వాలపర్ల తిరుపతమ్మ మనసు కుదుటపడ్డది. గుంటూరు జిల్లాలో కొత్తగా నిర్మించిన SRM యూనివర్సిటీలో నేల మీద పడిన పెయింట్‌ను శుభ్రం చేసే పనిని ఆమెకు అప్పజెప్పారు. "3-4 ఏళ్లగా మాకు పెద్దగా పని ఏదీ దొరకలేదు, కాబట్టి ఏదో ఒక పని దొరికినందుకు మాకు అప్పట్లో సంతోషం వేసింది. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు," అని ఆమె చెప్పింది. రెండు వారాల తర్వాత 29 ఏళ్ల తిరుపతమ్మను కారణాలు ఏవీ చెప్పకుండానే ఉద్యోగం నుండి తీసి వేశారు.

ఉస్తాల మేరీ మాత (40)ను కూడా ఉద్యోగం నుండి తీసివేశారు. "పెయింట్‌ను శుభ్రం చేయడానికి రోజుకు రూ. 250 ఇచ్చారు. పని పూర్తి అయ్యాక, వెళ్లిపొమ్మని చెప్పారు. మాకు ‘వయసైంద’ని, పని చేయలేమని చెప్పారు," అని ఆమె చెప్పింది.

2018 మే నెలలో 1500 జనాభా గల నీరుకొండ గ్రామంలోని దళిత కాలనీకి కాంట్రాక్టర్లు వచ్చి కూలీల కోసం ఆరా తీశారు. ఆడ, మగ కలిసి దాదాపు 20 మంది గల సమూహాన్ని పనిలోకి కుదుర్చుకున్నారు. "పని ఉన్నప్పుడల్లా వాళ్లు మమ్మల్ని తీసుకెళ్తారు. పని అయిపోయిన తర్వాత ఏదో ఒక సాకు చెప్పి తిరిగి పంపేస్తారు" అని 60 ఏళ్ల కురగంటి వాజీరాం చెప్పాడు. "అయినా ఇక్కడ మాకు పనేమీ లేదు కాబట్టి కూలీల కొరత కూడా లేదు.

కొందరు ఊరివాళ్లు యూనివర్సిటీలోని గార్డెనింగ్, హౌస్-కీపింగ్ డిపార్ట్‌మెంట్‌లలో పని కొనసాగిస్తున్నారు, అయితే ఆ పని ఎంత కాలం కొనసాగుతుందో వాళ్లకు తెలియదు. ప్రైవేట్ యూనివర్సిటీ అయిన SRM - పలు ఇతర యూనివర్శిటీలు - ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అయిన అమరావతిలో ఏర్పడబోతున్న 'నాలెడ్జ్ హబ్'లో భాగం కాబోతున్నాయి. ఇందులో ఉన్నత విద్యా సంస్థలు, కార్పొరేట్ మరియు ప్రభుత్వ రంగాలకు చెందిన రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లు, 'స్కిల్ డెవలెప్‌మెంట్' సంస్థలతో పాటు 'స్టార్ట్ అప్ హబ్' కూడా రాబోతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (APCRDA)కి చెందిన ఒక డాక్యుమెంట్‌‌లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం , ఈ క్లస్టర్‌లో 75 ఎకరాల వైశాల్యం గల మొదటి దశను 2022 లోగా, రెండవ దశను 2037 లోగా సిద్ధం చేయాల్సి ఉంది.

PHOTO • Rahul Maganti
PHOTO • Rahul Maganti

ఉస్తాల అజరయ్య మరియు ఉస్తాల మేరీ మాత: 'రైతులు తమ పంట భూములను పూలింగ్ కోసం ఇచ్చే ముందు మేము వాటిలో కూలీలుగా పని చేసే వాళ్లం'

ఈ 'హబ్' చుట్టూ ఎటువైపు చూసినా వ్యవసాయ రంగంలో కోల్పోయిన ఉపాధి అవకాశాలే ఎదురు పడతాయి. ఈ కార్మికులలో దాదాపు అందరూ - యూనివర్సిటీలో ఇంకా పని కొనసాగిస్తున్న వారు, ఉద్యోగం కోల్పోయిన వారితో సహా - భూమి లేని దళితులు, వారిలో అధిక శాతం మంది మాల సామాజిక వర్గానికి చెందిన వారే. 2014 నుండి, అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS) ద్వారా సొంత భూమి కల వారందరూ తమ భూములను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి 'స్వచ్చందంగా' ఇవ్వడం మొదలు పెట్టడం వల్ల ఈ ప్రాంతంలో పొలం పని తగ్గిపోసాగింది. మేరీ భర్త అయిన ఉస్తాల అజరయ్య (52) 'రైతులు తమ భూములను పూలింగ్‌లో భాగంగా ఇచ్చే వరకు, నా భార్య, నేను కూలీలుగా పని చేసే వాళ్లం. ఆ తర్వాత నుండి, మాకు పెద్దగా పని దొరకలేదు.' అని చెప్పాడు.

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపి కృష్ణా-గోదావరి డెల్టాగా పిలవబడే సారవంతమైన ప్రాంతంలో నీరుకొండ ఉంది. ఈ గ్రామం ఒక కొండకు ఆనుకుని ఉన్న పల్లపు నేలపై, కొండవీటి వాగుకు పక్కన ఉంది. ఈ డెల్టా ప్రాంతంలోని ఊళ్లలో రైతు కూలీలకు అందే దినసరి వేతనం - మగవారికి రూ. 400 నుండి 500, ఆడవారికి రూ. 150 నుండి 200 - రాష్ట్రవ్యాప్తంగా అత్యధికమైనది. "ఇద్దరు రైతు కూలీలు ఉన్న ఒక కుటుంబానికి, నెలకు రూ. 12 వేల నుండి 15 వేల వరకు సంపాదన వచ్చేది" అని మేరీ చెప్పింది. తాను, తన భర్త చివరిసారిగా 2015 ప్రారంభంలో ఆ స్థాయిలో సంపాదించగలిగారు. దాదాపుగా అదే సమయంలో అమరావతి మీద పని మొదలైంది.

LPS ప్రకారం, సరికొత్త 'గ్రీన్-ఫీల్డ్' రాజధాని కోసం ప్రభుత్వానికి భూమిని దానం చేసిన వారిలో కౌలు రైతులు, రైతు కూలీలకు కాకుండా, కేవలం భూ-యజమానులకు మాత్రమే నష్ట పరిహారాన్ని పొందే అర్హత ఉంది. ఉపాధిని కోల్పోయిన రైతు కూలీలలో ఒక్కో కుటుంబానికి, LPS ప్రకారం పదేళ్ల పాటు నెలకు రూ. 2500 చొప్పున పెన్షన్ అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, ఈ ప్రాంతంలో భూమి లేని కార్మికుల సగటు నెలవారీ ఆదాయంగా ప్రపంచ బ్యాంక్ ఇన్‌స్పెక్షన్ ప్యానెల్ 2017 సెప్టెంబర్‌లో నిర్దేశించిన రూ. 8476 కంటే ఈ మొత్తం చాలా తక్కువ. ఈ మాత్రం కూడా, నీరుకొండకు 12 కిలోమీటర్ల దూరాన విజయవాడలోని తుళ్లూరు మండలంలోని APCRDA బ్రాంచ్ ఆఫీస్ వద్ద కార్మికులు పలుమార్లు నిరసనలు చేసిన తర్వాతే 2015 మధ్యలో మంజూరు చేయబడింది.

PHOTO • Rahul Maganti

నేలపాడు గ్రామంలో భూమి లేని దళిత మహిళలకు, ముసలి వాళ్లకు పనేదీ దొరకడం లేదు, మరో వైపు వారి కుటుంబాలలోని మగవారు సుదూర ప్రయాణం చేసి తక్కువ కూలీకే పని చేస్తున్నారు

"నలుగురు మనుషులున్న కుటుంబానికి రూ. 2,500 ఎలా సరిపోతుంది?" అని మేరీ అడుగుతోంది. "ఆ కొంత కూడా బాగా ఆలస్యంగా అందుతుంది, 2-3 నెలలకు ఒకసారి ఇస్తారు."ఆ ఊరిలోని అగ్ర కుల రైతుల దగ్గర రుణాలు తీసుకుని ఆమె కుటుంబాన్ని నెగ్గుకొస్తోంది.

29 ఊళ్లకు చెందిన భూ-యజమానులు తమ భూమిని 'పూలింగ్' చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు, ఆ ఊళ్లలో నీరుకొండ కూడా ఒకటి. ఈ ఊరు అమరావతి దక్షిణ కొన వద్ద ఉండగా, మిగతా ఊళ్లు ఉత్తర కొనలో కృష్ణా నది గుండా ఉన్నాయి. రాజధాని నగర ప్రాజెక్ట్‌లో మొదటి దశలో 33 వేల ఎకరాలను (2050లో మూడవ దశ పూర్తయ్యే సరికి మొత్తం కలిసి లక్ష ఎకరాలను) రాష్ట్రం సేకరిస్తోంది."

ఆ 29 పల్లెటూళ్లలో మరొకటైన నేలపాడు, ఆ నది అవతలి ఒడ్డున ఉంది. "[ఒక వారంలో] 5-6 రోజుల పాటు పొలం పని దొరికేది," అని నేలపాడుకు చెందిన 40 ఏళ్ల బి. మరియమ్మ చెప్పింది. "పని ఉండింటే ఇలా ఇక్కడ [ఇంట్లో] మీతో మాట్లాడే సమయం ఉండేది కాదు."

నేలపాడులో దాదాపు 100 భూమి లేని దళిత కుటుంబాలు పొలం పని మీద ఆధారపడి ఉన్నాయి. అయితే, 2014లో భూమిని పూలింగ్ చేయడం మొదలుపెట్టినప్పటి నుండి, పని వెతుక్కుంటూ వాళ్లు సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తోంది. మాల దళిత సామాజిక వర్గానికి చెందిన రైతు కూలీ అయిన కొమ్మూరి చిట్టమ్మ (35) "30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైకుంఠపురం, గారపాడు, లింగపురం గ్రామాలకు మేము వెళ్తాము. అక్కడ [మిర్చి పంటను కోత కోసే] పని నవంబర్ నుండి మార్చి వరకు మాత్రమే దొరుకుతుంది. ఈ అయిదు నెలల్లో కూడా, మాకు 50-70 రోజుల పని [రోజుకు రూ. 150-200 సంపాదన] దొరకడమే ఎక్కువ."

PHOTO • Rahul Maganti
PHOTO • Rahul Maganti

మరియమ్మ మరియు బక్క దొనేష్: 'ఏదైనా పని దొరికినప్పుడే మాకు తిండి, లేకపోతే ఆకలితోనే నిద్రపోతాం'

“మేము తెల్లవారుజామున 5 కల్లా నిద్ర లేచి వంట చేసుకుని, డబ్బా కట్టుకుని ఉదయం 7 కల్లా పనికి బయలుదేరాల్సి ఉంటుంది. మేము తిరిగి మా ఊరికి వచ్చేసరికి 8 అవుతుంది,” అని కొమ్మూరి చిట్టమ్మ (35) చెప్పింది. ఈ ప్రయాణం, ఇటువంటి దినచర్య రెండింటి వల్ల ఒంట్లో సత్తువ మిగలనంతగా అలసట వస్తోందని ఆమె చెప్పింది.

"భూమి లేని కుటుంబాలన్నింటికీ నెలకు కనీసం రూ. పది వేలు [పెన్షన్ రూపంలో] ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం," అని తుళ్లూరులో కొన్ని నిరసనల్లో పాల్గొన్న కొయ్యగూర నిర్మల (50) చెప్పింది. "తుళ్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి ఒక్కసారి వెళ్తేనే రూ. 500 ఖర్చు అవుతుంది, అలాంటప్పుడు రూ. 2,500 ఇస్తే అది ఏ మూలకు సరిపోతుంది?"

MGNREGA పని 365 రోజులు లభిస్తుందని కూడా ప్రభుత్వం కార్మికులకు హామీ ఇచ్చినా 2014 నుండి మొదలుకొని ఈ పథకం ద్వారా ఒక్క రోజు కూడా పని లభించలేదని ఊరి వాళ్లు చెప్పుకొచ్చారు. అయితే, నేలపాడులో తెలుగులో పెట్టిన బోర్డులలో MGNREGA నిధులను ఉపయోగించి సిమెంట్ రోడ్డులను వేయడం జరిగిందని రాయబడి ఉంది. ఆ విషయాన్ని నేను చదివి చెబితే విన్న నిర్మల, "మాలో ఎవరికీ MGNREGA కింద పని ఏదీ దొరకలేదు" అని చెప్పింది. "ఈ బోర్డులు ఎప్పుడు ఎలా పుట్టుకొచ్చాయో నాకు తెలీదు."

కానీ, తుళ్లూరు మండల రెవెన్యూ అధికారి ఎ. సుధీర్ బాబును నేను సంప్రదించినప్పుడు, "2017లో రోడ్లు వేసినప్పుడు, APCRDA నియమాల ప్రకారం, నేలపాడు ఊరి ప్రజలకు MGNREGA ప్రకారం పని కేటాయించడం జరిగింది," అని చెప్పారు.

రాజధాని నగరంలో కొత్త భవనాల నిర్మాణం మొదలైన 3 - 4 ఊర్లలో నేలపాడు ఒకటి. లార్సెన్ & టబ్రో, షపూర్జీ పల్లోంజీ వంటి పెద్ద కంపెనీలు 'జస్టిస్ సిటీ' (హై కోర్ట్ ప్రాంగణం), ఎమ్మెల్యే క్వార్టర్స్‌లతో పాటు IAS ఆఫీసర్స్ కాలనీ మొదలైన పలు కాంప్లెక్స్‌లను నిర్మిస్తున్నాయి."

PHOTO • Rahul Maganti
PHOTO • Rahul Maganti

ఎడమ: నేలపాడులోని ఒక బోర్డు, MGNREGA ప్రకారం ఆ ఊరిలో ఎంత పని పూర్తి చేయబడిందో చూపుతోంది, అయితే ఈ పథకం ప్రకారం 2014 నుండి పని ఏదీ దొరకలేదని ప్రజలు చెబుతున్నారు. కుడి: నీరుకొండకు దగ్గర్లోనే అమరావతిలో 'నాలెడ్జ్ హబ్'లో భాగంగా ఏర్పడుతోన్న SRM యూనివర్సిటీకి చెందిన క్రీడా మైదానం

"నిర్మాణ రంగ కూలీలంతా పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ నుండి వచ్చారు," అని మరియమ్మ భర్త, బక్క దొనేష్ (48) చెప్పాడు. "ఈ కూలీలలో ఎవ్వరూ ఈ ఊరి వాళ్లు కాదు, అసలు ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన వాళ్లే కాదు. వాళ్లు తక్కువ కూలీకే పని చేస్తారు కాబట్టి వాళ్లనే కంపెనీలు పనిలోకి చేర్చుకుంటాయి."

ఒకసారి దొనేష్ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం కోసం వెతుకుతూ భవన నిర్మాణం జరుగుతోన్న ఒక స్థలానికి వెళ్లాడు. "వాళ్లు నన్ను ఒక పామును పట్టుకోమని చెప్పారు. దానిని చంపినప్పుడు మాత్రం, దానిని ప్రాణంతోనే పట్టుకోవాలి అని చెప్పారు. అలాంటి వాచ్‌మ్యాన్ ఈ జిల్లాలో ఎక్కడా దొరకడు అని వాళ్లకు చెప్పేసి వచ్చేశాను." తుళ్లూరులో భవన నిర్మాణం జరిగే చోట్లలో పని దొరికినప్పుడల్లా దొనేష్ అక్కడికి వెళ్తూ ఉంటాడు.

ప్రభుత్వం నుండి ఇసుమంతైనా సాయం లేకుండా, దొరికే కొద్దిపాటి పనితో నేలపాడులోని దళిత కుటుంబాలు ఎలా నెగ్గుకొస్తున్నాయి? "ఏదైనా పని దొరికినప్పుడే తింటాం. లేకపోతే ఆకలితోనే నిద్రపోతాం" అని మరియమ్మ నవ్వుతూ చెప్పింది.

నీరుకొండకు తిరిగి వస్తే, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో కరువు బారిన పడిన 20 కుటుంబాలు, ఆ ఊరి శివార్లలో టార్పాలిన్ టెంట్లలో క్యాంప్‌లో బతుకుతున్నారు. వాళ్లు కూడా యూనివర్సిటీలో పనికి చేరారు. "[గార్డెనింగ్] కాంట్రాక్టర్ మమ్మల్ని తీసుకొచ్చాడు, [2017 అక్టోబర్ నుండి] ఒక సంవత్సరం పైగా ఇక్కడే ఉంటున్నాం. కాంట్రాక్ట్ ఎప్పుడు ముగుస్తుందో మాకు అసలు తెలీదు," అని రోజుకు రూ. 250 సంపాదిస్తోన్న రమాదేవి (40) చెప్పింది.

PHOTO • Rahul Maganti
PHOTO • Rahul Maganti

ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలలో కరువు బారిన పడిన పల్లెటూళ్లకు చెందిన కుటుంబాలు నీరుకొండ శివార్లలో తాత్కాలిక టెంట్లలో నివాసం ఉంటున్నాయి. "మమ్మల్ని కాంట్రాక్టర్ తీసుకు వచ్చాడు. ఈ కాంట్రాక్ట్ గడువు ఎప్పుడు తీరుతుందో మాకు తెలీదు," అని రమాదేవి చెప్పింది.

ప్రకాశం జిల్లా మార్కాపూర్ గ్రామానికి చెందిన గోర్లమ్మ (35) "మా ఊళ్లలో నీరు లేదు కాబట్టి పొలం పని ఏదీ దొరకడం లేదు. అందుకే మా ఇళ్లను వదిలేసి ఇక్కడి వచ్చాం" అని చెప్పింది. గోర్లమ్మ, తన పిల్లలను వాళ్ల తాతయ్య, బామ్మల దగ్గర వదిలి వచ్చింది. "నాకు తిరిగి వెళ్లిపోవాలని ఉంది, కానీ మా ఊర్లో పని ఏదీ దొరకడం లేదు," అని ఆమె చెప్పింది.

అమరావతి నగర ప్లాన్‌లో ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులైన ఎన్. టీ. రామారావు స్మృతిగా ఒక పెద్ద శిలా విగ్రహాన్ని నీరుకొండ ఊరి పైన కొండ మీద స్థాపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని వల్ల ఆ ఊరి వాళ్లు నిర్వాసితులు అవుతారు కానీ ఆ విషయాన్ని ప్రభుత్వం వారికి ఇంకా తెలియజేయలేదు. ఆ కొండ మీద ఇతర దళిత కుటుంబాలతో నివసిస్తోన్న మేరీ తన ఇంటిని కోల్పోతానేమోనని ఆందోళన చెందుతోంది ఎందుకంటే తన కుటుంబం వద్ద టైటిల్ డీడ్ ఏదీ లేదు. "మాకు టైటిల్ డీడ్‌లు అందజేయాలి, అప్పుడే ఒకవేళ ప్రభుత్వం మమ్మల్ని ఖాళీ చేయించినా, కనీసం కొద్దో గొప్పో నష్ట పరిహారమన్నా అందుతుంది" అని ఆమె చెప్పింది.

ఎంతకాలంగానో నివసిస్తున్న ఊరిని బలవంతంగా ఖాళీ చేసి, తమను స్వాగతించని మహానగర నిర్మాణానికి చోటునిచ్చారు నీరుకొండవాసులు. ఈ మహానగరంలో తమ లాంటి చిన్న బ్రతుకులకు తావు లేదని భావించి, కనీసం తగిన పరిహారం లభిస్తే మరో స్థలంలో తల దాచుకోవచ్చనే ఆశతో వారు ఎదురుచూస్తున్నారు.

ఇటువంటి కథనాలు:

ఈ రాజధాని ప్రజల రాజధాని కాదు .

కొత్త రాజధానికి పాత పంథాలో విభజన

ప్రభుత్వం వాగ్దానం చేసిన ఉద్యోగాలన్నీ ఇవ్వనివ్వండి.

ముదురుతున్న రియల్ ఎస్టేట్, తరుగుతున్న వ్యవసాయ భవిత

మహా రాజధాని నగరం, చాలీచాలని జీతాల వలసకూలీలు

అనువాదం: శ్రీ రఘునాథ్ జోషి

Rahul Maganti

Rahul Maganti is an independent journalist and 2017 PARI Fellow based in Vijayawada, Andhra Pradesh.

Other stories by Rahul Maganti
Translator : Sri Raghunath Joshi

Sri Raghunath Joshi obtained a Masters degree in Engineering but switched careers to pursue his love of Telugu language. Currently he works remotely as Telugu-Language Lead at a Localization firm based in Noida. He can be contacted at [email protected]

Other stories by Sri Raghunath Joshi