ఈ విషయంలో పొరపాటేం లేదు. ఇక్కడున్నది ఒక ఏనుగు. దాని మీద ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. సర్గుజా-పలామూ సరిహద్దు మీద నిర్జనంగా ఉన్న ప్రదేశం వెంబడి మేం నడిచి వెళ్తున్నప్పుడు, మొదటిసారి మనిషినీ, జంతువునీ చూశాం. కనీసం మేం చూశామని అనుకున్నాం. ఈ విషయాన్ని మేం ముగ్గురం పరస్పరం తనిఖీ చేసుకున్నాం. అయితే, మేం దాన్ని దగ్గరగా వెళ్ళి చూసేందుకు తొందరపడలేదు

చందవా నుంచి నన్ను కలవడానికి అక్కడికి వచ్చిన దలీప్ కుమార్‌కు అది చిరాకు తెప్పించింది. మా వైఖరి అసంబద్ధంగా ఉందన్నాడతను. “ఇదే దృశ్యాన్ని మనం పాట్నాలోనో రాంచీలోనో లేదా మరే అర్బన్ పట్టణంలోనో చూస్తే, అది తేడాగా ఉందనే ఆలోచన మనకి రాదు. ఇది అడవి. ఏనుగులు ఇక్కడివి. మనం మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాం” అన్నాడు.

బహుశా మేం అందుకే మూర్ఖంగా ఉన్నామేమో. ఇది అడవి. సరే, దలీప్ పరిపూర్ణమైన తర్కంతో ఉన్నాడనుకోండి. కానీ తర్కాన్ని చర్యతో అనుసరించే విషయానికి వచ్చినప్పుడు ఉండాల్సిన ఉత్సాహం లోపించి అతను గందరగోళంలో ఉన్నాడు. అంతేకాదు, కొద్దిసేపు, పైన ఉన్న ఓ మనిషిని మేం నిజంగానే చూసేమని ఖచ్చితంగా తెల్చుకోలేకపోయాం.

కానీ ఈసారి, ఆ మనిషి మమ్మల్ని చూశాడు. అతను సంతోషంగా చేతులు ఊపాడు, తన భారీ వాహనాన్ని మా దిశగా మళ్ళించాడు. దాని పేరు పార్బతి, దాన్ని ఎక్కడ కలుసుకున్నా అది మర్యాదైన జీవిగా ఉంటుంది. ఇక అతని పేరు కూడా అందుకు తగినట్టే ఉంది, పర్భూ*. దాన్ని ఎక్కడో ఉన్న గుడికి అతను తీసుకుపోతున్నాడు, ఆ గుడి పేరు మేం ఎప్పుడూ వినలేదు. వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న అన్ని గుడులకీ తిరుగుతారని అతను వివరించాడు. అక్కడ వాళ్ళు కాస్త డబ్బు సంపాదించుకుంటారు. అంతేకాక, అక్కడ ఒక ఉత్సవం కూడా జరుగుతోంది. అలాగే, మార్గమధ్యంలో కనిపించే మంచి జనాలు వాళ్ళకి కొంచెం ఆహారం, డబ్బు ఇస్తారు.

తను మధ్యప్రదేశ్‌లోని సర్గుజాలో నివసిస్తూ ఉంటానని పర్భూ చెప్పాడు. కానీ అతను, పార్బతి పలామూతో ఉన్న సరిహద్దుకి రెండు వైపులా వెళ్తూ ఉంటారు. సర్గుజా జిల్లా ఒక్కటీ ఢిల్లీ, గోవా, నాగాలాండ్‌లని కలిపిన దానికన్నా పెద్దదిగా ఉంటుంది. పలామూ ప్రాంతం బీహార్‌కి చెందినది. ** రెండూ దేశంలోని అత్యంత పేద జిల్లాల జాబితాలో ఉన్నాయి. ఎందుకంటే, పేద ప్రజల సంఖ్య వాటిలో చాలా ఎక్కువ. వనరుల విషయానికొస్తే, రెండూ గొప్ప సంపన్నమైనవి.

పార్బతి బహుశా విశిష్టమైన వంశం నుంచి వచ్చి ఉంటుంది. సర్గుజాలోని ఏనుగులు యుద్ధాల్లో కీలకమైన పాత్ర పోషించినవిగా చరిత్రలో ప్రసిద్ధి చెందాయి. “మధ్యయుగ యుద్ధ రంగంలో, ఏనుగులు సామర్థ్యానికి సంబంధించిన ముఖ్యమైన వనరు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సర్గుజా ముఖ్యమైన కేంద్రాల్లో ఒకటి, ఆ కాలంలో ఏనుగులను ఇక్కడి నుంచే సేకరించేవారు. మాల్వా సుల్తాన్లకూ, సర్గుజా  పాలకులకూ ఈ ప్రాతిపదికనే ఒక వ్యూహాత్మకమైన సంబంధం ఉంది: మాల్వాకు నిరంతరంగా ఏనుగులను సరఫరా చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు” అని జిల్లా గెజిట్‌లో రాసి ఉంది.

వాస్తవానికి, సర్గుజా మీద తన ఆధిపత్యాన్ని మాల్వా నిలబెట్టుకోడానికి దీన్ని అతి ముఖ్యమైన కారణంగా పరిగణిస్తారు. పర్భూని, పార్బతిని చూసినప్పుడు, వాళ్ళ పూర్వీకులు ఉగ్రంగా, యుద్ధస్వభావంతో ఉండేవారని ఊహించుకోవడం కష్టం. పర్భూ విధేయత కలిగిన ఆత్మలా కనిపిస్తాడు. పార్బతి ఒక కుందేలు లాంటి పోరాటతత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. (చాలా చాలా పెద్దదీ, ప్రశాంతమైనదీ అయిన కుందేలుని మీరు ఊహించుకోగలిగితే.)

సమీపంలోని సంచార భావనలు

దలీప్, నేను, మేం అంబికాపూర్***లో కుదుర్చుకున్న ఒక పురాతనమైన జీపుకు డ్రైవర్, కలిసి ఒక గ్రామం కోసం వెతికేం, కానీ చివరికది మాకు కనిపించనే లేదు. ఒక చిన్న బిర్‌హోర్ కాలనీ సమీపంలో మేం మా జీపుని నిలబెట్టి ఉంచాం. హో, సంతల్, ముండాల మాదిరిగానే బిర్‌హోర్లు కూడా ఆస్ట్రో-ఆసియాటిక్ భాషా విభాగానికి చెందిన అత్యంత ప్రాచీనమైన తెగ. ఛోటానాగపూర్ ప్రాంతంలోని సంచార జాతులైన వీళ్ళు ప్రధానంగా పలామూ, రాంచీ, లోహర్‌దగా, హజారీబాగ్, సింఘ్‌భూమ్ పరిసరాల్లో తిరుగుతుంటారు. వాళ్ళిప్పుడు ఒక అంతరించిపోతున్న తెగ. ప్రస్తుతానికి వీరు సుమారు 2 వేల మంది మాత్రమే మిగిలేరు, బహుశా ఇంకా తక్కువ కూడా కావచ్చు.

'దగ్గర్లోనే’ ఒక ఆసక్తికరమైన గ్రామం ఉందని, ఈ బిర్‌హోర్ తెగవాళ్ళు మాకు చెప్పేరు. ఇప్పుడు మేం నేర్చుకొనే ప్రక్రియలో ఉన్నాం. రోడ్డు మీద అనేక మైళ్ళు ప్రయాణించాక, ‘దగ్గర్లోనే’ అనే ఒక సంచార వ్యక్తి భావనను ఆమోదించడం ప్రాణాంతకం అనేది నేర్చుకొనే ప్రక్రియలో ఇప్పుడు మేం ఉన్నాం. ఇబ్బందిని కలిగిస్తున్న జీపును బిర్‌హోర్ల సంరక్షణ కింద వదిలేసి, మేం కాలి నడకన ముందుకి సాగేం.

డ్రైవర్ కూడా మాతో వద్దామనుకున్నాడు. బిర్‌హోర్లు కనిపిస్తున్న తీరుకు తాను భయపడ్డానని అతను చెప్పేడు. ఇప్పుడతను పార్బతి కనిపించే తీరు చూసి భయపడుతున్నాడు. డ్రైవర్ తనకెలా కనిపిస్తున్నాడని తాననుకుంటున్నాడో, దాని గురించి దలీప్ కొన్ని కఠినమైన వ్యాఖ్యలు చేసేడు. అయినా అతను కూడా అలాగే మావెంట వచ్చాడు.

పర్భూ మమ్మల్ని ఏనుగును ఎక్కించుకుంటానంటూ ఉదారంగా ఒక అవకాశం ఇచ్చాడు. మేం దాన్ని ఆమోదించేం. కొన్ని నెలల కిందట, 1993 మధ్యలో, నా ప్రాజెక్ట్ కోసం నేను బయటికి వచ్చినప్పటి నుంచీ నేను ఉపయోగించిన వివిధ రకాల రవాణా సాధనాల సంఖ్యని లెక్కెట్టడం మొదలెట్టేను. అవి నాటు పడవలు, తెప్పల నుంచి రైళ్ళ పైకప్పుల వరకూ అనేక రకాలున్నాయి. కానీ ఆ జాబితాలో ఏనుగు లేదు. బాటలో కొంతదూరం కిందికి వెళ్ళిన తరువాత, పర్భూతో మాట్లాడడానికి కూర్చున్నాం. ఒక గ్రామం కోసం వెతుకుతున్న సంగతి మరచిపోయేం. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేదో ఉంది. అది కూడా ‘దగ్గరలో'నే. పార్బతికి అతనెలా తిండి పెడుతున్నాడో, సంరక్షిస్తున్నాడో మేం తెలుసుకోవాలనుకున్నాం.

ఇంటర్వ్యూలు చేయటంలో మా ఎన్నికైన నైపుణ్యాల్ని ఉపయోగించి గంటన్నరసేపు గడిపిన తరువాత కూడా, మేం నేర్చుకున్నది ఖచ్చితంగా ఏమీ లేదు. పర్భూ చక్కటి మనిషే కానీ సమాచారాన్ని చెప్పడానికి ఇష్టపడలేదు. జనం నించి, ఆలయ ఉత్సవాల నించి వచ్చేవాటితో తమ జీవనం బాగానే సాగుతోందని అతను చెప్పేడు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అది నిజమే కావచ్చు కానీ, ఇక్కడ కాకపోవచ్చు. “నువ్వో *%*#* అబద్ధాలకోరువి,” అన్నాడు దలీప్. “దీనికి 200 కిలోల గడ్డి కావాలి. ఇంకా ఇతర ఆహారం కూడా. నువ్వేం చేస్తావో నేను చెబుతా చూడు, దగ్గిర్లో ఉన్న వ్యవసాయ భూముల్లోకి అది చొరబడేలా చేస్తావు, కదూ?” అని అడిగేడతను.

బహుశా ఇది నిజమే కావచ్చు. కానీ పర్భూ దాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చేడు. “మేం ఈ చెత్త ఏనుగుని కూడా ఇంటర్వ్యూ చేయగలం,” అన్నాడు దలీప్. “అదే మరింత యథార్థంగా ఉంటుంది. ఇతను దీన్ని మేపడానికి మరీ అడవుల్లోపలికి వెళ్ళడు. అక్కడ అసలైన అడవి ఏనుగులు ఉంటాయి. ఇతర జీవులూ ఉంటాయి. లేదు, అతను పొలాల్లోని పంటను దోచుకుంటున్నాడు. ఇతను దీన్నక్కడికి తీసుకుపోతాడు, దానితో పంటని నాశనం చేయిస్తాడు.” అన్నాడు దలీప్. దాని తిండి గురించీ, ఖర్చుల గురించీ మేం చర్చిస్తూ ఉంటే, పార్బతి మాత్రం పర్భూతో ఆటలాడుతూనే ఉంది, దాని తొండం అతని తలమీంచి తతిరుగుతోంది. అది అతన్ని ఇష్టపడుతోందన్నది స్పష్టం. అది పొలాల్లో పంటని దోచుకుంటున్నట్లయితే, ఆ పనిని చాలా బాగా చేస్తున్నట్టే.

తమ సేవల్ని బడే లోగ్ (సంపన్నులు) వినియోగించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని పర్భూ చెప్పేడు. ఉదాహరణకు, ఒక వివాహంలో భారీ ఆకర్షణగా నిలవడం కోసం పార్బతికి ఆడంబరమైన దుస్తులు వేశారు. అయితే దానికి చివరగా వచ్చిన అవకాశం మరీ లాభదాయకమైనదేమీ కాదు. “ఇవ్వాల్సిన మొత్తం నుంచి మాలిక్ (యజమాని) రూ. 50 తగ్గించి ఇచ్చాడు” అని పర్భూ చెప్పేడు. “ఆ రోజు పార్బతి మంచి ఆకలితో ఉంది. దానికి తినడానికి ఏమీ దొరక్క, అక్కడే వున్న- తాను తినకూడని - తిండి కాస్త తిన్నది,” అంటూ దాని తొండం మీద మెల్లగా కొట్టేడు. బహుశా 50 రూపాయల నష్టం గుర్తుకొచ్చిందేమో. అది ఆప్యాయంగా గుర్రుమంది. బహుశా దానికి పెళ్ళి భోజనం గుర్తొచ్చివుంటుంది

“ఒకసారి ఓ ఊరేగింపు కోసం పార్బతిని అద్దెకు తీసుకుంటానని ఓ మనిషి వచ్చాడు. అతను ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకుడు. కానీ అలా జరగలేదు. కొందరు వ్యక్తులు పార్బతి గురించి తనకి చాలా చెడ్డ విషయాలు చెప్పారని ఆ తర్వాత అతనన్నాడు. అది ఆధారపడదగినది కాదని చెప్పేరుట. జనం ఇలాంటి పనులు చేస్తుంటారు,” అన్నాడతను విచారంగా.

గ్రామాల్లోకి అడుగుపెట్టినప్పుడు, పార్బతిని చూడగానే కలిగే అత్యుత్సాహం వలన అతనికి సమస్యలు రాలేదా? ఒకసారి అలా జరిగిందని పర్భూ చెప్పేడు. “పార్బతిని చూడగానే ఒక కుక్కల మంద మొరగడం మొదలెట్టి, దాన్ని కరవబోయాయి. అది భయపడి, పారిపోవడానికి ప్రయత్నించింది. వెనక్కి తగ్గి, ఒక ఇంట్లోకి వెళ్ళటంతో అక్కడ కొంత నష్టం జరిగింది. ఇంటి యజమానికి చాలా కోపం వచ్చింది,” అని పర్భూ చెప్పేడు.

మేం కొన్ని క్షణాలపాటు నిశ్శబ్దంగా ఊహాగానాలు సాగించేం. పార్బతి ప్రవేశించినప్పుడు ఇంటి యజమాని పరిస్థితి ఎలా ఉండుంటుంది? ఈ సంఘటన తరువాత ఆ ఇల్లు చూడ్డానికి ఎలా తయారైంది? ఇంటి యజమానికి చాలా కోపం వచ్చిందా, లేదంటే కేవలం చచ్చేంతగా భయపడ్డాడా?

మరోసారి, “ఒక గ్రామం బయట పార్బతి మీద జనం రాళ్ళు విసిరేరు...” అన్నాడు పర్భూ.

“ఆహ్!” అన్నాడు దలీప్ విజయగర్వంతో. “అది తప్పకుండా నువ్వు పొలాల్లో పంటను దోచుకున్నప్పుడే అయ్యుంటుంది.”

“అబ్బే, లేదు లేదు. మేం కేవలం వాళ్ళ పొలాల్లోంచి వెళ్తున్నామంతే. కొందరు వ్యక్తులు తాగేసి ఉన్నారనుకుంటా. వాళ్ళు రాళ్ళు విసిరేరు. మేం మరో దిశగా వెనుతిరిగేం. దురదృష్టవశాత్తు, అప్పుడు చీకటి పడుతోంది. అక్కడ మరో బస్తీ ఉంది, మేం దాన్లో ప్రవేశించేం. పార్బతి త్వరత్వరగా నడుస్తోంది. దాంతో జనం భయపడిపోయేరు. అది ఏమాత్రం దూకుడుగా లేదు. అయినా వాళ్ళు అనవసరంగా భయపడ్డారు, అరవడం మొదలుపెట్టేరు.”

చీకట్లోంచి ఒక్కసారిగా మా మధ్యకి ఒక పెద్ద ఏనుగు దూసుకొస్తే ఏం చేసేవాళ్ళం అనే ఆలోచన మమ్మల్ని సతమతం చేసింది. బహుశా మేం దాని మీద రాళ్ళు విసరకపోవచ్చు. కానీ భయపడట, అరవడం అనేవి అజెండాలో చాలా ఎక్కువగానే ఉంటాయనిపిస్తోంది.

ఏనుగును ఎలా మేపాలి?

మేం పరిశీలిస్తున్న కొద్దీ పర్భూ, పార్బతిల సమస్య మరింత క్లిష్టంగా కనిపిస్తోంది. సర్గుజాలోని అత్యధిక సంఖ్యలో మనుషులు సరైన తిండి తినరు. మరి, ఒక ఏనుగును ఎలా మేపటం? లేదా తను సంపాదించి తెచ్చినవాటితో పార్బతి పర్భూకే తిండి పెడుతోందా? ఏనుగుల్ని పక్కన పెడితే, సర్గుజా దాని పేదరికం వల్ల చారిత్రకంగా ప్రఖ్యాతి (లేదా కుఖ్యాతి) చెందింది.

సుల్తానులు, మొఘలులు, మరాఠాలు, బ్రిటిష్‌వారు- వీరందరూ ఈ రాష్ట్రం మీద అతి తక్కువ పన్నులు లేదా సుంకాలు విధించేరు. సుల్తానులు, మొఘలులు ఎక్కువగా ఏనుగుల రూపంలో సుంకాలను తీసుకునేవారు. దాదాపు 1919 నాటికి, పొరుగు రాష్ట్రాల సంపదల్ని విచ్చలవిడిగా దోచుకుంటున్న బ్రిటిష్‌వారు ఇక్కడ మాత్రం అతి తక్కువ మొత్తాలనే సుంకాలుగా స్థిరపరిచేరు. ప్రతి సంవత్సరం, సర్గుజా, కొరియా, ఛాంగ్ భఖార్ లాంటి స్థానిక పాలెగాళ్ళ రాజ్యాల నించి వరుసగా కేవలం రూ. 2,500, రూ. 500, రూ. 387లనే సుంకాలుగా తీసుకున్నారు.

18వ శతాబ్దపు ఆఖరి సంవత్సరాల్లో, అప్పటివరకూ సర్గుజా ఆధిపత్యంలో ఉన్న కొరియా సామంత రాజ్యాన్ని మరాఠాలు ఆక్రమించేరు. ఆఖరికి శక్తివంతులైన మరాఠాలు సైతం ఈ భూభాగాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోలేకపోయేరు, ఈ భూభాగాన్ని నియంత్రించడం చాలా కష్టమని తెలుసుకున్నారు. దానికి బదులుగా వారు కొరియా రాజు నించి కేవలం రూ. 2,000 డిమాండ్ చేశారు. అతను దాన్ని చెల్లించలేడని తెలుసుకొని, అయిదేళ్ళ పాటు ఏడాదికి ఈ ఛార్జీని రూ. 200కి తగ్గించేరు. హెచ్చరికగా అనేక పశువుల్ని పట్టుకున్నారు. జిల్లా గెజిటర్ పేర్కొన్నదాని ప్రకారం, నిరంకుశులైన మరాఠాలు సైతం రాజా ఒక్క రూపాయి కూడా చెల్లించలేడని త్వరలోనే అర్థం చేసుకున్నారు. దాంతో వాళ్ళు “అయిదు చిన్న గుర్రాలు, మూడు ఎద్దులు, ఒక గేదె”తో పరిష్కారం చేసుకున్నారు.

తరువాత ఆ పశువుల్ని కూడా వదిలేశారు. ఎందుకూ పనికిరానివని గుర్తించిన తరువాత, తాము దోచుకున్న ఇతర పశువుల్ని సైతం తిరిగి ఇచ్చేసేరు. శత్రుత్వాలు ముగిశాయి. అయోమయంలో పడిన మరాఠాలు వెనుతిరిగిపోయారు.

ఇటువంటి సర్గుజాలో ఒక ఏనుగుకి తిండి పెట్టడం ఎలా? దాన్ని మీరు అడవి లోలోపలికి తీసుకువెళ్ళలేరు కదా? మాకు ఇంతకుముందు తట్టింది తప్పితే, ఏదో ఒక సమాధానానికి మేం కనీసం దగ్గరగా కూడా రాలేకపోయాం. చాలా శ్రమతో చివరి ప్రయత్నం చేశాం. మేం దాన్నే అనుసరించడం మొదలుపెట్టేం.

పర్భూని ఒప్పించే ప్రయత్నంలో మేం అతనితో వాదించేం, బుజ్జగించేం, బతిమాలేం. విశేషమైన మాధుర్యంతో, నిగ్రహంతో అతను మా ప్రశ్నలకి గొప్ప వివరంగా సమాధానాలిచ్చేడు, కానీ మాకు చెప్పిందేమీ లేదు. పార్బతి సౌమ్యమైన, వినోదభరితమైన ధిక్కారంతో మా సంభాషణల్ని పరిశీలించింది.

ఒక గంట తరువాత, వాళ్ళ దారిలో వాళ్ళున్నారు. “తరువాతి గుడికి,..” అన్నాను నేను. “ఎవరి పొలాన్నో దోచుకోడానికి,” అన్నాడు దలీప్.

అతను ఏం చేసైనా సరే, రోజూ దానికి 200 కిలోల గడ్డినీ, ఇతర ఆహారాన్నీ పెట్టగలుగుతున్నాడు. ఎలా అనేది మనకు తెలీదంతే!

* పర్భూ లేదా ప్రభు అనేది మహాశివుడికి మరో పేరు. ఆయన దేవేరి పార్వతి (లేదా పార్బతి).

** అది తరువాత ఝార్ఖండ్‌లో భాగమయింది.

*** సర్గుజా జిల్లా కేంద్రం, ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో ఉంది.

చిత్రాలు: ప్రియాంకా బొరార్

ప్రియాంకా బొరార్ ఒక న్యూ మీడియా ఆర్టిస్ట్, పరిశోధకురాలు, మాధ్యమం తాలూకు ప్రదర్శనాత్మక స్వభావంపై ఆసక్తి కలిగినవారు. ఆమె ఇంటరాక్టివ్ మీడియాతో పని చేస్తున్నారు, కానీ ఆమెకు ఇష్టమైన మొదటి పని బొమ్మలు వెయ్యడం, ఈ మధ్యకాలంలోనైతే కామిక్స్.

చాలా భిన్నమైన చిత్రాలతో కూడిన ఈ కథనం ఒక వెర్షన్ మొదట సెప్టెంబర్ 1998 నాటి ఇండియా మ్యాగజైన్‌లో ప్రచురితమయింది. ఆ తర్వాత అక్టోబర్ 2000లో కాయ్ ఫ్రైస సంపాదకులుగా పనిచేసిన పెంగ్విన్‌వారి పుస్తకం 'ఎల్స్‌వేర్: అన్‌యూజువల్ టేక్స్ ఆన్ ఇండియా'లో కనిపించింది.

అనువాదం: సురేశ్ వెలుగూరి

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Suresh Veluguri

Suresh Veluguri is one of the first generation Technical Writers in India. A senior journalist by profession. He runs VMRG international, an organisation that offers language services.

Other stories by Suresh Veluguri