ఠేలూ మహతో, నేను రాసిన పుస్తకం, ది లాస్ట్ హీరోస్‌ లో కనిపించే, అప్పటికీ సజీవంగా ఉన్న స్వాతంత్ర్య సమరయోధులలో బహుశా అతి పెద్దవయసువారు, గురువారం సాయంత్రం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం పురులియా జిల్లాలోని పిరాహ్ గ్రామంలో తన ఇంటిలో మరణించారు. పుస్తకాన్ని ప్రచురించినప్పటికి జీవించి ఉండి, దాన్ని అందుకున్నవారిలో అతను మొదటివారు. ఇప్పుడంతా మరచిపోయినా, 1942లో పురులియాలోని 12 పోలీసు స్టేషన్‌లపై జరిగిన చారిత్రాత్మకమైన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నవారిలో ప్రాణాలతో ఉన్న చివరి వ్యక్తి ఈయనే. ఠేలూ వయస్సు 103 నుండి 105 సంవత్సరాల మధ్య ఉంటుంది.

ఈయన మరణంతో మనం, మన స్వతంత్రం కోసం పోరాడి, భారతదేశాన్ని ఒక స్వతంత్ర దేశంగా నిలబెట్టడంలో సహాయపడిన ఒక బంగారు తరాన్ని కోల్పోవటంవైపుగా మరో అడుగు ముందుకేశాం. మన దేశంలోని కొత్త తరాలవారు భారత దేశ స్వాతంత్ర్య సమరయోధుల గురించి వినే, చూసే, మాట్లాడే అవకాశాన్ని పొందలేరు. వాళ్ళెవరో, ఎందుకోసం పోరాడారో- స్వతంత్రం కోసమే వారెందుకు పోరాడారో మరి వారికిక చెప్పేవాళ్ళుండరు.

ఠేలూ మహతో, ఆయన జీవితకాల సహచరుడు లక్ఖీ మహతో తమ కథను చెప్పటానికి చాలా ఆసక్తితో ఉండేవారు. తాము తమ దేశం కోసం నిలబడ్డారనీ, అలా చేసినందుకు చాలా గర్వపడుతున్నారనీ ఇప్పటి యువతరం, కొత్త తరాలవాళ్ళు తెలుసుకోవాలని చాలా ఆతృతపడేవారు. ఠేలూ ఇక తన కథను చెప్పలేరు. రానున్న ఐదారేళ్ళలో ఆయన తరానికి చెంది, జీవించి ఉన్న మిగిలినవారు కూడా తమ కథలను చెప్పలేరు.

అది భావి యువ భారతీయులకు ఎంత నష్టం కాబోతోంది! మన కాలపు ఠేలూలు, వారి త్యాగాలు, మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి వారి కథలు ఎందుకు చాలా ముఖ్యమైనవి అనే దాని గురించి చాలా తక్కువ తెలిసిన, ఇంకా నేర్చుకునే అవకాశం కూడా లేని మన ప్రస్తుత తరాలకు ఇది ఇప్పటికే ఎంతో నష్టం.

ప్రత్యేకించి భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రను ఒక కల్పిత కథగానూ, కనిపెట్టినదిగానూ, బలవంతంగా రుద్దినదిగానూ తిరిగి రాయబడని యుగంలో. బహిరంగ ప్రసంగాలలో, మీడియాలోని ముఖ్యమైన విభాగాల విషయాలలో, మరింత భయంపుట్టించే విధంగా మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ హత్యకు సంబంధించిన కీలకమైన నిజాలు బడిపిల్లల పాఠ్య పుస్తకాలలో క్రమంగా చెరిపివేయబడుతున్న సమయంలో…

Thelu Mahato's home in Pirra village of Puruliya district, West Bengal where he passed away on April 6, 2023. Thelu never called himself a Gandhian but lived like one for over a century, in simplicity, even austerity.
PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

పశ్చిమ బెంగాల్‌, పురులియా జిల్లాలోని పిరాహ్ గ్రామంలో ఏప్రిల్ 6, 2023న మరణించిన ఠేలూ మహతో నివాసం. ఠేలూ తనను తాను గాంధేయవాదిగా ఎన్నడూ చెప్పుకోలేదు కానీ ఒక శతాబ్దానికి పైగా నిరాడంబరంగానూ, నిష్ఠతోనూ గాంధేయవాదిగానే జీవించారు. కుడి: ఠేలూ మహతో, ఆయన జీవితకాల సహచరుడు లక్ఖీ మహతో తమ కథలను చెప్పడానికి చాలా ఆసక్తితో ఉన్నారు

తనను తానెప్పుడూ గాంధేయవాదిగా చెప్పుకోనప్పటికీ, ఠేలూ మహతో వందేళ్ళకు పైగా గాంధేయవాదిగానే జీవించారు- నిరాడంబరంగానూ, నిష్ఠతోనూ. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా 1942, సెప్టెంబర్ 29, 30 తేదీలలో పురులియాలోని 12 పోలీస్ స్టేషన్ల పైకి ప్రదర్శనలు చేసినవారిలో ఈయన కూడా ఒకరు. ఆయన తనను తాను వామపక్షవాదిగా, విప్లవకారుడిగా భావిస్తారు. కానీ అమాయక ప్రజల రక్షణ కోసం, ఆత్మరక్షణ చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులలో తప్ప, ఆయన అహింసకు కట్టుబడివుండేలా ప్రతిజ్ఞ తీసుకున్నారు.

కానీ మీరు కొంత హింస చోటుచేసుకున్న ఆ పోలీస్ స్టేషన్ మీద జరిగిన దాడిలో పాల్గొన్నారు కదా? అని 2022లో పిరాహ్ గ్రామంలోని ఆయన ఇంటివద్ద నేనాయన్ని కలిసినప్పుడు అడిగాను. ఆ హింస బ్రిటిష్‌వాళ్ళ నుంచి వచ్చిందని ఆయన తిప్పికొట్టారు. స్టేషన్ల మీద భారత దేశ జెండాను ఎగురవేయడానికి వెళ్ళిన ప్రజలపై "పోలీసులు నిర్లక్ష్యంగా ప్రజలపైకి కాల్పులు జరిపారు. తమ కళ్ళముందే తమ స్నేహితులపై, కుటుంబంపై, కామ్రేడ్స్‌పై పోలీసులు కాల్పులు జరుపుతున్నప్పుడు ప్రజలు తప్పకుండా తిరగబడతారు."

ఠేలూ మహతోతోనూ, అతని జీవితకాల సహచరుడు లక్ఖీ మహతోతోనూ మేం జరిపిన సంభాషణల ద్వారా వారి తరం ఆలోచనలనూ ప్రభావాలనూ ఎంత బాహాటంగా స్వాగతించిందో; అయినప్పటికీ ఆ బహుళ ప్రభావాల వలన వారి వ్యక్తిత్వాలు ఎంత సంక్లిష్టంగా రూపుదాల్చాయో కూడా మాకు అర్థమయింది.  ఠేలూ - లక్ఖీ ఇప్పటికి కూడా - తన అభిరుచి ద్వారా, రాజకీయాల ద్వారా తిరుగులేని వామపక్షవాది; నైతిక నియమావళి, జీవనశైలి ద్వారా గాంధేయవాది. నిబద్ధత, బోధనల ద్వారా వామపక్షవాది, వ్యక్తిత్వం ద్వారా గాంధేయవాది. కానీ ఇద్దరూ కొన్ని దశాబ్దాలుగా కమ్యూనిస్టు పార్టీలో సభ్యులుగా ఉన్నారు.

వారు జీవించిన స్థాయిలో, వారి ఆరాధ్య నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయనే ఠేలూ, లక్ఖీల ప్రపంచం. వారు ఎన్నడూ దృష్టి పెట్టని గాంధీ, సుదూరమైనా కానీ మహోన్నతమైన, విస్మయం కలిగించే వ్యక్తి. వారి స్థానిక హీరోలలో ముగ్గురు రాబిన్ హుడ్-రకం బందిపోట్లు ఉన్నారు - బిపిన్, దిగంబర్, పీతాంబర్ సర్దార్. భూస్వాములు, ఇతర అణచివేతదారులకు వ్యతిరేకంగా అణగారిన ప్రజలు న్యాయం కోసం ఆశ్రయించిన బందిపోట్లు వీరు. ఈ బందిపోట్లు భయంకరంగా, హింసాత్మకంగా ఉంటారు, కానీ చట్టానికి విరుద్ధంగా ఉంటారు. చరిత్రకారుడు ఎరిక్ హాబ్స్‌బామ్ వర్ణించిన వీరి బందిపోటుతనం క్రూరమైనదైనప్పటికీ, “ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థను ఏకకాలంలో సవాలు చేస్తుంది."

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

ఠేలూ, లక్ఖీలు తమ తరం ఆలోచనలనూ ప్రభావాలనూ ఎంత బాహాటంగా స్వాగతించిందో మాకు చూపించారు. ఠేలూ తనను తాను అహింసకు కట్టుబడిన వామపక్షవాదిగానూ, విప్లవకారుడిగానూ భావిస్తారు

ఠేలూ, లక్ఖీలు ఈ పొరలలో ఎటువంటి వైరుధ్యాన్ని చూడలేదు. బందిపోట్ల పట్ల వారి వైఖరి అసహ్యం, గౌరవాల కలగలుపు. వారు బందిపోట్లను గౌరవించారు కానీ వారి హింసాత్మక అడుగుజాడలను అనుసరించలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొన్ని దశాబ్దాల పాటు, వివిధ భూపోరాటాలలోనూ, ఇతర పోరాటాలలోనూ రాజకీయంగా చురుకుగా ఉన్నారు - గాంధేయ జీవితాలను గడిపే స్వతంత్ర వామపక్ష వాదులుగా.

ఠేలూ మహతో ఒక కుర్మీ - జంగల్‌మహల్‌లోని తిరుగుబాటు ప్రాంతంలో అనేక పోరాటాలలో పాల్గొన్న సముదాయానికి చెందినవారు. 1931లో వారి ఆదివాసీ హోదాను దూరంచేసి, బ్రిటిష్‌వారు కుర్మీలను శిక్షించారు. ఆ ఆదివాసీ హోదాను పునరుద్ధరించడం వారి గొప్ప లక్ష్యం. జంగల్‌మహల్‌లో ఆ డిమాండ్‌ను లేవనెత్తుతూ కొనసాగుతున్న ఆందోళనలో ఠేలూ మరణించిన రోజు ఒక నూతన కార్యాచరణ దశగా గుర్తించబడుతుంది.

ఠేలూ ఎన్నడూ స్వాతంత్ర్య సమరయోధుని పింఛను గానీ, స్వాతంత్ర్య పోరాటంలో తన పాత్రకు తగిన గుర్తింపును కానీ పొందలేదు. మేం చివరిసారి ఆయనను కలిసినప్పుడు ఆయన వెయ్యి రూపాయల వృద్ధాప్య పింఛనుతో జీవిస్తున్నారు. శిథిలమైన, రేకుల కప్పు ఉన్న ఒకే ఒక గది ఆయన ఇల్లు. ఆ ఇంటికి కొద్ది దూరంలోనే తానెంతో గర్వపడే, తన స్వంత చేతులతో నిర్మించిన బావి ఉంది. దాని పక్కనే ఉండి ఫొటో తీసుకోవాలని ఆయన కోరిక.

ఠేలూ తవ్విన బావి అలాగే ఉండిపోతుంది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినవారి జ్ఞాపకాల బావి మాత్రం మరింత లోతుకు దిగజారింది

మీరు ఠేలూ, లక్ఖీ, ఇంకా 14 మంది ఇతర స్వాతంత్ర్య సమరయోధుల గురించిన పూర్తి కథనాన్ని పి. సాయినాథ్ రచించిన పుస్తకం ది లాస్ట్ హీరోస్: ఫుట్ సోల్జర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ ( The Last Heroes: Foot Soldiers of Indian Freedom) , పెంగ్విన్ ప్రచురణలు, నవంబర్ 2022లో చదవవచ్చు.

పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI)లోని ఫ్రీడమ్ ఫైటర్స్ గ్యాలరీ లో వారి ఫోటో ఆల్బమ్‌లను, వీడియోలను చూడండి

వ్యాసం మొదట The Wireలో ప్రచురితమైంది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli