తన మూడో బోరుబావి కూడా ఎండిపోవడంతో డి. అమర్‌నాథ్‌రెడ్డి తన భూమికి నీరందించేందుకు మళ్లీ వర్షాలపై ఆధారపడవలసి వచ్చింది. ఈ 51 ఏళ్ల రైతు ఆంధ్రప్రదేశ్‌లోని కరువు పీడిత రాయలసీమ ప్రాంతంలో టమోటాలు పండిస్తాడు. ఆ ప్రాంతంలో వర్షాలు ఎప్పుడొస్తాయో చెప్పలేము. అందుకని చిత్తూరు జిల్లా ముదివేడు గ్రామంలో తన మూడెకరాల పొలంలో బోర్‌వెల్‌పై రూ.5 లక్షలు ఖర్చుపెట్టాడు. డ్రిల్లింగ్‌కు ఆర్థికసాయం కోసం ప్రైవేట్‌ రుణదాతల నుంచి అప్పు తీసుకున్నాడు. మొదటి బావి విఫలమైన తర్వాత, అతను మళ్లీ ప్రయత్నించాడు. మూడవసారి, అతని అప్పు పెరిగింది కానీ భూమిలో నీటి నిలవ అంతు చిక్కలేదు.

ఏప్రిల్-మే 2020లో తన పంటను అందుకుని, తన రుణాలలో కొంత భాగాన్ని తిరిగి చెల్లించాలని అమర్‌నాథ్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు.అతనికి 10 లక్షల అప్పు ఉంది. ఈ పది లక్షలు అతను బోరెవెల్ వేయడం కోసం, అతని పెద్ద కుమార్తె పెళ్లికి కోసం, పంట రావడం కోసం ఖర్చు పెట్టాడు. అయితే గత ఏడాది మార్చి 24న ప్రధాని ప్రకటించిన ఆకస్మిక లాక్‌డౌన్ వలన అతను అనుకున్నట్టు  జరగలేదు. ఇటువంటి సమయంలో టమోటా పంట అమ్మడం సాధ్యం కాదు, అతను మొక్కల మీద ఉన్న కాయలు, పక్వానికి చేరి కుళ్ళిపోవడాన్ని చూస్తూ ఉండిపోయాడు.

"మహమ్మారి సమయంలో పరిస్థితులు మెరుగుపడవని అతను భావించి, ఆశలన్నీ కోల్పోయాడు" అని అమర్‌నాథ్ భార్య డి. విమల, సెప్టెంబర్ 17, 2020న అతను ఎందుకు విషం తీసుకున్నాడో వివరించడానికి ప్రయత్నిస్తూ. “దానికి 10 రోజుల ముందు కూడా అతను తన ప్రాణాలను తీసుకోవడానికి ప్రయత్నించాడు. మేము అతనిని రక్షించడానికి బెంగళూరులోని ఒక పెద్ద ఆసుపత్రికి [180 కిలోమీటర్ల దూరంలో] తీసుకెళ్లాము. దీనికోసం మేము అప్పుడు లక్ష రూపాయిలు ఖర్చుపెట్టవలసి వచ్చింది,” అని విమల చెప్పింది, మళ్ళీ అలా చేయవద్దని అమర్‌నాథ్‌ని వేడుకుంది.

చిత్తూరులో రైతుల ఆత్మహత్యలకు బోర్‌వెల్ విఫలమవడం ప్రధాన కారణాల్లో ఒకటి. మిగిలినవి టమోటా పంట వలన అయిన వ్యవసాయ అప్పులు. కుటుంబాలకు పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఉత్తర్వు మరిన్ని కారణాలను సూచిస్తుంది: “ఇటువంటి ఆత్మహత్యలకు కారణాలు బోర్‌వెల్‌ల వైఫల్యం, అధిక సాగు ఖర్చుతో వాణిజ్య పంటలను పెంచడం, పంటకు సరైన ధర అందకపోవడం, కేవలం మాట ద్వారా పొందే కౌలు, బ్యాంకు రుణాలు పొందేందుకు అనర్హత, అధిక వడ్డీ రేట్లతో ప్రైవేట్ రుణాలు, ప్రతికూల కాలానుగుణ పరిస్థితులు, పిల్లల విద్య, అనారోగ్యం, వివాహాల కోసం చేసిన భారీ వ్యయం.”

చాలా మందికి, గత సంవత్సరం ప్రణాళిక లేని లాక్‌డౌన్ కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. 2020లోనే, చిత్తూరు జిల్లాలో 34 మంది రైతులు తమ ప్రాణాలను తీసుకున్నారు- ఇది 2014 నుండి జరిగిన రైతుల ఆత్మహత్యలలో అత్యధిక సంఖ్య. ఇందులో 27 మంది ఏప్రిల్- డిసెంబర్ మధ్య మరణించారు.

Vimala's husband, D. Amarnath Reddy, could not harvest his tomato crop because of the Covid-19 lockdown
PHOTO • Courtesy: D. Vimala

చిత్తూరులోని ముదివేడులో డి. విమల (కుడి), ఆమె తండ్రి బి. వెంకట రెడ్డి. కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా విమల భర్త డి. అమర్‌నాథ్ రెడ్డి తన టమోటా పంటను అందుకోలేకపోయాడు

మహారోగం ముందు పరిస్థితి మెరుగ్గా ఏమిలేదు. 2019లో, ఆంధ్రప్రదేశ్‌లో రైతుల సగటు కుటుంబ రుణం – రూ. 2.45 లక్షలు - ఇది దేశంలోనే అత్యధికం. ఇటీవలి 2019 గ్రామీణ భారతదేశంలోని వ్యవసాయ కుటుంబాలు, వారికి చెందిన భూమి, పశువులు, వారి పరిస్థితుల అంచనా ప్రకారం , రాష్ట్రంలోని 93 శాతం వ్యవసాయ కుటుంబాలు ఆ సంవత్సరంలో అప్పుల్లో ఉన్నాయని తెలుస్తోంది.

అమర్‌నాథ్, విమల ఇంటి పక్క వీధిలో, 27 ఏళ్ళ పి. మంజుల ఉంటోంది. ఆమె తన చనిపోయిన భర్త మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అతను తన బాధను ఎవరికీ తెలియనివ్వలేదు, అని ఆమె చెప్పింది. వారు వివాహం చేసుకున్న ఎనిమిదేళ్లలో, అతను వారి 10 ఎకరాల వ్యవసాయ భూమిని సాగు చేయడానికి తనకున్న ప్రణాళికను తరచుగా చర్చించేవాడు. "కానీ అతను తన ఆర్థిక ఇబ్బందుల గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఈ 8.35 లక్షల రూపాయిల అప్పు కూడా నాకు ఆశ్చర్యం కలిగించింది.” అన్నదామె. ఆమె భర్త, 33 ఏళ్ల పి. మధుసూధన్ రెడ్డి, చెట్టుకు ఉరివేసుకుని, జూలై 26, 2020న మరణించారు.

అర ఎకరం పొలంలో మధుసూధన్ సాగు చేసిన టమోటా కాయ లేకుండా పోయింది. చాలా వరకు ఆతను తన వ్యవసాయ భూమిలో వేసిన నాలుగు బోర్‌వెల్‌ల కోసం ఈ అప్పు చేసిన డబ్బులను  ఖర్చుపెట్టినట్లు అతని తండ్రి పి. జయరామి రెడ్డి చెప్పారు. ఎనిమిదేళ్లుగా 700-800 అడుగుల బోర్లు తవ్వగా, అంత కాలం అయిన వడ్డీ, తీసుకున్న మొత్తానికు సమానమైంది.

కొన్ని అప్పులు తీర్చేందుకు మధుసూధన్‌ కుటుంబం, అతను చనిపోయిన తర్వాత రెండు ఎకరాల భూమిని విక్రయించింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని ఏడు కుటుంబాలు సంయుక్తంగా వినియోగిస్తున్న బోరుబావి నుంచి నీటిని తోడి అర ఎకరంలో వరి సాగు చేస్తున్నారు. “ఈ సంవత్సరం [2021] భారీ వర్షాల కారణంగా మేము విత్తిన వేరుశెనగ మంచి దిగుబడిని ఇవ్వలేదు. మేము పెట్టిన పెట్టుబడిని తిరిగి రాదు. మిగిలిన భూమి కూడా బీడుగా ఉంది’’ అని జయరామిరెడ్డి చెప్పారు.

2019 నుంచి కురుస్తున్న వర్షాల వల్ల జిల్లాలో రైతులు టమాటా నుండి వరిసాగుకు మరలుతున్నారని చిత్తూరు ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.శ్రీనివాసులు తెలిపారు. అయితే, 2009-10 మరియు 2018-19 మధ్య దశాబ్దంలో ఏడేళ్లపాటు జిల్లాలోని కురబలకోట మండలం ముదివేడు వంటి కొన్ని ప్రాంతాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించామని మండల సహాయ గణాంక అధికారి ఎన్.రాఘవ రెడ్డి తెలిపారు.

P. Manjula and her late husband P. Madhusudhan Reddy's parents, P. Jayarami Reddy and P. Padmavatamma.
PHOTO • G. Ram Mohan
M. Eswaramma and Pooja in Deganipalli
PHOTO • Courtesy: M. Eswaramma

ఎడమ: పి.మంజుల, ఆమె దివంగత భర్త పి.మధుసూధన్ రెడ్డి తల్లిదండ్రులు పి.జయరామిరెడ్డి, పి.పద్మావతమ్మ. కుడి: దేగానిపల్లిలో ఎం. ఈశ్వరమ్మ, పూజ

2019 నుండి చిత్తూరులో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సంకలనం చేసిన డేటా ప్రకారం, 2018లో ఈ సంఖ్య 7 ఉండగా, 2019లో అది 27కి పెరిగింది. 2020లో, ఆంధ్రప్రదేశ్ మూడవ అత్యధిక రైతు ఆత్మహత్యలు జరిగిన రాష్ట్రంగా నమోదు చేయబడినప్పుడు. దేశంలో రైతుల ఆత్మహత్యల సంఖ్య - 140 మంది కౌలు రైతులతో సహా 564గా ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రకారం - ఇందులో 34 మంది చిత్తూరుకు చెందినవారు.

వారిలో ఎం. చిన్న రెడ్డప్ప అనే దళిత కౌలు రైతు ఒకరు. పెద్ద తిప్పసముద్రం మండలం సంపతికోట గ్రామంలోని 1.5 ఎకరాల కౌలు భూమిలో టమోటా సాగు చేసి ఆరునెలలకు రూ. 20,000  కౌలు చెల్లించేవాడు. కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా అతని భార్య ఎం. ఈశ్వరమ్మ అతను పంటను విక్రయించలేకపోయాడని చెప్పారు. “పొలాల్లో పంట ఎండిపోవడంతో మాకు మూడు లక్షల రూపాయల అప్పు మిగిలింది.” ఆదాయాన్ని కోల్పోయినా తేరుకోవడానికి దంపతులకు ఆస్తి లేదా పొదుపు చేసిన డబ్బు, లేదు. డిసెంబర్ 30న 45 ఏళ్ల చిన్న రెడ్డప్ప తన జీవితాన్ని ముగించాడు.

ఈశ్వరమ్మ, 5వ తరగతి చదువుతున్న ఆమె కుమార్తె పూజ, బి.కొత్తకోట మండలం డేగానిపల్లి తండాలోని తన తల్లిదండ్రుల ఇంటికి మారారు. "ఇప్పుడు నేను రోజుకు 200 పొలాల్లో కూలి చేసుకుంటూ బతుకుతున్నాను, అప్పు తీర్చే మార్గం లేదు," అని ఈశ్వరమ్మ చెబుతుంది, "నేను బ్రతకడం చాలా కష్టంగా ఉన్నప్పటికీ, అప్పులు ఇచ్చినవారు నాకు ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు."

రైతు స్వరాజ్య వేదిక (ఆర్‌ఎస్‌వి) ఫిబ్రవరి 2019లో సమాచార హక్కు దరఖాస్తు ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 2014 మరియు 2018 మధ్య 1,513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వెలుగులోకి వచ్చింది. అయితే 391 కుటుంబాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 5 లక్షల పరిహారం అందుకున్నారు. దీనిపై మీడియాలో వార్తలు రావడం తో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. "ప్రభుత్వం మరో 640 మందికి మాత్రమే పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది, మిగిలిన 482 మంది రైతుల కుటుంబాలకు ఏమీ అందలేదు," అని చనిపోయిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందజేయాలని కృషి చేస్తున్న రైతు స్వరాజ్య వేదిక కార్యదర్శి బి. కొండల్‌రెడ్డి చెప్పారు. తరవాత రాష్ట్ర ప్రభుత్వం, అక్టోబర్ 2019 లో, చనిపోయిన రైతుల కుటుంబాలకు 2 లక్షలు పరిహారం ఎక్కువగా చెల్లిస్తామని చెప్పినా విమల, మంజుల, ఈశ్వరమ్మ - వీరెవరికీ ఇప్పటిదాకా అది అందలేదు.

2019-20లో, చిత్తూరు జిల్లా టమోటా ఉత్పత్తిలో రాష్ట్ర వాటాలో 37 శాతం అందించింది - ఆ సంవత్సరం, దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారు అయింది. హైబ్రిడ్, స్థానిక రకాల  టమోటాలు రెండూ ఏడాది పొడవునా సాగు చేయబడతాయి. రాయలసీమలోని చిత్తూరు ఇంకా ఇతర జిల్లాలలో (YSR కడప, అనంతపురం, కర్నూలు), అలానే పొరుగున ఉన్న కర్ణాటక నుండి కూడా చాలా మంది టమోటా రైతులు తమ ఉత్పత్తులను దేశంలోని అతిపెద్ద మార్కెట్ యార్డులలో ఒకటైన చిత్తూరులోని మదనపల్లి టమోటా మార్కెట్‌లో విక్రయిస్తారు.

S. Sreenivasulu from Anantapur (left) sells his produce at Madanapalle market yard in Chittoor. The market yard is one of the largest trading hubs for tomatoes
PHOTO • G. Ram Mohan
The market yard is one of the largest trading hubs for tomatoes
PHOTO • G. Ram Mohan

అనంతపురం (ఎడమ)కి చెందిన ఎస్‌.శ్రీనివాసులు చిత్తూరులోని మదనపల్లె మార్కెట్‌ యార్డులో తన ఉత్పత్తులను విక్రయిస్తున్నాడు. మార్కెట్ యార్డు టమోటాలకు అతిపెద్ద వ్యాపార కేంద్రాలలో ఒకటి

మదనపల్లెలో, హోల్‌సేల్ ధరలు వేలం ద్వారా నిర్ణయించబడతాయి, వాటి రేటు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ముందు రోజు రాత్రి కురిసిన వర్షం మరుసటి రోజు ఉదయం ధరను తగ్గిస్తుంది. ధరలు బాగున్నప్పుడు, మార్కెట్‌కు ఉత్పత్తి ఎక్కువగా రావడం వల్ల ఆ రోజు వేలం ధర తగ్గుతుంది. అనంతపురం జిల్లా తనకల్ మండలం మల్రెడ్డిపల్లె గ్రామానికి చెందిన మదనపల్లి యార్డులో విక్రయిస్తున్న ఎస్.శ్రీనివాసులు అనే రైతును ఈ విలేఖరి ఆగస్టు 29న కలిశాడు. “నిన్న  మంచి ధర రావడంతో రైతులు ఎక్కువ టమోటాలను యార్డుకు తీసుకురావడంతో 30 కిలోల క్రేట్ ధర రూ. 500 నుండి రూ. 390 కు తగ్గింది.” అని అతను చెప్పాడు

“ఎకరానికి టమోటా పెట్టుబడి రూ. 1,00,000 నుండి రూ 2,00,000 వరకు ఉంటుంది" అని అనంతపురం నల్లచెరువు మండలం అల్లగుండు గ్రామానికి చెందిన రైతు ఆర్. రామస్వామి రెడ్డి చెప్పారు. "ఇంకా ఎక్కువ కష్టపడితే దిగుబడి ఎక్కువగా ఉంటుంది, వర్షాలు పంటను దెబ్బతీయలేదు," అని ఆయన చెప్పారు. 2-3 సంవత్సరాలలో కలిగిన నష్టాలను నాల్గవ సంవత్సరంలో మాత్రమే పూరించుకోవచ్చు.

గత మూడేళ్లుగా టమోటా సాగు చేయడం ప్రమాదకరంగా మారిందని మదనపల్లెకు చెందిన న్యాయవాది ఎన్.సహదేవ నాయుడు చెప్పారు. ఈయన కుటుంబం 10-15 ఎకరాలు కౌలు భూమిలో టమోటాను సాగుచేస్తున్నారని ఆయన చెప్పారు. "నా 20 ఏళ్ల అనుభవంలో ఒక వారం రోజులు కూడా రేట్లు ఒకే విధంగా లేవు," అని ఆయన చెప్పారు, గత రెండు దశాబ్దాలలో పెట్టుబడి ఖర్చులు 7-10 రెట్లు పెరిగాయి, అయితే టమోటా రేటు మాత్రం రూ. 1 నుండి రూ. 60 మధ్యనే ఉంది. అయితే, పంటపై అధిక రాబడుల వచ్చే అవకాశం ఉందిగాబట్టి సాగుదారులు ఈ పంటను వేయాలనుకుంటారు. పంట దిగుబడి ఎక్కువగా ఉండడం వలన నాయుడు కుటుంబం మారుతున్న ధరలను తట్టుకోగలుగుతున్నారు. "మేము భూమిని కౌలుకు తీసుకొని పంటను సాగు చేసాము, సంవత్సరం పొడవునా టమోటాలు విక్రయించి, నష్టాల నుండి మమ్మల్ని రక్షించుకోగలిగాము," అని ఆయన వివరించారు.

ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబర్‌లో భారీ వర్షాలు, నవంబర్ మధ్య నుంచి 255 శాతానికి మించి కురిసిన అకాల వర్షాల వల్ల రాయలసీమ వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి . టమోటాలు అందుబాటులో లేని కారణంగా మదనపల్లెలో అక్టోబర్‌ నుంచి ధరలు పెరుగుతున్నాయి. గత నెలలో నాణ్యమైన హైబ్రిడ్ టమోటా కిలో రూ.42- రూ.48కి విక్రయించగా, నవంబర్ 16న కిలో రూ.92 ధర పలికింది. నవంబర్ 23న వరకు ధర పెరుగుతూనే ఉంది – చివరికి రికార్డ్ స్థాయిలో కిలో 130 రూపాయలు అయింది.

కొంతమంది రైతులు ఆ రోజు ఉపశమనంతో ఇంటికి వెళ్ళినప్పటికీ, చాలామందికి వారి అనిశ్చిత జీవనోపాధికి ఇది మరొక గుర్తు.

మీలో ఆత్మహత్య చేసుకోవాలనే  ఆలోచన కలుగుతున్నా లేదా ఆపదలో ఉన్నారని అనిపించినా, దయచేసి కిరణ్ అనే జాతీయ హెల్ప్‌లైన్‌కి 1800-599-0019 (24/7 టోల్ ఫ్రీ) లేదా మీకు సమీపంలో ఉన్న ఈ హెల్ప్‌లైన్‌లలో దేనినైనా కాల్ చేయండి. మానసిక ఆరోగ్య నిపుణుల, వారి సేవల సమాచారం కోసం, దయచేసి SPIF మానసిక ఆరోగ్య డైరెక్టరీ ని సందర్శించండి.

అనువాదం: అపర్ణ తోట

G. Ram Mohan

G. Ram Mohan is a freelance journalist based in Tirupati, Andhra Pradesh. He focuses on education, agriculture and health.

Other stories by G. Ram Mohan
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota