నేను గాంధీనగర్, అలళగపురి గ్రామాలకు వచ్చినప్పుడు ఆ గ్రామాలు రెండూ అందోళనగా ఉన్న జనంతో క్రిక్కిరిసి ఉన్నాయి. ఈ రెండు దళిత (షెడ్యూల్డ్ కాస్ట్) గ్రామాలను విడదీస్తూ మధ్యలో ఒక రోడ్డు ఉంది. అక్కడ అనేకమంది పోలీసులతోపాటు వాహనాలు కూడా ఉన్నాయి. శివకాశి పట్టణంలోని కనిష్క బాణాసంచా కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది కార్మికులు మరణించారనే విధ్వంసకర వార్త, ఈ సముదాయాన్ని తీవ్రంగా కలచివేసింది. చనిపోయినవారిలో ఆరుగురు ఒక్క గాంధీనగర్ గ్రామానికే చెందినవారు, అందరూ దళితులు కూడా.

చనిపోయిన తమ ప్రియమైనవారి కోసం జనం వీధుల్లో రోదిస్తున్నారు. కొంతమంది విరుధునగర్ జిల్లాలోని గ్రామాల్లో ఉండే తమ బంధువులకు ఫోన్‌ల ద్వారా ఈ వార్తను చేరవేస్తున్నారు.

కొంతసేపటికి, ఆ జనసమూహం శ్మశానం వైపుకు సాగుతుండటంతో, నేను కూడా వారితో కలిశాను. అక్టోబర్ 17, 2023న జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన ఆ గ్రామానికి చెందిన ఆరుగురు కార్మికులకు తుది వీడ్కోలు పలికేందుకు గ్రామం గ్రామమంతా శ్మశానానికి తరలివస్తోంది. కాలిపోయిన మృతదేహాలను తొలగించే బాధ్యతలో ఉన్న ఒక అగ్నిమాపక దళ ఉద్యోగి, వాటిని పోస్ట్‌మార్టం కోసం వెలికి తీయడంలో ఉన్న ఇబ్బందులను వివరిస్తున్నారు.

రాత్రి 8.30 సమయంలో ఆరు ఆంబులెన్సులు శ్మశానవాటిక వద్దకు రావటంతోనే, అక్కడి జనసమూహమంతా దుఃఖంతో కేకలు వేస్తూ వాటివైపుకు పరుగులుతీశారు. ఒక్క క్షణం పాటు నేను నా ఉద్యోగాన్ని మరిచిపోయాను; నా కెమెరాను బయటకు తీయలేకపోయాను. రాత్రి చీకటి కప్పివేసిన ఆ శ్మశానవాటికలో, ఒక దీపం చుట్టూ ఎగురుతోన్న చెదపురుగులు అక్కడ గుంపుకట్టిన గ్రామస్తులలాగా కనిపిస్తున్నాయి.

వారి శరీరాలను బయటకు తీయటంతోనే, ఆ సమూహమంతా వెనక్కు వెళ్ళిపోయింది - మాంసం కాలిన వాసన భరించరానిదిగా ఉంది. కొంతమంది వాంతులు కూడా చేసుకున్నారు. మృతదేహాలు వారి పేర్లు రాసివున్న చీటీలతో వచ్చినందువలన మాత్రమే వాటిని గుర్తించడానికి వీలయింది. జనం దూరంగా వెళ్ళిపోవడంతో, ఆ శ్మశానవాటిక ఒంటరిగా నిలబడిపోయింది.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: శివకాశిలోని కనిష్క బాణాసంచా తయారీ కర్మాగారంలో జరిగిన ప్రమాదం 14 మంది కార్మికుల ప్రాణాలను తీసింది. కుడి: అగ్నిప్రమాదంలో మరణించిన బాధితులలో ఒకరైన ఎమ్. బాలమురుగన్ ఇంటివద్ద గుమిగూడిన ప్రజలు

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: శ్మశానం వైపుకు వెళ్తోన్న మరణించిన వ్యక్తి బంధువులు, స్నేహితులు. కుడి: చీకటి పడుతున్నప్పటికీ శవాల కోసం ఎదురుచూస్తూన్న ప్రజలు

పద్నాలుగేళ్ళ ఎమ్. సంధ్యకు శాస్త్రవేత్త కావాలని కల. ఈ ప్రమాదంలో తన తల్లి మునీశ్వరిని పోగొట్టుకున్న సంధ్య తన కల గురించి తిరిగి ఆలోచిస్తోంది. సంధ్య తల్లి ఈ కర్మాగారంలో గత ఎనిమిదేళ్ళుగా పనిచేస్తున్నారు; తన కూతురి అవసరాలను తీర్చేందుకు ఆమె ఎక్కువ సమయాలు పనిచేశారు. ఒంటరి తల్లి అయిన ఆమె తాను చేయగలిగినంత చేసేదని సంధ్య బాగోగులు చూసుకుంటోన్న ఆమె పాట్టీ (నాయనమ్మ) అన్నారు. "మా పాట్టీ ఎంతకాలం నన్ను చూసుకోగలదో నాకు తెలియటంలేదు. ఆమె చాలా తీవ్రమైన మధుమేహంతో బాధపడుతోంది," అంటోంది సంధ్య.

ఈ విషాదకర సంఘటనలో పంచవర్ణం తన భర్తను పోగొట్టుకున్నారు. "బయట ఉంచిన బాణాసంచా శాంపిళ్ళకు నిప్పంటుకుంది," చెప్పారామె. "బయటకు వెళ్ళే ద్వారానికి దగ్గరగా కూర్చొని ఉన్న నేను తప్పించుకున్నాను. కానీ పొగవల్ల అతను బయటికి రాలేకపోయాడు.”

తప్పించుకుంటుండగా తనకు ఏర్పడిన కాలిన బొబ్బలనూ, గీతలనూ ఆమె నాకు చూపించారు. "మామూలుగా కొనుగోలుదారులు పెద్దమొత్తంలో బాణసంచాను కొన్నప్పుడు, అవి ఎలా పేలతాయో పరీక్షించి చూడాలనుకుంటారు. అలా చేయాలంటే వాళ్ళు కర్మాగారానికి కనీసం ఒక కిలోమీటరు దూరం వెళ్ళాల్సివుంటుంది. కానీ ఈ సంఘటన జరిగినరోజున, ఫ్యాక్టరీ పరిసరాలకు దగ్గరలోనే వాళ్ళు వాటిని పరీక్షించారు. ఆ సందర్భంగా ఎగసిన నిప్పురవ్వలు అన్ని చోట్లకూ చెల్లాచెదురుగా పడిపోయాయి. అలాగే ఫ్యాక్టరీ పైకప్పుపై పడిన రవ్వలు అక్కడినుంచి మేము పేరుస్తూ ఉన్న బాణాసంచా మీద పడ్డాయి. కొన్ని సెకన్లలోనే ఆ గది మొత్తానికీ నిప్పంటుకుంది. అక్కడ పనిచేస్తోన్న 15 మంది కార్మికులలో 13 మంది మంటల్లో చిక్కుకుపోయారు. మూడవ డిగ్రీ కాలిన గాయాలతో తప్పించుకొన్న ముగ్గురు ఈ ప్రమాదం జరిగిన సమయంలో మరుగుదొడ్డిలో ఉన్నారు. లేనట్లయితే వారు కూడా ప్రాణాలతో మిగిలివుండేవారు కాదు. వాళ్ళు బయటికి పరుగెత్తుతున్నప్పుడు వారి చీరలకు మంటలు అంటుకున్నాయి," అని ఆమె చెప్పారు.

పంచవర్ణం, ఆమె భర్త బాలమురుగన్‌ల ఆదాయం వాళ్ళు ఎన్ని గంటలు శారీరక శ్రమ చేస్తారనే దానిపై ఆధారపడి ఉండేది. కష్టపడి సంపాదించిన డబ్బుతో వారు బి.ఎస్సీ. నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతోన్న ఒక కూతురినీ, ఐటిఐలో డిప్లొమా ఉన్న ఒక కొడుకునూ పెంచుకొస్తున్నారు. భర్త బాలమురుగన్‌ను గుర్తుచేసుకుంటూ, "తన పిల్లల్ని చదివించేందుకు అతను ఏం చేయటానికైనా సిద్ధంగా ఉండేవాడు," అన్నారు పంచవర్ణం. "ఆయనెప్పుడూ ఒకే విషయం గురించి నొక్కిచెప్పేవాడు: విద్య. ఆయన బాధలు పడినట్లుగా మేం పడకూడదనుకునేవాడు" అని వారి కూతురు భవాని అన్నది.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

రాత్రి 8.30 గంటలకు శ్మశానానికి వస్తోన్న (ఎడమ) మొదటి ఆంబులెన్స్; దీని వెనుకే మరో ఐదు వచ్చాయి (కుడి)

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: మరణించిన కార్మికులను వారిని చుట్టివుంచిన గుడ్డపై రాసిన సంఖ్య ద్వారా గుర్తించవచ్చు. కుడి: అంబులెన్స్ నుండి మృతదేహాలను దించుతుండగా దుఃఖంతో చూస్తోన్న కుటుంబం, స్నేహితులు

అగ్నిప్రమాదం, ఆ తర్వాతి ఆసుపత్రి ఖర్చుల తర్వాత ప్రస్తుతం పంచవర్ణం, ఆమె కుటుంబం అప్పుల్లో కూరుకుపోయారు. తనకున్న మూత్రపిండాల సమస్య వలన ఇప్పటివరకూ ఆమెకు ఐదుసార్లు శస్త్రచికిత్సలు జరిగాయి. నెలకు రూ. 5000 ఖరీదు చేసే మందులను వాడాలని వైద్యులు ఆమెకు సలహా ఇచ్చారు. "మేమింకా మా అమ్మాయి కాలేజీ ఫీజు (రూ. 20000) కూడా కట్టలేదు. దీపావళికి మాకు వచ్చే బోనస్ డబ్బులతో కట్టేద్దామని అనుకున్నాం," అన్నారామె. చివరకు ఆరోగ్య పరీక్షలు చేయించుకునే స్తోమత కూడా పంచవర్ణంకు లేదు; తన ఒంట్లోని ఉప్పు నిల్వలను పరిమితిలో ఉంచుకునేందుకు మందు బిళ్ళలు మింగుతూ రోజులు గడుపుతున్నానని ఆమె అన్నారు.

బాలమురుగన్, పంచవర్ణంల చిన్నబిడ్డ, భవాని. 18 ఏళ్ళ భవానీ ఇప్పటికీ తన తండ్రి మరణాన్ని గురించి పూర్తిగా జీర్ణించుకునే క్రమంలోనే ఉంది. “మమ్మల్ని చాలా బాగా చూసుకునేవాడు, మేం ఇంట్లో ఎలాంటి పనులు చేయకుండా చూసేవాడు. ఇంట్లో అన్నీ ఆయనే చూసుకునేవాడు. మా అమ్మకి జబ్బుగా ఉండడం వలన ఇంటిని శుభ్రంచేయటం, వంట చేయగలిగేది కాదు. అన్నీ ఆయనే చేసేవాడు, నేను చేయాలని ఆశించేవాడు కాదు." ఈ తోబుట్టువులిద్దరూ తమ తండ్రిపై ఎక్కువగా ఆధారపడి ఉన్నారు, ఇప్పుడు ఆయన లేని లోటుతో కష్టపడుతున్నారు.

ప్రభుత్వం నష్టపరిహారంగా రూ. 3 లక్షలు అందించింది; ఆ మొత్తానికి చెక్కును వీరు కలెక్టర్ కార్యాలయం ద్వారా అందుకున్నారు. ఫ్యాక్టరీ రూ. 6 లక్షలను నష్టపరిహారంగా వారికి గత అక్టోబర్‌లో చెల్లించింది. ఈ బాణాసంచా తయారీ కంపెనీలో గత 12 ఏళ్ళుగా తాను, తన భర్త బాలమురుగన్ విశ్వాసంగా పనిచేస్తున్నందున ఫ్యాక్టరీ యాజమాన్యం తమకు తప్పకుండా సాయం చేస్తుందని పంచవర్ణం నమ్మకంతో ఉన్నారు.

గాంధీనగర్ గ్రామానికి చెందిన స్త్రీపురుషులంతా పొలాలలో గానీ, బాణాసంచా కర్మాగారంలోగానీ దినసరి కూలీలుగా పనిచేస్తుంటారు. పొలాల యజమానులైన భూస్వాముల కంటే ఈ బాణసంచా తయారీ కర్మాగారం వాళ్ళు కొంచం ఎక్కువ కూలిడబ్బులు ఇస్తుండటంతో పంచవర్ణం కుటుంబం ఇందులో పనిచేయడాన్ని ఎంచుకొంది.

ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్ళినప్పటి నుంచి వారి 19 ఏళ్ళ కుమారుడు పాండియరాజన్ భయంతోనూ బాధతోనూ కొయ్యబారిపోయాడు. అది అతన్ని కుదిపేసిందని అతని చెల్లెలు చెప్పింది. "ఆరోజు ఆయన (వాళ్ళ నాన్న) చివరిగా నాకే కాల్ చేసి మాట్లాడాడు. నేను మధ్యాహ్నం అన్నం తిన్నానో లేదో కనుక్కోవడానికి చేశాడు. ఒక అరగంట తర్వాత ఆయన సహోద్యోగి నాకు కాల్ చేసి ఈ ప్రమాదం గురించి చెప్పాడు. నేను వెంటనే అక్కడికి చేరుకున్నాను, కానీ వాళ్ళు నన్ను లోనికి రానివ్వలేదు. ఆసుపత్రికి చేరిన తర్వాతే ఆయన బతికిలేడని నాకు తెలిసింది," చెప్పాడు పాండియరాజన్.

"ఇకపై ఎలా జీవించాలో మాకు తెలియటంలేదు. మా అమ్మ ఏం చెప్తే అది చేయాలని నిర్ణయించుకున్నాం. ఆమె మమ్మల్ని ఆత్మహత్య చేసుకోమని చెప్పినా చేసుకుంటాం. ఎంతకాలమని మా బంధువులు మాకు ఆశ్రయాన్నిచ్చి మా సంరక్షణను చూస్తారు?" అని అడుగుతోంది భవాని.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: దహనక్రియలకు స్థలాన్ని సిద్ధం చేయడం కోసం తమ మొబైల్ టార్చ్‌లను ఉపయోగిస్తోన్న జనం. కుడి: మొత్తం ఆరు మృతదేహాలను కలిపే దహనం చేశారు

PHOTO • M. Palani Kumar

బంధువులూ స్నేహితులూ వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపటి వరకూ చీకటిలో మండుతోన్న చితిమంటలు

అగ్ని ఆమె జీవితాన్ని కబళించే సమయానికి తమిళసెల్వికి 57 ఏళ్ళు. ఆమె ఆ బాణాసంచా ఫ్యాక్టరీలో 23 ఏళ్ళ క్రితం పనిలోకి చేరారు. అప్పుడు రూ. 200గా ఉన్న ఆమె రోజు కూలీ క్రమంగా రూ. 400కు పెరిగింది. "నాకు రెండేళ్ళ వయసప్పుడు మా నాన్న చనిపోయాడు.అప్పటి నుంచి నాకూ, మా అన్నకూ మా అమ్మే అన్నీ సమకూర్చింది," ఆమె చిన్న కొడుకు టి. ఈశ్వరన్ చెప్పాడు. అతనూ, అతని అన్నా కూడా పట్టభద్రులు. "నేను కంప్యూటర్ సైన్స్, నా అన్న బి.ఎస్సీ. చేశాం," చెప్పాడతను.

తమిళసెల్వి పెద్ద కొడుకు ప్రస్తుతం తిరుపూర్‌లో పోలీసు అధికారిగా పనిచేస్తున్నాడు. "ఆమె తన జీవితమంతా తన కొడుకుల ఉన్నతి కోసమే పని చేసింది, కానీ వాళ్ళిప్పుడు ఎక్కబోయే శిఖరాలను ఇక ఆమె ఎన్నటికీ చూడలేదు," అని ఆమె బంధువులు చెప్పారు.

రసాయన పదార్థాలను ఎండబెట్టడం, వాటిని కాగితంలో చుట్టి, పేలుడు రసాయనాలతో వాటిని నింపడం, చివరకు వాటిని ఒకదానితో ఒకటి కట్టడం- ఈ పనులన్నీ చేస్తే, రోజుకు సుమారు రూ. 250 కూలీ వస్తుందని అగ్ని ప్రమాదం నుంచి బతికి బయటపడిన కురువమ్మ చెబుతున్నారు. అయితే వారం చివరిలో మాత్రమే వారికి ఆ డబ్బును అందజేస్తారు. వారికి సాధారణ పెంపుదలలు ఉండవు, అందుకు బదులుగా వారికి బోనస్ ఇస్తారు. సెలవు తీసుకోకుండా కర్మాగారంలో పనిచేసేవారు, ప్రతి ఆరు నెలలకు రూ. 5,000 బోనస్‌కు అర్హులు.

చాలా కుటుంబాలు మహిళల ఆదాయంపైనే ఆధారపడి ఉండటం వలన ఈ గ్రామంలోని చాలామంది మహిళలు కఠినమైన పనిపరిస్థితులు ఉన్నప్పటికీ ఈ కర్మాగారాల్లో పనిచేస్తున్నారు. తన కుటుంబాన్ని భుజాలపై మోసిన మహిళల్లో, అగ్నిప్రమాదంలో కాలిన గాయాలకు చనిపోయిన కురువమ్మాళ్ కూడా ఒకరు. ఆమె భర్త సుబ్బుక్కణ్ణి బోరుబావులలో పనిచేస్తున్న సమయంలో జరిగిన ఇటువంటి అగ్ని ప్రమాదంలోనే పాక్షికంగా చూపును కోల్పోయారు. అతను ఇకపై రోజువారీ కూలీ చేయలేరు. ఇప్పుడు కురువమ్మాళ్ కూడా పోవడంతో, ముగ్గురు సభ్యులున్న ఆ కుటుంబం కూలిపోయే ప్రమాదం అంచున ఉంది. "నేను చూపు కోల్పోయిన తర్వాత నాకు దారి చూపిన నా వెలుగు ఆమె," అని సుబ్బుక్కణ్ణి నీళ్ళు నిండిన కళ్ళతో చెప్పారు.

PHOTO • M. Palani Kumar

చనిపోయిన బాలమురుగన్ భార్య పంచవర్ణం, వారి పిల్లలు పాండియరాజన్, భవాని

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: బాలమురుగన్ తన కుటుంబాన్ని యాత్రలకు తీసుకువెళ్ళేవారు. వాళ్ళు కన్యాకుమారి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో. కుడి: భవానీ ఫోన్‌లో ఉన్న బాలమురుగన్ ఫోటో

ఈ భయంకరమైన అగ్నిప్రమాదానికి గురైన మరొక బాధితురాలు ఇంద్రాణి. తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడే ఆమెకు 30 నిమిషాల కంటే ఎక్కువసేపు నిలబడటం దాదాపు అసాధ్యంగా ఉండేది. కానీ మూర్ఛవ్యాధితో బాధపడుతున్న తన భర్తను, తన పిల్లలను పోషించుకోవడం కోసం ఆమె ఈ పనికి వెళ్ళవలసివచ్చింది. ఒక ఒంటిగది ఇంట్లో నివసించే నలుగురితో కూడిన వారి కుటుంబం, కొంత డబ్బు అప్పు చేసి మరో గదిని ఏర్పాటు చేసుకున్నారు.

"వచ్చే ఆరు నెలలలో మా అప్పులన్నీ తీర్చేయాలని మా అమ్మా నేనూ ప్రణాళికలు వేసుకున్నాం. ఆమె నా పెళ్ళి విషయం గురించి కూడా బాధపడుతుండేది. మూర్ఛవ్యాధి ఉన్న తండ్రి, జబ్బుగా ఉండే తల్లి ఉన్న పేద అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని ఎవరు మాత్రం అనుకుంటారు?" ఇంద్రాణి కుమార్తె, కార్తీశ్వరి అంటోంది. ఈ ఏడాది ప్రభుత్వ ఉద్యోగం కోసం గ్రూప్ 4 రాయాలని ఆమె అనుకుంటోంది. "కోచింగ్ సెంటర్లు డిమాండ్ చేసే ఫీజును కట్టే స్తోమత నాకు లేదు," అంటోందామె.

వీరి తండ్రి డిసెంబర్ 2023లో చనిపోవడంతో ఈ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. క్రిస్మస్ తారను కడుతున్నపుడు ఆయన జారి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పుడీ చిన్న అమ్మాయి కార్తీశ్వరి తన కుటుంబానికున్న అప్పులతోనూ, గ్రూప్ 4 రాయాలన్న తన ఆకాంక్షతోనూ ఒంటరిగా మిగిలిపోయింది.

గ్రామానికే చెందిన గురువమ్మ వంటి కొందరు మహిళలు, కత్తిరించిన అగ్గిపుల్లలను 110 పెట్టెలలో పెట్టి ప్యాకింగ్ చేయడానికి కేవలం మూడు రూపాయల కూలీకి అగ్గిపెట్టెల కర్మాగారంలో పనిచేసేవారు. తాము అతి తక్కువ వేతనాలతో దోపిడీకి గురవుతున్నామని గుర్తించిన మహిళలు, పనికోసం బాణాసంచా ఫ్యాక్టరీకి తరలివెళ్లాలని సమష్టిగా నిర్ణయం తీసుకున్నారు.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: మునీస్వరి వారపు కూలీని నమోదు చేసే ఖాతా పుస్తకం. వారానికి ఆమె సంపాదన ఎన్నడూ వెయ్యి రూపాయలకు చేరుకోలేదు. కుడి: సంధ్య, మునీశ్వరులు తిరుచెందూరులో తీయించుకున్న ఫోటో

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: అగ్ని ప్రమాదంలో చనిపోయిన తన తల్లి మునీశ్వరికి సంధ్య రాసిన ఉత్తరం. కుడి: తన నాయనమ్మతో సంధ్య

ఈ గ్రామంలో ఉపాధి కోసం ఉన్న మరో పని, వ్యవసాయం మాత్రమే. కానీ కరవు, అనావృష్టి వల్ల వ్యవసాయ భూములు సాగుచేయడానికి వీల్లేని విధంగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో తగినన్ని భూగర్భ జలాలు ఉన్నా, అక్కడి భూస్వాములు న్యాయమైన కూలీని చెల్లించడంలేదు. కాబట్టి, కురువమ్మ వంటి మహిళలు ఫ్యాక్టరీలో పని చేస్తూనే గొర్రెలనూ పశువులను కూడా పెంచుతుంటారు. అయితే, ఇక్కడ కూడా కరవు కారణంగా పశువుల మేతకు గడ్డి భూములు లేకపోవడంతో వారు అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు.

గ్రామీణులకు అందుబాటులో ఉన్న ఏకైక ఇతర ప్రత్యామ్నాయ ఉపాధి MNREGA. రాష్ట్రంలో దీనిని నూరు నాళ్ వేళై (100 రోజుల పని)గా వ్యవహరిస్తారు. 100 రోజుల పనిదినాన్ని ప్రభుత్వం 365 రోజులకు పొడిగిస్తే గ్రామంలోని మహిళలకు మేలు జరుగుతుందని భార్య తంగమాలైను కోల్పోయిన టి. మహేంద్రన్‌ అన్నారు.

ఈ ప్రాంతంలోని బాణాసంచా కంపెనీలకు సరైన లైసెన్స్ లేదని మహేంద్రన్ చెబుతున్నారు. వాటిని పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ అధికారులు ఆరు నెలలకు మించి ఈ ఫ్యాక్టరీలలో పనిని నిలిపివేసే సాహసాన్ని చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఫలితంగా, మళ్ళీ ఏడవ నెలలో ఈ ఫ్యాక్టరీలను తిరిగి తెరుస్తున్నారు. ఇదే మొదటి ప్రమాదం కాదు: 2023 అక్టోబర్‌లో కృష్ణగిరిలో ఎనిమిది మంది దళిత చిన్నారులు చనిపోయారు. చదవండి: ‘ప్రతి ఇల్లూ ఒక శ్మశానమే .

బతికి ఉన్నవాళ్ళు ఎదుర్కొంటోన్న దుఃఖం, నష్టం, కఠినమైన వాస్తవాలతో నిండిన ఈ హృదయ విదారక సంఘటన సామాజిక, ప్రభుత్వ మద్దతుల తక్షణ అవసరాన్ని చాటిచెపుతోంది. ఈ సంఘటనలను ఎదుర్కొన్నవారి కథనాలు, మెరుగైన పని పరిస్థితులు, భద్రతా చర్యలు, సమగ్ర సామాజిక భద్రతా వలయం వంటివాటి అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. ప్రతి విషాదకర సంఘటన వెనుక, వెనుక మిగిలిపోయిన వారి కలలు, పోరాటాలు, వినాశకరమైన నష్టాలతో కూడిన మానవ జీవితాలు ఉన్నాయనే కఠిన వాస్తవాన్ని ఇది గుర్తుచేస్తోంది.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఈ ప్రమాదంలో చనిపోయిన ఎస్. కురువమ్మాళ్ (ఎడమ). ఆమె భర్త సుబ్బుక్కణ్ణికి కంటి చూపు సమస్య ఉండటంతో, కుటుంబాన్ని పోషించటం కోసం కురువమ్మాళ్ ఈ ఫ్యాక్టరీలో పనిచేసేవారు

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: ఈ ప్రమాదంలో చనిపోయిన ఇంద్రాణి. ఈ వీడియోను తన సెలవు దినాలలో తల్లితో కలిసి ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు ఆమె కుమార్తె కార్తీశ్వరి తీసింది. కుడి: భర్త మురుగానందంకు ఏకైక సంరక్షకురాలు ఇంద్రాణి. ఆమె మరణం తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. 2023 డిసెంబర్‌లో, కుర్చీ మీది నుండి జారిపడి ఆయన మరణించారు

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: చనిపోవడానికి ముందు ఇంద్రాణి కట్టుకున్న చీర. కుడి: ఇంద్రాణి కట్టిన చిన్న గదిలో నిలబడి ఉన్న ఆమె కుమార్తె కార్తీశ్వరి

PHOTO • M. Palani Kumar

ప్రమాదంలో కాలిన గాయాలతో బతికి బయటపడ్డ ఎస్. మురుగాయి

PHOTO • M. Palani Kumar

తంగమాలై ఫోటో కోసం వెతుకుతోన్న ఆమె భర్త. ఆమె ఈ ప్రమాదంలో మరణించారు

PHOTO • M. Palani Kumar

తామిద్దరూ కలిసి తీయించుకున్న చివరి ఫోటోను పట్టుకొని ఉన్న ముత్తులక్ష్మి భర్త

PHOTO • M. Palani Kumar

'ప్రమాదానికి సంబంధించిన ఈ ఛాయాచిత్ర కథనం కార్తీశ్వరి జీవితానికి కొంత వెలుగునిస్తుందని నేను నమ్ముతున్నాను' అంటారు ఫోటోగ్రాఫర్ పళని కుమార్

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

M. Palani Kumar

M. Palani Kumar is Staff Photographer at People's Archive of Rural India. He is interested in documenting the lives of working-class women and marginalised people. Palani has received the Amplify grant in 2021, and Samyak Drishti and Photo South Asia Grant in 2020. He received the first Dayanita Singh-PARI Documentary Photography Award in 2022. Palani was also the cinematographer of ‘Kakoos' (Toilet), a Tamil-language documentary exposing the practice of manual scavenging in Tamil Nadu.

Other stories by M. Palani Kumar
Editor : Rajasangeethan

Rajasangeethan is a Chennai based writer. He works with a leading Tamil news channel as a journalist.

Other stories by Rajasangeethan
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli