“శనివారాలు నా భర్త మూడు సీసాల మద్యాన్ని కొనుక్కుంటాడు. ఒక్కో సీసా ఇంత పొడవుంటుంది,” అన్నది కనక తన చేతిని పొడుగ్గా సాచి చూపిస్తూ. “అతను రెండు మూడు రోజులు బాగా తాగి, ఆ సీసాలు ఖాళీ అయ్యాక పనికి వెళ్తాడు. తిండికి సరిపడా డబ్బులు ఎప్పటికి ఉండవు. నాకు నా  బిడ్డకు అసలు కడుపునిండదు, మళ్ళీ నా భర్తకి ఇంకో సంతానం కావాలి. వద్దు, నాకీ బతుకు”, అన్నదామె నిరాశగా.

ఇరవైనాలుగేళ్ల వయసున్న కనక(పేరు మార్చబడింది) కురుంబ ఆదివాసి మహిళ. ఈమె గుడలూరు ఆదివాసి ఆసుపత్రిలో డాక్టర్ ను కలవడానికి వచ్చింది. ఉదగమండలం (ఊటీ) నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడలూరు పట్టణంలోని ఈ 50 పడకల ఆసుపత్రి, తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని గూడలూర్, పంతులూరు తాలూకాలలోని 12,000 పైగా ఆదివాసి జనాభాకు సేవలను అందిస్తుంది.

చిన్నగా కుదిమట్టంగా ఉండి, వెలసిపోయిన ఒక  సింథటిక్ చీరను కట్టుకుని, కనక తన కూతురి కోసం ఇక్కడికి వచ్చింది. ఈ ఆసుపత్రికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామంలో ఒక రెగ్యులర్ హెల్త్ చెక్ అప్ లో, ఆశ్విని(ASHWINI- Association for Health Welfare in Nilgiris) సంస్థలోని ఒక హెల్త్ వర్కర్, కనక కూతురు 7.2 కిలోగ్రాములే ఉండడం చూసి హైరానా పడింది (రెండేళ్ల  పిల్లల సరియైన బరువు 10-12 కిలోలు). ఆ బరువు వలన ఆ పిల్ల విపరీతమైన పౌష్టికాహార లోప పరిధిలోకి వచ్చింది. ఆ హెల్త్ వర్కర్ కనకతో, పాపను ఆసుపత్రిలో చూపించమని గట్టిగా చెప్పింది.

కనక ఇంటికి వచ్చే ఆదాయాన్ని గమనిస్తే, ఆ పాపలో పౌష్హితకత లోపించడం ఆశర్యం కలిగించే విషయమేమి కాదు. ఇరవైల వడిలో ఉన్న ఆమె భర్త, వారంలో కొన్ని రోజులు సమీపంలోని టీ, కాఫీ, అరటి, మిరియాల ఎస్టేటుల్లో దిన కూలీగా పని చేసి రోజుకు 300 రూపాయిలు సంపాదిస్తాడు. “అతను  తిండికోసం నెలకు 500  రూపాయిలు ఇస్తాడు,” అన్నది కనక. “దానితో నేను మొత్తం కుటుంబానికి వండిపెట్టాలి.”

కనక, ఆమె భర్త, ఆమె భర్తకు అత్తా, మామ వరసయ్యే వారితో కలిసి ఉంటున్నారు. ఆ అత్త, మామ 50ల వడిలో  ఉన్నారు, దినకూలీలుగా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు కుటుంబాలకు రెండు రేషన్ కార్డులు ఉన్నాయి. దీనితో వారికి ప్రతి నెల 70 కిలోల ఉచిత బియ్యం కాక, 2 కిలోల పప్పు, రెండు కిలోల చక్కర, రెండు కిలోల నూనె సబ్సిడీ ధరల్లో లభిస్తాయి. “కొన్నిసార్లు నా భర్త బియ్యాన్ని కూడా అమ్మి, వచ్చిన సొమ్ముతో మద్యాన్ని కొనుక్కుంటాడు.” అన్నది కనక. “కొన్నిరోజులు అసలు తినడానికి ఏమి ఉండదు.”

The Gudalur Adivasi Hospital in the Nilgiris district –this is where young women like Kanaka and Suma come seeking reproductive healthcare, sometimes when it's too late
PHOTO • Priti David
The Gudalur Adivasi Hospital in the Nilgiris district –this is where young women like Kanaka and Suma come seeking reproductive healthcare, sometimes when it's too late
PHOTO • Priti David

నీలగిరి జిల్లాలో ఉన్న గుడలూరు ఆదివాసి ఆసుపత్రి - ఇక్కడే కనక, సుమ వంటి యువతులు వారి పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణకు వస్తారు. కొన్నిసార్లు అవసరానికి మించి ఆలస్యంగా వస్తారు

రాష్ట్ర పౌష్టికాహార కార్యక్రమాలు, కనక, ఆమె పిల్లల కొద్దిపాటి ఆహారానికి సరిపోయేలా కనిపించడం లేదు. గూడలూరులోని తన కుగ్రామం సమీపంలోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ స్కీమ్ (ICDS) బాల్‌వాడి వద్ద, కనకతో పాటు ఇతర గర్భిణీ స్త్రీలు,  పాలిచ్చే తల్లులకు వారానికి ఒక గుడ్డు, నెలకు రెండు కిలోల సత్తుమావు (గోధుమలు, పెసలు , వేరుశెనగలు, శనగలు, సోయాతో తయారుచేసిన పొడి, దీనితో జావా కాచుకోవచ్చు)ఇస్తారు. మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు కూడా అదే సాతుమావు నెలవారీ ప్యాకెట్ లభిస్తుంది. మూడు సంవత్సరాల తరువాత, పిల్లలు అక్కడున్న ICDS సెంటర్ కు ఉదయం, మధ్యాహ్నం, భోజనానికి, సాయంత్రం పలహారానికి(గుప్పెడు పల్లీలు, కొద్దిగా బెల్లం) వెళ్ళవచ్చు. విపరీతంగా పోష్టికాహార లోపం ఉన్న పిల్లలకు ఇంకొద్దిగా పల్లీలు, బెల్లము ఇస్తారు.

జులై 2019 నుండి ప్రభుత్వం. అమ్మ ఉత్తాచాట్టు పెట్టగం న్యూట్రిషన్ కిట్ ను కొత్తగా తల్లులైన వారికి ఇస్తున్నారు. ఈ కిట్ లో ఆయుర్వేదిక్  సప్లిమెంట్లతో పాటు, 250 గ్రాముల నెయ్యి, 200  గ్రాముల ప్రోటీన్ పొడి ఉన్నాయి. కానీ అశ్వినిలో,  కమ్యూనిటీ హెల్త్ కోర్డినేటర్ గా పనిచేస్తున్న 32 ఏళ్ళ జిజి ఎలమన, “ ఆ ప్యాకెట్ అలా అలమరాలో పడి ఉంటుంది. అసలు విషయమేమిటంటే ఆదివాసీల ఆహారంలో పాలు, నెయ్యి భాగం కాదు. అందుకని వారు వాటిని అసలు ముట్టుకోరు.  వాళ్ళకి ప్రోటీన్ పొడి కానీ  ఆపచ్చని ఆయుర్వేదిక్ పౌడర్ ఎలా వాడాలో తెలీదు. అందుకని దానిని ఒక పక్కకి పెట్టేస్తారు.”

ఒకానొక సమయంలో ఆదివాసీ వర్గాలకు అడవులలోనే ఆహారం అందుబాటుగా ఉండేది. “ఆదివాసీలకు వారు సేకరించే  దుంపలు, పళ్లు, ఆకు కూరలు, పుట్టగొడుగులు గురించి చాలా జ్ఞానం ఉన్నది,” అన్నారు మారి తెకెకరా. ఈమె గుడాలురు ఆదివాసీ తెగలతో నాలుగు దశాబ్దాలుగా పనిచేస్తున్నది. “వాళ్ళు ఏడాది పొడుగునా చేపలు పట్టడం, చిన్న చిన్న జంతువులను వేటాడడం కూడా చేసేవారు. చాలా ఇళ్ల బయట మాంసాన్ని ఎండపెడుతుండేవారు. దానిని వర్షాకాలంలో వాడేవారు. కాని ఫారెస్ట్ విభాగం, అడవులలోకి అనుమతిని నియంత్రించడం వలన వారు నెమ్మదిగా అడవి లోపలి వెళ్లడం తగ్గించి, ఇప్పుడు పూర్తిగా మానేశారు.”

అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం ఉమ్మడి ఆస్తి వనరులపై కమ్యూనిటీ హక్కులను పునరుద్ధరించినప్పటికీ, ఆదివాసీలు మునుపటిలాగా అడవి నుండి సేకరించిన వనరులతో వారి ఆహారాన్ని సమకూర్చుకోలేరు.

గ్రామంలో తగ్గిపోతున్న ఆదాయం కూడా పోషకాహార లోపానికి కారణం.  ఆదివాసీ మున్నేత్ర సంఘానికి సెక్రటరీ, కె టి సుబ్రమణియన్,  “గత 15 ఏళ్లుగా ఆదివాసీలకు వచ్చే దినకూలీ  పని తగ్గిపోతుంది. ఎందుకంటే ఇక్కడ అడవులను మదుమలై శాంక్చువరీ వాళ్లు నియంత్రిస్తున్నారు. శాంక్చువరీ లో చిన్న చిన్న ప్లాంటేషన్లు, ఎస్టేట్లలో ఆదివాసీలకు పని దొరికేది. కాలక్రమేణా వీటిని అమ్మేయడం కానీ స్థలాన్ని మార్చడం గాని జరిగింది. దీనివలన వారు పెద్ద ఎస్టేట్లలో లేదా పొలాలలో, చిన్న చిన్న పనులు వెతుక్కోవలసి వస్తుంది.

Adivasi women peeling areca nuts – the uncertainty of wage labour on the farms and estates here means uncertain family incomes and rations
PHOTO • Priti David

అరెకా కాయలు వలుస్తున్న ఆదివాసీ మహిళలు – ఇక్కడ పొలాలు, ఎస్టేట్‌లలో కూలీ పని ఉంటుందో లేదో తెలియదు - అంటే కుటుంబ ఆదాయాలు రేషన్‌లు ఎలా ఉంటాయో కూడా  తెలీదు

ఏ ఆసుపత్రిలో అయితే కనక డాక్టర్ కోసం ఎదురుచూస్తోందో, అదే గుడలూరు ఆదివాసీ ఆసుపత్రిలో, 26 ఏళ్ళ  సుమ(పేరు మార్చబడినిది) వార్డ్ లో విశ్రాంతి తీసుకుంటోంది. ఆమె పంతాలూర్ తాలూకా కు చెందిన పానీయన్ ఆదివాసి. ఇటీవలే ఆమె మూడో బిడ్డను ప్రసవించింది. ఆమెకు 2, 11 యేళ్ళున్న ఇద్దరు కూతుర్లున్నారు. సుమకు ఆసుపత్రిలో కానుపు అవలేదు. ఆమె ప్రసవానంతర సేవల కోసం, ట్యూబల్ లైగేషన్ ప్రొసీజర్ కోసం మాత్రమే ఇక్కడకు వచ్చింది.

“నాకు ఇంకొన్ని రోజులల్లో కానుపు అవుతుందని తెలుసు కానీ అప్పుడు రావడానికి డబ్బులు లేకపోయాయి.” అన్నదామె. ఆమె కుగ్రామం నుండి ఇక్కడిదాకా జీప్ లోనే రావాలి, దానికి ఖర్చు అవుతుంది. “గీత అక్క (అశ్వినిలో ఆరోగ్య కార్యకర్త) ప్రయాణానికి, తిండికి, మాకు 500 రూపాయిలు ఇచ్చింది కానీ నా భర్త ఆ డబ్బులను తాగుడుకు ఖర్చుపెట్టేసాడు. అందుకని నేను ఇంట్లోనే ఉండిపోవలసి వచ్చింది. మూడు రోజుల తరవాత నా నొప్పులు ఎక్కువయ్యాయి, బయలుదేరే సమయానికి చాలా ఆలస్యమైపోయి, నేను దగ్గరలో ఉన్న PHC లోనే ప్రసవించాను.” తరవాత రోజు PHCలోని నర్స్ 108(అంబులెన్స్ సేవ)ను పిలిపించి  సుమను, ఆమె కుటుంబాన్ని GAHకు పంపింది.

నాలుగేళ్ల క్రితం, సుమ ఏడో నెల గర్భంతో ఉండగా,  ఆమెకు గర్భస్రావం అయింది. దానికి కారణం గర్భాశయ పెరుగుదల పరిమితి (IUGR), అంటే పిండం దాని గర్భధారణ వయస్సు కంటే చిన్నదిగా  ఉండడం. ఇది పిండం తక్కువగా అభివృద్ధి చెందిన పరిస్థితి వలన జరుగుతుంది. ఈ పరిస్థితి తల్లిలో పోషకార లేమి, రక్తహీనత, ఫోలేట్ తక్కువ ఉండడం వలన జరుగుతుంది. సుమ తరవాత గర్భం కూడా  IUGR వలన ప్రభావితమైంది, ఆమె రెండవ కూతురు చాలా  తక్కువ బరువుతో  పుట్టింది(1.3 కిలోగ్రాములు, అసలయితే కనీసం 2 కిలోగ్రాములు ఉండాలి). పిల్లల వయస్సు నుండి బరువు గ్రాఫ్ అత్యల్ప పర్సంటైల్ లైన్ కంటే చాలా దిగువన ఉంది, చార్ట్‌లో 'తీవ్రమైన పోషకాహార లోపం' అని గుర్తించబడింది.

“తల్లి పోషకాహార లేమితో బాధపడుతుంటే పిల్లలు కూడా అదే ఇబ్బందితో పుడతారు”, అన్నారు GAH లో 42 ఏళ్ళ ఫ్యామిలీ మెడిసిన్ స్పెషలిస్ట్ డా. మృదుల రావు. “సుమ కూతురు తన తల్లి పోషకాహార లోపం, సరిగ్గా తినకపోవడం వలన ప్రభావితమయ్యే అవకాశముంది. ఆమె శారీరక, మానసిక, మేధోపరమైన,  నాడి సంబంధమైన పెరుగుదల ఆమె వయసులోని పిల్లల కన్నా ఆలస్యంగా ఉంటుంది.”

సుమ పేషెంట్ రికార్డు బట్టి ఆమె తన మూడవ గర్భంలో 5 కిలోల బరువు మాత్రమే పెరిగిందని తెలుస్తోంది. ఇది గర్భవతులైన వారు పెరగవలసిన సాధారణ బరువు కన్నా చాలా తక్కువ. సుమవంటి వారైతే పెరగవలసిన దానిలో సగం బరువు కూడా పెరగలేదు. ఆమె తొమ్మిది నెలలు నిండినప్పుడు కూడా ఆమె  బరువు 38 కిలోలు మాత్రమే ఉంది.

PHOTO • Priyanka Borar

ఇల్లస్ట్రేషన్: ప్రియాంక బోరార్

అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం ఉమ్మడి ఆస్తి వనరులపై కమ్యూనిటీ హక్కులను పునరుద్ధరించినప్పటికీ, ఆదివాసీలు మునుపటిలాగా అడవి నుండి సేకరించిన వనరులతో వారి ఆహారాన్ని సమకూర్చుకోలేరు

“నేను వారంలో చాలా సార్లు గర్భం తో ఉన్న తల్లిని, పిల్లలను చూడడడానికి వెళ్తాను.” గుర్తుచేసుకుంటూ అన్నది 40 ఏళ్ళ గీత కన్నన్. ఈమె GAH లో ఒక హెల్త్ యానిమేటర్. “నేను పిల్లలు ఒక అండర్వేర్ మాత్రమే వేసుకుని వారి అమ్మమ్మ లేక నాయనమ్మల వళ్లో ఉంటారు. ఇంట్లో వంట వండరు. చుట్టుపక్కలవారు ఆ బిడ్డకు అన్నం తినిపిస్తారు. సుమ పడుకుని ఉంది. చాలా నీరసంగా కనిపిస్తుంది. నేను సుమకు అశ్విని సాతుమావు (రాగి, ఇంకా వేరే దినుసులతో చేసిన పొడి) ఇచ్చి, ఆమె కోసం, ప్రస్తుతం పాలు తాగే ఆమె బిడ్డ కోసం, ఆమెను ఇంకా బాగా తినమని చెప్పాను. సుమ భర్త చాలా వరకూ కూలి డబ్బులు తాగుడుకు  ఖర్చుపెడుతున్నాడు,” అని గీత ఆగి మళ్ళీ చెప్పింది. “ ఇప్పుడు సుమ కూడా తాగడం మొదలుపెట్టింది.”

గుడలూరులో చాలా కుటుంబాల కథలు ఇలానే ఉన్నాగాని ఈ బ్లాక్ లో ఆరోగ్య సూచికలు కొద్దిగా మెరుగుపడుతున్నాయి. ఆసుపత్రి లెక్కల ప్రకారం, 1999 లో 10.7 ఉన్న ప్రసూతి మరణాల నిష్పత్తి, ఇప్పుడు  2018-19 లో 3.2 కి పడిపోయింది. ఇవే సంవత్సరాలలో శిశుమరణాల రేటు 48(1000 జననాలకు) నుండి 20కు తగ్గిపోయింది. వాస్తవానికి, రాష్ట్ర ప్రణాళికా సంఘం జిల్లా మానవాభివృద్ధి నివేదిక ( DHDR 2017 ) ప్రకారం, 2017 నీలగిరి జిల్లా IMR 10.7 వద్ద నమోదు చేయబడింది, ఇది రాష్ట్ర సగటు అయిన 21 కంటే తక్కువగా ఉంది, ఇక గుడలూరు తాలూకాలో అయితే 4.0 కంటే తక్కువ నమోదు అయింది.

ఇటువంటి సూచికలు మొత్తం కథను మనకు చెప్పవు, అన్నారు డా. పి శైలజ దేవి. ఈమె గుడలూరు లోని ఆదివాసి ఆడవారితో 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు. "MMR మరియు IMR వంటి మరణాల సూచికలు ఖచ్చితంగా మెరుగుపడ్డాయి, కానీ అనారోగ్యం పెరిగింది," అని ఆమె చెప్పింది. "మనం మరణాలకు అనారోగ్యానికి మధ్య తేడాను గుర్తించాలి. పోషకాహార లోపం ఉన్న తల్లి అనారోగ్యానికి గురయ్యే పోషకాహార లోపం ఉన్న బిడ్డను ప్రసవిస్తుంది. అటువంటి పిల్లలు మూడు సంవత్సరాల వయస్సులో అతిసారం వంటి వ్యాధులతో త్వరగా చనిపోవచ్చు. అంతేగాక ఆ  బిడ్డ మేధో పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. ఇదే ఆదివాసీల తర్వాత తరం అవుతుంది.”

అంతేకాకుండా, సాధారణ మరణాల సూచికలలో మెరుగుదలను చూపిస్తూ, గిరిజన వర్గాలలో  పెరుగుతున్న మద్య వ్యసనాన్ని విస్మరించి, ఆదివాసీ జనాభాలో అధిక స్థాయి పోషకాహార లోపాన్ని కప్పిపుచ్చవచ్చు. (మద్యపానం మరియు పోషకాహారలోపం మధ్య పరస్పర సంబంధంపై GAH ఒక పత్రాన్ని రూపొందించే ప్రక్రియలో ఉంది; ఇది ఇంకా బహిరంగంగా అందుబాటులో లేదు.) DHDR 2017 నివేదిక ఎత్తి చూపినట్లుగా, “మరణాలను నియంత్రించినప్పటికీ, పోషకాహార స్థితి మెరుగుపడకపోవచ్చు.”

“మేము అతిసారం, విరేచనాలు వంటి మరణాలకు ఇతర కారణాలను నియంత్రిస్తూ, అన్ని ప్రసవాలనూ సంస్థాగతంగా చేస్తున్నప్పుడు, సమాజంలో మద్యపాన వ్యసనం ఈ ప్రయత్నాలన్నిటిని వృధా చేస్తుంది. మేము నవజాత శిశువుల తల్లులు, ఇంకా వారి పిల్లలలో పోషకాహార లోపం, రాజీపడిన పోషకాహార స్థితి, సహారాలో ఉన్నవారితో పోల్చదగిన స్థాయిలలో ఉన్నది." అని ప్రసూతి మరియు గైనకాలజీ నిపుణురాలు, 60 ఏళ్ళ డాక్టర్ శైలజ చెప్పారు. ఈవిడ  జనవరిలో GAH నుండి అధికారికంగా పదవీ విరమణ పొందినా, ఇప్పటికీ ప్రతిరోజూ ఉదయం ఆసుపత్రిలో సమయం గడుపుతున్నారు. వీరు రోగులను కలవడం, కేసులను గురించి సహోద్యోగులతో చర్చించడం వంటివి చేస్తారు. "50 శాతం మంది పిల్లలు ఇప్పుడు మధ్యస్తంగా లేదా తీవ్రమైన  పోషకాహార లోపంతో బాధపడుతున్నారు" అని ఆమె అన్నారు. “పదేళ్ల క్రితం [2011-12], మధ్యస్థ పోషకాహార లోపం 29 శాతం, తీవ్రమైన పోషకాహార లోపం 6 శాతం ఉండేది. కాబట్టి ఇది కలవరపెట్టే ధోరణిలోనే సాగుతున్నది."

Left: Family medicine specialist Dr. Mridula Rao and Ashwini programme coordinator Jiji Elamana outside the Gudalur hospital. Right: Dr. Shylaja Devi with a patient. 'Mortality indicators have definitely improved, but morbidity has increased', she says
PHOTO • Priti David
Left: Family medicine specialist Dr. Mridula Rao and Ashwini programme coordinator Jiji Elamana outside the Gudalur hospital. Right: Dr. Shylaja Devi with a patient. 'Mortality indicators have definitely improved, but morbidity has increased', she says
PHOTO • Priti David

ఎడమ: గుడలూరు ఆసుపత్రి వెలుపల ఫ్యామిలీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మృదుల రావు, అశ్విని ప్రోగ్రాం కోఆర్డినేటర్ జిజి ఎలమన. కుడి: రోగితో డాక్టర్ శైలజా దేవి. 'మరణాల సూచికలు ఖచ్చితంగా మెరుగుపడ్డాయి, కానీ అనారోగ్యం కూడా పెరిగింది' అని ఆమె చెప్పింది

ఈ పోషకాహార లేమి చాలా స్పష్టంగా కనిపిస్తుంది, అన్నారు డా. రావు. “ ఇదివరకు అమ్మలు OPDకి చెకప్ ల కోసం వచ్చినప్పుడు, వారు వారి వాళ్ళ పిల్లలతో ఆడుకునేవారు. ఇప్పుడు ఏ భావము లేకుండా కూర్చుని ఉంటున్నారు, పిల్లలు కూడా నిస్తేజంగా ఉంటున్నారు. ఈ భావము లేకపోవడం పిల్లలను సంరక్షించడంలో, వారిని వారు సంరక్షించుకోవడంలో కూడా కనిపిస్తుంది.”

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ( NFHS-4 , 2015-16) ప్రకారం, నీలగిరిలోని గ్రామీణ ప్రాంతాల్లో, 6 నుండి 23 నెలల మధ్య ఉన్న పిల్లలలో 63 శాతం మందికి సరైన ఆహారం అందడం లేదని, 6నెలల నుండి  5 ఏళ్ళ వయస్సులో ఉన్న పిల్లలలో 50.4 శాతం మంది పిల్లలకు రక్తహీనత కూడా ఉంటుంది అని తెలిపింది (హెమోగ్లోబిన్ ప్రతి డెసిలీటర్‌కు 11 గ్రాముల కంటే తక్కువ - మిమినియం 12 మంచిది). దాదాపు సగం మంది (45.5 శాతం) గ్రామీణ తల్లులు రక్తహీనతతో బాధపడుతున్నారు, ఇది వారి గర్భాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

“మాకు ఇప్పటికి కొందరు ఆదివాసీ ఆడవారు అసలు రక్తం లేకుండా వస్తారు.. ఒక డెసిలిటేర్ కు రెండే మిల్లీగ్రాముల హిమోగ్లోబిన్ ఉంటుంది వారిలో. రక్తహీనత ను పరీక్షిస్తున్నప్పుడు హైడ్రో క్లోరిక్ ఆసిడ్ పైన రక్తాన్ని వేస్తున్నప్పుడు, అది డెసిలిటేర్ కు 2 గ్రాములకన్నా తక్కువ చూపించలేదు. అది అంతకన్నా తక్కువే ఉండొచ్చు కానీ మనం దానిని కొలవలేము.” అన్నారు డా. శైలజ

రక్తహీనతకు ప్రసూతి మరణాలకు చాలా దగ్గరి సంబంధం ఉంది. “ రక్తహీనత వలన ఆబ్స్టెట్రిక్ హెమోరేజ్, కార్డియాక్ ఫెయిల్యూర్, మరణం సంభావించవచ్చు”, అన్నారు 31 ఏళ్ళ డా నమ్రితా మేరీ జార్జ్. ఈమె GAH లో గైనకాలజీ, అబెస్ట్ట్రిక్స్ స్పెషలిస్టుగా పనిచేస్తున్నారు. “ఇది గర్భశయం లో శిశువు పెరుగుదలను హరిస్తుంది, తక్కువ బరువుండడం వలన పుట్టిన శిశువులు మరణించే ఆస్కారం ఉంది. ఎక్కువ కాలంగా ఉన్న పౌష్టికాహార లోపం వలన శిశువు బతికి ఉండడం కష్టమవుతుంది.”

చిన్న వయసులోనే వివాహం జరగడం, గర్భం దాల్చడం వలన పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. NFHS - 4 ప్రకారం, నీలగిరి గ్రామాలలో ఉన్న 21 శాతం అమ్మాయిలకు 18 ఏళ్లలోపు వివాహమవుతున్నది అని చెప్పినా, ఇక్కడి ఆరోగ్య కార్యకర్తలు అంతకన్నా ఎక్కువమంది ఆదివాసీ అమ్మాయిలకు 15 ఏళ్ళు రాకముందే, అంటే వారి రుతుస్రావం మొదలైన తరవాత నెలలోనే పెళ్లిళ్లు  జరుగుతాయి అని చెబుతారు. “పెళ్లిళ్లు ఆలస్యంగా జరగడానికి, పిల్లలను ఆలస్యంగా కనేటట్లుగా చేయడానికి మనమింకా చాలా పని చేయవలసి ఉంది’, అన్నారు డా శైలజ. “ఆడపిల్లలను పెరగనీయకుండా 15-16 ఏళ్ళకు గర్భవతులుగా మారిస్తే, వారిలోని పౌష్టికాహార లేమి నవజాత శిశువుల మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.”

An Alcoholics Anonymous poster outside the hospital (left). Increasing alcoholism among the tribal communities has contributed to malnutrition
PHOTO • Priti David
An Alcoholics Anonymous poster outside the hospital (left). Increasing alcoholism among the tribal communities has contributed to malnutrition
PHOTO • Priti David

ఆసుపత్రి వెలుపల మద్యపాన నిషేధ పోస్టర్ (ఎడమ). గిరిజన వర్గాల మధ్య పెరుగుతున్న మద్యపానం పోషకాహార లోపానికి దోహదపడింది

శైల చేచి గా ఆమె సహోద్యోగులు, పేషెంట్లతో పిలవబడే ఈమెకు, ఆదివాసి ఆడవారు పడే ఇబ్బందుల పై  సంపూర్ణ అవగాహన ఉంది. “కుటుంబ ఆరోగ్యం పోషకారంతో ముడిబడి ఉంది . గర్భవతులుగా ఉన్నవారు, పాలు ఇచ్చే ఆడవారు పోషకాహారాలేమి వలన ఎక్కువ ఇబ్బందులలో ఉన్నారు. జీతాలు పెరిగాయి, కాని డబ్బులు కుటుంబాలకు చేరడం లేదు. మాకు తెలిసిన ఎందరో మగవారు ఇంట్లో ఉన్న 35 కిలోల  రేషన్ బియ్యాన్ని బయట వెళ్లి అమ్ముకుని, ఆ సొమ్ముతో తాగివస్తారు. ఇలా జరుగుతుంటే, పిల్లలలో పౌష్టికత ఎందుకు క్షీణించదు?”

“కమ్మూనిటీలో ఏ మీటింగ్ పెట్టినా చివరకు చర్చ ఇక్కడికే వస్తుంది - కుటుంబాలలో పెరిగే మద్య వ్యసనం”, అన్నారు 53 ఏళ్ళ వీణ సునీల్. ఈమె అశ్వినిలో  మెంటల్ హెల్త్ కౌన్సిలర్ గా పని చేస్తున్నారు.

ఈ ప్రాంతంలోని ఆదివాసీ కమ్యూనిటీలు ఎక్కువగా కట్టునాయకన్ పానియన్లు, వీరు ప్రత్యేకించి బలహీనమైన గిరిజన సమూహాలుగా జాబితా చేయబడ్డారు. వీరిలో 90 శాతం మంది పొలాలు,  ఎస్టేట్లలో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారని ఉదగమండలం గిరిజన పరిశోధనా కేంద్రం చేసిన అధ్యయనం పేర్కొంది. వీరుగాక ఇక్కడ ప్రధానంగా ఇరులర్, బెట్ట కురుంబ, ముల్లు కురుంబ, షెడ్యూల్డ్ తెగలుగా జాబితా చేయబడ్డ వర్గపువారున్నారు.

“1980ల్లో, మేము ఇక్కడికి వచ్చిన కొత్తల్లో, బాండెడ్ లేబర్ సిస్టమ్ (రద్దు) చట్టం 1976, ఉన్నాసరే, పానీయన్లు వరి, మిల్లెట్, అరటి, మిరియం, తపియొకా ప్లాంటేషన్లలో వెట్టిచాకిరి చేసేవారు.” అన్నారు మారి తెకెకరా. “వారు అడివికి బాగా లోపల చిన్నచిన్న ప్లాంటేషన్ల లో పనిచేసేవారు.  వారు పనిచేసే భూములు వారి పేరు మీదే ఉన్నాయని కూడా వారికి తెలీయదు.”

మారి, ఆమె భర్త స్టాన్ తాకెకరతో కలిసి 1985లో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ACCORD (యాక్షన్ ఫర్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్, రిహాబిలిటేషన్ అండ్ డెవలప్‌మెంట్)ని స్థాపించారు. కాలక్రమేణా, విరాళాలతో నడిచే ఈ NGO, సంస్థల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది - సంగాలు (కౌన్సిల్స్) ఏర్పాటు చేయబడి, అవన్నీ ఆదివాసీ మున్నేట్ర సంఘం కిందకు తీసుకురాబడ్డాయి. ఇవి ఆదివాసీలచే నిర్వహించబడతాయి నియంత్రించబడతాయి. గిరిజనుల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం, తేయాకు తోటను ఏర్పాటు చేయడం, ఆదివాసీ పిల్లల కోసం పాఠశాలను ఏర్పాటు చేయడం వంటివి సంగం నిర్వహించాయి. ACCORD నీలగిరి(అశ్విని)లో హెల్త్ వెల్ఫేర్ అసోసియేషన్‌ను కూడా ప్రారంభించింది.  1998లో గూడలూర్ ఆదివాసీ హాస్పిటల్ ను స్థాపించింది. ఈ ఆసుపత్రిలో ఇప్పుడు ఆరుగురు వైద్యులు, ఒక ప్రయోగశాల, ఎక్స్-రే గది, ఫార్మసీ, బ్లడ్ బ్యాంకు సేవలు ఉన్నాయి.

Left: Veena Sunil, a mental health counsellor of Ashwini (left) with Janaki, a health animator. Right: Jiji Elamana and T. R. Jaanu (in foreground) at the Ayyankoli area centre, 'Girls in the villages approach us for reproductive health advice,' says Jaanu
PHOTO • Priti David
Left: Veena Sunil, a mental health counsellor of Ashwini (left) with Janaki, a health animator. Right: Jiji Elamana and T. R. Jaanu (in foreground) at the Ayyankoli area centre, 'Girls in the villages approach us for reproductive health advice,' says Jaanu
PHOTO • Priti David

ఎడమ: ఆరోగ్య యానిమేటర్ జానకితో అశ్విని మానసిక ఆరోగ్య సలహాదారు - వీణా సునీల్. కుడివైపు: అయ్యంకోలి ఏరియా సెంటర్‌లో జిజి ఎలమన, టి.ఆర్. జాను (ముందుభాగంలో) 'గ్రామాల్లోని బాలికలు పునరుత్పత్తి ఆరోగ్య సలహాల కోసం మమ్మల్ని సంప్రదిస్తారు' అని జాను చెప్పారు

“80లలో, ప్రభుత్వ ఆసుపత్రులలో ఆదివాసీలను రెండవ తరగతి పౌరులలా చూసేవారు, అందుకని వారు పారిపోయేవారు. ఆరోగ్య పరిస్థితి  ఘోరంగా ఉండేది, ఆడవారు గర్భాల వలన చనిపోతూ ఉండేవారు.. అతిసార వ్యాధి వలన చిన్నపిల్లలు చనిపోయేవారు.” అన్నది రూప దేవ దాసన్. ఆమె, ఆమె భర్త డా ఎన్ దేవదాసన్ అశ్విన్ డాక్టర్లకు మార్గదర్శకులుగా ఇంటింటికి వెళ్లేవారు. “జబ్బుగా ఉన్నా, గర్భవతులుగా ఉన్నా, వారింటి లోపలికి మమ్మల్ని రానిచ్చేవారు కాదు. ఆ కమ్యూనిటీలు మమ్మల్ని నమ్మడానికి, మేము చాలా మాట్లాడి వారిని ఒప్పించవలసి వచ్చింది.”

అశ్వినికి కమ్యూనిటీ మెడిసిన్ ప్రాణం వంటిది. 17 మంది ఆరోగ్య యానిమేటర్లు (ఆరోగ్య కార్యకర్తలు), 312 మంది ఆరోగ్య వాలంటీర్లను కలిగి ఉన్నఅశ్విని లో అందరూ ఆదివాసీలే. వీరు గూడలూర్, పంతులూరు తాలూకాలలో విస్తృతంగా పర్యటించి, ఇంటింటిని సందర్శించి ఆరోగ్యం, పోషకాహారంపై సలహాలు ఇస్తారు.

అశ్విని వద్ద శిక్షణ పొందిన మొదటి హెల్త్ యానిమేటర్ టి ఆర్ జాను, ప్రస్తుతం 50ల వడిలో ఉంది. పాటలూరు తాలూకా చేరంగోడే పంచాయత్ అయ్యంకోలి  కుగ్రామంలో ఆమెకు ఆఫీసు ఉంది. ఆమె ఆదివాసీ కుటుంబాలలో  డయాబెటిస్, హైపర్ టెన్షన్, టీబీ లక్షణాలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ, ఏదైనా అవసరం వస్తే ప్రథమ చికిత్స చేయడమే కాక, ఆరోగ్యం, పోషకాహారం పై సలహాలు ఇస్తుంటుంది. అలానే ఆమె గర్భవతులు, పాలు ఇచ్చే ఆడవారి ఆరోగ్యాన్ని గమనిస్తూ ఉంటుంది. “గ్రామంలో ఆడవారు పునరుత్పత్తి ఆరోగ్యం గురించి గర్భవతులుగా మారిన చాలా కాలానికి అడుగుతుంటారు. మొదటి మూడు నెలలలోనే ఫోలేట్ డెఫిషియన్సీ టాబ్లెట్లు ఇవ్వాలి. దీని వలన గర్భాశయం లో పెరుగుదల  ఆగిపోదు, ఆ సమయం లో మందులు వేసుకోక, ఆ తరవాత వేసుకున్నా అవి పనిచేయవు.” అన్నది ఆమె.

సుమ వంటి యువతులకు IUGR ని తప్పించలేము. మేము కలిసిన కొన్ని రోజులకు, ఆసుపత్రిలో ఆమెకు ట్యూబల్ లైగేషన్ చేసేసారు. ఆమె, ఆమె కుటుంబం ఇంటికి వెళ్ళడానికి సామాను సర్దుకుంటున్నారు. వారికి పోషకాహారం గురించి డాక్టర్లు, నర్సులు చెబుతున్నారు. ఆమెకి తిరిగి తన ఇంటికి వెళ్ళడానికి, వెళ్ళాక తినడానికి కూడా డబ్బులు చేతికి ఇచ్చారు. “ఈసారన్నా ఆ డబ్బులు సరిగ్గా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను,” వాళ్లు వెళ్తుండగా అన్నది జిజి ఎలమన.

పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. అట్టడుగున ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా ?  అయితే [email protected] కు మెయిల్ చేసి [email protected] కు కాపీ పెట్టండి.

అనువాదం : అపర్ణ తోట

Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Illustration : Priyanka Borar

Priyanka Borar is a new media artist experimenting with technology to discover new forms of meaning and expression. She likes to design experiences for learning and play. As much as she enjoys juggling with interactive media she feels at home with the traditional pen and paper.

Other stories by Priyanka Borar
Editor : Hutokshi Doctor
Series Editor : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota