"నేను దానిని కర్రతో కొట్టాను, కానీ అది నాపైకి దూకి నా మెడని, చేతులని దాని పంజాతో గీరింది. నేను అడవికి  నాలుగు కిలోమీటర్ల లోపల ఉన్నాను. నా బట్టలు రక్తంతో తడిసిపోయాయి. నేను ఇంటి వరకు నడవడానికి చాలా కష్టపడ్డాను.” ఆ చిరుతపులి దాడి నుండి కోలుకోవడానికి విశాల్‌రామ్ మార్కం ఆసుపత్రిలో తరువాతి రెండు వారాలు గడిపాడు. అయితే తన గేదెలు క్షేమంగా ఉన్నాయని తెలుసుకుని సంతోషించాడు. “చిరుతపులి నా కుక్కలపై కూడా దాడి చేసింది. అవి పారిపోయాయి, ”అని అతను చెప్పాడు.

దాడి 2015లో జరిగింది. ఈ దాడి జరగడానికి ముందు, ఆ తర్వాత కూడా వేటాడే జంతువులను చాలా దగ్గరగా చూశానని మార్కం ఇప్పుడు చెప్పి నవ్వుతున్నాడు. చత్తీస్‌గఢ్‌లోని జబర్రా అడవిలో, అతను తన గేదెలను మేపుతున్నప్పుడు, ఆకలితో ఉన్న చిరుతపులిలను మాత్రమే కాకుండా, పులులు, తోడేళ్ళు, నక్కలు, అడవి కుక్కలు, నక్కలు, అడవి పందులు, అలాగే సాంబార్, చితాల్ జింకలు, ఇంకా శక్తివంతమైన బైసన్‌లను కూడా చూసే అవకాశం ఉంది. వేసవిలో, జంతువులు అడవిలో చిన్న నీటి గుంటల కోసం వెళ్ళినప్పుడు, ఆకలితో ఉన్న మాంసాహారులైన క్రూరమృగాలను ఎదుర్కొనే అవకాశాలు రెట్టింపు అవుతాయి.

“నా గేదెలు వాటంతట అవే అడవిలోకి వెళతాయి. అవి తిరిగి రాకపోయినప్పుడు మాత్రమే నేను వాటి కోసం వెతుకుతాను,” అని మార్కం చెప్పారు. "కొన్నిసార్లు నా పశువులు  తెల్లవారుజామున 4 గంటల వరకు తిరిగి రావు. నేను రాత్రిపూట అడవిలో వాటి కోసం వెతకడానికి డబుల్ [స్ట్రెంగ్త్] టార్చ్‌ని ఉపయోగిస్తాను." చెప్పులు లేకుండా అడవిలోకి వెళ్ళినందుకు చర్మం మీద వచ్చిన మచ్చలను, పొక్కులను మాకు చూపించాడు.

స్వతంతంగా ఉండే అతని  గేదెలు ప్రతిరోజూమేత కోసం ధామ్‌తరి జిల్లాలోని నగ్రి తహసీల్‌ లోని జబర్రా గ్రామం పక్కన ఉన్న అడవిలో  9-10 కిలోమీటర్ల మేర తిరుగుతాయి. వేసవిలో, ఆహారం కోసం అవి రెట్టింపు దూరం ప్రయాణిస్తాయి. “అడవిపై ఇక ఎవరూ ఆధారపడలేరు; పశువులు ఆకలితో కూడా చనిపోవచ్చు, ”అని మార్కం చెప్పారు.

Vishalram Markam's buffaloes in the open area next to his home, waiting to head out into the forest.
PHOTO • Priti David
Markam with the grazing cattle in Jabarra forest
PHOTO • Priti David

ఎడమ: అడవిలోకి వెళ్లేందుకు ఎదురు చూస్తున్న విశాల్‌రామ్ మార్కం గేదెలు. కుడి: జబర్రా అడవిలో మేస్తున్న తన పశువులతో మార్కం

"నేను అవి తినడానికి పాయెరా [ధాన్యం కాడల ఎండిన ఆకులు] కొంటాను, కానీ అవి అడవి చుట్టూ తిరగి అడవి గడ్డిని తినడానికి ఇష్టపడతాయి," అని మార్కం తన మందను గురించి తన పిల్లల గురించి చెప్పినట్లుగానే చెప్పాడు. అందరు తల్లిదండ్రుల మాదిరిగానే, వాటిని వెనక్కు తీసుకురావడానికి అతని దగ్గర కొన్ని ఉపాయాలు ఉన్నాయి - ఉదాహరణకి ఉప్పును నాకడం వాటికి ఇష్టం. దీనివలన అవి సాధారణంగా రాత్రి 8 గంటల కల్లా ఇంటికి వస్తాయి. వీటికి ‘ఇల్లు' అంటే తమ యజమాని ఇటుక, మట్టి కలిపి కట్టుకున్న నివాసానికి ప్రక్కనే ఉన్న పెద్ద కంచె వేసిన ప్రాంగణం.

జబర్రాలోని 117 గృహాలలో ఎక్కువ భాగం గోండ్ ఇంకా కమర్ ఆదివాసీ వర్గాలకు చెందినవి. ఇవి గాక కొందరు యాదవులు (రాష్ట్రంలో వీరిని ఇతర వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్నారు). గోండు ఆదివాసి అయిన మార్కమ్‌కు 5,352 హెక్టార్ల అడవికి సంబంధించిన ప్రతి వివరమూ తెలుసు. అతను దాదాపు 50 సంవత్సరాల తన జీవితమంతా దాని పరిసరాల్లోనే గడిపాడు. "నేను స్థానిక పాఠశాలలో 5 వ తరగతి వరకు చదివాను, ఆ తరవాత ఇక్కడ వ్యవసాయం ప్రారంభించాను," అని అతను చెప్పాడు.

ఛత్తీస్‌గఢ్‌లోని తూర్పు మూలలో ఉన్న ధామ్‌తరి జిల్లాలో 52 శాతం రిజర్వ్‌డ్ మరియు రక్షిత ప్రాంతం, అందులో దాదాపు సగం దట్టమైన అడవులు అని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క 2019 నివేదిక పేర్కొంది. విస్తారమైన సాల్ ఇంకా టేకు చెట్లతో పాటు, సజ్, కోహా, హర్రా, బహేరా, టిన్సా, బీజా, కుంబి, మహువా చెట్లు ఉన్నాయి.

సంవత్సరాలుగా సరిపడా వర్షపాతం లేకపోవడం, పలుచబడిన పచ్చని అడవి పై కప్పు, జంతువులకు మేత భూమిని తగ్గించింది. 90కి పైగా ఉన్న తన మందను ఇప్పుడు 60-70 గేదెలకు తగ్గించానని, వాటిలో 15 దూడలు ఉన్నాయని మార్కం చెప్పాడు. “గేదెలకు అడవిలో ఆహారం తగ్గిపోతోంది. వారు చెట్లను నరికివేయడం మానేస్తే, అది పెరిగే అవకాశం ఉంటుంది , ”అని ఆయన చెప్పాడు. “నేను నా జంతువుల కోసం [2019లో] చారా [గడ్డి మోపు] కొనడానికి 10,000 రూపాయలకు పైగా ఖర్చు చేశాను. ఒక్కో ట్రాక్టర్ లోడ్ ధర 600 రూపాయలు. ఇది రైతుల నుండి సేకరించడానికి నేను 20 సార్లకు పైగానే తిరగవలసి వచ్చింది.”

వేసవిలో, జంతువులు అడవిలో చిన్న నీటి గుంటల వైపు వెళ్లినప్పుడు, ఆకలితో ఉన్న మాంసాహార క్రూరమృగాలను ఎదుర్కొనే అవకాశాలు రెండు, మూడు రెట్లు ఎక్కువగా  ఉంటాయి

వీడియో చూడండి: ‘నేను చనిపోయినప్పుడు మాత్రమే ఈ జంతువులను వదులుతాను’

2006లో అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆగస్ట్ 2019లో జబర్రా గ్రామసభకు అందించబడిన 'సమాజ అటవీ వనరుల హక్కులను' వినియోగించుకోవడం ద్వారా మేత ప్రాంతాన్ని పెంచాలని మార్కం ఆశించవచ్చు. ఈ చట్టం ప్రకారం, ఈ సమాజం సాంప్రదాయంగా రక్షిస్తున్న అటవీ వనరులను, “రక్షించే, పునరుత్పత్తిని పెంచే లేదా సంరక్షించే లేక నిర్వహించే హక్కు”, ఉన్నది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ హక్కులను పొందిన మొదటి గ్రామం జబర్రా.

“ఏ చెట్లను రక్షించాలి లేదా నాటాలి; ఏ జంతువులు మేయడానికి అనుమతించాలి; ఎవరు అడవిలోకి ప్రవేశించగలరు; చిన్న చెరువుల తయారు చేయడం; కోతను అరికట్టే చర్యలు – ఈ నిర్ణయాలన్నీ ఇప్పుడు గ్రామసభ చేతుల్లో ఉంటాయి” అని జబర్రాలో పంచాయతీ (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం లేదా PESA అమలుకు బాధ్యత వహించే జిల్లా సమన్వయకర్త ప్రఖర్ జైన్ చెప్పారు.

చట్టపరమైన నిబంధనలు స్వాగతించదగినవే, ఎందుకంటే చాలామంది బయటి వ్యక్తులు అడవిలోకి వచ్చి హాని కలిగిస్తున్నారని మార్కం చెప్పారు. "మనుష్యులు వచ్చి చేపలను పట్టుకోవడానికి నీటి వనరులలో పురుగుమందులు చల్లడం, పెద్ద జంతువులను పట్టుకోవడానికి విషాన్ని ఉపయోగించడం నేను చూశాను" అని ఆయన చెప్పారు. "వీరు మా వాళ్ళు కాదు."

వచ్చే గ్రామసభ సమావేశంలో తగ్గుతున్న గడ్డి సమస్యను లేవనెత్తుతానని చెప్పారు. "నాకు సమయం లేనందున నేను ఇప్పటివరకు చేయలేకపోయాను. నేను అర్థరాత్రి వరకు గోబర్ [పేడ] సేకరిస్తూనే ఉంటాను, ఇక నేను సమావేశానికి ఎలా హాజరుకాగలను?" అని అడిగాడు.  “అడవుల నరికివేతకు వ్యతిరేకంగా మన ప్రజలు ఏకం కావాలి. అడవిని కాపాడితే మన జీవనోపాధి సురక్షితంగా ఉంటుంది. అడవిని రక్షించే బాధ్యత మన చేతుల్లోనే ఉంది.” అన్నాడు.

అడవి అంచున ఉన్న మార్కం మూడు గదుల పక్కా ఇంటికి ఒక పెద్ద ప్రాంగణం ఉంది, అక్కడ అతను రాత్రిపూట దూడలను కట్టి ఉంచుతాడు. పెద్ద జంతువులు పక్కనే ఉన్న బహిరంగ ప్రదేశంలో స్థిరపడతాయి.

A pile of hay that Markam has bought to feed his buffaloes as there isn't enough grazing ground left in the forest.
PHOTO • Purusottam Thakur
He restrains the calves in his fenced-in courtyard to stop them from straying into the jungle.
PHOTO • Priti David
The 'community forest resources rights' title granted under the Forest Rights Act to Jabarra gram sabha

ఎడమ: అడవిలో తగినంత మేత లేకపోవడంతో మార్కం తన గేదెలను మేపడానికి కొనుగోలు చేసిన ఎండుగడ్డి కుప్ప. కేంద్రం: అతను దూడలను అడవిలోకి వెళ్లకుండా ఆపడానికి కంచె ఉన్న తన ప్రాంగణంలో వాటిని నిలువరిస్తాడు. కుడి: జాబర్రా గ్రామసభకు అటవీ హక్కుల చట్టం కింద 'కమ్యూనిటీ అటవీ వనరుల హక్కులు' మంజూరు చేయబడ్డాయి

ఉదయం 6:30 గంటలైంది, మేము అతనిని కలిసేటప్పటికి సూర్యుడు ఉదయిస్తున్నాడు. శీతాకాలపు రాత్రి అతను అంటించిన చెక్క మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయి. గుర్రుగుర్రుమంటున్న పశువులు, ఆత్రంగా ఉన్న దూడల శబ్దాలు అతని ఇంటి ప్రాంగణం నుండి వస్తున్నాయి. పెరట్లో ఉన్న పెద్ద పాల డబ్బాలు ఎండిపోతున్నాయి - పాలను ధామ్తరి పట్టణంలోని ఒక వ్యాపారికి పంపారు. రోజూ బావుంటే 35-40 లీటర్ల పాలు అమ్మి లీటరుకు 35 రూపాయలు సంపాదిస్తున్నట్లు మార్కం చెప్పారు. పేడ కూడా అమ్ముడుపోతుంది. “ప్రతిరోజు నేను దాదాపు 50-70 [వెదురు] బుట్టల్లో పేడను సేకరిస్తాను. ఈ పేడను మొక్కల నర్సరీలు కొంటాయి. నేను ఒక నెలలో ట్రాక్టర్-ట్రాలీలో పట్టినంత పేడను అమ్మగలిగాను, [ప్రతి బ్యాచ్‌కి] 1,000 రూపాయలు సంపాదించాను, ”అని అతను చెప్పాడు.

అతను మాతో మాట్లాడుతూనే, దూడలను నిలువరించడానికి కంచెకున్న రెండు కడ్డీలకు అడ్డంగా ఒక గట్టి కర్రను అమర్చాడు. మేయడానికి బయలు దేరిన పెద్ద పశువులతో పాటు ఈ చిన్న పశువులు వెళ్లకుండా ఆపడానికి అతను ఇలా చేస్తాడు. "అవి చిన్నవి, నేను వాటిని ఇంటి నుండి చాలా దూరం వెళ్ళనివ్వలేను, అడవిలో  క్రూర జంతువులు వాటిని తేలికగా లాగి తినేయవచ్చు," అని తమను వెళ్లనివ్వకుండా ఆపివేశాడని గొడవ చేస్తున్న దూడల అరుపుల మధ్య తాను కూడా గొంతు పెంచుతూ చెప్పాడు.

పశువులను మేపడమే కాకుండా, మార్కం ఒక ఎకరం పొలంలో వరి సాగు చేస్తున్నాడు. అతను ఒక సంవత్సరంలో దాదాపు 75 కిలోలు పండిస్తాడు, ఇవన్నీ అతను, అతని కుటుంబం వినియోగిస్తారు. "నేను వ్యవసాయం చేసేదాన్ని, నేను 200 రూపాయలకు ఒక ఆడ గేదెను కొన్నాను, అది 10 దూడలకు జన్మనిచ్చింది,” అంటూ అతను పశువుల పెంపకంలో ఎలా అడుగుపెట్టాడో వివరించాడు. జబర్రా జనాభాలో దాదాపు 460 మంది వరి, కుల్తీ , మినప  పప్పుధాన్యాల కోసం చిన్న మోతాడులో భూమిని సాగు చేయడం, ఇప్ప పువ్వులు, తేనె వంటి కలపేతర ఉత్పత్తుల కోసం అడవిని వెతకడంతోపాటు, పశువుల పెంపకంపై కూడా ఆధారపడి ఉన్నారు.

Markam fixes the horizontal bars on the makeshift fence to corral the calves.
PHOTO • Purusottam Thakur
Outside his three-room house in Jabarra village
PHOTO • Priti David

ఎడమవైపు: మార్కం దూడలను పట్టుకోవడానికి తాత్కాలిక కంచెపై అడ్డంగా ఉండే కడ్డీలను అమర్చాడు. కుడి: జబర్రా గ్రామంలో అతని మూడు గదుల ఇంటి వెలుపల

మార్కం తన భార్య కిరణ్ బాయితో నివసిస్తున్నాడు, ఆమె జంతువుల సంరక్షణలో సహాయం చేస్తుంది. అతని ఇద్దరు కొడుకులు చిన్నప్పుడే చనిపోయారు. మిగిలిన ఇద్దరు కూతుళ్ళూ పెళ్ళిచేసుకుని దూరంగా నివసిస్తున్నారు.

మార్చి 2020 నుండి కోవిడ్-19 లాక్‌డౌన్‌ల సమయంలో, ధామ్‌తరిలోని మార్కెట్‌కి గేదెల పాలను డెలివరీ చేయలేక మర్కం నష్టపోయాడు. "తినుబండారాలు, దుకాణాలు మూసివేయబడ్డాయి, కాబట్టి మా పాల పంపిణీ వ్యవస్థ ప్రభావితమైంది," అని ఆయన చెప్పారు. కిరణ్ బాయి మరుగుతున్న పాలు, మీగడను కలియబెట్టడంలో అతనికి సహాయం చేయడంతో అతను నెయ్యి తయారీకి మారాడు, ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

కమర్ ఆదివాసి అయిన కిరణ్ బాయి మార్కం రెండవ భార్య. అతను ఛత్తీస్‌గఢ్‌లోని అతిపెద్ద ఆదివాసీ సమూహం అయిన గోండు. ఆమెను వివాహం చేసుకోవడానికి అతను తమ సమాజానికి మూల్యం చెల్లించవలసి వచ్చింది. "[సమాజం] వెలుపల వివాహం చేసుకున్నందుకు జరిమానాగా నేను దాదాపు 1.5 లక్షల రూపాయలను విందులకు ఖర్చు చేయాల్సి వచ్చింది" అని ఆయన చెప్పారు.

తన పనిని చేపట్టడానికి వారసులెవ్వరూ లేకపోవడంతో, మార్కం తాను చనిపోయాక తన జంతువుల గతి ఏమిటా అని ఆందోళన పడతాడు. “నేను లేనప్పుడు నా జంతువులు అలా తిరుగుతుంటాయి. ఇక నేను చనిపోతే, వాటిని చూసుకోవడానికి ఎవరూ లేరు కాబట్టి వాటిని అలా వదిలెయ్యాలి,” అని అతను చెప్పాడు. “వాటిని చూసుకునే పనిలో నేను ఇరుక్కుపోయాను. నేను చనిపోయిన తర్వాత మాత్రమే వారిని విడిచిపెడతాను.”

22 సెప్టెంబర్ 2020న PARI ప్రచురించిన మారుతున్న వాతావరణ రెక్కలపై కీటకాల యుద్ధం , అనే ఈ వీడియోలో విశాల్‌రామ్ మార్కం వాతావరణ మార్పుల గురించి మాట్లాడడాన్ని చూడండి.

అనువాదం: అపర్ణ తోట

Purusottam Thakur

Purusottam Thakur is a 2015 PARI Fellow. He is a journalist and documentary filmmaker and is working with the Azim Premji Foundation, writing stories for social change.

Other stories by Purusottam Thakur
Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota