"సెలవులు పొందే అవకాశం లేదు, పని మధ్య విరామం లేదు, నిర్దిష్ట పని గంటలూ లేవు."

షేక్ సలావుద్దీన్, హైదరాబాద్‌కు చెందిన ఒక సమగ్ర క్యాబ్ కంపెనీలో డ్రైవర్. 37 ఏళ్ల సలావుద్దీన్ పట్టభద్రుడైనప్పటికీ, కంపెనీతో తాను సంతకం చేసిన ఒప్పందాన్ని ఎన్నడూ చదవలేదని చెప్పారు. ఆ కంపెనీ పేరు చెప్పేందుకు అతను ఇష్టపడలేదు. "అది చాలా చట్టసంబంధమైన షరతులతో నిండి ఉంది." అతను డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌లో మాత్రమే ఆ ఒప్పందం ఉంది; పత్రం రూపంలో లేదు.

"ఒప్పందంలాంటిది దేనిపైనా సంతకం పెట్టలేదు," డెలివరీ ఏజెంట్‌గా పనిచేసే రమేశ్ దాస్ (పేరు మార్చారు) అన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, మేదినీపూర్ జిల్లాలోని బాహా రునా గ్రామం నుంచి కొల్‌కతాకు వలస వచ్చినపుడు, తనకు ఎంత త్వరగా పని దొరుకుతుందీ అనే ధ్యాస తప్ప ఈ చట్టపరమైన హామీ పత్రాల గురించిన ఆలోచనే అతనికి లేదు. "ఏదీ రాతపూర్వకంగా లేదు. మా ఐడి (గుర్తింపు)ని ఆ యాప్‌కు జతచేశారు - అదొక్కటే రుజువు. మమ్మల్ని పరోక్ష పద్ధతిలో (మూడవ పార్టీ ఔట్‌సోర్చింగ్ ద్వారా) ఈ ఉద్యొగాల్లోకి తీసుకున్నారు," అని అతను పేర్కొన్నారు.

ఒక్క రోజులో దాదాపు 40 నుండి 45 పార్శిల్ డెలివరీలను పూర్తి చేస్తే, రమేశ్‌కు ఒక్కో పార్శిల్‌కు దాదాపు 12 నుండి 14 రూపాయలు వస్తాయి. అంటే అతను రోజుకు రూ. 600 వరకూ సంపాదిస్తారు. "ఇందులో ఇంధనానికి అయ్యే ఖర్చు రాదు, బీమా సౌకర్యం ఉండదు. వైద్య ప్రయోజనాలు కానీ, ఇతర భత్యాలు కానీ ఉండవు.

Left: Shaik Salauddin, is a driver in an aggregated cab company based out of Hyderabad. He says he took up driving as it was the easiest skill for him to learn.
PHOTO • Amrutha Kosuru
Right: Monsoon deliveries are the hardest
PHOTO • Smita Khator

ఎడమ: హైదరాబాద్‌కు వెలుపల ఉన్న ఒక సమగ్ర క్యాబ్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తోన్న షేక్ సలావుద్దీన్. తనకు డ్రైవింగ్ నేర్చుకోవడం చాలా సులువైన పని కాబట్టే తాను డ్రైవింగ్‌ను వృత్తిగా చేపట్టానని ఆయన అంటారు. కుడి: వానాకాలపు డెలివరీలు అత్యంత కష్టతరమైనవి

మూడు సంవత్సరాల క్రితం బిలాస్‌పూర్‌లోని తన ఇంటి నుండి రాయ్‌పూర్‌కు వచ్చిన తర్వాత, సాగర్ కుమార్ స్థిరమైన జీవనోపాధి కోసం అనేక గంటలు పని చేస్తున్నాడు. 24 ఏళ్ళ ఈ యువకుడు చత్తీస్‌గఢ్ రాజధానీ నగరంలోని ఒక కార్యాలయ భవనంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆ తర్వాత అర్ధరాత్రి వరకు తన బైక్‌పై స్విగ్గీ ఆర్డర్‌లను చేరవేస్తుంటాడు.

బెంగళూరులోని ఒక ప్రసిద్ధ తినుబండారాలశాల వెలుపల, అనేక మంది డెలివరీ ఏజెంట్లు తమ స్మార్ట్‌ఫోన్‌లను అరచేతిలో పెట్టుకుని తిరుగుతున్నారు. సుందర్ బహదూర్ బిష్త్ తరువాతి ఆర్డర్‌ కోసం తన ఫోన్ ఎప్పుడు మోగుతుందా అని ఎదురుచూస్తున్నాడు. 8వ తరగతితో బడి మానేసిన ఇతను ఇప్పుడిప్పుడే తాను నేర్చుకుంటోన్న భాషలో వచ్చే సూచనలను అర్థం చేసుకోవడానికి కష్టపడుతున్నాడు

“నేను ఇంగ్లీషులో ఉన్న ఆ సూచనలను చదువుతాను. ఎలాగో అర్థంచేసుకోవటం వరకూ వచ్చాను. ఇందులో చదవడానికి పెద్దగా ఏమీ లేదు… మొదటి అంతస్తు, ఫ్లాట్ 1ఎ...” అంటూ చదివాడతను. అతని చేతిలో ఎటువంటి ఒప్పంద పత్రం గానీ, మొహం చూపెట్టడానికి 'కార్యాలయం' అనే ప్రదేశం గానీ లేదు. "సెలవు తీసుకోవడం, అనారోగ్యంతో సెలవు పెట్టడంలాంటివేవీ అందుబాటులో ఉండవు."

దేశవ్యాప్తంగా విస్తరించి, మెట్రోలలో, చిన్న పట్టణాలలో పనిచేస్తోన్న షేక్, రమేశ్, సాగర్, సుందర్ వంటివారే భారతదేశ గిగ్ శ్రామికులు. 2022లో ప్రచురించిన నీతి ఆయోగ్ నివేదికలో వీరి సంఖ్య 7.7 మిలియన్లుగా అంచనా వేసినట్లుగా పేర్కొంది.

Left: Sagar Kumar moved from his home in Bilaspur to Raipur to earn better.
PHOTO • Purusottam Thakur
Right: Sunder Bahadur Bisht showing how the app works assigning him his next delivery task in Bangalore
PHOTO • Priti David

ఎడమ: మరింత మెరుగైన సంపాదన కోసం బిలాస్‌పూర్‌లోని తన ఇంటినుండి రాయపూర్‌కు వలస వచ్చిన సాగర్ కుమార్. కుడి: బెంగళూరులో తన తదుపరి డెలివరీ ఎక్కడ ఇవ్వాలో కేటాయిస్తూ యాప్ ఎలా పనిచేస్తుందో చూపిస్తోన్న సుందర్ బహదూర్ బిష్త్

వీరిలో క్యాబ్‌లను నడిపేవారు, ఆహారాన్నీ పార్శిళ్ళనూ చేరవేసేవారు, ఇంటికే వచ్చి అందంగా తయారుచేసే సేవలను అందించేవారు కూడా ఉన్నారు. ఇలాంటి పనులు చేసేవారిలో ఎక్కువ మంది యువత ఉన్నారు. వారి ఫోన్‌లే వారి కార్యాలయాలుగా మారాయి. ఉద్యోగ వివరాలు కంప్యూటర్ ద్వారా జారీ అవుతాయి. అయితే, రోజువారీ వేతన కార్మికుడికి ఉన్నట్లే ఉద్యోగ భద్రత ప్రమాదకరంగా ఉంటుంది. గత కొన్ని నెలల్లోనే కనీసం రెండు యజమాన్యాలు ఖర్చు తగ్గించుకునే నెపంతో వేలాది మంది కార్మికులను పనుల నుండి తొలగించాయి.

పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (జూలై-సెప్టెంబర్ 2022) ప్రకారం, 15-29 సంవత్సరాల వయస్సు గల కార్మికులలో నిరుద్యోగం రేటు 18.5 శాతంగా ఉండటంతో, చట్టపరమైన, ఒప్పంద అంతరాలు ఉన్నప్పటికీ, ఏదో ఒక ఉద్యోగంలో చేరాలనే భయాందోళనలతో కూడిన కోరిక ఉంటుంది.

నగరంలోని ఇతర రోజువారీ కూలీ చేసే కార్మికుల కంటే గిగ్-శ్రామికులే ఎక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. “నేను కూలీగానూ; బట్టలు, సంచులు అమ్మే దుకాణాలలో కూడా పనిచేశాను. నాకు స్విగ్గీ (డెలివరీ) కోసం కావలసింది ఒక బైక్, ఒక ఫోన్. బరువైన వస్తువులను ఎత్తాల్సిన అవసరం లేదు, లేదా శారీరకంగా చాలా కష్టమైన పనులను చేయాల్సిన అవసరం కూడా లేదు,” అని సాగర్ పేర్కొన్నాడు. రాయ్‌పూర్‌లో సాయంత్రం 6 గంటల తర్వాత ఆహారాన్నీ, ఇతర వస్తువులనూ ఇళ్ళకు చేరవేస్తూ అతను రోజుకు రూ. 300 నుంచి రూ. 400 వరకు, పండుగల సమయంలో రోజుకు రూ. 500 వరకూ సంపాదిస్తాడు. అతని గుర్తింపు కార్డు 2039 వరకు చెల్లుతుంది, కానీ అందులో అతని బ్లడ్ గ్రూప్ గురించి కానీ, అత్యవసరంగా సంప్రదించాలంటే ఉండవలసిన ఫోన్ నంబర్ కానీ లేదు. ఈ వివరాలను అప్‌డేట్ చేయడానికి తనకు సమయం దొరకలేదని అతను చెప్పాడు.

అయితే అందరిలా కాకుండా, పగటిపూట సెక్యూరిటీ ఏజెన్సీలో సాగర్ చేసే ఉద్యోగంలో వైద్య బీమా, ప్రావిడెంట్ ఫండ్‌ సౌకర్యాలు ఉన్నాయి. నెలవారీ వేతనంగా కూడా రూ. 11,000 వస్తుంది. పగలు చేసే స్థిరమైన ఉద్యోగం, వస్తువుల చేరవేత ద్వారా వచ్చే అదనపు ఆదాయం అతను తన పొదుపును మరింత పెంచుకునేందుకు వీలుకల్పించింది. “నేను ఒక్క ఉద్యోగం చేసినపుడు పొదుపు చేయడం, నా కుటుంబానికి డబ్బు పంపించడం, కరోనా సమయంలో చేసిన అప్పులు తీర్చడం వంటివేవీ చేయలేకపోయాను. ఇప్పుడు నేను కనీసం కొంచెమైనా పొదుపు చేయగలను."

Sagar says, ‘I had to drop out after Class 10 [in Bilaspur]because of our financial situation. I decided to move to the city [Raipur] and start working’
PHOTO • Purusottam Thakur

'మా ఆర్థిక పరిస్థితి కారణంగా నేను 10వ తరగతి (బిలాస్‌పూర్‌లో) తర్వాత చదువు మానేయవలసి వచ్చింది. దాంతో నేను నగరానికి (రాయ్‌పూర్) వెళ్ళి పనిచేయటం మొదలెట్టాలని నిర్ణయించుకున్నాను' అంటాడు సాగర్

తిరిగి బిలాస్‌పూర్‌కు వెళ్తే, అక్కడ సాగర్ తండ్రి సాయిరామ్ పట్టణంలో ఒక కూరగాయల దుకాణాన్ని నడుపుతున్నారు. అతని తల్లి సునీత అతని తమ్ముళ్ళు - ఆరేళ్ళ భవేశ్, ఏడాది వయసున్న చరణ్‌ల ఆలనాపాలనా చూసుకుంటారు. ఈ కుటుంబం ఛత్తీస్‌గఢ్‌లోని దళిత సముదాయానికి చెందినది. “మా ఆర్థిక పరిస్థితి కారణంగా నేను 10వ తరగతి తర్వాత చదువు మానేయాల్సివచ్చింది. నగరానికి వెళ్ళి పనిచేయటం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను,” అని సాగర్ చెప్పాడు.

హైదరాబాద్‌లో యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తోన్న షేక్, డ్రైవింగ్ నేర్చుకోవడం తనకు సులువనిపించింది కాబట్టి, ఈ వృత్తిని ఎంచుకున్నట్టు చెప్పారు. ముగ్గురు చిన్నిపాపల తండ్రి అయిన షేక్, తాను యూనియన్ పనికీ, డ్రైవింగ్‌కీ మధ్య తన సమయాన్ని విభజించుకుంటానని చెప్పారు. "ట్రాఫిక్ తక్కువగా ఉండటం, కొంచెం ఎక్కువ డబ్బు వస్తుంది కాబట్టి," తాను ఎక్కువగా రాత్రి సమయాలలో డ్రైవింగ్ పనికి వెళ్తానని షేక్ చెప్పారు. ఈ పని ద్వారా ఆయన నెలకు, ఖర్చులకు పోను, సుమారు రూ. 15,000 - 18,000 వరకూ సంపాదిస్తారు.

కొల్‌కతాకు వలస వచ్చిన రమేశ్ కూడా యాప్ ఆధారిత డెలివరీ వ్యాపారంలో చేరవలసి వచ్చింది, ఎందుకంటే ఇది తొందరగా డబ్బు సంపాదన ప్రారంభించేందుకు మార్గం. అతను 10వ తరగతి చదువుతుండగా తండ్రి చనిపోవడంతో కుటుంబాన్ని పోషించడం కోసం చదువు మానేయాల్సి వచ్చింది. “మా అమ్మకు సహాయం చేయడం కోసం నేను సంపాదించడం మొదలుపెట్టాలి. నేను రకరకాల ఉద్యోగాలు చేశాను - దుకాణాల్లో పనిచేశాను,” అని అతను గత 10 సంవత్సరాలలో తాను చేసిన పనుల గురించి చెప్పారు.

కొల్‌కతాలోని జాదవ్‌పూర్‌లో పార్శిళ్ళను చేరవేస్తున్నప్పుడు, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగవలసిరావటం తన తలలో ఉద్రిక్తతను పెంచుతుందని అతను చెప్పారు, “నేనెప్పుడూ తొందరలోనే ఉంటాను. నేనెంత వేగంతో సైకిల్‌ నడుపుతానంటే... అన్ని పనులను సమయానికే పూర్తిచేయాలనే ఆత్రుత ఎక్కువ. రుతుపవనాల కాలం మాకు అత్యంత దుర్భరమైన కాలం. మేం మా లక్ష్యాన్ని చేరుకోవడం కోసం విశ్రాంతినీ ఆహారాన్నీ ఆరోగ్యాన్నీ త్యాగం చేస్తాం,” అని ఆయన చెప్పారు. భారీ బ్యాక్‌ప్యాక్‌లలో పార్శిళ్ళను తీసుకెళ్ళడం వల్ల వెన్నునొప్పి వస్తుంది. “మేమందరం భారీగా సరుకులను మోసుకువెళతాం. వస్తువులను చేరవేసే పనిచేసే ప్రతి వ్యక్తి వెన్నునొప్పితో బాధపడతాడు. కానీ మాకు ఎటువంటి ఆరోగ్య పరిరక్షణ సౌకర్యం (కవరేజ్) లేదు,” అని ఆయన చెప్పారు.

Some delivery agents like Sunder (right) have small parcels to carry, but some others like Ramesh (left) have large backpacks that cause their backs to ache
PHOTO • Anirban Dey
Some delivery agents like Sunder (right) have small parcels to carry, but some others like Ramesh (left) have large backpacks that cause their backs to ache
PHOTO • Priti David

సుందర్ (కుడి) వంటి కొంతమంది డెలివరీ ఏజెంట్లు చిన్న పార్శిళ్ళను తీసువెళ్తుంటారు. కానీ రమేశ్ (ఎడమ) వంటి మరికొందరు పెద్ద పెద్ద బ్యాక్‌ప్యాక్‌లలో మోసుకుపోవడం వలన వారికి వెన్ను నొప్పి వస్తుంది

ఈ పనిలో చేరేందుకు, బెంగళూరు చుట్టుపక్కల తిరిగేందుకు నాలుగు నెలల క్రితం సుందర్ ఒక స్కూటర్‌ని కొనుగోలు చేశాడు. నెలకు 20,000 నుండి 25,000 వరకు సంపాదిస్తానని; అందులో తన ఖర్చులు, స్కూటర్ ఇఎమ్ఐ, పెట్రోల్, ఇంటి అద్దె, ఇంటి ఖర్చులకు దాదాపు రూ. 16,000 అవుతాయని చెప్పాడు.

రైతులు, రోజువారీ కూలీల కుటుంబానికి చెందిన సుందర్, ఎనిమిది మంది తోబుట్టువులలో చిన్నవాడు. నేపాల్‌లోని ఆ కుటుంబం నుండి పని కోసం వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి బయటకు వచ్చింది ఇతనొక్కడే. "నేను అప్పుచేసి భూమి కొనుక్కున్నాను. ఆ అప్పు తీరేంతవరకూ ఈ పని చేయాలనుకుంటున్నాను" అని అతను చెప్పాడు.

*****

"మేడమ్, మీకు కారు నడపడం తెలుసా?"

షబ్నమ్‌బాను షెహదలీ షేక్‌ను తరచుగా అడిగే ప్రశ్న ఇది. ఈ 26 ఏళ్ళ మహిళా క్యాబ్ డ్రైవర్, గత నాలుగు సంవత్సరాలకు పైగా అహ్మదాబాద్‌లో డ్రైవింగ్ చేస్తోంది. ఇప్పుడామె ఆ సెక్సిస్ట్ కామెంట్‌ను తోసిపడేస్తుంది.

Shabnambanu Shehadali Sheikh works for a app-based cab company in Ahmedabad. A single parent, she is happy her earnings are putting her daughter through school
PHOTO • Umesh Solanki
Shabnambanu Shehadali Sheikh works for a app-based cab company in Ahmedabad. A single parent, she is happy her earnings are putting her daughter through school
PHOTO • Umesh Solanki

షబ్నమ్‌బాను షెహదలీ షేక్ అహ్మదాబాద్‌లోని ఒక యాప్ ఆధారిత క్యాబ్ కంపెనీలో పనిచేస్తోంది. ఒంటరి తల్లి అయిన ఈమె తన సంపాదనతో కుమార్తెను పాఠశాలలో చదివిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది

భర్త దుర్మరణం చెందడంతో ఆమె ఈ పనిని చేపట్టింది. "నేనెప్పుడూ స్వంతంగా రోడ్డు దాటి ఎరుగను," ఆ రోజులను గుర్తుచేసుకుంటూ చెప్పిందామె. షబ్నమ్‌బాను ముందుగా సిమ్యులేటర్‌పై శిక్షణ పొంది, ఆ తర్వాత రోడ్డుపై శిక్షణ పొందింది. ఒక బిడ్డ తల్లి అయిన షబ్నమ్, 2018లో ఒక కారును అద్దెకు తీసుకుని ఈ యాప్ ఆధారిత క్యాబ్ సర్వీస్‌లో పనిచేస్తోంది.

"నేనిప్పుడు హైవే మీద కూడా డ్రైవ్ చేస్తాను," నవ్వుతూ చెప్పిందామె.

మొత్తం 24.7 శాతంగా ఉన్న నిరుద్యోగులలో పురుషుల కంటే ఎక్కువగా స్త్రీ నిరుద్యోగులున్నారని నిరుద్యోగ డేటా చెప్తోంది. షబ్నమ్‌బాను ఇందుకు మినహాయింపు. ఆమె తన సంపాదనతో తన కుమార్తెను చదివిస్తున్నందుకు చాలా గర్వపడుతోంది.

ఆమె పట్ల లింగ వివక్షతతో చేసే వ్యాఖ్యలు (ఆమె కారులో ప్రయాణించేవారు) ఆగిపోయినప్పటికీ, 26 ఏళ్ళ ఆ యువతికి మరింత తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయి: “రోడ్డుపై ప్రయాణించేటప్పుడు మరుగుదొడ్లు చాలా దూరంగా ఉంటాయి. పెట్రోలు పంపులవాళ్ళు వాటికి తాళం వేసి ఉంచుతారు. అక్కడ కేవలం మగవాళ్ళు మాత్రమే ఉన్నందున తాళం చెవి అడగడానికి నాకు సిగ్గుగా ఉంటుంది." ఉమెన్ వర్కర్స్ ఇన్ ది గిగ్ ఎకానమీ ఇన్ ఇండియా పేరుతో జరిపిన ఒక అధ్యయనం, మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడంతో పాటు, మహిళా కార్మికులు వేతనాలలో వ్యత్యాసాన్ని, పనిలో తక్కువ భద్రతను ఎదుర్కొంటున్నారని పేర్కొంది.

On the road, the toilets are far away, so if she needs to find a toilet, Shabnambanu simply Googles the nearest restrooms and drives the extra two or three kilometres to reach them
PHOTO • Umesh Solanki

ప్రయాణంలో ఉన్నపుడు మరుగుదొడ్లు చాలా దూరంగా ఉంటాయి. మరుగుదొడికి వెళ్ళాల్సివస్తే షబ్నమ్‌బాను, గూగుల్‌లో రెస్ట్‌రూమ్‌ల కోసం వెతికి, రెండు లేదా మూడు కిలోమీటర్లు అదనంగా డ్రైవ్ చేసి వాటిని చేరుకుంటుంది

ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు, షబ్నమ్‌బాను సమీపంలో ఉన్న రెస్ట్‌రూమ్‌ల కోసం గూగుల్‌ చేసి, వాటిని చేరుకోవడానికి అదనంగా రెండు లేదా మూడు కిలోమీటర్లు డ్రైవ్ చేస్తుంది. “నీళ్ళు తక్కువగా తాగడం తప్ప మరో దారి లేదు. కానీ నేనలా చేసినప్పుడు, ఈ వేడి వాతావరణానికి నాకు తల తిరుగుతుంది, స్పృహ తప్పినట్టవుతుంది. నా కారును కాసేపు పక్కన ఆపి వేచి ఉంటాను,” అని ఆమె చెప్పింది.

కొల్‌కతాలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళుతున్నప్పుడు రమేశ్ ఎదుర్కొనే ఆందోళన కూడా ఇదే. "రోజువారీ లక్ష్యాన్ని పూర్తి చేయాలనే తొందరలో, ఇవి (టాయిలెట్ బ్రేక్‌లు) ప్రాధాన్యం లేనివిగా మారాయి," ఆందోళనగా చెప్పారతను.

తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు కూడా అయిన షేక్ మాట్లాడుతూ, "డ్రైవర్ మరుగుదొడ్డికి వెళ్ళాల్సిన అవసరం వచ్చిన సమయంలోనే అతనికి రైడ్ అభ్యర్థన వచ్చినపుడు, దానిని తిరస్కరించే ముందు అతను చాలాసార్లు ఆలోచించాలి," అన్నారు. ఆర్డర్ / రైడ్‌ను తిరస్కరించడం మిమ్మల్ని యాప్‌లో దిగజారేలా చేస్తుంది, మీకు జరిమానా విధిస్తారు. లేదంటే మిమ్మల్ని తొలగించడమో, పక్కన పెట్టడమో జరుగుతుంది. పరిష్కారం కోరుతూ మీరొక అస్తిత్వం గోచరించని సంస్థకు ఫిర్యాదు చేసి, మంచి జరగాలని ఆశించడం తప్ప చేయగలిగింది లేదు.

ఇండియాస్ రోడ్‌మ్యాప్ ఫర్ ఎస్‌డిజి 8 అనే నివేదికలో, “భారతదేశంలోని శ్రామికశక్తిలో దాదాపు 92 శాతం మంది అనధికారిక రంగంలో ఉపాధి పొందుతున్నారు... కోరుకున్న సామాజిక భద్రతను పొందడం లేదు…” అని నీతి ఆయోగ్ పేర్కొంది. ఇతర సమస్యలతో పాటు, “కార్మిక హక్కులను పరిరక్షించడం, సురక్షితమైన, భద్రత గలిగిన పని వాతావరణాన్ని ప్రోత్సహించడం"పై ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు- 8 దృష్టి సారిస్తుంది.

Shaik Salauddin is founder and president of the Telangana Gig and Platform Workers Union (TGPWU)
PHOTO • Amrutha Kosuru

తెలంగాణా గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్

పార్లమెంటు కోడ్‌ ఆన్ సోషల్ సెక్యూరిటీ ఇన్ 2020ని ఆమోదించింది. గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ కార్మికుల కోసం - 2029-30 నాటికి మూడు రెట్లు పెరిగి 23.5 మిలియన్లకు చేరుతుందని అంచనా - సామాజిక భద్రతా పథకాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చింది.

*****

ఈ కథనం కోసం మాట్లాడిన చాలామంది కార్మికులు " మాలిక్ (యజమాని)" నుండి స్వేచ్ఛను కోరుకున్నారు. PARIతో మాట్లాడిన మొదటి నిమిషంలోనే సుందర్, బెంగళూరులో ఇంతకుముందు చేసిన ఒక మామూలు బట్టలమ్మే గుమాస్తా ఉద్యోగం కంటే తాను ఈ ఉద్యోగాన్నే ఎందుకు ఇష్టపడతాడో మాకు చెప్పాడు: “నాకు నేనే యజమానిని. నేను అనుకున్న సమయానికి పని చేయగలను, ఈ క్షణాన నేను బయటపడాలనుకుంటే, అదీ చేయగలను." కానీ అప్పు చెల్లించిన తర్వాత మాత్రమే తాను మరింత స్థిరమైన, మరింత తీరుబాటు ఉన్న పనికోసం చూస్తానని కూడా అతను స్పష్టంగా చెప్పాడు.

త్రిపురకు చెందిన శంభునాథ్‌కు మాట్లాడేందుకు ఎక్కువ సమయం లేదు. అతను పుణేలో చాలా రద్దీగా ఉండే ప్రసిద్ధి చెందిన ఫుడ్ జాయింట్ వెలుపల వేచి ఉన్నాడు. జొమాటో, స్విగ్గీల ఏజెంట్ల వరుస వారి వారి బైక్‌లపై ఆహార పొట్లాలను తీసుకోవడానికి వేచి ఉన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా పుణేలో ఉంటున్న అతను మరాఠీలో అనర్గళంగా మాట్లాడతాడు.

సుందర్‌లాగే అతను కూడా అంతకు ముందు ఒక మాల్‌లో రూ. 17,000 తెచ్చిపెట్టిన ఉద్యోగం కంటే ఈ ఉద్యోగాన్నే ఇష్టపడతారు. “ఈ పని బాగుంది. మేమంతా కలిసి (అతని స్నేహితులు) ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని, అందులో ఉంటున్నాం. నేను రోజుకు దాదాపు వెయ్యి రూపాయలు సంపాదిస్తాను” అని శంభునాథ్ చెప్పారు.

Rupali Koli has turned down an app-based company as she feels an unfair percentage of her earnings are taken away. She supports her parents, husband and in-laws through her work as a beautician
PHOTO • Riya Behl
Rupali Koli has turned down an app-based company as she feels an unfair percentage of her earnings are taken away. She supports her parents, husband and in-laws through her work as a beautician
PHOTO • Riya Behl

రూపాలీ కొలీ తన సంపాదనలో ఎక్కువ శాతాన్ని అన్యాయంగా తీసుకుంటుందని భావించడంతో ఒక యాప్ ఆధారిత కంపెనీని తిరస్కరించారు. ఆమె బ్యూటీషియన్‌గా పనిచేస్తూ, తన తల్లిదండ్రులకు, భర్తకు, అత్తమామలకు సహాయంగా ఉంటున్నారు

కోవిడ్-19 లాక్‌డౌన్ కాలం రూపాలీ కొలీని బ్యూటీషియన్‌గా తన నైపుణ్యాలను స్వతంత్రంగా ఉపయోగించేలా మార్చింది. "నేను పనిచేస్తున్న పార్లర్ మా జీతాలను సగానికి సగం తగ్గించింది. దాంతో నేను స్వతంత్రంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాను." ఆమె ఒక యాప్ ఆధారిత ఉద్యోగంలో చేరాలని మొదట అనుకున్నా, దానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. “నేను కష్టపడి, ఒక ఉత్పత్తిని (అందం) సాధించి, నా ప్రయాణానికి నేనే డబ్బు చెల్లిస్తున్నప్పుడు, నేను ఎవరికైనా 40 శాతం ఎందుకు ఇవ్వాలి? నా 100 శాతం ఇచ్చి, ప్రతిఫలంగా 60 శాతం మాత్రమే పొందాలని నేను కోరుకోవడం లేదు."

ముంబయిలోని అంధేరి తాలూకా , మధ్ ద్వీపంలోని ఒక మత్స్యకార కుటుంబానికి చెందిన 32 ఏళ్ల రూపాలీ కొలీ, స్వతంత్ర బ్యూటీషియన్‌గా పనిచేస్తూ తన తల్లిదండ్రులకు, భర్త, అత్తమామలకు కూడా సహాయంగా ఉంటున్నారు. "ఈ విధంగానే నేను నా స్వంత ఇంటి కోసం, పెళ్ళికోసం ఖర్చుపెట్టాను" అని ఆమె చెప్పారు. ఆమె కుటుంబం, మహారాష్ట్రలో ప్రత్యేక వెనుకబడిన తరగతి (SBC)గా జాబితా చేసిన కొలీ సముదాయానికి చెందినది.

రూపాలీ దాదాపు ఎనిమిది కిలోల బరువున్న ట్రాలీ బ్యాగ్‌నూ, మూడు కిలోల బరువుండే బ్యాక్‌ప్యాక్‌తోనూ నగరమంతటా చుట్టేస్తారు. అపాయింట్‌మెంట్‌ల మధ్య దొరికే సమయాన్ని ఆమె తన ఇంటి పని చేయడానికి, తన కుటుంబానికి మూడు పూటలా భోజనం వండడానికీ కేటాయిస్తారు. “ అప్నా మన్ కా మాలిక్ హోనే కా (ప్రతి ఒక్కరూ తమకు తామే యజమానిగా ఉండాలి)” అని నిశ్చయంగా చెబుతారామె.

ఈ కథనాన్ని మేధా కాలే, ప్రతిష్ఠా పాండ్య, జాషువా బోధినేత్ర, సన్వితి అయ్యర్, రియా బెహల్, ప్రీతి డేవిడ్‌ ల సంపాదకీయ మద్దతుతో హైదరాబాద్‌ నుంచి అమృత కోసూరు; రాయ్‌పూర్ నుంచి పురుషోత్తం ఠాకూర్; అహ్మదాబాద్‌ నుంచి ఉమేశ్ సోలంకి ; కొల్‌కతా నుంచి స్మితా ఖటోర్ ; బెంగళూరు నుంచి ప్రీతి డేవిడ్ ; పుణె నుంచి మేధా కాలే ; ముంబై నుంచి రియా బెహల్ నివేదించారు.

ముఖ చిత్రం: ప్రీతి డేవిడ్

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli