ఉత్తర్ ప్రదేశ్ లో పంచాయతీ ఎలెక్షన్ కు తప్పనిసరి డ్యూటీ చేసిన ఉపాధ్యాయులలో, 1,621 మంది ఉపాధ్యాయులు  కోవిడ్ - 19 వలన చనిపోయారు. ఇందులో  1,181 మగవారు, 440 మంది ఆడవారు ఉన్నారు. ఈ జాబితా  శిక్షక్ మహాసంఘ్  అనే ఉపాధ్యాయ సంఘం, దాని అనుసంధానించిన ఇతరుల సంఘాలతో కలిసి రూపొందించబడినది. PARI వద్ద పూర్తి జాబితా హిందీ లోనూ ఇంగ్లీష్ లోనూ ఇక్కడ ఉంది.

మే 10 న, మేము ఒక కథనాన్నిప్రచురించాము - ఈ భాగాన్ని క్రింద చూడండి - ఈ మానవ నిర్మిత విపత్తు ఎలా జరిగిందో వివరంగా చదవవచ్చు. ఎన్నికలను వాయిదా వేయాలని ఉపాధ్యాయ సంఘాలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఇసి) మరియు యుపి ప్రభుత్వం రెండూ విస్మరించాయి. ఆ సమయంలో, పోల్ డ్యూటీ చేసి, కోవిడ్ -19 వలన మరణించిన ఉపాధ్యాయుల సంఖ్య 713 -  అందులో 540 మంది పురుషులు, 173 మహిళలు ఉన్నారు.

ఈ రాష్ట్రంలో దగ్గరగా 8 లక్షల ఉపాధ్యాయులు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్నారు - వీరిలో పదివేల మంది పోల్ డ్యూటీ కోసం పంపబడ్డారు. ఇవి చాలా భారీగా జరిగే ఎన్నికలు. మొత్తంగా 1.3 లక్షల మంది అభ్యర్థులు 8 లక్షల సీట్లకోసం, 130 మిలియన్ల మంది అర్హతగల ఓటర్ల మధ్య పోటీపడ్డారు.   అందుకే పోలింగ్ అధికారులు (ఉపాధ్యాయులు మరియు ఇతరులు) వేలాది మందితో సంభాషించవలసి  వచ్చింది. కానీ ఎన్నికల కోసం అతి కొన్ని భద్రతా జాగ్రత్తలు మాత్రమే తీసుకోవడం జరిగింది.

యుపి పంచాయతీ ఎన్నికలు గతంలో వాయిదా వేయబడ్డాయి - ఉదాహరణకు, సెప్టెంబర్ 1994 నుండి 1995 ఏప్రిల్ వరకు. “మరి అటువంటప్పుడు ఈ మహమ్మారి తో పాటు జరిగే ఈ మానవ సంక్షోభం నడుమ ఈ ఆతురత  ఎందుకు ?”  అని మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సతీష్ కుమార్ అగర్వాల్ అడిగారు.

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికలు నిర్వహించడానికి పాఠశాల ఉపాధ్యాయుల ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మరణాలకు మధ్య ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. “ఢిల్లీలో ఏదైనా ఎన్నిక జరిగిందా? మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయా? ” అని మే 12 న నోయిడాలో ఆయన విలేకరులను అడిగారు . తమ బాధ్యతను అలహాబాద్ హైకోర్టు పైన వేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. సిఎం ఆదిత్యనాథ్ విలేకరులకు, "హైకోర్టు ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికలు జరిగాయి." అని చెప్పారు.

ఇది పాక్షిక సత్యం మాత్రమే. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతున్నపిటిషన్‌ను కోర్టు తిరస్కరించినమాట నిజమే. కానీ అది ఒక ప్రైవేట్ పిటిషన్, రాష్ట్రం దాఖలు చేసినది కాదు. (అసలైతే రాజ్యాంగ నిబంధన ప్రకారం, జనవరి 21, 2021 లోపు పంచాయతీ ఎన్నికలు పూర్తి అయి ఉండాలి). కానీ ఎన్నికలలో  కోవిడ్ -19 ప్రోటోకాల్స్‌ను కఠినంగా పాటించాలని కోర్టు ఆదేశించింది.

ఏప్రిల్ 6 న అలహాబాద్ హైకోర్టు రాష్ట్రం అన్ని భద్రతా ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉంటుందని నమ్ముతున్నదని, యుపి ప్రభుత్వం "ఎన్నికల ప్రచారంలో కట్టుబడి ఉండాలని ఒక ప్రోటోకాల్‌ను ఇప్పటికే ప్రకటించింది " అని అన్నారు. "పంచాయతీ రాజ్ ఎన్నికలు కూడా ప్రజలు గుమిగూడని విధంగా నిర్వహించాలని ఇది ఆదేశించింది. నామినేషన్ అయినా, క్యాన్వాసింగ్ అయినా లేదా అసలు ఓటింగ్ అయినా, అన్ని COVID-19 ప్రోటోకాల్స్ గమనించేటట్లు చూడాలి. మరో మాటలో చెప్పాలంటే, "హైకోర్టు ఆదేశాల ప్రకారం" ఎన్నికలు జరగలేదు. ఆ కోర్టు ఆదేశాల ఉల్లంఘనే  ఉపాధ్యాయులకు ప్రాణాంతకమై వారు చనిపోవలసి వచ్చింద”ని వారి యూనియన్లు చెబుతున్నాయి.

"గౌరవనీయమైన సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా కూడా, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు  ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన తాజా లేఖ లో,"సమాఖ్య తన న్యాయవాది ద్వారా తన ఆలోచనలను వివరించింది. ఏదేమైనా, ఓట్ల లెక్కింపు సమయంలో కోవిడ్ వ్యాప్తి నుండి ప్రజలను రక్షించడానికి మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తామని గౌరవనీయమైన సుప్రీంకోర్టుకు ప్రభుత్వ అభ్యర్ధి హామీ ఇచ్చారు.”

లేఖలో ఒక గుండె పగిలే వాక్యం ఉంది: "ప్రాథమిక విద్యా శాఖ, లేదా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు ఇంత పెద్ద సంఖ్యలో జరుగుతున్న ఉపాధ్యాయుల మరణాలపై ఎలాంటి దుఃఖాన్ని వ్యక్తం చేయలేదు."

ఏప్రిల్ 26 న, ఆ ప్రోటోకాల్‌లను "పాటించకపోవడం" గురించి కోర్టు SEC కి నోటీసు జారీ చేసింది, వీటిలో ఫేస్ మాస్కింగ్ మరియు సామాజిక దూరం, "ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది." అని చెప్పింది. కోర్టు ఆదేశాలపై ప్రభుత్వం లేదా SEC అసంతృప్తిగా ఉండి ఉంటే వారు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసి ఉండేవారు. కానీ వారు చేయలేదు. అంతకుముందు, మార్చి చివరి వారంలో, రాష్ట్రంలో భారీ హోలీ వేడుకల సందర్భంగా కోవిడ్ -19 ప్రోటోకాల్‌లను అమలు చేయడానికి రాష్ట్రం నిజాయతీగా ప్రయత్నించలేదు.

ముఖ్యంగా, అలహాబాద్ హైకోర్టు మే 12 న రాష్ట్రం పంచాయతీ ఎన్నికలలో విధులను  నిర్వర్తించి  తర్వాత కోవిడ్ -19 కారణంగా మరణించిన పోలింగ్ అధికారుల (ఉపాధ్యాయులు మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు) కుటుంబాలకు ఎక్స్-గ్రాటియా పరిహారంగా 1 కోట్లు కనీసం ఇవ్వాలని చెప్పింది . జస్టిస్ సిద్ధార్థ వర్మ మరియు అజిత్ కుమార్ యొక్క డివిజన్ బెంచ్ మాటలలో: "ఎన్నికల సమయంలో అతని / ఆమె సేవలను అందించడానికి స్వచ్ఛందంగా ఎవరూ ముందుకు రాలేదు. తమకు ఇష్టం లేకపోయినా ఎన్నికల సమయంలో విధులను నిర్వర్తించడం తప్పనిసరి అనడం వలన మాత్రమే వారు పనిచేయవలసి వచ్చింది." అని చెప్పారు.

ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ సంవత్సరం కుంభమేళా జరగాలని దేశంలోని ఏ కోర్టు, ఉత్తరాఖండ్ లేదా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలను ఆదేశించలేదు లేదా కోరలేదు. హరిద్వార్‌లోని కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది , అది 2022 లో జరగాల్సి ఉంది. అయినప్పటికీ, కుంభ్ వంటి భారీ సామూహిక కార్యక్రమం, పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న  రోజులలోనే  జరిగాయి. పైగా 2022 లో జరగవలసిన  కుంభమేళాను 2021 లో జరపడం పట్ల  తీవ్రమైన జ్యోతిషశాస్త్ర,  మతపరమైన అనేక కారణాలు చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుంభమేళా మరియు పంచాయతీ ఎన్నికలను 'విజయవంతంగా' నిర్వహించాల్సిన రాజకీయ ఆవశ్యకత గురించి చాలా తక్కువ చర్చ జరిగింది. కానీ ఈ సంఘటనలు చేసిన నష్టాలు ఇంత తేటతెల్లంగా నిరూపణ అయుండకపోతే, అవే గొప్ప విజయాలుగా చెలామణి అయ్యేవి.

ఈ విషాదం గురించి PARI రాసిన ముందు భాగం(మే 10) క్రింద చదవండి:

యుపి పంచాయతీలు: ఎన్నికలు ఎవరి కోసమో!

ఉత్తర్ ప్రదేశ్  పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ ఆఫీసర్లుగా పనిచేసిన దాదాపు 700 మంది పైగా  స్కూల్ టీచర్లు కోవిడ్ వలన చనిపోయారు.ఇంకా ఎందరో ప్రమాదం అంచుల్లో ఉన్నారు,  ఈ  ఎన్నికల సమయంలో 30 రోజుల్లోనే ఎనిమిది లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

జిగ్యాస మిశ్ర | ముఖ్య దృష్టాంతాలు: అంతరా రామన్

సీతాపూర్ లో ఆక్సిజన్ మీద ఉండి మృత్యువు తో పోరాడుతున్నప్పుడు కూడా, రితేష్ మిశ్ర ఫోన్ మోగుతూనే ఉంది. ఆ ఫోన్ లు అన్ని  రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి,  గవర్నమెంట్ అధికారుల దగ్గర్నుంచి వస్తున్నాయి.  ఈ నీరసంగా పడి ఉన్న స్కూల్ టీచర్ ను మే 2వ తేదీ కల్లా డ్యూటీ లో జాయిన్ అవమని చెప్తున్నాయి. ఆ రోజు ఉత్తరప్రదేశ్ పంచాయత్ పోల్  ఎన్నికల కౌంటింగ్(లెక్కింపు) జరుగుతుంది.

“ఆ ఫోన్ మోగడం అసలు ఆగలేదు.” అన్నది అతని భార్య అపర్ణ. “నేను ఆ ఫోన్ తీసుకుని  అవతల మనిషికి ఈయన హాస్పిటల్ లో ఉన్నారు కాబట్టి ఎన్నికల డ్యూటీ కి రాలేరు అని చెప్తే, రుజువు కోసం ఆయన హాస్పిటల్ లో ఉన్న ఫోటో పంపమని దబాయించారు. నేను పంపాను. ఉండండి, మీకు కూడా పంపుతాను” అని PARI తో అని, ఫోటోను పంపించింది.

ముప్పై నాలుగేళ్ల అపర్ణ మిశ్ర ఎక్కువగా మాట్లాడినదేంటంటే   ఆమె తన భర్తను ఎన్నికల పని కి వెళ్ళొద్దని ఆమె చాలా గట్టిగా చెప్పింది. “నేను ఆయనని వెళ్ళొద్దని వారి డ్యూటీ రూస్టర్ రాగానే చెప్పాను.” అన్నది. “కానీ ఆయన ఎన్నికల పని కాన్సిల్ అయ్యేది కాదని  పదేపదే  చెప్పారు. పైగా వెళ్లకుంటే  అధికారులు ఆయన మీద FIR ఫైల్ చేసే అవకాశం కూడా  ఉంటుందని అన్నారు.” చెప్పింది అపర్ణ.

రితేష్ కోవిడ్ తో ఏప్రిల్ 29 న చనిపోయాడు. యూపీ  ఎలక్షన్ లో పనిచేసిన ప్రతి 700 టీచర్లకు ఒకరు, ఇలానే చనిపోయారు. PARI వద్ద వారి పూర్తి జాబితా ఉంది . మొత్తం 713 మంది చనిపోయారు- 540 మగవారు, 173 ఆడవారు. ఈ జాబితా ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ రాష్ట్రం లో దగ్గరగా ఎనిమిది లక్షల మంది ప్రాధమిక పాఠశాల టీచర్లున్నారు. ఇందులో పదుల వేల మందిని  పోల్ డ్యూటీ కి పంపారు.

రితేష్, ఒక సహాయక అధ్యాపకుడిగా(అసిస్టెంట్ టీచర్) తన కుటుంబం తో సీతాపూర్ జిల్లా హెడ్ క్వార్టర్ లో  ఉంటూ  లక్నో గోసైగంజ్ బ్లాక్ లోని ప్రాధమిక పాఠశాలలో బోధించేవాడు. అతనిని  పోలింగ్ పనికోసం దగ్గరలో ఉన్న  ఊరిలో ని స్కూల్ లో- ఏప్రిల్ 15న , 19న, 26న, 29న,  నాలుగు దశలుగా సాగే  పంచాయత్ పోల్స్ లో డ్యూటీ వేశారు.

'When I said Ritesh is hospitalised and could not accept the duty – they demanded I send them a photograph of him on his hospital bed – as proof. I did so. I will send you that photograph', says his wife Aparna. Right: Ritesh had received this letter asking him to join for election duty.
PHOTO • Aparna Mishra
'When I said Ritesh is hospitalised and could not accept the duty – they demanded I send them a photograph of him on his hospital bed – as proof. I did so. I will send you that photograph', says his wife Aparna. Right: Ritesh had received this letter asking him to join for election duty.
PHOTO • Aparna Mishra

“నేను రితేష్ ఆస్పత్రిలో ఉన్నాడు, డ్యూటీ కి రాలేడు అంటే  - వారు ఆ విషయాన్ని రుజువు చేస్తూ అతను హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఒక ఫోటో ను పంపమని దబాయించారు. నేను ఆ ఫొటో ని మీకు పంపుతాను”,  అన్నది అతని భార్య అపర్ణ. రితేష్ ని  ఎలక్షన్ డ్యూటీ లో హాజరుకమ్మని పైన ఉత్తరాన్ని అందుకున్నాడు.

యూపీలో పంచాయత్ పోల్స్` అంటే చాలా భారీ విషయం. ఈ పంచాయత్ పోల్స్ లో  ఎనిమిది లక్షల సీట్ల కోసం  పదమూడు లక్షల మంది పోటీ పడ్డారు. మొత్తం 13 కోట్ల ఓటర్లు, నాలుగు  దశలుగా,  వీరిని వేరే వేరే పోస్టుల కోసం ఎన్నుకున్నారు. దీనంతటి కోసం 520 మిలియన్ల బ్యాలెట్ పేపర్లను అచ్చువేశారు. ఇటువంటి పరిస్థితిలో ఎన్నికల పని చేయడానికి పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ప్రమాదం వాటిల్లుతుందో అందరికీ తెలిసిన విషయమే.

టీచర్లు, వారి యూనియన్లు కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉన్న సమయం లో  ఇటువంటి  ప్రమాదకరమైన డ్యూటీ ని గురించి  తెలిపిన నిరసనను  అసలు పట్టించుకోలేదు. యూపీ లో ఉండే శిక్షక్ మహాసంఘ్ (టీచర్ల ఫెడరేషన్) ఏప్రిల్ 12 న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి రాసిన లేఖ లో చెప్పినట్లుగా నిజమైన రక్షణ గాని, జాగ్రత్తలు గాని, భౌతిక దూరాన్ని పాటించడానికి కావలసిన వసతులు గాని- ఇలా టీచర్లు వైరస్ బారిన పడకుండా ఉండటానికి ఏ విధమైన చర్యలు చేపట్టలేదు. ఆ లేఖ, బ్యాలెట్ బాక్సులని నిర్వహించడంలో, టీచర్లు వేలమందికి దగ్గరగా రావడంలో ఉన్న ప్రమాదాలను వివరించి స్పష్టంగా హెచ్చరించింది. ఈ కారణాలను విశదీకరించి,  ఆ ఫెడరేషన్ ఎన్నికలను వాయిదా వేయమని అడిగింది.   ఆ తర్వాత  ఏప్రిల్ 28న, 29న వచ్చిన లేఖలు కూడా ఓట్ల లెక్కింపు  తేదీని వాయిదా వేయమని విజ్ఞప్తి చేశాయి.

“మేము రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కి మెయిల్లోను, చేతికి రాతపూర్వకంగాను  మా లేఖను  ఇచ్చాము.కానీ దానికి సమాధానం కానీ, ఇచ్చామన్న గుర్తింపు కానీ రాలేదు,” అని  యూపీ శిక్షక్ మహాసంఘ్ ప్రెసిడెంట్ అయిన దినేష్ చంద్ర శర్మ, PARI కి చెప్పారు. “మా లేఖలు రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వెళ్లాయి కానీ ఏమి లాభం లేకపోయింది.”

టీచర్లు మొదట ఒకరోజు శిక్షణకు వెళ్లారు.  ఆ తర్వాత రెండు రోజులు పోలింగ్  పని. ఒకరోజు పోలింగ్ కు  సన్నాహాలైతే ,  రెండో రోజు అసలు ఓటింగ్ పని. తరవాత వేలమంది ఓట్లని లెక్కించడానికి అవసరమయ్యారు. ఈ పనులు చేయడం తప్పనిసరి. తన శిక్షణ ముందే పూర్తి చేసి రితేష్ ఏప్రిల్ 18న పోలింగ్ డ్యూటీ  కి వెళ్ళాడు. “తాను వేరే ప్రభుత్వ సిబ్బంది తో  పనిచేసాడు కానీ వారంతా వేరే డిపార్ట్మెంట్ల వారు, అంతకు ముందు తనకు పరిచయం లేని వారు.” అన్నది అపర్ణ.

“డ్యూటీ సెంటర్ కి  వెళ్తుండగా తను తీసుకుని నాకు పంపిన సెల్ఫీలు చూపిస్తాను. అది సుమోనో బొలెరోనో- తనతో పాటు ఇంకో ఇద్దరు మగవాళ్ళు కూర్చున్నారు. తర్వాత తాను ఇంకొ సెల్ఫీ పంపాడు అలాంటి వాహనమే కానీ అందులో తనతో పాటు ఇంకా పదిమంది  దాకా ఎలక్షన్ డ్యూటీ కి వెళ్తున్నారు. నేను చాలా భయపడ్డాను. ఇక ఓటింగ్ బూత్ దగ్గర ఐతే ఇంకా దగ్గరగా మసిలారందరూ.” చెప్పింది అపర్ణ

ఇలస్ట్రేషన్: జిగ్యాస మిశ్ర

టీచర్లు  ముందు  ఒక రోజు శిక్షణ కు వెళ్లారు. ఆ తర్వాత  రెండు రోజులు పోలింగ్ పని వేశారు - ఒక రోజు  ఎన్నికల సన్నాహాలకు, మరో రోజు ఎన్నికలకు . తర్వాత కొన్ని వేల మంది మళ్ళీ ఓట్ల లెక్కింపు కి అవసరం పడ్డారు. ఈ పనులన్నీ తప్పనిసరిగా చేయవలసినవే.

“ఓటింగ్ తర్వాత ఏప్రిల్ 19 న ఆయన ఇంటికి 103 జ్వరం తో తిరిగి వచ్చారు. అక్కడి నుంచి బయలుదేరే ముందు  నాకు ఫోన్ చేసి ఒంట్లో బాలేదు అని చెప్పారు, నేను వెంటనే బయలుదేరి వచ్చేయమని చెప్పాను. ఒక రెండు రోజుల పాటు మేము అది అలసట వలన వచ్చిన మామూలు జ్వరం లానే చూసాము. కానీ మూడో రోజు(ఏప్రిల్ 22న) కూడా జ్వరం ఉండడం తో, ఒక డాక్టర్ ని కలవగానే ఆయన వెంటనే కోవిడ్  టెస్ట్, సిటీ స్కాన్ చేయించమన్నారు.”

“మేము ఆ టెస్టులు చేయించగానే ఆయనకు పాజిటివ్ అని తెలిసింది. మేము ఆసుపత్రిలో పడక కోసం పరిగెత్తాము.  లక్నో లో కనీసం పది ఆసుపత్రులను కనుక్కొని ఉంటాము. ఒక రోజంతా తిరిగాక, సీతాపూర్ లో ఉన్న ఒక ప్రైవేట్ క్లినిక్ లో  చేర్పించాము. అప్పటికే ఆయనకు ఆయాసం పెరిగింది.”

“డాక్టర్ రోజుకు  ఒకసారి వచ్చేవారు- ఎక్కువగా అర్ధరాత్రి 12 గంటలకి.  పైగా స్టాఫ్ ఎవరూ ఎంత పిలిచినా, సాయం అడిగినా సమాధానమిచ్చేవారు కాదు. ఆయన ఏప్రిల్ 29 సాయంత్రం 5.15 కి ఇక ప్రాణాలు వదిలేశారు. ఆయన కి కుదిరినంతగా  ఆయన ప్రయత్నించారు, మాకు కుదిరినంతగా  మేము ప్రయత్నించాము. కానీ ఆయన మా ముందే అలా జారిపోయారు.”

రితేష్, అపర్ణ, వారి కూతురు, రితేష్ అమ్మ నాన్న- ఈ ఐదుగురు ఉన్న కుటుంబం లోని రితేష్ ఒకడే సంపాదించేది.. అపర్ణ కు అతనికి 2013 లో పెళ్లి అయింది, వారి మొదటి బిడ్డ 2020 లో కలిగింది. “మా ఎనిమిదో పెళ్లిరోజు ఈ మే 12 న జరుపుకునే వాళ్ళం, కానీ దానికి ముందే  అతను మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు.” అని అపర్ణ ఏడ్చింది.

*****

ఏప్రిల్ 26న మద్రాస్ హైకోర్టు, ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా (ECI ) పై కోవిడ్ 19 మహమ్మారి సమయంలో పొలిటికల్ ర్యాలీలు ఆమోదించినందుకు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. మద్రాస్ HC చీఫ్ జస్టిస్ సంజీబ్ బెనర్జీ, “మీ సంస్థ ఒకటే కోవిడ్ రెండవ వేవ్ కి బాధ్యత వహించాలి”  అని  ECI కౌన్సెల్ కి చెప్పారు. పైగా చీఫ్ జస్టిస్, “బహుశా మీ అధికారులందరి పైన మర్డర్ కేసులు పెట్టాలి

https://www.livelaw.in/top-stories/madras-high-court-pulls-up-election-commission-for-allowing-political-rallies-during-amid-covid-173135

” అనేంతదాకా వెళ్లారు.

కోర్ట్ ఆర్డర్లు ఉన్నాగాని ఫేస్ మాస్కులు, శానిటైజర్లు, పోలింగ్ కాంపెయిన్ లలో భౌతిక దూరాన్ని పాటించని కమిషన్ వైఫల్యానికి మద్రాస్ హై కోర్ట్ ఆగ్రహపడింది.

At Lucknow’s Sarojini Nagar, May 2, counting day: Panchayat polls in UP are gigantic and this one saw nearly 1.3 million candidates contesting over 8 lakh seats
PHOTO • Jigyasa Mishra
At Lucknow’s Sarojini Nagar, May 2, counting day: Panchayat polls in UP are gigantic and this one saw nearly 1.3 million candidates contesting over 8 lakh seats
PHOTO • Jigyasa Mishra

లక్నో,సరోజినీ నగర్ ,మే 2, కౌంటింగ్ దినం: యూపీ లో పంచాయత్ పోల్స్ చాలా పెద్దవి. ఈ సారి  ఎనిమిది లక్షల సీట్లకి 13 లక్షల మంది పోటీ చేశారు.

ఆ తరవాత ఏప్రిల్ 27న  ఆగ్రహించిన అలహాబాదు హై కోర్ట్ బెంచ్  యూపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఒక ఉత్తర్వు జారీ చేసి షో కాజ్ అడిగింది - ఎన్నికలలో కోవిడ్ మార్గదర్శకాలను  పాటించడం లో ఎందుకు  వైఫల్యమొందారు. దశల వారీగా జరిగిన పంచాయత్ ఎన్నికలలో  మార్గదర్శకాలను ఉల్లంఘించిన అధికారులపై  చర్యలెందుకు తీసుకోలేదు? అలాగే ఎవరైతే ఈ ఉల్లంఘనకు  బాధ్యులో వారిపై చర్యలు తీసుకొమ్మని కూడా ఈ ఉత్తర్వు చెప్పింది.

ఒక దఫా లో ఓటింగ్ , లెక్కింపు ఇంకా జరగవలసి ఉండగా, కోర్ట్ SEC ని “రాబోయే దశల పంచాయతీ ఎలక్షన్ లో జాగ్రత్తలు తీసుకునేలా నిర్ధారించుకోమని, కోవిడ్ మార్గదర్శకాలైన   భౌతిక దూరం, ఫేస్ మాస్కులు కచ్చితంగా పాటించాలని లేదా ఎన్నికల బాధ్యత లో ఉన్న అధికారుల పై చర్యలు తీసుకోబడతాయని,” చెప్పింది .

ఆ దశలో కోవిడ్ మరణాలు 135 కి చేరుకున్నాయి, ఇక ఈ సమాచారాన్ని పై స్థాయి కి తీసుకువెళ్లాక, ఈ విషయాన్ని గురించి అమర్ ఉజాలా అనే దినపత్రిక నివేదిక ను  ఇచ్చింది.

కానీ ఏమీ మారలేదు.

ఇక మే 1న , లెక్కింపుకు ఇరవై నాలుగు గంటల ముందే అంతే చిరాకు పడిన సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని అదే అడిగింది .” దాదాపు 700 మంది టీచర్లు ఈ ఎన్నికల వలన చనిపోయారు, దీని గురించి మీరేం చేయబోతున్నారు? (అప్పటికే ఉత్తర్ ప్రదేశ్ లో పోయిన 24 గంటల్లో 34,372 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.)

దీనికి అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఇచ్చిన సమాధానం ఇలా ఉంది.” ఎన్నికలు జరగని రాష్ట్రాల్లో కూడా కేసుల ఉప్పెన ఉంది. ఢిల్లీలో ఎన్నికలు లేకపోయినా కేసులు పెరిగాయి. పోలింగ్ మొదలయ్యేప్పటికీ రెండో వేవ్ మొదలవలేదు.”

వేరే మాటల్లో చెప్పాలంటే, ఎన్నికలకి పోలింగ్ కు జరిగ్గిన మరణాలతో సంబంధంలేదు.

'The arrangements for safety of the government staff arriving for poll duty were negligible', says Santosh Kumar
PHOTO • Jigyasa Mishra
'The arrangements for safety of the government staff arriving for poll duty were negligible', says Santosh Kumar
PHOTO • Jigyasa Mishra

“పోలింగ్ పనికి వచ్చే ప్రభుత్వ ఉద్యోగుల భద్రత కోసం జరిగిన ఏర్పాట్లు ఇంచుమించుగా ఏమి లేవు.” అన్నారు సంతోష్ కుమార్.

“మా దగ్గర ఎవరు కోవిడ్ పాజిటివ్, ఎవరు కాదో చెప్పగల ప్రామాణికత ఉన్న డేటా లేదు.” అని  యూపీ రాష్ట్ర ప్రాథమిక విద్యా మంత్రి సతీష్ చంద్ర ద్వివేది PARI తో అన్నారు. “మేము ఏ విధమైన ఆడిట్ చేయించలేదు. అంతే గాక డ్యూటీ కి వెళ్ళింది  టీచర్లు మాత్రమే కాదు. వారు డ్యూటీ లో చేరక ముందే వారు కరోనా పాజిటివ్ కాదని ఎలా చెప్పగలరు?” అని అడిగారు.

ఏది ఏమైనా,  టైమ్స్ అఫ్ ఇండియా నివేదిక, అధికారక డేటా ని ప్రస్తావిస్తూ, 30 జనవరి 2020 నుంచి 4 ఏప్రిల్ 2021  వరకు - ఈ పదిహేను నెలలు యూపీ లో 6.3 లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 4 ఏప్రిల్ నుంచి ఈ ముప్ఫయి రోజులలో, 8 లక్షల కొత్త కేసులు మొత్తం కేసు లోడ్ ను 14 లక్షల దాకా తీసుకెళ్లిపోయాయి.ఈ దశ అంతా గ్రామీణ పోల్స్ కు చెందినది గా గుర్తించబడినది. ఇంకోలా చెప్పాలంటే మొత్తంగా ఈ మహమ్మారి కాలంలో ఉన్న కేసులన్నిటిలోను, రాష్ట్రం ఒకే ఒక్క నెలలో పోల్స్ పని వలన ఎక్కువ కోవిడ్ కేసులను  చూడవలసి వచ్చింది.

మొత్తం 706 చనిపోయిన టీచర్ల జాబితాను  ఏప్రిల్ 29న తయారు చేయగా  అన్నిటి కన్నా ఘోరంగా అజాంగడ్  జిల్లా లో మొత్తం 34 మంది చనిపోయారు. అలాగే బాగా దెబ్బ తిన్న జిల్లాలంటే -గోరఖ్పూర్ లో 28 మరణాలు,  జువాన్పూర్లో 23,  లక్నోలో 27. లక్నో యూపీ శిక్షక్ మహాసంఘ్ జిల్లా ప్రెసిడెంట్ సుదాంశు మోహన్, “ఈ చావులు ఇంకా ఆగలేదు” అన్నారు. “ఈ పోయిన ఐదు రోజుల్లో పోల్ డ్యూటీ నుంచి తిరిగి వచ్చిన టీచర్ల లో ఏడుగురు చనిపోయారు”, అని చెప్పారు. (ఈ పేర్లు కూడా PARI జాబితాలో కలిపారు.)

ఏదేమైనా రితేష్  ఇంట్లో జరిగిన విషాదం, మొత్తం 713 కుటుంబాల్లో ఎటువంటి విషాదాన్ని మిగిల్చిందో  ప్రతిబింబిస్తున్న ప్పు డు, కథ ఇక్కడితో ఆగిపోలేదని గ్రహించాలి. వీరు కాకుండా ఇంకా చాలా మంది టీచర్లు కోవిడ్ తో పోరాడుతున్నారు. ఇంకా చాలా మంది పరీక్ష చేయించుకోవాలి.  పరీక్ష చేయించుకున్న వారు  ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. వీరేగాక వెనక్కి తిరిగి వచ్చిన వారిలో లక్షణాలు కనపడకపోయినా వారు సెల్ఫ్ క్వారంటైన్  అయి ఉన్నారు. వీరందరి కథలోని చేదు నిజాలు మద్రాస్, అలహాబాద్ హైకోర్టులు, , సుప్రీంకోర్టుల ఆగ్రహాన్ని, ఆందోళనని ప్రతిబింబిస్తున్నాయి.

“పోల్ డ్యూటీ కి వచ్చిన ప్రభుత్వ సిబ్బంది భద్రతకు  అసలే ఏర్పాట్లు లేవు,”.అన్నారు 43 ఏళ్ళ సంతోష్ కుమార్. ఈయన  లక్నోలోని గోసైగంజ్ బ్లాక్లో  ప్రాథమిక పాఠశాలకు  హెడ్మాస్టర్ గా పని చేస్తున్నారు. ఈయన రెండు ఓటింగ్ రోజులూ పని చేశారు. “మేము బస్సుల్లాంటి అన్నిరకాల వాహనాలను వాడవలసి వచ్చింది. భౌతికదూరాన్ని పాటించే వీలే లేకపోయింది. ఆ తర్వాత ఓటింగ్ జరిగేచోట గ్లోవ్స్ , శానిటైసార్లు వంటి ముందు జాగ్రత్త చర్యలు అసలు తీసుకోలేదు. మా దగ్గ్గర మేము తీసుకెళ్ళినవి మాత్రమే  ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మేము తీసుకెళ్లిన ఎక్స్ట్రా మాస్కులు మాస్క్ వేసుకోకుండా వచ్చిన ఓటర్లకు ఇచ్చాము.” అని చెప్పారు.

ఇలస్ట్రేషన్: అంతరా రామన్

‘నాకు రోజు మా స్కూల్ వంటామె నుండి  ఫోన్ వస్తుంది. ఆమె తన ఊరిలో పరిస్థితి ఎలా దిగజారిపోతోందో చెప్తుంది. అక్కడి జనాలకి కనీసం తాము ఎందుకు చనిపోతున్నామో కూడా తెలీదు.’

“మా డ్యూటీ కాన్సిల్ చేయించుకునే పరిస్థితి లేదనుకోవడం నిజమే.” అన్నారాయన. “నీ పేరు కనక జాబితాలో వస్తే నువ్వు డ్యూటీ కి వెళ్ళవలసిందే. కడుపుతో ఉన్న ఆడవారైనా సరే, డ్యూటీకి వెళ్ళవలసిందే. సెలవు కోసం వారు పెట్టుకున్న అర్జీలు అన్నీ తిప్పికొట్టారు.” కుమార్ కు  ఇప్పటి వరకు కోవిడ్ లక్షణాలు బయటపడలేదు.అందువల్ల మే 2న జరిగిన లెక్కింపులో పాల్గొన్నాడు.

మీతు అవస్థి, లఖింపూర్ ప్రాథమిక పాఠశాల హెడ్. ఆమె ఇంకా దురదృష్టవంతురాలు. ఆమె శిక్షణ కోసం వెళ్లిన రోజు “ 60 మంది సిబ్బంది ఒకే గదిలో పనిచేయడం చూసింది . అందరు వేరే వేరే పాఠశాలల నుండి వచ్చినవారు. మోచేతులు తగిలేంత దగ్గరగా కూర్చుని బ్యాలట్ బాక్స్ తో  ఎలా పని చెయ్యాలో నేర్చుకుంటున్నారు. అక్కడ పరిస్థితి ఎంత భయపెట్టేలా ఉందో మీరసలు ఊహించుకోలేరు.”  అని మీరు PARI తో అన్నది.

అవస్థి కి  ఆ వెంటనే పాజిటివ్ వచ్చింది. ఆ శిక్షణ కార్యక్రమం వల్లనే ఆమెకు పాజిటివ్ వచ్చిందని నమ్ముతుంది.  ఆమె ఇక  ఓటింగ్ కి, లెక్కింపుకు వెళ్ళలేదు. ఆమె స్కూల్లో ఉన్నవేరే  సిబ్బందికి  ఆ పనిని అప్పజెప్పారు.

“మాలో ఒక సహాయక టీచర్  ఇంద్రకాంత్ యాదవ్ కి ఇప్పటివరకు ఎలక్షన్ పని వెయ్యలేదు. కానీ ఈ సారి వేశారు.” అన్నదామె. “యాదవ్ వికలాంగుడు. అతనికి ఒక్క చెయ్యి మాత్రమే ఉంది. అయినా అతనిని పని పై పంపించారు. మరో రెండు రోజుల్లో అతనికి జ్వరం వచ్చింది, ఆ తరవాత అతను చనిపోయాడు.” చెప్పింది  అవస్థి.

“నాకు రోజూ మా స్కూల్ వంటామె నుండి  ఫోన్ వస్తుంది. ఆమె తన ఊరిలో పరిస్థితి ఎలా దిగజారిపోతోందో చెప్తుంది. అక్కడి జనాలకి కనీసం తాము ఎందుకు చనిపోతున్నామో కూడా తెలీదు. తమకి వచ్చే జ్వరం గాని,  దగ్గు గాని కోవిడ్ అయి ఉండవచ్చు అనే ఆలోచన కూడా వాళ్లకి లేదు.” అన్నది అవస్థి.

టీచర్ గా ఇంకా ఒక్క సంవత్సరం కూడా పూర్తిచేసుకోని శివ కె, చిత్రకూట్ మావు బ్లాక్ లో ఉన్న  ప్రాధమిక పాఠశాలలో పనిచేస్తున్నాడు. అతను డ్యూటీ కి వెళ్లబోయే  ముందు పరీక్ష చేయించుకున్నాడు. “ఎందుకైనా మంచిదని  నేను పోల్ డ్యూటీ కి బయలుదేరేముందు RTPCR పరీక్ష చేయించుకున్నాను. అంతా బాగానే ఉంది.” ఆ తరువాత అతను బియావాల్ ఊరిలోని అదే బ్లాక్ లో ఏప్రిల్ 18న, 19న పనిచేశాడు . “నేను వెనక్కి వచ్చాక మళ్లీ పరీక్ష  చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది”,  అని  PARI కి చెప్పాడు.

Bareilly (left) and Firozabad (right): Candidates and supporters gathered at the counting booths on May 2; no distancing or Covid protocols were in place
PHOTO • Courtesy: UP Shikshak Mahasangh
Bareilly (left) and Firozabad (right): Candidates and supporters gathered at the counting booths on May 2; no distancing or Covid protocols were in place
PHOTO • Courtesy: UP Shikshak Mahasangh

బరేలి(ఎడమ), ఫిరోజాబాద్(కుడి):  క్యాండిడేట్లు, సపోర్టర్లు  కౌంటింగ్ బూత్ ల  వద్ద  మే2న జమయ్యారు. ఏ మాత్రం భౌతిక దూరం లేదా కోవిడ్ జాగ్రత్తలు తీసుకోలేదు.

“నేను బస్సులో వైరస్ ను తెచ్చుకున్నాను  అనుకుంటాను.  చిత్రకూట్ జిల్లా హెడ్ క్వార్టర్ల నుంచి మట్దాన్ కేంద్ర(ఓటింగ్ సెంటర్) వెళ్లే బస్సులో పోలీసులతో కలిపి కనీసం 30 మందిని ఉన్నాము.” అన్నాడు శివ. అతను ఇప్పుడు చికిత్స తీసుకుంటూ క్వారంటైన్ లో ఉన్నాడు.

ఈ విపత్తులో బయటపడిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఏజెంట్లు RT PCR పరీక్షలలో నెగటివ్ రిపోర్ట్ ను తనిఖీ చేయవలసి ఉన్నా అది జరగలేదు.   కౌంటింగ్ డ్యూటీ చేసిన సంతోష్ కుమార్ , ఈ తనిఖీ చేయకపోవడమే గాక  కోవిద్ మార్గదర్శకాలు కూడా ఎన్నడూ సెంటర్లలో  పాటించలేదని చెప్తున్నారు.

*****

“మేము ఏప్రిల్ 28 న  యూపీ రాష్ట్ర ఎన్నికల  కమిషన్ కు,  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు రాసిన లేఖలో ఎన్నికలు వాయిదా వేయమని అభ్యర్ధించాము.” అని శిక్షక్ మహాసంఘ్ ప్రెసిడెంట్ దినేష్ చంద్ర శర్మ చెప్పారు. “ఆ తరవాత రోజు బ్లాకుల నుంచి సేకరించిన 700 మరణాల  జాబితాను SEC కి, CM కి ఇచ్చాము.”

శర్మ మద్రాస్ హైకోర్టు  ఎన్నికల కమిషన్ కు చెప్పిన మాటలు తెలిసినా వాటి గురించి ఏమీ  వ్యాఖ్యానించలేదు. కానీ అతను చాలా బాధతో, “మా జీవితాలు పట్టవు. ఎందుకంటే మేము సామాన్యులం, ధనవంతులం కాము. ప్రభుత్వానికి ఎన్నికలు వాయిదా వేసి, పవర్ ఉన్న వారికి కోపం తెప్పించాలని లేదు- ఎందుకంటే వారు ఎన్నికల కోసం  చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. జరిగిన దానికి బదులుగా మేము ఇచ్చిన చావు లెక్కలకు అన్యాయమైన మాటలు పడవలసి వస్తోంది.” అన్నారు.

“చూడండి, మాది 100 ఏళ్ళ యూనియన్,  ప్రాధమిక, ప్రాధమికోన్నత  పాఠశాలలో పనిచేసే 3 లక్షల మంది  ప్రభుత్వ టీచర్లు ఉన్నారు ఇందులో-. ఇలాంటి యూనియన్ ఇన్నేళ్లు అబద్ధాలతో, మోసాలతో రాణించగలదా?”

“వాళ్ళు మేము ఇచ్చిన లెక్కలను చూడడానికి,  ఒప్పుకోడానికి సుముఖంగా  లేకపోవడమే కాకుండా దీని గురించి విచారణ చేస్తున్నారు. అసలైతే మేము  ఈ జాబితాలో జతచేయని పేర్లు చాలా ఉన్నాయని తెలిసింది. కాబట్టి మేము మా జాబితా ను మళ్లీ సరిచేయాలి.”

ఇలస్ట్రేషన్: జిగ్యాస మిశ్ర

అతని చాలా బాధతో, ‘మా జీవితాలు పట్టవు. ఎందుకంటే మేము సామాన్యులం, ధనవంతులం కాము. ప్రభుత్వానికి ఎన్నికలు వాయిదా వేసి పవర్ ఉన్న వారికి కోపం తెప్పించాలనిలేదు- ఎందుకంటే వారు ఎన్నికల కోసం  చాలా డబ్బులు ఖర్చుపెట్టారు.’

లక్నో జిల్లా  ప్రెసిడెంట్  మహాసంఘ్ సుదాంసు, “మేము ఎన్నికల డ్యూటీ నుంచి వెనక్కి వచ్చిన టీచర్లలో ఎంత మంది కోవిడ్ పాజిటివ్ అయ్యారో ఆ లిస్ట్ ను  కూడా తయారు చేస్తున్నాం. చాలా మంది టెస్టుకు వెళ్ళక పోయినా లక్షణాలను బట్టి కూడా ఇళ్ళలో సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారు.” అని PARI తో చెప్పారు.

దినేష్ శర్మ  యూనియన్ కి రాసిన మొదటి లేఖ లో “ ఎన్నికల పని  లో పాల్గొంటున్న సిబ్బంది అందరికీ  కోవిడ్-19 నుంచి రక్షణ పొందడానికి కావలసిన సామాగ్రిని  ఇవ్వాలని”, డిమాండ్ చేశామని  చెప్పారు.

“ఈ విధంగా నేను నా భర్తను  కోల్పోతానని నాకు తెలిసి ఉంటే, నేను తనని అసలు వెళ్లనిచ్చేది దాన్ని కాదు. మహా అయితే అతని ఉద్యోగం కోల్పోయేవాడు, కానీ అతను బతికి ఉండేవాడు కదా,” అంటుంది అపర్ణ మిశ్ర.

శిక్షక్ మహాసంఘ్  అధికారులకు  రాసిన మొదటి ఉత్తరం లోనే, “ఏ ఉద్యోగికైనా  కోవిడ్ 19 సోకితే, వారికి చికిత్స కు 20 లక్షలు, ప్రాణాలు కోల్పోతే చనిపోయిన వారి కుటుంబానికి  50 లక్షలు ఇవ్వాలి”,  అని రాశారు.

అలా జరిగితే  అపర్ణ కు, అపర్ణ వంటి ఎందరికో, వారి జీవిత భాగస్వాములను, కుటుంబ సభ్యులను, వారి ఉద్యోగాలను , జీవితాలను  కోల్పోయినందుకు  కొంతైన సాంత్వన దొరుకుతుంది.

గమనిక:  ఇప్పుడే అందిన వార్త ప్రకారం  ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం  అలాహాబాద్ హై కోర్ట్ కు “చనిపోయిన పోలింగ్  ఆఫీసర్ల  కుటుంబ సభ్యులకు  రూ. 30,000,00/-  ఇవ్వడానికి నిర్ణయించడమైనది” అని చెప్పింది. కానీ రాష్ర ఎన్నికల  కమిషన్, కోర్టుకు  చెప్పినదాని ప్రకారం  ప్రభుత్వం వద్ద  ఇప్పటిదాకా  28 జిల్లాల్లో  77 మరణాల రిపోర్టులు మాత్రమే ఉన్నాయని  చెప్పింది.

అనువాదం: అపర్ణ తోట

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Illustration : Antara Raman

Antara Raman is an illustrator and website designer with an interest in social processes and mythological imagery. A graduate of the Srishti Institute of Art, Design and Technology, Bengaluru, she believes that the world of storytelling and illustration are symbiotic.

Other stories by Antara Raman
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota