాచారం అందించిన ఐదు ప్రైవేట్ ఆసుపత్రులలో మూడింటిలో, ఏప్రిల్ మరియు అక్టోబర్ 2010 మధ్య కాలంలో మహిళలకు నిర్వహించిన 385 శస్త్రచికిత్సలలో 286 గర్భాశయ శస్త్రచికిత్సలు జరిగినట్లు RTI చూపించింది. చిత్రంగా సాధారణ ఆసుపత్రులైన మధుర్ హాస్పిటల్ (సుశీలకు స్టెరిలైజేషన్ చేసిన ప్రదేశం), మదన్ నర్సింగ్ హోమ్, బాలాజీ హాస్పిటల్, విజయ్ హాస్పిటల్, కట్టా హాస్పిటల్. గర్భాశయ శస్త్రచికిత్స చేయించుకున్న మహిళల్లో ఎక్కువ మంది 30 ఏళ్లలోపు వారే, అందులో చిన్న వయస్సు కేవలం 18 ఏళ్లు. చాలా మంది మహిళలు జిల్లాలోని బైర్వ, గుజ్జర్, మాలి వంటి షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల వర్గాలకు చెందినవారు. మనోజ్, సుశీల బైర్వ కమ్యూనిటీకి చెందినవారు. వారి గ్రామమైన ధని జమాలో 97 శాతం జనాభా షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు.

"మేము ఆడ శిశుహత్య సమస్య గురించి చర్చిస్తున్నాము, ఇంతలో ఎవరో పార్ కోఖ్ హై కహాన్ [అయినా ఎంతమంది స్త్రీలకు గర్భాశయం ఉంది] అని ఎత్తిచూపారు," అని సైనీ వివరించారు. ఈ వ్యాఖ్య, ఏదో తప్పు జరిగిందని వారు అనుమానించేలా చేసింది.

“వైద్యులు, పిహెచ్‌సి సిబ్బంది మరియు ఆశా వర్కర్ల మధ్య ఏర్పడిన ఒప్పందం (పెద్ద సంఖ్యలో అనవసరమైన గర్భాశయ శస్త్రచికిత్సలు) వలన ఇలా జరుగుతుందని అని మేము నమ్ముతున్నాము. కాని మేము దానిని నిరూపించలేకపోయాము,” అని సైనీ నివేదించారు. రాజస్థాన్, బీహార్ మరియు ఛత్తీస్‌గఢ్‌లలో లాభదాయకమైన ప్రైవేట్ ఆసుపత్రులలో "గర్భసంచి తొలగింపు కుంభకోణాలకు" వ్యతిరేకంగా 2013లో సుప్రీంకోర్టులో రాజస్థాన్‌కు చెందిన ప్రయాస్ అనే లాభాపేక్ష లేని సంస్థ-స్థాపకుడు డాక్టర్ నరేంద్ర గుప్తా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)లో బండికుయ్ ఫలితాలు చేర్చబడ్డాయి. శస్త్రచికిత్స చేయించుకున్న మహిళలకు నష్టపరిహారంతోపాటు పాలసీ విధానాలలో తగిన మార్పులు చేయాలని పిటిషన్‌లో కోరారు.

“బీహార్, ఛత్తీస్‌గఢ్ మరియు రాజస్థాన్‌లలో ఇంటర్వ్యూ లో పాల్గొన్న చాలా మంది మహిళలు శస్త్రచికిత్స అత్యవసరమని నమ్మి తప్పుదోవ పడిన వారే” అని పిఐఎల్ పేర్కొంది. "వైద్యుల సలహాలను పాటించకపోతే వారికి క్యాన్సర్ వస్తుందని నమ్మించారు."

'We believed it [the unnecessary hysterectomies] was the result of a nexus...But we couldn’t prove it', said advocate Durga Prasad Saini
PHOTO • Sanskriti Talwar

'అనవసరమైన హిస్టెరెక్టమీలు ఒప్పందం యొక్క ఫలితమని మేము నమ్ముతున్నాము... కానీ మేము దానిని నిరూపించలేము' అని న్యాయవాది దుర్గా ప్రసాద్ సైనీ అన్నారు

గర్భసంచి తొలగింపు వలన జరిగే ప్రమాదాలు, దీర్ఘకాలిక దుష్ప్రభావాలతో సహా అవసరమైన సమాచారం - తరచుగా మహిళల వరకు చేరదని, వారు శస్త్రచికిత్సకు ముందు వారి అనుమతి తీసుకున్నారా అనే సందేహాన్ని కలిగిస్తుందని పిటిషన్ లో జోడించారు.

అనవసరమైనప్పుడు శస్త్రచికిత్సలు చేశారని మీడియాలో కథనాలు రావడంతో ప్రైవేట్ ఆసుపత్రులు, వైద్యులు ఆ ఆరోపణలను ఖండించారు.

“దౌసా జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, ఇప్పుడు సూచించబడినప్పుడు మాత్రమే గర్భాశయ శస్త్రచికిత్సను నిర్వహిస్తాయి. కానీ అంతకుముందు అలా కాదు. ఇది తనిఖీ చేయబడలేదు, పైగా  ఈ  శస్త్ర చికిత్సలు బాగా జరిగేవి. గ్రామస్తులు మోసపోయారు. స్త్రీలకు రుతుక్రమానికి సంబంధించిన ఉదర సంబంధ సమస్యలు ఏవైనా వచ్చినా, వారిని ఒకచోటి నుంచి మరొక చోటికి పంపి, చివరకు గర్భాశయాన్ని తొలగించమని చెబుతారు, ”అని సైనీ చెప్పారు.

2015-16లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ( NFHS-4) యొక్క నాల్గవ రౌండ్‌లో గర్భాశయ శస్త్రచికిత్సలను చేర్చాలని డాక్టర్ గుప్తా యొక్క పిటిషన్ ప్రభుత్వాన్ని ప్రేరేపించింది. దీని ద్వారా 15నుండి 49 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలలో 3.2 శాతం మంది గర్భసంచి తొలగింపులు చేయించుకున్నారని వెల్లడయింది. వీటిలో 67 శాతానికి పైగా భారతదేశంలోని ప్రైవేట్ హెల్త్‌కేర్ రంగంలో జరిగాయి. NFHS-4 ప్రకారం, రాజస్థాన్‌లో 15 నుండి 49 సంవత్సరాల మధ్య 2.3 శాతం మంది మహిళలు గర్భాశయ శస్త్రచికిత్స చేయించుకున్నారు.

గర్భాశయాన్ని తొలగించిన తర్వాత ప్రయాస్ నిజనిర్ధారణ బృందాలు సంప్రదించిన చాలా మంది మహిళలు శస్త్రచికిత్స తర్వాత కూడా లక్షణాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆమె గర్భాశయాన్ని తొలగించిన రెండు నెలల తర్వాత, మేము సుశీలను ఆమె ఇంటిలో కలిసినప్పుడు, ఆమె బకెట్లు ఎత్తడంతో పాటు ఇతర ఇంటి పనులు చేస్తోంది. అయినప్పటికీ శస్త్రచికిత్స గాయాలు ఇంకా లేతగా ఉన్నాయి, ఆమెను జాగ్రత్తగా ఉండమని చెప్పారు. మనోజ్ తిరిగి పనిలోకి చేరాడు. అతను సంపాదిస్తున్న దానిలో సగానికి పైగా తన భార్య ఎదుర్కొనే నిరంతర ఆరోగ్య సమస్యలను తీర్చడానికి, వడ్డీ వ్యాపారులకు బంధువుల నుండి తీసుకున్న లక్ష రూపాయిల అప్పు తీర్చడానికే సరిపోతుంది. వారు సుశీల నగలను కూడా రూ. 20,000-30,000కు అమ్మి వేసారు.

గత మూడు సంవత్సరాలలో జరిగిన సంఘటనల నుండి ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్న ఈ జంట, ఈ దీర్ఘకాలం నొప్పికి  రక్తస్రావానికి నిజంగా కారణమేమిటో, ఆమె గర్భాశయాన్ని తొలగించడం చివరకు సరైన చికిత్స అవునో కాదో ఖచ్చితంగా తెలియదు. ఇప్పటికైతే సుశీలకు మరలా బాధ లేదని వారు నిశ్చింతగా ఉన్నారు.

" పైసా లగాతే లగతే ఆద్మీ థక్ జాయే తో ఆఖిర్ మే యాహీ కర్ సక్తా హై ," అని మనోజ్ చెప్పారు - ఒక వ్యక్తి  డబ్బు ఖర్చు చేయడంలో అలసిపోయి, చివరికి సరైన పనే చేసానని తృప్తి పడవచ్చు.

పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. అట్టడుగున ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? ఐయితే [email protected] కి ఈమెయిల్ చేసి అందులో [email protected] కి కాపీ చేయండి.

అనువాదం: జి విష్ణు వర్ధన్

Anubha Bhonsle is a 2015 PARI fellow, an independent journalist, an ICFJ Knight Fellow, and the author of 'Mother, Where’s My Country?', a book about the troubled history of Manipur and the impact of the Armed Forces Special Powers Act.

Other stories by Anubha Bhonsle
Sanskriti Talwar

Sanskriti Talwar is an independent journalist based in New Delhi, and a PARI MMF Fellow for 2023.

Other stories by Sanskriti Talwar
Illustration : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi
Editor : Hutokshi Doctor
Series Editor : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : G. Vishnu Vardhan

G. Vishnu Vardhan obtained a Post-graduation Diploma in Rural development and management from Hyderbad. Currently he works with ICRISAT in tribal agency area of Utnoor, Telangana.

Other stories by G. Vishnu Vardhan