మీనాకి ఇక త్వరలోనే పెళ్ళయిపోతుంది. ఎందుకో ఆమె చెప్పింది. కొన్ని నెలల క్రితమే, “నేను ఒక సమస్య అయిపోయాను.” ఆమె పిన్ని కూతురు సోను కూడా, మీనా వంటి ‘సమస్య’ స్థాయికి వచ్చింది. మీనా ‘సమస్య’ గా మారిన కొన్ని వారాలకు సోను కూడా ‘సమస్య’ అయ్యే అర్హత సంపాదించుకుంది. ‘సమస్య’, అంటే తమ వంటి అమ్మాయిలకు రుతుక్రమం మొదలవడం.

మీనాకు 14 ఏళ్ళు, సోను కి 13 ఏళ్ళు. ఇద్దరూ చార్ పాయ్ మీద పక్కపక్కనే కూర్చున్నారు. మాట్లాడేటప్పుడు ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుతున్నారు, కానీ ఎక్కువగా ఇంటి గచ్చు వైపు కళ్ళుదించి చూస్తూ మాట్లాడుతున్నారు. కొత్త మనిషితో వారి శరీరంలోని ప్రస్తుత మార్పు - వారి నెలసరి గురించి మాట్లాడడం వారికి సిగ్గుగా ఉంది. వారి వెనుక ఉన్న గదిలో ఒక ఒంటరి మేకను తాడుతో కట్టి భూమిలోకి దింపిన ఒక చెక్కముక్కకు తాడు రెండో కొసను కట్టారు. ఉత్తరప్రదేశ్ కొరాన్ బ్లాక్ లోని బైతక్వలో అడవి జంతువులు ఆ మేకను తినేస్తాయని భయం. అందుకే దాన్ని ఇంట్లో ఉంచేస్తారు అని చెప్పారు వాళ్ళు. ఆ మేక, ఈ చిన్న ఇంట్లో మిగిలిన వారితో కలిసిపోయి ఉంటుంది.

నెలసరి అంటే సిగ్గు పడవలసిన విషయంగా ఈ అమ్మాయిలు అర్థం చేసుకున్నారు. భయపడాలని కూడా వారి తల్లిదండ్రుల ద్వారా అర్థం చేసుకున్నారు. అమ్మాయిలలో ఋతుచక్రం మొదలవగానే ఆడపిల్లల భద్రత, వారికి పెళ్లికాకుండానే గర్భం వస్తుందేమోనని ఆందోళన వలన ప్రయాగ్ రాజ్(ఇదివరకు అహ్మదాబాద్) వద్దనున్న ఈ కుగ్రామంలో వారి ఆడపిల్లలకు త్వరగా, అంటే 12 ఏళ్లకు కూడా పెళ్లి చేసేస్తారు.

“మా పిల్లలు గర్భం దాల్చేంత పెద్దయ్యాక, వారిని భద్రంగా ఎలా ఉంచగలము?”, అని అడుగుతుంది 27 ఏళ్ళ మీనా తల్లి రాణి. ఈమెకు  కూడా త్వరగా పెళ్ళయిపోయి, 15 ఏళ్లకే తల్లి అయింది. సోను వాళ్ల అమ్మ చంపకి కూడా  27 ఏళ్లే, ఆమెకు కూడా ప్రస్తుతం తన కూతురు వయసులోనే - 13 ఏళ్లకే పెళ్లయిందని  గుర్తుచేసుకుంది. మా చుట్టూ కూర్చున్న ఆరుగురు ఆడవారు, ఆడపిల్లలకు 13-14 ఏళ్లకే పెళ్లి అవడం అనేది  మామూలు అని, అవకపోతేనే ఈ గ్రామంలో వింత అని చెప్పారు. “ హమారా గావ్ ఏక్ దూస్రా జమానా మే రెహతా హై (మా గ్రామం వేరే శకంలో జీవిస్తుంది). మాకు వేరే దారి లేదు, మేము నిస్సహాయులం.” అన్నది రాణి.

బాల్యవివాహాలు ఉత్తరప్రదేశ్ లోని ఉత్తర-మధ్య బెల్ట్ వద్ద, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్ లో రివాజుగా జరుగుతున్నాయి. 2015లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ విమెన్, UNICEF కలిసి చేసిన జిల్లా స్థాయి అధ్యయనం ప్రకారం, “మూడింటిలో రెండో వంతు జిల్లాలలో, యాభై శాతం మంది ఆడవారికి, చట్టబద్దమయిన వివాహ వయసుకు ముందే పెళ్లిళ్లు జరిగుతున్నాయి.”

బాల్యవివాహాల నిషేధ చట్టం, 2006 ప్రకారం అమ్మాయికి 18 ఏళ్ళు, అబ్బాయికి ఇంకా 21 ఏళ్లు దాటని వివాహాన్నినిషేధిస్తుంది. అలాంటి వివాహాన్ని ప్రోత్సహించినందుకు లేదా అనుమతించినందుకు రెండు సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష వేయడమే కాక లక్ష రూపాయిల వరకు జరిమానా ఉంటుంది.

PHOTO • Priti David

మీనా, సోనూలకు నెలసరి అంటే ఏంమ్మితో అర్థమైంది- అది  వారు సిగ్గుపడవలసిన విషయం

“చట్టవిరుద్ధమైన పని చేసి  దొరికి పోవడం అన్న ప్రశ్న ఉండదు,” అన్నది నలభై నాలుగేళ్ల నిర్మలా దేవి, ఆ గ్రామ అంగన్వాడీ టీచర్. “ఎందుకంటే ఈ పిల్లలకు పుట్టిన తేదీ సర్టిఫికెట్ ఉండదు కాబట్టి”.  ఆమె అన్నది నిజమే. నేషనల్ ఫామిలీ హెల్త్ సర్వే(NFHS -4, 2015-16) నివేదిక ప్రకారం, ఉత్తర్ ప్రదేశ్ గ్రామాలలో పుట్టిన 42 శాతం మందికి వారి పుట్టిన వివరాలు నమోదు కాలేదు. ఇక  ప్రయాగరాజ్ జిల్లాలో అయితే ఇంకా ఎక్కువ - 57 శాతం మందికి వారి పుట్టిన వివరాలు నమోదు కాలేదు.

“ఇక్కడ  ఆసుపత్రికి వెళ్లరు”, ఆమె చెప్పింది. “ఇదివరకు, మేము ఒక ఫోన్ చేస్తే 30 కిలోమీటర్ల  దూరంలో ఉన్న  కొరాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్(CHC) నుంచి  మాకు అంబులెన్సు వచ్చేది. కానీ ఇప్పుడు మేము మొబైల్ యాప్ 108 వాడవలసి వస్తోంది. దీనికి 4జి కనెక్టివిటీ ఉండాలి. కానీ మాకు ఇక్కడ నెట్వర్క్ లేదు, అందుకని డెలివరీ కోసం CHCకి వెళ్లలేము”, ఆమె వివరించింది. ఇంకోలా చెప్పాలంటే యాప్ వాడమని చెప్పడం వలన పరిస్థితి మరింత దిగజారింది.

మన దేశంలో ఏడాదికి సోను, మీనాల వంటి పదిహేను లక్షల మంది బాలావధువులు కనిపిస్తున్నప్పుడు, చట్టం మాత్రమే  కుటుంబాలను ఈ రివాజు నుండి కాపాడలేదు. యు.పి లో ఐదుగురిలో ఒకరికి, వారి చట్టబద్దమైన వయసు కన్నా తక్కువ వయసులో పెళ్లిళ్లు జరుగుతున్నాయి.

భగాదేతే హై (తరిమేస్తారు)”, అన్నది 30 ఏళ్ళ సునీత దేవి పటేల్. ఈమె బైతాక్వా ఇంకా చుట్టుపక్కల గ్రామాలలో ఆశ(Accredited Social Health Activist- ASHA) వర్కర్ గా పనిచేస్తుంది. “పిల్లలు పెరిగేవరకు ఆగమని వారిని బతిమాలతాను. అంత చిన్న వయసులో గర్భం దాల్చడం ప్రమాదమని కూడా చెబుతాను. వాళ్ళేమి పట్టించుకోరు, నన్ను వెళ్లిపొమ్మని చెబుతారు. కానీ తర్వాత సారి నేను వెళ్ళేప్పటికి, అంటే ఒక నెల తరవాత లేదా ఆపైన కొన్ని రోజులకు, ఆ అమ్మాయికి పెళ్ళయిపోయుంటుంది.”

కానీ తల్లిదండ్రులకు, వారి కారణాలు వారికి ఉన్నాయి. “ మా ఇంటిలో టాయిలెట్ లేదు.” ఆరోపించింది మీనా తల్లి రాణి. “ ప్రతిసారి వారు 50-100 మీటర్ల  దూరంలో ఉన్న పొలం గట్ల వద్దకు ఆ పని కోసం వెళ్తే, లేదా వారు పశువులను మేపడానికి వెళ్తే, వారికి ఏమైనా చెడు జరగవచ్చని భయపడతాం మేము.” ఆమె యు.పి హత్రాస్ జిల్లా లో 19  ఏళ్ళ  దళిత్ అమ్మాయిపై పై కులపు మగవారు భయంకరంగా జరిపిన లైంగిక హింసను తలచుకుని  వణికిపోయింది. “ హమే( హత్రాస్ కా డర్ హమేషా హై (మాకు హత్రాస్ లో జరిగినటువంటిది ఇక్కడ జరుగుతుందని ఎప్పుడూ భయం ఉంటుంది).”

జిల్లా హెడ్ క్వార్టర్ అయినా కొరాన్ నుండి బైతక్వకి వచ్చే దారి నిర్మానుష్యంగా ఉంటుంది. ఇందులో 30  కిలోమీటర్లు దాకా పొలాలు, చిట్టడవి  ఉంటాయి. ఇందులో ఐదు కిలోమీటర్లు అడవిలోంచి, చిన్న కొండల మధ్య నుండి  సాగే దారి మరీ నిర్మానుష్యంగా ఉంటుంది. స్థానికులు అక్కడ బుల్లెట్లు దింపిన కొన్ని మృతకళేబరాలను చూశామని చెప్పారు. అక్కడ ఒక పోలీస్ చౌకి లేదా కాస్త వెసులుబాటుగా ఉండే రోడ్లు కానీ ఉంటే పరిస్థితి కాస్త నయంగా ఉండొచ్చని స్థానికులు చెప్పారు. వర్షాకాలంలో అయితే బైతక్వ చుట్టూ ఉన్న 30  గ్రామాలలో, కొన్ని సార్లు కొన్ని వారాల వరకు మనుషులు కనిపించరు

PHOTO • Priti David
PHOTO • Priti David

బైతక్వ కుగ్రామం: అక్కడ కూడిన ఆడవారు ఆడపిల్లలకు 13-14 ఏళ్లకే పెళ్లి అవడం అనేది  మామూలు అని, అదేమీ  ప్రత్యేకమైన విషయం కాదనీ చెప్పారు

ఆ కుగ్రామం చుట్టూతా, ఆ గోధుమ రంగు విధ్యాచల  కొండలు కింద, ఒకవైపు కొద్దిగా ముళ్ల  పొదలు పెరిగి మధ్యప్రదేశ్ సరిహద్దుని గుర్తిస్తాయి. సింగల్ తారు వేసిన రోడ్డులో కోల్ ఇళ్లు, పొలాలు - ఇవి ఎక్కువగా OBC కుటుంబాలవి(దళితులకు చిన్న చిన్న భూములు మాత్రమే ఉన్నాయి) దారికి రెండువైపులా ఉంటాయి.

అక్కడున్న 500 షెడ్యూల్డ్ కులాల కుటుంబాలలో(అందులో అందరూ కోల్ వర్గానికి చెందినవారు, 20 మంది వరకు OBC వర్గానికి చెందినవారున్నారు) భయం పెరిగిపోతుంది. “కొన్ని నెలల క్రితమే, మా అమ్మాయిలలో ఒకామె ఊరిలో నడుస్తూ ఉంది. ఇంతలో పై కులానికి చెందిన అబ్బాయిలు కొందరు తమ మోటార్ బైక్ మీద కూర్చోమని బలవంత పెట్టి కూర్చోబెట్టుకున్నారు. ఆమె ఎలానో ఆ బైక్  మీద నుంచి కిందికి దూకేసి ఇంటికి  పారిపోయింది.” రాణి ఆందోళన నిండిన గొంతుతో చెప్పింది.

జూన్ 12, 2021న పధ్నాలుగేళ్ల కోల్ అమ్మాయి తప్పిపోయింది. ఇప్పటిదాకా ఆమె ఆచూకీ తెలియలేదు. ఆమె కుటుంబం FIR ఫైల్ చేశారు గాని అది వారు మాకు చూపించడానికి ఇష్టపడలేదు. వాళ్ళు మాకు వివరాలు చెప్పి పోలీసుల ఆగ్రహానికి గురికాదలచుకోలేదు. కానీ  పోలీసులు ఈ సంఘటన జరిగిన రెండు వారాల తరవాత గాని విచారణకు రాలేదని తెలిసింది.

“మేము ఒక స్థాయికి(షెడ్యూల్డ్ కులానికి) చెందిన పేదవారిమి. మీరు చెప్పండి. పోలీసులు మమ్మల్ని ఏమన్నా పట్టించుకుంటారా? అసలెవరన్నా పట్టించుకుంటారా? మేము భయంతో గాని లేదా సిగ్గుతో  (రేప్ గాని ఎత్తుకెళ్ళడం కానీ) గాని బ్రతకాలి.” అని లోగొంతుకతో అన్నది నిర్మలా దేవి.

నిర్మల ఒక కోల్ అమ్మాయి. ఈమె తన కుగ్రామంలో పెళ్లి తరవాత బి ఏ చదివి పాసైన అతికొందరి మహిళలలో ఒక మనిషి. ఆమె భర్త మురళి లాల్ ఒక రైతు. ఆమెకు నలుగురు చదువుకున్న కొడుకులు ఉన్నారు. ఆమె వాళ్ళని దగ్గరలో ఉన్న మిర్జాపుర్ జిల్లాకు చెందిన డ్రమంగంజ్ లోని ప్రైవేట్ స్కూల్ లో తాను పొదుపు చేసుకున్న డబ్బుతో చదివించింది. “నా మూడో  గర్భం తరవాత నేను ఆఖరుకు ఇంటి నుంచి బయటపడగలిగాను.” అన్నది ఒక చిన్న ఇబ్బంది  కూడిన నవ్వుతో. “నా పిల్లలను చదివించాలనుకున్నాను. అదే నన్ను ముందుకు నడిపింది.” నిర్మల ఇప్పుడు తన కోడలు శ్రీదేవిని కూడా ANM ఉద్యోగం కోసం చదివిస్తుంది. శ్రీదేవి కి 18 ఏళ్ళు వచ్చాక, నిర్మల కొడుకుని పెళ్లి చేసుకుంది.

కానీ ఊరిలో మిగిలిన తల్లిదండ్రులు చాలా భయంగా ఉన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం, ఉత్తర్ ప్రదేశ్ లో 2019లో మహిళల పై 59,853 నేరాలు నమోదయ్యాయి . అంటే సగటున రోజుకు 164 నేరాలు జరిగాయి. ఇందులో మైనర్లు, అమ్మాయిలు, మహిళలపై జరిగిన లైంగిక హింస, కిడ్నాపులు, ఎత్తుకెళ్ళడం, మానవ ట్రాఫిక్కింగ్ వంటి నేరాలున్నాయి.

PHOTO • Priti David
PHOTO • Priti David

పుట్టిన సర్టిఫికెట్లు ఉండడం అరుదు, కాబట్టి బాల్యవివాహాలకు పట్టుబడే అవకాశం లేదు, అన్నది, నిర్మలా దేవి(కుడి), అంగన్వాడి (ఎడమ) వర్కర్

“మగవారు అమ్మాయిలను గమనించడం మొదలుపెట్టాక వారిని భద్రంగా ఉంచడం కష్టమవుతున్నది,” అన్నాడు మిథిలేష్. సోను, మీనాలకు ఇతను అన్నవరసవుతాడు. “ఇక్కడున్న దళితులకు ఒక లక్ష్యం మాత్రమే ఉంటుంది. మా పేరును, మా గౌరవాన్ని నిలుపుకోవాలని. మా ఆడపిల్లకు  త్వరగా పెళ్ళిచేస్తే  అది సాధ్యమవుతుంది.”

ఇలా ఆందోళన పడుతున్న మిథిలేష్ తన తొమ్మిదేళ్ల కొడుకుని, ఎనిమిదేళ్ల కూతురిని గ్రామంలో వదిలేసి ఇటుక బట్టీలలో పనిచేయడానికి, లేదా ఇసుక మైనింగ్ పనులలో పనిచేయడానికి, ఎక్కడ పని దొరికితే అక్కడికి వలస వెళ్తుంటాడు.

అతను నెలకు సంపాదించే 5000 రూపాయిలు, అతని భార్య పొయ్యి కర్రలు అమ్మడం వలన, పొలాల్లో కూలిపని వలన వచ్చే డబ్బులకు వేన్నీళ్లకు చన్నీళ్లుగా సరిపోతాయి. వారి గ్రామం చుట్టుపక్కల సాగు చేసుకునే వెసులుబాటు లేదు. “మేము ప్రతిదీ పండించలేము, ఎందుకంటే అడవిలో జంతువులొచ్చి వాటిని తినేసి పోవచ్చు. అడవి పక్కనే ఉంటున్నాము కాబట్టి ఇప్పటికీ అడవి పందులు మా ఇంటి ఆవరణ లోకి వస్తాయి,” అన్నాడు మిథిలేష్.

2011  సెన్సస్  ప్రకారం, బైతక్వ కుగ్రామంగా కల దియోఘాట్ లో 61 శాతం జనాభా వ్యవసాయ కూలి పని, ఇంటి పని, ఇంకా వేరే ఇతర పనుల ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. “ప్రతి ఇంటిలో  ఒక మనిషి కన్నా ఎక్కువ మందే పని కోసం వలస వెళ్తున్నారు,” అన్నాడు మిథిలేష్. వాళ్లు అలహాబాద్, సూరత్ లేదా ముంబై కి  వెళ్లి అక్కడ పనులు వెతుక్కుంటారు. ఇటుక బట్టీలలోను, వేరే విభాగాలలోను పనిచేస్తే రోజుకు 200 రూపాయిలు వస్తాయని కూడా చెప్పాడు.

“ప్రయాగరాజ్ జిల్లాలోని 21 బ్లాకుల్లో కొరాన్ ఎక్కువగా నిర్లక్ష్యానికి గురి అవుతుంది,” అన్నారు డా.  యోగేష్ చంద్ర శ్రీవాత్సవ. ఈయన 25 ఏళ్లుగా ప్రయాగ్ రాజ్ లోని సామ్ హిగ్గిన్బోథమ్ యూనివర్సిటీ అఫ్ అగ్రికల్చర్, సైన్సెస్ అండ్ టెక్నాలజీలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు.

పెళ్ళైన వెంటనే సోను, మీనా ఇద్దరూ వారి గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి భర్తల ఇళ్లకు మారిపోతారు. “నేను అతన్ని ఇంకా కలవలేదు,” అన్నది సోను. “కానీ నేను అతని మొహాన్ని మా చిన్నాన్న  సెల్ ఫోన్ లో చూశాను. నేను అతనితో తరచూ ఫోన్లో మాట్లాడుతుంటాను. అతను నాకన్నా కొన్నేళ్లు పెద్దవాడు, పదిహేనేళ్ళునుంటాయి, సూరత్ లో వంటవాడికి సహాయకుడిగా పనిచేస్తుంటాడు.”

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ :“మగవారు అమ్మాయిలను చూడడం మొదలుపెట్టాక వారిని భద్రంగా ఉంచడం కష్టమవుతున్నది,” అన్నాడు మిథిలేష్. కుడి: డా. యోగేష్ చంద్ర శ్రీవాస్తవ అన్నారు, “ఏ ప్రామాణికతనన్నా తీసుకోండి - కొరాన్ బ్లాక్ ఎందులోనూ అభివృద్ధి చెందలేదు”

ఈ జనవరిలో బైతక్వ అమ్మాయిలు, ప్రభుత్వ మిడిల్ స్కూల్ నుండి కొన్ని ఉచిత సానిటరీ పాడ్లు, ఒక సబ్బు, ఒక టవల్ అందుకుని అక్కడ వచ్చిన NGO వారు చూపించిన నెలసరి సమయాల్లో పరిశ్రుభ్రత గురించి విన్నారు. అలానే కేంద్ర ప్రభుత్వ కిశోర సురక్ష యోజన క్రింద 6-12 తరగతుల అమ్మాయిలకు ఉచితంగా నాప్కిన్లు సరఫరా చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 2015లో ప్రవేశపెట్టారు.

కానీ సోను, మీనా స్కూల్ కి ఎప్పటినుంచో వెళ్లడం లేదు  “మేము స్కూల్ కి వెళ్లడం లేదు కాబట్టి మాకు దీని గురించి తెలీదు.” అంది సోను. వారిద్దరికీ నెలసరి సమయంలో గుడ్డలు వాడడం కన్నా సానిటరీ పాడ్లు వాడడమే నయంగా ఉంటుంది.

పెళ్లి కాబోతున్నాగాని, ఈ ఇద్దరమ్మాయిలకు సెక్స్ గురించి, గర్భం గురించి, నెలసరి పరిశుభ్రత గురించి ఇంచుమించుగా అసలేమీ అవగాహన లేదు. “మా అమ్మ నా వదిన(పెద్దమ్మ కొడుకుకు భార్య)ను అడగమంది. మా వదిన నేను ఇంకే మగవాడి పక్కన పడుకోకూడదు, అలా అయితే చాలా పెద్ద సమస్య అవుతుంది, అని చెప్పింది,” అన్నది సోను. ఆ అమ్మాయి ఈ మాటలు మాట్లాడేటప్పుడు గొంతు తగ్గించింది. సోను ఆమె ఇంట్లో ఉన్న ముగ్గురు ఆడపిల్లలలోనూ పెద్దది. ఆమె రెండవ తరగతిలో  బడి మానేసి తన తరవాత పుట్టిన చెల్లెళ్లని చూసుకోవడానికి ఇంట్లో ఉండిపోయింది.

కొన్నాళ్లకు ఆమె తన తల్లి చంపతో కలిసి పొలం పనులకు వెళ్ళసాగింది. ఆ తరవాత తన ఇంటి వెనక ఉన్న అడవిలో పొయ్యి కట్టలు ఏరడం మొదలుపెట్టింది- కొన్ని వారి కోసం, కొన్ని అమ్మడానికి. రెండు రోజులు పనిచేస్తే 200 రూపాయిల వరకు ఖరీదు చేసే పొయ్యి కర్రలు పోగెయ్యవచ్చు. “కొన్ని రోజులకు సరిపడా నూనె, ఉప్పు కొనుక్కోవచ్చు,” అని చెప్పింది మీనా వాళ్ళ అమ్మ రాణి. సోను వాళ్ల ఇంటిలో ఉన్న 8-10 మేకలను కూడా మేపుతుంది. ఈ  పనులేగాక, తన తల్లికి వంటలో, ఇంటి పనులలో సాయం చేస్తుంది.

సోను, మీనా - ఇద్దరు తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. ఇక్కడ ఆడవారికి రోజువారీ కూలి 150 రూపాయిలు అయితే మగవారికి 200 ఇస్తారు. అంటే, నెలలో 10-12 రోజులు పని దొరికితే చాలా బాగా ఆదాయం వచ్చినట్లు అర్థం. సోను తండ్రి రామస్వరూప్ దగ్గరలోని పట్టణాలకు, నగరాలకు, కుదిరితే ప్రయాగ్ రాజ్ కి కూడా ప్రయాణించి అక్కడ రోజు కూలి పని దొరుకుతుందేమో ప్రయత్నించేవాడు. కానీ 2020లో, అతను టీబీ తో చనిపోయాడు.

“మేము అతని చికిత్సకి 20,000 రూపాయిలు ఖర్చుపెట్టాము. నేను మా కుటుంబం నుండి, వేరే వారి వద్ద నుంచి ఈ డబ్బులు అప్పుగా తీసుకురావాల్సి వచ్చింది.” అన్నది చంప. “అతని ఆరోగ్యం క్షీణిస్తున్న కొద్దీ మాకు డబ్బులు ఇంకా అవసరం పడ్డాయి. నేను 2,000- 2,500 రూపాయలకు మేకను అమ్మవలసి వచ్చేది. దీనిని ఒక్కదాన్ని మాత్రమే ఉంచుకున్నాము.” ఆ గదిలో ఒంటరిగా కట్టేయబడిన మేకని చూపిస్తూ అన్నది.

“మా నాన్న చనిపోయాక మా అమ్మ నా పెళ్ళి గురించి మాట్లాడడం మొదలుపెట్టింది,” తన అరచేతిలో పాలిపోతున్న గోరింటాకుని చూసుకుంటూ నెమ్మదిగా అన్నది సోను.

PHOTO • Priti David
PHOTO • Priti David

“మా నాన్న చనిపోయాక మా అమ్మ నా పెళ్ళి గురించి మాట్లాడడం మొదలుపెట్టింది,” తన అరచేతిలో పాలిపోతున్న గోరింటాకుని చూసుకుంటూ అన్నది సోను

సోను, మీనాల తల్లులు - చంప, రాణి అక్క చెల్లెళ్లు. వీరు ఇద్దరు అన్నదమ్ములను పెళ్లిచేసుకున్నారు. 25 మంది ఉన్న వీరి ఉమ్మడి కుటుంబం, 2017 లో ప్రధాన మంత్రి అవాస్ యోజన హోసింగ్ స్కీం క్రింద వచ్చిన రెండు గదుల ఇంట్లో ఉంటున్నారు. ఈ ఇంటికి బయట ప్లాస్టరింగ్ చేయబడని ఇటుక గోడ, సిమెంట్ పైకప్పు ఉన్నాయి.  ఇప్పుడు వంట చేయడానికి, కొందరు నిద్ర పోవడానికి వాడే అంతకు ముందున్న మట్టి ఇల్లు , ఈ కొత్త ఇంటి వెనుకే ఉంది.

ఇద్దరు అమ్మాయిలలో మీనా మొదట రజస్వల  అయింది. దాని వలన ఆమె కోసం చూసిన అబ్బాయికి ఒక తమ్ముడున్నాడని తెలిసింది. దీనివలన  సోనుకి కూడా ఆ ఇంటిలో సంబంధం దొరికింది. ఇది ఇద్దరు అమ్మలకు నిమ్మళం ఇచ్చే విషయం.

మీనా ఇంట్లో అందరికన్నా పెద్దది. ఆమెకు ఇద్దరు చెల్లెల్లు ఒక తమ్ముడు ఉన్నారు. ఆమె 7వ తరగతిలో, అంటే ఒక ఏడాది క్రితం, బడి మానేసింది. “నాకు కడుపులో నొప్పి వచ్చేది. ఇంట్లో ఎక్కువసేపు అలా పడుకునే ఉండేదాన్ని. మా అమ్మ పొలం పనికి  వెళ్ళేది. మా నాన్న కొరాన్ లో కూలి పనికి వెళ్ళిపోయేవాడు. ఎవరూ నేను స్కూల్ కి వెళ్లాలని ఖచ్చితంగా చెప్పలేదు. అందుకని నేను వెళ్ళలేదు.” అన్నదామె. ఆ తరవాత ఆమె కిడ్నీలో రాళ్లున్నాయని తెలిసింది. కానీ చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది, పైగా చాలా సార్లు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్ కి వెళ్ళవలసి వస్తుంది, అందుకని చికిత్స చేయించే ఉద్దేశం మానుకున్నారు. దానితో పాటే ఆమె చదువు కూడా నిలిచిపోయింది.

ఇప్పటికీ ఆమె కడుపులో అప్పుడప్పుడు నొప్పి వస్తుంది.

ఎంత తక్కువ ఆదాయం ఉన్నా, కోల్ కుటుంబాలు తమ కూతుర్ల పెళ్లికోసం ఎలాగోలా డబ్బును సమకూరుస్తారు. “మేము పెళ్ళికోసం 10,000 రూపాయిలు దాచాము. ఇంచుమించుగా 100-150 మందికి విందు చేయవలసి ఉంటుంది- పూరి, సబ్జి(కూర), మీఠా(మిఠాయి),” అన్నది రాణి. ఇద్దరు ఆడపిల్లలకు ఒకేరోజున ఇద్దరు అన్నదమ్ములతో పెళ్లి జరిపించాలని వారు అనుకున్నారు.

తల్లిదండ్రులు వారి బాధ్యతను దీనితో తీర్చేసామానుకుంటే, ఈ ఆమ్మాయిలు వారి బాల్యం ఇంతటితో అయిపోయిందనుకుంటున్నారు. సోను, మీనాలు వారి కారణాలు వారు, తమ చుట్టూ ఉన్న పరిస్థితులు, సమాజం బట్టి వెతుక్కున్నారు. “ఇంటిలో అన్నం తక్కువ వండుకొవచ్చు. మేము ఒక సమస్య అయిపోయాం ఇప్పుడు.” అన్నారు. “తినిపించేందుకు కొన్ని నోరులే ఉంటాయిక. మేము ఇప్పుడు ఒక సమస్య.”

PHOTO • Priti David

ఇద్దరు అమ్మాయిలలో మీనా మొదట రజస్వల  అయింది. దాని వలన ఆమె కోసం చూసిన అబాయికి ఒక తమ్ముడున్నాడని తెలిసింది. దీనివలన  సోనుకి కూడా ఆ ఇంటిలో సంబంధం దొరికింది

UNICEF ప్రకారం బాల్యవివాహం , కౌమార వయసులో ఉన్న అమ్మాయిలను గర్భధారణ, ప్రసవ సమయాలలో చనిపోయేంత ప్రమాదంలో పడేయగలదు. అంత చిన్నప్పుడే పెళ్లి చేసేయడం వలన,  “వాళ్లలో ఐరన్ లేదా ఫోలిక్ ఆసిడ్ శాతాన్ని పరీక్షించడం కుదరదు. “అన్నది ఆశ వర్కర్ సునీత దేవి. ఈమె గర్భవతులు సాధారణంగా అనుసరించే పద్ధతుల గురించి మాట్లాడుతూ ఈ మాటలన్నది. నిజానికి ఉత్తర్ ప్రదేశ్ లో చిన్నవయసులో అమ్మలైన వారిలో  22 శాతం మంది మాత్రమే ప్రసవం తరవాత చెక్ అప్ లకు వెళ్తారు. ఈ విషయంలో,  ఈ దేశంలో అందరి కన్నా తక్కువ సంఖ్య ఈ రాష్ట్రానిదే.

ఈ సంఖ్య యూనియన్ మినిస్ట్రీ అఫ్ హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్ లో ఇటీవలే ఒక నివేదిక ప్రచురితమైంది. ఈ నివేదిక ప్రకారం యు పి లో ఉన్న సగం పైన ఆడవారు- 52 శాతం - 15-49 మధ్య వయసులలో ఉన్న ఆడవారు రక్త హీనతతో బాధపడుతున్నారు. దీనివలన వారికి, పుట్టబోయే పిల్లలకి  గర్భధారణ సమయంలో ఆరోగ్యానికి ప్రమాదముంది. అంతేగాక 49 శాతం యు.పి  గ్రామాలలో పెరిగే ఐదేళ్లలోపు పిల్లల పెరుగుదల సరిపడాలేదు లేదా రక్తహీనతతో బాధపడుతున్నారు. దీనివల అంతులేని జబ్బులు, ప్రమాదాలు వస్తాయి.

“అమ్మాయిల పోషణ అంత ముఖ్యమేమి కాదు. అమ్మాయి పెళ్లి కుదరగానే, ఆమె ఎటూ వెళ్ళిపోతుంది కాబట్టి ఆమె తాగడానికి ఇచ్చే పాలు, ఇవ్వడం మానేయడం చూశాను. ఎలాంటి పొదుపైనా మంచిదే. వారి కష్టం అలాంటిది.” తను గమనించింది చెప్పింది సునీత.

రాణి, చంపాల  ఆలోచన వేరే విషయం పై కేంద్రికృతమై ఉంది.

“పెళ్లికి మేము జమ చేసిన డబ్బులు ఎవరన్నా ఎత్తుకుపోతారేమో అని ఆందోళనగా ఉంటుంది.  మా దగ్గర డబ్బు ఉందని అందరికి తెలుసు.” అన్నది రాణి. “నేను ఇంకో 50,000 రూపాయిలు అప్పు తీసుకోవాలి.” అన్నది రాణి. ఇంకా ఆ పనితో వారి సమస్య తీరిపోయినట్లే అని నమ్ముతుంది.

అలహాబాద్‌లోని షుట్స్‌లో ఎక్స్‌టెన్షన్ సర్వీసెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆరిఫ్ ఎ. బ్రాడ్‌వే కు, ఆయన అమూల్యమైన సహాయానికి, సూచనలకు విలేఖరి ధన్యవాదాలు  తెలుపుతున్నారు.

ఈ వ్యాసంలో వ్యక్తుల పేర్లు వారి గోప్యత కోసం మార్చడమైనది.

పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. అట్టడుగున ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకున్నారా? అయితే [email protected] కి ఈమెయిల్ చేసి [email protected] కి కాపీ పెట్టండి.

అనువాదం: అపర్ణ తోట

Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Illustration : Priyanka Borar

Priyanka Borar is a new media artist experimenting with technology to discover new forms of meaning and expression. She likes to design experiences for learning and play. As much as she enjoys juggling with interactive media she feels at home with the traditional pen and paper.

Other stories by Priyanka Borar

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Series Editor : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota