శాంతిలాల్, శాంతు, టిన్యో- ఒకే మనిషి, మూడు పేర్లు. ఇది చాలనట్టు అతనికి నాలుగో పేరు కూడా ఉంది. సాబర్‌కాంఠా జిల్లాలోని వడాలి గ్రామపు పలుకుబళ్ల పుణ్యమా అని అతన్ని శొంతూ అని పిలుస్తారు. మనమూ అదే పేరుతో పిలుద్దాం.

శొంతు ఒక ప్రత్యేకమైన మనిషి. ప్రత్యేకమూ అంటే అద్భుతం, ఒకే ఒక్కడు, ప్రముఖుడు- ఇలాంటి విశేషణాలకు చెందిన ప్రత్యేకత కాదది. బలహీనవర్గాల నిరుపేద దళితవ్యక్తి. విలువలకు కట్టుబడి ఉండటం అన్నది ఉంది చూశారూ- దానివల్ల అతగాడు గందరగోళపడుతూ, బాధలుపడుతూ, వాటిని సహిస్తూ ముందుకు సాగే మనిషిగా పరిణమించాడు శొంతూ. ఒకోసారి అతగాడు అసలు ఉనికేలేని జీవి అనిపిస్తాడు. మరోసారి అతడు ఒక సగటు మనిషికి ఎంతపాటి అస్తిత్వం ఉండదగునో అంతపాటి, ఛాయామాత్రపు ఉనికితో కనిపిస్తాడు.

ఆరుగురు కుటుంబ సభ్యులు - తల్లిదండ్రులు, ఒక అన్న, ఒక అక్క, ఒక చెల్లి. కనీస అవసరాలు తీర్చుకోలేని కటిక దారిద్ర్యం. పెరిగే నిత్యావసరాలు. తీర్చుకోలేని ఆర్థిక పరిస్థితి... ఈ నేపథ్యంలో పెరిగాడు శొంతూ. తల్లిదండ్రులు, అక్క, అన్న కలసి రెండుపూటలా తిండికి సరిపడేంత సంపాదిస్తారు. తండ్రి సరుకులు రవాణా చేసే మెటడోర్ వ్యాను డ్రైవరు. సరుకులే తప్ప అదనంగా ప్రయాణీకుల్ని ఎక్కించుకోరు- అంచేత ఆ అదనపు ఆదాయం రాదు. తల్లి కూడా రోజుకూలీగా పనిచేస్తుంది. ఆ పని ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఉండదు. తండ్రికి తాగుడు అలవాటు లేకపోవడం, ఇంట్లో అలజడులు లేకపోవడమనేది అదో సుకృతం. అది సుకృతమన్న సంగతి శొంతూకు ఎంతోకాలం తర్వాతగానీ తెలియలేదు.

వడాలి గ్రామంలోని హైస్కూల్లో శొంతూ తొమ్మిదోక్లాసు చదువుతున్నపుడు ఊర్లోకి సర్కస్ వచ్చింది. కానీ టిక్కెట్లు బాగా ఖరీదు. అయినా స్కూలు పిల్లలకు ఐదురూపాలకే అమ్మారు. శొంతూవాళ్ళకు ఆ ఐదు రూపాయలు కూడా కష్టమే. "నించో" టీచరు అజ్ఞాపించారు. "ఏం బాబూ, డబ్బులు తేలేదేం?" వాత్సల్యంగానే అడిగారు టీచర్. "మామ్, మా నాన్నకు జొరం. పత్తి మిల్లు కూల్డబ్బులు మా అమ్మకు ఇంకా అందలేదు," అంటూ శొంతూ ఏడవసాగాడు.

మర్నాడు కుసుమ్ పఠాన్ అన్న తోటి విద్యార్థిని- రంజాన్ పండుగ ఆశీర్వాదాలు పొందే ప్రక్రియలో భాగంగా- శొంతూకు పదిరూపాయలు అందించింది. ఆ మర్నాడు 'నేనిచ్చిన పది రూపాయలు ఏం చేశావ్?' అనడిగింది. 'ఐదు రూపాయలు సర్కస్ టికెట్టుకిచ్చాను. మిగిలిన ఐదూ ఇంటిఖర్చుల కోసం అప్పుగా ఇచ్చాను,' నిజాయితీగా చెప్పాడు శొంతూ. కుసుమ్, రంజాన్, శొంతూ, సర్కస్- అదో సౌమ్యమైన దయనిండిన ప్రపంచం.

అతను పదకొండో తరగతిలో ఉన్నపుడు వాళ్ళ మట్టి ఇంటిని ఇటుకలు, సిమెంటుతో తిరిగి కట్టాల్సిన అవసరం పడింది- గోడలకు గిలాబా(ప్లాస్టరింగ్) చేయించడం అన్న మాట ప్రణాళికలో లేదు. దానిక్కూడా వాళ్ళకు ఆర్థిక స్తోమత లేదు. తాపీ పనికి ఒక మనిషిని పెట్టుకుని ఇంటిల్లపాదీ ఆ పనిలో మునిగిపోయారు. అయితే ఆ పనికి చాలాకాలం పట్టింది. శొంతూ గమనించేలోగానే ఫైనల్ పరీక్షలు వచ్చేశాయి. పరీక్షలు రాయడానికి హాజరు తక్కువయింది. పరిస్థితి వివరించి బ్రతిమాలితే, ప్రధానోపాధ్యాయులు శొంతూను పరీక్షలు రాయనిచ్చారు.

పరీక్ష గట్టెక్కి పన్నెండో క్లాసుకు వెళ్లాడు శొంతూ. ఈసారి ఇంకా బాగా చదవాలి అని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. గట్టిగా చదవడం మొదలెట్టాడు. ఈలోగా వాళ్ళమ్మకు జబ్బుచేసింది. జబ్బు ముదిరి ఆమె శొంతూ ఫైనల్ పరీక్షలకు కాస్తంత ముందు కన్నుమూశారు. ఆమెను పోగొట్టుకోవడం, ఆ వ్యథ- పద్దెనిమిదేళ్ళ కుర్రాడు భరించలేనంత బాధ. అయినా పరీక్షల కోసం బాగా చదివే ప్రయత్నం చేశాడు. కష్టపడి చదివాడు. ఫలితం లేకపోయింది. అరవై ఐదు శాతం మార్కులే వచ్చాయి. ఇక పైచదువులు అన్న ఆలోచన వదులుకోవాలనుకున్నాడు.

అతనికి పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. రోజూ ఊళ్లోని గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు ఇంటికి తెచ్చుకుంటూండేవాడు. అతని ఆసక్తిని గమనించిన ఓ స్నేహితుడు వడాలి ఆర్ట్స్ కళాశాలలో చరిత్ర సబ్జెక్టుగా తీసుకొని డిగ్రీ చదవమని ప్రోత్సహించాడు. 'ఆ సబ్జెక్టు తీసుకుంటే ఎన్నో గొప్ప పుస్తకాలు చదివే అవకాశం ఉంటుంది ' అని వివరించాడు. శొంతూ కళాశాలలో చేరాడు. కానీ అక్కడి గ్రంథాలయంలో పుస్తకాలు తెచ్చి ఇచ్చిరావడానికే తన రాకపోకలు పరిమితం చేశాడు. మిగిలిన సమయమంతా పత్తి మిల్లులో పనిచెయ్యడానికే వినియోగించసాగాడు. సాయంత్రాలు ఊళ్లో రికామీ తిరిగేవాడు. పుస్తకాలు చదివేవాడు. బియ్యే మొదటి ఏడాదిలో అరవైమూడు శాతం మార్కులు వచ్చాయి.

ఆ మార్కులు చూసి వాళ్ల ప్రొఫెసరు 'కాలేజీకి రెగ్యులర్‌గా రా' అని చెప్పారు. శొంతూకు క్రమక్రమంగా డిగ్రీ చదువు మీద మక్కువ ఏర్పడింది. అలా బియ్యే మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఆ ఏడాది వాళ్ళ కళాశాలవాళ్ళు పుస్తకాలు చదివే నైపుణ్యం ఉన్న విద్యార్థికి ఎవార్డు ఇవ్వాలనుకున్నారు. ఆ ఎవార్డు శొంతూకు వచ్చింది. 'నీకు గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు తీసుకునేంత సమయం ఎలా కుదురుతోంది శాంతిలాల్?" గొప్ప ఆశ్చర్యంతో అడిగారు వాళ్ల ప్రొఫెసరు. 2003లో బియ్యే మూడో సంవత్సరం అరవై ఆరు శాతం మార్కులతో పాసయ్యాడు శొంతూ.

PHOTO • Shantilal Parmar
PHOTO • Shantilal Parmar

కుడివైపున ఉన్న ఫోటోలో మనకు ఎదురుగా కనిపిస్తోన్న ఇంటి పై అంతస్తులో ఇప్పుడు శొంతూ నివసిస్తున్నారు. శొంతూ 11వ తరగతి చదువుతున్నప్పుడు అతని కుటుంబం ఇటుకలు, సిమెంట్‌తో తిరిగి నిర్మించిన ఇల్లు ఇదే. మనం చూస్తున్న గిలాబా చాలా కాలం తర్వాత వచ్చింది

డిగ్రీ ముగించాక దగ్గర్లోనే మహ్‌సానా ప్రాంతంలో ఉన్న విస్‌నగర్‌లోని ప్రభుత్వ కళాశాలలో ఎమ్.ఎ. చేయడానికి వెళ్లాడు శొంతూ. అక్కడి హాస్టల్లో గది దొరకాలంటే డిగ్రీ పరీక్షల్లో అరవై శాతం మార్కులు ఉండి తీరాలి. అంతకన్నా ఎక్కువే వచ్చాయి కాబట్టి శొంతూకు సులభంగానే గది దొరికింది. కానీ ఎమ్.ఎ. మొదటి సంవత్సరం పరీక్షల్లో ఏభైతొమ్మిది శాతం మార్కులే రావడంతో, రెండవ సంవత్సరంలో శొంతూ తన హాస్టల్ గదిని ఖాళీ చేయాల్సివచ్చింది.

వడాలీ, విస్‌నగర్‌ల మధ్య అటూ ఇటూ రోజూ గంటన్నర గంటన్నర ప్రయాణం చేసి కాలేజీకి వెళ్లడం మొదలెట్టాడు శొంతూ. ఆ ఏడాది దీపావళి రోజుల్లో వాళ్ళ నాన్నకు పని లేకుండాపోయింది. బ్యాంకు నుండి అప్పుచేసి కొన్న టెంపోకు వాయిదాలు కట్టడం సంగతి అటుంచి వాళ్ళకు రోజూ తినడానికి తిండి దొరకడం కూడా కష్టమయిపోయింది. అప్పటికే కుట్టుపని నేర్చుకుని ఉన్న శొంతూ అన్న రాజు, ఇంటి ఖర్చులకు తన వంతు సాయం అందించసాగాడు. అన్న దగ్గర ఏ సాయం తీసుకోవాలన్నా శొంతుకు రుచించకుండా పోతోంది. కాలేజీకి వెళ్ళిరావడంలో క్రమం తప్పింది.

ఊరి మార్కెట్లో ఉద్యోగం సంపాదించాడు. పత్తిని సంచుల్లో నింపి ట్రక్కులకు ఎత్తే పని. రోజుకు వందా రెండువందల సంపాదన. మార్చి నెల వచ్చింది. మళ్ళీ హాజరు తక్కువయింది. కళాశాల అధికారులు పరీక్షలకు అనుమతించలేదు. స్నేహితులు అడ్డంపడి ఎలాగోలా అనుమతి సాధించారు. మొత్తానికి 58.38 శాతం మార్కులతో శొంతూ ఎమ్.ఎ. గట్టెక్కాడు. ఎమ్.ఫిల్. చేయాలన్న కోరికైతే ఉంది కానీ ఆర్థిక సమస్య పెనుభూతంలా కళ్లముందు నిలబడి భయపెడుతోంది.

ఒక ఏడాది విరామం తర్వాత విస్‌నగర్‌లోని బి.ఎడ్. కాలేజీలో చేరాడు శొంతూ. రాజుభాయ్ వెంటనే మూడు శాతం వడ్డీతో ఏడువేలు అప్పు తీసుకున్నాడు. అందులో రూ. 3,500 కళాశాలలో చేరేందుకు కట్టే రుసుము కింద పోయింది. మరో రూ. 2,500 ఆ కోర్సుకు కంపల్సరీ సబ్జెక్ట్- కంప్యూటర్స్‌కు ఫీజుగా ఖర్చయింది. ఇతర ఖర్చుల కోసం అంతా కలసి శొంతూ దగ్గర వెయ్యి రూపాయలు మిగిలాయి. విస్‌నగర్‌కు రోజూ వెళ్ళిరావడం మొదలుపెట్టి అది మూడో సంవత్సరం.

అప్పటికే తమ కుటుంబపు ఆర్థిక ఒడిదుడుకుల గురించి శొంతూకు బాగా తెలుసు. చదువు మానేస్తానని కూడా అన్నకు చెప్పాడు. ‘ఈ ఇబ్బందుల మధ్యే చదువు కొనసాగించడం నేర్చుకో. చదువు మీద దృష్టిపెట్టు. మన ఇంటి సమస్యల సంగతి మర్చిపో. ఏడాదంటే ఎంతా- గిర్రున తిరిగిపోతుంది. అంతా సవ్యంగా సాగితే బి.ఎడ్. పూర్తయ్యాక నీకు ఉద్యోగం రావచ్చు,’ అన్నాడు రాజు. అన్నయ్య మాటలు శొంతూకు కొత్త స్ఫూర్తిని అందించాయి. అతని చదువుల బండి గాటనబడి నింపాదిగా వేసవిదాకా సాగిపోయింది.

శీతాకాలం మొదట్లో వాళ్ల నాన్న జబ్బుపడ్డాడు. ఖర్చుల బాధ్యతలు అన్న ఒంటిచేతిమీద జరుపుకోవలసి వస్తోందన్న వాస్తవం శొంతూకు వేదన కలిగించింది. చదువూ ఖర్చులూ అన్నవాటి మధ్య విడదీయరాని స్నేహ సంబంధముందన్న విషయాన్ని తన బి.ఎడ్. కోర్సు శొంతూకు స్పష్టపరిచింది. సార్వజనిక ప్రాథమిక విద్యా ప్రణాళికకు సంబంధించిన సర్వశిక్షా అభియాన్ కార్యక్రమంలో ఇంటర్న్‌షిప్ చేయవలసిన అవసరం ఏర్పడింది. దానికోసం పదిరోజులపాటు బోకర్‌వాడా, భాండు గ్రామాలకు వెళ్ళిరావాలి. అక్కడి తిండీతిప్పలూ బోకర్‌వాడా ప్రాథమిక పాఠశాలవాళ్ళు చూసుకొంటారు గానీ వసతి మాత్రం ఎవరికి వారే ఏర్పాటు చేసుకోవాలి. అదో అదనపు ఖర్చు. అన్నయ్యను డబ్బడగటానికి శొంతూకు మనసొప్పలేదు. తన కళాశాల పరిపాలనా కార్యాలయంలో పనిచేసే మహేంద్రసింగ్ ఠాకూర్ దగ్గర రూ 300 అప్పు తీసుకున్నాడు.

"అక్కడి పూజారిని అడిగితే ప్లేటుకు పాతిక రూపాయల లెక్కన భోజనం వండిపెడతానన్నాడు. “మావాళ్ళంతా నాలుగురోజులపాటు అక్కడ తిన్నారు. నేను రెండ్రోజులు తిని రెండ్రోజులు ఉపవాసం ఉన్నాను. ఏభై రూపాయలు అలా మిగిలాయి." అని శొంతూ గుర్తుచేసుకున్నాడు. ఆ తర్వాత మరో ఐదు రోజులు భాండు అనే ఊరిలో గడపాల్సివచ్చింది. అక్కడివాళ్ళు వసతి చూపించలేకపోయారు. దాంతో రోజూ బోకర్‌వాడా నుంచి భాండూకు వెళ్ళిరావలసివచ్చింది. అదో రోజుకు పదిరూపాయల అదనపు ఖర్చు. మహేంద్రసింగ్ దగ్గర మరో రూ. 200 అప్పుచేయాల్సివచ్చింది.

భాండు ఇంజినీరింగ్ కళాశాలలో భోజనం ఏర్పాట్లు జరిగాయి.మళ్ళా ప్లేటు 25 రూపాయలు. శొంతు మరో రెండ్రోజులు ఉపవాసం ఉన్నాడు. అది స్నేహితుల్ని బాధపెట్టింది. "శాంతిలాల్... మేమంతా ముందే అయిదురోజులకీ డబ్బులు కట్టేశాం. భోంచేసేటప్పుడు ఎప్పటికప్పుడు డబ్బులు కట్టేది నువ్వొక్కడివే. ఒక పని చెయ్యి. మేం తిని వెళుతున్నపుడు ఎవరూ డబ్బులడగరుగదా, మాతోపాటే మా మధ్య కూర్చుని తిను. మాతోపాటే బయటికొచ్చేయ్, మరేం పర్లేదు" అని వాళ్ళు సలహా ఇచ్చారు. అతను పాటించాడు. "వాళ్ళ సలహా ప్రకారం కొన్నాళ్ళు అలా డబ్బు కట్టకుండా భోంచేశాను" అంటాడు శొంతూ.

అలా చెయ్యటం అతనికే నచ్చలేదు. ఇంత చేసినా వాళ్ళ ప్రొఫెసర్ ఎచ్ కె పటేల్ దగ్గర మరో రూ. 500 అప్పుచేయాల్సివచ్చింది. నా స్కాలర్‌షిప్పు రాగానే తిరిగి ఇచ్చేస్తానని చెప్పి తీసుకొన్నాడు. ఇంటర్న్‌షిప్ ఖర్చులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వీళ్ళంతా కలసి భాండులోని పాఠశాల  ఉపాధ్యాయులకు టిఫిన్లవీ పెట్టించడం కూడా జరిగింది.

ఒకరోజు ప్రొఫెసర్ పటేల్ శొంతును తన స్టాఫ్‌రూమ్‌కు పిలిపించి, వందనోటు చేతికి అందించి "మీ నాన్నకు బాగా సీరియస్‌గా ఉంది. వెంటనే ఇంటికి వెళ్ళు" అని పంపించారు. ఇంటికి వెళ్ళేసరికి అంతా అతనికోసం ఎదురుచూస్తూ కనిపించారు. "నాకు మా నాన్న మొహం చూపించి ఆయన శరీరాన్ని పంపించే ప్రయత్నాలు మొదలెట్టారు," అంటాడు శొంతు. అలా పంపడంతో ముగియలేదు సమస్య. పన్నెండో రోజు చెయ్యవలసిన కర్మకాండలు ఆ కుటుంబం ముందు జడిపిస్తూ నిలబడ్డాయి. తండ్రి పోయినపుడు అవి సక్రమంగా చెయ్యడం అనివార్యం. కానీ అందుకు నలభైవేలు కావాలి.

PHOTO • Shantilal Parmar
PHOTO • Shantilal Parmar

పాఠశాలకు, తరువాత కళాశాలకు వడాలీ నుండి విస్‌నగర్ లేదా విజయనగర్‌కు, మళ్ళీ వెనుకకు ఇంటికి వెళ్ళే ప్రతిసారీ ప్రయాణించే దారిలో శొంతూకు బాగా తెలిసిన వీధులు, వీటికి చివర ఉండే ఇల్లు లాంటివి

వాళ్ళ అమ్మ పోయినపుడు ఎలాగో ఆ కర్మకాండలు చెయ్యకుండా గడిపేశారు. ఈసారి ఇహ తప్పించుకునే మార్గం లేదు. అయినా ఊళ్ళోని వాళ్ళ కులపెద్దలు అందర్నీ సమావేశపరిచారు. అందులోని పెద్దాళ్ళు ఈసారి కూడా వీళ్ళకు మినహాయింపు ఇద్దాం అని ప్రతిపాదించారు. "పిల్లలింకా చిన్నాళ్ళు. రెండో అబ్బాయి చదువింకా పూర్తవలేదు. మిగతావాళ్ళు ఎలాగోలా ఇల్లు నడుపుకొస్తున్నారు. వీళ్ళమీద ముందుముందు ఇంకా బాధ్యతలు పడతాయి. ఇప్పుడు ఈ ఖర్చుకు వీళ్ళు తట్టుకోలేరు" అని అందరికీ నచ్చచెప్పారు. మొత్తానికి ఆ కుటుంబానికి ఆ గండం అలా గడిచింది. లేకపోతే ఆర్థికంగా వాళ్ళు చితికిపోయేవారే.

శొంతూ 76 శాతం మార్కులతో బి.ఎడ్. పాసయ్యాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు ఆరంభించాడు. ఈలోగా వర్షాకాలం వచ్చింది. వాళ్ళ అన్న రాజు ఆదాయానికి గండికొట్టింది. "ఇహ ఉద్యోగం గురించి ఆలోచన విరమించి పొలాల్లో పనిచెయ్యడం మొదలెట్టాను" అన్నాడు శొంతూ. కొత్తగా తెరచిన బి ఎడ్ ప్రైవేటు కాలేజీలు ఆ ప్రాంతంలో ఉన్నమాట నిజమే అయినా అక్కడ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉంది. వాళ్ళందరికీ మార్కులు ఎక్కువ. వాళ్ళతో పోటీ పడటం ఎలా? పైగా నియామకాల్లో అవినీతి పాత్ర ఉండనే ఉందయ్యే. ఇదంతా శొంతును బాగా కలవరపరచింది.

కొన్నాళ్ళ తర్వాత శొంతు మరో ఆలోచన చేశాడు. కంప్యూటర్ మీదకు తన దృష్టి మళ్లించాడు. తమ సాబర్‌కాంఠ జిల్లాలోనే విజయనగర్ అన్న ఊళ్ళో ఉన్న టెక్నికల్ కాలేజీలో ఏడాదికాలపు పీజీ డిప్లొమాకు అప్లై చేశాడు. మెరిట్ లిస్టులో అతని పేరు ఎక్కింది. అయినా ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు.

తమ వడాలి గ్రామానికి రెండుకిలోమీటర్ల దూరాన ఉన్న కోఠీకంపా అనే గ్రామంలోని చింతన్ మెహతా అనే ఆయన్ని ఆశ్రయించాడు శొంతూ. ఆయన కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి కోర్సు ఫీజును శొంతూకు రాబోయే స్కాలర్‌షిప్పులో సర్దుబాటు చేసుకొనేలా ఒప్పించాడు. మర్నాడు శొంతూ విజయనగర్ చెరుకొన్నాడు. కానీ అక్కడి కాలేజీ గుమస్తా ఫీజు కట్టకుండా చేర్చుకోడానికి ఒప్పుకోలేదు. "ఇక్కడి వ్యవహారాలన్నీ ఆజమాయిషీ చేసేది మేము" అంటూ అతగాడు మొండికేశాడు. మూడురోజులు గడిచాక ఫీజు కట్టలేదన్న కారణంతో అతని పేరును మెరిట్ జాబితో లోంచి తొలగించారు.

అయినా శొంతూ ఆశలు వదులుకోలేదు. అదనపు సీట్ల కోసం కాలేజీ యాజమాన్యం పైవాళ్ళకు అప్లై చేసిందన్న సమాచారం క్లర్కు ద్వారా తెలుసుకున్నాడు. ఆ సీట్లు శాంక్షన్ అయి వచ్చేదాకా తరగతులకు హాజరుకావడానికి అనుమతి సంపాదించాడు శొంతూ. ఆ వ్యవహారం అలా తేలీతేలని సమయంలో రోజుకు యాభై రూపాయలు ఖర్చుపెట్టి వడాలి, విజయనగర్‌ల మధ్య ప్రయాణించడం మొదలుపెట్టాడు. మళ్ళీ స్నేహితులు అతడ్ని ఆదుకొన్నారు. శశికాంత్ అనే సన్మిత్రుడు బస్ పాస్ కొనుక్కోవడానికి 250 రూపాయలు అప్పు ఇచ్చాడు. ఎంతో ఎంతో బతిమాలాక ఆఫీసు క్లర్కు శొంతు బస్‌పాస్ మీద ఆఫీసు స్టాంపు వెయ్యడానికి ఒప్పుకున్నాడు అలా అదనపు సీట్ల కేటాయింపు ద్వారా తనకు కళాశాలలో చోటు దొరుకుతుందన్న ఆశతో నెలన్నరపాటు వడాలి - విజయనగర్‌ల మధ్య తిరిగాడు శొంతూ. కానీ చివరికి ఆ కేటాయింపు రానే లేదు. అది తెలిశాక శొంతూ తన ప్రయాణాలు మానేశాదు.

మళ్ళీ పొలం పనులకు వెళ్లడం మొదలుపెట్టాడు శొంతూ. మొరాద్ అనే పల్లెటూర్లో అలా నెలరోజులపాటు పనిచేశాక తిరిగి సొంత ఊరు వచ్చి వాళ్ళ అన్న చేస్తోన్న టైలరింగ్ పనిలో చేరాడు. ఊళ్ళోని రెప్‌డీమాతా మందిరం పక్కనే ఉన్న రోడ్డు పక్కనే ఉన్న టైలరింగ్ దుకాణమది. పున్నమికి ఇంకా మూడురోజులు ఉందనగా శొంతూకు అతని స్నేహితుడు శశికాంత్ కనిపించి, "శాంతిలాల్, కంప్యూటర్ క్లాసులు అర్థంచేసుకోలేక చాలామంది విద్యార్థులు కోర్సు మానేశారు. చాలా సీట్లు ఖాళీ అయ్యాయి. ప్రయత్నిస్తే నీకు మళ్ళీ సీటు దొరకొచ్చు" అని చెప్పాడు.

మర్నాడు వెళ్ళి గుమస్తాను కలిశాడు శొంతూ. ఫీజుకట్టమన్నాడు ఆ గుమాస్తా. అన్న దగ్గర టైలరింగు పనిచేసినపుడు సంపాదించిన వెయ్యి రూపాయలు క్లర్కుకు ఇచ్చి, దీపావళి లోగా మిగతా రూ. 5,200 ఎలాగోలా తీసుకొచ్చి కడతానని నచ్చచెప్పి కాలేజీలో చేరాడు.

చేరిన పదిహేను రోజులకే మొదటి ఇంటర్నల్ పరీక్షలు వచ్చాయి. అస్సలు ప్రాక్టీస్ అన్నది లేకుండా పరీక్ష రాయటంతో  శొంతూ ఫెయిలయ్యాడు.  టీచర్లంతా ఇలా ఆలస్యంగా చేరావు, ఇంకా డబ్బులు వృథా చేయొద్దని అతనికి సలహా ఇచ్చారు. ఎంత కష్టపడినా పాసవలేవు అన్నారు. అయినా శొంతూ ఆశ కోల్పోలేదు. హిమాంశు భవ్‌సర్, గజీంద్ర సోలంకి అనే వడాలి స్నేహితులు చదువులో బాగా సాయపడ్డారు. ఇదార్‌కు చెందిన శశికాంత్ ఉండనే ఉన్నాడు. అంతా కలసి శొంతూ అప్పటిదాకా పోగొట్టుకున్న పాఠాలు చెప్పి తర్ఫీదు ఇచ్చారు. సెమిస్టర్ పరీక్షల్లో శొంతూకు 50 శాతం మార్కులు వచ్చాయి. టీచర్లంతా నమ్మలేకపోయారు.

PHOTO • Labani Jangi

శొంతూ పరీక్షలో విఫలమయ్యాడు. అతనికి ఎటువంటి అభ్యాసం లేదు. డబ్బు వృథా చేయవద్దని అతని ఉపాధ్యాయులు అతనికి సలహా ఇచ్చారు. పరీక్షను గట్టెక్కలేడని వారు అతనికి చెప్పారు. కానీ శొంతూ ఆశ వదులుకోలేదు

రెండో సెమిస్టరు ఫీజు 9,300 రూపాయలు. మొదటి సెమిస్టర్ బకాయి 5, 200 అలాగే ఉంది. రెండూ కలసి 14, 500. అంత మొత్తం కట్టడం అతనికి అసాధ్యం. వేడుకోళ్ళూ మొత్తుకోళ్ళతో పరిస్థితి కొనసాగింది. రెండో సెమిస్టర్ ఫైనల్ పరీక్షలు రానేవచ్చాయి. ఫీజు కట్టితీరాలి. కానీ ఎలా? దారీతెన్నూ కనిపించలేదు. చివరికి ఒకే ఒక్క ఆశారేఖ- స్కాలర్‌షిప్.

వెళ్ళి క్లర్కును కలిశాడు. రాబోయే స్కాలర్‌షిప్పులోంచి ఫీజు మినహాయించుకోమని బతిమాలాడు. ఒక్క షరతు మీద అందుకు ఒప్పుకొన్నాడు ఆ క్లర్కు. దేనా బ్యాంక్ వాళ్ల విజయనగర్ బ్రాంచిలో  ఎకౌంట్ తెరిచి సంతకం పెట్టిన బ్లాంక్ చెక్‌ను సెక్యూరిటీ ధరావతుగా ఇమ్మన్నాడు. ఎకౌంట్ తెరవడానికి కావలసిన రూ. 500 శొంతూ దగ్గర లేవు.

కానీ శొంతూకు బాంక్ ఆఫ్ బరోడాలో ఎకౌంటు ఉంది. అందులో రూ. 700 మాత్రమే ఉన్నాయి. ఆ బ్యాంకు చెక్‌బుక్ ఇవ్వడానికి నిరాకరించింది. తనకు బాగా తెలిసిన రమేశ్ సోలంకి అనే ఆయనకు పరిస్థితి వివరించాడు. ఆయన శొంతూ మాటల్ని నమ్మి, తనకు దేనా బ్యాంకులో ఉన్న ఎకౌంటుకు చెందిన ఒక బ్లాంక్ చెక్కును సంతకం పెట్టి ఇచ్చారు. ఆ చెక్కును కాలేజీలో జమచేసి పరీక్షలు రాయడానికి అనుమతి పొందాడు శొంతూ.

ఫైనల్ పరీక్షల్లో 58 శాతం మార్కులు వచ్చాయి. అయినా పరీక్షలు నిర్వహించిన ఉత్తర గుజరాత్‌కు చెందిన హేమచంద్రాచార్య విశ్వవిద్యాలయం నుంచి శొంతూకు మార్కుల లిస్టు అందనే లేదు.

కాల్‌లెటర్ వచ్చేలోగా మార్క్స్ షీట్ అందుతుందన్న ఆశతో శొంతూ, ఓ  ఉద్యోగానికి అప్లై చేశాడు. మార్క్స్ షీట్ రాలేదు. స్కాలర్‌షిప్ వచ్చి ఫీజులు చెల్లించేదాకా మార్క్స్ షీట్ రాదని స్పష్టమయింది. ఒరిజినల్ మార్క్స్ షీట్ చేతిలో లేదు కాబట్టి శొంతూ ఇంటర్వ్యూకు వెళ్ళలేకపోయాడు.

సాబర్‌కాంఠా ప్రాంతపు ఇదార్‌లోని ఒక కొత్తగా ప్రారంభించిన ఐటిఐలో నెలకు రూ. 2500 జీతం మీద పనిచేయడం మొదలెట్టాడు శొంతూ. నెలలోగా మార్క్స్ షీట్ జమచెయ్యాలన్నది అక్కడి షరతు. నెల గడిచింది. మార్క్స్ షీట్ రాలేదు. సోషల్ వెల్‌ఫేర్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్ళి వాకబుచేశాడు శొంతూ. స్కాలర్‌షిప్పులు అప్పటికే కాలేజీకి పంపారని తెలిసింది. కాలేజీకి వెళ్ళి క్లర్కును కలిశాడు. స్కాలర్‌షిప్పులు వచ్చిన మాట నిజమే గానీ వాటిల్ని కాలేజీ యాజమాన్యం ఆమోదించిన తర్వాతే అతని ఫీజు మినహాయించుకోవటం జరుగుతుందని క్లర్కు చెప్పాడు. అది జరిగాకే మార్క్స్ షీటు.

తానిచ్చిన బ్లాంక్ చెక్కును తిరిగిమ్మని అడిగాడు శొంతూ. రమేశ్‌భాయ్ సంతకం పెట్టి ఇచ్చిన చెక్కది. తిరిగిస్తాలే అని యథాలాపంగా జవాబిచ్చాడా క్లర్కు. మళ్ళీ ఈ పనిమీద పదే పదే రావద్దన్నాడు. ‘ఫోను చేసి నీ ఎకౌంట్ నెంబరు చెప్పు’ అన్నాడు. దీపావళి, కొత్త సంవత్సరానికి మధ్యన ఓ మంచి రోజు ఎంచుకొని శొంతూ క్లర్కుకు ఫోను చేశాడు. "నీకే బ్యాంకులో ఎకౌంట్ ఉంది?" అడిగాడు క్లర్కు. "బ్యాంక్ ఆఫ్ బరోడా" అని చెప్పాడు శొంతూ. "ముందు నువ్వు దేనా బ్యాంక్‌లో ఎకౌంట్ తెరువు" అని ఆ క్లర్కు జవాబు.

శొంతూకు చివరకు సర్వశిక్షా అభియాన్‌లో పని దొరికింది. జూన్ 2021 నుండి సాబర్‌కాంఠా జిల్లాలోని బిఆర్‌సి భవన్ ఖేద్‌బ్రహ్మలో 11 నెలల కాంట్రాక్ట్‌పై ఉన్నారు. అతను ప్రస్తుతం డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ ఆఫీస్ అసిస్టెంట్‌గా నెలకు 10,500 రూపాయల జీతం తీసుకుంటున్నాడు.

రచయిత గుజరాతీలో రాసిన సృజనాత్మక నాన్-ఫిక్షన్ సంకలనం మాటి నుండి ఈ కథనాన్ని స్వీకరించారు

అనువాదం:  అమరేంద్ర దాసరి

Umesh Solanki

Umesh Solanki is an Ahmedabad-based photographer, documentary filmmaker and writer, with a master’s in Journalism. He loves a nomadic existence. He has three published collections of poetry, one novel-in-verse, a novel and a collection of creative non-fiction to his credit.

Other stories by Umesh Solanki
Illustration : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi
Editor : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya
Translator : Amarendra Dasari

Amarendra Dasari worked in Bharath Electronics Limited. He loves reading and travelling. Quite a number of his travel experiences are documented and published as travelogues.

Other stories by Amarendra Dasari