“ఇదంతా దేని కోసం జరుగుతోందో నాకు తెలియదు. కానీ, ఇదేదో మోదీకి సంబంధించిన విషయమని మాత్రం అర్థమైంది. నేనిక్కడికి భోజనం కోసం వచ్చాను. మాకింక పస్తులుండాల్సి వస్తుందనే భయమే లేదు” అని పదహారేళ్ల రేఖ చెప్పింది. (ఈ కథనంలోని మిగతా చాలామందిలాగే ఈమె కూడా తన మొదటి పేరును మాత్రమే చెప్పింది.) సింఘూ నిరసన ప్రదేశానికి 8 కిలోమీటర్ల దూరంలో, ఉత్తర ఢిల్లీలోని అలీపూర్‌లో నివసించే రేఖ చెత్తకుప్పల్లో వ్యర్థాలను రీసైకిల్ చేసే పని చేస్తుంది.

హరియాణా-ఢిల్లీ సరిహద్దులో దిగ్బంధంలో ఉన్న సింఘూ వద్ద రేఖ ఉంది. సెప్టెంబర్ 2000లో ప్రభుత్వం ఆమోదించిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్ 26 నుండి ఇక్కడ రైతులు నిరసనలు చేస్తున్నారు. ఈ నిరసన స్థలాలకు రైతులు, వారి మద్దతుదారులే కాకుండా వేలాది మంది ఔత్సాహికులు, రైతులూ గురుద్వారాలూ నిర్వహించే లంగర్‌లలో కడుపారా భోజనం చేయాలనుకునే నిరుపేదలు సైతం వస్తున్నారు. ఈ సామాజిక వంటశాలల్లో పనిచేసే వారు అందరినీ భోజనం చేసివెళ్ళమని ఆహ్వానిస్తారు.

వీరిలో చాలా కుటుంబాలు సమీపంలోని పేవ్‌మెంట్ల మీద, మురికివాడలలో నివసిస్తున్నాయి, వీరు ప్రధానంగా లంగర్‌లలో లభించే ఉచిత భోజనం కోసమే ఈ నిరసన స్థలానికి వస్తారు. ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా రోజంతా భోజనం వడ్డిస్తూనే వుంటారు. అన్నం, పప్పు, పకోడీలు, లడ్డూలు, ఆకుకూర, మొక్కజొన్న రొట్టెలు, పండ్లరసాలు, మంచినీళ్లు.. అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్లు అవసరమైనవారికి ఉచితంగా మందులు, దుప్పట్లు, సబ్బులు, చెప్పులు, బట్టలు, తదితర వస్తువులను కూడా అందజేస్తున్నారు.

ఈ వాలంటీర్లలో హర్‌ప్రీత్ సింగ్ అనే 23 ఏళ్ల యువరైతు కూడా వున్నాడు. ప్రస్తుతం బి.ఎస్సి చదువుతున్న ఈ యువకుడు పంజాబ్, గుర్‌దాస్‌పూర్ జిల్లాలోని ఘుమన్ కలాన్ అనే ఊరికి చెందినవాడు. “ఇవన్నీ తప్పుడు చట్టాలని మేము నమ్ముతున్నాం. ఈ భూములన్నీ మా తాతముత్తాతలు సాగుచేసినవి, సంపాదించినవి. ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని మా భూముల నుంచి తరిమేయాలని చూస్తోంది. మేము ఈ చట్టాలను సమర్థించం. మాకిష్టం లేదని చెబుతుంటే మమ్మల్ని ఎలా బలవంతపెడతారు? ఈ చట్టాలన్నీ రద్దు కావాల్సిందే”  అన్నాడు హర్‌ప్రీత్.

PHOTO • Kanika Gupta

'లాక్‌డౌన్‌ సమయంలో మాకు మంచి ఆహారం కాదు కదా, అసలు తినడానికి తిండే దొరకలేదు` అని చెప్పారు 30 ఏళ్ల మీనా. (ఆకుపచ్చ పల్లూ తలకు చుట్టుకున్న మహిళ). ఉత్తర ఢిల్లీలోని ఆలీపూర్ నివాసి అయిన మీనా బతుకుతెరువు కోసం సింఘూ సరిహద్దుకు 8 కిలోమీటర్ల దూరంలో రోడ్ల మీద బెలూన్లు అమ్ముతుం టారు `మాకిక్కడ లభిస్తున్నంత మంచి ఆహారాన్ని గతంలో మేమెప్పుడూ తినలేదు. రైతులు మాకు రోజంతా కడుపు నిండా అన్నం పెడుతున్నారు. మేము వారం రోజులుగా రోజూ రెండుసార్లు ఇక్కడే భోజనం చేస్తున్నాం` అని చె ప్పారామె

PHOTO • Kanika Gupta

23 ఏళ్ల యువరైతు హర్‌ప్రీత్ సింగ్(నీలి రంగు తలపాగా ధరించిన వ్యక్తి) పంజాబ్, గుర్‌దాస్‌పూర్ జిల్లాలోని ఘుమన్ కలాన్ అనే ఊరికి చెందినవాడు. ప్రస్తుతం బి.ఎస్సి చదువుతున్న హర్‌ప్రీత్ ఉద్యమంలో చేరాలనే పిలుపు రాగానే ఇల్లు వదిలేసి వచ్చాడు. 'ఇవన్నీ తప్పుడు చట్టాలని మేము నమ్ముతున్నాం. ఈ భూములన్నీ మా తాతముత్తాతలు సాగుచేసినవి, సంపాదించినవి. ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని మా భూముల నుంచి తరిమేయాలని చూస్తోంది. మేము ఈ చట్టాలను సమర్థించం. మాకిష్టం లేదని చెబుతుంటే మమ్మల్ని ఎలా బలవంతపెడతారు? ఈ చట్టాలన్నీ రద్దు కావాల్సిందే'  అన్నాడు హర్‌ప్రీత్

PHOTO • Kanika Gupta

`నేనిక్క‌డ నా సోద‌రుల‌తో క‌లిసి భోజ‌నాన్ని వ‌డ్డిస్తున్నాను` అని చెప్పాడు హ‌ర్‌ప్రీత్‌సింగ్ (ఈ చిత్రంలో లేరు). ' ఇది గురువుగారి లంగర్‌. ఇది ఎప్ప‌టికీ ఆగేదికాదు. మాతో స‌హా వేలాదిమంది ఆక‌లిని తీరుస్తున్నాయివి. ఇప్పుడు మాకు సాయం చేయ‌డానికి, విరాళాలివ్వ‌డానికి చాలామంది ముందుకొస్తున్నారు. మా నిర‌స‌న‌ల‌ పట్ల సంఘీభావాన్ని ప్ర‌క‌టిస్తున్నారు. ఈ రైతు వ్య‌తిరేక చ‌ట్టాల్ని ర‌ద్దు చేసేంత‌వ‌ర‌కూ మేమిక్క‌డినుంచి క‌ద‌లం. మా లంగర్లు రోజంతా తెరిచేవుంటాయి. ఇక్క‌డికి వ‌చ్చిన‌వారంతా వారి క‌డుపు నిండా తిని వెళ్ల‌వ‌చ్చు' చెప్పాడ‌త‌డు

PHOTO • Kanika Gupta

వాయువ్య ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల గృహిణి రాజ్‌వంత్ కౌర్ (త‌న స‌హ‌చర కార్య‌క‌ర్త‌తో క‌లిసి ఎర్ర‌టి దుప‌ట్టాను పంచుకుంటున్న మ‌హిళ). ఆమె కుమారుడు రోజూ ఇక్క‌డి సామాజిక వంట‌శాల‌ల్లో ప‌నిచేయ‌డానికి వస్తుంటాడు. ' మా అబ్బాయి రోజూ ఇక్క‌డికొచ్చి ప‌నిచేయ‌డం నాకు ఆస‌క్తిని క‌లిగించింది. ఈ మంచిపని చేయడంలో నేనెందుకు భాగం కాకూడ‌దు అనిపించింది. ఇంత‌కంటే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డానికి నా ద‌గ్గ‌రేమీ లేదు. కాబ‌ట్టి, రోజూ ఇక్కడికొచ్చి ప‌నిచేయాల‌ని నిర్ణ‌యించుకున్నా. ఇక్క‌డికొచ్చే వేలాదిమంది సోదర రైతులకు వండిపెట్ట‌డం నాకు చాలా సంతృప్తినిస్తుంది' అని చెప్పారామె

PHOTO • Kanika Gupta

పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలోని మాలేర్‌కోట్లా అనే నగరానికి చెందిన ఒక ముస్లిమ్‌ల బృందం జర్దా అనే వారి ప్రత్యేక రకమైన అన్నాన్ని వడ్డించారు. నిరసనలు సాగుతున్న మొదటి రోజు నుండి వారు ఇక్కడే ఉన్నారు. మాలేర్‌కోట్లా, ముస్లిమ్ ఫెడరేషన్ ఆఫ్ పంజాబ్‌కు చెందిన తారిక్ మంజూర్ ఆలం, తాము ముస్లిమ్‌లు, సిక్కు సోదరులు శతాబ్దాలుగా ఒకరికొకరు అండగా నిలబడి ఉన్న ప్రాంతానికి చెందినవారమని వివరించారు. రైతుల పొరాటానికి సహాయంచేసేందుకు, వారు తమదైన ప్రత్యేక వంటకాన్ని తమతో తీసుకువచ్చారు. "వారు ఎంతకాలం పోరాడితే, అంతవరకూ మేము వారికి మద్దతు ఇస్తాము. మేము వారి పక్కనే నిలబడి ఉన్నాము." అని తారిక్ చెప్పారు

PHOTO • Kanika Gupta

కరణ్‌వీర్ సింగ్ వయసు 11 ఏళ్లు. అతని తండ్రి సింఘూ సరిహద్దులో బండి మీద చౌమీన్ అమ్ముతుంటారు. “నా స్నేహితులు నన్నిక్కడికి రమ్మని పిలిచారు. మేము గాజర్ కా హల్వా (కారెట్ హల్వా) తినాలనుకున్నాము,” అని జర్దా అనే కుంకుమపువ్వు రంగులో ఉన్న అన్నాన్ని తింటున్న కరణ్‌వీర్ నవ్వుతూ చెప్పాడు

PHOTO • Kanika Gupta

హరియాణాలోని సోనిపట్ జిల్లా కుండ్లి గ్రామానికి చెందిన మున్నీ నిర్మాణ స్థలాల్లో పనిచేస్తుంటారు. ఆహారం కోసం ఆమె తన పిల్లలను ఈ నిరసన మైదానానికి తీసుకువచ్చారు. "నాకు ఏదైనా తినాలనుకునే చిన్న పిల్లలున్నారు. నేను వారిని నాతోపాటు ఇక్కడకు తీసుకువచ్చాను. ఇదంతా దేని గురించో నాకు ఏమీ తెలియదు. వారు పంటల గురించీ, ఉత్పత్తులను గురించీ పోరాడుతున్నారని నేననుకుంటున్నాను." అని ఆమె చెప్పారు

PHOTO • Kanika Gupta

పూజ లాంటి అనేక‌మందికి ఇక్కడ రోజూ భోజ‌నం లభించడంతో పాటు, ఈ నిర‌స‌న ప్ర‌దేశం వారికి ఉపాధిని కూడా కల్పిస్తోంది. హ‌రియాణా రాష్ట్రం కుండ్లీ లోని సెర్సా బ్లాక్‌లో నివసించే పూజ , త‌న భ‌ర్త‌తో క‌లిసి వివిధ కార్యాల‌యాల నుంచి వ్య‌ర్థాల‌ను సేక‌రించి, వాటి అమ్మ‌కం ద్వారా జీవ‌నోపాధిని పొందుతోంది. ఇప్పుడు సింఘూ బార్డర్‌లో ప‌నిచేస్తోంది. ' నేనిక్క‌డ గ‌దులు వూడ‌వ‌డం, చెత్త‌, ఖాళీ సీసాలు, డ‌బ్బాల‌ను తొల‌గించే ప‌నులు చేస్తున్నాను. వీరు మాకు మంచి ఆహారం, నా బిడ్డ‌కు పాలు అందిస్తున్నారు. రైతుల‌ నిర‌స‌న‌లు ప్రారంభ‌మైన తొలిరోజు నుంచే మేమిక్క‌డ ప‌నిచేస్తున్నాం. వీరు మాకందించేదేదైనా మాకిష్టమైన‌దే. కొన్నిసార్లు అరటిపండ్లు, నారింజపళ్లు, మరికొన్నిసార్లు సబ్బులు, దుప్పట్లు కూడా ఇస్తారు. ఇక్క‌డ సేక‌రించిన సీసాలు అమ్మి నేను రోజుకు 200-300 రూపాయ‌లు సంపాదిస్తున్నాను. ఇది నా పిల్లల ఖర్చుల కోసం సాయ‌ప‌డుతోంది. మా గురించి ఇంత శ్ర‌ద్ధ తీసుకుంటున్నందుకు వాహేగురు వారు కోరుకున్న‌వి ఇవ్వాల‌ని ఆశిస్తున్నాను' అని చెప్పింది పూజ‌

PHOTO • Kanika Gupta

హరియాణా రాష్ట్రం కర్నాల్ లోని ఒక ఆశ్రమానికి చెందిన కార్య‌క‌ర్త‌లు రాత్రివేళ‌ల్లో ఇక్కడ ఇలా మంచి రుచిగ‌ల వేడివేడి పాల‌ను సిద్ధం చేస్తారు. ఈ పాల‌లో డ్రైఫ్రూట్స్, నెయ్యి, ఖర్జూరం, కుంకుమపువ్వు, తేనెల‌ను కూడా క‌లుపుతారు. రైతులను రాత్రిపూట వెచ్చగా ఉంచడానికి ఈ పానీయం ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌ర్నాల్‌లోని పాలకేంద్రాల నుంచి రోజూ ఉదయం తాజా పాలు సేకరిస్తారు

PHOTO • Kanika Gupta

పంజాబ్, కపుర్థలా జిల్లాలోని ఒక‌ సంక్షేమ సంస్థకు చెందిన కార్య‌క‌ర్త‌లు ఇక్కడ సాయంత్రం వేళ‌ల్లో స్నాక్‌గా వేడి వేడి పకోడీలను తయారుచేస్తున్నారు. నిరసన మైదానంలో అత్యంత రద్దీగా ఉండే స్టాల్ ఇదే!

PHOTO • Kanika Gupta

అక్షయ్‌కి 8 ఏళ్లు, సాహిల్‌కి 4 ఏళ్లు. 'మా తల్లిదండ్రులు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తారు. మా అమ్మ ఉదయాన్నే ప‌నికి వెళ్లిపోతుంది. కాబట్టి ఆమె మాకు అల్పాహారం త‌యారుచేయ‌లేదు. ఇందువ‌ల్లే మేము ప్రతిరోజూ ఉద‌యం ఇక్కడ అల్పాహారానికి వ‌స్తున్నాం` అని వారు చెప్పారు. `నాకు  స్ప్రైట్ అంటే ఇష్టం. సాహిల్‌కి బిస్కెట్లంటే ఇష్టం` అని చెప్పాడు అక్ష‌య్‌

PHOTO • Kanika Gupta

తొమ్మిదేళ్ల అంచ‌ల్‌, ఏడేళ్ల సాక్షి మంచి స్నేహితులు (నేల‌మీద కూర్చునివున్న పిల్ల‌లు). ' మా పొరుగింటివాళ్లు మమ్మల్ని ఇక్క‌డికి వెళ్ల‌మ‌ని స‌ల‌హా ఇచ్చారు. ఇక్క‌డ మాక్కావాల్సినంత ఆహారం దొరుకుతుంద‌ని వారే చెప్పారు' అన్నారు

PHOTO • Kanika Gupta

రైతులు ఆందోళన చేస్తున్న చోట ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో కేవలం రైతులకు మాత్రమే కాకుండా, ఈ స్టాల్‌ని సందర్శించిన వారెవరికైనా ఉచితంగా మందులు ఇస్తారు. సమీప ప్రాంతాల్లో నివసించే చాలా మంది వ్యక్తులు ఈ శిబిరాలను సందర్శించి, వైద్య‌సేవ‌లు పొందుతున్నారు

PHOTO • Kanika Gupta

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాకు చెందిన 37 ఏళ్ళ కంచన్ ఒక ఫ్యాక్టరీలో పని చేస్తారు. తనకు నెలకి రూ. 6,500 వస్తుందని ఆమె చెప్పారు. "నాకు కొన్ని రోజులుగా జ్వరం ఉంది. చికిత్స కోసం ఇప్పటికే చాలా డబ్బు ఖర్చుపెట్టాను. సింఘూ సరిహద్దులో ఉచితంగా మందులు ఇస్తున్నారని మా ఫ్యాక్టరీలో కొందరి ద్వారా నాకు తెలిసింది. నేను ఇక్కడికి వచ్చి, నాకు కావలసిన మందులు తీసుకున్నాను. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తున్న నా సోదరులకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా స‌రిపోవు. వాళ్ళు మాకు ఆహారం ఇచ్చారు, మందులు ఇచ్చారు, లేక‌పోతే ఇతరత్రా వాటికి వందల రూపాయలు ఖర్చయ్యేది" అన్నారు

PHOTO • Kanika Gupta

పంజాబ్‌లోని తరన్ తారన్‌కు చెందిన 20 ఏళ్ళ సుఖ్‌పాల్ సింగ్ నిర‌స‌న‌కారుల‌కు టూత్‌పేస్టులు, సబ్బులు, బిస్కెట్లను పంపిణీ చేస్తున్నారు. ఢిల్లీ-హరియాణా సరిహద్దులో రోడ్డు దిగ్బంధం కొనసాగుతూ ఉండడంతో, ట్రాక్టర్లు సుదీర్ఘంగా బారులు తీరాయి. అక్క‌డ‌ ఆందోళన చేస్తున్న రైతులకే కాకుండా, సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు కూడా శానిటరీ నేప్‌కిన్ల నుంచి దుప్పట్ల వరకూ, ఆహారం నుంచి మందుల వరకూ, ఇంకా టూత్ బ్ర‌ష్‌లు, సబ్బుల వరకూ... అన్ని రకాల వస్తువులనూ పంపిణీ చేస్తున్నారు

అనువాదం: సురేశ్ వెలుగూరి

Kanika Gupta

Kanika Gupta is a freelance journalist and photographer from New Delhi.

Other stories by Kanika Gupta
Translator : Suresh Veluguri

Suresh Veluguri is one of the first generation Technical Writers in India. A senior journalist by profession. He runs VMRG international, an organisation that offers language services.

Other stories by Suresh Veluguri