తన గ్రామంలో వీధులన్నీ చకచకా చుట్టేస్తూ ప్రజలనందరినీ తనకే మద్దత్తునీయండని చిరునవ్వుతో అభ్యర్దిస్తోంది వైశాలి. చేతులు రెండూ జోడించి  “నేను మీ కూతుర్ని” అంటూ స్థానిక యాసలో వోటు కోసం అర్థిస్తోంది.

తనకు లభిస్తున్న ఆదరణతో  వైశాలి సంతృప్తిగానే ఉంది. అయితే ‘మీ యాదిలో నన్నుంచుకోండి. నాకోసం ప్రార్థించండి ’ అని  ఆమె చేస్తున్న అభ్యర్ధనలో రైతు కుటుంబాలలోని తనలాంటి వితంతువులను,    \ రైతులైన భర్తల ఆకస్మిక మరణం తరువాత వారు పడ్డ కష్టాలనూ, కన్నీళ్ళనూ మరచిపోవద్దనే సందేశం ఉంది.

ఈ ఎన్నికల ప్రచారంలో ఇరవై ఎనిమిదేళ్ళ వైశాలి అప్పుడప్పుడూ పెద్దవాళ్ళ దగ్గర  ఆశీర్వచనాలు తీసుకుంటోంది. యువతులతో చేయి చాపి కరచాలనాలు చేస్తోంది. బోరుబావుల నుంచి నీళ్ళు మోసుకు తెచ్చుకుంటున్న స్త్రీలను చూసి చేతులూపుతూ అభివాదాలు తెలియచేస్తోంది. అనంతరం ఓ ఆరేడు కార్ల వాహన శ్రేణిలో తన కోసం వేచి చూస్తున్న కారెక్కి 42 సెల్సియస్ డిగ్రీల మండుటెండను కూడా  లెక్కచేయకుండా మరో ఊరుకి ప్రచారం కోసం వెళ్ళిపోతోంది.

వైశాలి మహారాష్ట్రలో తూర్పు ప్రాంతంలో ఉన్న యవత్మల్-వాషిం లోక్ సభ నియోజక వర్గం నుంచి ఈ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఏప్రిల్ 11 న జరిగే ఎన్నికల్లో దరిదాపు 17.5 లక్షల మంది వోటర్లు తమ వోటు హక్కును ఇక్కడ వినియోగించుకుంటారు. వైశాలి ‘ప్రహార్ జనశక్తి పక్ష’ తరపున పోటీలో ఉంది. అమరావతి జిల్లాలో స్వతంత్ర అభ్యర్ధి ‘ఓంప్రకాష్ (బచ్చు) కాడు’ అనే మధ్యవయస్కుని  నాయకత్వంలో నడుస్తున్న స్థానిక పార్టీ అది. అతడి పార్టీ విదర్భలో మెలమెల్లగా ప్రజల ఆదరణను చూరగొంటోంది. రైతుల, కూలీల సమస్యల మీద కేంద్రీకరిస్తూ అది తన బలాన్ని పెంచుకుంటూ వస్తోంది.

Vaishali, the nominee of the Prahar Janshakti Paksha, a local political party, is campaigning in Yavatmal-Washim
PHOTO • Jaideep Hardikar
Vaishali, the nominee of the Prahar Janshakti Paksha, a local political party, is campaigning in Yavatmal-Washim
PHOTO • Jaideep Hardikar

ఏప్రిల్ 11 న ఎన్నికలు జరగనున్న యవత్మల్-వాషిం  నియోజకవర్గం నుంచి స్థానిక రాజకీయ పార్టీ  ప్రహార్ జనశక్తి పక్ష అభ్యర్థి వైశాలి ప్రచారం నిర్వహిస్తున్న దృశ్యం

వ్యవసాయ సంక్షుభిత విదర్భ ప్రాంతంలో సుమారు రెండు దశాబ్దాల కాలంగా రైతు ఆత్మహత్యలకు కేంద్రంగా యవత్మల్ నిలుస్తూవచ్చింది. అప్పులు పేరుకుపోవడం, ఆదాయం పడిపోవడం, గ్రామీణ ఆర్ధికం స్తంభించిపోవడం వంటి అనేక కారణాల వలన వందలమంది ప్రత్తి, సోయాబీన్ రైతులు ఈ జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

“ఇవ్వాళ రేలిగావ్ తిరిగాం. రేపు వాషిం వెళ్తాం.” అంది వైశాలి. నిజానికి నియోజకవర్గంలో ఉన్న  రెండువేల పైచిలుకు గ్రామాలను చుట్టుముట్టిరావడం చాలా కష్టమైన పని. అందుకే కొన్ని చోట్ల బహిరంగ సభలు కూడా నిర్వహించాలని ఆమె అనుకుంటోంది.

సుధాకర్ యేడేతో 2009లో వివాహం అయ్యేనాటికి వైశాలికి నిండా 18 ఏళ్ళు కూడా వుండవు. ఇరవై ఏళ్ళు వచ్చేసరికి భర్తను కోల్పోయింది. యవత్మల్ ప్రాంతానికి చెందిన కలాంబ్ తహసీలులోని రాజూర్ గ్రామంలో అతడికి ఓ మూడెకరాల మెట్ట పొలం ఉంది. సోయాబీన్, ప్రత్తి పంటలు వేసేవాడు. వైశాలి దొంగార్ ఖర్డా గ్రామానికి చెందింది. రాజుర్ కి 20 కి.మీ దూరంలో ఉంటుందీ ఊరు. భర్త సుధాకర్ 2 అక్టోబరు 2011 లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయానికి ఆమె తన పుట్టింట్లో ఉంది. తన రెండో బిడ్డ జాహ్నవి అప్పుడే పుట్టింది. మొదటి బిడ్డ కునాల్ కి ఏడాదిన్నర. “నా పెనిమిటి విషం తాగి చచ్చిపోయాడని ఆ రోజు సాయంత్రం కబురు వచ్చింది. మమల్ని విడిచి వెళ్ళిపోయాడు. నా గురించీ, పిల్లల గురించీ కొంచెం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయాడు. తనను ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలు ఏమిటో స్పష్టంగా తెలియదు. అప్పులు ఉన్నాయి. ఆ ఏడాది పంట రాలేదు...”  అంటూ వైశాలి ఆ విషాదఘటనను గుర్తుకు తెచ్చుకుంది.

వీడియో చూడండి : ‘నేను గనుక ఎన్నికయితే పేద ప్రజల, రైతుల సమస్యలను పార్లమెంటులో చర్చిస్తాను’

యవత్మల్ ప్రాంతంలో సంభవించిన పలు ఆత్మహత్యల, దురవస్థలపై కధనాల మధ్య ఈ విషాదాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ప్రసిద్ధ నాటకకర్త, పాత్రికేయుడు శ్యాం పేత్కర్ రాసిన విలక్షణ నాటిక తెరవలో(పదమూడో దినం) నటించమని వైశాలిని గతేడాది అడిగారు. విదర్భ ప్రాంతంలో వితంతు రైతు మహిళల గురించి పనిచేసే ఒక సంస్థ ద్వారా శ్యాంకు ఈమె పరిచయం అయ్యింది. నాటికలో “ఒకవేళ ఈ పళంగా నీ భర్త బతికొస్తే నువ్వేమి అడుగుతావు?” అన్న ప్రశ్న ఒకటి ఎదురవుతుంది. ఈ ప్రశ్నే కథోపకథనాలుగా నాటికను విస్తరిస్తుంది. విదర్భలోని వివిధ ప్రాంతాలకు చెందిన వితంతు రైతు మహిళలే పాత్రధారులుగా  పేత్కర్ వారి నిజ జీవిత కథనాలను సజీవంగా నాటకీకరించారు.

జనవరి 2019 లో యవత్మల్ లో ఒక సాహిత్య సభను ప్రారంభించమని వైశాలిని ఆహ్వానించారు. నిజానికి ఆ సభను ఆవిష్కరించమని రచయిత నయన్ తారా సెహగల్ ను స్థానిక నిర్వాహకులు  ఆహ్వానించారు కానీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దీనితో వైశాలి ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా మారింది.

‘ప్రహార్ జనశక్తి పక్ష’  యవత్మల్-వాషిం లోక్ సభ నియోజక వర్గం ఒక్క దానికే పోటీకి నిలిపిందని ఆ పార్టీ నేత కాడు అంటారు. గ్రామీణ విదర్భలో ఆయనకు ఆదరణ ఎంతో ఉంది. “రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రైతులు ఈ సోదరి తరపున ప్రచారం నిమిత్తం విరాళాలు పంపుతున్నారు” అని చెప్పారు ఆయన.

కాడు, అతని సైన్యం ముందుండి వైశాలి ప్రచారాన్ని నడిపిస్తున్నారు. పంటల గిట్టుబాటు ధరల నుంచి ప్రభుత్వాల రాజకీయ నిర్లక్ష్యం వరకూ వారు ఎన్నో రైతుల సమస్యలను లేవనెత్తుతున్నారు. దక్షిణ యవత్మల్ లోని పాన్దార్కోడా కు 2017 లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో అతడి ప్రహార్ పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ, కాంగ్రెస్ లను పక్కకు నెట్టి మొత్తం పందొమ్మిది సీట్లలో 17 సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది.

ఇతర పోటీదారులు బలమైనవారు : శివసేనకు చెందిన భవన గవాలి, ఇప్పటికి నాలుగుసార్లు పార్లమెంటు సభ్యుడు, మరియు కాంగ్రెస్  కు చెందిన మహారాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ మానిక్రావ్ ఠాక్రే

యవత్మల్, వాషిం ప్రాంతంలోని గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ, జిల్లా పరిషద్ లలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా వైశాలిని ఆ పార్టీ ఎన్నికల్లో నిలిపింది. పార్టీకి ప్రజలు మద్దతునిచ్చేదీ లేనిదీ, స్థానికసంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్ధులెవరన్న విషయాన్నీ ఈనాడు వైశాలికి దక్కే వోట్లు, ఆమెకు వోట్లు పడే పోలింగ్ బూత్ లే సూచిస్తాయి.

“ నాకు ఈ పని ఇష్టం లేదు- కానీ రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదనీ, రైతుల సమస్యలు లేవనెత్తడానికి తనేను పోటీ చేయాల్సిందేనని బచ్చు బావు చెప్పిన తర్వాత నేను ఎన్నికలలోకి దిగాలని నిర్ణయించుకున్నాను” అంటుంది వైశాలి. “ “రాజకీయాలకోసం జరిగే ఎన్నికలంటే నాకు ఆసక్తి లేదు. సాంఘిక సేవంటే నాకు ఇష్టం” అంటుంది ఆమె.

ఊరేగింపుల్లో, కూడళ్ళలో జరిగే సభల్లో తనను పార్లమెంటుకు ఎన్నుకోమని రైతులను వైశాలి కోరుతోంది. తద్వారా పంటల గిట్టుబాటు ధరలు, మహిళా కూలీలకు న్యాయమైన వేతనాలు, వితంతు రైతు మహిళల, కుటుంబాల సమస్యలు మొదలైన వాటిని అక్కడ లేవనెత్తగలనని ఆమె చెబుతోంది. వ్యవసాయ కుటుంబాల్లోత్రాగుడు సమస్య కూడా ఆమె మాట్లాడబోయే సమస్యల్లో ఒకటి. యువత్మల్ లో మద్యనిషేధం విధించాలని ఆమె కోరుకుంటోంది. మహిళలపై హింసనూ, వారు పడే అగచాట్లనూ నివారించడంలో మద్యనిషేధం చాలా కీలకమైనదని ఆమె అభిప్రాయపడతుంది. ఆదివాసీ సమాజంలో లైంగికంగా దోపిడీకి గురయిన, భర్తలు వదిలేసిన మహిళలకు పునరావాసం కల్పించడం కూడా ఆమె ప్రాధాన్యతల్లో ఒకటి. (అలాంటి పలు కేసులు స్థానికంగా వెలుగులోకి వచ్చాయి.)

ఎన్నికల్లో ఈమె ప్రత్యర్ధులు చాలా శక్తివంతులు: శివసేన నుంచి గత ఎన్నికల్లో గెలిచిన భావనా గవాలి తిరిగి ఎన్నికవ్వాలనుకుంటున్నారు. మహారాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నేత  అయిన మాణిక్ రావు థాక్రే ఈమెకు ప్రధాన ప్రత్యర్ధి. థాక్రే మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు కూడా.

Vaishali, the nominee of the Prahar Janshakti Paksha, a local political party, is campaigning in Yavatmal-Washim
PHOTO • Jaideep Hardikar
Omprakash (Bachchu) Kadu (right, addressing the crowd), an Independent MLA from Amravati, urged Vaishali to contest. His Paksha is gaining popularity in Vidarbha by focussing on agrarian issues
PHOTO • Jaideep Hardikar

ఓం ప్రకాష్ ( బచ్చు), అమరావతి ఎమ్మెల్యే కాడు ( కుడి వైపున జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న వ్యక్తి) వైశాలిని పోటీకి దిగమని కోరారు. వ్యవసాయరంగ సమస్యల మీద కేంద్రీకరిస్తున్న ఆయన పార్టీ విదర్భలో ప్రజలను ఆకట్టుకుంటోంది.

“మీరు ఈ బడా నేతలను ఎన్నుకుంటే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోతారు. కానీ మీ బిడ్డకు మద్దతిస్తే  ఆమె రేయింబవళ్ళూ మీ కోసమే పనిచేస్తుంది.” అని కాడు దొంగార్ ఖర్డాలో సమావేశమైన గ్రామస్తులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో అన్నారు.

వైశాలి ఉదయం పూట పొలంలో కూలీగా, మద్యాహ్నం రాజూర్ గ్రామంలో అంగన్వాడీ సహ్యాయకురాలిగా పనిచేస్తుంది. సాయంత్రం మరికొంచెం ఆదాయం కోసం తన కుట్టుమిషను మీద బట్టలు కుడుతుంది. మొత్తం మీద నెలకు ఏడెనిమిది వేలు సంపాదించుకుంటుంది. “గత తొమ్మిదేళ్ళూ దుర్భరంగా గడిచాయి” అంటాడు ఆమె పెద్దన్న సంజయ్. కుటుంబానికి ఇప్పుడతడే పెద్దదిక్కు.

రాజూర్ లోని వైశాలి అత్తవారి కుటుంబం(యేడే వారు) చాలా పెద్దది. సుమారు 50 ఇళ్లు ఉంటాయని ఆమె మావగారు మాణిక్ యేడే అంటారు. వైశాలి పుట్టింటి వారికి భూమేమీ లేదు. ఆమె తండ్రి మాణిక్ రావు దోతే తాపీ పని చేస్తారు. తల్లి చంద్రకళ వ్యవసాయ కూలీ. పెద్దన్న సంజయ్, తమ్ముడు వినోద్ కూలి కోసం వలస వెళ్లి వస్తుంటారు.  దోతే వారికి దొంగార్ ఖర్డాలో శిధిలావస్థలో ఉన్న ఓ  చిన్న రెండు వాటాల ఇల్లు ఉంది. ఒక వాటాలో సంజయ్, అతడి భార్యా, కొడుకూ ఉంటారు. మరో వాటాలో వైశాలి తల్లిదండ్రులు, వినోద్, ఆమె తొమ్మిదేళ్ళ కొడుకూ ఉంటారు.  వైశాలి, ఒకటో తరగతి చదువుతున్న ఆమె కూతురూ రాజూర్ లోని ఆమె అత్తగారు పంచ్ ఫులా శేషారావు యేడే ఇంట్లో ఉంటారు.

“వైశాలిని ఒక అభ్యర్ధిగా చూడటం మా ఊహకు అందని విషయం. ఆమెకు వోట్లు బాగానే వస్తాయని నా నమ్మకం. రైతులు ఆమెకు వోటు వేస్తారు” అంటారు ఆమె తండ్రి.

Vaishali with her son Kunal, and parents Manikrao and Chandrakala Dhote at their modest home in Dongarkharda, Yavatmal.
PHOTO • Jaideep Hardikar
Vaishali with her daughter Janhavi at her in-laws house in Rajur village
PHOTO • Jaideep Hardikar

ఎడమ వైపు చిత్రం : యవత్మల్ లోని దొంగర్ ఖర్దా గ్రామం లోని తమ ఇంట్లో కొడుకు కునాల్, తల్లిదండ్రులు మాణిక్ రావు, చంద్రకళ ధోతేలతో వైశాలి. కుడి వైపు చిత్రం : తన కుమార్తె జాహ్నవితో రాజ్ పూర్ గ్రామంలోని అత్తవారి ఇంటివద్ద వైశాలి.

వైశాలి అభ్యర్థిత్వం చాలా మందిని ఇబ్బందుల్లో పడేసింది. “ నా సంశయం చాలా చిత్రమైనది” అంటారు ముప్పయి ఏళ్ళ వయసుండే దొంగార్ ఖర్డా సర్పంచ్ నిశ్చల్ థాక్రే. భావోద్వేగాలను అనుసరించి  తన ఊరికే చెందిన వైశాలి తరపున ప్రచారం చేయాలా లేక విశాల గ్రామాభివృద్ధి లక్ష్యాల వైపు- రోడ్లు, నీటి సరఫరా, సాగునీరు- దృష్టి పెట్టాలా అన్నదే ఆ సంశయం. “ఎందుకంటే నన్ను తిరిగి (సర్పంచ్ గా) ఎన్నుకోమని గ్రామస్తులను నేను కోరినప్పుడు వూరికి ఏమి చేసావని వారు నన్ను అడుగుతారు” అంటారు ఆయన. యవత్మల్ - వాషిం పార్లమెంట్ నియోజక వర్గంలో ఆధిపత్యం ఉన్నవాడే నెగ్గుతాడని ఆయన సూచిస్తున్నాడు. ఆరు నెలల్లో రానున్న విధాన సభ ఎన్నికలనూ, దాని వెనువెంటనే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలనూ అది ప్రభావితం చేస్తుంది. “మేము ప్రవాహంతో పాటు సాగితే గ్రామాభివృద్ది కోసం మాకు నిధులు సులువుగా వస్తాయి.” అంటారు ఆయన.

బీజేపీ-శివసేనల స్థానిక నాయకులతో థాక్రేకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే తన ఉపకులానికే చెందిన(ఖైరే కున్బీలు) వైశాలిని నిర్లక్ష్యం చేయలేడు. యవత్మల్ లో ఈ కులం ప్రాబల్యం ఎక్కువే.

బలవంతులతో జరిగే ఈ యుద్ధంలో వైశాలికి తోడుగా ఆర్ధికబలం కానీ , అర్ధబలంకానీ  లేవు. ఎన్నికల తర్వాత మళ్లీ తాను రెక్కల కష్టం చేయక తప్పదేమో అని ఆమె అంటుంది. కానీ ప్రస్తుతం తన నియోజకవర్గంలో ప్రజలకు చేరువ కావడానికి ప్రయత్నం చేస్తోంది. రైతు సమాజం నుంచి ఎవరో ఒకరు వారి సమస్యల మీద మాట్లాడకపోతే వాటికి పరిష్కారం దొరకదు అంటుందామె. “ నాకంటే ఎవరికి రైతుల, మహిళల సమస్యలు తెలుసు? నన్ను గనుక ఎన్నుకుంటే, నేను నా జనం సమస్యలను సంసద్ ( పార్లమెంటు) లో లేవనెత్తుతా” అంటుంది వైశాలి.

అనువాదం - ఎన్.ఎన్. శ్రీనివాస రావు

Jaideep Hardikar

Jaideep Hardikar is a Nagpur-based journalist and writer, and a PARI core team member.

Other stories by Jaideep Hardikar
Translator : N.N. Srinivasa Rao

N.N. Srinivasa Rao is a freelance journalist and translator from Andhra Pradesh.

Other stories by N.N. Srinivasa Rao