“నన్ను ఎవరూ పనిలో పెట్టుకోవడానికి సిధ్ధంగా లేరు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నన్ను వారి ఇళ్ళల్లోకి రానివ్వడం లేదు” అని మహారాష్ట్రలోని లాతూరు నగరంలో ఇళ్లలో పని చేసుకుంటూ బతికే అరవై ఎనిమిదేళ్ల జెహెదబి సయెద్ చెప్పింది. “నేనెప్పుడూ ఈ గుడ్డ ( మాస్క్) తీసింది లేదు. సామాజిక దూరాన్ని పాటించడంతో పాటు అన్ని నియమాలను పాటిస్తూనే ఉన్నాను”, అని వివరించింది.

జెహెదబి ఐదు ఇళ్ళలో పనిచేసేది. ఏప్రిల్ 2020 కోవిడ్ లాక్ డౌన్ సమయంలో వారిలో నాలుగు కుటుంబాల వారు ఆమెను పనికి రావద్దని చెప్పేశారు. “ నాకు ఒక్క ఇల్లే మిగిలింది పనిచేయడానికి. వాళ్ళేమో మరీ ఎక్కువ పని చేయించుకునేవారు” అని వాపోయింది.

జెహెదబి గత ముప్ఫై ఏళ్లుగా ఇళ్ళల్లో పనులు చేసుకుంటూ బతుకుతోంది. కరోనాకు ముందు-  జెహెదబి వంటి వారెందరో, ఇపుడు తమని పని మాన్పించిన ఇళ్ళలో గిన్నెలు కడగటం, గదులు ఊడ్వడం వంటి పనులు చేసుకునేవారు. ఢిల్లీలోని ఒక మసీదులో మార్చి 2020లో జరిగిన తబ్లిఘీ జమాత్ ధార్మిక సమ్మేళనం కోవిడ్ వెల్లువకు వేదిక అయిందన్న వివాదాస్పద వార్త తన యజమానుల మీద ప్రభావం వేసిందని ఆమె భావిస్తోంది. “ముస్లిములకు దూరంగా ఉండండని సాగిన గుసగుసలు కార్చిచ్చులా పాకాయి”, అని ఆమె గుర్తు చేసుకుంది. “జమాత్ మూలంగానే నా పనికి ఎసరు వచ్చిందని మా అల్లుడు అన్నాడు. కానీ దానితో నాకేమి సంబంధం?”, జెహెదబి ప్రశ్నించింది.

జెహెదబి ఆదాయం నెలకు ఐదు వేల రూపాయల నుంచి వెయ్యికి పడిపోయింది. “నన్ను పనిమాన్పించిన కుటుంబాలు ఇక నన్ను పనిలో పెట్టుకోవా?”, జెహెదబి అడిగింది. “నేను వారి కోసం ఎన్నో ఏళ్ళు పని చేశాను. కానీ ఆకస్మికంగా వాళ్ళు నన్ను వదిలేసి వేరేవాళ్లను పనిలో పెట్టుకున్నారు”, అని ఆమె వాపోయింది.

ఏడాదిలో ఆమె పరిస్థితులు ఏమీ సానుకూలంగా మారింది లేదు. “మరింత దుర్భరంగా మారాయంతే”,  చెప్పింది జెహెదబి. మార్చి 2021 లో ఆమె మూడిళ్ళలో పనిచేస్తూ వచ్చింది. దాని మూలంగా ఆ నెలలో రూ. 3,000 సంపాదించింది. అయితే ఏప్రిల్ నెలలో కోవిడ్ రెండోసారి ఉధృతంగా మాహారాస్థ్రలో వ్యాపించడంతో  రెండిళ్ళ వారు పనికి రావద్దని చెప్పేశారు. “నేను బస్తీలో (slum) నివాసం ఉంటున్నానననీ, అక్కడ మేమెవరం కోవిడ్ భద్రతా నియమాలు పాటించమనీ వారు అన్నారు”,  చెప్పింది జెహెదబి.

ఒకే ఒక్క ఇంట్లో పని చేస్తూన్న ఫలితంగా ఆమె ఆదాయం నెలకు రూ. 700 కు పరిమితమయింది. మరి కొన్ని ఇళ్ళలో పని దొరికేవరకు ఆమె ఆదాయం అంతే ఇక.

Jehedabi Sayed has been a domestic worker for over 30 years
PHOTO • Ira Deulgaonkar

ముప్ఫై ఏళ్లుగా ఇళ్లలో పనిచేస్తూ  బతుకుతున్న జెహెదబి సయెద్

స్థిరమైన ఆదాయం లేక జెహెదబి గతేడాది ఎంతో ఇబ్బంది పడింది. లాతూరు విఠల్ నగర్ లోని ఆమె ఇల్లు గతించిన ఆమె భర్త పేరు మీద ఉంది. ఇల్లంటే ఒక గది, వంటిల్లు మాత్రమే. మరుగుదొడ్డి కూడా లేదు, కరెంటు లేదు. పదిహేనేళ్ల క్రితం ఆమె భర్త సయెద్ జబ్బు చేసి చనిపోయాడు. “నాకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. ఇద్దరు కొడుకులు కొన్నేళ్ళ క్రితం చనిపోయారు. చిన్నవాడు తాపీ పనులు చేస్తాడు. వాడికి పెళ్లి అయిన నాటి నుంచీ వాడిని చూడనే లేదు. 2012లో ముంబై వెళ్లిపోయాడు.” చెప్పింది జెహెదబి. ఆమె కూతురు సుల్తానా విఠల్ నగర్ లోనే భర్తా పిల్లలతో కలిసి ఉంటోంది.

“మేమెక్కడ ఉంటున్నాం, ఏ సమూహానికి చెందిన వాళ్ళం, ప్రతీదీ సమస్యగా మారింది. నేనెలా సంపాదించుకునేది? ఏమి తినేది? ఈ రోగం మనుషులని విడగొట్టి తక్కువగా చూస్తోంది”, అని ఆవేదన చెందింది జెహెదబి.

వయసు రీత్యా పెద్ద వాళ్ళై తమ కాళ్ళ మీద తాము బతుకుతున్న జెహెదబి లాంటి మహిళల మీద, భర్తను కోల్పోయి ఆరు నుండి పదమూడేళ్ల మధ్య వయసున్న ఐదుగురు పిల్లలను తానొక్కతే సాకుతున్న గౌసియా ఇనాందార్ వంటి వాళ్ళ మీదా కోవిడ్ తన ప్రకోపం చూపిస్తూనే ఉంది.

కోవిడ్-19 రెండవ దశ ఉధృతిని నిలువరించేందుకు ఈ ఏడాది మార్చి నడుమ నుంచి అమలు చేస్తున్న నియంత్రణల ఫలితంగా  ఉస్మానాబాద్ జిల్లా చివారి గ్రామంలో వ్యవసాయ కూలీగా పనిచేసే 30 ఏళ్ల గౌసియాకు పని దొరకడం లేదు.

వ్యవసాయ పనులు చేసుకుంటూ మార్చి 2020 వరకూ గౌసియా రోజుకు రూ.150 ఆర్జించుకునేది. ఉస్మానాబాద్ జిల్లా తుల్జాపూర్ తాలూకా చివారి, ఉమర్గా గ్రామాలలోని రైతులు వారానికి ఒకసారో రెండుసార్లో మాత్రమే ఈమెను కూలికి పిలుస్తున్నారు. “ఈ రోగం ( కోవిడ్-19) మిమ్మల్ని రోజుల తరబడి పస్తులు పెట్టింది. మా పిల్లల గురించి నేను ఆందోళన చెందుతున్నాను. వారానికి వచ్చే రూ.150 తో మేమెలా బతికేది?”, గౌసియా ప్రశ్నించింది. స్థానిక ప్రభుత్వేతర సంస్థ ఒకటి పంపిన రేషన్ ఆ రోజుల్లో ఆదాటుకు వచ్చాయి.

లాక్ డౌన్ నిబంధనలు కొంత సడలిన తర్వాత కూడా గౌసియా వారానికి రూ. 200 మించి ఆర్జించ లేకపోయింది. గ్రామంలోని ఇతరులకు కొంత మెరుగ్గానే పని లభిస్తోందని గౌసియా చెప్పింది. “మా కుటుంబంలో పని దొరకక ప్రతి మహిళా ఇబ్బంది పడుతున్నారు. కానీ జూన్-జూలై (2020) నుంచి మా అమ్మ వాళ్ళ పొరుగున ఉన్న కొంత మంది ఆడవాళ్ళకు వారంలో మూడు సార్లయినా పని దొరుకుతోంది. అందరం ఒకే రకంగా పని చేయగలిగే వాళ్ళమే అయినప్పటికీ మాకెందుకు పని దొరకడం లేదు”, అంటూ గౌసియా ప్రశ్నించింది. డబ్బుల కోసం తాను రవికెలు, సారీ ఫాల్స్ కుట్టడం మొదలు పెట్టింది. తన ఒక కుట్టు మెషీన్ ను అద్దెకు ఇచ్చింది.

గౌసియాకు పదహారేళ్ళప్పుడు వివాహం అయ్యింది. ఐదేళ్ల క్రితం ఆమె భర్త అనారోగ్యంతో మరణించాడు. భర్త చావుకు గౌసియానే కారణమని నిందించి అత్త మామలు ఆమెను పిల్లలతో సహా ఇంటినుంచి వెళ్లిపోయేలా బలవంతపెట్టారు. చివారి గ్రామంలోని భర్తకు చెందిన కుటుంబ ఆస్తిలో ఆమెకు, పిల్లలకు దక్కాల్సిన న్యాయమైన వాటాను కూడా నిరాకరించారు. చివారి గ్రామంలోనే ఉన్న తన పుట్టింటికి పిల్లలతో సహా గౌసియా వెళ్లిపోయింది. అయితే ఆమె సోదరుడు ఆ ఇంట్లో మరో ఆరుగురు జీవన భారాన్ని మోయలేక పోవడంతో అక్కడి నుంచి కూడా ఆమె బయటకు వచ్చేసింది. ఊరి శివార్లలో తన తల్లిదండ్రుల స్థలంలో తాత్కాలికంగా వేసుకున్న గుడిసెలోకి మారిపోయింది.

“ఇక్కడ ఇళ్ళు చాలా తక్కువ. నా ఇంటి పొరుగునే ఉన్న బార్ నుంచి వచ్చే తాగుబోతులు రాత్రిపూట నన్ను ఇబ్బంది పెడుతూ ఉండేవారు. నా ఇంట్లోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తించేవారు. మొదట కొన్ని నెలల పాటు నా పరిస్థితి దయనీయంగానే గడిచింది. కానీ నాకు వేరే మార్గం లేదు”, అని గౌసియా తన దీనావస్థను వెల్లడించింది. ఆమెకు సాయంగా ఆ ప్రాంతపు ఆరోగ్య సిబ్బంది జోక్యం చేసుకున్న తర్వాతనే ఈ వేధింపులు ఆగాయని ఆమె చెప్పింది.

Gausiya Inamdar and her children in Chivari. She works as a farm labourer and stitches saree blouses
PHOTO • Javed Sheikh

చివారి గ్రామానికి చెందిన గౌసియా ఇనాందార్, ఆమె ముగ్గురు పిల్లలు. పొలం పనులు చేసుకుంటూ, ఇంట్లో రవికెలు కుట్టుకుంటూ జీవనం సాగిస్తోంది.

కనీస అవసరాలు తీరడం కూడా గౌసియాకు కష్టంగానే ఉంది. “కుట్టు పని సరిపడా దొరకదు- ఏ రెండు వారాలకో ఒకరు వస్తారు. కోవిడ్ కారణంగా ఆడవాళ్ళు ఎవరూ తమ బట్టలు కొట్టించు కోవడానికి రావట్లేదు. ఇది మరొక పీడకలలా తయారయ్యింది”, అని ఆమె వాపోయింది. “కరోనా, నిరుద్యోగం- ఈ రెండిటిలో మేమెప్పటికీ ఇరుక్కుపోతామా?”, అంటూ గౌసియా ప్రశ్నించింది.

ఏప్రిల్ 2020 లో అజూబీ లడాఫ్ అత్త మామలు ఆమెను ఆమె నలుగురు పిల్లలతో సహా ఇంటి నుంచి వెళ్లగొట్టారు. ఆమె భర్త ఇమామ్ లడాఫ్ చనిపోయిన మర్నాడే ఇలా జరిగింది. “ఉమార్గాలో మేము, ఇమామ్ తల్లిదండ్రులు, అతడి అన్న కుటుంబం ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉండేవాళ్ళం”, చెప్పింది అజూబి.

రోజు కూలీగా పని చేసే ఇమామ్ చనిపోక ముందు కొద్ది నెలలు జబ్బు పడ్డాడు. తాగుడు అలవాటు మూలంగా అతని మూత్రపిండాలు చెడిపోయాయి. గతేడాది ఫిబ్రవరిలో  38 ఏళ్ల అజూబీ, భర్తను ఉమార్గా పట్టణంలో విడిచిపెట్టి, పిల్లలని తనతో పాటు తీసుకుని పని వెతుక్కుంటూ పూణే వెళ్లిపోయింది.

పని సహాయకురాలిగా నెలకు రూ. 5000 కు ఒక ఇంట్లో పని దొరికింది. అయితే కోవిడ్ లాక్ డౌన్ ప్రారంభం కాగానే 10, 14 ఏళ్ల తన ఇద్దరు పిల్లలతో నగరం వదిలేసి తుల్జాపూర్ తాలూకాలో నల్ దుర్గ్ గ్రామంలో తన తల్లిదండ్రుల వద్దకు చేరింది. అక్కడ పని లభిస్తుందని ఆమె ఆశించింది. “మార్చి 27 న పూణేలో మొదలై  నల్ దుర్గ్ గ్రామం చేరడానికి 12 రోజులపాటు నడిచాము. ఈ ప్రయాణం మొత్తంలో మేము ఒక ముద్ద కూడా తినింది లేదు”, చెప్పింది అజూబి.

నల్ దుర్గ్ గ్రామం చేరేటప్పటికి ఇమామ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. అజూబి, ఆమె పిల్లలు వెంటనే 40 కి.మీ దూరంలో ఉన్న ఉమార్గాకు తిరిగి నడక ప్రారంభించారు. “మేము ఉమార్గా చేరిన సాయంత్రం ఇమామ్ మరణించాడు”, అజూబి వివరించింది.

ఏప్రిల్ 12 న పొరుగు వాళ్ళ సాయంతో ఇమామ్ తల్లిదండ్రులు, సోదరుడు కలిసి అజూబినీ, పిల్లలనూ వెళ్లగొట్టారు. అజూబీ, పిల్లలూ పూణే నుంచి వచ్చారు కనుక తమ ఆరోగ్యానికి ప్రమాదం తెచ్చిపెడతారని ఆమె అత్తింటి వారు భావించారు. “మేము స్థానిక దర్గాలో ఆ రాత్రికి ఆశ్రయం తీసుకుని ఆ తర్వాత నల్ దుర్గ్ వెళ్లిపోయాము”, అని అజూబి చెప్పింది.

అజూబి తల్లిదండ్రులు అజూబి, ఆమె పిల్లల సంరక్షణ చేపట్టే పరిస్థితుల్లో లేరు. “ఆమె తండ్రి, నేను రోజు కూలీలం. మాకు వచ్చే కూలి డబ్బులు మేమిద్దరం బతకడానికే సరిపోవు. మేము నిస్సహాయులం”, అని అజూబి తల్లి నాజ్ బునాబి దవాల్సబ్ అన్నది.

Azubi Ladaph with two of her four children, in front of their rented room in Umarga
PHOTO • Narayan Goswami

ఉమర్గాలో అద్దెకు తీసుకున్న గది ముందు తన నలుగురి పిల్లలలో ఇద్దరితో అజూబి లడాఫ్

“మా అయిదుగురి భారాన్ని నా తల్లిదండ్రులపై వేసి వారిని ఇబ్బంది పెట్టలేను.” అని చెప్పింది అజూబి. అందుకే నవంబరులో తిరిగి ఉమర్గా వెళ్లిపోయింది. “రూ. 700 కు అద్దెకు ఒక గదిని తీసుకున్నాను. అంట్లు కడగటం, బట్టలు ఉతకడం ద్వారా నెలకు రూ. 3 వేలు సంపాదిస్తున్నాను.” అని చెప్పింది అజూబి.

అత్తింటి వారు అజూబిని ఇంట్లోంచి నెట్టేశాక ఆ కథనాన్ని స్థానిక వార్తా పత్రికలు ప్రచురించాయి. “నేను మాట్లాడే పరిస్థితుల్లో లేను. అది ఎంత బాధాకరమైనదో వివరించలేను”, అని అజూబి ఆవేదన చెందింది. “ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు నల్ దుర్గ్ లోని మా అమ్మవాళ్ళ ఇంటికి వచ్చి నాకు ఆర్థిక సహాయం వాగ్దానం చేశారు. కానీ నేటి వరకు నాకు ఏ సహాయం అందలేదు”, అని అజూబి చెప్పింది.

అజూబి, గౌసియా, జెహెదబిలలో ఎవ్వరికీ రేషన్ కార్డులు లేవు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటు పొందటానికి జన్ ధన్ పథకం కింద వారికి బ్యాంకు ఖాతాలు కూడా లేవు. జన్ ధన్ బ్యాంకు ఖాతా ఉండుంటే లాక్ డౌన్ విధించిన మొదటి మూడు నెలలలో (ఏప్రిల్-జూన్ 2020) వారికి నెలకు రూ. 500 దక్కేవి. “బ్యాంకుకు వెళ్ళి అక్కడ ఎక్కువ సమయాన్ని వెచ్చించలేను”, అని జెహెదబి చెప్పింది. తనకు అక్కడ సహాయం అందుతుందని విశ్వసించలేనని జెహెదబి అభిప్రాయపడింది.

మహారాష్ట్ర ప్రభుత్వ సంజయ్ గాంధీ నిరాధార్ పింఛను పథకం కింద ఫించను పొందటానికి గౌసియా అర్హురాలే. ఈ పథకం కింద వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు ఆర్థిక సహాయం పొందారు. గౌసియాకు నెలకు రూ. 900 ఫించను కింద వస్తాయి. అయితే అవి ఎపుడు వస్తాయో తెలియదు. ఆమెకు 2020 జనవరి నుంచి ఆగస్టు వరకు ఫించను అందలేదు. “ఇవి (ఫించను డబ్బులు) లాక్ డౌన్ సమయంలో నా మీద కొంత భారాన్ని తగ్గించేవి”, అని గౌసియా చెప్పింది. ఫించను క్రమంగా కాక అప్పుడప్పుడూ వస్తోంది. 2020 సెప్టెంబరులో ఒకసారి, నవంబరులో ఒకసారి, తిరిగి ఫిబ్రవరి 2021 లో ఒకసారి ఫించను డబ్బులు అందాయి.

సామాజిక వెలివేత, ఆర్థిక సహకారలేమి వంటివి  జెహెదబి వంటి ఒంటరి మహిళల మనుగడను సవాలు చేస్తున్నాయి. “వాళ్ళు ఇల్లూ, భూమీ కరువైన వాళ్ళు. పిల్లల విద్యకి డబ్బులు సమకూర్చుకోవడం మరొక ఆర్థిక భారం. వాళ్ళ దగ్గర దాచుకున్న డబ్బులు ఏమీ లేవు. లాక్ డౌన్ సందర్భంగా నిరుద్యోగం వారిని ఆకలి బాధల్లోకి నెట్టింది” అని ఉస్మానాబాద్ జిల్లా అండూర్ లోని హెచ్ ఏ ఎల్ ఓ మెడికల్ ఫౌండేషన్ అధ్యక్షుడు డా. శశికాంత్ అహంకారి అన్నారు. ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కోసం పనిచేస్తుంది. మరట్వాడా లోని ఒంటరి మహిళలకు వృతి నైపుణ్యాలను నేర్పుతుంది.

కోవిడ్-19 మహిళల సమస్యలను ఇబ్బడి ముబ్బడిగా పెంచింది “పెళ్ళయిన రోజు నుంచి నేటివరకు డబ్బుల కోసం, పిల్లలను పెంచడం కోసం ప్రతి రోజూ నాకు తిప్పలు తప్పలేదు. నా జీవితంలో అతి దుర్భరమైన కాలం ఈ మహమ్మారి కాలం”, అని జెహెదబి చెప్పింది. లాక్ డౌన్ మరింత దుస్థితిలోకి గెంటేసిందని గౌసియా అభిప్రాయపడింది. “జబ్బు సంగతి సరే, లాక్ డౌన్ లో మేము నిత్యం పడుతున్న ఇబ్బందులు మమ్మల్ని బతకనివ్వవు”, అని ఆమె అభిప్రాయపడింది.

అనువాదం: ఎన్.ఎన్.శ్రీనివాసరావు

Ira Deulgaonkar

Ira Deulgaonkar is a 2020 PARI intern. She is a Bachelor of Economics student at Symbiosis School of Economics, Pune.

Other stories by Ira Deulgaonkar
Translator : N.N. Srinivasa Rao

N.N. Srinivasa Rao is a freelance journalist and translator from Andhra Pradesh.

Other stories by N.N. Srinivasa Rao