ఇన్‌సాన్ అప‌నా ఝ‌గ‌డే సే మ‌రేగా న ర‌గ‌డే సే
ఔర్ మ‌రేగా తో భూక్ ఔర్ ప్యాస్ సే

మాన‌వ‌జాతి ఒత్తిళ్లూ విధ్వంసాల వ‌ల్ల నాశ‌నం కాదు,
కేవ‌లం ఆక‌లి ద‌ప్పిక‌ల‌తో మాత్ర‌మే నాశ‌న‌మ‌వుతుంది.

"వాతావ‌ర‌ణ మార్పుల మీద ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తున్న‌ది కేవ‌లం సైన్స్ మాత్ర‌మే కాదు. ఇవ‌న్నీ మ‌న పురాణాలు ఎన్నో శ‌తాబ్దాలుగా ఘోషిస్తున్న‌వే" అని ఒక్క మాట‌లో స‌త్యం బోధించారు ఢిల్లీ రైతు శివ‌శంక‌ర్ (75). తాను విశ్వసించే 16వ శ‌తాబ్దం నాటి ఆణిముత్య‌పు సాహిత్యం ` రామ్ చ‌రిత మాన‌స్‌ `ను ఉటంకిస్తూ ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేశారు. ( వీడియో చూడండి ). ఇటువంటి పురాణాలు చ‌ద‌వ‌డం శంక‌ర్ కు సరిగ్గా రాకపోయి ఉండవచ్చు, అందువలన అతను ఉటంకించే మాట‌లు తుల‌సీదాస్ ప‌ద్యాల్లో ఎక్క‌డున్నాయో క‌నుక్కోవ‌డం చాలా క‌ష్టం. అయితే, యమునా ప‌రివాహ‌క‌ ప్రాంతంలో నివ‌సిస్తున్న‌ ఈ రైతు చెప్పిన మాటలు మాత్రం మన కాలానికి ఖ‌చ్చితంగా సరిపోతాయి.

ఎన్నో ఇబ్బందుల‌కోర్చి శంకర్, అతని కుటుంబం, ఇంకా ఎంతోమంది రైతులు య‌మునా ప‌రివాహ‌క ప్రాంతాల్లో వ్య‌వ‌సాయం చేసుకుంటున్నారు. ఎప్ప‌టికప్పుడు మారిపోతుండే ఉష్ణోగ్ర‌త‌లు, వాతావ‌ర‌ణ మార్పులు మొత్తం న‌గ‌రం మీదా ప్ర‌భావం చూపిస్తున్నాయి. మొత్తం 1,376 కిలోమీట‌ర్ల దూరం ప్రవ‌హించే య‌మునా న‌ది, డిల్లీలో కేవ‌లం 22 కిలోమీట‌ర్లు మాత్ర‌మే ప్ర‌వ‌హిస్తుంది.  ఇది ఢిల్లీ భూభాగం లోని 97 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల మీద మాత్ర‌మే, అంటే ఢిల్లీలో కేవ‌లం 6.5 శాతం మీద మాత్ర‌మే ఈ ప్ర‌భావం ప‌డుతోంది. విన‌డానికి ఈ సంఖ్య‌ చాలా చిన్న‌దిగానే అనిపిస్తుంది కానీ, జాతీయ‌ రాజ‌ధాని న‌గ‌రపు వాతావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త , ఉష్ణోగ్ర‌త‌ల  మీద ఇది చూపిస్తున్న ప్ర‌భావం మాత్రం చాలా ఎక్కువే. కాబట్టి ఢిల్లీ ప్రకృతికి ఇది ఒక థెర్మోస్టాట్ లా పనిచేస్తుంది.

మారుతున్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్ని ఇక్క‌డి రైతులు ఇప్పుడు త‌మ‌కు తోచిన‌విధంగా తామే విశ్లేషించుకుంటున్నారు. పాతికేళ్ల క్రితం దాకా తాము సెప్టెంబ‌ర్ నెల లోనే కాస్త వెచ్చ‌గా వుండే దుప్ప‌ట్లు వినియోగించ‌డం మొద‌లుపెట్టేవార‌మ‌ని, ఇప్పుడు డిసెంబ‌ర్ దాకా చ‌లి ప్రారంభం కావ‌డం లేద‌ని శివ‌శంక‌ర్ కుమారుడు విజేంద‌ర్ సింగ్ (35) అన్నారు. గ‌తంలో మార్చి నెల‌లో హోళీ పండుగ స‌మ‌యంలో చాలా వేడిగా వుండేద‌ని, కానీ తామిప్పుడు చ‌లికాలంలోనే హోళీ జ‌రుపుకుంటున్నామ‌ని చెప్పారాయ‌న‌.

Shiv Shankar, his son Vijender Singh (left) and other cultivators describe the many changes in temperature, weather and climate affecting the Yamuna floodplains.
PHOTO • Aikantik Bag
Shiv Shankar, his son Vijender Singh (left) and other cultivators describe the many changes in temperature, weather and climate affecting the Yamuna floodplains. Vijender singh at his farm and with his wife Savitri Devi, their two sons, and Shiv Shankar
PHOTO • Aikantik Bag

శివ‌శంక‌ర్‌, ఆయ‌న కుమారుడు విజేంద‌ర్ సింగ్ (ఎడ‌మ‌వైపు), ఇత‌ర రైతులు వాతావ‌ర‌ణంలో వ‌స్తున్న మార్పులు, య‌మున వ‌ర‌ద కార‌ణంగా క‌లుగుతున్న ముప్పుల్ని వివ‌రించారు. త‌న భార్య, ఇద్ద‌రు కుమారులు, త‌న త‌ల్లి సావిత్రి దేవి, శివ‌శంక‌ర్‌ల‌తో విజేంద‌ర్ సింగ్‌. (కుడివైపు చిత్రం)

శంకర్ కుటుంబం ఇక్క‌డి రైతుల అనుభ‌వాల‌ను ప్రతిబింబిస్తున్నది. కొంచెం అటూఇటూగా 5,000 - 7,000 మంది రైతులు యమునా నది ఢిల్లీ తీరం పాయ వెంబడి నివసిస్తున్నారు. సంచితంగా చూస్తే గంగాన‌ది త‌ర్వాత రెండ‌వ అతి పొడ‌వైన (ఘాఘ్‌హ‌రా త‌ర్వాత‌) న‌దిగా య‌మున ప్ర‌వ‌హిస్తోంది. న‌గ‌ర రైతుల ప‌రిస్థితుల గురించి ఇక్క‌డి వ్య‌వ‌సాయాధికారులు మాట్లాడుతూ, గ‌తంలో ఈ ప్రాంతంలో సుమారు 24,000 ఎక‌రాల్లో పంట సాగు జ‌రిగేద‌ని, అదిప్పుడు చాలామేర‌కు త‌గ్గిపోయింద‌ని చెప్పారు. ఇక్క‌డి రైతులంద‌రూ న‌గ‌ర రైతులే కానీ, గ్రామీణ ప్రాంతాల రైతులు కాదు. అక్క‌డి రైతుల్లాగా వీరికి ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లంటూ ఏమీవుండ‌వు. `అభివృద్ధి` పేరుతో జ‌రిగే తంతులతో నిరంత‌రం త‌మ అస్తిత్వాల‌ను పోగొట్టుకుంటూ అనిశ్చితంగా బ‌తుకుతున్నారు వీరు. ముంపు ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలను నిరసిస్తూ నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ (ఎన్‌జీటీ)లో ఎన్నో పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. అందుకని ఆందోళనలకు గుర‌య్యేది రైతులొక్క‌రే కాదు.

వ‌ర‌ద‌ మైదానాలన్నీ కాంక్రీట్ నిర్మాణాల‌మ‌యం అవుతున్నాయ‌ని విశ్రాంత ఇండియ‌న్ ఫారెస్ట్ ఆఫీస్ స‌ర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి మ‌నోజ్ మిశ్రా చెప్పారు. ఫ‌లితంగా వేస‌వితో పాటు శీతాకాలాల్లో కూడా ఉష్ణోగ్రతలు విపరీతంగా, భరించలేనివిగా మారతాయ‌ని; చివ‌రికి  ఢిల్లీవాసులు నగరం విడిచి వ‌ల‌స‌పోవ‌ల్సిరావ‌చ్చ‌ని కూడా చెప్పారాయ‌న‌. ``ఢిల్లీ న‌గ‌రం నివాసానికి అయోగ్యంగా మారిపోతోంది. ఇది ప‌లు అనివార్య ప‌రిస్థితుల‌కు దారితీస్తుంది. వ‌ల‌స‌లు తీవ్ర‌మ‌వుతాయి. చివ‌రికి రాయ‌బార కార్యాల‌యాలు కూడా త‌ర‌లిపోయే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది`` అని వివ‌రించారు మిశ్రా. మిశ్రా. ఈయన ‘య‌మునా జియే అభియాన్` (లాంగ్ లివ్ య‌మునా) అనే పేరుతో ఒక ఉద్య‌మాన్ని న‌డుపుతున్నారు. 2007లో ఈ వేదిక ప్రారంభ‌మైంది. ఢిల్లీ న‌గ‌రంలో ప్ర‌కృతి స‌మ‌తుల్య‌త‌ను, య‌మునా న‌దిని కాపాడుకోవ‌డం కోసం ప్ర‌జ‌లు, ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు, సంస్థ‌లు, సామాజిక కార్య‌క‌ర్త‌లను క‌లుపుకుంటూ న‌డుస్తోంది ఈ సంస్థ‌.

*****

మ‌ళ్లీ ఒక‌సారి వెన‌క్కి వ‌ర‌ద మైదానాలు విష‌యానికి వెళితే, గత కొన్ని దశాబ్దాలుగా ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాలు రైతులతో పాటు మత్స్యకారులనూ ఒకేలా వేధిస్తున్నాయి.

య‌మునా న‌ది మీద ఆధార‌ప‌డిన కొన్ని సామాజిక‌వ‌ర్గాలు ఏటా భారీవ‌ర్షాలు కుర‌వాల‌నే కోరుకుంటాయి. ముఖ్యంగా జాల‌రులు త‌మకు కొత్త వ‌ర్షాలు మేలు చేస్తాయ‌ని భావిస్తారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా న‌దిలో క‌ల్మ‌ష‌మంతా తొల‌గిపోయి, ఆరోగ్య‌వంత‌మైన చేప‌లు సాధార‌ణం కంటే మూడు రెట్ల ఎక్కువ సంఖ్య‌లో దొరుకుతాయ‌ని వారు ఆశిస్తారు. " జ‌మీన్ న‌యీ బ‌న్‌జాతా హై. జ‌మీన్ ప‌ల‌ ట్ జాతీ హై (భూమి కొత్త‌దిగా మారుతుంది; భూమి పున‌రుజ్జీవం పోసుకుంటుంది)”, అని వివ‌రించారు శంక‌ర్‌. "2000 సంవ‌త్స‌రం వ‌ర‌కూ ఇది నిరంత‌రం సాగింది. ఇప్పుడు వ‌ర్షాలు త‌గ్గిపోయాయి. గ‌తంలో రుతుప‌వ‌నాలు జూన్ నెల‌లో మొద‌ల‌య్యేవి. ఈ ఏడాది జూన్‌, జులైల‌లో కూడా వేడిమే కొన‌సాగింది. వ‌ర్షాలు ఆల‌స్యంగా కుర‌వ‌డం మా పంట‌ల మీద ఎంతో ప్ర‌భావం చూపిస్తుంది" అన్నారాయ‌న‌.

వ‌ర్షాలు త‌క్కువ‌గా ప‌డిన‌ప్పుడు భూమిలో న‌మ‌క్ (ఉప్పు కాదు, ఆల్క‌లీన్ ప‌దార్థం) ఎక్కువ‌గా పెరుగుతుందని త‌న పొలాల‌ను చూపిస్తూ చెప్పారు శంక‌ర్‌. య‌మున వ‌ర‌ద మైదానాల ద‌గ్గ‌ర పేరుకుపోయే ఒండ్రుమ‌ట్టి వీరికి న‌ది ఇచ్చిన వ‌రమ‌ని చెప్పుకోవాలి. ఈ నేల రైతుల‌కు దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాల‌ను అందించింది. చెర‌కు, వ‌రి, గోధుమ‌, కూర‌గాయ‌లను పండించ‌డానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డింది. చెర‌కులో కూడా మూడు రకాలు- లాల్రి, మిరాటి, సొరత ఈ నేల‌లో బాగా పండుతాయి. నిజానికి ఈ చెర‌కులే 19వ శతాబ్దం చివరి దాకా ఢిల్లీ నగరానికి గర్వకారణంగా భాసిల్లాయ‌ని ఢిల్లీ గెజిటీర్ తెలియ‌జేస్తోంది.

'జ‌మీన్ న‌యీ బ‌న్‌జాతా హై. జ‌మీన్ ప‌ల‌ట్ జాతీ హై (భూమి కొత్త‌దిగా మారుతుంది; భూమి పున‌రుజ్జీవం పోసుకుంటుంది)' వివరించాడు శంకర్

వీడియో చూడండి: ‘ఈ రోజు ఊరిలో ఒక్కటైనా పెద్ద చెట్టు లేదు’

ఈ చెర‌కు కొల్హస్ (క్ర‌ష‌ర్ల) ద్వారా గుర్ (బెల్లం) త‌యారీకి కీల‌కంగా ఉప‌యోగ‌ప‌డేది. ప‌దేళ్ల క్రితం దాకా ఢిల్లీ లోని ప్ర‌తి వీధి మూల‌నా  చిన్న‌చిన్న బండ్ల మీద కూడా తాజా చెర‌కు ర‌సం అమ్మేవారు. ఆ స‌మ‌యంలో ప్ర‌భుత్వం చెర‌కుర‌సం అమ్మ‌డం పై నిషేధం విధించింది.1990 నుంచీ చెర‌కు ర‌సం అమ్మ‌కాల‌పై అధికారిక నిషేధాలు అమ‌ల‌వుతున్నాయి. వీటిని స‌వాల్ చేస్తూ కోర్టుల్లో కేసులు కూడా న‌డుస్తూనేవున్నాయి. "చెర‌కుర‌సం వ‌ల్ల బ‌హుళ ప్రయోజ‌నాలున్నాయ‌ని అందరికీ తెలుసు. ఇది శ‌రీరంలో వేడిని త‌గ్గించడ‌మే కాక‌, జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రుస్తుంది. కూల్‌డ్రింక్ కంపెనీలు మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులతో కుమ్మ‌క్క‌యి, మా వ్యాపారాల్ని నిలిపివేయించాయి" అని మ‌రికొంత వివ‌రంగా చెప్పుకొచ్చారు శంక‌ర్‌.

"ఇంకొన్ని సంద‌ర్భాల్లో అటు వాతావ‌ర‌ణం ఆటుపోట్లు, ఇటు ప్ర‌భుత్వం తీసుకునే రాజ‌కీయ పాల‌నా నిర్ణ‌యాలు క‌లిసి మాకు మ‌రిన్ని విప‌త్క‌ర ప‌రిస్థితుల్ని సృష్టిస్తాయి. ఈ ఏడాది ఆగ‌స్టులో మొద‌ట‌ య‌మునా న‌ది నీటిని హ‌ర్యానా లోని హాథ్నికుండ్ బ్యారేజీ నుంచి విడుద‌ల చేశారు. ఢిల్లీలో కురిసిన భారీ వ‌ర్షాల‌కు పైనుంచి వ‌చ్చిన వ‌ర‌ద ముప్పు తోడ‌యింది. దీంతో చాలా చోట్ల పంట‌లు నాశ‌న‌మైపోయాయి" అంటూ త‌మ పొలాన్ని చూపారు విజేంద‌ర్‌. అందులో కుచించుకుపోయిన మిర‌ప‌కాయ‌లు, ముడ‌త‌లు ప‌డిపోయిన బెండ‌కాయ‌లు, ఇక ఈ ఏడాది పూత పూయని చిన్న ముల్లంగి మొక్క‌లు వున్నాయి. బేలా ఎస్టేట్లో వారికి ఐదు బీగాల (ఒక ఎక‌రం) స్థ‌లం వుంది. ఈ ఎస్టేట్ రాజ్‌ఘాట్, శాంతివన్ జాతీయ స్మారక చిహ్నాల వెనుక వుంది.

దేశ రాజ‌ధానిలో చాలాకాలంగా ఒక భిన్న‌మైన వాతావ‌ర‌ణ ప‌రిస్థితి వుంది. 1911లో బ్రిటిష్ రాజ‌ధానిగా మార‌క‌ముందు ఢిల్లీ వ్య‌వ‌సాయ రాష్ట్రమైన పంజాబ్‌కు ఆగ్నేయంగా వుంది. ప‌శ్చిమాన రాజ‌స్తాన్ ఎడారి, ఉత్త‌రాన హిమాల‌య ప‌ర్వ‌తాలు, తూర్పున ఇండో గంగా మైదానాలున్నాయి. ఈ ప్రాంతాల‌న్నీ ఇప్పుడు అనేక వాతావ‌ర‌ణ మార్పుల‌కు గుర‌వుతున్నాయి. అతిశీత‌ల శీతాకాలాలూ, అత్యుష్ణోగ్ర‌త‌ల‌కు నిల‌యంగా మారాయి. మ‌ధ్య‌లో 3,4 నెల‌లు రుతుప‌వ‌నాల వ‌ల్ల కాస్త ఉప‌శ‌మ‌నం దొరుకుతుంటుంది.

ఈ ప‌రిస్థితులు ఇప్పుడు మ‌రింత అస్థిరంగా మారాయి. భారత వాతావరణ శాఖ నివేదిక‌ ప్రకారం ఈ ఏడాది జూన్-ఆగస్టు సీజన్‌లో ఢిల్లీలో 38 శాతం లోటు వర్షపాతం నమోదైంది. స‌గ‌టు వ‌ర్ష‌పాతం 648.9 మి.మీల‌కి గాను 404.1 మి.మీ మాత్ర‌మే న‌మోదైంది. ఇంకాస్త సున్నితంగా చెప్పాలంటే, ఢిల్లీ ఇలాంటి పేల‌వ‌మైన‌ రుతుప‌వ‌నాల్ని గ‌త అయిదేళ్ల‌లో ఎన్న‌డూ చూడ‌లేదు.

"సౌత్ ఆసియా నెట్‌వ‌ర్క్ ఆఫ్ డ్యామ్స్‌, రివ‌ర్స్ & పీపుల్‌," స‌మ‌న్వ‌య‌క‌ర్త హిమాంశు థ‌క్క‌ర్ మాట్లాడుతూ  `దేశంలో రుతుప‌వ‌నాల గ‌తులు మారిపోతున్నాయి, వ‌ర్ష‌పాతం ఇంత అని అంచ‌నా వేసే ప‌రిస్థితి లేకుండాపోతోంది` అని చెప్పారు. వ‌ర్షాల సంఖ్య త‌గ్గ‌క‌పోయినా, అవి కురిసే రోజుల సంఖ్య త‌గ్గిపోతోంది. కురిసిన రోజుల్లో మాత్రం వాటి ప్ర‌భావం అతివృష్టిని త‌ల‌పిస్తోంది. ఫ‌లితంగా ఢిల్లీ వాతావ‌ర‌ణం ప‌లు మార్పుల‌కు లోన‌వుతోంది. య‌మునా న‌ది వ‌ర‌ద‌లు, న‌గ‌రానికి పెరుగుతున్న వ‌ల‌స‌లు, రోడ్ల మీది కిక్కిరిసిన వాహ‌నాల వ‌ల్ల తీవ్ర‌మ‌వుతున్న వాతావ‌ర‌ణ కాలుష్యం - ఇవ‌న్నీ అంచ‌నాల‌కు మించి మారిపోతున్నాయి. ఈ ప్ర‌భావం ఇప్పుడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, పంజాబ్ రాష్ట్రాల‌నూ తాకింది. చిన్న‌చిన్న ప్రాంతాల వాతావరణాలు (మైక్రో క్ల‌యిమేట్స్‌) కూడా స్థానిక వాతావరణాలను ప్రభావితం చేస్తాయి.”

*****

The flooding of the Yamuna (left) this year – when Haryana released water from the Hathni Kund barrage in August – coincided with the rains in Delhi and destroyed several crops (right)
PHOTO • Shalini Singh
The flooding of the Yamuna (left) this year – when Haryana released water from the Hathni Kund barrage in August – coincided with the rains in Delhi and destroyed several crops (right)
PHOTO • Aikantik Bag

ఈ ఏడాది య‌మునా ప్ర‌వాహం (ఎడ‌మ‌వైపు చిత్రం) - హ‌థ్ని కుండ్ బ్యారేజ్ నుంచి మొన్న ఆగ‌స్టులో హ‌ర్యానా వ‌దిలిన నీటి ప్ర‌వాహం తో పాటు . యాదృచ్ఛికంగా అదే స‌మ‌యంలో కురిసిన భారీ వ‌ర్షాలు కలిసి అనేక పంట‌ల్ని నాశ‌నం చేశాయి

జ‌మ్‌నా పార్‌కే మ‌ట‌ర్ లే లో’ (య‌మునా తీరం నుంచి తెచ్చిన బ‌ఠానీలండీ) అని ఒక‌ప్పుడు ఢిల్లీలో కూర‌గాయ‌ల మార్కెట్లు, వీధుల్లో తిరిగి కూర‌గాయ‌లు అమ్మేవారు స‌గ‌ర్వంగా అరుస్తుండేవారు. ఇది 1980ల నాటి సంగ‌తి. ఒక‌ప్పుడు ఢిల్లీలో పండే పుచ్చ‌కాయ‌లు అచ్చం ` లుక్న‌వి ఖ‌ర్బూజా ` (ల‌ఖ‌న‌వూ పుచ్చ‌కాయ‌లు)ల లాగా వుండేవ‌ని పాత‌త‌రం మ‌నుషులు చెప్తుంటారు. ఈ విష‌యాన్ని `నేరేటివ్స్ ఆఫ్ ది ఎన్విరాన్‌మెంట్ ఆఫ్ ఢిల్లీ` అనే పుస్త‌కంలో ('ఇండియ‌న్ నేష‌న‌ల్ ట్ర‌స్ట్ ఫ‌ర్ ఆర్ట్ & క‌ల్చ‌ర‌ల్ హెరిటేజ్‌' ప్ర‌చుర‌ణ‌)లో కూడా ప్ర‌స్తావించారు. న‌ది ఇసుక‌నేల‌ల్లో పండ‌డం, అలాగే వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా స‌హ‌జంగా పెర‌గ‌డం వ‌ల్ల ఈ ఖ‌ర్బూజాల‌ ర‌సం చాలా రుచిగా వుండేది. ఈ ఖ‌ర్బూజాలు సాదా ఆకుప‌చ్చ రంగులో, మంచి బ‌రువుతో వుండేవి. బాగా తియ్య‌గా కూడా వుండేవి. ఇవి ఏడాదిలో ఒక్క‌సారి సీజ‌న్‌లో మాత్ర‌మే క‌నిపిస్తాయి. ఇక‌, సాగు ప‌ద్ధ‌తుల్లో వ‌చ్చిన ఆధునిక మార్పులు భిన్న త‌ర‌హాల ఖ‌ర్బూజా విత్త‌నాల‌ను మార్కెట్లోకి ప్ర‌వేశ‌పెట్టాయి. వీటిద్వారా వ‌చ్చే పుచ్చ‌కాయ‌లు చిన్న‌విగా వుండి, పైన తొక్కు చార‌లు చార‌లుగా వుంటుంది.

ఎక్కువ ర‌సంతో నిండిన ' సింఘారా 'ల‌ను బండ్ల మీద పెట్టుకుని రైతులు న‌గ‌ర‌మంతా ఇంటింటికీ తిరుగుతుండేవారు. ఇవి న‌జ‌ఫ‌ర్‌జంగ్ చెరువు కింది సార‌వంత‌మైన నేల‌ల్లో నాణ్య‌మైన నీటితో పండేవ‌వి. అవ‌న్నీ క‌నుమ‌రుగైపోయాయి. “ఈ రోజు న‌జ‌ఫ‌ర్‌జంగ్ కాలువ‌,  ఢిల్లీ గేట్ కాలువ‌లు, యమునలోని  63 శాతం కాలుష్యానికి కార‌ణ‌మ‌వుతున్నాయి" అని నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ (ఎన్‌జీటీ) వెబ్‌సైట్ పేర్కొంది. ` సింఘారాలు చిన్న చిన్న నీటి గుంట‌ల్లో పెరుగుతాయి` అని ఢిల్లీ పీసెంట్స్ కోఆప‌రేటివ్ మ‌ల్టీప‌ర్ప‌స్ సొసైటీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బ‌ల్‌జీత్ సింగ్ (80) చెప్పారు. “కావ‌ల్సినంత నీరు అంద‌క విసుగుతో రైతులిప్పుడు వీటిని పండించ‌డం మానేశారు,” అన్నారు.  రాజ‌ధాని న‌గ‌రంలో ఇప్పుడు నీళ్లు, స‌హ‌నం - ఈ రెండు కరువవుతున్నాయి.

రైతులు వేగంగా ఫ‌లితాల‌నిచ్చే పంట‌ల‌నే కోరుకుంటార‌ని బ‌ల్‌జీత్ సింగ్ చెప్పారు. రెండు మూడు నెల‌ల్లోనే కాపుకొచ్చేవి; ఏడాదికి మూడు నాలుగు కాపుల‌నిచ్చే పంట‌ల‌మీద‌నే వారికి మొగ్గు వుంటుంద‌న్నారాయ‌న‌. బెండ‌, బీన్స్‌, వంకాయ‌, ముల్లంగి, కేలీఫ్ల‌వ‌ర్ త‌దిత‌ర పంట‌లు ఈ కోవ‌లోకి వ‌స్తాయి. రెండు ద‌శాబ్దాల క్రితం ముల్లంగిలో ప‌లు కొత్త ర‌కాలొచ్చాయ‌ని విజేంద‌ర్ సింగ్ గుర్తు చేసుకున్నారు. ``సైన్స్ చాలా అభివృద్ధి చెందింది. గ‌తంలో మాకు ఎక‌రానికి 40-50 క్వింటాళ్ల ముల్లంగి దిగుబ‌డి వ‌చ్చేది. ఇప్పుడ‌ది నాలుగు రెట్ల‌కు పెరిగింది. ఏటా మూడుసార్లు పంట దిగుబ‌డి వ‌స్తుంది`` అన్నారు శంక‌ర్‌.

Vijender’s one acre plot in Bela Estate (left), where he shows us the shrunken chillies and shrivelled brinjals (right) that will not bloom this season
PHOTO • Aikantik Bag
Vijender’s one acre plot in Bela Estate (left), where he shows us the shrunken chillies and shrivelled brinjals (right) that will not bloom this season
PHOTO • Aikantik Bag
Vijender’s one acre plot in Bela Estate (left), where he shows us the shrunken chillies and shrivelled brinjals (right) that will not bloom this season
PHOTO • Aikantik Bag

బేలా ఎస్టేట్ లోని విజేంద‌ర్ ఎక‌రం పొలం (ఎడ‌మ‌). ఇక్క‌డే ఆయ‌న వ‌ర‌ద‌ల వ‌ల్ల త‌న మిర్చి, వంకాయ పంట‌ల‌కు క‌లిగిన న‌ష్టాన్ని (కుడివైపు చిత్రం) చూపించారు. ఈ సీజ‌న్‌లో ఇటువంటి ప‌రిస్థితి మ‌ళ్లీ రాకూడ‌ద‌ని కోరుకుంటున్నాడాయ‌న‌

ఈలోగా ఢిల్లీలో కాంక్రీట్ త‌ర‌హా నిర్మాణాలు ఊపందుకున్నాయి. వ‌ర‌ద ప్రాంతాల్లో కూడా ఈ నిర్మాణాలు వెలిశాయి. ఢిల్లీ 2018-19 ఆర్థిక సర్వే ప్రకారం  2000 - 2018ల‌ మధ్య ప్రతి ఏటా పంటల విస్తీర్ణం దాదాపు 2 శాతం తగ్గుతూవ‌చ్చింది. ప్ర‌స్తుతం న‌గ‌ర‌ జ‌నాభాలో ద‌రిదాపు 25 శాతం ప్రాంతం (ఇది 1991లో 50 శాతంగా వుండేది) గ్రామీణ ప‌రిధిలో వుంది. 2021 మాస్ట‌ర్‌ప్లాన్ ప్ర‌కారం ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డిడిఎ) సంపూర్ణ పట్ట‌ణీక‌ర‌ణ‌కు సంసిద్ధ‌మైంది.

ఐక్య‌రాజ్య‌స‌మితి అంచ‌నాల మేర‌కు, ఢిల్లీలో చ‌ట్ట‌బ‌ద్ధంగా, చ‌ట్టవిరుద్ధంగా జ‌రుగుతున్న మితిమీరిన కాంక్రీట్ నిర్మాణాల కార‌ణంగా 2030 నాటికి ఇది అత్యధిక జ‌నాభా క‌లిగిన న‌గ‌రంగా మారే ముప్పు పొంచివుంది. ప్ర‌స్తుతం ఢిల్లీ జ‌నాభా 2 కోట్లు. ఇది టోక్యో జ‌నాభా (3.6 కోట్లు)ను మించిపోయే అవ‌కాశాలున్నాయి. వ‌చ్చే ఏడాది నాటికి భూగ‌ర్భ‌జ‌లాలంటూ ల‌భించ‌ని 21 భార‌తీయ న‌గ‌రాల్లో ఢిల్లీ కూడా ఒక‌టి కానుంద‌ని నీతి అయోగ్ పేర్కొంది.

"కాంక్రీటీక‌ర‌ణ కార‌ణంగా ఇంకా ఎక్కువ భూమి చ‌దును లోకి వ‌చ్చి, నిర్మాణాలు పెరిగిపోతాయి. ఫ‌లితంగా భూమిలోనికి నీరు ఇంకడం తగ్గిపోతుంది, కాబట్టి నీటి  ఎద్దడి పెరుగుతూ పోతుంది. అంతేగాక ప‌ర్యావ‌ర‌ణ ప‌రంగా కూడా విప‌రీత మార్పులొస్తాయి. ఉష్ణోగ్ర‌త పెరిగిపోతుంది" అని వ్యాఖ్యానించారు మ‌నోజ్ మిశ్రా.

1960లో - అంటే శంక‌ర్‌కి ప‌ద‌హారేళ్ల వ‌య‌సున్న‌ప్పుడు ఢిల్లీ న‌గ‌రం 178 రోజుల స‌గ‌టు ఉష్ణోగ్ర‌త 32 డిగ్రీల వ‌ర‌కూ వుండేది. 2019లో న్యూయార్క్ టైమ్స్ ప‌త్రిక పేర్కొన్న ప్ర‌కారం, ఇది ఆ ఏడు 205 రోజుల అత్యుష్ణ స్థితికి చేరుకుంది. వాతావ‌ర‌ణ మార్పులు, గ్లోబ‌ల్ వార్మింగ్ ప్ర‌భావాలే ఇందుకు కార‌ణం. ఈ శ‌తాబ్దం ముగిసిపోయే లోగా భార‌త జాతీయ రాజ‌ధానిలో ప్ర‌స్తుత‌మున్న 6 నెల‌ల స‌గ‌టు ఉష్ణోగ్ర‌త 32 సెల్సియ‌స్ 8 నెల‌ల‌కు చేరుకుంటుంది. ఈ మార్పులకు చాలా వరకు మనుషుల చర్యలే కారణం.

Shiv Shankar and his son Praveen Kumar start the watering process on their field
PHOTO • Aikantik Bag
Shiv Shankar and his son Praveen Kumar start the watering process on their field
PHOTO • Shalini Singh

శివ‌శంక‌ర్‌, అత‌ని కుమారుడు ప్ర‌వీణ్ కుమార్ త‌మ పొలానికి నీళ్లు పెడుతున్న‌ దృశ్యాలు

నైరుతి ఢిల్లీలోని పాలం; తూర్పున ఉన్న వరద మైదానాల మధ్య ఉష్ణోగ్రతలలో ఇప్పుడు సుమారు 4 డిగ్రీల సెల్సియస్ తేడా ఉందని మిశ్రా తెలిపారు. ``పాలంలో 45 సెల్సియస్ ఉష్ణోగ్ర‌త‌ ఉంటే, వరద స‌మ‌యాల్లో వ‌ర‌ద మైదానాల్లో 40-41 వుంటుంది. ఇంతటి మ‌హాన‌గ‌రంలో వరద మైదానాలు(flood plains) మనకు పెద్ద బహుమతి,`` అన్నారాయ‌న‌.

*****

యమునా కాలుష్యంలో దాదాపు 80 శాతం రాజధాని నుండే వస్తోంద‌ని ఎన్‌జీటీ పేర్కొంది. ఇప్పుడు అదే య‌మున ఢిల్లీలో  లేకుండా పోతే ఏం జ‌రుగుతుంది? కాస్త లాజిక‌ల్‌గా ఆలోచిస్తే ... ఇది బాధిత ప‌క్షాల‌కు విష‌పూరిత స‌మ‌స్య‌ల నుంచి ప‌రిష్కారం చూప‌గ‌ల‌దా? "అస‌లు ఢిల్లీ ఉనికిలో వున్న‌దే య‌మునా న‌ది వ‌ల్ల‌.  ఢిల్లీకి 60 శాతానికి పైగా తాగునీరు ... య‌మునా నదిని సమాంతర కాలువలోకి మళ్లించడం ద్వారానే ల‌భిస్తోంది. రుతుప‌వ‌నాలు న‌దిని సంర‌క్షిస్తాయి. మొద‌టి వ‌ర‌ద కార‌ణంగా య‌మునలో వున్న కాలుష్యం మొత్తం తొల‌గిపోతుంది. రెండవ‌, మూడ‌వ వ‌ర‌ద‌ల వ‌ల్ల న‌గ‌రంలో భూగ‌ర్భ జ‌లాలు పెరుగుతాయి. ఇలా 5 నుంచి 10 సార్లు జ‌రిగితే ... కాలుష్య నివార‌ణ‌కు ఇక ఏ ఏజెన్సీ సేవ‌ల అవ‌స‌రమే లేదు. 2008, 2010, 2013 సంవ‌త్స‌రాల్లో వ‌చ్చిన వ‌ర‌ద‌ల కార‌ణంగా న‌గ‌రానికి ఐదేళ్ల‌పాటు నీటి బెడ‌ద త‌ప్పింది. కానీ ఢిల్లీవాలాల‌లో చాలామంది దీనిని అంగీక‌రించ‌రు`` అన్నారు మిశ్రా.

ఆరోగ్యకరమైన వరద మైదానాలే కీలకం. నీటిని విస్తరించడానికి, దాని వేగాన్ని నియంత్రించ‌డానికి ఇవి స్థలాన్ని అందిస్తాయి. వ‌ర‌ద స‌మ‌యాల్లో అద‌న‌పు నీటిని ఇవి పీల్చుకుని, నెమ్మ‌దిగా భూగ‌ర్భ‌జ‌లాలుగా మారిపోతాయి. న‌దిని దాని అసలు స్వరూపం రావడానికి కూడా ఇది ప్ర‌యోజ‌న‌కారే. 1978లో యమునా నది వ‌ర‌ద తన అధికారిక భద్రతా స్థాయి కంటే 6 అడుగుల ఎత్తుకు ఎగబాకినప్పుడు ఢిల్లీ వ‌ణికిపోయింది. పెద్ద‌సంఖ్య‌లో ప్రజలు మరణించారు. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. లక్షలాది మంది మీద దీని ప్ర‌భావం ప‌డింది. ఇక పంట‌ల‌కు, ఇత‌ర నీటి వ్య‌వ‌స్థ‌ల‌కు జ‌రిగిన న‌ష్టం గురించి చెప్ప‌డం క్లిష్ట‌మైన ప‌ని. ఆఖ‌రుసారిగా 2013లో మ‌ళ్లీ ఒక‌సారి య‌మున ప్ర‌మాద‌స్థాయిని దాటింది. వ‌ర్జీనియా యూనివ‌ర్సిటీ నిర్వ‌హ‌ణ‌లో వున్న‌ `న్యూఢిల్లీ అర్బ‌న్ ఎకాల‌జీ` సంస్థ `య‌మునా న‌ది ప్రాజెక్టు`ను నిర్వ‌హిస్తోంది. ఈ ప్రాజెక్టు పేర్కొన్న‌ ప్ర‌కారం, వ‌ర‌ద మైదానాల్లో అనూహ్య స్థాయిలో అక్ర‌మ క‌ట్ట‌డాలు వెలిశాయి. ఇవ‌న్నీ అనేక విప‌రిణామాల‌కు దారితీస్తాయి. “వ‌ర‌ద స్థాయి వంద సంవ‌త్స‌రాల క‌నిష్టానికి చేరితే , క‌ట్ట‌లు కొట్టుకుపోతాయి;  లోతట్టు ప్రాంతాలలో నిర్మించిన నిర్మాణాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌తో పాటు తూర్పు ఢిల్లీ మొత్తాన్నీ యమునా, నీటితో ముంచెత్తుతుంది.”

Shiv Shankar explaining the changes in his farmland (right) he has witnessed over the years
PHOTO • Aikantik Bag
Shiv Shankar explaining the changes in his farmland (right) he has witnessed over the years
PHOTO • Aikantik Bag

తను సాగు చేసే భూమిలో ఏళ్ల తరబడి జరుగుతున్న మార్పులను వివరిస్తున్న శివశంకర్(కుడి)

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఇటువంటి కాంక్రీట్ నిర్మాణాలను రైతులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. "ఇది మా జీవితాల మీద పెనుప్ర‌భావాన్ని చూపిస్తుంది. ప్ర‌తి భ‌వ‌నానికీ పార్కింగ్ కోసం బేస్‌మెంట్ వుంటుంది. అక్క‌డ వాళ్లు క‌ల‌ప కోసం ఫాన్సీ మొక్క‌లు నాటుతారు. వాటికి బ‌దులు వారు మామిడి, జామ‌, దానిమ్మ‌, బొప్పాయి వంటి మొక్క‌ల్ని నాటితే క‌నీసం అవి తిన‌డానికైనా ప‌నికొస్తాయి. అలాగే ప‌క్షుల‌కు, పశువులకు కూడా ఆహారభ‌ద్ర‌త ఏర్ప‌డుతుంది" అన్నారు శివ‌కుమార్‌.

"అధికారుల లెక్క‌ల ప్ర‌కారం 1993 నుంచి ఇప్ప‌టిదాకా య‌మునా న‌దిని ప‌రిశుభ్రం చేయ‌డానికి 3,100 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుపెట్టారు. ఏం, ఇప్పుడు య‌మున శుభ్రంగా లేదా?" అని వెక్కిరింపు ధోర‌ణిలో అన్నారు బ‌ల్‌జీత్ సింగ్‌.

ఢిల్లీలో ఇప్పుడు జ‌రుగుతున్న‌దంతా త‌ప్పుడు తంతే. న‌గ‌రంలో ఎక్క‌డ అంగుళం ఖాళీస్థ‌లం దొరికితే అక్క‌డ కాంక్రీట్ నిర్మాణాలు చేస్తున్నారు. వీటిపై ఎవ‌రి నియంత్ర‌ణా లేదు. గొప్పవైన య‌మునా న‌ది వ‌ర‌ద‌ప్రాంతాలను విష‌పూరితం చేస్తున్నారు. భూమిలో కొత్తకొత్త విత్త‌నాల‌ను నాట‌డం ద్వారా ఊహించ‌లేని మార్పులు సంభ‌విస్తున్నాయి. నూత‌న‌ సాంకేతిక ఉప‌క‌ర‌ణాలు, వాటి వినియోగం ద్వారా వినియోగ‌దారుల‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల‌పై స్ప‌ష్ట‌త లేదు. ఈ చ‌ర్య‌ల‌న్నీ ప్ర‌కృతి స‌మ‌తుల్య‌త‌ను నాశ‌నం చేయ‌డానికే. ఈ కార‌ణాల వ‌ల్లే రుతుప‌వ‌నాల స‌మ‌యాలు అస్థిరంగా మారిపోతున్నాయి. వాయుకాలుష్యం పెనుతీవ్రంగా పెరిగిపోతోంది. ఇదంతా ఘోర‌మైన త‌ప్పుల పరంపర.

శంక‌ర్‌, ఆయ‌న తోటి రైతులు ఈ దుష్ప‌రిణామాల‌పై ఇంకా స్పందించారు. "మీరు ఎన్నెన్ని రోడ్లు వేశారు? కాంక్రీట్ నిర్మాణాలు ఎన్ని పెరిగితే అంత వేడి భూమిని ఆక్ర‌మిస్తుంది. ఆఖ‌రికి కొండ‌లు, ప‌ర్వ‌తాలు కూడా వ‌ర్షాల ద్వారా ఉత్తేజితమవుతాయి. కాంక్రీట్‌తో నిర్మించే మీ భ‌వ‌నాలు క‌నీసం ఊపిరి పీల్చుకోవ‌డానికి ప‌నికొస్తాయా? అవి వ‌ర్షాల‌ను భూమిలోకి ఒంపుకోగ‌ల‌వా? వ‌ర్షాలే లేకుంటే అస‌లు మీరేం తింటారు?"

వాతావరణ మార్పుల గురించి ప్రజల అనుభవాలను వారి గొంతులతోనే పదిలపరచాలని PARI దేశవ్యాపిత వాతావరణ మార్పులపై రిపోర్టింగ్ ప్రాజెక్టును UNDP సహకారంతో చేపట్టింది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే [email protected] కి ఈమెయిల్ చేసి అందులో [email protected] కి కాపీ చేయండి.

అనువాదం: సురేష్ వెలుగూరి

Reporter : Shalini Singh

Shalini Singh is a founding trustee of the CounterMedia Trust that publishes PARI. A journalist based in Delhi, she writes on environment, gender and culture, and was a Nieman fellow for journalism at Harvard University, 2017-2018.

Other stories by Shalini Singh

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Series Editors : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : Suresh Veluguri

Suresh Veluguri is one of the first generation Technical Writers in India. A senior journalist by profession. He runs VMRG international, an organisation that offers language services.

Other stories by Suresh Veluguri