పూన‌మ్ ఎనిమిదేళ్ల వ‌య‌సున్న త‌న రెండ‌వ కుమార్తె రాణి జుట్టును రెండు పాయ‌లుగా విడ‌దీసి, దానికి నూనె ప‌ట్టించింది. ఇక జుట్టును గ‌ట్టిగా బిగించి, ర‌బ్బ‌ర్‌బాండ్ చుట్టేలోపే ఆ అమ్మాయి, బ‌య‌ట స్నేహితులు, తోబుట్టువుల‌తో ఆడుకోవడానికి బయటకు పరిగెత్తింది. “ దోస్త్ సబ్ కె అబితాయి యే షబ్ సాంజ్ హొయితే ఘర్ సా భైగ్ జై చాయ్ ఖేలా లేల్ (ఆమె స్నేహితులు రాగానే, అందరూ సాయంత్రాలు బయటకు వెళ్లి ఆడుకుంటారు)”, అంటూ వంటచేయడానికి సిద్ధపడింది పూన‌మ్ దేవి. ఎనిమిదేళ్ల రాణి ఆమె రెండవ కూతురు.

పూన‌మ్‌కి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. కానీ ఆ న‌లుగురిలో మ‌గ‌పిల్లాడికి త‌ప్ప‌, ఆడ‌పిల్ల‌లెవ‌రికీ జ‌న‌న ధృవీక‌ర‌ణ ప‌త్రాల్లేవు. “ హమ్రా లగ్ మీ ఇత్తే పాయ్ రహితాయ్  తా బన్వాయే లేతియే సబికే (నా ద‌గ్గ‌ర డ‌బ్బులుండివుంటే నా ముగ్గురు ఆడ‌పిల్ల‌ల‌కు కూడా ఈ ప‌త్రాల్ని తీసుకునివుండేదాన్ని)”, అని చెప్పిందామె.

గ్రామీణ బీహార్ ప్రాంతంలో సాధార‌ణంగా క‌నిపించే వెదురు ఫెన్సింగ్‌తో కూడిన‌ ఇళ్ల లాంటిదే పూన‌మ్ క‌చ్చా ఇల్లు కూడా. మ‌ధుబ‌ని జిల్లా బెనిప‌ట్టి బ్లాక్ లోని ఎక్‌తారా అనే గ్రామంలో నివ‌సిస్తోంది పూన‌మ్ కుటుంబం. ఆమె భ‌ర్త మ‌నోజ్ (38) దిన‌కూలీగా ప‌నిచేస్తూ నెల‌కు 6000 రూపాయ‌ల దాకా సంపాదిస్తుంటాడు.

“నా వ‌య‌సిప్పుడు పాతికేళ్ల‌కు పైనే వుంటుంది. నా పెళ్లి ఎప్పుడ‌యిందో కూడా నాకు జ్ఞాప‌కం లేదు. నా ఆధార్ కార్డు ఎప్పుడూ మా ఆయ‌న‌తోనే వుంటుంది. కాబ‌ట్టి నా స‌రైన వ‌య‌సు చెప్ప‌లేను`` అని చెప్పింది పూన‌మ్‌. (ఈ క‌థ‌నం లోని పేర్ల‌న్నిటినీ వ్య‌క్తిగత గోప్య‌త దృష్ట్యా మార్చ‌డం జ‌రిగింది). ఆమె వ‌య‌సిప్పుడు పాతికేళ్లు కాబ‌ట్టి  వివాహ‌మ‌య్యే స‌మ‌యానికి ఆమెకు 14 ఏళ్ల వ‌య‌సుండి వుండొచ్చు.

పూన‌మ్ పిల్ల‌లంద‌రూ ఇంట్లోనే పుట్టారు. “ప్రతిసారి ఆ స‌మ‌యంలో దాయి(మంత్ర‌సాని) సాయం చేసింది. ప‌రిస్థితి బాగా తీవ్ర‌మైనది అనిపిస్తేనే మేము ఆసుప‌త్రికి వెళ‌తాం”, అని మ‌నోజ్ అత్త శాంతిదేవి (57) చెప్పింది. పూన‌మ్ నివ‌సించే మొహ‌ల్లాకు స‌మీపం లోనే శాంతిదేవి ఇల్లు కూడా వుంది. ఆమె పూన‌మ్‌ను సొంత కోడ‌లిలాగా చూసుకుంటుంటుంది.

PHOTO • Jigyasa Mishra

పూన‌మ్‌కి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. కానీ ఆ న‌లుగురిలో చిన్న‌వాడైన మ‌గ‌పిల్లాడికి త‌ప్ప‌, ఆడ‌పిల్ల‌లెవ‌రికీ జ‌న‌న ధృవీక‌ర‌ణ ప‌త్రాల్లేవు

“మాలో చాలామందికి లాగే పూన‌మ్‌కి కూడా జ‌న‌న ధృవీక‌ర‌ణ ప‌త్రం కోసం ఎలా ప్ర‌య‌త్నించాలో తెలీదు. ఈ పత్రం కావాలంటే ఒక‌రు జిల్లా ఆసుప‌త్రికి వెళ్లాలి. అక్క‌డ కొంత డ‌బ్బు చెల్లించాలి, కానీ అదెంత మొత్తమో నాకు తెలీదు”, అని వివ‌రించింది శాంతిదేవి.

జ‌న‌న ధృవీక‌ర‌ణ ప‌త్రానికి డబ్బు క‌ట్టాలా?

తఖ్ఖన్ కి (ఖచ్చితంగా). ఎందుకంటే డ‌బ్బులివ్వ‌కుండా వాళ్లు అక్కడ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌రు. మరెక్కడైనా వారు ఇస్తారా?”. వారు అంటే, అక్క‌డ ప‌నిచేసే ఆశా కార్య‌క‌ర్త‌లు (ధృవీకృత సామాజిక ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు), ఆసుపత్రి సిబ్బంది. పాయ్ లాయ్ చ్చాయి, ఓహి దువారే నై బంబై చియాయి ( అంద‌రూ డ‌బ్బుల‌డిగేవాళ్లే. వారివ‌ల్లే మేము మా ఆడ‌పిల్ల‌ల‌కు జ‌న‌న ధృవీక‌ర‌ణ ప‌త్రాలు పొంద‌లేక‌పోతున్నాం),” అని చెప్పింది శాంతి.

పూన‌మ్‌, శాంతిదేవిల‌తో స‌హా అక్క‌డి మొహ‌ల్లా ల‌లో వుండేవారంతా మైథిలి భాష‌లోనే మాట్లాడుకుంటారు. దేశ‌వ్యాప్తంగా మైథిలి భాష మాట్లాడేవారు 13 ల‌క్ష‌ల మంది దాకా వుండొచ్చు. ప్ర‌థానంగా బీహార్ లోని మ‌ధుబ‌ని, ద‌ర్భంగా, స‌హ్ర‌స‌ జిల్లాల్లో మైథిలి మాట్లాడేవారి సంఖ్య ఎక్కువ‌. మ‌న పొరుగుదేశం నేపాల్‌లో మైథిలి రెండ‌వ అధికార భాష‌గా వినియోగంలో వుంది.

ఇక్క‌డొక ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఏక్‌తారా లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) పూనమ్ ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలోనే వుంది.  కానీ, స్థానికులు మాత్రం అదెప్పుడూ మూసేవుంటుంద‌ని చెప్తారు. “కాంపౌండ‌ర్ వారానికోసారి ఇలా వ‌చ్చి కేంద్రం త‌లుపులు తెరిచి, అలా వెళ్లిపోతుంటాడు. ఇక డాక్ట‌ర్ రావ‌డ‌మ‌నేది చాలా అరుదు. కొన్ని సంద‌ర్భాల్లో మేము ఆయనను కొన్ని నెల‌ల పాటు చూడ‌నేలేదు”, అని పూన‌మ్ పొరుగింట్లో నివ‌సించే రాజ్‌ల‌క్ష్మి మ‌హ్తో (50) అన్నారు. “మా గ్రామానికి స‌మీపంలోని ఒక తండాలో నివ‌సించే దులార్ చంద్ర భార్య దాయి గా పనిచేస్తుంది. మేము ప్ర‌స‌వాల కోసం ఆమెనే పిలిపించుకుంటుంటాం. ఆమె చాలా న‌మ్మ‌ద‌గిన మ‌హిళ‌”, అని కూడా చెప్పిందామె.

PHOTO • Jigyasa Mishra

పూనమ్ ఇంటి వద్దనున్న PHC, ఇది ఎక్కువగా మూసివేసే ఉంటుంది

రీసెర్చ్ రివ్యూ ఇంటర్నేషనల్ జర్నల్ - 2019లో ప్ర‌చురిత‌మైన‌ నివేదిక ప్ర‌కారం - “నీతి ఆయోగ్ గ‌ణాంకాల‌ను గ‌మ‌నిస్తే, భారతదేశంలో 6 లక్షల మంది వైద్యులు, 20 లక్షల మంది నర్సులు; ఇంకా 2 లక్షల మంది డెంటల్ సర్జన్ల కొరత ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్క‌ల మేర‌కు భార‌త్‌లో రోగుల నిష్ప‌త్తికి త‌గిన సంఖ్య‌లో వైద్యులు లేరు. ఈ నిష్పత్తి 1:1,000గా నివేదిక పేర్కొంటున్న‌ప్ప‌టికీ, గ్రామీణ భారతావ‌నిలో ఇది 1:11,082; బీహార్ వంటి కొన్ని రాష్ట్రాల్లో 1:28,391 కంటే తక్కువగా వుంది. ఇక ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఇది 1:19,962గా ఉంది ”

భార‌త్‌లో ప్ర‌భుత్వ గుర్తింపు పొందిన (అలోప‌తి) 1.14  మిలియన్ల వైద్యుల్లో సుమారు 80% మంది, దేశ జనాభా లోని కేవలం 31% మంది మాత్రమే నివ‌సిస్తున్న‌ నగరాల్లోనే పనిచేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లోని PHCలు, జిల్లా ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో ఈ ప‌రిస్థితి ఇంకా ఘోరంగా వుంది. వీటిలో క‌నీస మాత్రపు మౌలిక స‌దుపాయాల్లేవు. పూన‌మ్ ఇంటికి అతిస‌మీపంలో వున్న పిహెచ్‌సిలో కూడా ఇదే ప‌రిస్థితి.

మేము పూన‌మ్ ఇంటి ద‌లాన్ (ఇంటి వ‌సారాకీ, వ‌రండాకీ మ‌ధ్య‌నున్న కొద్దిపాటి స్థ‌లం)లో నిల‌బ‌డి మాట్లాడుకుంటున్నాం. బీహార్ ప్రాంతంలో పురుషులు, పెద్ద‌లు త‌ర‌చుగా ద‌లాన్ లోనే గ‌డుపుతుంటారు. కొద్దిసేప‌టి తర్వాత, మాకు పొరుగున వుండే మరికొంత మంది మహిళలు కూడా వ‌చ్చి మాతో క‌లిశారు. నిజానికి అంద‌రికీ లోప‌లి గ‌ది లోకి వెళ్లి మాట్లాడుకోవాల‌నుంటుంది కానీ, మేము మాత్రం దలాన్ లోనే మాట్లాడుకుంటుంటాం.

"నా కుమార్తెను ప్ర‌స‌వం కోసం మేము బేనిప‌ట్టి ఆసుప‌త్రికి వెళ్లాం. మొద‌ట మేము ఇంట్లోనే కాన్పు చేయించాల‌నుకున్నాం కానీ, దాయి వూర్లో లేద‌ని తెలిసి బేనిప‌ట్టి ఆసుప‌త్రిని ఎంచుకున్నాం. దాంతో నేను నా కుమారుడు ఆమెను ఆటోరిక్షాలో ఆసుపత్రికి తీసుకెళ్లాం. కాన్పు అయిన తర్వాత, డ్యూటీలో ఉన్న నర్సు మా నుండి 500 రూపాయలు డిమాండ్ చేసింది. అంత‌మొత్తం మేమివ్వ‌లేమ‌ని చెప్పాను. దాంతో ఆమె మాకు జ‌న‌న ధృవీక‌ర‌ణ ప‌త్రం ఇవ్వ‌డంలో చాలా ఇబ్బంది పెట్టింది" అని రాజ్‌ల‌క్ష్మి చెప్పారు.

ఇలాంటి ఉదంతాలు చాలు, ఇక్క‌డి పేద మ‌హిళ‌లు ఎలాంటి దారుణ‌మైన ఆరోగ్య వ్య‌వ‌స్థ‌లో వేద‌న‌తో జీవిస్తున్నారో మ‌నం అర్థం చేసుకోవ‌డానికి.

PHOTO • Jigyasa Mishra

'వాళ్లంద‌రూ మ‌మ్మ‌ల్ని డ‌బ్బుల‌డుగుతారు, మేమివ్వ‌లేం. వారివ‌ల్లే మేము మా ఆడ‌పిల్ల‌ల‌కు జ‌న‌న ధృవీక‌ర‌ణ ప‌త్రాలు పొంద‌లేక‌పోతున్నాం' , అని శాంతిదేవి చెప్పారు

మౌలిక సదుపాయాల కొరత, వైద్యుల గైర్హాజ‌రు, ప్ర‌యివేటు వైద్య సేవలు వారు భరించలేని ఖ‌ర్చులతో కూడుకున్న కార‌ణంగా; నిస్స‌హాయ స్థితిలో ఈ నిరుపేద మ‌హిళ‌లు ఆశా కార్య‌క‌ర్త‌ల మీదే ఆధారప‌డుతున్నారు. ఇదే స‌మ‌యంలో  గ్రామ స్థాయిలో కోవిడ్‌పై పోరాటంలో ఎవరైనా ముందు వరుసలో ఉన్నట్లయితే, వారు ఆశా కార్యకర్త‌లేన‌ని కూడా ఒప్పుకోవాలి.

ఇంటింటికీ తిరుగుతూ ప్ర‌తి ఒక్క‌రినీ ఇంట్లోనే సుర‌క్షితంగా వుంచ‌డంలో ఆశాల‌దే కీల‌క పాత్ర‌. వారు త‌మ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి మ‌రీ వాక్సినేష‌న్‌, మందుల స‌ర‌ఫ‌రా; గ‌ర్భిణుల‌కు ప్ర‌స‌వానికి ముందు, ఆ త‌రువాత కూడా మంచి చికిత్స‌ను అందించ‌డం వంటి వివిధ కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకుంటున్నారు.

స్థానికురాలైన ఒక న‌ర్సు (ఎఎన్ఎం), ఆశా కార్య‌క‌ర్త‌లు, అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌లపై కొద్దిపాటి అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తున్నా; వార‌డుగుతున్న‌ది చిన్న‌చిన్న మొత్తాలే అయినా, వాటిని కూడా ఇక్క‌డి పేద మ‌హిళ‌లు భ‌రించ‌లేని ప‌రిస్థితిలో వున్నారు.

ఇలాంటి విధానాల‌కు అల‌వాటు ప‌డిపోయిన ఆశా కార్య‌క‌ర్త‌లు కూడా తీవ్ర‌మైన ఒత్తిడిలో వున్న‌వారే. దేశ‌వ్యాప్తంగా ప‌ది ల‌క్ష‌ల మందికి పైగా ఆశాలున్నారు. గ్రామీణ జ‌నాభాను ప్ర‌జారోగ్య వ్య‌వ‌స్థ‌తో అనుసంధానించ‌డం వారి ప్ర‌ధాన‌మైన విధి. ఈ విధి నిర్వ‌హ‌ణ‌లో త‌మ‌కెన్నో ఇబ్బందులు, ముప్పులు ఏర్ప‌డ‌తాయ‌ని తెలిసి కూడా వారు త‌మ బాధ్య‌త‌ల్ని నిర్వ‌హిస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా వున్న ఆశాలంద‌రూ గ‌త ఏడాది ఏప్రిల్ నెల నుంచీ రోజూ 25 గృహాల‌ను సంద‌ర్శించాల్సిన బాధ్య‌త‌ను స్వీక‌రించారు. క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన‌వారి వివ‌రాల సేక‌ర‌ణ‌కు నెల‌కు క‌నీసం నాలుగుసార్లు స‌ర్వే బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తారు, అది కూడా చాలా త‌క్కువ ఆరోగ్య ర‌క్ష‌ణతో .

క‌రోనా విప‌త్తు సంభ‌వించ‌డానికి ముందే, 2018లో బీహార్‌లో ఆశాలు త‌మకు మంచి వేత‌నాలివ్వాల‌ని కోరుతూ తీవ్ర స్థాయిలో ఆందోళ‌న‌ల‌ను చేప‌ట్టారు. భార‌త్‌లో అత్య‌ధిక సంఖ్య‌లో ఆశాలున్న రెండ‌వ రాష్ట్రమైన బీహార్‌లో 93,687 మంది ఈ స‌మ్మెలో పాల్గొన్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలిచ్చిన హామీతో దేశ‌వ్యాప్తంగా ఆశాలు త‌మ స‌మ్మెను విర‌మించుకున్నారు. కానీ, ఇప్ప‌టికీ ఆ హామీలు గాలి లోనే వుండిపోయాయి.

ద‌ర్భంగాకు చెందిన మీనాదేవి అనే ఆశా కార్య‌క‌ర్త అడిగింది, 'మా వేత‌నాలెంత అధ్వాన్నంగా వుంటాయో మీకు తెలుసా? కాన్పుల‌కు వ‌చ్చిన‌వారు సంతోషంగా ఇచ్చే డ‌బ్బును కూడా తీసుకోక‌పోతే ఎలా?'

ఈ ఏడాది మార్చి నెల‌లో ASHA సంయుక్త్ సంఘర్ష్ మంచ్ నేతృత్వంలో మ‌రోసారి ఆశా కార్య‌క‌ర్త‌లు గ‌ళ‌మెత్తి ర‌హ‌దార్ల మీదికొచ్చారు. ఈసారి వారికి ఒక నినాదం కూడా తోడయింది. “ ఏక్ హజార్ మే దమ్ నహీ, ఇకీస్ హజార్ మాసిక్ మాండే సే కమ్ నహీ ” [1,000 రూపాయల పెంపు చాల‌దు, ఇంత తక్కువ పెంపుతో సరిపెట్టుకోవద్దు. 21,000 రూపాయల నెలవారీ గౌరవ వేతనం కావాల్సిందే) అని నిన‌దిస్తూ,  ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాల‌ని డిమాండ్‌ చేశారు. ప్ర‌స్తుతం బీహార్‌లో ఆశా కార్య‌క‌ర్త‌ల‌కు క‌నీస వేత‌నం రూ. 3000గా వుంది. ఇది కూడా వారు నిర్వ‌ర్తించే అనేకానేక బాధ్య‌త‌ల‌కు ప్ర‌భుత్వ‌మిచ్చే అస్థిర‌మైన‌ `గౌర‌వ వేత‌నం` మాత్ర‌మే.

వారు స‌మ్మెల‌కు దిగిన‌ప్పుడ‌ల్లా ప్ర‌భుత్వాలు స‌రికొత్త వాగ్దానాలు చేస్తూనేవుంటాయి, కానీ వాటిని అవే మ‌ర్చిపోతుంటాయి. ప్ర‌భుత్వ ఉద్యోగుల స్థాయిలో జీతాలు, పెన్ష‌న్లు, ఇంకా ఏ స‌దుపాయాలూ వారికి లేవు. ఫ‌లితంగా ఆశాల జీవితాలు సంక్లిష్టంగా మారాయి. అంగ‌న్‌వాడీల జీవితాలూ అంతే.

ద‌ర్భంగాకి చెందిన ఆశా కార్య‌క‌ర్త మీనాదేవి మాట్లాడుతూ, “మా వేత‌నాలెంత అధ్వాన్నంగా వుంటాయో మీకు తెలుసా? కాన్పుల‌కు వ‌చ్చిన‌వారు సంతోషంగా ఇచ్చే డ‌బ్బును కూడా తీసుకోక‌పోతే ఎలా? మేమెవ‌రినీ ఇంత‌ మొత్తం డ‌బ్బులివ్వ‌మ‌ని డిమాండ్ చేయం.  వారు సంతోషంతో ఏమిస్తే అదే తీసుకుంటాం. పిల్ల‌లు పుట్టిన‌ప్పుడో, వారికి జ‌న‌న ధృవీక‌ర‌ణ స‌ర్టిఫికెట్లు రూపొందించి ఇచ్చిన‌ప్పుడే వారు మా సేవ‌ల‌కు ప్ర‌శంస‌గా ఇచ్చే డ‌బ్బునే తీసుకుంటాం,” అని చెప్పారు.

ఆమె, మరికొందరి విషయంలో ఇది నిజం కావచ్చు. కానీ, దేశవ్యాప్తంగా ప‌నిచేస్తున్న లక్షలాది మంది ఆశాలు కూడా ఇలాగే వున్నార‌ని కాదు. కానీ ఇక్క‌డ‌ మధుబని, బీహార్‌లోని కొన్ని ఇతర ప్రాంతాలలో దోపిడీకి గుర‌వుతున్న చాలామంది పేద మ‌హిళ‌ల అనుభ‌వాలు, అణ‌చివేత‌, డిమాండ్ల గురించి మాత్ర‌మే వారు గ‌ళ‌మెత్తుతున్నారు.

మనోజ్ తల్లిదండ్రులు కూడా మనోజ్, పూనమ్ తో కలిసి ఒకే ఇంట్లో వుండేవారు. మ‌నోజ్‌, పూన‌మ్‌ల‌కు ముగ్గురు ఆడ‌పిల్ల‌లు - అంజ‌లి (10), రాణి (8), సోనాక్షి (5)లను వారు చూశారు. ఇప్పుడు రెండున్నరేళ్ల వ‌య‌సున్న మ‌గ‌పిల్లాడు రాజాను చూడ‌కుండానే వారు మ‌ర‌ణించారు. ``మా అత్త‌గారికి క్యాన్స‌ర్ వ్యాధి సోకింది. కానీ అది ఏ త‌ర‌హా క్యాన్స‌రో నాకు తెలియ‌దు. నాలుగైదేళ్ల క్రితం ఆమె మ‌ర‌ణించింది. మూడేళ్ల క్రితం మా మామ‌గారు కూడా మ‌ర‌ణించారు. ఆయ‌నెప్పుడూ మనవడు పుట్టాల‌ని తహతహలాడేవాడు. రాజాను కూడా ఆయ‌న చూసివుంటే బావుండేది`` అని చెప్పింది పూన‌మ్‌.

PHOTO • Jigyasa Mishra

నాకు మూడ‌వ కాన్పు జ‌రిగిన‌ప్పుడు ఒక ఆశా కార్య‌క‌ర్త న‌న్ను డ‌బ్బుల‌డిగేదాకా జ‌న‌న ధృవీక‌ర‌ణ ప‌త్రం అనేదొక‌టుంటుంద‌నే విష‌య‌మే నాకు తెలియ‌దు

పూన‌మ్ ఆరో త‌ర‌గ‌తి వ‌ర‌కే చ‌దువుకుంది. ఆమె భ‌ర్త ప‌ద‌వ త‌ర‌గ‌తి పాస‌య్యాడు. ``నాక‌స‌లు జనన పత్ర్ (జ‌న‌న ధృవీక‌ర‌ణ పత్రం) ఒక‌టుంటుంట‌ద‌ని కూడా తెలీదు. నా మూడ‌వ కాన్పు త‌రువాత ఆశా కార్య‌క‌ర్త న‌న్ను డ‌బ్బుల‌డిగింది. అప్ప‌టిదాకా ఇలాంటి ధృవ‌ప‌త్రం వుంటుంద‌నే నాకు తెలీదు. ఆమె న‌న్ను 300 రూపాయ‌ల‌డిగింది. అది ప్ర‌భుత్వ ఫీజు అనుకున్నా. కానీ నా భ‌ర్త చెప్పాడు. జ‌న‌న ధృవీక‌ర‌ణ ప‌త్రం తీసుకోవ‌డానికి ఎలాంటి ఫీజుండ‌ద‌ని, ఆస్ప‌త్రి వాళ్లే ఉచితంగా దానిని అందించాల‌ని`` అని చెప్పింది పూన‌మ్.

కహాలకై అధై సౌ రూప్య దియా తౌహాన్ జనమ్ పత్రి బన్వా దేబ్ (250 రూపాయ‌లిస్తే జ‌న‌న ప‌త్రం ఇస్తాను) అని ఆశా కార్య‌క‌ర్త చెప్పింది. చివ‌రికి 200 రూపాయ‌ల‌కు ఒప్పుకుని నా కొడుక్కి సర్టిఫికెట్ ఇచ్చింది. “750 రూపాయ‌లివ్వ‌లేక తాను త‌న ముగ్గురు ఆడ‌బిడ్డ‌ల‌కు స‌ర్టిఫికెట్లు తీసుకోలేక‌పోయాన‌ని పూన‌మ్ నాకు చెప్పింది.

“స‌ర్టిఫికెట్‌ను మేమే నేరుగా తెచ్చుకోవాలంటే  బెనిప‌ట్టి (బ్లాక్ హెడ్‌క్వార్ట‌ర్స్‌) ఆసుప‌త్రికి వెళ్లాలి. అక్క‌డ కూడా సఫాయివాలి (స్వీప‌ర్‌)కి డ‌బ్బులివ్వాలి. బెనిప‌ట్టి వెళ్లి రావ‌డం కూడా ఖ‌ర్చే. అన్నీ క‌లిపి ఆశా ఇక్క‌డ అడిగిన‌ డ‌బ్బుకు దాదాపు స‌మానంగా ఖ‌ర్చ‌వుతుంది. కాబ‌ట్టి, స‌ర్టిఫికెట్లు లేక‌పోయినా ప‌ర‌వాలేద‌ని నిమ్మ‌కున్నాం”, అని చెప్పింది పూన‌మ్‌. “భ‌విష్య‌త్‌లో అవి అవ‌స‌రం ప‌డొచ్చేమో! కానీ, నా భ‌ర్త సంపాదించేది రోజుకు 200 రూపాయలు మాత్ర‌మే. మా నాలుగు రోజుల సంపాద‌న‌ను ఈ స‌ర్టిఫికెట్ల కోసం ఎందుకివ్వాలి?”,, అని సూటిగా ప్ర‌శ్నించిందామె.

శాంతి తిరిగి మాట్లాడుతూ, “ఒక‌సారి నేను ఈ విష‌యంలో ఆశా కార్య‌క‌ర్త‌తో గొడ‌వ‌ప‌డ్డాను కూడా. డ‌బ్బులివ్వకుండా మీరు స‌ర్టిఫికెట్లివ్వ‌కపోతే మాక‌వి అవ‌స‌ర‌మే లేదు  అని చెప్పాను”, అంది.

పూనమ్ పొరుగువారిలో చాలామంది అప్పటికే గ్రామంలో ప్ర‌తి వారం జ‌రిగే సంత (గ్రామీణ మార్కెట్)కి బయలుదేరుతున్నారు.  చీకటి పడకముందే సంత‌కు చేరాల‌ని వారి భావ‌న‌. “నేను సోనాక్షి తండ్రి (త‌న భ‌ర్త‌) కోసం ఎదురు చూస్తున్నాను. మేము కూడా వెళ్లి కొన్ని కూరగాయలు, లేదా చేపలు కొనుక్కోవచ్చు. నేను మూడు రోజులుగా పిల్ల‌ల‌కు ఒట్టి పప్పు, అన్నం మాత్ర‌మే వండుతున్నాను`` అందామె. సోనాక్షికి రోహు చేప అంటే చాలా ఇష్టం.

త‌మ ఆడ‌బిడ్డ‌ల‌కు వెంట‌నే జ‌న‌న ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ అవ‌స‌రం కన్నా ఇంకా ముఖ్యమైన అవసరాలు ఉన్నాయని వారు అనుకుంటున్నట్లు అనిపించింది.

పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. అట్టడుగున ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? ఐయితే [email protected] కి ఈమెయిల్ చేసి అందులో [email protected]కి కాపీ చేయండి.

జిగ్యసా మిశ్రా ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా ప్రజారోగ్యం మరియు పౌర స్వేచ్ఛపై నివేదికలు అందిస్తారు. ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఈ రిపోర్టేజీలోని విషయాలపై సంపాదకీయ నియంత్రణను అమలు చేయలేదు.

అనువాదం: సురేష్ వెలుగురి

Jigyasa Mishra

Jigyasa Mishra is an independent journalist based in Chitrakoot, Uttar Pradesh.

Other stories by Jigyasa Mishra
Illustration : Jigyasa Mishra

Jigyasa Mishra is an independent journalist based in Chitrakoot, Uttar Pradesh.

Other stories by Jigyasa Mishra

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Series Editor : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : Suresh Veluguri

Suresh Veluguri is one of the first generation Technical Writers in India. A senior journalist by profession. He runs VMRG international, an organisation that offers language services.

Other stories by Suresh Veluguri