“మేము ఆ గుడారంలో కూర్చుని ఉన్నాము, వాళ్ళు దాన్ని చించేశారు. మేము అలా కూర్చునే ఉన్నాము,” అని ఆ వృద్ధ స్వాతంత్య్ర యోధుడు మాతో  చెప్పాడు. “వాళ్ళు మా మీద, మేము కూర్చున్న నేల మీద నీళ్లు చల్లుతూనే ఉన్నారు. నేలను తడిపితే దానిమీద మేము కూర్చోవడం కష్టం అవుతుందనుకున్నారు. కానీ మేమలా కూర్చునే ఉన్నాము. తరవాత నేను మంచినీళ్లు తాగడానికని లేచి టాప్ దగ్గర తలవంచగానే, నా తల పగలగొట్టారు. నన్ను ఆసుపత్రికి పరుగులు పెట్టి తీసుకెళ్లవలసి వచ్చింది.”

భారతదేశంలో సజీవంగా ఉన్న చివరి స్వాతంత్య్ర యోధులలో, ఒడిశా కోరాపుట్ ప్రాంతంలో ఉన్న బాజీ మొహమ్మద్ ఒకడు. ఆయన 1942లో బ్రిటిష్ వారి దౌర్జన్యం గురించి మాట్లాడట్లేదు(అతనికి దాన్ని గురించి కూడా చెప్పవలసింది చాలా  ఉంది). దానికి అర్థ శతాబ్దం తర్వాత జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో తన పై సాగిన దాడి గురించి చెబుతున్నారు. “అక్కడున్న 100 మంది శాంతి కార్యకర్తల బృందంలో నేను కూడా ఉన్నాను.” కానీ ఈ బృందానికి అసలు శాంతిని ఇవ్వలేదు. డెబ్భైల నడిమిలో ఉన్న ఈ వృద్ధ గాంధేయవాది, పది రోజులు ఆసుపత్రిలో గడిపి, ఇంకో నెల వారణాసి ఆశ్రమంలో ఉండి తన తల పై తగిలిన గాయం నుండి కోలుకున్నారు.

ఇది చెప్పేడప్పుడు ఆయనలో కొద్దిగా కూడా కోపం లేదు. ఈ దాడికి  కారణమైన రాష్ట్రీయ స్వయమ్ సేవక్ సంఘ్ మీద కానీ బజ్రంగ్ దళ్ మీద కానీ ద్వేషం లేదు. ఆయన చిరునవ్వు చిందిస్తున్న ఒక ముసలివాడు మాత్రమే. పైగా ఆయన ధృడమైన గాంధీ భక్తుడు.  ఆయన నబ్రంగపుర్ లో ఆవువధను వ్యతిరేకించే పని చేస్తున్న సంఘానికి అధ్యక్షుడైన ఒక ముస్లిం. “దాడి  తరవాత బిజూ పట్నాయక్ మా ఇంటికి వచ్చి నన్ను మందలించాడు. ఈ వయసులో శాంతి నిరసనలో నేను చురుగ్గా పాల్గొనడాన్ని చూసి ఆందోళన పడ్డాడు. ఇంతకు ముందు కూడా నేను స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చే పెన్షన్ ని తీసుకోలేదని విసిగించాడు.”

బాజీ మొహమ్మద్ అదృశ్యమవుతున్న తెగలో మిగిలిపోయిన ఒక రంగురంగుల తళుకు ముక్క. లెక్కలేనంతమంది భారత దేశ గ్రామీణ ప్రజలు దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేశారు. కానీ స్వాతంత్రానికి కారణమైన తరం మాత్రం ఒకరి తరవాత ఒకరు  త్వరగా చనిపోతున్నారు, చాలామంది వారి 80లలో 90లలో ఉన్నారు. బాజీ వయసు 90కు దగ్గరగా ఉంది.

“నేను 1930లలో చదువుకుంటున్నాను కానీ మెట్రిక్ దాటలేకపోయాను. నా గురువు సదాశివ్ త్రిపాఠి తర్వాత ఒడిశా చీఫ్  మినిస్టర్ అయ్యాడు. నేను కాంగ్రెస్ పార్టీ లో చేరి నబ్రంగపూర్ విభాగానికి(అప్పటికి ఇంకా కోరాపుట్ జిల్లాలోనే ఉంది) ప్రెసిడెంట్ ని అయ్యాను. నేను కాంగ్రెస్ పార్టీలో 20,000 మంది చేర్చాను. అప్పటికే ఈ ప్రాంతం చైతన్యంతో ఉంది. అది సత్యాగ్రహం తో పూర్తిగా కార్యరూపం దాల్చింది.”

ఏదేమైనా, వందలకొద్దీ మనుషులు కోరాపుట్ లో కవాతుకు వెళ్తే, బాజీ మొహమ్మద్ వేరే చోటికి వెళ్లాడు. “నేను గాంధీజిని చూడడానికి వెళ్లాను.” కాబట్టి ఆయన, “నా నేస్తం లక్ష్మణ్ సాహుతో పాటు సైకిల్ మీద, డబ్బులు కూడా లేకుండా, ఇక్కడ నుంచి రాయపూర్ దాకా వెళ్లాను.” మొత్తం 350 కిలోమీటర్ల దూరం, పైగా కొండల మీదుగా వెళ్లే కష్టమయిన దారి. “అక్కడ నుంచి మేము వార్ధాకి ట్రైన్ తీసుకుని సేవాగ్రాంకి వెళ్లాను. చాలా గొప్పవారు ఆ ఆశ్రమంలో ఉన్నారు. మేము అవాక్కపోయి  ఆందోళన తో చూస్తున్నాం. ఎప్పుడు కలవగలము? కలవగలమా లేదా? ఆయన సెక్రటరీ మహదేవ్ దేశాయ్ ని అడగండి అని, అక్కడివారు చెప్పారు.

“దేశాయ్ మమ్మల్ని సాయంత్రం 5 గంటలకు ఆయన సాయంత్రం వాహ్యాళి లో ఉన్నప్పుడు కలవొచ్చు, అని చెప్పారు. ఇది బావుంటుంది, తాపీగా మాట్లాడొచ్చు అనుకున్నాను. కానీ ఆ మనిషి చాలా త్వరగా నడుస్తున్నాడు. నా పరుగు, ఆయన నడక ఒకటే వేగంతో సాగుతున్నాయి. చివరికి, ఆయన వేగంతో నాకు కుదరక ఆయన దగ్గరికి వెళ్లి బతిమాలాను. ఆగండి. నేను ఒడిశా నుంచి ఇక్కడిదాకా మిమ్మల్ని చూడాలనే వచ్చాను.

“ఆయన పరీక్షగా అన్నారు, ‘ఏమి చూస్తావు? నేను కూడా మనిషినే, రెండు చేతులు, రెండు కాళ్లు, ఒక జత కళ్లు. నువ్వు ఒడిశాలో సత్యాగ్రహివా?’ నేను సత్యాగ్రహిని ప్రతిజ్ఞ చేశాను, అని సమాధానిమిచ్చాను.

“వెళ్లు’, అన్నాడు గాంధీ. వెళ్లి లాఠీ  దెబ్బలు తిను. దేశం కోసం త్యాగం చెయ్యి.’ ఏడు రోజుల తరవాత మేము ఇక్కడికి ఆయన చెప్పినట్లే చేయాలని నిశ్చయించుకుని వచ్చాము. బాజీ మహమ్మద్ యుద్ధానికి వ్యతిరేకంగా తన నిరసనను తెలపడానికి నబ్రంగ్ పూర్ మస్జీద్ దగ్గర సత్యాగ్రహానికి కూర్చున్నాడు. దానివలన 50 రూపాయిల జరినామాతో పాటు “ఆరునెలల  జైలు శిక్ష పడింది. ఆ రోజుల్లో అదేం చిన్న మొత్తం కాదు.”

ఇటువంటివే మరికొన్ని సంఘటనలు జరిగాయి. “ఒకసారి అయితే, జైల్లో, ప్రజలు పోలీసుల పై దాడి చేయడానికి పూనుకున్నారు. నేను వెళ్లి అది ఆపాను. ‘చనిపోతాము కానీ చంపము’, అని చెప్పాను.”

PHOTO • P. Sainath

“జైలు నుండి బయటకు వచ్చిన వెంటనే గాంధీని ‘ఇప్పుడేంటి?,’ అని అడిగాను. ఆయన నుండి వెంటనే సమాధానం వచ్చింది. ‘మళ్లీ జైలుకి వెళ్లు.’ అలానే చేశాను. ఈ సారి నాలుగు నెలలు. కానీ మూడోసారి, వాళ్ళు అరెస్ట్ చేయలేదు. నేను మళ్లీ గాంధీని అడిగాను. ‘ఇప్పుడేం చెయ్యను?’ ఆయన చెప్పారు - ‘అవే నినాదాలు పట్టుకుని ప్రజల మధ్యలోకి వెళ్లు.’ కాబట్టి మేము 20-30  మంది మనుషులం, 60 కిలోమీటర్లు నడిచి, చిన్న చిన్న ఊర్లను దాటుతూ తిరిగాము. ఆ తరవాత క్విట్ ఇండియా పోరాటం వచ్చింది. పరిస్థితులు మారాయి.

“1942 ఆగష్టు 25 న, మమ్మల్నందరిని అరెస్ట్ చేశారు. నబ్రంగపూర్ పాపరండీలో మొత్తం 19 మంది అక్కడిక్కడే పోలీసు కాల్పులలో మరణించారు. చాలామంది అక్కడ తగిలిన గాయాలకు కొన్నిరోజుల్లో చనిపోయారు. 300మందికి పైగా గాయాలయ్యాయి. వెయ్యిమందికి పైగా జైలుపాలయ్యారు. చాలామందిని కాల్చడమో, ఉరితీయడమో చేశారు. కోరాపుట్ లో దగ్గరగా 100మంది అమరవీరులయ్యారు. వీర్ లఖన్ నాయక్(బ్రిటిష్ ని ఎదిరించిన ప్రసిద్ధుడైన ఆదివాసీ నాయకుడు)ని ఉరితీశారు.

బాజీ భుజం, నిరసనకారుల పై జరిగిన అదుపులేని హింస వల్ల దెబ్బతిన్నది. “ఆ తరవాత నేను ఐదేళ్లు కోరాపుట్ జైల్లో ఉన్నాను. తరవాత నేను లఖన్ నాయక్ ను బరంపురం జైలు నుండి బదలీ  చేసేటప్పుడు చూశాను. అతను నేనుండే చోటుకు ఎదురుగా ఉన్న సెల్ లో ఉండేవాడు. నేను అతనితో ఉన్నప్పుడే అతని ఉరి ఆర్డర్ వచ్చింది. నీ కుటుంబానికి ఏం చెప్పమంటావు అని అడిగాను? ‘నేను ఏమి ఆందోళన పడలేదని చెప్పు,’ అని సమాధానమిచ్చాడు. ‘కానీ మనం పోరాడిన స్వరాజ్యాన్ని చూసేవరకు బ్రతికి ఉండలేకపోతున్నందుకు బాధపడుతున్నాను.”

బాజీ మాత్రం బ్రతికి, ఆ రోజును చూశాడు. అతన్ని స్వాతంత్య్ర దినోత్సవం ముందే విడుదల చేశారు- “స్వాతంత్య్ర  భారతదేశంలోకి నడుచుకుని వెళ్ళాడు.” అతనితో పని చేసినవారు- అందులో భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయిన సదాశివ్ త్రిపాఠి కూడా ఉన్నారు, వీరంతా 1952 ఎన్నికలలో ఎం ఎల్ ఏ లు అయ్యారు, ఇది  స్వాతంత్య్ర దేశంలో మొదటిసారి అయింది.” బాజీ “తనంతనే  తానే ఏ ఎన్నికలలో నిలబడలేదు. పెళ్లిచేసుకోలేదు.

“నాకు అధికారం కానీ పదవి కాని వద్దు,” ఆయన వివరించాడు. “నాకు తెలుసు నేను వేరే పద్ధతిలో సేవ చేయగలనని. గాంధీ గారు చెప్పిన పద్ధతుల్లో.” ఆయన దశాబ్దాలుగా కచ్చితమైన కాంగ్రెస్ మనిషిగానే ఉండిపోయాడు. “కానీ నేను ఇప్పుడు ఒక పార్టీ కి చెందినవాడిని కాదు,” అతను చెప్పాడు, “నేను పార్టీ లేనివాడిని.”

కానీ దీనివలన అతను ప్రజలకోసం పని చేయడం మానలేదు. “నేను 1956 లో వినోబాభావే భూదాన్ పోరాటంలో చేరినప్పటినుండి పని ఆపలేదు.” అతను కొన్ని జయప్రకాశ్ నారాయణ్ ప్రచారాల్లో కూడా పనిచేశారు. “ఆయన 1950లో రెండుసార్లు ఇక్కడ బస చేశారు.” కాంగ్రెస్ బాజీని ఎన్నికలలో పోటీచేయమని చాలాసార్లు అడిగారు. “కానీ నాకు అధికారం సంపాదించడం కన్నాసేవ చేయడమే మక్కువ.”

బాజీ మొహమ్మద్ కు గాంధీని కలవడం అంటే “నా పోరాటానికి దొరికిన గొప్ప బహుమతి. ఎవరికన్నా అంతకన్నా ఏం కావాలి?” ప్రసిద్ధి చెందిన మహాత్మాగాంధీ నిరసన కవాతులో, తాను పాల్గొన్న ఫోటోలు చూపిస్తున్నప్పుడు బాజీ కళ్ళు తడిబారాయి. ఇవన్నీ అతని ఆస్తులు.  అతని 14 ఎకరాలు భూదాన్ పోరాటంలో ఇచ్చేశాడు. స్వాతంత్య్ర పోరాటం లో అతనికి ఇష్టమైన ఘడియలు ఏంటి? “ప్రతి ఒకటి. కానీ మహాత్మని కలవడం, ఆయన గొంతు వినడం అన్నిటికన్నా ఎక్కువ. అదే నా  జీవితంలో అత్యంత ఆనందమయ సమయం. కానీ ఆయన కలగన్న స్వతంత్ర ప్రభుత్వం ఇంకా సాకారం కాలేదు.”

ఆయన చక్కని చిరునవ్వును ధరించిన మంచి మనిషి, అంతే. అతను చేసిన త్యాగం వయసుమీరిన అతని భుజం మీద తేలిగ్గా చేరింది.

ఫోటోలు: పి సాయినాథ్

ఈ వ్యాసాన్ని ది హిందూ లో ఆగష్టు 23, 2007 న మొదట ప్రచురించారు.

ఈ వరసలో ఇంకొన్ని శీర్షికలు :

సాలిహాన్ రాజ్ మీద ఎదురుదాడి చేయగా

పనిమారా స్వాతంత్య్ర క్షేత్ర యోధులు -1

పనిమారా స్వాతంత్య్ర క్షేత్ర యోధులు - 2

లక్ష్మి పాండా ఆఖరి పోరాటం

గోదావరి: దాడి కై ఎదురుచూస్తున్న పోలీసులు

షేర్పూర్ : గొప్ప త్యాగం, గుర్తులేని జ్ఞాపకం

సోనాఖాన్ : వీర్ సింగ్ రెండు సార్లు మరణించాడు

కల్లియస్సేరి: సుముకన్ కోసం వెతికే ఒక ప్రయత్నం

కల్లియస్సేరి : యాభైల్లో కూడా వీడని పోరాటం

అనువాదం: అపర్ణ తోట

پی سائی ناتھ ’پیپلز آرکائیو آف رورل انڈیا‘ کے بانی ایڈیٹر ہیں۔ وہ کئی دہائیوں تک دیہی ہندوستان کے رپورٹر رہے اور Everybody Loves a Good Drought اور The Last Heroes: Foot Soldiers of Indian Freedom کے مصنف ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز پی۔ سائی ناتھ
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

کے ذریعہ دیگر اسٹوریز Aparna Thota