అది ఆగష్టు 11. పనామిక్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ వద్ద, వందమంది పైన గుమిగూడి, కోవిడ్ మొదటి డోసు వాక్సినేషన్ కోసం ఎదురుచూడడడం నేను చూశాను. ఇది దేశంలోని వేల సెంటర్ల  వద్ద  గుమిగూడిన దృశ్యంతో సమానమా? కాదు. సముద్రపు మట్టం నుండి  19,091 అడుగుల  ఎత్తున్న అతి ఎత్తైన ప్రదేశాల జాబితాలో లేహ్ లోని పనామిక్ బ్లాక్ కూడా ఉంది. ఆ బ్లాక్ లోని  అదే పేరున్న ప్రధాన గ్రామం కూడా,  కొన్నివేల అడుగుల కింద ఉంది. కానీ 11,000  అడుగుల ఎత్తున్న ఈ  PHC మాత్రం, దేశంలో ఉన్న అన్ని వాక్సినేషన్  సెంటర్లు అన్నింటిలోనూ ఎత్తైన ప్రదేశంలో ఉంది.

ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో, అసలు వాక్సిన్లను ఇంత ఎత్తైన ప్రదేశాల వరకు చేర్చడమే పెద్ద ప్రహసనం. పైగా కొన్ని మారుమూల  ప్రదేశాలకు సరైన రహదారులు ఉండవు, కాబట్టి ఇక్కడ పని మామూలుకన్నా ఇంకా చాలా కష్టం.

కానీ ఈ సెంటర్లో దీని అసాధారణమైన ఎత్తు కన్నా ప్రత్యేకమైన మరొక విషయం ఉంది. అది అసాధారణమైన ఆలోచనాధోరణి అనవచ్చేమో. సియాచిన్ గ్లేసియర్ కి దగ్గరగా, లేహ్ లో ఉండే ఈ PHC, ఒకేరోజులో 250 ఆర్మీలో పనిచేసేవారికి మొదటి డోసు వాక్సినేషన్  ఇవ్వగలిగింది. అది కూడా సరిగ్గా పని చెయ్యని ఇంటర్నెట్ కనెక్షన్ తో, చాలా ఘోరమైన కమ్యూనికేషన్ సౌకర్యాలతో ఉన్న పనామిక్ లోని ఈ  PHC, లడఖ్ లో ఉన్న వేరే కొన్ని సెంటర్ల లాగానే, వాక్సినేషన్ ని చాలా విజయవంతంగా నిర్వహించింది.

కానీ వారు ఇంటర్నెట్ కూడా  లేకుండా, లేహ్ పట్టణానికి 140  కిలోమీటర్ల  దూరం ఉంటూ ఎలా నిర్వహించారు? అక్కడి కోల్డ్ చైన్ హాండ్లర్,  ట్సేరింగ్ అంచోక్, అది చాలా సరళమైన విషయమే అన్నట్టుగా, “అది చాలా తేలిక! మేము ఓపికగా పనిచేశాము. చాలా గంటలు పని చేయవలసి వచ్చినా, మా పని సరిగ్గా జరిగింది.”  దీని అర్థం ఇక్కడి వారంతా సరైన ఇంటర్నెట్ కనెక్షన్లు లేకపోవడం వలన వేరే ప్రదేశాలలో నిముషాల్లో జరిగే పనిని, ఇక్కడ గంటల తరబడి చేయవలసి వచ్చింది. ఇదేగాక వాక్సినేషన్ కి ఇంకా ఎక్కువ గంటలు పట్టింది.

PHOTO • Ritayan Mukherjee

“నాకు ఫోటో తీయించుకోవడం ఇష్టం లేదు.” అన్నాడు ఎనిమిదేళ్ల జగ్మట్ జొరఫల్, స్టాంజిన్ డోల్మా కొడుకు. డోల్మా పనామిక్ లోని PHCలో ఫార్మసిస్ట్. ఆ చిన్న పిల్లవాడు తన అమ్మ డ్యూటీ లో  ఉన్నప్పుడు జరిగే వాక్సినేషన్ డ్రైవ్ లలో ఆమెతో పాటే ఉంటాడు

స్టాంజిమ్ డోల్మా, ఈ PHC లో ఫార్మసిస్ట్. ఆమె ఎక్కువ గంటలు పని చేయడమే కాదు, తరచుగా తన వెనుకే తిరిగే ఈ ఎనిమిదేళ్ల కొడుకు పైన కూడా కన్నేసి ఉంచవలసి వస్తుంది. “నా చిన్న కొడుకు నా దగ్గర నుంచి మరీ ఎక్కువ సమయం దూరంగా ఉండలేడు.” అని చెప్పింది. “అందుకని నాకు నాకు ఎక్కువ పని గంటలు ఉన్న రోజుల్లో వాడిని నాతొ పాటు తీసుకురావాల్సి వస్తుంది. తాను రోజంతా PHC లో ఉంటాడు. నాకు నైట్ షిఫ్టులు ఉన్న రాత్రులు కూడా నాతోనే ఉంటాడు.”

ఆమెకు బాబుని ఇక్కడ ఉంచితే వచ్చే ప్రమాదం తెలియకుండా ఏమి లేదు. కానీ ఇలా అయితేనే అతనిని బాగా చూసుకోగలను అని ఆమె నమ్ముతుంది. “పేషెంట్లు, నా కొడుకు- ఇద్దరూ నాకు ముఖ్యమైనవారే.”  అంది.

PHC లోని రెసిడెంట్ డాక్టర్, మణిపూర్ కి చెందిన, చబుంగ్‌బామ్ మీరాబా మీటీ, “మొదట్లో చాలా గందరగోళంగా ఉండేది. మేము ఈ మొత్తం పద్ధతిని ఉన్న కొద్ది సౌకర్యాలతో, అతి తక్కువ సమాచారంతో నడపడానికి కష్టపడ్డాము. కానీ మెల్లగా ఈ పద్ధతిపైన మాకు పట్టు వచ్చింది. అలానే గ్రామస్తులలో కూడా వాక్సినేషన్ పట్ల అవగాహనను పెంచాము.” అన్నారు

మన దేశంలో చాలా భాగాలలో జరిగినట్లుగానే లడఖ్ ను కూడా కోవిడ్  సెకండ్ వేవ్ చాలా ప్రభావితం చేసింది. కేసులలో ఈ పెరుగుదల - రవాణా రద్దీ పెరగడం, వలస కార్మికులు రావడం, వేరే ప్రాంతాలలో చదువుకుంటున్న, పనిచేస్తున్న లడఖ్ కు చెందినవారు తిరిగి లేహ్ పట్టణానికి రావడం వలన జరిగి ఉంటుందని అనుకుంటున్నారు.

“అది పిచ్చెక్కించిన సమయం.” అన్నారు మహారోగం మొదలైన సమయం గురించి మాట్లాడుతూ, లేహ్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్,  తాషి నామ్గోయల్. “ఆ సమయంలో, లేహ్ ప్రజలను పరీక్షించడానికి అవసరమైన సౌకర్యాలు మా వద్ద లేవు. కాబట్టి మేము సాంపిల్స్ ని చండీగఢ్ కి పంపవలసి వచ్చేది. ఫలితాలు తెలుసుకోవడానికి రోజులు పట్టేది. కానీ ఇప్పుడు మేము 1000 మందికి పైగా పరీక్షలు నిర్వహించి  లేహ్ లోని  సోనమ్ నూర్భూ మెమోరియల్ ఆసుపత్రికి పంపగలుగుతున్నాము. ఈ ఏడాది మొదటినుంచి, ఈ వాక్సినేషన్ ని చలికాలం మొదలవకముందే- అంటే అక్టోబర్ మాసం ముగిసేలోపే ముగించాలని అనుకున్నాము.”

ఇక్కడ హెల్త్ సెంటర్లకు సరైన ఇంటర్నెట్ సదుపాయం లేక, ప్రజలకు కమ్యూనికేషన్ టెక్నాలజీ సరైన అందుబాటులో లేక, కొత్త మార్గాలు అన్వేషించవలసి వచ్చింది. “వృద్ధులు స్మార్ట్ ఫోన్లు వాడరు. పైగా ఇంటర్నెట్ ఇబ్బందులు కూడా ఉన్నాయి.” అన్నారు ఖల్త్సే నుంచి వచ్చిన ఆరోగ్య కార్యకర్త, కుంజాన్గ్ చోరోల్. ఇది సముద్ర మట్టానికి 9,799 అడుగుల పైన ఉంది. ఇలాంటి పరిస్థితులలో వాళ్ళు వాక్సినేషన్ ను ఎలా సంబాళించారు?

PHOTO • Ritayan Mukherjee

కుంజాన్గ్ చోరోల్, ఖల్సి తెహసిల్ లోని PHC లో ఫిజియోథెరపిస్ట్ గా పనిచేస్తున్నారు. ఈయన ఖాల్త్సే గ్రామంలోని పేషెంట్ వివరాలను cowin app లో నమోదుచేస్తున్నారు

‘కునే’ అని పిలవబడే కుంజాన్గ్ ఇలా అన్నారు: “మొదటి డోస్ తరవాత, మేము వారికి ఇచ్చిన ప్రత్యేక సంఖ్యను, వాక్సిన్ రెండో డోసు తేదీని ఒక పేపర్ మీద రాసేవారిమి. ఆ కాగితాన్ని వాక్సిన్ వేయించుకున్న వారి ఆధార్ కార్డు వంటి ముఖ్యమైన కాగితాల  వెనుక అతికించేవారిమి. ఈ మొత్తం ప్రక్రియని ఇలానే నడిపాము. ఇప్పటిదాకా ఈ పధ్ధతి మా గ్రామస్తులకు బాగా పనిచేసింది.”

“రెండు డోసులు అయిపోయాక మేము వాక్సినేషన్ సర్టిఫికెట్ ని ప్రింట్ తీసి, వారికి ఇచ్చేవాళ్లము.” అని చెప్పింది.

ఒకపక్క హెల్త్ కేర్ సెంటర్లు, ఆసుపత్రులు ఉన్న అన్ని వనరులను మహారోగంతో పోరాటానికి వినియోగిస్తుండగా, ఫిలంగ్ గ్రామం లో ఒక PHC లో సాధారణంగా జరిగే బాలల ఇమ్యునైజేషన్  కార్యక్రమం నిరంతరాయంగా సాగుతోంది. ఈ ప్రాంతం సముద్రానికి 12,000 అడుగుల పైన ఉంది.

ఇప్పుడు, అర్హత కలిగిన జనాభాలో 100 శాతం మంది కోవిడ్ -19 వ్యాక్సిన్ మొదటి మోతాదును అందుకున్నారు అని కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ ప్రకటించి , అందుకు సంబంధించి ఏ సవాలునైనా అందుకోడానికి సిద్ధంగా ఉంది . కానీ ఈ సవాళ్లకు మించినది, ఇటువంటి పర్వత మార్గాలలో ప్రయాణించి లక్ష్యాన్ని సాధించిన ముందు వరుస ఆరోగ్య కార్యకర్తల స్ఫూర్తిదాయకమైన పాత్ర. లడఖ్‌లోని 8,000 నుండి 20,000 అడుగుల ఎత్తులో నివసిస్తున్న దాదాపు 270,000 మంది నివాసితులకు వ్యాక్సిన్‌లను తీసుకెళ్లడానికి వీరు కష్టపడ్డారు,.

“మాకు ఇక్కడ లెక్కనేనన్ని సవాళ్లున్నాయి. మొదట్లో, మేము cowin కి అలవాటు పడవలసి వచ్చింది. పైగా పనామిక్ వంటి మారుమూల PHC లలో సరైన ఇంటర్నెట్ సౌకర్యం లేదు.” అన్నారు జిగ్మేట్ నామ్గోయల్. ఈయన లేహ్ లో వాక్సిన్, కోల్డ్ చైన్ మేనేజర్. నామ్గోయల్ 300 కిలోమీటర్ల పైనే మంచు ఎడారి లో తిరుగుతూ సరిపడిననన్ని వాక్సిన్ లు, సరైన ఉష్ణోగ్రతలో పదిలపరిచారని ధ్రువపర్చుకునేవారు.

PHOTO • Ritayan Mukherjee

ఫియాంగ్ లోని PHCలో- సముద్రమట్టానికి 12000 అడుగుల పైన, డాక్టర్లు వాక్సిన్ డ్రైవ్ తో పాటు బాలలకు సాధారణ ఇమ్యునైజేషన్ సేవలు కూడా  అందిస్తున్నారు

“Cowin అనే కాదు. వాక్సిన్ దుబారానే అసలు సవాలు”, అన్నారు ఖల్సి తెహసిల్ లోని PHC లో పనిచేసే డీఛాన్ అంగ్మో. “వాక్సిన్ దుబారా చెయ్యొద్దని ప్రభుత్వం నుంచి చాలా గట్టి సూచన  వచ్చింది.”

అసలు సవాలు చాలా పెద్దది. “ఒక  వయల్ నుండి పది మందికి వాక్సినేషన్ ఇవ్వొచ్చు. కానీ ఒకసారి వయల్(వాక్సిన్  ఉన్న సీసా) ని తెరిస్తే, ఒక నాలుగు గంటలలో దానిని వాడేయాలి. ఇక మా ఖల్త్సే లాంటి  మారుమూల ప్రాంతాలకు మేము కేవలం ఆ నాలుగుగంటల్లో నలుగురైదురు మాత్రమే రావడం చూసాము. వాళ్ళు కూడా చాలా  దూరాల నుంచి వస్తారు. కాబట్టి ఆ వయల్ చాలా వరకూ వృధా అయిపోతుంది. అలా జరగకుండా ఉండడానికి, నా సహోద్యోగులు ఒక రోజు ముందే ఆ  గ్రామాలకు వెళ్లి తరవాత రోజు వాక్సిన్ ని తీసుకోవడానికి రమ్మని చెప్పి వారు PHC కి  వచ్చేలా రూఢీ చేసుకునేవారు. ఇది చాలా కష్టమైన పధ్ధతి, కానీ మాకు ఫలితాలను ఇచ్చింది. దానివలన మాకు వాక్సిన్ వృధా పోలేదు.”

ఖాల్సిలో ఆరోగ్య సంరక్షణ శాఖ వాక్సిన్ లు పట్టుకుని ఈ తాలూకాకు చెందిన లింగ్సేట్ అనే ఒక మారు మూల  గ్రామానికి వెళ్లారని నాకు తరవాత తెల్సింది. ఆ రోజు వాక్సినేషన్ కు ఇంచార్జి అయినా డా. పద్మ, గైనకాలజిస్ట్, ఇలా అన్నది. “మొదట్లో గ్రామస్తులు వాక్సిన్ తీసుకోడానికి కాస్త తటపటాయించినా, మేము ఓపిగ్గా వివరిస్తూనే ఉండడంతో, దాని అవసరం తెలిసింది. ఇప్పుడు మేము రోజుకు 500 మందికి వాక్సిన్ వేసి రికార్డు నెలకొల్పాము. ఇది మేము ఒక టీం గా సాధించాం.”

“ఇంతమంది నర్సులు, ఫార్మసిస్టులు, డాక్టర్లు ఇన్ని ఇబ్బందులను ఎదురీది ఈ వాక్సినేషన్ డ్రైవ్ ని విజయవంతం చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. పైగా మేము లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికే కాక, అక్కడి వలస కార్మికులకు, నేపాలీ కార్మికులకు, ఇంకా వాక్సిన్ వేయించుకొని వేరే రాష్ట్రపు టూరిస్టులకు కూడా వాక్సిన్ వేశాము.” అన్నారు జిగ్మేట్ నామ్గోయల్.

ఇదేదో గొప్పలు చెప్పుకోవడం కాదు. నేను అప్పుడే పనామిక్ PHC వద్ద రోడ్డు పని చేస్తున్నఝార్ఖండ్ వలస కూలీలని కలిశాను. “మేము లడఖ్ లో ఉన్నందుకు సంతోషిస్తున్నాము. మా అందరికి మొదటి డోసు వాక్సిన్ అయిపొయింది. మాకు కోవిడ్ భయం తగ్గింది. ఇప్పుడు మా కుటుంబాలను భద్రంగా ఉంచుకోగలము.” అన్నారు వారు.

PHOTO • Ritayan Mukherjee

ఒక ఆరోగ్య సంరక్షణ కార్మికుడు తన ఇంటర్నెట్ కనెక్షన్‌ని పనామిక్ PHC వద్ద పైకప్పుపై తనిఖీ చేస్తున్నాడు, ఇక్కడ కనెక్టివిటీ చాలా పెద్ద సవాలుగా మారింది


PHOTO • Ritayan Mukherjee

లేహ్ పట్టణానికి దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న పనామిక్  PHC వద్ద సుమారు 100 మంది క్యూలో ఉన్నారు. ఇది సియాచిన్ గ్లేసియర్ కి దగ్గరగా ఉంది, అంతేగాక పనామిక్ బ్లాక్ సముద్ర మట్టానికి 19,091 అడుగుల ఎత్తులో ఉంది


PHOTO • Ritayan Mukherjee

ఫార్మాసిస్ట్ స్టాన్జిన్ డోల్మా పానమిక్ PHCలో టీకా డ్రైవ్ కోసం సిద్ధమవుతున్నారు


PHOTO • Ritayan Mukherjee

ట్సేరింగ్ ఆంగ్చోక్ పనామిక్ PHCలో టీకా నిల్వను తనిఖీ చేస్తుంది. కోవిన్ యాప్ స్టాక్‌లను డిజిటల్‌గా అనుసరించినప్పటికీ, కొన్నిసార్లు సంఖ్యలు వాస్తవ గణన కంటే భిన్నంగా ఉండవచ్చు. కాబట్టి ఆరోగ్య సంరక్షణ కార్మికులు రెండుసార్లు తనిఖీ చేస్తారు


PHOTO • Ritayan Mukherjee

పనామిక్ PHCలో హెల్త్‌కేర్ వర్కర్ ట్సేవాంగ్ డోల్మా, టీకా వేసే ముందు, ఆందోళన చెందుతున్న గ్రామస్తుడికి భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు


PHOTO • Ritayan Mukherjee

ఊరికూరికే జ్వరం వస్తుందని పనామిక్‌లో ఆరోగ్య సదుపాయానికి వచ్చిన సన్యాసిని, డాక్టర్ చాబుంగ్‌బామ్ మీరాబా మీటీ పరీక్షిస్తున్నారు


PHOTO • Ritayan Mukherjee

పనామిక్‌లో PHCలో సీనియర్ నర్సు, ఆస్తమాతో బాధపడుతున్న చిన్న టెంజిన్ కోసం నెబ్యులైజర్‌ను పెడుతోంది


PHOTO • Ritayan Mukherjee

వ్యవసాయం చేస్తూ ప్రమాదానికి గురైన గ్రామస్థుడి గాయపడిన వేలుకు డా. చాబుంగ్‌బామ్ కుట్లు వేస్తున్నారు. పనామిక్ PHC లో పోస్ట్ చేసిన వైద్యులు మహమ్మారి అంతటా బహుళ రంగాలలో పని చేస్తూనే ఉన్నారు


PHOTO • Ritayan Mukherjee

“ఇక్కడ కేసులు ప్రారంభంలో కొంచెం గందరగోళంగా ఉండేవి, కానీ ఇప్పుడు మేము చాలా మందికి టీకాలు వేశాము" అని తుర్తుక్ నుండి వచ్చి పనామా PHC లో పనిచేసే ఫార్మసిస్ట్ అలీ ముషా అన్నారు


PHOTO • Ritayan Mukherjee

ఖాల్ట్సే గ్రామంలోని PHC లో, డీచెన్ ఆంగ్మో, ఆమె సహోద్యోగి ట్సెరింగ్ లాండోల్ టీకా ఇవ్వడం ప్రారంభించే ముందు, పిపిఇ దుస్తులను ధరించడానికి సహాయం చేస్తున్నారు


PHOTO • Ritayan Mukherjee

ఖాల్ట్సే PHCలో గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మ, టీకా డ్రైవ్ ప్రారంభానికి ముందు ఫోన్‌లో కొన్ని వివరాలను తనిఖీ చేస్తున్నారు


PHOTO • Ritayan Mukherjee

ఖాల్ట్సే గ్రామంలోని PHCలో తదుపరి రోగి కోసం డీచెన్ ఆంగ్మో వేచి ఉన్నాడు. టీకా వ్యర్థం లడఖ్‌లో ఒక పెద్ద సవాలు, కాబట్టి ప్రతి ఆరోగ్య సంరక్షణ కార్మికుడు వయల్ కు 10-11 మందికి టీకాలు పడేలా  చూస్తారు


PHOTO • Ritayan Mukherjee

ఖాల్ట్సే గ్రామంలో టీకా కేంద్రంగా ఉపయోగించబడుతున్న తరగతి గదిలో ప్రజలు తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు


PHOTO • Ritayan Mukherjee

ఖల్సీ తహసీల్‌లోని ఒక మారుమూల గ్రామం నుండి రెండవ డోస్ కోసం వచ్చిన ఒక వృద్ధురాలికి  ఒక ఆరోగ్య కార్మికురాలు సహాయపడుతోంది


PHOTO • Ritayan Mukherjee

లమయూరు ప్రాంతపు గ్రామస్ధుడు, ఖాల్త్సే గ్రామపు PHC లో రెండవ డోస్ వాక్సిన్ వేయించుకుంటున్నాడు.


PHOTO • Ritayan Mukherjee

డీచెన్ ఆంగ్మో, ఖల్ట్సే గ్రామానికి చెందిన ఒక వృద్ధుడికి జాగ్రత్తగా టీకాలు వేస్తున్నాడు


PHOTO • Ritayan Mukherjee

టీకా పడిన తరవాత  టీకా సర్టిఫికెట్‌ అందుకుంటున్న పౌరుడు


PHOTO • Ritayan Mukherjee

"ఇవి సౌకర్యవంతమైన దుస్తులు కాదు. PPE సూట్‌లో ఒక పూర్తి రోజు గడపడం చాలా కష్టం గా ఉంటుంది.  ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి పర్లేదు; మైదానాల్లోని ఆరోగ్య సంరక్షణ కార్మికులకు ఇది చాలా ఇబ్బందిగా ఉండాలి" అని ఖాల్ట్సే గ్రామంలోని PHC వద్ద ట్సెరింగ్ ఆంగ్‌చుక్ అన్నారు


PHOTO • Ritayan Mukherjee

ఖాల్ట్సే పిహెచ్‌సిలో, టీకాలు వేసిన రోజు ఆఖరుకు, నిర్జనమైన తాత్కాలిక టీకా గది


అనువాదం: అపర్ణ తోట

Ritayan Mukherjee

Ritayan Mukherjee is a Kolkata-based photographer and a PARI Senior Fellow. He is working on a long-term project that documents the lives of pastoral and nomadic communities in India.

Other stories by Ritayan Mukherjee
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota