“మేము సెక్స్ వర్క్ చేసి సంపాదిస్తాము కాబట్టి మా శరీరాలతో ఏమైనా చేయవచ్చని అనుకుంటారు,” మీరా (30) భర్త అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడంతో 2012లో తన ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకుని ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ నుండి ఢిల్లీకి వచ్చారు. ఆమెలో కోపం, నిస్సత్తువ సమపాళ్లలో రగులుతున్నాయి.

“నా మందులు ఇచ్చేటప్పుడు వాళ్లు ఇలా చేస్తారు” అని అమిత (39) తన మొహంలో అసహ్యాన్ని వెళ్లబుచ్చుతూ చూపించారు. ఆసుపత్రిలోని మగ హెల్పర్లు, వార్డ్ అసిస్టెంట్లు తమ చేతులతో ఆమె ఒంటిని ఎలా తడుముతారో చేసి చూపించారు. ఆ అవమానం సహించలేరానిదైనా చెకప్‌ల కోసం లేదా మందుల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తిరిగి వెళ్తారు.

“మేము ఎచ్. ఐ. వి. పరీక్షలు చేయించుకోవడానికి వెళ్లినప్పుడు, ఒకవేళ మేము సెక్స్ వర్కర్లమని వాళ్లకు తెలిస్తే చాలు, సాయం చేస్తామని ఆశ చూపుతారు. ‘ వెనుక వైపు ద్వారం నుండి వచ్చేసేయి, నీ మందులు తెచ్చిస్తాను ’ అని అంటారు. ఆ అవకాశాన్ని వాడుకుని మమ్మల్ని అసభ్యంగా తాకుతారు.” ఇలా కుసుమ్ (45) మాట్లాడుతున్నప్పుడు పలు మహిళలు తమకూ ఇలా జరిగిందని అంగీకరిస్తూ తలలూపారు. అఖిల భారతీయ సెక్స్ వర్కర్ల నెట్‌వర్క్ (AINSW) ప్రెసిడెంట్‌గా కుసుమ్ గతంలో పని చేశారు. ఈ ఫెడరేషన్‌లో భాగంగా 16 రాష్ట్రాలకు చెందిన సామూహిక సేవా సంస్థలు 4.5 లక్షల సెక్స్ వర్కర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.

ఢిల్లీ వాయువ్య జిల్లాలోని రోహిణి అనే ప్రాంతంలోని ఒక సామూహిక ఆశ్రయ శిబిరం వద్ద PARI సిబ్బంది కొందరు సెక్స్ వర్కర్లను కలిసినప్పుడు, వాళ్లలో దాదాపు అందరికీ కొవిడ్ మహమ్మారి వల్ల పని దొరకడం లేదని చెప్పారు. చలికాలంలో ఆ రోజు మధ్యాహ్నం పూట వారంతా వెచ్చదనం కోసం ఒకరికొకరు దగ్గరగా కూర్చుని తాము ఇంట్లో వండుకుని స్టీల్ డబ్బాలలో తెచ్చుకున్న ఆహారాన్ని పంచుకుని భోంచేస్తున్నారు. ఆ భోజనంలో కూరగాయల కూర, దాల్ (పప్పు), రోటీ (రొట్టె) మాత్రమే తినగలిగే దుస్థితిలో ఉన్నారు.

Sex workers sharing a meal at a community shelter in Delhi's North West district. Many have been out of work due to the pandemic
PHOTO • Shalini Singh

ఢిల్లీ వాయువ్య జిల్లాలో ఒక సామూహిక ఆశ్రయ శిబిరం వద్ద సెక్స్ వర్కర్లు కలిసి భోంచేస్తున్నారు. కొవిడ్ మహమ్మారి వల్ల చాలా మందికి పని దొరకడం లేదు

ఒంటరిగా ఉండే సెక్స్ వర్కర్లకు వైద్య సేవలను పొందడం మరింత కష్టతరంగా ఉంటుందని మీరా చెప్పారు.

“ఈ మగవాళ్లు మధ్యాహ్నం రెండింటి తర్వాత ఆసుపత్రికి తిరిగి రమ్మని అంటారు. ‘నీ పని నేను చేసి పెడతాను’ అని అంటారు. అయితే అది ఫ్రీగా జరగదు. కేవలం మందుల కోసం, వార్డ్ బాయ్స్‌లను డాక్టర్లుగా పొరబడి వారితో కూడా సెక్స్ చేయాల్సి వచ్చింది . కొన్నిసార్లు మాకు వేరే దారేదీ ఉండదు, తప్పక రాజీ పడాల్సి ఉంటుంది. పెద్ద క్యూలో మేము నిలబడలేం. అంత సమయం మా దగ్గర ఉండదు, అదీ కాక కస్టమర్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్లవలసి ఉంటుంది కాబట్టి అస్సలు సమయం దొరకదు. చికిత్స కోసం వేచి ఉంటే ఆకలితో చనిపోవాలి,” అని మీరా చెప్పడం కొనసాగారు. ఆమె కళ్లలో కోపం, గొంతులో వెటకారం తెలుస్తున్నాయి. “నేనేమైనా గొంతెత్తి మాట్లాడితే, నేను ఒక సెక్స్ వర్కర్‌ని అని నా మీద వివక్ష చూపుతారు. దాంతో ఉన్న దారులు కూడా మూసుకుపోతాయి.”

ఆ ప్రాంతంలో ఉన్న రెండు ప్రభుత్వ ఆసుపత్రులు, ఆ చుట్టుపక్కల ఉండే సెక్స్ వర్కర్ల కోసమని ప్రతి రోజు మధ్యాహ్నం 12:30 నుండి 1:30 వరకు, అంటే ఒక గంట సేపు సమయాన్ని కేటాయించాయి. ఎన్జీవో కార్యకర్తల అభ్యర్థనల మేరకు ఈ రెండు ఆసుపత్రులు ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఈ సమయాన్ని సెక్స్ వర్కర్లు ఎచ్. ఐ. వి మరియు ఇతర లైంగికంగా సంక్రమించే వ్యాధుల (ఎస్. టి. ఐ.) పరీక్షలు చేయించుకోవడానికి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది.

“సెక్స్ వర్కర్లు సాధారణ ప్రజలతో పాటు ఎక్కువ సేపు క్యూలో నించోలేరు ఎందుకంటే క్యూ చాలా పొడవుగా ఉంటుంది, వాళ్లు పరీక్షలు చేయించుకుని చికిత్స పొందడానికి చాలా సమయం పడుతుంది” అని రజిని తివారీ చెప్పారు. ఢిల్లీకి చెందిన సవేరా అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో ఆమె పని చేస్తున్నారు. ఈ సంస్థ సెక్స్ వర్కర్ల శ్రేయస్సు కోసం పాటుపడుతోంది. క్యూలో ఉన్నప్పుడు ఒకవేళ ఎవరైనా కస్టమర్ వాళ్లకు కాల్ చేస్తే, క్యూను వదిలేసి వాళ్లు వెళ్లిపోతారని ఆమె చెప్పారు.

ప్రత్యేకంగా కేటాయించిన ఆ గంట సేపటి సమయంలో కూడా ఎలాగోలా ఆసుపత్రికి వెళ్లి రావడం కొన్నిసార్లు కష్టతరంగా ఉంటుందని తివారీ చెప్పారు. వైద్య సేవలను పొందడంలో వారికి ఎదురయ్యే ఆటుపోట్లలో ఇది ప్రారంభం మాత్రమే.

వైద్యులు ఎస్.టి.ఐ. ల కోసం మాత్రమే వైద్యం చేసి మందులు ఇస్తారు. ఎచ్. ఐ. వి మరియు సిఫిలిస్ వ్యాధుల పరీక్షా కిట్లను సవేరా వంటి ఎన్జీవోలు అందజేస్తాయి. వాటికోసం ఢిల్లీ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణా సంస్థ ఆర్థికపరమైన తోడ్పాటును అందిస్తోంది.

A room at the office of an NGO, where a visiting doctor gives sex workers medical advice and information about safe sex practices
PHOTO • Shalini Singh
A room at the office of an NGO, where a visiting doctor gives sex workers medical advice and information about safe sex practices
PHOTO • Shalini Singh

ఒక ఎన్జీవో కార్యాలయంలోని విజిటింగ్ డాక్టర్, సెక్స్ వర్కర్లకు వైద్యపరమైన సలహాలతో పాటు సురక్షితమైన సెక్స్ కోసం పాటించాల్సిన పద్ధతుల గురించిన సమాచారాన్ని అందజేస్తున్నారు

“ఇతరుల లాగానే సెక్స్ వర్కర్లు కూడా జ్వరం, ఛాతీలో నొప్పి, మధుమేహం వంటి ఇతర వ్యాధులకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది,” అని ఆమె చెప్పారు. “వార్డ్ బాయ్స్‌కు వాళ్లు సెక్స్ వర్కర్లని తెలిస్తే వాళ్లపై లైంగికపరమైన చర్యల కోసం ఒత్తిడి చేయడం తరచుగా జరుగుతుంది,” అని సెక్స్ వర్కర్ల స్వీయ అనుభవంతో ఏకీభవిస్తూ చెప్పారు.

ఆసుపత్రి సిబ్బందిగా పని చేసే మగవాళ్లకు మహిళా రోగులలో ఎవరు సెక్స్ వర్కర్లో గుర్తించడం సులువైన పనే.

ఈ మహిళలు వృత్తి రీత్యా కస్టమర్లను కలుసుకునేందుకు సామూహిక ఆశ్రయ శిబిరం వద్ద వేచి ఉంటారు. ఆ శిబిరం ఈ ఆసుపత్రికి కొంత దూరంలోనే ఉంది. కొవిడ్ మహారోగానికి ముందు, ఈ హాస్పిటల్ గేట్ వద్ద నుండి కస్టమర్లు అమితను పికప్ చేసుకుని వెళ్లేవారు. ఇదంతా ఆసుపత్రికి చెందిన మగ సిబ్బంది కళ్ల ముందే జరిగేది.

“ఎచ్. ఐ. వి. టెస్టింగ్ కోసం వాడే ప్రత్యేకమైన కాగితపు స్లిప్‌ను బట్టి, అవి ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్లు సెక్స్ వర్కర్లు అని చివరికి గార్డులు కూడా అర్థం చేసుకున్నారు. మేము పరీక్షలు చేయించుకోవడానికి వెళ్లినప్పుడు మమ్మల్ని గుర్తుపట్టి, తమలో తాము మాట్లాడుకుంటారు. కొన్నిసార్లు, క్యూ అవసరం లేకుండా వైద్యులను సంప్రదించడానికి మా కస్టమర్ల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది,” అని అమిత చెప్పారు. నిజానికి, వైద్యులను సంప్రదించడానికి, చికిత్స పొందడానికి, మందులు తీసుకోవడానికి వేర్వేరు క్యూలు ఉంటాయి.

అమిత భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోవడంతో రెండు దశాబ్దాల క్రితం తన ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెను వెంటబెట్టుకుని పాట్నా నుండి ఢిల్లీకి తరలివచ్చారు. మొదట్లో దినకూలీగా ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవారు. అక్కడ ఆమెకు అందాల్సిన వేతనాలు ఇవ్వకపోవడంతో ఒక స్నేహితురాలు సెక్స్ వర్క్ చేయమని సూచించారు. “ఇలాంటి పని చేయడం నాకస్సలు ఇష్టం లేదు అని ఎన్నో రోజులు ఏడ్చేదానిని. కానీ 2007లో రోజుకు 600 రూపాయల సంపాదన అంటే ఆషామాషీ కాదు - ఒక్కరోజు వేతనంతో 10 రోజుల పాటు తిండి దొరికేది.”

అమిత, మీరాలతో పాటు ఇతర సెక్స్ వర్కర్ల గాధలు వింటే సెక్స్ వర్కర్లు ప్రత్యేకమైన వివక్షకు గురవువుతారని, తద్వారా వైద్య సేవలను పొందడంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుందనీ సులువుగా అర్థం అవుతుంది. ఇందువల్ల, వీరు ఆసుపత్రులలో తాము చేపట్టే వృత్తిని దాచిపెట్టాల్సి వస్తుందని 2014లో ఒక నివేదిక పేర్కొనింది. “మహిళా సెక్స్ వర్కర్లను విమర్శించడం, హీనంగా చూడటం, వారిని అధిక సమయం పాటు వేచి ఉండేలా చేయడం, సరిగ్గా పరీక్షించకపోవడం, వారికి బలవంతంగా ఎచ్. ఐ. వి పరీక్షలు చేయించడం, ప్రైవేటు ఆసుపత్రులలో మితిమీరి ఛార్జీలు బాదడం, వైద్యపరమైన సేవలను, ప్రసూతి సేవలను నిరాకరించడంతో పాటు వారి గోప్యతను అతిక్రమించడం జరుగుతాయి” అని ఆ నివేదిక పేర్కొంది. ఈ నివేదికను జాతీయ సెక్స్ వర్కర్ల నెట్‌వర్క్‌లో భాగమైన సహాయక సంస్థలు, సెక్స్ వర్కర్ల స్వయం సహాయక సంఘాలు సంయుక్తంగా తయారుచేశాయి.


Left: An informative chart for sex workers. Right: At the community shelter, an illustrated handmade poster of their experiences
PHOTO • Shalini Singh
Right: At the community shelter, an illustrated handmade poster of their experiences
PHOTO • Shalini Singh

ఎడమ: సెక్స్ వర్కర్లకు సమాచారాన్ని అందించే ఒక చార్ట్. కుడి: సామూహిక ఆశ్రయ శిబిరంలో ఈ మహిళల అనుభవాలను చిత్రీకరించేందుకు చేత్తో చేసిన ఒక పోస్టర్

నివేదికలో పేర్కొన్న అంశాలనే అమిత తన అనుభవంలోనూ చవిచూసింది. “ఎచ్. ఐ. వి. లాంటి పెద్ద వ్యాధుల చికిత్స కోసమో, గర్భస్రావం కోసమో లేదా స్థానిక వైద్యుల వద్ద విసిగి వేసారితేనే మేము పెద్ద ఆసుపత్రికి వెళ్తాము. మిగితా సమయాల్లో ఝాలా చాప్ (లైసెన్స్ లేని స్థానిక వైద్యులు) వద్దకు వెళ్తాం. మేము దందా (సెక్స్ వర్క్) చేస్తామని వాళ్లకు తెలిస్తే, వాళ్లు కూడా మమ్మల్ని ఏదో ఒకలా దోచుకోవాలని చూస్తారు,” అని ఆమె చెప్పారు.

వాళ్లకు ఎదురయ్యే ఎవరూ తమపై కనీస మర్యాద చూపించరని కుసుమ చెప్పారు. వాళ్ల వృత్తి ఏంటో తెలియగానే, లైంగిక వేధింపులు మొదలవుతాయి. సెక్స్ కావాలి అంటారు, అది కాకపోతే క్షణికమైన లైంగిక సుఖం కావాలి, లేదంటే మమ్మల్ని కించపరిచి అందులో పైశాచిక ఆనందాన్ని పొందాలి. “ బస్ కిసి తరహ్ బాడీ టచ్ కర్నా హై ఉన్కో (ఏదైనా చేసి మా శరీరాలను తాకాలి).”

ఈ వేధింపుల వల్ల, వైద్య సేవలను పొందడానికి సెక్స్ వర్కర్లు మొగ్గు చూపకపోవడంతో వాళ్లకు నచ్చజెప్పాల్సి వస్తుంది అని డాక్టర్ సుమన్ కుమార్ బిశ్వాస్ చెప్పారు. డాక్టర్ బిశ్వాస్,, రోహిణి ప్రాంతానికి చెందిన వారు. ఒక స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన కార్యాలయంలో సెక్స్ వర్కర్లు ఈయనను సంప్రదిస్తారు. ఈయన ఆ మహిళలకు కండోమ్‌లను పంచడంతో పాటు, వైద్య సలహాలు ఇస్తారు.

కొవిడ్-19 మాహారోగం వలన సెక్స్ వర్కర్లపై ఉండే వివక్ష మరింత బలపడింది, దాంతో వారు మరింతగా లైంగిక దోపిడీకి గురవుతున్నారు.

“సెక్స్ వర్కర్లను అంటరాని వారిగా చూస్తారు” అని AINSW ప్రస్తుత ప్రెసిడెంట్ అయిన పుతుల్ సింగ్ చెప్పారు. “రేషన్ షాపుల ముందుండే క్యూలలో మమ్మల్ని అనుమతించరు, ఆధార్ కార్డ్‌లు ఉండాలి అని వేధిస్తారు. మాలో ఒక మహిళ గర్భం దాల్చినప్పుడు అది సంక్లిష్టంగా ప్రమాదకరంగా మారింది. కానీ ఆంబులెన్స్ రావడానికి ఒప్పుకోలేదు. కేవలం కొన్ని కిలోమీటర్ల అదనపు దూరానికి ఐదు వేల కంటే ఎక్కువ డబ్బు కడితేనే వస్తామని బెదిరించారు. ఏదోలా ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినా అక్కడి సిబ్బంది డొంకతిరుగుడు కారణాలు చెప్పి ఆమెకు వైద్యం నిరాకరించారు. ఒక డాక్టరు ఆమెను చూడటానికి ఒప్పుకున్నారు కానీ రోగికి ఆమడదూరంలో ఉండి చూశారు.” ఆ మహిళను ఒక ప్రైవేట్ క్లినిక్‌కు తీసుకెళ్లినప్పటికీ చివరికి ఆమె బిడ్డ చనిపోయిందని సింగ్ చెప్పారు.

****

Pinki was left with a scar after a client-turned-lover tried to slit her throat. She didn't seek medical attention for fear of bringing on a police case.
PHOTO • Shalini Singh
A poster demanding social schemes and government identification documents for sex workers
PHOTO • Shalini Singh

ఎడమ: పింకీ కస్టమర్‌లలో ఒకరు ప్రేమికుడిగా మారి అసూయతో ఆమె గొంతును కోయబోయినప్పుడు ఆమైకు గాయమయ్యింది. పోలీసు కేసు అవుతుందనే భయంతో ఆమె వైద్యులను సంప్రదించలేదు. కుడి: సెక్స్ వర్కర్లకు ప్రభుత్వ గుర్తింపు పత్రాలను సంక్షేమ పథకాలను వర్తింపజేయాల్సిందిగా డిమాండ్లను కలిగి ఉన్న ఒక పోస్టర్

ప్రైవేట్, పబ్లిక్ వైద్య రంగాల మధ్య ఒకదానికి ఎంచుకోమని అడిగితే అది ఈ మహిళలకు క్లిష్టమైన ప్రశ్నే అవుతుంది. “ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే మర్యాద కోల్పోవాల్సిన అవసరం లేకుండా వైద్యులను సంప్రదించవచ్చు,” అని అమిత చెప్పారు. అయితే ఈ ఆసుపత్రులలో ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, ప్రైవేట్ ఆసుపత్రులలో అబార్షన్ చేయించుకోవడానికి కనీసం రూ. 15 వేలు అవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ.

ప్రభుత్వ ఆసుపత్రులతో వచ్చే మరో చిక్కేమిటంటే, ప్రభుత్వ గుర్తింపు పత్రాలు చాలా అవసరం అవుతాయి.

పింకీ (28) తన మొహానికి మెడకు వేసుకున్న మాస్కును తీసి భయంకరమైన ఒక గాయపు గుర్తును చూపించారు. ఆమె కస్టమర్‌లలో ఒకరు ప్రేమికుడిగా మారి అసూయతో ఆమె గొంతును కోయబోయినప్పుడు ఆ గాయం ఏర్పడింది. “మమ్మల్ని లక్షల్లో ప్రశ్నలు అడుగుతారు, మా వివరాలు తెలిసిపోతాయి, మా మీద పోలీసు కేసు అయ్యే అవకాశం కూడా ఉంది. మరో విషయం ఏంటంటే, మాలో చాలా మంది సొంతూళ్లలో మా ఇళ్లను వదిలి వచ్చేటప్పుడు మా రేషన్ కార్డులను గానీ ఇతర పత్రాలను గానీ చాలా సార్లు వెంట తెచ్చుకోము,” అని ఆమె ప్రభుత్వ ఆసుపత్రికి ఎందుకు వెళ్లలేదో వివరిస్తూ చెప్పారు.

సెక్స్ వర్కర్లు “ప్రజా ఆరోగ్యానికి హానికరమైన” వారనే అభిప్రాయం ప్రబలంగా ఉందని ఇండియన్ వుమెన్స్ హెల్త్ ఛార్టర్ 2007 మార్చి లో పేర్కొనింది. ఆ తర్వాత ఒక దశాబ్దంపైగా సమయం గడిచినప్పటికీ, చివరికి రాజధాని నగరంలో కూడా పెద్దగా మార్పులేవీ రాలేదు. కొవిడ్ మహమ్మారి వల్ల సెక్స్ వర్కర్ల జీవనం మరింత దుర్భరంగా మారింది.

2020 అక్టోబరులో జాతీయ మానవ హక్కుల కమీషన్ కొవిడ్-19 సందర్భంలో మహిళల హక్కులపై ఒక సూచన ను జారీ చేసింది. అందులో సెక్స్ వర్కర్ల దైనందిన జీవితం అనూహ్యమైన స్థాయిలో దెబ్బతినిందని పేర్కొనింది. కొవిడ్ వల్ల వారి జీవనోపాధి ప్రభావితమైంది, వారిలో ఎచ్. ఐ. వి. పాజిటివ్ వ్యాధి గల వారు యాంటీ-రెట్రోవైరల్ చికిత్సను పొందలేకపోతున్నారు. అంతే కాక వారిలో చాలా మంది వద్ద ప్రభుత్వ అధికారిక గుర్తింపు పత్రాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు వారికి అందడం లేదు. సెక్స్ వర్కర్లను అసంఘటిత కార్మికులుగా గుర్తించాలనీ, ఇతర రంగాలలోని కార్మికులకు మల్లే వీరికి కూడా సంక్షేమ పథకాలను ప్రయోజనాలను వర్తింపజేయాలని మొదట NHRC సూచించినా, చివరికి ఆ సూచనను తొలగించింది. దానికి బదులుగా సెక్స్ వర్కర్లకు మనవతా దృక్పథంతో చేయూతనందించాలని సూచించింది.

At the NGO office, posters and charts provide information to the women. Condoms are also distributed there
PHOTO • Shalini Singh
At the NGO office, posters and charts provide information to the women. Condoms are also distributed there
PHOTO • Shalini Singh

ఎన్జీవో కార్యాలయంలో ఈ మహిళలకు సమాచారాన్ని అందించే పోస్టర్లు, చార్ట్‌లు ఉన్నాయి. ఇక్కడ కండోమ్‌లను కూడా పంపిణీ చేస్తారు

“కొవిడ్ సమయంలో పరిస్థితి మరింత దిగజారింది. ప్రభుత్వ ఆసుపత్రులలోని సిబ్బంది ‘మీరు వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశం ఉంది కాబట్టి మేము మిమ్మల్ని ముట్టుకోము’ అని సెక్స్ వర్కర్లకు చెప్పారు. అందువల్ల వాళ్లకు మందులను తిరస్కరించారు, పరీక్షలు చేయలేదు,” అని స్నేహ ముఖర్జీ చెప్పారు. ఆమె ఢిల్లీకి చెందిన హ్యూమన్ రైట్స్ లా నెట్‌వర్క్‌లో న్యాయవాదిగా పని చేస్తున్నారు. 2021 మానవ అక్రమ రవాణా బిల్లు డ్రాఫ్ట్ ప్రకారం సెక్స్ వర్కర్లందరూ అక్రమ రవాణా బాధితులుగా పరిగణించబడతారు. ఈ బిల్లు చట్టంగా మారితే సెక్స్ వర్కర్‌గా వృత్తిని కొనసాగించడం మరింత కష్టతరంగా మారుతుందని ముఖరీ అభిప్రాయపడ్డారు. దీని వల్ల, సెక్స్ వర్కర్లు వైద్య సేవలను పొందడం మరింత క్లిష్టంగా మారవచ్చని ఆమె హెచ్చరించారు.

2020కి మునుపు, రోజుకు ఒకరిద్దరు కస్టమర్లు ఉండి, వారు తలా రూ. 200-400 చెల్లిస్తే, సెక్స్ వర్కర్ ఒక నెలకు రూ. 6-8 వేల రూపాయల వరకు సంపాదించగలిగేవారు. మొదటిసారి దేశవ్యాప్తంగా కొవిడ్-19 లాక్‌డౌన్ విధించినప్పటి నుండి, నెలల తరబడి కస్టమర్లు లేకపోవడంతో సెక్స్ వర్కర్లు కూడా ఇతర అసంఘటిత రంగ కార్మికుల లాగానే ఇతరుల దాన ధర్మాల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఆహార పదార్థాలే అరకొరగా ఉన్న పరిస్థితుల్లో మందులు దొరికే ప్రశ్నే లేదు.

“2021 మార్చిలో రేషన్ సరుకులు కూడా ఆగిపోయాయి. సెక్స్ వర్కర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏ పథకాన్నీ ప్రారంభించలేదు,” అని AINSW కో-ఆర్డినేటర్ అమిత్ కుమార్ చెప్పారు. “కొవిడ్ మహమ్మారి మొదలై దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా వాళ్ల వద్దకు కస్టమర్లెవరూ రావట్లేదు. ఆహార కొరతతో పాటు వారి జీవనోపాధిని కోల్పోవడం వల్ల, తాము చేసే వృత్తి తమ కుటుంబ సభ్యులకు తెలియడం వల్ల వాళ్లు ఎంతో మానసిక అనారోగ్యానికి గురవుతున్నారు.”

సెక్స్ వర్కర్ల నెట్‌వర్క్ రూపొందించిన 2014 నివేదిక ప్రకారం భారతదేశంలో 8 లక్షలకు పైగా సెక్స్ వర్కర్లు ఉన్నారు. వారిలో దాదాపు 30 వేల మంది ఢిల్లీలో ఉన్నారని తివారీ అంచనా వేశారు. రాజధానిలోని దాదాపు 30 ఎన్జీవోలు ఒక్కొక్కటి కనీసం వెయ్యి మంది సెక్స్ వర్కర్ల చొప్పున విభజించుకుని వారికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించడంలో సహాయపడుతున్నారు. ఈ మహిళలు తమను తాము దినకూలీలుగా పరిగణిస్తారు. “మేము ఈ పనిని సెక్స్ వర్క్ అనే పేరుతో పిలుస్తాం, వ్యభిచారం అని కాదు. ఏ రోజుకు ఆ రోజు సంపాదిస్తాను, దాంతో నా ఆకలి తీర్చుకుంటాను. నాకంటూ ఒక ఫిక్స్‌డ్ స్పాట్ ఉంది. రోజుకు ఒకరిద్దరు కస్టమర్లు వస్తారు, తలా 200-300 చెల్లిస్తారు,” అని రాణి (34) చెప్పారు. ఈమెది ఉత్తర్ ప్రదేశ్‌లోని బదాయు జిల్లా, ఈమె భర్త చనిపోయారు.

There are nearly 30,000 sex workers in Delhi, and about 30 not-for-profit organisations provide them with information and support
PHOTO • Shalini Singh
PHOTO • Shalini Singh

ఢిల్లీలో దాదాపు 30 వేల మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. దాదాపు 30 స్వచ్ఛంద సేవా సంస్థలు వారికి కావాల్సిన సమాచారాన్ని, మద్దతును అందిస్తున్నాయి

ఈ మహిళల జీవనోపాధి, వాళ్ల జీవితంలో ఒక పార్శ్వం మాత్రమే. “ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సెక్స్ వర్కర్ల జీవితాలను ప్రభావితం చేసే ఇతర అంశాలు ఎన్నో ఉన్నాయి. వీరు ఒంటరిగా బతికే మహిళలు, ఒంటరిగా పిల్లలను పెంచుకుంటోన్న తల్లులు, దళిత మహిళలు, నిరక్షరాస్యులు, వలస వచ్చిన మహిళలు మొదలైన వివిధ వర్గాలకు చెందిన వారు,” అని మంజిమ భట్టాచార్య చెప్పారు. ఈమె ముంబైకి చెందిన సామాజిక కార్యకర్త మరియు స్త్రీవాద రచయిత. గ్లోబలైజేషన్ మరియు సాంకేతికతల వల్ల లైంగిక క్రయవిక్రయాల వ్యాపారంపై ఎలాంటి ప్రభావం పడిందో వివరిస్తూ ఇంటిమేట్ సిటీ అనే పుస్తకాన్ని రాశారు. “చాలా కేసులలో ఖర్చులకు సరిపడా ఆదాయాన్ని సంపాదించుకోవడానికి ఈ మహిళలు పలు రకాల పనులు చేసుకుంటారు: ఇళ్లలో పనిమనిషిగా, భవన నిర్మాణ కార్మికురాలిగా, కర్మాగారాలలో కార్మికురాలిగా మొదలైనవి,” అని ఆమె చెప్పారు.

సెక్స్ వర్క్‌లో కూడా కొన్ని అనిశ్చిత పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. “ఈ పని కోసం మేము వేరే వాళ్ల ఇంటిని వాడుకోవాల్సి వస్తే ఆ వ్యక్తికి కమీషన్ ఇవ్వాలి. కస్టమర్‌ను నేను తీసుకొస్తే నేను నెలకు రూ. 200-300 అద్దె రూపంలో కట్టాలి. కానీ అదే కస్టమర్‌ను ఆ దీదీ ( ఇంటి ఓనర్) తెస్తే, ఫిక్స్‌డ్ రేట్ మొత్తాన్ని నేను ఆమెకు ఇవ్వాలి,” అని రాణి చెప్పారు.

అటువంటి ఒక ఇంటికి ఆమె నన్ను తీసుకెళ్లారు. తాను ఎవరన్న విషయాన్ని మేము రహస్యంగా ఉంచుతామని, తద్వారా ఈ సెక్స్ వర్క్ ఒప్పందాన్ని ఇరకాటంలో పెట్టబోమని నిర్ధారించాల్సిందిగా ఆ ఇంటి యజమాని మమ్మల్ని అడిగారు. మేము నిర్ధారించిన తర్వాతే సెక్స్ వర్క్ కోసం కేటాయించిన గదిని మాకు చూపించారు. అందులో ఫర్నీచర్ పెద్దగా లేదు. ఒక మంచం, అద్దం, భారతీయ దేవతామూర్తుల ఫోటోలు, వేసవి కాలంలో వాడేందుకు గాను ఒక పాత కూలర్ ఉన్నాయి. ఇద్దరు మహిళలు మంచం మీద కూర్చుని తమ మొబైళ్లలో లీనమై ఉన్నారు. బాల్కనీలో పొగ తాగుతోన్న ఇద్దరు మగవాళ్లు తమ చూపు తిప్పుకున్నారు.

తమ శరీరాన్ని ఆర్థిక వనరుగా మార్చే ‘ప్రపంచపు అత్యంత పురాతన వృత్తి’లోని వారికి ఈ వృత్తిని ఎంచుకోవడంలో ఎంతవరకు స్వేచ్ఛ ఉంటుంది అనే ప్రశ్నను లేవనెత్తితే, దానికి సమాధానం ఇవ్వడం మానవ చరిత్ర అంతటా కష్టతరంగా ఉండిందని చెప్పవచ్చు. ఈ వృత్తిని పూర్తి స్వేచ్ఛతో ఎంచుకోవడం జరిగింది అని చెప్పడం కష్టం ఎందుకంటే, ఈ ఎంపికను చెడ్డదిగా అనైతికమైనదిగా పరిగణించడం జరుగుతుంది అని భట్టాచార్య చెప్పారు. “సెక్స్ వర్క్‌ను కావాలనే ఎంచుకున్నాను అని ఏ మహిళయినా చెప్పుకుంటుందా? ఇలాంటి ప్రశ్నే మరో  చోట ఎదురవుతుంది. తమ బాయ్ ఫ్రెండ్‌తోనో లేదా భాగస్వామితోనో తాను సెక్స్‌కు సమ్మతించానని నిక్కచ్చిగా ఒప్పుకోవడానికి అమ్మాయిలు వెనుకాడతారు. ఎందుకంటే అలా ఒప్పుకుంటే తాము ‘చెడ్డ’ అమ్మాయిలమనే లేబుల్ పడుతుంది.”

ఇదిలా ఉండగా, తన పిల్లల ఆహారం, ఇల్లు, స్కూల్ ఫీజులకు, మందులకు ఖర్చు చేయడానికి వాళ్ల అమ్మ డబ్బు ఎలా సంపాదిస్తోందో తన ఎదిగే పిల్లలకు ఎలా చెప్పాలా అని రాణి ఆలోచిస్తున్నారు.

సెక్స్ వర్కర్ల గోప్యతను కాపాడేందుకు గాను వాళ్ల అసలు పేర్లను మార్చడం జరిగింది.

గ్రామీణ భారతదేశంలో యుక్త వయస్సులోని ఆడపిల్లలు మరియు యువ మహిళల మీద దేశవ్యాప్తంగా PARI మరియు  CounterMedia Trust సంయుక్తంగా ఈ రిపోర్టింగ్ ప్రాజెక్ట్‌ను చేపట్టాయి. సాధారణ ప్రజల అనుభవాలను, వారి దృష్టి కోణాలను వెలికితీస్తూ, అణచివేతకు గురైన వర్గాల ప్రజల స్థితిగతులను అన్వేషించడానికి Population Foundation of India సపోర్ట్ చేసిన కార్యక్రమాలలో ఈ ప్రాజెక్ట్ ఒకటి.

ఈ ఆర్టికల్‌ను తిరిగి పబ్లిష్ చేయాలని అనుకుంటున్నారా? అయితే [email protected] అడ్రస్‌కు ఈమెయిల్ పంపండి, cc ఫీల్డ్‌లో [email protected] అడ్రస్‌ను చేర్చండి.

అనువాదం: శ్రీ రఘునాథ్ జోషి

Shalini Singh

Shalini Singh is a founding trustee of the CounterMedia Trust that publishes PARI. A journalist based in Delhi, she writes on environment, gender and culture, and was a Nieman fellow for journalism at Harvard University, 2017-2018.

Other stories by Shalini Singh
Illustration : Priyanka Borar

Priyanka Borar is a new media artist experimenting with technology to discover new forms of meaning and expression. She likes to design experiences for learning and play. As much as she enjoys juggling with interactive media she feels at home with the traditional pen and paper.

Other stories by Priyanka Borar
Translator : Sri Raghunath Joshi

Sri Raghunath Joshi obtained a Masters degree in Engineering but switched careers to pursue his love of Telugu language. Currently he works remotely as Telugu-Language Lead at a Localization firm based in Noida. He can be contacted at [email protected]

Other stories by Sri Raghunath Joshi