సి వెంకట సుబ్బారెడ్డి తన డబ్బును ఇమ్మంటూ డిమాండ్ చేస్తున్న ఆరవ ధర్నా ఇది. పద్దెనిమిది నెలలు పైగానే వైస్సార్ జిల్లాలోని ఈ రైతు చెరుకుకు చెల్లింపులు జరగలేదు.

ఫిబ్రవరి 2020న సుబ్బారెడ్డి  ఇంచుమించుగా 170 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి చిత్తూరు జిల్లాలోని తిరుపతి నగరానికి, ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతుల సంఘం నిర్వహించిన ధర్నా(స్ట్రైక్) కి  వచ్చారు.

“2018 లో నేను సప్లై చేసిన చెరుకుగాను మయూర షుగర్ ఫ్యాక్టరీ నాకు 1.46 లక్షలు ఇవ్వాలి,” అన్నాడు సుబ్బారెడ్డి. ఇతనికి కమలాపురం మండల్ , విభారంపురం గ్రామంలో 4.5 ఎకరాలున్నాయి.  మయూర షుగర్స్ ఇతనికి టన్నుకు 2,500 రూపాయిలు ఇస్తామని 2018-19 కాలంలో చెప్పారు. “కానీ కంపెనీ దాని రేటును 2,300 రూపాయలకు తగ్గించేసింది. నాకు మోసం జరిగింది.” అన్నారు.

ధర్నా లో పాల్గొన్న ఆర్. బాబునాయుడు కూడా షుగర్ మిల్ నుండి తనకు రావలసిన 4.5 లక్షల కోసం ఎదురుచూస్తున్నారు. అతను చిత్తూరులోని రామచంద్రాపురం మండలం గణేశపురం గ్రామంలో తన బంధువు వద్ద 8 ఎకరాలు కౌలుకి తీసుకున్నారు. తన స్వంత భూమిలో బోర్ ఎండిపోయినందు వలన దానిని సాగుచేయడం మానేసారు.  “నేను 2019-20 లో 80,000 రూపాయిలు ఆ పొలాన్ని సాగుచేసుకోవడానికి చెల్లించాను, కానీ ఆ  భూమి యజమాని నా బంధువు. అందుకని నాదగ్గర తక్కువ డబ్బులు తీసుకున్నాడు. మామూలుగా అయితే ఒక ఎకరానికి కౌలు ఖరీదు 20,000 రూపాయిల పై మాటే.”

బాబునాయుడుకి రావలసిన 8.5 లక్షల్లో, మయూర షుగర్స్ అతనికి నాలుగు లక్షలే ఇచ్చింది. “ఇవ్వవలసింది ఇంకా ఉంది. రైతులకు వారి పొలాలు సాగు చేసుకోవడానికి డబ్బులు కావాలి.”

చిత్తూరు, వైస్సార్(కడప) జిల్లాలలో చెరుకు రైతులు మయూర షుగర్స్ చెల్లింపుల కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు. “మేము మా నిరసన ని ఇంకా తీవ్రతరం చేయాలనుకున్నాం కానీ చేయలేకపోయాము”, అన్నాడు సుబ్బారెడ్డి. మార్చ్ 2020 లో కోవిడ్ లాక్ డౌన్ వలన ఎక్కువ నిరసనలు నిర్వహించలేకపోయారు.

Left: A. Rambabu Naidu grows sugarcane in his 15 acres of land in Chittoor district. Right: Farm leader P. Hemalatha speaking at a dharna in Tirupati
PHOTO • G. Ram Mohan
Left: A. Rambabu Naidu grows sugarcane in his 15 acres of land in Chittoor district. Right: Farm leader P. Hemalatha speaking at a dharna in Tirupati
PHOTO • G. Ram Mohan

ఎడమ: ఎ రాంబాబు నాయుడు చిత్తూర్ జిల్లాలోని తన 15 ఎకరాల భూమిలో చెరుకుని పండిస్తాడు. కుడి: వ్యవసాయ నాయకురాలు పి హేమలత తిరుపతి ధర్నాలో మాట్లాడుతున్నారు

మామూలుగా రైతులు చెరుకును సప్లై చేసిన పధ్నాలుగు రోజుల్లోగా డబ్బులు అందుకోవాలి. ది షుగర్ కేన్ (కంట్రోల్) ఆర్డర్ ఆఫ్ 1996 ప్రకారం 14 రోజుల్లో రైతులకు చెల్లింపులు అందకపోతే, మిల్లు, వారికి వడ్డీతో సహా తరవాత చెల్లించాలి. ఒకవేళ అది కూడా జరిగకపొతే, రెవిన్యూ రికవరీ ఆక్ట్ కింద కేన్ కమీషనర్, ఫాక్టరీ ఆస్తులని వేలంపాట పాడొచ్చు.

కానీ చిత్తూరు బుచ్చినాయుడు కండ్రిగ మండల్ లో ఉన్న మయూర షుగర్ ఫ్యాక్టరీ, 2018లో లాక్  అవుట్ అయి ఫిబ్రవరి 2019 లో ఫ్యాక్టరీ పనులు నిలిపివేసింది. ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు చిన్న మొత్తాలుగా ఆగస్టు 2019 వరకు ఇచ్చినా, వారు  ఇంకా  36 కోట్లు బకాయిలోనే ఉన్నారు.

కాబట్టి ఈ నష్టాన్ని పూడ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ భూమితో కలిపి ఉన్న 50 కోట్లు చేసే 160 ఎకరాల భూమిని జతచేసినదని జాన్ విక్టర్, చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కెన్ కమీషనర్ అన్నారు. నవంబర్ 4, 2020న ఆస్తులను వేలంపాట వేసేముందు మయూర షుగర్స్ కి ఏడు నోటీసులు జారీ చేయబడ్డాయి. కానీ ఒక బిడ్ మాత్రమే అందుకున్నారు, అది కూడా చాలా తక్కువగా ఉంది అని చెప్పారు విక్టర్. మయూర నిర్వాహకులు, ఆ తరవాత కెన్ కమీషనర్ కి బ్యాంకర్ చెక్ పంపించారు. “మయూర మేనేజ్మెంట్ నాకు డిసెంబర్ 31, 2020 తారీఖుతో చెక్ పంపారు, కానీ అది డిపాజిట్ చేయగానే బౌన్స్ అయింది.” అని విక్టర్ చెప్పారు.

అది 10 కోట్ల చెక్కు. “కానీ మయూర షుగర్స్, మొత్తం రైతులందరికీ కలిపి 36 కోట్లు బకాయి ఉంది”, అన్నది ఆల్ ఇండియా షుగర్ కేన్ ఫార్మర్ ఫెడరేషన్ కమిటీ మెంబెర్, పి హేమలత. “మాకు కంపనీ నిర్వాహకులు జనవరి 18(2021) కల్లా కంపెనీ ఆస్తులను అమ్మి మాకు రావలసినవి ఇచ్చేస్తామని చెప్పారు. కానీ రైతులు ఇప్పటి వరకు డబ్బులు అందుకోలేదు.”

ఇలా రైతులను చెల్లింపులకు ఎదురుచూపులతో నిలబెట్టడం మయూర మాత్రమే చేయలేదు. నిండ్ర మండల్ లో నాటెమ్స్ షుగర్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానులు కూడా  2019-20 లో సేకరించిన చెరుకు కోసం రైతులకు ఇంకా చెల్లింపులు చేయలేదు.

నాటెమ్స్ షుగర్ ఫ్యాక్టరీ ఫార్మెర్స్ అసోసియేషన్ సెక్రటరీ దాసరి జనార్దన్ ప్రకారం, నాటెమ్స్ నిర్వాహకులు రైతులకు వారికి రావలసిన చెల్లింపులు చేస్తామని  భరోసా ఇచ్చారు. “కాని లాక్ డౌన్ మాకు ఒక గట్టి దెబ్బ కొట్టింది. మేనేజింగ్ డైరెక్టర్ లండన్ లో ఇరుక్కుపోయాడు కాబట్టి, వాళ్ళు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వలేము అన్నారు.” అని చెప్పారు.

Left: Entrance of Natems' sugar factory in Chittoor's Nindra mandal. Right: Farmers demanding their dues at the factory
PHOTO • G. Ram Mohan
Left: Entrance of Natems' sugar factory in Chittoor's Nindra mandal. Right: Farmers demanding their dues at the factory
PHOTO • G. Ram Mohan

ఎడమ: నాటెమ్స్ షుగర్ ఫ్యాక్టరీ ఎంట్రన్స్   కుడి: తమకు రావలసిన చెల్లింపుల కోసం డిమాండ్ చేస్తున్న రైతులు

సెప్టెంబర్ 2020 కాలానికి నాటెమ్స్ రైతులకు 37. 67 కోట్లు ఇవ్వవలసి ఉంది అని విక్టర్ చెప్పారు. సెప్టెంబర్ 19, 2020 నాటికి ఫ్యాక్టరీ మెషిన్లను వేలం వేయవలసి ఉంది. “కానీ ఆ కంపెనీ హై కోర్ట్ నుంచి ఒక ఇంటెరిమ్ స్టే ఆర్డర్ తెచ్చుకుంది.”

జనవరి 2021 కి నాటెమ్స్ కొన్ని బకాయిలు చెల్లించింది. “మేము 32 కోట్లు రైతులకు చెల్లించవలసి ఉంది. నేను నిధులను సమకూర్చుకుంటున్నాను. మేము రైతులకు ఈ నెలాఖరుకల్లా(జనవరి) డబ్బులు ఇచ్చేసి చెరుకురసాన్ని తీయడం మొదలుపెడతాము. నేను కంపెనీని రక్షించుకోడానికి వనరులను ఏర్పరుచుకుంటున్నాను.” అని అదే నెలలో కంపెనీ డైరెక్టరు ఆర్ నంద కుమార్ అన్నారు. కానీ రైతులు ఇప్పటివరకు ఏమి అందుకోలేదు.

ఆంధ్ర ప్రదేశ్ లో షుగర్ ఫ్యాక్టరీల పరిస్థితి అంత బావుండలేదు అని చెప్తారు నంద కుమార్. ఈయన ఏపీ చాప్టర్ అఫ్ ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్(ISMA)కి ప్రెసిడెంట్ కూడా. “ఒకప్పుడు 27 షుగర్ ఫ్యాక్టరీలు ఉండేవి, ఇప్పుడవి 7 ఫ్యాక్టరీలకు పడిపోయాయి.”

వ్యవసాయ నాయకులు దీనికి కారణం తప్పుగా ఉన్న పాలసీలే అంటారు. చక్కర రిటైల్ ధర, చెరకుకు ఇవ్వవలసిన సరసమైన మరియు వేతన ధర మధ్య పోలిక లేకపోవడమే అన్నింటి కన్నాపెద్ద కష్టం.

నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్ వారికి  2019 లో ISMA ఇచ్చిన ప్రెజెంటేషన్ లో, చక్కరను తయారు చేయడానికి అయ్యే ఖర్చు, చక్కర అసలు ఖరీదు కన్నా ఎక్కువ అని చెప్పింది . “ఒక కిలో చక్కర ను తయారు చేయడానికి 37-38 రూపాయిలు ఖర్చు అవుతుంది. కానీ ఇదే చక్కర చెన్నైలో 32 రూపాయలకు, హైదరాబాద్ లో 31 రూపాయిలు అమ్ముడు పోతుంది.” వివరించారు నందకుమార్. “మేము పోయిన ఏడాది(2019-20) 50 కోట్లు నష్టపోయాము, అంతకుముందు సంవత్సరం 30 కోట్లు నష్టపోయాము.”

నిండ్ర మండలం లో గురప్పనాయుడు కండ్రిగ గ్రామంలో  తన పదిహేను ఎకరాల భూమిలో చెరుకుని సాగుచేసే ఎ. రాంబాబు నాయుడు,  చక్కర ఖరీదును పరిశ్రమ నిర్ణయించాలి అని చెప్తారు. “చక్కరను కిలో  50 రూపాయిలకు ఎందుకు అమ్మకూడదు? మిగిలిన పరిశ్రమలు వారు అమ్మే ఉత్పత్తుల  ఖరీదును నిర్ణయించినప్పుడు చక్కర పరిశ్రమ ఎందుకు నిర్ణయించకూడదు?”

Left: K. Venkatesulu and K. Doravelu making the rounds of Natems to collect their payment. Right: V. Kannaiah, a tenant farmer, could not repay a loan because the factory had not paid the full amount that was his due
PHOTO • G. Ram Mohan
Left: K. Venkatesulu and K. Doravelu making the rounds of Natems to collect their payment. Right: V. Kannaiah, a tenant farmer, could not repay a loan because the factory had not paid the full amount that was his due
PHOTO • G. Ram Mohan

ఎడమ:  కె. వెంకటేశులు, కె దొరవేలు తమ చెల్లింపులుల  కోసం నాటెమ్స్ చుట్టూ తిరుగుతున్నారు. కుడి: కౌలుదారుడు వి కన్నయ్య, ఫ్యాక్టరీ అతనికి బకాయి ఉన్నా చెల్లింపులు ఇప్పటిదాకా చేయలేక పోవటం వలన తన అప్పును తీర్చుకోలేకపోయాడు

చక్కర పరిశ్రమ కూడా నగదు కోసం ఇబ్బందులు పడుతున్నది. “షెడ్యూల్డ్ బ్యాంకుల నుంచి ఫైనాన్స్ అసలు లేనట్టే, ముడిసరుకు కోసం కూడా అప్పు పుట్టట్లేదు”, అన్నారు నంద కుమార్.

వారి అవసరాలకు వ్యక్తిగత రుణాలు తీసుకోవలసి వచ్చిన రైతులకు సంస్థాగత క్రెడిట్ చాలా తక్కువగా లభిస్తుంది. "మేము వేసిన వేరే పంటలకు అప్పు మీద ఎరువులు కొనవలసి వచ్చింది" అని జనార్ధన్ చెప్పారు, అతను తన కూలీల చెల్లింపులకు కూడా డబ్బు అప్పు చేశారు. "చక్కెర ఫ్యాక్టరీ మామూలుగా  రైతులకు కార్మిక ఛార్జీలు చెల్లిస్తుంది. దీని వలన వారి వద్ద పని చేసే కూలీలకు కూడా వారు చెల్లించవచ్చు. కానీ నేను రూ. 50,000 అప్పు తీసుకుని కూలి వారికి చెల్లించాను. మళ్లీ ఆ అప్పుకు కూడా వడ్డీ కడుతున్నాను.”

తక్కువ చక్కెర ధరలు ప్యాకేజీ చేసిన ఆహారం మరియు పానీయాలను ఉత్పత్తి చేసే సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తాయని ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంగాటి  గోపాల్ రెడ్డి చెప్పారు. "ఈ ధరలు పెద్ద కంపెనీలకు బాగా ఉపయోగపడతాయి." కూల్ డ్రింకులు, పానీయాలు, మిఠాయిలను ఉత్పత్తి చేసే కంపెనీలు దేశంలో గత మూడు దశాబ్దాలుగా పెరిగాయి. అంతేగాక చక్కెర వినియోగ విధానాన్ని మార్చాయి. ఈ బల్క్ వినియోగదారులు,  ఉత్పత్తి చేసే చక్కెరలో 65 శాతం వాడుతున్నారని టాస్క్‌ఫోర్స్‌కు ISMA నివేదిక చెప్పింది.

నందకుమార్ చెప్పినదాని ప్రకారం భారతదేశం లో చాలా చక్కర ఉత్పత్తి అవుతుంది. కొంత చక్కర ఎగుబడి చేస్తే మరికొంత ఈథనోల్ తయారు చేయడానికి వాడతారు. ఇదే పద్ధతిలో సాగితే మార్కెట్ స్థిరీకరించబడుతుంది.

ఈ పారిశ్రామికవేత్త కేంద్ర ప్రభుత్వ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమం పై ఆధారపడుతున్నారు. దీని ద్వారా ప్రైవేటు చక్కెర మిల్లులు, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలకు చక్కెర తయారు చేసే ప్రక్రియలో  ఉప ఉత్పత్తి అయిన మొలాసిస్‌ను సరఫరా చేయగలవు. "చెరకును ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించడం వల్ల మార్కెట్లో ఉన్న కొరత తగ్గుతుంది" అని నంద కుమార్ చెప్పారు.

అక్టోబర్ 2020 లో, చక్కెర పరిశ్రమ, తమకు సప్లై చేసే రైతులకు ఎక్కువగా చెల్లించగలిగే సామర్ధ్యాన్ని పెంచడానికి , కేంద్ర ప్రభుత్వం చెరకు ఆధారిత ముడి పదార్థాల నుండి పొందిన ఇథనాల్ కు అధిక ధరను నిర్ణయించింది .

కానీ వ్యవసాయ నాయకుడు జనార్దన్ ఈ విషయం తో ఏకీభవించరు. “షుగర్ ఫ్యాక్టరీ నిర్వాహకులు ఇలా డబ్బుని వేరే ఉద్దేశ్యాలకు వాడడం వలన పరిస్థితి ఇంకా చెడుతుంది.” అన్నారు.

Sugarcane farmers protesting in Tirupati in April 2021, seeking the arrears of payments from Mayura Sugars
PHOTO • K. Kumar Reddy
Sugarcane farmers protesting in Tirupati in April 2021, seeking the arrears of payments from Mayura Sugars
PHOTO • K. Kumar Reddy

2021 ఏప్రిల్‌లో తిరుపతిలో చెరకు రైతులు నిరసన వ్యక్తం చేశారు, మయూరా షుగర్ల నుండి బకాయిలు చెల్లించాలని కోరారు

కోజెనరేషన్ ప్లాంట్‌కు నాటెమ్స్ రూ. 500 కోట్లు పెట్టుబడి ఇవ్వడం కంపెనీకి కూడా ఆందోళన కలిగించే విషయం. చక్కెర కర్మాగారం ద్వారా ఉత్పత్తి చేయబడిన మిగులు విద్యుత్తును విద్యుత్ గ్రిడ్‌కు పంపాల్సి ఉంది. "మాకు కర్మాగారంలో 7.5 మెగావాట్ల వ్యవస్థాపిత సామర్థ్యం ఉంది, కాని మేము విద్యుత్తును సరఫరా చేయటం లేదు, ఎందుకంటే [రాష్ట్ర] ప్రభుత్వం మేము చెప్పే రేట్లకు విద్యుత్తును కొనుగోలు చేయడానికి సుముఖంగా లేదు. పైగా విద్యుత్ మార్పిడి రేట్లు యూనిట్‌కు రూ. 2.50 నుండి రూ. 3 రూపాయలకు వరకు తగ్గింది,” అని కంపెనీ డైరెక్టర్ చెప్పారు.

అనేక చక్కెర మిల్లుల కోజెనరేషన్ ప్లాంట్లు పనికిరాని ఆస్తులుగా మారాయని నంద కుమార్ వివరించారు. “దీనిలో పెట్టుబడి పెట్టిన తరువాత, మాకు ప్రత్యామ్నాయం లేదు. ప్రభుత్వ పాలసీల కారణంగా మా ప్రణాళిక ను 20 మెగావాట్ల ప్లాంటుకు తగ్గించాము. పాలసీలు మారి పరిస్థితి మెరుగుపడేవరకు మేము ఎలాగో బ్రతకాలి. ”

కానీ చిత్తూరులో ఈ పరిస్థితి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది  - ఇది ఆంధ్రప్రదేశ్ లో అధిక చెరకు ఉత్పత్తి చేసే జిల్లాలలో రెండవ స్థానం లో ఉంది . ఎనిమిది సంవత్సరాలలో చిత్తూరులోని 66 మండలాల్లో సాగు దాదాపు సగం తగ్గిందని జిల్లా పరిపాలన రికార్డులు చూపిస్తున్నాయి - జిల్లాలో 2011 లో సుమారు 28,400 హెక్టార్ల భూమి చెరకు సాగులో ఉంది, కానీ 2019 నాటికి చెరకు 14,500 హెక్టార్లలో మాత్రమే పండించబడింది.

చెల్లింపులలో ఆలస్యం కావడం వలన చెరుకు రైతులు- వారి పంటను నిర్దేశించిన మిల్లుకే అమ్మాలి కాబట్టి వేరే పంటలు వేయడానికి కష్టపడుతున్నారు, కానీ పెద్దగా ఉపయోగం ఉండట్లేదు. ఆ పంటను సాగు చేయడానికి అయ్యే ఖర్చు వలన రైతులకు ఏమి రావడం లేదు అని చెప్పారు సుబ్బారెడ్డి.

బాబునాయుడుకి అతని బంధువుల వద్ద నుండి సాయం తీసుకోవడం తప్పడం లేదు. “మా బంధువులు నా కూతురిని ఇంజినీరింగ్ కాలేజ్ లో చేర్చడానికి సాయం చేశారు. నా డబ్బులు నాకు సమయానికి ఇచ్చేసి ఉంటే వారి ముందు చేయిసాచావలసిన అవసరం నాకు ఉండేది కాదు.” అన్నారు.

షుగర్ ఫ్యాక్టరీలు రైతులతో వ్యవహరించే పద్ధతికి రైతులు ఏమి చేయలేరని  సుబ్బారెడ్డి అన్నారు. “కానీ మా పిల్లలని ఫీజు కట్టలేదని ఇళ్లకి పంపించేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో రైతులు ఆత్మహత్య గురించి ఆలోచించరా?”

అనువాదం : అపర్ణ తోట

G. Ram Mohan

G. Ram Mohan is a freelance journalist based in Tirupati, Andhra Pradesh. He focuses on education, agriculture and health.

Other stories by G. Ram Mohan
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota